వాచికంలో స్పష్టత, పదాల విరుపులో భావుకత కలబోసిన కంఠం జగ్గయ్య
ఒకవైపు గంభీరమైన నటనతో తెలుగు చలన చిత్ర రంగాన్ని
మరోవైపు రచనతో సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసిన కృషీవలుడు జగ్గయ్య
1928 లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మోరంపూడి గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించారు జగ్గయ్య. ఆయన తండ్రి సంస్కృతాంధ్రాల్లో పండితుడు. సంగీత విద్వాంసుడు. కళల మీద ముఖ్యంగా నటనంటే ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే తెనాలిలో ' శ్రీకృష్ణ సౌందర్య భవనం ' అనే పేరుతో ఒక ప్రదర్శనశాల నిర్మించారు. ఆయనది కూడా గంభీరమైన స్వరమే ! ఆ వారసత్వమే జగ్గయ్యకు వచ్చింది.
జగ్గయ్య దుగ్గిరాలలోని బోర్డు హైస్కూల్లో చదివారు. ఆయన పదకొండవయేటే పద్యాలు రాయడం ప్రారంభించారు. హైస్కూలు లో చదువుతున్న రోజుల్లోనే గాంధీ గారి బోధనలకు ప్రభావితులై హరిజనవాడలకు వెళ్ళి పాఠాలు చెప్పడం, మద్యపాన నిషేధ ఆవశ్యకతను తెలియజెప్పడం లాంటివి చేసేవారు. స్వాతంత్ర్యోద్యమాల్లో కూడా పాల్గొన్నారు.
ఆంధ్రదేశంలో గ్రంథాలయోద్యమం విస్తరించడానికి మూలకారకులైన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, పాతూరి నాగభూషణం గారి పిలుపుతో దుగ్గిరాలలో మిత్రులందరినీ కలుపుకుని వారి దగ్గరున్న గ్రంథాలను పోగుచేసి జగ్గయ్య ఓ గ్రంథాలయాన్ని స్థాపించారు.
గుంటూరు ఆంద్ర క్రిస్టియన్ కళాశాలలో చదివేటపుడు విద్యార్థి ఉద్యమాలతోటి, నాటకరంగం తోటి అనుబంధం ఏర్పడింది. ప్రజానాట్య మండలి నాటకాల్లో కూడా పాల్గొన్నారు. అక్కడే నందమూరి తారక రామారావు గారు జగ్గయ్య గారికి సహాధ్యాయి. ఇద్దరూ కలసి అనేక నాటకాలు ప్రదర్శించారు. 1946 లో విజయవాడ నాటక కళా పరిషత్తు పోటీల్లో రామారావు గారితో కలసి ప్రదర్శించిన ' చేసిన పాపం ' నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతినందుకున్నారు. ప్రజానాట్య మండలి తరఫున ప్రదర్శించిన ' తెలంగాణా ఘోష ' నాటకంలో జగ్గయ్య ధరించిన వృద్ధుడి పాత్రకు ఉత్తమ నటన బహుమతి లభించింది. డిగ్రీ పూర్తయ్యాక ఎన్టీయార్ తో కలసి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థలో నాటకాలు ప్రదర్శించారు.
గుంటూరులో చదువుతున్న కాలంలోనే నవ్య సాహిత్య పరిషత్ లో సభ్యత్వం కలిగి ఉండేవారు. తర్వాత విజయవాడలో అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భవించాక అందులో చేరారు. ప్రముఖ చిత్రకారులు అడవి బాపిరాజు గారి దగ్గర మూడేళ్ళు చిత్రలేఖనం నేర్చుకున్నారు. కొంతమంది మిత్రుల సహకారంతో ' శోభ ' అనే లిఖిత పత్రికను నడిపారు.
1941 లో బి. ఏ. పూర్తయ్యాక దుగ్గిరాల బోర్డు హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరి ఇంగ్లీష్, చరిత్ర బోధించారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ' శాక్రిఫైస్ ' అనే నాటకాన్ని ' బలిదానం ' అనే పేరుతో అనువదించారు. అప్పటివరకూ చిన్న చిన్న నాట్య ప్రదర్శనలకే పరిమితమైన సావిత్రి ని ( మహానటి సావిత్రే ! ) అపర్ణ అనే చిన్నపిల్ల పాత్రలో నాటకరంగానికి పరిచయం చేశారు.
దుగ్గిరాలలో వున్నపుడు ప్రదర్శించిన ' ఖిల్జీ రాజ్య పతనం ' నాటకం ద్వారా జమునను రంగస్థలానికి పరిచయం చేసారు.
తర్వాత డిల్లీ ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్ గా, న్యూస్ రీడర్ గా మూడు సంవత్సరాలు పనిచేసారు. ఆ సమయంలోనే ఆకాశవాణి విదేశీ విభాగంలో యూరోపియన్ శ్రోతల కోసం తెలుగు సాహిత్యం మీద ఆంగ్లంలో ప్రసంగాలు చేసారు.
త్రిపురనేని గోపీచంద్ ' పేరంటాలు ' చిత్రంకోసం తొలిసారిగా జగ్గయ్య గారికి మేకప్ టెస్ట్ జరిగింది. అయితే పాత్రకు తగ్గ విగ్రహం లేదని అవకాశం మాత్రం రాలేదు. తర్వాత గోపిచంద్ గారిదే ' ప్రియురాలు ' చిత్రంలో కథానాయకుడుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. అప్పుడే ఉద్యోగానికి రాజీనామా కూడా చేసారు. అయితే ' ప్రియురాలు ' చిత్రం ఫ్లాప్ అయింది. రెండవచిత్రం కూడా గోపీచంద్ గారి ' పాలేరు '. ఆ చిత్రం విడుదల కాలేదు. తర్వాత చిత్రం ' ఆదర్శం ' కూడా పరాజయం పాలయ్యింది. హెచ్. యం. రెడ్డి గారి లాంటి ఉద్దండుడి చిత్రం ' పేదల ఆస్తి ' లో కథానాయకునిగా వేస్తే అది కూడా ఫ్లాపే ! ఇలా వరుసగా వచ్చిన అవకాశాలన్నీ ఆయనకు, నిర్మాతలకు కలసిరాలేదు.
వాహిని పిక్చర్స్ వారి ' బంగారు పాప ' లో ఎస్వీ రంగారావు గారిది ఒక ముఖ్య పాత్ర. ఆ పాత్రతో ఇంచుమించుగా సమానమైన పాత్ర జగ్గయ్య గారిది. తర్వాత ' అర్థాంగి ' చిత్రంలో అక్కినేని గారి సోదరుని పాత్ర చేసారు. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతో జగ్గయ్య గారికి ఇంక ఎదురులేక పోయింది. సుమారు 500 వందల సినిమాల్లో నటిస్తే అందులో సుమారు 125 సినిమాల్లో హీరో గా చేసారు.
గాంధీ గారి సహాయనిరాకరణ ఉద్యమం నేపథ్యంగా ' పదండి ముందుకు ' చిత్రాన్ని స్వంతంగా నిర్మించారు. తెలుగులో వచ్చిన తొలి రాజకీయ చిత్రం ' పదండి ముందుకు '. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా యాభైవేల రూపాయిల సబ్సిడీని ఇచ్చిన తొలి చిత్రం కూడా అదే ! తాష్కెంట్ చలన చిత్రోత్సవంలో పాల్గొంది. హీరో కృష్ణ ఈ చిత్రంలో చిన్న వేషం వేశారు.
తర్వాత తాను నిర్మించిన ' శభాష్ పాపన్న ' చిత్రం ద్వారా నటుడు శ్రీధర్ ని పరిచయం చేసారు జగ్గయ్య.
తన గంభీరమైన స్వరాన్ని తొలిసారిగా ' మనోహర ' చిత్రంలో శివాజీ గణేషన్ కి అరువిచ్చారు జగ్గయ్య. అక్కడినుంచి శివాజీ అనువాద చిత్రాలన్నిటికీ జగ్గయ్యగారే డబ్బింగ్ చెప్పారు. శివాజీ గారి ఆంగికానికి, జగ్గయ్య గారి వాచికానికి అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది.
జగ్గయ్య గారు హైస్కూల్ చదువులో వున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో సోషలిస్ట్ విభాగం ఉండేది. దానిలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1962 లో తెనాలి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైనా ఆచార్య ఎన్. జి. రంగ పోటీలో వుండడం, ఆయనలాంటి నిస్వార్థ ప్రజా సేవకుడు పార్లమెంట్ కి రావాలని కోరుకున్న అప్పటి ప్రధాని పండిట్ నెహ్రు గారి అభ్యర్ధన మేరకు జగ్గయ్య పోటీనుంచి విరమించుకున్నారు. 1967 లో ఒంగోలు స్థానం నుంచి పార్లమెంట్ కి ఎంపికయ్యారు. అయితే తనకు రాజకీయాలు సరిపడవని గ్రహించిన జగ్గయ్య 1972 లో రాజకీయాలనుంచి వైదొలిగారు.
జగ్గయ్య గారి రచనల్లో చెప్పుకోదగ్గది ' రవీంద్ర గీత '. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 137 కవితలను పద్యకావ్యంగా తెలుగులోనికి అనువదించారు. దేశ, విదేశాల రాజకీయ పరిణామాలు, ముఖ్యమైన ఘట్టాలు, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు ప్రధానాంశంగా జగ్గయ్యగారు రచించిన ' రాజకీయ విజ్ఞాన కోశం ' అనే గ్రంథం అముద్రితంగా వుంది.
మనస్విని ట్రస్ట్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి ప్రతీ ఏటా మంచి పాట రాసిన ఓ రచయితకు మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి పేరు మీద పురస్కారం అందజేసేవారు జగ్గయ్య.
తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకున్న నటుడు జగ్గయ్య.
జగ్గయ్య గారి జన్మదినం సందర్భంగా ఆయనకు కళా నీరాజనం సమర్పిస్తూ......................
Vol. No. 02 Pub. No. 104