Wednesday, June 30, 2010

లాఠీఛార్జ్

1949 లో వచ్చిన ' మనదేశం ' చిత్రం ప్రత్యేకత ఏమిటో సినిమా ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటరత్నని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన చిత్రం అది. ఆ చిత్ర దర్శకుడు ఎల్. వి. ప్రసాద్ .

ఎన్టీరామారావు అయినా, నాగేశ్వరరావు అయినా మరొకరు అయినా అప్పటితరం నటులు తాము ధరించిన పాత్రలో ఎలా లీనమైపోయేవారో చెప్పే సంఘటన ఇది.....

' మనదేశం ' చిత్రంలో ఎన్టీరామారావు ధరించింది సబ్ ఇనస్పెక్టర్ పాత్ర. నిజానికది చాలా చిన్నపాత్ర.  మంచి స్పురద్రూపంతో వున్న రామారావు నటనలో ఎంతవరకూ పనికోస్తాడో చూడడానికి ఎల్వీ ప్రసాద్ పెట్టిన పరీక్ష ఆ పాత్ర.
షూటింగ్ ప్రారంభమైంది. ప్రసాద్ గారు సన్నివేశం వివరించారు ఎన్టీయార్ కి.
" రామారావ్ ! ఇది కాంగ్రెస్ వాలంటీర్ల మీద లాఠీఛార్జ్ ! నేను యాక్షన్ అంటాను. వెంటనే వాళ్ళని లాఠీలతో ఎదుర్కోవాలి " అన్నారు ప్రసాద్.
" ఓకే సార్ ! " అన్నారు రామారావు.
" యాక్షన్ "  అన్నారు ప్రసాద్.
రామారావు గారు లాఠీతో రంగంలోకి దూకేశారు. వాలంటీర్లను చావబాదేశారు. ఆపమని ప్రసాద్ గారు ఎంత కేకలు పెట్టినా వినిపించుకోనంత ఆవేశంగా ఆ పాత్రలో లీనమైపోయారు. ఏదీ విన్పించుకునే స్థితిలో లేరు. ప్రసాద్ గారు ' కట్ ' చెప్పారు. కెమెరా ఆగిపోయింది. కానీ ఎన్టీయార్ లాఠీ ఆగలేదు. వాలంటీర్ పాత్రధారులని స్టూడియో గేటు దాకా తరిమికొట్టి వచ్చారు.
" ఏమయ్యా ! రామారావ్ ! ఇది సినిమా. నువ్వు వాళ్ళను దుమ్ము విరిగేలా చావబాదావు. నేను ఆగమని కేకలేస్తున్నా విన్పించుకోలేదు. వాట్ ఇస్ థిస్ ? " అన్నారు ప్రసాద్ .
" పోలీసు వాళ్ళు ఇలాగే లాఠీ ఛార్జ్ చేస్తారండీ ! నేచురల్ గా వుండాలని అలా చేసాను, తప్పా ? " అనడిగారు రామారావు.
" వెళ్లి వాళ్ళందర్నీ పిల్చుకురా ! మళ్ళీ షాట్ తీద్దాం ! " అన్నారు ప్రసాద్ గారు ప్రొడక్షన్ మేనేజర్ తో. అతను నీళ్ళు నమిలాడు. నెమ్మదిగా చెప్పాడు.
" అక్కడ ఎవరూ లేరు సార్ ! కొంతమంది ఇళ్ళకీ, మరికొంతమంది ఆస్పత్రికీ వెళ్ళిపోయారు " అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్.
ఆ దెబ్బలు తిన్న వారిలో తర్వాత దర్శకుడిగా ప్రముఖుడైన తాతినేని ప్రకాశరావు కూడా వున్నారు.

Vol. No. 01 Pub. No. 334

3 comments:

రవిచంద్ర said...

నటించమంటే జీవించేశారన్న మాట :-)

Vinay Datta said...

I heard NTR was well known for the strength of his hands. Added to the hands is the laathi...poor things!

SRRao said...

* రవిచంద్ర గారూ !
* మాధురి గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం