Friday, September 30, 2011

పాటబడి పెద్ద

విజయనగరం పేరు చెప్పగానే గజపతుల వైభవంతో బాటు సంగీత, సాహిత్య వైభవం కూడా మన కళ్ళ ముందు మెదులుతుంది. ముఖ్యంగా సంగీత రంగాన్ని సుసంపన్నం చేసిన ఎందఱో కళాకారులకు విజయనగరం పుట్టినిల్లు. పుట్టింది కృష్ణా జిల్లా అయినా ఘంటసాల మాస్టారు సంగీతజ్ఞుడిగా తయారయింది విజయనగరంలోనే ! స్వర కోకిలమ్మ సుశీలమ్మను మనకందించింది కూడా విజయనగరమే ! గురజాడ రచనలకు వేదిక అయింది కూడా విజయనగరమే ! వీరికే కాదు ఇంకా ఎందఱో సాహితీవేత్తలకు కూడా విజయనగరం స్థానం కల్పించింది.

ఆ విజయనగరానికే తలమానికమైన సంగీత కళాశాల అదే.... ఒకప్పటి సంగీత పాఠశాల చరిత్ర సుమారు ఎనిమిదిన్నర దశాబ్దాలనాటిది. కర్ణాటక సంగీత రంగాన్ని సుసంపన్నం చేసిన ఎందఱో మహానుభావులు ఆ కళాశాలనుంచి తయారయ్యారు. మరెందరో మహనీయులు ఆ కళాశాల కీర్తిని ఇనుమడింపజేసారు. ఆ పాఠశాల తొలి అథ్యక్షులుగా హరికథా పితామహ శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు 1935 లో నియమితులయ్యారు. 

సాధారణంగా ఇతరులైతే తమ హోదాను పాఠశాల అథ్యక్షులు అనే రాసుకుంటారు. కానీ నారాయణదాసు గారు  తమ హోదాను రాసుకోవలసి వచ్చినప్పుడు శుద్ధ వ్యావహారికంలో ' పాటబడి పెద్ద ' అని రాసుకునేవారట.  ఎంత చక్కటి పలుకుబడి...... ఓసారి పురిపండా అప్పలస్వామి గారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా చర్చ ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభమైన వ్యావహారిక భాషోద్యమం మీదకి మళ్ళింది. ఆయన అకస్మాత్తుగా ఒక ప్రశ్న వేసారు. 

" ' తవ్వోడ ' అనే మాట ఎప్పుడైనా విన్నారా ? " అని అడిగారు. 

మేము బుర్రలు గోక్కున్నాం. ఆ పదం అసలు తెలుగు పదమేనా ? లేక మరేదైనా భాషా పదమా ? అనే సందేహం వచ్చింది. 

ఆ విషయమే అప్పలస్వామి గారిని అడిగాం. అది తెలుగు భాషకు చెందినదే అని చెప్పారు. 

ఎంత ఆలోచించినా ఆ పదం ఏమిటో, దాని అర్థం ఏమిటో అప్పుడు మాకు తట్టలేదు. చివరికి ఆయనే ఆ పదం గురించి వివరించారు. 

మీకెవరికైనా ఆ పదం గురించి తెలిస్తే చెప్పగలరా ?

 Vol. No. 03 Pub. No. 045

Thursday, September 29, 2011

కవిసమయం

డా. సి. నారాయణరెడ్డి గారు మంచి వక్త. మీదు మిక్కిలి చమత్కార సంభాషణ ఆయన ప్రత్యేకత. ఆయన ఉపన్యాసం ఆద్యంతం ఆకట్టుకోవడానికి సందర్భానుసారంగా ఆయన వదిలే చమత్కార బాణాలే ప్రధాన కారణం. భాషా విన్యాసాలతో సాగిపోతుంది ఆయన ఉపన్యాసం. 

సినారె గారు ఓసారి విశాఖపట్నం లో ఓ సభలో మాట్లాడుతూ... 


  " ఇది విశాఖ. శ్రీశ్రీ వంటి కవిని సృష్టించిన ఫలవృక్ష శాఖ. 
  అమ్మా ఓ ముద్ద పెట్టు అంటాడు కవి. మనస్సు ఆర్ద్రమవుతుంది. 
  అమ్మాయీ ఓ ముద్దు పెట్టు అంటాడు రసరాజ్య యువకవి. మనస్సు ప్రేమార్ద్రమవుతుంది. 
  కవికి మాట్లాడే సమయం తెలియాలి. కవి సమయమూ తెలియాలి " 

.... అనగానే చప్పట్లే చప్పట్లు.  

Vol. No. 03 Pub. No. 044

Wednesday, September 28, 2011

మధురగానం


గంధర్వులు చేసే గానం అమృతమయమైనది అని ప్రతీతి.
నిజానికి అది మానవ మాత్రులకు అలభ్యం.
కానీ భారత దేశం చేసుకున్న అదృష్టం ఏమిటో గానీ ఎన్నో రకాల సంగీత రీతులు, ఎందరో మధుర గాయకులు. ఈ కర్మభూమిలో సాక్షాత్తూ ఆ గంధర్వులే దిగివచ్చి గానామృతాన్ని మనకందిస్తున్నారా అనిపిస్తుంది.
అలాంటి గంధర్వ గానామృతమే లతా మంగేష్కర్.

భారతదేశం చేసుకున్న అదృష్టం లతా  !
లలిత మనోహరమైన సుమధుర గానం లతది !
కోకిల గానం చెయ్యడానికి సందేహిస్తుంది లత గానం ముందు....

సెలయేళ్ల చిరు సవ్వడి ఆమె గొంతులో
చిన్ని లేళ్ళ చిరు నడకలు ఆమె గానంలో
గంధర్వులు మోకరిల్లుతారు ఆమె గానం ముందు..... 


సంగీత సరస్వతి ఆమెనావహించింది
అంతులేని స్వరగంగ ప్రవహించింది
దివ్యలోకాల సంచారం చేయిస్తుంది ఆమె గానం....

మధురగాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ......

నిదురపోరా తమ్ముడా.... అంటూ తెలుగులో తొలిసారిగా లతా మంగేష్కర్ పాడిన ఈ పాట ' సంతానం ' చిత్రంలోనిది.Vol. No. 03 Pub. No. 043

Monday, September 26, 2011

దసరా ప్రత్యేకం - శిరాకదంబం

 మంగళవారం నుండి ప్రారంభం కానున్న శరన్నవరాత్రులలో జరుపుకునే పూజా విధానం, దసరా పాటలతో పాటలపల్లకి దుర్గ అందిస్తున్న ఆడియో కార్యక్రమం వంటి ప్రత్యేకతలతో ఈ వారం శిరాకదంబంలో ...... Vol. No. 03 Pub. No. 042

Saturday, September 24, 2011

అక్కడ దుర్యోధనుడు... ఇక్కడ శకుని

నిజమైన నటుడికి సాధ్యం కాని పాత్ర అంటూ వుండదు. రెండు విభిన్న మనస్తత్వాలు గల పాత్రలు.... ఒకటి రాజ్యకాంక్షతో బంధుత్వాలను కూడా కాలదన్నిన అహంకార పూరితమైన దుర్యోధనుని పాత్ర. మరొకటి తన పగ తీర్చుకోవడం కోసం కపట నాటకమాడి దుర్యోధనాదులలో బలహీనతలను, అహంకారాన్ని రెచ్చగొట్టిన శకుని పాత్ర. 

రంగస్థలం మీద దుర్యోధనుని పాత్రకు, వెండితెర మీద శకుని పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి . అప్పటివరకూ వెండితెర శకునిగా వెలుగొందిన సీయస్సార్ స్థానాన్ని ఆక్రమించిన గొప్ప నటుడు ధూళిపాళ.  1921 వ సంవత్సరం గుంటూరు జిల్లా గురజాల తాలూకా దాచేపల్లి గ్రామంలో శుద్ధ శ్రోత్రియ కుటుంబంలో జన్మించిన ధూళిపాళ ఎనిమిదో తరగతి వరకూ తమ గ్రామంలోనే చదివారు. అంతకంటే చదివే అవకాశం ఆ గ్రామంలో లేకపోవడం చేత బాపట్లలో వేద పాఠశాలలో చేరి వేదాధ్యయనం చేసారు. తరువాత తండ్రిగారి బలవంతం వలన గురజాలలో వాలంటరీ పని నేర్చుకోవడానికి వెళ్ళారు. ప్లీడరు గుమాస్తా దగ్గర సహాయకుడిగా ఉండే పనిని అప్పట్లో వాలంటరీ అనేవారు. ఆ పని చేసినందుకు జీతభత్యాలేమీ వుండవు. పని నేర్చుకోవడం కోసమే చేరేవారు. అక్కడినుంచి గుంటూరు వెళ్ళాక ఆయనను రంగస్థలం పలుకరించింది. మొదట్లో ఎక్కువగా ఆడవేషాలు వేసిన ధూళిపాళ మాధవపెద్ది వెంకట్రామయ్య గారి ప్రోత్సాహంతో ' వీరాభిమన్యు ' నాటకంలో అభిమన్యుని పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నారు. తర్వాత అనేక పాత్రలు పోషించినా ఆయనకు రంగస్థలం మీద ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది మాత్రం దుర్యోధనుని పాత్ర.

ఆయనకు  చలనచిత్ర రంగ జీవితాన్నిచ్చింది కూడా దుర్యోధనుని పాత్రే ! అంతకుముందు ఒక చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించినా ఆయనకు గుర్తింపు తెచ్చింది మాత్రం ఈ పాత్రే ! అది కూడా అప్పటికే అగ్రనటుడైన, నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావు కురువృద్ధుడు భీష్మునిగా నటించిన బి. ఏ. సుబ్బారావు గారి ' భీష్మ ' చిత్రంలో . మొదటి చిత్రంలోనే ఎన్టీయార్ ప్రశంసలందుకుని ఆయనకు అభిమాన నటుడిగా మారిపోయారు ధూళిపాళ.

ఎన్టీయార్ అభిమానానికి చిహ్నమే ధూళిపాళ ను వెండితెర శకునిని చేసింది. శ్రీకృష్ణ పాండవీయం ద్వారా ఆయనకా అవకాశం ఇచ్చారు రామారావు. ఆ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఆ పాత్రను తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతం చేసారు ధూళిపాళ. అప్పటివరకూ అపర శకునిగా పేరు తెచ్చుకున్న సీయస్సార్ ని మరిపించారు. ఇవే కాకుండా ' కలిమిలేములు ' చిత్రంలో జమిందారు పాత్రతో ప్రారంభించి ఎన్నో సాంఘిక చిత్రాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించారు. నటనకు భాష్యం చెప్పగల ధూళిపాళ అస్త్ర సన్యాసం చేసినట్లు తన నటనకు వీడ్కోలు చెప్పి శేష  జీవితాన్ని హనుమాన్ మందిర నిర్మాణంలోను, ఆంజనేయ ఉపాసకుడిగా ఆథ్యాత్మిక మార్గంలో గడిపారు. 

రంగస్థలంపై దుర్యోధనుడిగా, వెండితెరపై శకునిగా కీర్తి గడించిన ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు కళా నీరాజనాలు అర్పిస్తూ...   

ధూళిపాళ గారిపై గతంలోని టపా .......... 


Vol. No. 03 Pub. No. 041

Thursday, September 22, 2011

పేర్లు చెప్పరా ?- జవాబు


  కనుక్కోండి చూద్దాం - 53_ జవాబు 


అసలు పేర్లు                                                                   తెర పేర్లు
1. ప్రమీల                                                    -    దేవిక
2 . వసుంధరాదేవి                                          -    వసుంధరాదేవి
3 . ఉదయచంద్రిక                                          -     రాధ
4 . ఉష                                                      -     దివ్యవాణి
5 . శ్రీలత                                                    -     రోజా
6 . విజయలక్ష్మి                                            -     రంభ
ఇవన్నీ ఒకప్పటి తెలుగు చిత్ర కథానాయికల అసలు పేర్లు. 
వీరి తెర పేర్లు ఏమిటో వరుసలో చెప్పగలరా ?
 
దేవిక గారు రెండు తప్ప మిగిలిన పేర్లు చెబితే ప్రసీద గారు అదనంగా మరో పేరు చెప్పారు. వారిద్దరికీ ధన్యవాదాలు.
 
Vol. No. 03 Pub. No. 036a

Wednesday, September 21, 2011

తెలుగు అడుగుజాడ

" చెడ్డవారి వల్ల చెప్పుదెబ్బలు తినచ్చును గానీ - మంచివారి వల్ల మాటకాయడం కష్టం " 
" నిజమాడేవాడు సాక్ష్యానికి రాడు ! సాక్ష్యానికొచ్చేవాడు నిజవాళ్ళేడు "
" నమ్మించోట చేస్తే మోసం... నమ్మని చోట చేస్తే లౌక్యమను " 
" అడగ్గానే యిస్తే వస్తువు విలువ తగ్గిపోతుంది " 
" ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటేనే కానీ పొలిటీషియన్ కానేరడు " 
" కుంచం నిలువునా కొలవడానికి వీల్లేనపుడు - తిరగేసి కొలిస్తే నాలుగ్గింజలైనా నిలుస్తాయి " 
" ఒకడు చెప్పిందల్లా బాగుందనడమే - సమ్మోహనాస్త్రం అంటే అదేగా " 
" లెక్చర్లు ఎంతసేపూ సిటీల్లోనేగానీ - పల్లెటూళ్ళో ఎంతమాత్రం పనికి రావు "
 " పేషన్స్ ఉంటేనే గానీ లోకంలో నెగ్గలేం "
" ప్రమాదాలు తప్పించుకోవడమే ప్రజ్ఞ "

- చివరగా " మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్ "
" డామిట్ ! కథ అడ్డం తిరిగింది " అని తేల్చేసారు గురజాడ.

సుమారు నూట పదిహేనేళ్ళ క్రితమే తన ' కన్యాశుల్కం ' ద్వారా పలికిన ఈ భాష్యాలు నిత్య సత్యాలు. ఇలాంటివి ఆ నాటకంలో కోకొల్లలు. ఆనాటి సాంఘిక దురాచారాలైన కన్యాశుల్కం. బాల్యవివాహాలపై ఆయన ఎక్కుపెట్టిన కలం వాడి ఈనాటికీ చెక్కు చెదరలేదు. ఆ దురాచారాలు ఈనాడు అవే రూపాల్లో లేకపోవచ్చు. రూపాలు మారి ఉండవచ్చు. కానీ అప్పుడు ఇప్పుడూ అలాంటి దురాచారాలకు తొలుత బలవుతున్నది స్త్రీలు మాత్రమే !

గురజాడ స్త్రీ పక్షపాతి అన్నది ఈ నాటకం ద్వారా అర్థమవుతుంది. అమాయక బుచ్చమ్మ దగ్గర్నుంచి గడుసుతనం గల పూటకూళ్ళమ్మ దాకా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని, దానికి నాగరికత రంగు పూసే గిరీశం పాత్ర దీనికి పెద్ద ఉదాహరణ. గిరీశమే కాదు... డబ్బుకోసం అన్నెం పున్నెం తెలియని కూతుళ్ళ జీవితాలు బలి చేసే అగ్నిహోత్రావధానులు... కాటికి కాళ్ళు జాచినా, తలచెడి వయసులో వున్న కూతురు ఇంట్లో వున్నా మళ్ళీ  పెళ్లి కోసం వెంపర్లాడి పోయే లుబ్దావధానులు, సానివాడలని పోషిస్తూ తన లౌక్యాన్ని ప్రదర్శించే రామప్ప పంతులు.... ఇలా ప్రధాన పురుష పాత్రల్లో మగవారికి ఆనాడు స్త్రీల పట్ల వున్న చులకన భావాన్ని మన కళ్ళ ముందుంచారు గురజాడ.

ఆడ అయినా, మగ అయినా మంచి చెడ్డా రెండు ఉంటాయనడానికి ఉదాహరణగా కొన్ని పాత్రలను మలిచారు గురజాడ తన ' కన్యాశుల్కం ' లో. వాటిలో ప్రధానమైనవి - ఒకటి తన మేనకోడలికి జరుగుతున్నా అన్యాయాన్ని సహించలేక, మూర్ఖుడైన తన బావగారికి నచ్చచెప్పలేక సతమవుతూ, ఆ పెళ్లి తప్పించడానికి ఏం చెయ్యడానికైనా సిద్ధమయ్యే పాత్ర గుంటూరు శాస్త్రి అదే కరటకశాస్త్రి. రెండు ప్లీడరు సౌజన్యారావు పంతులు గారు. అన్యాయాన్ని, దురాచారాలను సహించలేని ఆయన పాత్ర మొదట్లో వేశ్యలపైన దురభిప్రాయాన్ని కలిగి వుంటుంది. అయితే మధురవాణితో మాట్లాడాక ఆయనలో మార్పు వస్తుంది.

ఇక స్త్రీ పాత్రలలో చాలా ముఖ్యమైన పాత్ర మధురవాణి. వృత్తి రీత్యా ఆమె వేశ్య. కానీ ఆ పాత్రను నిశితంగా పరిశీలిస్తే వేశ్యలంటే చులకన భావం కలుగదు. ఎన్నో జీవిత సత్యాలను ఆమె మనకు తెలియజేస్తుంది. వేశ్యలకు కూడా నీతి ఉంటుందని, వాళ్ళు కూడా మనలాంటి మనుష్యులే, వాళ్ళకీ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు ఉంటాయని ఆ పాత్ర ద్వారా మనకి తెలియజేస్తారు. అప్పట్లో వేశ్యలుగా వున్న స్త్రీలపట్ల సమాజంలో వున్న చులకన భావాన్ని ఈ పాత్ర ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తారు గురజాడ. అయితే ఆయన ఆశయం నెరవేరిందా అనేది వేరే విషయం. కానీ ఆయనకు స్త్రీల మీద వున్న గౌరవం ఈ పాత్ర ద్వారా ప్రస్పుటమవుతుంది.

కృత్రిమమైన పాత్రలు, వాతావరణం కాక సహజమైన, సజీవమైన పాత్రల్ని, వాతావరణాన్ని, సంఘటనల్ని మనముందు ఆవిష్కరించడం వలన వంద సంవత్సరాలు దాటిపోయినా ఆ నాటకం సజీవంగా వుంది. ఆ నాటకం ద్వారా గురజాడ కూడా నేటికీ అందరి మనస్సులో సజీవంగా వున్నారు. ఇప్పటి తరానికి సమకాలీన రచయితల పేర్లు తెలియకపోయినా గురజాడ గురించి తెలియని వారు ఉంటారని అనుకోను.

గురజాడ కలం నుండి జాలువారిన  ' దేశమును ప్రేమించుమన్నా... ' వింటుంటే మనలో దేశభక్తి పొంగి ప్రవహించవలసినదే ! ప్రామాణికమైన తొలి తెలుగు కథగా ఆయన ' దిద్దుబాటు ' గుర్తించబడింది. ఆయన రచనల్లో చెప్పుకోదగిన మరొకటి ' పుత్తడిబొమ్మ పూర్ణమ్మ '. బాల్యవివాహం నేపథ్యంలో స్త్రీ వివక్షతను గురించి స్పష్టంగా తెలియజెప్పిన రచన. ఇది ఈనాటికీ పూర్తిగా సమసిపోలేదు. స్త్రీలు ఎంత ముందంజలో వున్నా అక్కడక్కడ ఈ వివక్షత ఇంకా కొనసాగుతోనే వుంది. ఇంకో వందేళ్ళు గడిచినా గురజాడ కోరిక తీరదేమో !

తెలుగుభాషకు అడుగుజాడ గురజాడ వెంకట అప్పారావుగారి నూట ఏభైవ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ...
 


Vol. No. 03 Pub. No. 040

Tuesday, September 20, 2011

అభినయానికి సజీవ రూపం

మనకున్న అరవై నాలుగు కళలలో అభినయం ప్రధానమైనది. ఆ అభినయ కళను ఔపోసన పట్టి ఆరు దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకుల్ని ఆనందామృతాన్ని పంచిన మహానటుడు అక్కినేని. 

ఆయన ఎక్కని ఎత్తులు లేవు. కీర్తి అనేది ఒక శిఖరమనుకుంటే ఆయన ఆ శిఖరాన్ని ఎప్పుడో ఎక్కేసారు. అఖండ కీర్తి అనేదానికి ఆయనో సజీవ సాక్ష్యం. ఎంత ఎత్తు ఎదిగినా ప్రతీ మనిషీ తనేమిటో మర్చిపోకూడదనే సత్యాన్ని ఆయన తన జీవనశైలితో నిరూపించారు. అందుకే అంటారు అక్కినేని........ 

" నేను సినిమాల్లో అభినయిస్తాను. జీవితంలో అనుభవిస్తాను. కానీ అభినయించడంలో కూడా అనుభవిస్తూనే నటిస్తాను. అప్పుడే అభినయం నాకు తృప్తినిస్తుంది. రక్తికడుతుంది కూడా ! నా జీవితానికి నా నటన ఉదాత్తతనందించింది " 

అవును. ఆయన అనుభవిస్తూ అభినయిస్తారు కాబట్టే ఆయన ధరించిన ప్రతీ పాత్రా... అది సీరియస్ పాత్ర అయినా, అల్లరి చిల్లరి పాత్ర అయినా సరే... సజీవంగా మన కళ్ళ ముందు కదులుతాయి. మహాకవి కాళిదాసు, విప్రనారాయణ, అమరశిల్పి జక్కన, దేవదాసు, తెనాలి రామకృష్ణ, బాటసారి, భక్త తుకారాం, బుద్ధిమంతుడు, దసరాబుల్లోడు.... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... ఎన్నెన్నో.....  

ఆయనకు లభించిన ఈ కీర్తి అంత సులభంగా లభించలేదు. ఎంచుకున్న వృత్తినే దైవంగా భావించి, భక్తిభావంతో ఆరాధించి, ఎదురైన కష్టనష్టాలన్నిటినీ భరించి..... ఒక్క మాటలో చెప్పాలంటే తపస్సులా భావించిన వ్యక్తికి విజయం తథ్యమని నిరూపించారు. ఆకర్షణలకు లొంగిపోక, విజయాలను సోపానాలుగా చేసుకుని ఎదిగిన మనిషి అక్కినేని. అందుకే ఆయన నటనే కాదు... ఆయన జీవితం కూడా ఆదర్శప్రాయమే అందరికీ ! 
తన వృత్తి నటన. తన రంగం చలనచిత్ర రంగం. అంతే ! ఎంతమంది ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా రాజకీయ రంగంలోకి రాలేదు. తను నమ్ముకున్న చిత్ర కళామతల్లి సేవలోనే తరించారు. ఒక్కసారి ఆయన ఎక్కిన మెట్లు గుర్తు చేసుకుంటే అవి మనకి స్పూర్తిని అందిస్తాయి. 

1924 లో కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా లోని వెంకట రాఘవాపురంలో జన్మించిన అక్కినేని 1934 లో తొలిసారిగా స్త్రీ పాత్రతో రంగస్థలం ఎక్కారు. అక్కడినుంచి చిత్రసీమలో కాలుపెట్టాక ఆయన నటించిన తొలి చిత్రం ' ధర్మపత్ని ' 1941 లో విడుదలయింది. అయితే కథానాయకుడిగా ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం 1944 లో వచ్చిన ' సీతారామజననం '. అరవై చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని  1957 లో డా. బెజవాడ గోపాలరెడ్డి గారి చేతుల మీదుగా ' నటసామ్రాట్ ' బిరుదు అందుకున్నారు. 1962 వ సంవత్సరంతో వంద చిత్రాలు పూర్తయ్యాయి. 1968 లో పద్మశ్రీ బిరుదనందుకున్నారు. కథానాయకుడిగా రజతోత్సవాన్ని 1969 లో జరుపుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1977 లో ' కళాప్రపూర్ణ ' గౌరవ డాక్టరేట్ నందించింది. 1982 తో 200 చిత్రాలు పూర్తయ్యాయి. 1988 లో ఆయన ' పద్మభూషణ్ ' అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత రఘుపతి వెంకయ్య పురస్కారం 1990 లో లభించింది. మరుసటి సంవత్సరం 1991 లో భారత ప్రభుత్వ అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. 1993 లో నాగార్జునా విశ్వవిద్యాలయం గౌరవ డి. లిట్ట్. పట్టా నందించింది. 1995 లో జీవిత సాఫల్య పురస్కారం, తమిళనాడు ప్రభుత్వం ' అన్న ' పురస్కారం పొందారు. మరో ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు పేరున స్థాపించిన ఎన్టీయార్ జాతీయ చలనచిత్ర పురస్కారం తొలిసారిగా 1996 లో అందుకున్నారు. అదే సంవత్సరం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ' కాళిదాస్ కౌస్తుభ్ ' పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఆటా, తానా లతో బాటు అనేక విదేశాల్లోని సంస్థలు జీవిత సాఫల్య పురస్కారాన్ని 2000 వ సంవత్సరంలో అందించాయి. అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రంగస్థల, చలనచిత్ర మరియు టీవీ రంగాల అభివృద్ధి సంస్థ సలహాదారుగా నియమితులయ్యారు. 

ఇవన్నీ అక్కినేని అధిగమించిన సోపానాలు. ఈ విజయాల వెనుక మొక్కవోని కృషి వుంది. తపన వుంది. సాధన వుంది. అన్నిటినీ మించి అంతులేని ఆత్మస్థైర్యం వుంది. అందుకే అక్కినేనికి ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఎనభై ఎనిమిది సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ఆయన ఇంకా యువకుడే ! 

అక్కినేని నాగేశ్వరరావు ఎనభై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనతో ముఖాముఖి తెలుగు వన్ రేడియో ' టోరి '  తమ పాటలపల్లకి మూడవ వార్షికోత్సవ కార్యక్రమంగా ప్రసారం చేస్తోంది. శ్రీమతి దుర్గ సమర్పిస్తున్న ఈ కార్యక్రమం ఈ ఆదివారం ( 25 సెప్టెంబర్ ) మధ్యాహ్నం గం. 12 .00 లకు ప్రసారం అవుతుంది. 


Vol. No. 03 Pub. No. 039

Sunday, September 18, 2011

కీర్తి తెచ్చిన తంటా

  మనకి అఖండ కీర్తి రావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఒక్కోసారి ఆ కీర్తి కూడా కొన్ని చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. దానికి ఉదాహరణ ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల రచయిత సోమర్సెట్ మామ్ ఉదంతం.

ఒకసారి మామ్ భార్యా సమేతంగా స్పెయిన్ దేశం వెళ్లారు. అక్కడ ఆయనకు తన పుస్తకాలమీద ప్రచురణ కర్తల నుంచి పెద్ద మొత్తంలో రాయల్టీ లభించింది. ఇంతవరకూ బాగానే వుంది గానీ అంత పెద్ద మొత్తాన్ని అక్కడినుంచి తీసుకెళ్ళడానికి స్పెయిన్ దేశ చట్టాలు ఒప్పుకోవు. అందుకని ఏం చెయ్యాలో మామ్ కి అర్థం కాలేదు. బాగా అలోచించి ఆ డబ్బును అక్కడే సరదాగా కాలక్షేపం చేసి ఖర్చు చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.

మాడ్రిడ్ లోని అత్యంత ఖరీదైన హోటల్లో బస చేసి భార్యతో కలసి రాజభోగాలు అనుభవించారు మామ్. చాలావరకు ఖర్చు అయ్యాక ఇక తన దేశానికి బయిలుదేరాడు. హోటల్ ఖాళీ చేసే క్రమంలో యాజమాన్యాన్ని బిల్ ఇమ్మని అడిగాడు. దానికి ఆ యాజమాన్యం చెప్పిన సమాధానం సోమర్సెట్ మామ్ ని విస్తుపోయేటట్లు చేసింది. 

" అయ్యా ! మీలాంటి గొప్ప రచయిత మా హోటల్లో బస చెయ్యడమే మా అదృష్టం. మీరు ఇక్కడ బస చెయ్యడం వల్ల మా హోటల్ ప్రతిష్ట కూడా పెరిగి మా వ్యాపారం రెట్టింపు అయింది. దానికి మేమే మీకు ఋణపడి వుంటాం. ఇంకా మీ దగ్గర బిల్లు తీసుకోవడమా ? మామీద దయవుంచి మా కోరికను కాదనకండి. ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మా సేవలు మీకు ఉచితమే ! " అన్నాడా హోటల్ యజమాని.

ఇంకేం చేస్తారు సోమర్సెట్ మామ్ తన కీర్తే తనకు తంటా తెచ్చాక..... !

Vol. No. 03 Pub. No. 037

Saturday, September 17, 2011

పేర్లు చెప్పరా ?

  కనుక్కోండి చూద్దాం - 53 
1. ప్రమీల 
2 . వసుంధరాదేవి
3 . ఉదయచంద్రిక 
4 . ఉష 
5 . శ్రీలత 
6 . విజయలక్ష్మి 

ఇవన్నీ ఒకప్పటి తెలుగు చిత్ర కథానాయికల అసలు పేర్లు. 
వీరి తెర పేర్లు ఏమిటో వరుసలో చెప్పగలరా ?

Vol. No. 03 Pub. No. 036

Friday, September 16, 2011

భారత స్వరకోకిల

 గంధర్వ గానం ఎలా వుంటుందో మనకి రుచి చూపించిన స్వరకోకిల మధురై  షణ్ముగవడివు సుబ్బులక్ష్మి 
మధుర మీనాక్షి ఆశీస్సులతో, వంశపారంపర్యంగా వస్తున్న సరస్వతీ కటాక్షంతో దివి నుండి దిగిన అమృత గానం కుంజమ్మ

ఆమె సుప్రభాతాన్ని వింటూ సూర్యుడు ఉదయిస్తాడు.. దేవతలందరూ మేల్కొంటారు
ఆమె భక్తి సంగీతంతో ప్రతీ ఇల్లూ మేల్కొని దైనందిక కార్యకలాపాల్లోకి వెడుతుంది 

కర్ణాటక సంగీతాన్ని చిన్నచూపు చూసే ఉత్తరాదివారిని తన సంగీతంతో మెప్పించిన ఘనత సుబ్బులక్ష్మిది 
భారత సంగీతాన్ని సరిగా గుర్తించని యావత్ ప్రపంచాన్ని తన గానంతో మురిపించిన చతురత సుబ్బులక్ష్మిది 

భక్తి గీతాలు, భజనలు, కీర్తనలు, అభంగులు .... ఒకటేమిటి... సుబ్బులక్ష్మి ఏది పాడినా శ్రోతలకు తన్మయత్వమే !
గాంధీ, నెహ్రు, రాజాజీ, సరోజినినాయుడు లాంటి నాయకులను, ప్రసిద్ధ సంగీతజ్ఞులందరినీ కూడా మెప్పించిన గానం సుబ్బులక్ష్మిది

భారత స్వరకోకిల ఎం. ఎస్. సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా స్వరనీరాజనాలు అర్పిస్తూ....... 

ఎమ్మెస్ గురించి గతంలో రాసిన టపా..... 


సుబ్బులక్ష్మి కచేరీల యుట్యూబ్ వీడియోల ప్లే లిస్టు ఈ క్రింది లింకులో చూడండి...............

http://www.youtube.com/artist?a=GxdCwVVULXdYV5EjsF_CLpEspJF1WKEz

Vol. No. 03 Pub. No. 035

Thursday, September 15, 2011

చలన చిత్రానికి తెలుగు పలుకులద్దిన రోజు

 ఈరోజు తెలుగు చలన చిత్రం పుట్టినరోజు జరుపుకుంటున్నాం. దీనిపైన రకరకాల అభిప్రాయాలున్నాయి. అసలు తెలుగు సినిమా భారతదేశంలో టాకీ సినిమా పుట్టిన 1931 వ సంవత్సరంలో తయారు కాలేదని కూడా కొందరి అభిప్రాయం. దీనికి కారణం సరైన అథారాలు భద్రపరచకపోవడం. పత్రికలలో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా వుండడం. నిజానికి ఎవర్నీ తప్పు పట్టలేం. ఎందుకంటే బాల్యదశలో వున్న సినిమా రంగంలో సరైన దిశానిర్దేశం లేకపోవడం వలన సమాచారం భద్రపరచడం జరిగి ఉండకపోవచ్చు. 

లభిస్తున్న ఆధారాలను బట్టి విడుదల మీద భిన్నాభిప్రాయాలున్నా నిర్మాణం జరిగింది 1931 లోనే అన్నది మాత్రం చాలామంది అంగీకరిస్తున్నారు. ఈ వివాదాలన్నీ ఎలావున్నా సకల కళల సమాహారంగా భాసిల్లుతున్న తెలుగు సినిమా పుట్టుకను గురించి మరింత విస్తృతమైన పరిశోధన చేసి సరైన అథారాలతో ఎవరైనా ఖచ్చితంగా నిర్ధారించేదాకా ఈ అద్భుతమైన ఆధునిక యుగపుకళను మనకు అందించిన హెచ్. యమ్. రెడ్డి గారిని, ఇతర మహానీయుల్ని తలుచుకుందాం. 

శిరాకదంబం వెబ్ పత్రికలో వ్యాసం లింక్ .........

 చలన చిత్రానికి తెలుగు పలుకులద్దిన రోజు

  Vol. No. 03 Pub. No. 034

ఆంధ్ర ' కే ' సరి


ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి బిరుదు అన్న విషయం ఆంధ్రులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రుల పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఆయనకు లబించిన బిరుదమది. ఆయనకు ఆంధ్రులలో ఎంత పేరున్నా రాష్ట్ర స్థాయిని దాటి కేంద్ర స్థాయికి చేరుకోలేకపోయారు.


కట్టమంచి రామలింగారెడ్డిగారు సి. ఆర్. రెడ్డి గా ప్రసిద్ధులు. ఆయన విద్యావేత్త, కవి, విమర్శకుడు...మీదు మిక్కిలి సంభాషణా చతురుడు. ఆయన వ్యంగ్య బాణాలు విసరడంలో దిట్ట. ఆయన నోటివెంట శ్లేషలు అలవోకగా పలుకుతాయి.

ఓసారి రెడ్డిగారు ప్రకాశం గారిని గురించి మాట్లాడుతూ ఆయన బిరుదును విరిచి  ఆంధ్ర ' కే ' సరి  అని అన్నారట. Vol. No. 03 Pub. No. 033

Tuesday, September 13, 2011

పోయినోళ్ళందరూ మంచోళ్ళు

గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్లు 
ఉండమన్న వుండవమ్మా సాన్నాళ్ళు
పోయినోళ్ళందరూ మంచోళ్ళు 
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు ..... 
**************************
మమతే మనిషికి బందిఖానా 
భయపడి తెంచుకు పారిపొయినా 
తెలియని పాశం వెంటపడి ఋణం తీర్చుకోమంటుంది..... 
**************************
తనువుకెన్ని గాయాలైనా  మాసిపోవునేలాగైనా 
మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా.... 
**************************
 చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు 
నాటకరంగానివే.... మనసా ! 
తెగిన పతంగానివే ! .....
************************** 
ఏమిటో ఈ ప్రేమ తత్త్వం 
ఎక్కడుందో మానవత్వం 
ఏది సత్యం ఏది నిత్యం 
చివరికంతా శూన్యం... శూన్యం....
**************************
వేసవిలోనూ వానలు రావా 
కోవెల శిలకు జీవం రాదా 
జరిగేనాడే జరుగును అన్నీ 
జరిగిననాడే తెలియును కొన్ని...... 
**************************.
తనకు తానూ సుఖపడితే ఒక ఆనందం 
తనవాళ్ళనైన సుఖపెడితే పరమానందం 
ఈ రెంటికినోచని జీవితం ఎండిపోని కన్నీటి సముద్రం....
**************************  
ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం 
ఏది నిజమౌ బంధం ? 
ఏది అనురాగం ఏది ఆనందం ? .....
**************************
పశువులుకన్నా పక్షులకన్నా 
మనిషిని మిన్నగా చేసాడు.....
........ 
బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక 
నరుడే ఈ నరలోకం నరకం చేసాడు...... 
************************** 
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం 
అది తెలియకపోతే వేదాంతం......
************************** 
ఎవరు ఎవరికి తోడవుతారో
ఎప్పుడెందుకు విడిపోతారో 
.........
ఎవ్వరి పయనం ఎందాకో 
అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ..... 
**************************
రానైనా రాలేను నిదురపోనైనా పోలేను 
నిశిరాతిరియైనా నీ పిలుపే నా ప్రియా 
అదే పూల గాలి ఆనాటిదే జాబిలీ ........
**************************
కళ్ళు వాకిట నిలిపి చూసే 
పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో.....
**************************
గడ్డి మేసి ఆవు పాలిస్తుంది 
పాలు తాగి మనిషి విషమవుతాడు
అది గడ్డి గొప్పతనమా 
ఇది పాల దోషగుణమా ?......
**************************
రవ్వంత పసుపు కాసంత కుంకుమకు 
మగవాడిని నమ్మడం మనిషి చేయడం 
మనసు నిదరలేపడం మమత నింపడం.....
**************************
 జాబిల్లి వెన్నెల్లు చవి చూడలేదు 
 సిరిమల్లె సిగ ముడువలేదు.......
**************************
మనసు మాసిపోతే మనిషే కాదని 
కాటికి రాయికైనా కన్నీరుందని......
**************************
కలిమిలేమి జంటలని 
అవి కలకాలంగా ఉన్నవని 
రుజువు చేయమని 
మన ఇద్దర్నీ కాలం నేటికి కలిపేనని.....
**************************
పసిపాపవలె ఒడి చేర్చినాను 
కనుపాపవలె కాపాడినాను..... 
**************************
చంపేది ఎవడురా ? చచ్చేది ఎవడురా ? 
శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదురా !
 **************************


........ ఈ ఆణిముత్యాలను పాటలలో పొదిగిన కవి ఆత్రేయ. సినిమా పాటకు గ్లామర్, గ్రామర్ లను కూర్చిన కవి ఆత్రేయ. 

" తెల్లారేలోపు వెళ్ళాలి జగతి విడిచి 
వెలుగులో ఈ జగతి చూస్తే వెళ్ళను.. కాళ్ళాడవు " ....... అంటూ ' వెళ్తున్నాను ' అనే కవిత చెప్పి 1989 సెప్టెంబర్ 13 న వెళ్ళిపోయిన ఆత్రేయ గారికి ఈ కదంబంతో నివాళులు అర్పిస్తూ ....... 

 Vol. No. 03 Pub. No. 032

Saturday, September 10, 2011

తెలుగుభారతి ముద్దు బిడ్డ విశ్వనాథ

 ఒక్క సంగీతమేదో పాడునట్లు భా 
     షించునప్డు విన్పించు భాష  
విష్పష్టముగ విన్పించునట్లు స్ప
     ష్టోచ్చారణంబున నొనరు భాష
రసభావముల సమర్పణ శక్తి యందున 
     నమర భాషకు దీటైన భాష
 జీవులలోనున్న చేవ యంతయు చమ 
      త్కృతి పల్కులన్ సమర్పించు భాష
భాషలొక పది తెలిసిన ప్రభువుచూచి 
భాషయననిద్దియని చెప్పబడిన భాష 
తనర ఛందస్సులోని యందమ్ము నడక 
      తీర్చిచూపించినట్టిది తెలుగు భాష
వృత్తులు పాకముల్ రీతులు శైలులు 
      లావణ్య మొప్పెడు లలిత భాష 
ఎద్ది సంభవమౌనొ అద్ది సంధానించి
     ఉచితత్వమున్ గూర్త నొదుగు భాష
ఎన్నియొయ్యారంబులేని పోనగజేసి
     నడిపింపగలయట్టి గడుసు భాష 
పాలించి దక్షిణాపథమెల్ల నొకనాడు 
     ప్రభుత నిరూపించు రాజభాష 
అల్ల భాషయొక్క నధికత్వమంతయు
     శక్తి నెరపగలుగు జనుల మీద    
అన్ని కాలములను నాధారపడియుండు
     తెలుగు భాషయన్న దివ్యభాష


....... తెలుగు భాష సొగసు గురించి ఇంత బాగా చెప్పగలవారెవరు ?
తెలుగుభారతి ముద్దు బిడ్డ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కన్నా...

రామాయణ కల్పవృక్షాన్ని తెలుగు భారతి పెరట్లో నాటిన మహాకవి విశ్వనాథ
కిన్నెరసానికి నడకలు నేర్పి ఆంధ్ర దేశమంతా పారించిన మధురకవి విశ్వనాథ
నవలా సాహిత్యాన్ని వేయి పడగలతో అలంకరించిన సవ్యసాచి విశ్వనాథ
ప్రబంధం, కథ, కవిత, గేయం, విమర్శ.... అన్నీ ఆయనకు నల్లేరు మీద నడక
ఆధునిక యుగంలో శ్రీనాథునితో పోల్చగలిగిన గొప్ప కవి ఎవరు విశ్వనాథ కాక

విశ్వనాథవారు ఆథునికులలో ప్రాచీనుడు.... ప్రాచీనులలో అథునికుడు
ఆయన తెలుగు కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేసిన జ్ఞానపీఠాలంకృతుడు

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి జయంతి సందర్భంగా నీరాజనాలు అర్పిస్తూ.........


Vol. No. 03 Pub. No. 030

ఇద్దరు ప్రముఖ రచయిత్రులు...?- జవాబు

   కనుక్కోండి చూద్దాం - 52 _ జవాబు 

  ఈ ప్రక్కఫోటోలో కనిపిస్తున్నది ఇద్దరు ప్రముఖ రచయిత్రులు. పాత ఫోటో కావడం, అంత స్పష్టంగా లేకపోవడం వలన సులభంగా గుర్తుపట్టడానికి ఒక క్లూ..... వీళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళు. 
 ప్రశ్న : ఇద్దరు రచయిత్రుల పేర్లు చెప్పగలరా ?  
 
జవాబు : ఒకరు ( కుడిప్రక్క ) రచయిత్రి శ్రీమతి గోవిందరాజు సీతాదేవి గారు, ఇంకొకరు కొంతకాలం పాటు ఆంధ్ర పాఠకలోకాన్ని  ఉర్రూతలూగించిన రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి. 

 
Vol. No. 03 Pub. No. 024a

Friday, September 9, 2011

ప్రజాకవి ' గొడవ '

సత్యాహింసల 
  యేబదేండ్ల కృషి 
క్షణంలో 
  అయిపోయెను మసి

బాపూజీ బ్రతికిన యప్పటి 
సత్యహింసల దుప్పటి 
బొంకుల బొంతగా మారెను 
ఘనతలు శాంతము దీరెను 

ఉదయం కానే కాదనుకోవడం నిరాశ 
ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ 
ఈ చీకటి వుండదు 
సూర్యుడు తప్పక ఉదయిస్తాడు  

మాయలోకము మాయజనుల 
మనసులో గల మాటయొకటి
పైకి నుడివెడి పలుకు ఒకటి 
చేయదలచిన చేష్ట యొకటి 


      అవనిపై జరుగేటి అవకతవకలు జూచి 
      ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు 

పరుల కష్టముజూచి కరగిపోవును గుండె 
మాయమోసము జూచి మండిపోవును ఒళ్ళు 
పతిత మానవుజూచి చితికిపోవును మనసు 
       ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు

అవకతవకలు నేను సవరింపలేనపుడు
" పరుల కష్టాలతో పనియేమి మాక " నెడు
అన్యులను గనియైన హాయిగా మనలేను 
       ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు


 ........... ఇదీ కాళోజి ' గొడవ ' . ఆయనదెప్పుడూ వ్యవస్థతో  గొడవ పడే తత్వమే  ! 
 ఆయన జీవితమే ఉద్యమం. ఉద్యమమే ఆయన ఊపిరిగా జీవించాడు. 

అవినీతి, అన్యాయం పెచ్చుమీరినప్పుడు
దౌర్జన్యం, దుర్మార్గం హద్దు మీరినప్పుడు
మానవత్వం మృగ్యమైనప్పుడు
మనిషి మనిషిగా జీవించలేనప్పుడు

ఆయన కెరటమై నిలువెత్తు పొంగాడు
ఆయన ఉద్యమమై ఉవ్వెత్తున లేచాడు
కలాన్ని ఖడ్గంగా చేసాడు
ఫల్గుణ శక్తితో విజృంభించాడు

తెలంగాణా వైతాళికుడు కాళోజి
మాటలలో, చేతలలో, వేషభాషలలో
మూర్తీభవించిన తెలంగాణా కాళోజి

నేను ప్రపంచ పౌరుడినన్న  కాళోజికి
తెలంగాణా అంటే అంతులేని అభిమానం
రవీంద్రునిలా అది దురభిప్రాయం కాదు

తన భాష, తన ప్రాంతం, తన ప్రజలు
అభివృద్ధి చెందాలనేది ఆయన ఆశయం
అందుకోసమే ఉద్యమించాడు

" ఇప్పటి కవులందరూ సూత్ర పారాయణ వరకే...
 నా, మా, మన అనే దశలను పూర్తి చేసినపుడే కవి పరిపూర్ణుడవుతాడు. ఇక్కడ నా..  అంటే నేను. మా.. అంటే
తన భార్యాపిల్లలు అని. మన.. అంటే మనందరం అని అర్థం. ఈ స్థాయిలో కవిత్వం రాసినప్పుడే అది ముందడుగు అవుతుంది. ఈ క్రమంలో నేను ' నా ' దాటి ' మా ' దగ్గరనే వున్న. అలాగే ఇప్పుడున్న కవులందరూ అక్కడే ఆగారు. కానీ ప్రభుత్వానికి నేరుగా వ్యతిరేకంగా రాసింది గరిమెళ్ళ సత్యనారాయణ ఒక్కడే ! అట్లాంటి కవులు ఇంకా రావాలే ! " అనేవారు కాళోజి.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రముఖకవి దాశరథితో బాటు కాళోజి కూడా పాల్గొన్నారు. కాళోజీ రచించిన ' నా గొడవ ' కావ్యం మొదటి మూడు ప్రచురణలకు దాశరథి పీఠికలు రాసారు.

" కాళోజీ ఇరవదవ శతాబ్దంలో తెలంగాణా ప్రప్రథమ ప్రజాకవి. కాళోజీ అనగా కల్లలకూ, కపటాలకూ లాలూచీ పడని జీవితం అని అర్థం. అతని గేయాలకు గానీ, అతనికి గానీ అర్థం చెప్పవలసిన అవసరమే లేదు. అసలు అవే అర్థంకాని ఈ సమాజపు మహొద్గ్రంథానికి విపుల టిప్పణి వంటివి " అన్నారు దాశరథి మొదటి ప్రచురణలో. 

' నా గొడవ ' మొదటి ప్రచురణ ఆవిష్కరణ సందర్భంలో మహకవి శ్రీశ్రీ మాట్లాడుతూ ...

" కాళొజీ నిఖిలాంధ్ర కవి. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివినవారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ " అని ప్రస్తుతించారు. 

ప్రజా ఉద్యమాలకోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే కాళోజీ జీవించారు.

ప్రజాకవి కాళన్న జయంతి సందర్భంగా నివాళులు  అర్పిస్తూ......Vol. No. 03 Pub. No. 029

Thursday, September 8, 2011

వయసును జయించిన ఆశా

1962 వ సంవత్సరంలో  అమరవీరుల సంస్మరణ దినం రోజున మన దేశ రాజధానిలో ఏర్పాటయిన కార్యక్రమానికి రావాల్సిందిగా బొంబాయి ( ఇప్పటి ముంబై ) లోని ఇద్దరు గాయనీమణులకి ఆహ్వానం అందింది. వారి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సరిగా బయిలుదేరేముందు ఒక చిన్న మార్పు జరిగింది. ఇద్దరు కాదు ఒకరే ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారని. దాంతో ఒకరు ఆగిపోయారు. మరొకరు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు సమక్షంలో ప్రముఖకవి ప్రదీప్ రాసిన, సి. రామచంద్ర స్వరపరచిన ' అయ్ మేరె వతన్ కే లోగోం.... ' అనే పాటను పాడి అక్కడ హాజరైన వారినే కాక దేశ ప్రజలందరినీ ఉత్తేజపరిచారు. 

అంత అద్భుతమైన పాటను మరింత అద్భుతంగా పాడిన ఆ గాయని భారత కోకిల లతామంగేష్కర్. ఆమెతో బాటు వెళ్ళకుండా ఆపివేయబడ్డ రెండవ గాయని ఆశాభోస్లే. స్వయానా లత చెల్లెలు. ఎంతవారైనా డబ్బు, కీర్తికి దాసులని ఈ సంఘటన నిరూపిస్తుంది. అలా అక్క నీడలో ఎదుగూ బొదుగూ లేకుండా ఉండడానికి ఆశా ఇష్టపడలేదు. అందుకే ఏటికి ఎదురీదారు. అక్కతో చాలాకాలం విబేధించినా ఆమెపై గౌరవం కొంచెం కూడా సడలలేదు ఆశాలో. అందరూ అడుగడుగునా ఆమె గానాన్ని లతతో పోల్చి చూడడం ఆమెకేమాత్రం ఇష్టముండేది కాదు. అందుకే తనకంటూ ఒక బాణీని ఏర్పరుచుకుంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తన స్వరంతో ఎన్నో ప్రయోగాలు చేసింది. 

 మహారాష్ట్రలో సంగీత కుటుంబమైన మంగేష్కర్ కుటుంబంలో జన్మించిన ఆశా పదవ ఏటనే మరాఠీ చిత్రం ద్వారా చిత్రంలో పాట పాడి రంగ ప్రవేశం చేసింది. తర్వాత హిందీలో అడుగుపెట్టి తొలిరోజులలోనే సోలో పాటకు అవకాశం దక్కించుకుంది. అయితే అప్పుడు హిందీ సినిమా లోకానికి, ముఖ్యంగా సంగీత దర్శకులకు లతాయే దిక్కు. ఆవిడ కటాక్షంకోసం ఎదురుచూస్తూ కూర్చునేవారు తప్ప కొత్తవారిని ప్రోత్సహించేవారు కాదు. ఆ ప్రభావం ఆశ పైనా కూడా పడింది. చాలాకాలం పాటలు పాడుతూ వున్నా అవి కేవలం క్లబ్ పాటలో, లత పాడని పాటలో పాడేది. ఆమె గళంలోని ప్రత్యేకతను గుర్తించింది ఓ.పి. నయ్యర్ అయితే ప్రయోగాలు చేయించింది మాత్రం సి. రామచంద్ర. వారిద్దరి సంగీత దర్శకత్వంలో ఆశ ఎన్నో వైవిధ్యభరితమైన పాటలు పాడింది. ఆ విధంగా ఆమె స్వరంలోని ప్రతిభ నిజంగా వెలుగు చూడడానికి మూడు దశాబ్దాలు పట్టింది. అక్కడనుంచి ఆమె గళానికి ఎదురు లేకుండా పోయింది. ప్రముఖ సంగీత దర్శకులందరూ ఆమెతో పాడించారు. 

1966 లో వచ్చిన తీస్రీ మంజిల్ చిత్రం ఆమె జీవితాన్ని మరోమలుపు తిప్పింది. ఆర్. డి. బర్మన్ తో అనుబంధానికి నాంది పలికింది. వాళ్ళిద్దరి కలయికలో ఎన్నో అద్భుతమైన పాటలు పుట్టుకొచ్చాయి. అంతకుముందు చాలాకాలం క్రితమే ఆమె వైవాహిక జీవితం విఫలమయింది. ఆ సంఘటనే ఆమెను కష్టాలలోకి నెట్టింది. కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరం ఏర్పడడంతో తనకు తెల్సిన సంగీతాన్నే నమ్ముకుంది. చివరకు ఆ సంగీతమే ఆమెను అందాలాలెక్కించింది. ఆర్. డి. బర్మన్ కి దగ్గర చేసింది. ఫలితంగా మరోసారి ఆమె జీవితంలో పెళ్లి బాజాలు మ్రోగాయి. అయితే ఈ జీవితం కూడా సాఫీగా సాగలేదు. కాలంతో పోటీపడలేక బర్మన్ ఆగిపోతే, యువగాయకులతో పోటీపడుతూ, యువసంగీత దర్శకుల ఆధునిక పోకడలను తన గళంలో నింపుకుంటూ... సాగిపోతున్న ఆమె జైత్రయాత్రను చూసి బర్మన్లో పురుష సహజమైన అసూయలాంటిది బయిల్దేరింది. దాంతో ఆయనతో జీవించి వున్నప్పుడు, ఆయన మరణించాక వారసులతో అనేక కష్టాలను ఎదుర్కొంది. అయినా ధైర్యం సడలలేదు. వయసును జయించిన ఆమె గళం రీమిక్స్ లు, పాప్ ఆల్బంలూ అంటూ డెబ్భై ఆరేళ్ళ వయసులో కూడా అప్రతిహతంగా ముందుకు సాగిపోతోంది.

 గాయని  ఆశాభోస్లే జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తూ..... 
Vol. No. 03 Pub. No. 028

Wednesday, September 7, 2011

కళాకారుల జంట

 మనకున్న కళలు అరవై నాలుగు .  ఈ కళలన్నీ అవినాభావ సంబంధం కలవి. ఉదాహరణకు నాట్యానికి తోడు సంగీతం. సంగీతానికి తోడు సాహిత్యం. అలాగే శిల్పకళకు తోడు చిత్రలేఖనం. ఇంకా ..... ఇలా చెప్పుకుంటూ పోతే ఏ తోడూ లేని కళ వుండదేమో ! ఈ కళలన్నిటినీ సమన్వయపరచి ఏకతాటిపైకి తెచ్చిన ఈ శతాబ్దపు అద్భుతం సినిమా ! ఇదొక ప్రత్యేకమైన ఆధునిక యుగపు కళగా అభివృద్ధి చెందింది. సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పకళ, చిత్రకళ..... ఇలా దాదాపు కళలన్నీ ఈ సినిమాల్లోనే అమరిపోతున్నాయి. ఆ రకంగా సినిమా అనేది ఒక సమగ్రమైన కళారూపం అని చెప్పవచ్చు. అయితే పిచ్చివాడి చేతిలోని రాయిలాగ కళాత్మక హృదయం కాకుండా కేవలం వ్యాపార దృష్టి మాత్రమే ఉన్నవాళ్ళ చేతిలో అన్ని కళల్లాగే అప్పుడప్పుడు సినిమా కూడా విపరీత పోకడలు పోతుంటుంది. కానీ నిజమైన కళను ప్రజలెపుడూ ఆదరిస్తారు. కలకాలం ఆ కళాఖండాలను, కళాకారులను గుర్తుపెట్టుకుంటారు. 

ఒక కళకు మరొక కళ తోడైనట్లు ఒకరికి మరొకరు తోడుగా, నీడగా చిత్రసీమలో చిరకాలం నిలిచిన జంట భానుమతి - రామకృష్ణ. 1943 లో ' కృష్ణప్రేమ ' చిత్రంతో అంకురించిన భానుమతీరామకృష్ణల ప్రేమ సుమారు నలభై మూడేళ్ళ వైవాహికబంధంగా కొనసాగింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న సామెత వారి విషయంలో నిజం కాలేదు. ఇద్దరూ సినిమారంగంలో ఉన్నవారే ! ఆ మాటకొస్తే వారి వివాహానికి వేదిక సినిమారంగమే ! సహాయ దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణను ప్రేమించి... తండ్రి ఒప్పుకోకపోతే పక్షం రోజులపాటు కఠినమైన దీక్ష చేసి మరీ వివాహం చేసుకున్నారు భానుమతి.
 ఆ వివాహబంధం సాక్షిగా ఆ జంట అనేక విజయాలు చవిచూశారు. తమ కుమారుడి పేరుమీద స్థాపించిన భరణీ పిక్చర్స్ పతాకంపైన అనేక చిత్రాలు నిర్మించారు. వారు ఏ చిత్రం నిర్మించినా సామాజిక విలువలు, కళాత్మక విలువలు పుష్కలంగా ఉండేవి. తమ చిత్రాల్లో చాలావాటికి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 

 సాహిత్యంలో రచయిత విశ్వనాథకవిరాజు శిష్యురాలిగా భానుమతిలో హాస్యం పాలు ఎక్కువే ! అందుకే తమ చిత్రాల్లో హాస్యరసానికి ఎక్కువ ప్రాదాన్యమిచ్చేవారు. ఆవిడ రచనలు చూసినా హాస్యానికే పెద్ద పీట. భానుమతి సంగీతం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా సంగీతంలో ఒక ప్రత్యేకమైన ఒరవడిని సృష్టించారు. తమ సినిమాల్లో శాస్త్రీయ సంగీతానికి అగ్రస్థానమిచ్చారు. నృత్యానికి కూడా తగిన ప్రాధాన్యతే ఇచ్చారు. భానుమతి నటన గురించి చెప్పడం అంత సులభం కాదు. నవరసాలు పలికించిన నటి ఆమె. నటనా వ్యాకరణం అని అన్నాదురై నుండి బిరుదందుకున్న నటీమణి భానుమతి.

ఆ జంట రూపొందించిన చిత్రాలను పరిశీలిస్తే సినిమాలలో ఒదిగిపోయే అన్ని కళలకూ సమానమైన ప్రాధాన్యమే కల్పించారని చెప్పవచ్చు. అసలు రామకృష్ణ సినిమా కళను బాగా ఒంటబట్టించుకున్నారు గనుకనే ఆ చిత్రాల రూపకల్పనలో తీసుకున్న శ్రద్ధ వారి విజయానికి కారణమైంది. 1947 లో రత్నమాల తో ప్రారంభించి వారు నిర్మించిన లైలామజ్ఞు, చండీరాణి, చక్రపాణి, విప్రనారాయణ, బాటసారి, వివాహబంధం లాంటి ఎన్నో చిత్రాలను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. 


1939 లో వరవిక్రయం తో ప్రారంభమైన భానుమతి సినిమాజీవితం 1953 లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చండీరాణి చిత్రానికి దర్శకత్వం వహించడంతో మలుపు తిరిగింది. తర్వాత వారి పతాకంలో తయారైన కొన్ని చిత్రాలకు ఆవిడకూడా దర్శకత్వం చేసారు. భరణి స్టూడియోను స్థాపించి విజయవంతంగా నిర్వహించారు. 

...... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జంట సాధించిన విజయాలెన్నో ! సినిమావారి ప్రేమలు, వివాహాలు విఫలమవుతాయనే విమర్శకు సమాధానం ఆ జంట సుదీర్ఘ వైవాహిక జీవితమే ! సినిమావారికి కళాత్మక దృష్టికంటే వ్యాపార దృష్టే ఎక్కువ అనుకునేవారికి వారి చిత్రాలే సమాధానం. 

 జీవితాన్ని, వృత్తినీ సమానంగా పంచుకున్న ఆ కళాకారుల జంట ఇంకో విషయం కూడా పంచుకున్నారు. అది సెప్టెంబర్ 7 వ తేదీని. 1925 వ సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదీన భానుమతి గారు జన్మిస్తే 1986 సెప్టెంబర్ 7 వ తేదీన రామకృష్ణ గారు దివంగతులయ్యారు. ఇద్దర్నీ ఒకేరోజు స్మరించుకునే అవకాశాన్ని మనకిచ్చారు. 

  భానుమతి - రామకృష్ణ జంటకు కళా నీరాజనాలు అర్పిస్తూ.......

 భానుమతి గారిపై గతంలోని టపా, ఆవిడతో ఇంటర్వ్యూ వీడియో ఈ క్రింది లింకులో...... 


భానుమతి గళంలో జయదేవుని అష్టపది........ Vol. No. 03 Pub. No. 027

Tuesday, September 6, 2011

ఇద్దరు ప్రముఖ రచయిత్రులు...?

  కనుక్కోండి చూద్దాం - 52 

  ఈ ప్రక్కఫోటోలో కనిపిస్తున్నది ఇద్దరు ప్రముఖ రచయిత్రులు. పాత ఫోటో కావడం, అంత స్పష్టంగా లేకపోవడం వలన సులభంగా గుర్తుపట్టడానికి ఒక క్లూ..... వీళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళు. 

 ప్రశ్న : ఇద్దరు రచయిత్రుల పేర్లు చెప్పగలరా ?  


 
Vol. No. 03 Pub. No. 026

హైదరాబాద్ లో మొదటి నిర్మాత.. ? - జవాబు

 కనుక్కోండి చూద్దాం - 51_జవాబు  


అ ) హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి చలనచిత్ర నిర్మాత ఎవరు ?

జవాబు : ధీరేంద్రనాథ్ గంగూలీ

ఆ ) ఆయన ప్రధానంగా ఏ భాషలో చిత్రాలు నిర్మించారు ?

జవాబు : బెంగాలి, హిందీ

ధీరేంద్రనాథ్ గంగూలీ శాంతినికేతన్ విద్యార్ధి. ఆయన నటుడు, దర్శకుడు, నిర్మాత. బెంగాలీలో చిత్రాలు నిర్మించారు. 1921 నుంచీ ఆయన చిత్రాల్లో నటించారు. దాదాసాహెబ్ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ నైజాం స్టేట్ ఆర్ట్ స్కూల్లో ప్రథానోపాధ్యాయునిగా పనిచేసారు. నిజం సహకారంతో లోటస్ ఫిలిం కంపెనీ నెలకొల్పి బిమాత, చింతామణి లాంటి చిత్రాలు  నిర్మించారు. ఆ పేరుతోనే ఒక స్టూడియో, రెండు థియేటర్లు స్థాపించారు.

1924 లో ధీరేంద్ర రజియా బేగం చిత్రం పంపిణీ చెయ్యడం నిజాం నవాబుకు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా ఆయన హైదరాబాద్ ను వదలి వెళ్ళాల్సివచ్చింది. కలకత్తా చేరుకున్నాక ఆయన చాలా చిత్రాలు రూపొందించారు. పద్మభూషణ్ తో బాటు అనేక పురస్కారాలు అందుకున్నారు.

Vol. No. 03 Pub. No. 011a

Monday, September 5, 2011

గురువు - అమ్మగురుర్బ్రహ్మా గురుర్విష్ణుః 
గురుర్దేవో మహేశ్వరః 
గురుర్సాక్షాత్ పరబ్రహ్మః 
తస్మైశ్రీ గురవే నమః 
సమస్త ప్రకృతి మనకి గురువే !
నిత్యం మనకెన్నో విషయాలు బోధపరుస్తుంటుంది 
సమస్త జనులు మనకు గురువులే !
వారి జీవనశైలితో మనకు కర్తవ్య బోధ చేస్తుంటారు 

వీటన్నిటినీ రంగరించి మనకర్థమయ్యేలా బోధించి 
పథ నిర్దేశం చేసేవారు మన ఉపాథ్యాయులు 

ఉపాథ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాథ్యాయులకు, మిత్రులకు శుభాకాంక్షలు 
మన భారత ద్వితీయ రాష్ట్రపతి, తెలుగు వాడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నివాళులు

************************************అమ్మ అనగానే అదో తీయనైన భావన
అందులోను ఆ అమ్మ విశ్వానికే అమ్మ
కరుణామయి.. ప్రేమ స్వరూపిణి
ఆమే...... మదర్ థెరెసా !!!మదర్ థెరెసా వర్థంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తూ.... 


మదర్ గురించి గతంలోని టపాలు.............

అమ్మకు వందనం

అమ్మ ఎవరికైనా అమ్మ


Vol. No. 03 Pub. No. 025

Sunday, September 4, 2011

వినాయకపూజల చిత్రకదంబం - ఈవారం

వినాయక పూజలు ముగుస్తునాయి. కొంతమంది మిత్రులు తమ పూజలను అందరితో పంచుకోవడానికి పూజ ఫోటోలను, విశేషాలను అందించారు. మీరు కూడా పంపండి. దానితో బాటు శిరాకదంబం వెబ్ పత్రికలో ఈవారం ............ 


www.sirakadambam.com
 Vol. No. 03 Pub. No. 24

Saturday, September 3, 2011

సాహితీ ధ్రువతార

 మరో సాహితీ ధ్రువతార రాలిపోయింది
 ఆయన పాత్రికేయుడు మాత్రమే కాదు.... సాహితీవేత్త కూడా.....
ఆయన సాహితీవేత్త మాత్రమే కాదు..... పరిశోధకుడు కూడా.....
ఆయన పరిశోధకుడు మాత్రమే కాదు.... విజ్ఞానవేత్త కూడా.....
ఆయన విజ్ఞానవేత్త మాత్రమే కాదు......... సాహితీ సుక్షేత్రంలో అన్నీ

పత్రికలకు విలువ నేర్పినవారు
అనువాదకులకు అర్థాలు నేర్పినవారు
నరావతారాన్ని చదువరులకు చూపించినవారు
తెలుగువారందరికీ విశ్వదర్శనం చేయించినవారు
విజ్ఞానగ్రంథాల రచనలో విశ్వరూపం ప్రదర్శించినవారు 

పెద్దలకోసం పెద్ద గ్రంథాలు అనువుగా రాసారు
తెలుగులో విజ్ఞాన సాహిత్యం లేదనే కొరత తీర్చారు
పిల్లలకోసం బాల సాహిత్యం సులువుగా తెనిగించారు
మార్క్ ట్వైన్ ఆంధ్రుడిగా పుట్టి తెలుగులో స్వయంగా రాసాడా అనిపించారు

ఆ ధ్రువతార రాలిపోయింది..... ఆ సాహితీవనం వాడిపోయింది
ఆయన కలం ఆగిపోయింది..... ఆయన గళం మూగవోయింది
అయినా ఆయన రచనలు సాహితీవినీలాకాశంలో ఎప్పటికీ ద్రువతారలే !
అయినా ఆయన పంచిన విజ్ఞానం సాహితీవనంలో ఎప్పటికీ వాడని కుసుమాలే !!

రాలిపోయిన మరో సాహితీ ధ్రువతార నండూరి రామమోహనరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ..... 


నండూరి వారు తీర్చిదిద్దిన ఆంధ్రజ్యోతి ఈనాటి సంచికలో ఆయన గురించి ఈ క్రింది లింకులలో ......

సంపాదకీయం .....
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2011/09/03/ArticleHtmls/03092011004004.shtml?Mode=1

తుర్లపాటి వారి జ్ఞాపకాలు ....
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2011/09/03/ArticleHtmls/03092011004011.shtml?Mode=1

Vol. No. 03 Pub. No. 023

Friday, September 2, 2011

అందాల నటుడు

ఆజానుబాహు విగ్రహం, స్పురద్రూపం, గంభీరమైన స్వరం ఆయన సొంతం
ఉత్తమ కథానాయకుని లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న నటుడాయన
పౌరాణిక పాత్రలకు కావల్సిన అన్ని లక్షణాలు ఆయనలో వున్నాయి
సాంఘిక పాత్రలకు కావల్సిన అన్ని హంగులు ఆయనలో వున్నాయి
అంతెందుకు... అగ్రనటుడికి  కావాల్సిన అన్ని అర్హతలూ ఆయనలో వున్నాయి

............ ఆయనే అందాల నటుడు హరనాథ్.
 ఒకప్పుడు అప్పటి అగ్రహీరోలని తలదన్ని అగ్రస్థానానికి చేరుతాడని అందరూ భావించిన నటుడు. మన దురదృష్టమో, ఆయన దురదృష్టమో తెలియదు. తెలుగు తెరకు ఒక మంచి నటుడు దూరమయ్యాడు.

ఈరోజు హరనాథ్ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ...... 

హరనాథ్ వివరాలతో గతంలో రాసిన టపా..........

రెండో రాముడు

Vol. No. 03 Pub. No. 022

Thursday, September 1, 2011

శుక్లాంబరధరం......

 శుక్లాంబరధరం... విష్ణుం...
శశివర్ణం చతుర్భుజం... 
ప్రసన్న వదనం.... ధ్యాయేత్ ! 
సర్వ విఘ్నోప శాంతయే !

సమస్త విఘ్నాలను తొలగించే శక్తి ఆ గణనాథునికి వున్నది.
స్వచ్చమైన తెల్లని చంద్రుని కాంతి వంటివాడు వినాయకుడు.
సమస్త లోకాలలో వ్యాపించివున్న ఆ విఘ్ననాశనునిని పూజిద్దాం.
ఆయన అనుగ్రహించే సిద్ధిని, బుద్దినీ అందుకుందాం.
ధ్యానశ్లోకం యొక్క వివరణ.............Vol. No. 03 Pub. No. 021
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం