Wednesday, June 30, 2010

లాఠీఛార్జ్

1949 లో వచ్చిన ' మనదేశం ' చిత్రం ప్రత్యేకత ఏమిటో సినిమా ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటరత్నని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన చిత్రం అది. ఆ చిత్ర దర్శకుడు ఎల్. వి. ప్రసాద్ .

ఎన్టీరామారావు అయినా, నాగేశ్వరరావు అయినా మరొకరు అయినా అప్పటితరం నటులు తాము ధరించిన పాత్రలో ఎలా లీనమైపోయేవారో చెప్పే సంఘటన ఇది.....

' మనదేశం ' చిత్రంలో ఎన్టీరామారావు ధరించింది సబ్ ఇనస్పెక్టర్ పాత్ర. నిజానికది చాలా చిన్నపాత్ర.  మంచి స్పురద్రూపంతో వున్న రామారావు నటనలో ఎంతవరకూ పనికోస్తాడో చూడడానికి ఎల్వీ ప్రసాద్ పెట్టిన పరీక్ష ఆ పాత్ర.
షూటింగ్ ప్రారంభమైంది. ప్రసాద్ గారు సన్నివేశం వివరించారు ఎన్టీయార్ కి.
" రామారావ్ ! ఇది కాంగ్రెస్ వాలంటీర్ల మీద లాఠీఛార్జ్ ! నేను యాక్షన్ అంటాను. వెంటనే వాళ్ళని లాఠీలతో ఎదుర్కోవాలి " అన్నారు ప్రసాద్.
" ఓకే సార్ ! " అన్నారు రామారావు.
" యాక్షన్ "  అన్నారు ప్రసాద్.
రామారావు గారు లాఠీతో రంగంలోకి దూకేశారు. వాలంటీర్లను చావబాదేశారు. ఆపమని ప్రసాద్ గారు ఎంత కేకలు పెట్టినా వినిపించుకోనంత ఆవేశంగా ఆ పాత్రలో లీనమైపోయారు. ఏదీ విన్పించుకునే స్థితిలో లేరు. ప్రసాద్ గారు ' కట్ ' చెప్పారు. కెమెరా ఆగిపోయింది. కానీ ఎన్టీయార్ లాఠీ ఆగలేదు. వాలంటీర్ పాత్రధారులని స్టూడియో గేటు దాకా తరిమికొట్టి వచ్చారు.
" ఏమయ్యా ! రామారావ్ ! ఇది సినిమా. నువ్వు వాళ్ళను దుమ్ము విరిగేలా చావబాదావు. నేను ఆగమని కేకలేస్తున్నా విన్పించుకోలేదు. వాట్ ఇస్ థిస్ ? " అన్నారు ప్రసాద్ .
" పోలీసు వాళ్ళు ఇలాగే లాఠీ ఛార్జ్ చేస్తారండీ ! నేచురల్ గా వుండాలని అలా చేసాను, తప్పా ? " అనడిగారు రామారావు.
" వెళ్లి వాళ్ళందర్నీ పిల్చుకురా ! మళ్ళీ షాట్ తీద్దాం ! " అన్నారు ప్రసాద్ గారు ప్రొడక్షన్ మేనేజర్ తో. అతను నీళ్ళు నమిలాడు. నెమ్మదిగా చెప్పాడు.
" అక్కడ ఎవరూ లేరు సార్ ! కొంతమంది ఇళ్ళకీ, మరికొంతమంది ఆస్పత్రికీ వెళ్ళిపోయారు " అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్.
ఆ దెబ్బలు తిన్న వారిలో తర్వాత దర్శకుడిగా ప్రముఖుడైన తాతినేని ప్రకాశరావు కూడా వున్నారు.

Vol. No. 01 Pub. No. 334

Tuesday, June 29, 2010

చిత్రసీమలో సాహితీ ప్రముఖులు - జవాబులు

  కనుక్కోండి చూద్దాం - 20 



 స్పందించిన వారందరికీ ధన్యవాదాలు.
జవాబులు :

ఈ క్రింది రచయితలు కొన్ని చిత్రాలకు సంభాషణలు రాసారు. ఎవరు, ఏ చిత్రాలకు రాసారో చెప్పగలరా ?


1 .  గుర్రం జాషువా             - రాధాకృష్ణ ( 1939 )
2 . వేలూరి శివరామశాస్త్రి      - జరాసంధ ( 1938 )
3 . గుడిపాటి వెంకటచలం     - మాలపిల్ల  ( 1938 )




ప్రముఖ కవి, రచయిత కవికోకిల బిరుదాంకితులు దువ్వూరి రామిరెడ్డి గారు
ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రమేది ?        
- చిత్రనళీయం ( 1938 )
ఆయనే కొన్ని చిత్రాలకు కథాకథనాలను అందించారు. ఆ చిత్రాలేవి ?
- సతీతులసి ( 1936 ), చిత్రనళీయం ( 1938 ) , బాలాజీ ( 1939 ), పార్వతి ( 1941 )

 Vol. No. 01 Pub. No. 333

Saturday, June 26, 2010

చిత్రసీమలో సాహితీ ప్రముఖులు

  కనుక్కోండి చూద్దాం - 20  

 తెలుగు చలన చిత్రసీమ కొందరు సాహితీ ప్రముఖులనూ ఆకర్షించింది.
ఈ క్రింది రచయితలు కొన్ని చిత్రాలకు సంభాషణలు రాసారు. ఎవరు, ఏ చిత్రాలకు రాసారో చెప్పగలరా ?

1 .  గుర్రం జాషువా
2 . వేలూరి శివరామశాస్త్రి
3 . గుడిపాటి వెంకటచలం



* ప్రముఖ కవి, రచయిత కవికోకిల బిరుదాంకితులు దువ్వూరి రామిరెడ్డి గారు
ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రమేది ?
ఆయనే కొన్ని చిత్రాలకు కథాకథనాలను అందించారు. ఆ చిత్రాలేవి ?



Vol. No. 01 Pub. No. 332

Friday, June 25, 2010

కుంచె 'కూచి' విలాసం

మూస కార్యక్రమాలు. మూస సీరియల్స్, జుగుప్స కలిగించే నృత్య కార్యక్రమాలు, గోరంతను కొండంత చేసే అభూతకల్పనల వార్తాకథనాలు  ... వెరసి  ప్రస్తుతం టీవీ చూడాలంటేనే భయమేసే పరిస్థితి. టామ్ రేటింగుల కోసం రకరకాల విన్యాసాలు, చర్చల్లో- కోర్టుల్లో వాటిని సమర్థించుకోవడాలు, బ్లాక్ మెయిలింగ్ వార్తలు .... ఒక  రకంగా టీవీ సామాన్య ప్రేక్షకుణ్ణి దూరం చేసుకుంటున్న పరిస్థితి. ఆప్పుడు ఏ రేటింగులు ఆదుకుంటాయో మరి. అయినా రేపటి సంగతి మనకేల ? నేడు సుఖపడు మనసారా ! అనే ఫిలాసఫీని వంటబట్టించుకున్నాయి చానెల్స్.

శాస్త్రీయ సంగీతమంటే టీవీ చానళ్ళకు అంటరానిదైపోయిన కాలంలో ధైర్యం చేసి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ' నాదవినోదం ' ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది ' మా టీవీ ' . ఎందరో వర్థమాన కళాకారులకు వేదికనిస్తూ, లబ్దప్రతిష్టులైన కళాకారుల సంగీత విన్యాసాలను కూడా అందిస్తోంది. మన సంస్కృతి లోని కళల వైశిష్ట్యాన్ని ప్రపంచమంతటా చాటుతున్న 'మా టీవీ'  కి జేజేలు. అసలు ఈ ధైర్యం చెయ్యడమే గొప్ప.  సాంప్రదాయానికి కూడా కమర్షియల్ సొగసులు అద్దింది. దేన్నైనా కమర్షియలైజ్ చెయ్యడానికి సాంప్రదాయాన్ని కించపరచనక్కర్లేదని నిరూపించింది. అర్థం పర్థం లేని సంగీతం, నృత్యం పదే పదే ప్రసారం చేస్తూ ప్రేక్షకుల చెవుల్లో తుప్పునీ, కళ్ళల్లో కారాన్నీ నింపుతున్న టీవీ చానళ్ళను సవాల్ చేస్తూ మన చెవులు, కళ్ళూ ఆరోగ్యంగా వుండేటట్లు చేసే కార్యక్రమం చేపట్టినందుకు అభినందించాల్సిందే !

'నాదవినోదం' మహోత్సవం పేరిట ప్రసారం చేస్తున్న ఎపిసోడ్లలో ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీసింది ' మా టీవీ ' . వేదిక మీద సంగీత కళాకారుల విన్యాసం సాగుతుండగా వారి పాట / కీర్తన / కంపోజిషన్ కు అనుగుణంగా అప్పటికప్పుడు ఆ వేదిక మీదే ఒక చిత్రకారుడు తైలవర్ణ చిత్రాన్ని రచించడమనే కొత్త ప్రక్రియకు శ్రీకారం పలికింది ' మా టీవీ '.  నిన్న ( జూన్ 24 వ తేదీన ) జరిగిన ఎపిసోడ్ లో  మాండలిన్ పై వాయించిన ' మహా గణపతిం ' కీర్తనకు గణపతి పెయింటింగ్, ప్రముఖ మృదంగ విద్వాంసులు యెల్లా వెంకటేశ్వర రావు గారు అద్భుతంగా స్వరపరచిన ప్రాక్పశ్చిమ వాయిద్య విన్యాసానికి, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తన బృందంతో ఆలపించిన రెండు పాశ్చాత్య గీతాలకు అనుగుణంగా ఆయా పాటలు  /  కంపోజిషన్ లు పూర్తయ్యే లోపు పెయింటింగ్ వేయడం జరిగింది.

ఈ రోజు ( జూన్ 25 వ తేదీన ) సాయింత్రం గం. 07-00 లకు ( భారత కాలమానం ప్రకారం )  ప్రసారం కానున్న 'నాదవినోదం ' ఎపిసోడ్ లో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ ను మీరందరూ తిలకించి మీ అభిప్రాయాలను తెలియపరిస్తే ఆరోగ్య కరమైన కార్యక్రమాలు మన ఇళ్ళల్లో చూడడానికి ప్రోత్సహించినట్లవుతుంది.

ఈ కార్యక్రమంలో వేదికపైన సంగీత విన్యాసంతో బాటు అప్పటికప్పుడు తన కుంచె విలాసాన్ని ప్రదర్శించిన చిత్రకారుడు కూచి సాయిశంకర్. ఈ వైభవాన్ని మీరూ తిలకించండి.

ఈ రోజు సాయింత్రం గం.07-00 లకు ' మా టీవీ ' లో .........


 Vol. No. 01 Pub. No. 331

Thursday, June 24, 2010

' బడ్జెట్ ' చక్రపాణి

గౌతమీ పిక్చర్స్ బ్యానర్ మీద యన్. రామబ్రహ్మం 1970 లో విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీయార్, జయలలిత నాయికా నాయకులుగా  ' ఆలీబాబా 40 దొంగలు ' చిత్రం నిర్మించారు.  పాత్రలు, గుర్రాలు, సెట్టింగ్లు, చేజింగ్ సన్నివేశాలు వగైరా దండిగా వున్న చిత్రం. దాంతో బడ్జెట్ బాగానే పెరిగింది. రామబ్రహ్మం గారికి ఏం చెయ్యాలో తోచలేదు. సలహాకోసం సీనియర్ నిర్మాత, ' విజయా ' ద్వయంలో ఒకరైన చక్రపాణి గారి దగ్గరకు వెళ్ళారు. 



" భారీ తారాగణం. బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువయ్యేలాగా వుంది. ఏం చెయ్యాలో తెలియడంలేదు " అని తన బాధ చెప్పుకున్నారు. దానికి చక్రపాణి గారు తన సహజదోరణిలో....


" పోనీ, ఆలీబాబా నలుగురు దొంగలు అని తీస్తే పోలా ? " అని చమత్కరించారు.



Vol. No. 01 Pub. No. 330

Wednesday, June 23, 2010

జైలు, ఇల్లు.... ఏదైతేనేం !!

 తల్లావఝుల శివశంకర శాస్త్రి గారు పండితులు, కవి. అంతేకాదు ఆయన దేశభక్తులు కూడా ! స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో అనేక సార్లు జైలుకి కూడా వెళ్లి వచ్చారు.


ప్రముఖ రచయిత మునిమాణిక్యం నరసింహారావుగారికి శివశంకర శాస్త్రిగారంటే గౌరవం, అభిమానం.



ఒకసారి ఆయన శాస్త్రిగారిని బందరు వచ్చి తన ఇంట వారం రోజులైనా వుండాలని కోరారు. తల్లావఝుల వారు తనకు వీలు పడదన్నారు. అయినా మునిమాణిక్యం గారు విడిచిపెట్టలేదు. ఏమైనా తనకోసం నాలుగురోజులైనా కేటాయించాలని పట్టుబట్టారు.

దానికి శివశంకర శాస్త్రిగారు " నేనేట్లాగూ జైలుకి వెడుతూనే వున్నాగా ! ఇప్పుడు బందరు రాకపోతేయేమి ? " అన్నారట.

Vol. No. 01 Pub. No. 329

Tuesday, June 22, 2010

నిజమైన అక్షరాస్యతా ఉద్యమం

http://www.kidsone.in/telugu/images/alphabet-learning/letters.pngఅన్ని రంగాల్లో అభివృద్ధి సాదిస్తున్నామనుకున్నా మన దేశం అక్షరాస్యత విషయంలో ఇంకా వెనుకబడే వుంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరనుంచి ఎన్నో రకాల పథకాలు మన ప్రభుత్వాలు రూపొందించాయి. కొంత కాలం క్రితం వరకూ  ప్రజల నుంచి కూడా ఈ విషయంలో స్పందన బాగానే ఉండేది. ఇన్ని పథకాలు అమలులోవున్నా, ప్రజల భాగస్వామ్యం వున్నా స్వాతంత్ర్యం వచ్చిన 63 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అక్షరాస్యత పూర్తి స్థాయిలో లేకపోవడం శోచనీయం.  దీనికి కారణం పథకాల అమలులో ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి లోపించడం. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం ప్రజల ఉదాశీనతకు కారణమై ఉండవచ్చు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశకంలో గాంధీజీ బోధనల ప్రభావం ఎక్కువగా వున్న రోజుల్లో ఇదొక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. గాంధీజీ ఎంతమందినో ఈ ఉద్యమంలో భాగస్వాముల్ని చేశారు. ముఖ్యంగా విదేశీయులెందరో ఈ ఉద్యమాన్ని చేపట్టి మన దేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలామందిని అక్షరాస్యుల్ని చేశారు. దీనికో ఉదాహరణ........

1952 ప్రాంతంలో వెల్త్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ తన భర్త మరణం తర్వాత మన దేశానికి వచ్చింది. అంతకుముందు ఏదో సందర్భంలో గాంధీజీ ఆవిడ సేవా దృక్పథాన్ని గమనించి ఆమెతో  " మీరు గనుక భారత దేశానికి వస్తే పల్లెల్లో మీ సేవా కార్యక్రమాలు కొనసాగించవచ్చు "  అన్నారు. ఆ స్పూర్తితో ఆమె 73 సంవత్సరాల వయసులో మన దేశానికి వచ్చింది. ఆ వయసులో అలహాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో 43 మంది విద్యార్థులతో కలిసి సైకిల్ మీద గ్రామాలకు వెళ్ళేది. తమతో కూడా చిన్న చిన్న పెట్టెల్లో కొన్ని పుస్తకాలు, పలకలు, బలపాలు, బ్లాకు బోర్డులు, కిరోసిన్ దీపాలు వగైరా తీసుకెళ్ళేవారు. గ్రామాల్లోని ప్రజలకు విద్య యొక్క ఆవశ్యకతను బోధించేవారు. వాళ్లకు ఇదేమీ అర్థం కాక ఆమెను అనుమానంగా చూసేవారు. హిందీలో మాట్లాడి వాళ్ళలో తనపైన నమ్మకాన్ని పెంచి ఆకట్టుకునేది. వారు ప్రధానంగా 14 నుండి 40 సంవత్సరాల వయసు వారికి విద్యాబోధన చేసేవారు. తమ పేరు తాము రాసుకోవడం ఆ నిరక్షరాస్యులను ఫిషర్ బోధనల పట్ల ఆకర్షితులను చేసేది. ఫలితంగా అనేకమంది విద్యావంతులుగా మారారు. ఒక జీపులో గ్రంధాలయాన్ని ఏర్పాటు చేసి కొంతమంది ఔత్సాహికులైన ఉపాధ్యాయులతో కలసి వారానికి సుమారు 150 గ్రామాల్లో తిరుగుతూ సుమారు 15 సంవత్సరాలు  అక్షరాస్యతా ఉద్యమం కొనసాగించింది.  ప్రపంచంలో అంత లేటు వయసులో అక్షరాస్యతా ఉద్యమాన్ని చేపట్టిన తొలి మహిళ వెల్త్ ఫిషర్ అని చెప్పుకోవచ్చేమో !

సంకల్పం వుంటే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపించిన వ్యక్తి ఫిషర్. దురదృష్టవశాతూ దేశవ్యాప్తంగా ఈ విషయానికి విస్తృతంగా ప్రచారం జరుగలేదు. జరిగుంటే ఆమె పేరు కూడా ప్రముఖ వ్యక్తుల జాబితాలో చోటు చేసుకునేదేమో ! ఆమె కార్యక్రమాలనుంచి కొంతమందైనా స్పూర్తి పొందేవారేమో ! ! 


Vol. No. 01   Pub. No. 328

Monday, June 21, 2010

సంగీత విద్వాంసులెవరు ? - జవాబు

   కనుక్కోండి చూద్దాం - 19  
 సంగీత విద్వాంసులెవరు ? - జవాబు 

 ఈ ప్రశ్నకు జవాబిచ్చిన వారిలో ........

* KK గారు, జయ గారు, అజ్ఞాత గారు కొంతవరకూ సరైన జవాబులిచ్చారు.

* శ్రీనివాస్ పరుచూరి గారు, మాధురి గారు సరైన సమాదానాలిచ్చినా మాధురి గారు కొంచెం ఆలస్యమయ్యారు. అయితే రంజని గారన్నట్లు తెలుగు పాటల నిధి సేకరణలో భాగస్వాములైన శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత మిగిలిన వాళ్లకు ఆలోచించే అవకాశముండదు. ఎందుకంటే ఆయన దగ్గర పెద్ద data bank వుంది. మిగిలిన మిత్రులు జవాబుల కోసం Old Telugu Songs ను కూడా పరిశీలించే అవకాశముంది. శ్రీనివాస్ గారు ఈ విషయం గమనిస్తారనుకుంటాను.

............ అందరికీ ధన్యవాదాలు.


ఇక జవాబులు -



1 .  పవిత్రహృదయాలు ( 1971 ) - ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చినసత్యనారాయణ గార్లు. 



2. బికారి రాముడు ( 1961 ) -  ఆకాశవాణి ద్వారా శాస్త్రీయ, లలిత సంగీత గాయనిగా చిరపరిచుతులైన శ్రీరంగం గోపాలరత్నం గారు

3. సతీ సావిత్రి ( 1957 ) - మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్. వరలక్ష్మి గార్లు
ఈ పాట మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన తొలి సినిమా పాట. ఆయనే స్వరకర్త కూడా ( ఎస్. రాజేశ్వరరావు కూడా ఈ చిత్రానికి సంగీతమందించారు )



ఈ చిత్రంలో పువ్వుల సూరిబాబు గారు మధురంగా గానం చేసిన అన్నమాచార్య కీర్తన వినండి.



Vol. No. 01 Pub. No. 327

Sunday, June 20, 2010

పితృదేవోభవ....


 నాన్న- జననంలో భాగస్వామి
నాన్న - ఎదుగుదలకు మార్గదర్శి  
నాన్న - జ్ఞానార్జనకు ఆలంబన
నాన్న - జీవితాన్ని తీర్చిదిద్దే త్యాగశీలి




అందుకే ......

ఓ నాన్నా !...... నీ మనసే వెన్నా !.....
అమృతం కన్నా ఆది ఎంతో మిన్నా !
...............
ముళ్ళ బాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు దాచి వుంచావు

*************************************************



పితృ దినోత్సవ సందర్భంగా తండ్రులందరికీ శుభాకాంక్షలతో .............

Vol. No. 01 Pub. No. 326

Friday, June 18, 2010

సంగీత విద్వాంసులెవరు ?

  కనుక్కోండి చూద్దాం - 19  

 ప్రముఖ సంగీత విద్వాంసులు కొందరు తెలుగు చలన చిత్రాల్లో పాటలు పాడారు. వారిలో కొందరు పాడిన పాటలు ఈ క్రింద వున్నాయి.

1 .  ఉద్ధండులైన ఇద్దరు సంగీత విద్వాంసులు  పాడిన ఈ పాట విని ఆ గాయకులెవరో, ఏ చిత్రంలోనిదో, వారి చేత పాడించిన సంగీత దర్శకుడెవరో చెప్పగలరా ?



2 . ఈ పాట ప్రముఖ శాస్త్రీయ, లలిత సంగీత గాయని పాడారు. ఆవిడెవరు ? ఏ చిత్రంలోనిది ?



3 .  ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు తొలిసారిగా చిత్రసీమలో పాడిన పాట ఇది. ఆయనతో బాటు మరో ప్రముఖ నటి, గాయని గొంతు కలిపారు. ఆ గాయనీ గాయకులెవరు ? ఆ చిత్రమేది ?



Vol. No. 01 Pub. No. 325

Thursday, June 17, 2010

' నేను ' - మీ కోసం

' నేను ' అనే ఈ లఘు చిత్రం విజువల్ కమ్యూనికేషన్స్ ( బి.ఎస్సీ. ) మొదటి సంవత్సరం పూర్తిచేసి రెండో సంవత్సరంలో అడుగుపెట్టిన మా అబ్బాయి ఉదయ్ తన మిత్ర బృందంతో కలసి నిర్మించాడు. ఆ బృందంలోని అందరి వయసూ దాదాపుగా 18 సంవత్సరాలే ! ఇప్పుడిప్పుడే లోకాన్ని అర్థం చేసుకుంటున్న పిల్లలు వీళ్ళు. వాళ్ళకు పాఠాలు నేర్పిస్తూ ప్రోత్సహిస్తున్న తమ ఫేకల్టీ వి గానీ, సుమారు 25 సంవత్సరాల అనుభవమున్న నావి గానీ సలహాలు, సూచనలు తీసుకోకుండా పూర్తిగా తామే స్వంతంగా నిర్మించిన ఈ చిన్న సినిమా వారికి తొలి అడుగు. అది తప్పటడుగో, తప్పుటడుగో మిత్రులు, పెద్దలు చెప్పాలి. వాళ్ళు చదువుతున్నది విజువల్ కమ్యూనికేషన్స్. సమాజంలోని అనేక కోణాలను, అనేక సమస్యలను అందరికీ అర్థమయ్యే విధంగా దృశ్య రూపంలో అందించాల్సిన బాధ్యత కలిగిన వృత్తులలోకి భవిష్యత్తులో ప్రవేశించాల్సిన వాళ్ళు. మీ అందరి అభిప్రాయాలు, విమర్శలు, సలహాలు, సూచనలు వారి భవితకు సోపానాలు కాగలవనే వుద్దే్శ్యంతో ఈ చిన్ని చిత్రాన్ని మీ అందరి ముందు పెడుతున్నాను. అందుకే ఈ చిత్రం చూసాక ఉదాసీనంగా వెళ్ళిపోక మీకు కనిపించిన లోపాలు, మెరుగు పరచుకోవడానికి మీరిచ్చే సూచనలు మిత్రులందరూ దయచేసి నిర్మొహమాటంగా తెలియజేస్తారని ఆశిస్తూ.... అవే వాళ్ళకు దీవెనలు కావాలని కోరుకుంటూ...........మీకోసం... మీ ఆశీస్సులకోసం.....   
       
  నేను  
























Vol. No. 01 Pub. No. 324

Wednesday, June 16, 2010

చిరంజీవి ' మల్లాది '


 తెలుగు చిత్ర గీతాలకు సాహితీ పరిమళాలద్దిన రచయిత

తెలుగు సాహితీ లోకంలో కథాసుదలు చిలికన కవితామూర్తి

తెలుగు పలుకుబడులను రచనలలో పొదిగిన మల్లాది రామకృష్ణశాస్త్రి

తెలుగు సాహితీ లోకంలో ఆయనెప్పుడూ చిరంజీవి 




రామకృష్ణశాస్త్రిగారు సముద్రుడికన్నా గొప్పవాడు. తనలో ఎన్నో నిధి నిక్షేపాలున్నా గొప్పవాడినంటూ సముద్రుడిలా ఘోష పెట్టడు. రామకృష్ణశాస్త్రిగారు అగస్త్యుడికన్నా గొప్పవాడు. అగస్త్యుడు సాగరాలను పుక్కిట పట్టి వదిలి పెట్టేశాడు. శాస్త్రిగారు భాషా సముద్రాలను తనలోనే నిలబెట్టుకున్నారు.

............. మల్లాది వారి గురించి ఆరుద్రగారి మాటలవి.

ప్రౌఢ వాక్యాల తెరల మరగున దోబూచులాడీ.....ముగ్ధభావాలతో.......
వన్నెలాడిలా...కన్నేలేడిలా...వయ్యారాలు పోయే తేనె మాటల...
తెలుగు మాటల...రంగుల హోరంగులతో తెలుగువాడి జీవిత
జూమూతాన్ని ఒత్తిగించి....తెల్లని...చక్కని...చిక్కని...
కథాశరశ్చంద్రికలు వెలయించి... పడుచు గుండెలు గుబగుబలాడించి
మనసుకందని అందాలను భాషకు దించి, భాషలో...కైతలో....
బయోస్కోపు స్కోపులో అచ్చరలచ్చల పచ్చ చమత్కారాలు పండించుకుంటూ
అలనాటి పాండురంగ విభుని పదగుంభనలా పాండిబజారు దర్బారులో 
నిలిచి... ఎవరన్నా ! మహానుభావకులు ?
ఓహో ! వచన రచనకు మేస్త్రి 
సాహో ! రామకృష్ణ శాస్త్రి


..................మల్లాది వారి రచనా వైభవాన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు వర్ణించిన విధమది.

మల్లాది రామకృష్ణశాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయన రచనా వైదుష్యానికి మచ్చు తునకలనదగ్గ పాటలు చూడండి.......






Vol. No. 01 Pub. No.323

Tuesday, June 15, 2010

మహాకవికి స్వర నీరాజనం



తెలుగు సోదరా
గెలుపు నీదిరా !
చూడరా చూడరా తెలుగు సోదరా
నీ చుట్టూరా సాగుతున్న నాటకాలు చూడరా !

................ అంటూ హెచ్చరించినా



ముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా.... చావండి !
నెత్తురు నిండే శక్తులు మండే సైనికులారా....... రారండి !
మరో ప్రపంచం మరోప్రపంచం పిలిచింది
పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి

....................అంటూ ప్రభోదించినా

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వసృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విప్పి అరిచాను
నేను సైతం విప్లవాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను

................. అంటూ త్యాగాన్ని వివరించినా

పాడవోయి భారతీయుడా !
ఆడి పాడవోయి విజయ గీతికా !
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరబాటు

...................అంటూ కర్తవ్య బోధ చేసినా

ప్రళయ భయంకర రూపం దాల్చే సీతారామరాజు
పాశుపతాస్త్ర శాపం దాల్చే సీతారామరాజు
మధ్యందిన మార్తాండునివోలె బయిలుదేరినాడు

..................అంటూ అల్లూరి సీతారామరాజు ప్రతాపాన్ని వర్ణించినా


తెలుగువారు నవజీవన నిర్మాతలని
తెలుగుజాతి సకలావనికే జ్యోతి అని
కలసి పాడుదాం తెలుగు పాట

.................. అంటూ తెలుగు జాతి వైభవాన్ని ఎలుగెత్తి చాటినా

ఏనాటికైనా స్వార్థము నశించి తీరును
ఏరోజుకైన సత్యమే జయించి తీరును
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకు గొంకు లేక ముందు సాగి పోమ్మురా

................. అంటూ ధైర్యం చెప్పినా

ఒకటే జాతి ఒకటే నీతి చీలికలేందుకు మనలో
ఒకటే ధ్యేయం ఒకటే శపథం తప్పదు సమరావనిలో
రండీ కదలిరండీ ! రండీ కలసి రండీ !

............... అంటూ సమైక్యతా నినాదం వినిపించినా

అర్థరాత్రి స్వతంత్ర్యం అంధకార బంధురం
అంగాంగం దోపిడైన కన్నతల్లి జీవితం
ఇదే ఇదే నేటి భారతం భరతమాత జీవితం

................. అంటూ భారతమాత దుస్థితిని మన కళ్ళ ముందుంచినా


మారలేదులే ఈ కాలం మారలేదులే ఈ లోకం
దీనులకు హీనులకు తీరలేదులే ఈ శోకం

................ అంటూ దళితుల పరిస్థితిని వివరించినా


పచ్చ పచ్చని బతుకు బంజరై మిగిలింది
దేశమంతా ఈనాడు శోకమే మిగిలింది
ఎన్నాళ్ళూ ఎన్నేళ్ళూ ఈ పాట్లు పడతావూ
ఇకనైనా మేలుకో నీరాజ్యం ఏలుకో

................ అంటూ దారి చూపినా

కండలు కరిగిస్తే పండని చేను ఉంటుందా ?
ముందుకు అడుగేస్తే అందని గమ్యం ఉంటుందా ?

........................అంటూ జీవిత సత్యాన్ని ఆవిష్కరించినా

కళలన్నా కవితలన్నా వీళ్ళకి చుక్కెదురు
కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు
కొంతమంది యువకులు ముందు యుగం దూతలు

............... అంటూ బాద్యత మరచిన యువతరాన్ని హెచ్చరించినా

ఆది మహాకవి శ్రీశ్రీ కే చెల్లు. అన్యాయాన్ని, అక్రమాన్నీ నిర్భయంగా నిలదీయగల సత్తా ఆయనది.

ఆ మహాకవి వర్థంతి సందర్భంగా శిరాకదంబం స్వర నీరాజనం.......................




Vol. No. 01 Pub. No.322

Monday, June 14, 2010

హర హర మహాదేవ



శ్రీ రహమతుల్లా గారు ' శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ' చిత్రంలోని పాటను జ్ఞప్తికి తెస్తే నా దగ్గరున్న ఆ పాటను అందించాను. సూరిబాబు గారి గాత్రం మీద మక్కువతో ఒక అభిమాని తన వ్యాఖ్యలో ( ' అజ్ఞాత ' పేరుతో రాసారు. వారు తమ పేరు తెలియజేస్తే ఇక్కడ ప్రచురించగలను )  ' దక్ష యజ్ఞం ' లోని ' హర హర మహాదేవ ' పాట లింక్ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ మంచి పాట, గాత్రం, అభినయం అందరి కోసం........

 ఈ పాటతో బాటు ' దక్ష యజ్ఞం ' చిత్రంలోనివే సూరిబాబు, రఘురామయ్య, మాధవపెద్ది పాడిన పద్యాలు కూడా చూడండి.






Vol. No. 01 Pub. No.321

కళ్ళు తెరువరా నరుడా !

 పువ్వుల సూరిబాబు గారు ప్రముఖ రంగస్థల నటుడు. సూరిబాబు అనేక పౌరాణిక నాటకాల్లో నటించారు. అంతేకాక మాలపిల్ల (1938), రైతు బిడ్డ (1939), తారా శశాంకం (1941),  శ్రీకృష్ణ తులాభారం (1955), సతీ సావిత్రి (1957), కృష్ణ లీలలు (1959), శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం (1960), దక్షయజ్ఞం (1962) వంటి కొన్ని చిత్రాల్లో నటించడమే కాక కొన్ని చిత్రాల్లో పాటలు కూడా పాడారు.

ఆయనది ఒక విలక్షణమైన స్వరం. ఆయన పద్యం పాడితే కంచు మ్రోగినట్లుగా మైక్ లేకపోయినా చాలా దూరానికి స్పష్టంగా వినిపించేది. పి. పుల్లయ్య దర్శక నిర్మాణంలో 1960 లో వచ్చిన ' శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ' చిత్రంలో ఆయన పాడిన పాటను తెలుగు భాషోద్యమానికి కృషి చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎన్. రహమతుల్లా గారు తమ వ్యాఖ్యలో గుర్తుచేశారు...............

Nrahamthulla said... 
రావు గారూ
కొత్త విషయాలు తెలియజేస్తున్నారు.చాలా సంతోషం.నేను చిన్నప్పుడు ఎన్టీఆర్ నటించిన "వేంకటేశ్వర మహత్యం" సినిమా చూశాను.అందులో నారదుడిగా నటించిన పి.సూరిబాబు వెంకటేశ్వరుని విగ్రహం ముందు నిలబడి"కళ్ళుతెరవరా నరుడా" అనే పాట అద్భుతంగా పాడుతాడు.ఆ పాట దొరుకుతుందేమో అని చాలా చోట్ల ప్రయత్నించాను.సినిమాలో పాటలు ఎక్కువయ్యాయని ఈ పాటను తీసేశారని కొందరు చెప్పారు.విఏకే రంగారావు గారి దగ్గరకూడా ఈ పాట లేదు.ఇలాంటి పాటలను ఎక్కడో ఒకచోట భద్రపరచాలిగానీ పూర్తిగా తీసెయ్యటం వలన అమూల్యమైన తెలుగు సినీ సాహిత్యం,సంగీతం ఎవరికీ దొరకకుండా పోతోందని నా బాధ. 


.............. ఇదీ రహమతుల్లా గారి వ్యాఖ్య. కొంతకాలం క్రితం వరకూ ఈ పాట ఆకాశవాణిలో తరచుగా వినిపించేది. నా దగ్గరున్న ఆ పాట ఆయన కోసం, అందరి కోసం...........



Vol. No. 01 Pub. No.320

Sunday, June 13, 2010

పాట పాడిన నిర్మాత, నటుడు - జవాబు

  కనుక్కోండి చూద్దాం - 18 
 జవాబు 

 ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చిన ముగ్గురికీ ( శ్రీరాం గారు, కె.కె. గారు, అజ్ఞాత గారు ) , ప్రయత్నించిన మాదురిగారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే face book ద్వారా
"sterday question answer entandi?
m.s rama rao gaara?"
అంటూ జవాబు ఇచ్చిన సంతోష్ దోసపాటి గారికి కూడా ధన్యవాదాలు.

ఇక జవాబు విషయానికి వస్తే........
* శ్రీరాం గారూ ! - రామానాయుడు గారు తమ స్వంత చిత్రాల్లో ఎక్కువగా అతిథి పాత్రలు ధరించారు. కానీ పాటలేమీ పాడలేదు.
* కె. కె. గారూ ! - బి. ఏ. సుబ్బారావు గారు కూడా పాటలు పాడలేదండి.
* సంతోష్ గారూ ! - ఎం.ఎస్. రామారావు గారు గాయకుడే గానీ నిర్మాత - నటుడు కాదండి. 
* అజ్ఞాత గారూ ! - ముందుగా మీ పేరు కూడా రాసి వుంటే బాగుండేది. మీరు చెప్పిన సమాధానం సరైనదే ! ఆ నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య గారే !



పుండరీకాక్షయ్య గారు మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, ఆరాధన ( NTR ) వంటి చిత్రాలు నిర్మించారు. పల్లెటూరు చిత్రంతో ప్రారంభించి కొన్ని చిత్రాలలో వేషాలు వేసినా, 1991 లో వచ్చిన కర్తవ్యం లో ముద్దుకృష్ణయ్య పాత్రతో విలన్ గా, కారెక్టర్ నటునిగా పేరు తెచ్చుకున్నారు.  





Vol. No. 01 Pub. No.319

Saturday, June 12, 2010

'ఆటా'డిస్తా !

ఈ రోజు రియాల్టీ షోల మీద మానవ హక్కుల కమిషన్ తీర్పు వచ్చింది. సహజంగానే విస్తృతంగా, వాడిగా, వేడిగా చర్చలు జరుగుతున్నాయి. ప్రజా సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తుంటే, ఆ షోలలో పాల్గొనే పిల్లల తల్లితండ్రులు, పిల్లలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాదు చేయిస్తున్నారు. దీనికి కూడా తెరవెనుక దర్శకత్వం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికంతటికీ వీళ్ళందర్నీ 'ఆటా' డిస్తున్నది ' డబ్బే ' ! ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం.

ఈ రోజు ఒక ఛానల్లో జరుగుతున్న చర్చల్లో  పెద్దలతో వాదిస్తున్న ఒక బాలుడి వాదన వెనుక స్క్రిప్ట్, దర్శకత్వం ఎవరివో తెలుసుకోలేనంత అజ్ఞానంలో ప్రేక్షకులు లేరనుకుంటాను. కాకపోతే అందరిలోనూ సహజంగానే ఉండే ఉదాసీనత వలన కావలసినంత నిరసన రావడంలేదు. సరైన నిరసన వస్తే ఇలాంటి ' ఆట ' లు సాగవేమో ! ఇప్పుడు ఈ తీర్పు వచ్చాకా మనందరం కాసేపు ఆవేశపడిపోతున్నాం ! తర్వాత మన పనుల్లో మనం మునిగిపోతాం ! వాళ్లకి చట్టంలోనూ, న్యాయ వ్యవస్థలలోను, రాజ్యాంగంలోను వున్న లొసుగులు తెలుసు. లేదా తెలుసుకుంటారు. లొసుగులు లేకపోతే ఉన్నవాటికి వారికి అనుకూలమైన అర్థాలు అన్వయిస్తారు. పై కోర్ట్ లకి వెడతారు. లేదా డబ్బుతో బాధితుల్ని తమకి అనుకూలంగా తిప్పుకుంటారు.

దీనికి నిదర్శనం ఈ రోజు ఛానల్లో వాదించిన కుర్రవాడు నిర్వాహకుల్ని సమర్థించిన తీరు , మరో ఛానల్లో ఒక తల్లి వాదనలు వింటే అర్థమవుతోంది. డబ్బు కోసం మేం పిల్లల్ని హింసించడం లేదని వాదిస్తున్న ఆ తల్లికి, మిగిలిన తల్లిదండ్రులకి నాకు తెలిసిన విషయం ఒకటి చెబుతాను. రెండు సంవత్సరాల క్రితం ఆ కుర్రవాడి  పరిస్థితి విజయవాడలో చాలామందికి తెలుసు. అప్పట్లో ఆ కుర్రవాడిని వెంటబెట్టుకుని అతని తల్లి నగరంలోని పెద్దల దగ్గరికి, సంస్థల కార్యాలయాలకి ప్రతినెలా మొదటి వారంలో ఎక్కే గుమ్మంగా, దిగే గుమ్మంగా తిరగడం నాకు బాగా తెలుసు. ఆ కుర్రవాడిలో టాలెంట్ నచ్చి , అతని భవిష్యత్తుకు ఆర్ధిక ఇబ్బందులు ఆటకం కాకూడదని కొందరు ప్రతినెలా ఇచ్చే డబ్బుకోసమే అలా తిరిగేవారు. ఇలా ఇంకా ఎంతోమంది ఈ స్థాయి పిల్లల తల్లిదండ్రులు ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. సొంత పిల్లలనే బలిచేస్తున్నారు.

ఈ షోల పుణ్యమాని పిల్లలు అంగడి సరుకులై పోయారు. తల్లిదండ్రులు వారిని అమ్ముకుంటున్నారు. నిర్వాహకులు కొనుక్కుని తమకు కోట్లు సంపాదించి పెట్టే సరుకుగా తయారుచేసి  ప్రేక్షకుల మీద వదులుతున్నారు. డబ్బు కోసం పిల్లల్ని ఇలా తయారు చెయ్యడం కొంతమంది చేస్తుంటే, మరో రకం తమ పిల్లలు తెర మీద కనబడాలని, ఉన్నతమైన స్థానంలో చూడాలనే పిచ్చితో ఎదురు పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏ రకమైన తల్లిదండ్రులైనా నలిగిపోతున్నది మాత్రం పిల్లలే !


ఒక ప్రక్క  తీర్పు వచ్చింది. మరోప్రక్క వేడిగా చర్చ జరుగుతోంది. ఆ సమయంలోనే మరో ఛానల్ అలాంటి కార్యక్రమమే  ప్రసారం చేస్తోంది. త్వరలోనే నిషేధించిన కార్యక్రమం పాత వేషం తీసేసి  కొత్త రూపంతో, కొత్త పేరుతో వస్తుంది. నిరసన తెలియజేసే మానవతావాదుల్ని పరిహసిస్తూ తల్లిదండ్రులందరూ నిర్వాహకుల పక్షమే జేరుతున్నారు. డబ్బెవరికి చేదు ?

ఈ ఫీట్లన్నీ ఎందుకంటే బ్రహ్మ పదార్ధం లాంటి టి. ఆర్. పి. రేటింగుల కోసమే ! అవేమో కొంతమంది జేబులో ఇరుక్కు పోయాయి మరి. తమ జేబులోకి రావాలంటే ఇలాంటి జిమ్మిక్కులు తప్పదు. దానికోసం, ఆది తెచ్చే డబ్బు కోసం  పిల్లల్ని, తల్లిదండ్రుల్నీ, ప్రేక్షకుల్నీ, నిరసనకారుల్నీ ఇలాంటి  కార్యక్రమాల నిర్వాహకులు 'ఆటా' డిస్తూనే వుంటారు. 



Vol. No. 01 Pub. No.319

రాజకీయాల్లోకి క్రికెట్



గత తరం క్రికెటర్ మొహిందర్ అమరనాథ్  కొంతకాలం క్రితం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని భారతీయ జనతా పార్టీలో చేరారు. భా. జ . పా . లో సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ గారు అమరనాథ్ ని పార్టీ సభ్యులకి పరిచయం చేసే కార్యక్రమం చేపట్టారు. ఆ పరిచయంలో అమరనాథ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి అద్వానీజీ ................




" క్రికెట్ లో రాజకీయాలు పెరిగి పోవడం మూలాన్నో ............ లేక రాజకీయాల్లో క్రీడాస్పూర్తి తగ్గిపోవడం వలనో గానీ బహుశా అమరనాథ్ ఇలా క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకుని వుంటారు "
అని చమత్కరించారు.




Vol. No. 01 Pub. No.318

Friday, June 11, 2010

చైనా ప్రధానిని మెప్పించిన తెలుగు యముడు

తెలుగు పౌరాణిక చిత్రాల చరిత్ర ఘనమైనది. కృష్ణుణ్ణీ, రాముణ్ణీ తలుచుకోగానే మన కళ్ళముందు ఎన్టీయార్ రూపం ప్రత్యక్షమైనట్లు రావణుడు, ధుర్యోధనుడు, యమధర్మరాజు లాంటి పాత్రలకు ఎస్వీరంగారావు రూపం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అసలు వాళ్ళు ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసారేమోననిపిస్తుంది.

1957 లో కడారు నాగభూషణం దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు సత్యవంతునిగా, ఎస్. వరలక్ష్మి సావిత్రిగా వచ్చిన ' సతీసావిత్రి ' చిత్రంలో యముడిగా ఎస్.వి. రంగారావు నటించారు. ఆ చిత్రం జెమినీ స్టూడియోలో నిర్మించబడింది.



అప్పట్లో చైనా ప్రధానిగా వున్న చౌ-ఎన్-లై  ఆ సమయంలోనే మద్రాసు సందర్శించారు. అందులో భాగంగా ఆయన జెమినీ స్టూడియోకు కూడా వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ' సతీసావిత్రి ' షూటింగ్ జరుగుతోంది. ఎస్. వి. రంగారావు గారు యముడి గెటప్ లో వున్నారు. చౌ-ఎన్-లై కి ఆ ఆహార్యం ఆసక్తి కలిగించింది. వివరాలడిగారు. జెమినీ స్టూడియో అధినేత ఎస్.ఎస్.వాసన్ ఆయనకు ఎస్. వి. రంగారావుని పరిచయం చేస్తూ " ఈయన గ్రేట్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఈయన వేసినది ఆయువు మూడినపుడు మనుష్యుల ప్రాణాలు హరించే దేవుడి వేషం "  అని వివరించారు.

దానికి చౌ-ఎన్-లై ఆశ్చర్యంగా  " మీ దేశంలో ప్రాణాలు తియ్యడానికి కూడా ఓ దేవుడున్నాడా ? " అంటూ ఎస్వీఆర్ కి అభినందనలు తెలుపుతూ " నన్ను మాత్రం కొంతకాలం ఈ భూమ్మీద వుండనివ్వండి " అని నవ్వుతూ చమత్కరించారు.


Vol. No. 01 Pub. No. 317

Thursday, June 10, 2010

పాట పాడిన నిర్మాత - నటుడు

 కనుక్కోండి చూద్దాం - 18 

ఈ పాట ఓ ప్రముఖ నిర్మాత - నటుడు పాడారు.
ఆ నిర్మాత ఎన్టీరామారావు తో కొన్ని హిట్ చిత్రాలు నిర్మించారు. తర్వాత క్యారెక్టర్ నటుడిగా, విలన్ గా కొన్ని చిత్రాల్లో నటించారు.
ఆయనెవరో చెప్పగలరా ? ప్రయత్నించండి.




Vol. No. 01 Pub. No.316

తెలుగు తేజానికి గ్రామీ పురస్కారం


 స్లం డాగ్ మిలియనీర్ చిత్రానికి శబ్ద గ్రాహకుడిగా వ్యవహరించిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ అదృష్ట దీపక్ కి  ప్రతిష్టాత్మక గ్రామీ పురస్కారం లభించింది. ఆయనకు అభినందనలు తెలుపుతూ ....... ఈనాడులో ఆ వార్త లింక్ ...........

 http://www.eenadu.net/story.asp?qry1=7&reccount=25





Vol. No. 01 Pub. No.315

Wednesday, June 9, 2010

భారత చిత్ర ప్రముఖుడు - గెడ్డం వెనుక కథ

 కనుక్కోండి చూద్దాం ! - 17

ఈ ప్రక్క ఫోటోలోని వ్యక్తి భారత చిత్రసీమలో పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి.
ఎవరో గుర్తు పట్టగలరా ?  

జవాబు :
jyothi valaboju - Yesudas kada..May 30

పై ప్రశ్నకు జ్యోతి గారొకరే సరైన సమాధానం చెప్పారు. అసలు సమాధానమిచ్చింది కూడా ఆవిడొకరే !  ఆవిడకు ధన్యవాదాలు. 
ఇది జేసుదాసు గా పిలవబడే జే. యేసుదాసు గారి గెడ్డంతో లేని ఫోటో. ఇప్పుడు మనమంతా చూసే యేసుదాసు గారి గెడ్డం వెనుక కథ ఏమిటంటే ....................

జేసుదాసు గారికి పెళ్ళైన ఏడేళ్లకు ఆయన భార్య గర్భం దాల్చింది. ఆ సమయంలో  దీక్ష పడితే మంచిదని పెద్దలు సలహా ఇచ్చారు. వారి సలహాననుసరించి జేసుదాసు దీక్ష తీసుకుని గెడ్డం పెంచడం ప్రారంభించారు. కొందరు మిత్రులు ఆది చూసి ఆయన ముఖానికి గెడ్డం బాగా అమిరిందని మెచ్చుకున్నారు.  మిత్రులే కాదు భార్య కూడా ఆయన గెడ్డాన్ని మెచ్చుకుంది. దాంతో ఇక ఎప్పటికీ గెడ్డం తియ్యకూడదని జేసుదాసు నిర్ణయించుకున్నారు. అప్పట్నుంచీ మనకు జేసుదాసుకు గుర్తుగా గెడ్డం ఉండిపోయింది. గెడ్డం పెంచకముందు జేసుదాసు ఫోటోగా ఇప్పుడు బాగా గుర్తించగలరనుకుంటాను.

Vol. No. 01 Pub. No. 314

Tuesday, June 8, 2010

యుగంధరుని బారసాల - B & G లో ....

ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత కొమ్మూరి సాంబశివరావు గారి యుగంధరుడి బారసాల వృత్తాంతం B & G  లో చదవండి....ఈ క్రింది లింక్ లో ......
 http://booksandgalfriends.blogspot.com/2010/06/blog-post_08.html








 Vol. No. 01 Pub. No.313

Monday, June 7, 2010

సంగీతమయం సమస్తం



చిత్తూరు వి. నాగయ్య గారి కాలం తెలుగు సినిమా సంగీతానికి స్వర్ణయుగం. ఆయన రేణుకా పిక్చర్స్ కార్యాలయం సంగీత సరస్వతి నిలయం. సంగీత సామ్రాట్టులు, సాహితీ స్రష్టలతో నిత్యం ఆ కార్యాలయం కళకళలాడేది. విద్వద్గోష్టులు జరుగుతుండేవి. ఒకటేమిటి... సమస్తం సంగీతమయంగా వుండేది.



  త్యాగయ్య  చిత్ర నిర్మాణ కాలంలో  ఆ కార్యాలయంలో సంగీత వైభవం మరింతగా వుండేది. అప్పటి ప్రముఖ సంగీత విద్వాంసులందరూ అక్కడే వుండేవారు. కాబట్టి ఆ ప్రాంగణంలో నిత్యం జరిగే మామూలు సంభాషణలు కూడా సంగీతమయంగానే వుండేవి.  వాటినుంచి కొన్ని..........

* ప్రముఖ సంగీత విద్వాంసులు చెంబై వైద్యనాథ భాగవతార్ కూడా ఆ సమయంలో నాగయ్య గారి వద్దకు వచ్చేవారు. ఆయన్ని నాగయ్యగారు ఓసారి " అయ్యా ! మీ వయసెంతో తెలుసుకోవచ్చా ? " అని అడిగారు. దానికి సమాధానంగా ఆయన
" షణ్ముఖ ప్రియ " అన్నారట.
షణ్ముఖ ప్రియ 65 వ మేళకర్త రాగం. అంటే వైద్యనాథ భాగవతార్ గారి జవాబుకి అర్థం ఆయన వయస్సు 65 సంవత్సరాలు అని.

* చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై అని మరో విద్వాంసుణ్ణి " మీ ఇల్లు ఎంత దూరం ? " అని అడిగితే " మా ఇల్లు ఇక్కడికి దగ్గరే ! మాయామాళవగౌళ గజాలకన్నా ఎక్కువ వుండదు " అన్నారట.
మాయామాళవగౌళ 15 వ మేళకర్త రాగం. అంటే ఆయన ఇల్లు 15 గజాలకన్నా ఎక్కువ వుండదు.

* నాగయ్య గారు తమ కార్యాలయానికి ఎవరొచ్చినా కాఫీ పలహారాదులు, భోజనాలు చేసి వెళ్ళే ఏర్పాటు చేసేవారు. ఇందుకోసం కార్యాలయంలోనే మెస్ నడిపేవారు. ఒకసారి ఒక సంగీత విద్వాంసుడు ఆ మెస్ లో ఫలహారం కానిచ్చి " ఇడ్లీకి పక్కవాయిద్యాలు భలే వున్నాయి " అన్నాడట. ఇడ్లీకి పక్కవాయిద్యాలంటే దానితో బాటు ఇచ్చిన సాంబారు, చెట్నీ, కారప్పొడి.
ఆ విద్వాంసుడే కాఫీ త్రాగబోతూ " అరే ! కాఫీ ఇంత వేడిగా వుందేమిటి ? " అన్నాడట. అక్కడే వున్న నాగయ్య గారు " ఏముందీ ! ఆ లోటాలోంచి ఈ లోటాలోకి ఆరోహణ, అవరోహణ చెయ్యండి " అని సంగీత పరిభాషలోనే సలహా ఇచ్చారట.   

................. ఇలా సాగేవి నాగయ్యగారి కొలువులో సంగీత సరస్వతి స్వేచ్చా విహారాలు.



Vol. No. 01 Pub. No.312

Sunday, June 6, 2010

విరాళం పెంచిన వ్యాపారం

బెనారస్ హిందూ యూనివర్సిటీ ( కాశీ విశ్వ విద్యాలయం ) స్థాపకుడు పండిట్ మదనమోహన్ మాలవ్యా. ఆ విశ్వవిద్యాలయ స్థాపనకు ఆయన అవిరళ కృషి చేశారు. అందులో భాగంగా విరాళాల సేకరణ కూడా ఆయనే స్వయంగా చేసేవారు. ఆ పని మీద ఒకసారి ఆయన ఒక బ్యాంకు అధిపతి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు ఆ బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో వుంది. అందువల్ల విరాళమియ్యలేని తన అశక్తతను మాలవ్యా దగ్గర వ్యక్త పరచాడు ఆ బ్యాంకు అధిపతి.

మదనమోహన్ మాలవ్యా కొద్దిసేపు ఆలోచించారు. ఆయనకో ఉపాయం తట్టింది. " ఒక పని చేద్దాం ! మొదట అయిదు లక్షల రూపాయలకు ఒక చెక్కు రాసివ్వండి. దాంతో మీ వ్యాపారం కూడా బాగుపడుతుంది " అన్నారు.

ఆ బ్యాంకు అధిపతికి ఏమీ అర్థం కాలేదు. అసలే నా వ్యాపారం బాగులేదంటే ఈయన అయిదు లక్షలకు చెక్కు ఇమ్మంటారేమిటీ ? అనుకున్నాడు. అదే విషయం మాలవ్యా గారికి చెప్పాడు. ఆయన వెంటనే " అదేం కాదు. ముందు నేను చెప్పినట్లు చెయ్యండి. తర్వాత విషయం నేను చూసుకుంటాను "

మాలవ్యా గారి మీద గురి, గౌరవం వున్న ఆ బ్యాంకు అధిపతి ఇంకేమీ మాట్లాడకుండా అయిదులక్షలకు చెక్కు రాసి ఇచ్చాడు. అంతే ! మర్నాడు వార్తాపత్రికల్లో ఫలానా బ్యాంకు కాశీ విశ్వవిద్యాలయానికి అయిదు లక్షల విరాళం ఇచ్చినట్లు వచ్చింది. దాంతో ప్రజల్లో అప్పటివరకూ ఆ బ్యాంకు మీద వున్న అపోహలు, సందేహాలు అన్నీ తొలగిపోయి మళ్ళీ డిపాజిట్లు ఇవ్వడం ప్రారంభించారు. అలా బ్యాంకు ఆర్ధిక పరిస్థితి గాడిన పడింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి విరాళం దక్కింది.


Vol. No. 01 Pub. No.311

Saturday, June 5, 2010

పంచభూతాలు - ప్రకృతి

పంచభూతాలు ప్రకృతిమాత మనకు ప్రసాదించిన వరాలు
మహాజ్ఞానులమనే అజ్ఞానంతో మనం విర్రవీగితే
మిగిలేది శూన్యమే !

ప్రకృతి మాత వొడిలో మానవుడు ఎప్పుడూ బాలుడే !
ఆది తెలుసుకుంటే ప్రకృతి మనకెప్పుడూ అమ్మ వొడే !
అప్పుడంతా ఆనందమే !

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఓ చిన్న విన్నపం..........

 


Vol. No. 01 Pub. No.310

Friday, June 4, 2010

' బాలు ' నికి వెరైటీ సన్మాన పత్రం

 
 సన్మాన పత్రం    
 ఎలక్ట్రానిక్ వాచ్ ( ఓడిపోయిన మొహంతో ) :  మా బాస్ కి స్పీడెక్కువ. ఆయనతో పరుగెత్తలేక నా కాళ్ళు  ( ముళ్ళు )   నొప్పెడుతున్నాయి. నన్నిక ఎవరికో ఒకరికి ప్రెజెంట్ చేసినా బాగుణ్ణు. కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.

 గిల్లెట్ రేజర్ ( దర్పంగా ) :  ఆయనకి ప్రతిరోజూ షేవింగ్ హడావిడే ! కంఠం దగ్గరకొచ్చేసరికి మాత్రం నేను చాలా ' స్మూత్ ' గా  రన్నవుతాను.

 ఏసీ అంబాసడర్ కారు ( ఉస్సురనుకుంటూ ) : ప్రతిపూటా ఓవర్ లోడింగే ! ఆయన కేంతమంది ఫ్రెండ్స్ ఉంటే మాత్రం అంతా రికార్డింగ్ కి రావలసిందేనా ! ఇద్దరు ముగ్గురు చాలు ప్రాణానికి హాయిగా వుంటుంది. 

 వడపళని, నుంగంబాక్కం రోడ్లు ( సాదరంగా ) : ఎంతమంది మహావ్యక్తులకి మేము రోజూ రాజమార్గాలైనా, బాలూ కారుకి మేమిచ్చేది మాత్రం ఎప్పటికీ రెడ్ కార్పెట్ ట్రీట్ మెంటే !

 మైక్ ( సిన్సియర్ గా ) : ఏకు మేకై కూర్చోడమంటే ఇదే ! సన్నగా, నున్నగా వున్న ' బాలగాత్రం ' గాన గానాభివృద్ధి చెంది ' బోల్డ్ వాయిస్ ' అయిన బాలు గాత్రంగా మారడానికి నేనేగా ప్రత్యక్ష సాక్షిని. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నేనున్నా, లేకున్నా - నాలోంచి విన్నా, విడిగా విన్నా బాలు గొంతు ' నభూతో నభవిష్యతి ' 

 మద్రాస్ రికార్డింగ్ థియేటర్లు ( గ్లూకోస్ డబ్బాలవైపు చూస్తూ ) : మేమే మెషిన్లమయితే మమ్మల్ని మించిన ' సింగింగ్ ' మెషిన్ దొరికాడు మా ప్రాణానికి.

 పాట సాహిత్యం ( బాలానందంగా )  : థాంక్ గాడ్ ! మా పదాలకి మాకే తెలీని కొత్త అందాలు పెట్టగలిగే గాయకుడి గొంతులో పడ్డాం !

 వాయిద్యాలు ( బెరుకుగా ) :  ఇదెక్కడి మిమిక్రీ అండి బాబూ ! తొందరలో మమ్మల్ని రిప్లేస్ చేసేలా వున్నాడే !

 బాల్ ( + ఉ ) పెన్ను ( ధీమాగా ) : మా ఓనర్ గారి చేతిలో పడ్డాక నా ' రాతే ' మారిపోయింది.

పత్రికలు ( గర్వంగా ) : ఈయన పేరు లేకుండా రావుకదా పత్రికలు.

 హిగ్గిన్ బాదమ్స్ బుక్ స్టాల్ ( ముసి ముసి నవ్వులతో ) : కొత్త ఇంగ్లిష్ పుస్తకం రావడం ఆలస్యం. నా రాక్ లో పట్టుమని పదినిముషాలుండనివ్వడు కదా !

 రేడియో ( గంతులేస్తూ ) : ఇక నా పేరు ' బాలిండియా రేడియో ' గా మార్చేస్తారట.

 వీడియో ( దర్పంగా ) : నాకు, బాలు గారికి ఇంతటి అనుబంధం ఏర్పడిపోతుందని కల( ర్ ) లో కూడా అనుకోలేదు. రాత్రి ఒకటైనా, రెండైనా నా దర్శనం చేసుకోందే పడుకోలేడుకదా !

 అకాయ్ డెక్ ( హడావిడిగా ) : సారీ సర్ ! ఐ యాం టు బిజీ. టేప్ టు టేప్ టు టేప్...... !

 చొక్కా కన్నీళ్ళతో ) : కాస్త డైటింగ్ చెయ్యమని చెప్పండి డాక్టరూ ! నా కుట్లు విడిపోతున్నాయి దేవుడో !

 సుమారు రెండు దశాబ్దాల క్రితం బాలుగారికి హైదరాబాదులో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో డా. వై. దివాకరబాబు సమర్పించిన వెరైటీ సన్మాన పత్రం ఇది. 

బాలుగారి జన్మ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలందిస్తూ....... బాలుగారు తెరమీద తొలిసారిగా కనిపించి స్వయంగా పాడిన ' హ్యాపీ బర్త్ డే ' పాట..... ఆయనకోసం, మీకోసం .................



Vol. No. 01 Pub. No. 309

Thursday, June 3, 2010

దొరకునా ఇటువంటి సేవ....ధర్మతేజ

 ' దొరకునా ఇటువంటి సేవ ...'  వేటూరి వారు రాసిన ఆణిముత్యాలలో ఒకటి. ధర్మతేజ వేటూరి వారికి లభించిన ఆణిముత్యంలాంటి అనుయాయి. చదివిన న్యాయశాస్త్రాన్నీ, మెజెస్ట్రేట్ వుద్యోగాన్నీ వదిలి, స్వయంగా రచయితో, సంగీత దర్శకుడో  కాగలిగే సామర్థ్యం వుండి కూడా ఆ సాహితీమూర్తి సేవలో తరించారు ధర్మతేజ.

సుమారు అయిదు సంవత్సరాల క్రితం ధర్మతేజ గారితో వున్న కొద్దిపాటి పరిచయంలోనే ఆయనకు వేటూరిగారితో  వున్న అనుబంధం ఏపాటిదో నాకు అర్థమయింది.  ఆయన  ప్రతి సంభాషణలోనూ వేటూరివారి ప్రసక్తి, ఆయన రచనల ప్రసక్తి రాకుండా ఉండేదికాదు. అంతగా ఆయన జీవితం ఆ సాహితీమూర్తి జీవితంతో పెనవేసుకుపోయింది.

ధర్మతేజగారు వేటూరి గారితో తన అనుబంధాన్ని ఈ రోజు ఆంధ్రజ్యోతి లో వివరించారు.  ఆ లింక్ మీకోసం.........

http://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2010/jun/3/navya/3navya1&more=2010/jun/3/navya/navyamain&date=3/6/2010

Vol. No. 01 Pub. No.308

Wednesday, June 2, 2010

పార్లమెంట్ - విరహ వేదన


 పి.వి. నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పటి రోజులు. ఉపాధ్యక్షరాలిగా శ్రీమతి నజ్మా హెప్తుల్లా వున్న రాజ్య సభలో ప్రశ్నోత్తరాల సమయం. ప్రధానికి ప్రశ్న వేశారు. కానీ ఆ సమయానికి ఆయన సభలో లేరు. ప్రతిపక్ష సభ్యులు తమ అభ్యంతరాన్ని ఉపాధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్ళారు. సరిగ్గా ఆ సమయంలోనే పి. వి. సభలో ప్రవేశించారు.


ఆయన్ని చూసి నజ్మా హెప్తుల్లా " ప్రధాని గారూ ! మీరంటే సభ్యులకు ఎంత ప్రేమో చెప్పలేం ! మీరు రావడం ఒక్క నిముషం ఆలస్యమైనా తాళలేకపొతున్నారు " అన్నారు.

వెంటనే పి.వి. నరసింహారావు గారు నవ్వుతూ " అయ్యో ! ఈ విషయం ముందే తెలిస్తే మరికొంచెం ఆలస్యంగా వచ్చేవాడిని.  అప్పుడు సభ్యులు విరహ వేదనతో మరింత ప్రేమ కురిపించేసి ఉండేవాళ్ళు కదా ? " అని ఛలోక్తి విసిరారు. 



Vol. No. 01 Pub. No.307

Tuesday, June 1, 2010

కల్తీ లేని కట్టలు

1952 లో విడుదలయిన ' సువర్ణమాల ' చిత్ర నిర్మాణ సమయంలో జరిగిన విచిత్ర సంఘటన. ఆ చిత్రానికి దర్శకుడు కాళ్ళకూరి సదాశివరావు గారు.

కథానాయిక " నీ రూపాయిలెవరికి కావాలి. నాకు కావాల్సింది కల్తీలేని ప్రేమ " అంటూ డబ్బు కట్టల్ని కథానాయకుని మొహం మీద విసిరి కొట్టే సన్నివేశం.

చిత్రీకరణ సమయంలో డమ్మీ రూపాయి కట్టలతో అనుకున్న ఎఫెక్ట్ రాదనీ నిజం నోట్ల కట్టల్నే తెప్పించమన్నారు దర్శకులు . నిజం కట్టలే వచ్చాయి. సన్నివేశం ప్రారంభమైంది. అనుకున్నట్లుగానే హీరోయిన్ నోట్లను విసిరేసింది. దాంతో అనుకున్న ఎఫెక్ట్ వచ్చింది.

కానీ నిర్మాత ముఖంలో మరో ఎఫెక్ట్ కనిపించింది. చెల్లాచెదురుగా పడ్డ ఆ నోట్లను బోయ్స్ దగ్గర్నుంచి దర్శకుని వరకూ అందరూ తరతమ బేధాలు లేకుండా ఏరేసుకున్నారు. అప్పటికి మూడు నెలలుగా ఆ కంపెనీలో సిబ్బందికి జీతాలు లేవు మరి. అందుకే దర్శకులు ఈ ఝలక్ ఇచ్చారు.

Vol. No. 01 Pub. No. 306
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం