Thursday, December 30, 2010

నా ' త్యా ' గయ్య

నాకు ఊహ తెలిసాక, సంగీతాన్ని ఆస్వాదించడం ప్రారంభించినప్పట్నుంచీ త్యాగరాజు గారి గురించి, ఆయన కీర్తనల గురించి తెలిసినా ఆయన రూపాన్ని ఊహించుకోవడానికి మాత్రం ఎక్కడో ఎవరో గీసిన రేఖా చిత్రం మాత్రమే ఆధారం. అయితే చిన్నతనంలో చూసిన ' త్యాగయ్య ' చిత్రం పూర్తిగా గుర్తులేకపోయినా అందులో నాగయ్య గారి రూపమే త్యాగయ్యగా గుర్తుండిపోయింది. త్యాగరాజు గారి రేఖాచిత్రాలు ఎన్ని చూసినా, ఆఖరికి వాస్తవానికి దగ్గరగా ఉందనే రేఖా చిత్రాన్ని చూసినా అందులో కూడా నాగయ్య గారి పోలికలే కనిపిస్తాయి. దానికి నాగయ్య గారు త్యాగయ్యగా పరకాయ ప్రవేశం చేసారా ? లేక త్యాగయ్యే నాగయ్య గారిని ఆవహించారా ? తెలీదు గానీ నాకు మాత్రం త్యాగయ్య అంటే నాగయ్య గారే అని స్థిరపడిపోయింది. 

1938 లో ' గృహలక్ష్మి ' చిత్రంలో జాతీయ నాయకుడి పాత్రతో చిత్ర రంగ ప్రవేశం చేసిన నాగయ్య గారు రెండవచిత్రం ' వందేమాతరం ' చిత్రంతో హీరోగా మారారు. అయితే 1940 లో మూడవ చిత్రం ' సుమంగళి ' తో కందుకూరి వీరేశలింగం గారిని పోలిన వృద్ధ సంఘ సంస్కర్త పాత్ర పోషించడం ఒక సాహసం. మరో సాహసం 1942 లో ఆయన పోషించిన ' భక్త పోతన ' పాత్ర. తెలుగు, తమిళ ప్రేక్షకులలో ఎందరినో నాగయ్య గారికి భక్తులను చేసింది. ప్రముఖ ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఈ విషయానికి సంబంధించి ఓ సంఘటనలో వివరించారు......
ఐక్యరాజ్య సమితిలో వేణుమాధవ్ గారి మిమిక్రీ విశేషాలు తెలుసుకున్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నాగయ్య గారి ద్వారా ఆయన్ని పిలిపించుకున్నారు. వారింటికి వెళ్ళాక పి. ఏ. ద్వారా రాధాకృష్ణన్ గారికి సమాచారం పంపితే ఆయనే స్వయంగా అక్కడికి వచ్చి లోపలి తీసుకెళ్ళారట. వేణుమాధవ్ గారు రాధాకృష్ణన్ గారికి పూలమాల వేసి పండ్లు చేతికిస్తూ ' మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాను ' అనగానే రాధాకృష్ణన్ గారు నాగయ్య గారి చేతులు పట్టుకుని కళ్ళకద్దుకుని ' నా దర్శనం చేసుకుంటే ఏముంది. నాగయ్య గారి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది ' అన్నారంటే నాగయ్య గారిలోని కళాకారుడు ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరాడో ఊహించుకోవచ్చు.

1943 లో నాగయ్య గారు నిర్మాతగా మారి పి. పుల్లయ్య గారి దర్శకత్వంలో ' భాగ్యలక్ష్మి ' చిత్రం నిర్మించారు. ఆ తర్వాత ఆయన నటించిన ' స్వర్గసీమ ' 1945 లో ఘన విజయం సాధించింది. 1946 లో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన  ' త్యాగయ్య ' న భూతో న భవిష్యతి. త్యాగయ్య గా ఆయనందుకున్నన్ని సన్మానాలు, గౌరవాలు మరే ఇతర నటుడుకూడా అందుకుని ఉండడు. ఆ విశేషాలు ఇక్కడ చదవండి.

న భూతో న భవిష్యతి ' నాగయ్య '


http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_05.html

1947 లో వాహిని వారి ' యోగి వేమన ' చిత్రంలో ఆయన నటన మరువరానిది. ' ఫిలిం ఇండియా ' పత్రిక సంపాదకుడు బాబురావు పటేల్ నాగయ్య గారిని భారత దేశపు పాల్ ముని అని వర్ణించాడు.

1950 లో వచ్చిన ' బీదల పాట్లు ' చిత్రంతో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రికార్డు సృష్టించినా చేతికి ఎముక లేకుండా చేసిన దానాల వలన చివరి దశలో ఆయనే పాట్లు పడాల్సి వచ్చింది. ఆయన స్వంత సంస్థ ' రేణుక ఫిల్మ్స్ ' కార్యాలయం ఎప్పుడూ కళకళలాడుతూ ఒక సత్రం లాగ ఉండేది. ఆ విశేషాలు ఇక్కడ చదవండి.

సంగీతమయం సమస్తం

http://sirakadambam.blogspot.com/2010/06/blog-post_07.html

తెలుగు సినిమాకి భావయుక్తంగా పాట ఎలా పాడాలో, పద్యం ఎలా చదవాలో నేర్పిన మహాభావుడు నాగయ్య.

తాను పోషించిన పాత్ర ' పోతన ' లాగే తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయిన ధర్మాత్ముడు నాగయ్య.

సినిమావాళ్ళంటే జులాయిలు, వ్యభిచారులు అనే అపప్రధను పోగొట్టి గౌరవాన్ని తెచ్చిపెట్టిన నటుడు నాగయ్య.

1965 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ బిరుదు పొందిన తొలి తెలుగు సినిమా నటుడు నాగయ్య.

' నా యిల్లు ' చిత్రం తర్వాత నిర్మించిన ' భక్త రామదాసు ' ఆయన్ని ఆర్థికంగా మరింత కృంగదీసింది. అనేక కష్టాలకు ఓర్చి నిర్మాణం పూర్తి చేసి విడుదల చేసినా ఆర్థికంగా విజయవంతం కాకపోవడం ఆయన్ని మరిన్ని కష్టాలలోకి నెట్టింది. అందుకే ఆయన తన అనుభవాలను వివరిస్తూ .........
" నా జీవితం ఇంకొకరికి గుణపాఠం. నేను నేర్చుకున్న నీతిని అందరికీ వెల్లడిస్తూ నేర్చుకోమని విన్నవిస్తున్నాను. దానధర్మాలు చెయ్యండి. తనకు మాలిన ధర్మాలు చేయకండి. అందరినీ నమ్మకండి. అందరూ మంచివాళ్ళే అనుకోవడం పెద్ద పొరబాటు. మేకవన్నె పులులేవరో తెలుసుకుని వాళ్ళని వేరు చేయండి. మీ మంచితనాన్ని, సహృదయతను వినియోగించుకునే వాళ్ళని గమనించి ప్రవర్తించండి. పేరు ప్రఖ్యాతులు, అఖండ గౌరవాలు  పొందినా నాలాంటి దుర్దశ ఇంకొకరికి రాకూడదు "
అంటారు నాగయ్య.

మొదట భోగిగా, తర్వాత యోగిగా మారిన వేమన అంతిమయాత్ర జరుగుతోంది. తొలుత మిత్రుడు, తర్వాత శిష్యుడిగా మారిన అభిరాముడు దుఃఖంతో గానం చేస్తుండగా వేమన తనువు చాలించాడు. ' యోగి వేమన ' చిత్రంలో ఈ ఘట్టం చిత్రీకరణ పూర్తయింది. ఆ ఘట్టంలో అభిరాముడి పాత్రధారి లింగమూర్తి కూడా నాగయ్య గారికి ప్రియ మిత్రుడు. మేకప్ తీసేసాక ఆయనతో నాగయ్య గారు " బావా ! ఇలాగే మనిద్దరిలో ఎవరు ముందుగా కాల్ షీట్ పూర్తి చేసుకుని ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి సిద్ధమవుతారో... వారి చెవిలో రెండవవారు నారాయణ మంత్రం చెబుతూ వీడ్కోలు పలకాలి. అలా అని నాకు మాటియ్యి " అని లింగమూర్తి గారి చేత చేతిలో చెయ్యి వేయించుకున్నారట.
1973 డిసెంబర్ 30 వ తేదీన లింగమూర్తి గారికి ఆమాట నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. మద్రాస్ ' వాలంటరీ హెల్త్ సర్వీసెస్ ' ఆస్పత్రిలో నాగయ్య గారి చివరి ఘడియల్లో ఆ వార్డులో భజన జరుగుతుండగా లింగమూర్తి గారు నాగయ్య గారి చెవిలో నారాయణ మంత్రం జపించారు. ఆస్పత్రి వర్గాలు గానీ, అక్కడి రోగులు గానీ ఆ భజనకు ఆడ్డు చెప్పలేదు సరికదా వారు కూడా పాల్గోన్నారట.
దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.... నాగయ్య గారి మీద ప్రజలకు వున్న పూజ్య భావాన్ని. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా దానధర్మాలు చేసినా తెలుగు, తమిళ ప్రజల మనస్సులో మాత్రం మహోన్నతమైన స్థానాన్ని మిగుల్చుకున్న మహానటుడు నాగయ్య గారు.

 ఈరోజు నాగయ్య గారి వర్థంతి సందర్భంగా ఆయనకు కళా  నీరాజనాలర్పిస్తూ...........
  నాగయ్య గారి గురించి గతంలో రాసిన టపాలు ఈ క్రింది లింకుల్లో...........

http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_30.html         

http://sirakadambam.blogspot.com/2010/03/blog-post_29.html

Vol. No. 02 Pub. No. 103

6 comments:

తృష్ణ said...

నాగయ్య గారి స్వీయ చరిత్ర చదివారా? చాలా భారంగా అయిపోతుంది మనసు అది చదవగానే. అయిటే నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా చాలన్ ఉంటాయి అందులో. ఆయన సంగీతం,స్వరం,నటనా సామర్ధ్యం అన్నీ మెచ్చదగ్గవే. తెలుగు సినిమా గర్చించదగ్గ గొప్ప నటులు.

Saahitya Abhimaani said...

అద్భుతమైన సమాచారం ఇచ్చారు రావుగారూ. తెలియని విశేషాలు అనేకం తెలిసినాయి.

ధన్యవాదాలు.

SRRao said...

* తృష్ణ గారూ !
నాగయ్య గారి స్వీయ చరిత్ర పుస్తకం చదవలేదండీ ! కానీ ఆయన గురించి చాలా విన్నాను... చదివాను. నిజంగానే ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ధన్యవాదాలు.

* శివ గారూ !

ధన్యవాదాలు

shankar said...

ఆయన గొంతులో ఏదో పవిత్రత తొణికిసలాడుతూ ఉంటుందనిపిస్తుంది నాకు. మీ బ్లాగ్ముఖతా ఆ మహానుభావుడిని మరోసారి తలచుకునేలా చేసినందుకు ధన్యవాదాలు. చక్కగా ఉంది మీ నివాళి.

@ తృష్ణ గారు
నాగయ్య గారి స్వీయ చరిత్ర ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పగలరు. చదవాలనుంది.

SRRao said...

* శంకర్ గారూ !
ధన్యవాదాలు

తృష్ణ said...

@sankar gaaru, try in "visaalaandhra"book stores.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం