Saturday, April 30, 2011

దర్శక దాదా !

1978 లో ఒకరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెడుతుండగా నారాయణగూడ దీపక్ థియేటర్ దగ్గర ఒక కొత్త రకంగా వున్న హోర్డింగ్ కనబడింది. నలుపు తెలుపు సినిమాలకు కూడా రంగుల్లో పోస్టర్లు ముద్రించే ఆ రోజుల్లో నలుపు తెలుపులోనే ... అదీ ముఖ్యంగా సిల్హౌట్ ( చాయా పధ్ధతి ) లో  హోర్డింగ్ వుండడం నన్ను ఆకర్షించింది. ఏదో కొత్తసినిమా. ఆరోజే విడుదలనుకుంటాను. హీరో హీరోయిన్ లు ఎవరా అని చూసాను. కానీ సరిగా గుర్తుపట్టలేకపోయాను. పైన మేఘాలలో కె. బాలచందర్ అని కనబడింది. అంతే ! ఇదేదో కొత్త సినిమాలా వుంది. ఎలా తీసాడో చూడాలి అనుకున్నాను. అంతకుముందే సర్వర్ సుందరం దగ్గర్నుంచి అంతులేని కథ వరకూ ఆయన చిత్రాలు చూసి ఆయన చిత్రాలపై, ఆయన దర్శకత్వంపైన అభిమానం పెంచుకున్నాను. ఇది మాత్రం పొరిగింటి పుల్లకూర మోజు కాదు.

ఆ రోజు ఎలాగైనా ఆ సినిమా చూడాలనే కోరిక పెరిగింది. ఫలితంగా లంచ్ తర్వాత సీఫెల్ లో క్లాసు ఎగ్గొట్టి దీపక్ థియేటర్ దగ్గరికి వచ్చేసాను. మాటినీ సమయం అయిపొయింది. థియేటర్ దగ్గర జనం కనబడలేదు. హౌస్ ఫుల్ అయిపోయినట్లుంది అనుకుంటూ బుకింగ్ ల కేసి చూస్తే ఆశ్చర్యకరంగా అవి తెరిచి వున్నాయి. గబగబా అక్కడికి వెళ్లి కౌంటర్ లో వున్నతన్ని అడిగితే పెద్దగా జనం లేరని, ఖాళీగానే వుందని అన్నాడు. అనుమానం వచ్చి సినిమా ఎలావుందని అడిగాను. ట్రాజెడీ అనీ, చివర్లో హీరో హీరోయిన్లిద్దర్నీ చంపేశారని అన్నాడు. అందుకేనేమో జనం రావడం లేదని కూడా అన్నాడు. చూడడం రిస్కేమో ఆని కొంచెం భయం వేసింది.  అసలే సినిమా ప్రారంభం కూడా అయిపొయింది అనుకుంటూ అప్పటికి వాయిదా వేసుకున్నాను. తర్వాత వారంరోజుల లోపే సినిమా చాలా బాగుంది. కొత్తదనం వుంది ఆని యూనివర్సిటీ అంతా చెప్పుకోవడం వినబడింది. ఆ తర్వాత సుమారు వందరోజు దాకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో 200 రోజులు పైబడి ఆడి రికార్డులు సృష్టించింది.  ఆ చిత్రం ' మరో చరిత్ర ' . మొదటిసారి చూడడానికి భయపడిన నేను ఎన్నిసార్లు చూసానో, ఇప్పటికీ చూస్తున్నానో లెక్క లేదు.   

సాధారణంగా మన సినిమాల్లో పాటలు ప్రేక్షకులకు గొప్ప రిలీఫ్. ఇంకా చెప్పాలంటే అవి ప్రకటించని ఇంటర్వల్స్. నచ్చని పాట వస్తోంటే  బయిటకొచ్చి రిలాక్స్ అవుతుండేవారు. కానీ బాలచందర్ చిత్రాల్లో అలా కుదరదు. ఎందుకంటే ఆయన చిత్రాల్లో పాటలు కథలో ఇమిడి వుంటాయి. ఒక్కోసారి కథలో కొంత భాగాన్ని అవే చెప్పేస్తాయి. అందుకని బయిటకు వెడితే కథలో కొంత మిస్సయ్యే ప్రమాదముంది.  

బాలచందర్ గారి పాత్రలు మన చుట్టూవున్న సమాజం నుంచే వస్తాయి. నిజజీవిత  సంఘటనలే ఆయన చిత్రాల్లో వుంటాయి. ' అపూర్వ రాగంగళ్ ' ( తూర్పు పడమర -తెలుగు ) చిత్రంలో హీరో మాట్లాడిన ఓ డైలాగ్ కి సెన్సార్ వారు అభ్యంతరం పెట్టారు. నిత్య జీవితంలో సాధారణంగా వాడే మాటేనని, అభ్యంతరకరం కాదని బాలచందర్ వాదించారు. ఆ నిరసన జ్వాలల్లో నుంచి ' గుప్పెడు మనసు ' లో సుజాత పాత్ర పుట్టుకొచ్చింది. అందులో ఆమెది సెన్సార్ బోర్డు సభ్యురాలి్ పాత్ర.

మొదట్లో మానసిక సంఘర్షణలు ఇతివృత్తంగా తీసుకున్నా రాను రాను సామాజిక సమస్యలపైన దృష్టి పెట్టారు. మూస కథల ఒరవడిలో కొట్టుకుపోతున్న సినిమారంగాన్ని మరోవైపు లాక్కొచ్చిన మేధావి బాలచందర్. మంచి అనేది ఎక్కడ వున్నా తీసుకునే విశిష్ట లక్షణం ఆయనలో వుంది. అప్పట్లో వైవిధ్యంగా వుందని పేరు తెచ్చుకున్న కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి చిత్రం ' ఓ సీత కథ ' చూసి ఆయనకు నచ్చి కమలహసన్, రజనీకాంత్, శ్రీదేవి లతో తమిళంలో పునర్నిర్మించారు. ఆయనలోని ప్రతిభను వెలికితీసి జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారాన్ని అందించిన చిత్రం ' తన్నీర్ తన్నీర్ '. ఇప్పటికి కూడా ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మిగిలిన నీటి సమస్యను ఆ చిత్రంలో వాస్తవిక ధోరణిలో చూపారు బాలచందర్.

ఆయన నిర్మాతగా మారి ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించారు. అందులో మణిరత్నం దర్శకత్వంలో నిర్మించిన ' రోజా ' చిత్రం ఎంతటి పేరు తెచ్చుకుందో చెప్పనక్కర్లేదు. సమకాలీన సామాజిక సమస్య లకు ఆయన ఎంతటి ప్రాముఖ్యం ఇస్తారో ఆ చిత్రం చెబుతుంది.

కమలహసన్, రజనీకాంత్, ప్రకాష్ రాజ్ లాంటి ఆణిముత్యాలను చిత్రరంగానికి అందించిన మహాదర్శకుడు బాలచందర్. కమలహసన్, రేవతి జంటగా ఆయన 1986 లో దర్శకత్వం వహించిన ' పున్నగై మన్నన్ ' ( తెలుగు అనువాదం - డాన్స్ మాస్టర్ )   చిత్ర శతదినోత్సవ సంబరాలు చెన్నైలో జరిగినపుడు బాలచందర్ గారి దర్శన భాగ్యం నాకు కలిగింది.  

మరో నాలుగు రోజుల్లో భారత చలన చిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే నిర్మించిన తొలి భారతీయ చలన చిత్రం ' రాజా హరిశ్చంద్ర ' 98 వ వార్షికోత్సవం జరుగబోతోంది. ఈ తరుణంలో బాలచందర్ గారికి ఫాల్కే పేరిట వున్న పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు వారికి కూడా గర్వకారణం. కళలకు, కళాకారులకు భాషాభేధాలు, ఎల్లలు లేవని నిరూపించారు బాలచందర్. ఈ వార్త విన్న తమిళులెంత ఆనందపడతారో తెలుగు వారు కూడా అంతే ఆనందపడతారు.


దర్శకోత్తముడు బాలచందర్ గారిని అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి భారత ప్రభుత్వం ఎంపిక చేసిన శుభసందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ.....




Vol. No. 02 Pub. No. 217

Friday, April 29, 2011

నాట్యదినోత్సవం


సంతోషానికి ఆనంద తాండవం
కోపానికి ప్రళయ తాండవం
ప్రేమకి అనురాగ తాండవం 
బాధలకు విషాద తాండవం

ప్రతీ అనుభూతి వ్యక్తీకరణకు ఆలంబన నాట్యం 
మానవ జీవితంలో విడదీయరాని భాగం నాట్యం


....  ప్రపంచంలో ప్రతి దేశం, ప్రతి జాతి తమదైన సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి వుంది. వాటిలో భాగంగా తమదైన నాట్యరీతులు ప్రతీ దేశం కలిగి వున్నాయి. అయితే సగానికి పైగా దేశాలలో ప్రభుత్వాలు ఈ కళల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దాంతో ప్రజల్లో కూడా నిస్పృహ మొదలైంది. 

నాట్యానికి ప్రజల్లో క్రమేణా తగ్గుతున్న ఆదరణను, పోషించాల్సిన ప్రభుత్వాల అలసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక విభాగం ( యునెస్కో ) ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 29 వతేదీన అంతర్జాతీయ నాట్య దినోత్సవం జరుపుతోంది.

నాట్యం యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియజెయ్యడం, ప్రభుత్వాలను ఈ విషయంలో జాగృతపరచి తగిన నిధులు కేటాయించడం ద్వారా నాట్యాభివృద్ధికి కృషి చెయ్యడం ఈ నాట్యదినోత్సవ లక్ష్యాలు.

మన దేశంలో కూడా ప్రతీ ఏటా ఈ నాట్యదినోత్సవం జరుపుతున్నారు. కానీ మనదేశంలో నాట్యం ఇంకా ఉన్నత తరగతికే పరిమితమైపోయింది. మధ్య తరగతిలో ఆసక్తి వున్నా ఖరీదైన ఆసక్తి కావడంతో తమ ఉత్సాహాన్ని కొంతవరకే పరిమితం చేసుకుని తృప్తి పడాల్సి వస్తోంది. ఇక దిగువ తరగతికి ఇది అందని పండే !

ఆసక్తికి, నైపుణ్యానికి ఆర్ధిక స్థాయితో సంబంధం లేదు. కళాకారులు ఉన్నత తరగతిలో మాత్రమే పుట్టరు. పేదరికం కళాకారునికి ఆటంకం కాకూడదు. కళ అనేది వాళ్లకి కలగా మిగిలిపోకూడదు. అలాగే ఆసక్తి వున్నా ఆర్థికంగా ఉన్నత కుటుంబాలతో పోటీ పడలేక తమలోని నైపుణ్యాన్ని మధ్యలోనే చంపుకునే పరిస్థితి మధ్య తరగతికి వుండకూడదు.

ప్రతీ సంవత్సరం ఏవో కొన్ని కార్యక్రమాలు నిర్వహించి, కొన్ని అకాడెమిలు పెట్టి, వాటిని ఆయా రంగాలతో సంబంధం లేని, వాటి గురించి అవగాహన ఏమాత్రం లేని వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి. ఇది నిజమైన కళాకారులకు, నిజమైన నైపుణ్యం వున్న వాళ్లకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ఎక్కడో కొన్ని కాలేజీలలో మాత్రమే ఈ కోర్సు లు అందుబాటులో ఉంటున్నాయి. అవి కూడా పలుకుబడి, ఆర్ధిక స్థోమత వున్న వాళ్ళకే దక్కుతున్నాయి. కనుక ఇలాంటి కోర్సు లు అందరికీ అందుబాటులో  తక్కువ ఖర్చుతో అందించగలిగితే అసలైన కళాకారులు బయిటకొస్తారు  అన్నిటికంటే ముఖ్యం నాట్యాబ్యాసం వల్ల జీవనానికి లోటు వుండదు అనే భరోసా కలిగించగలగాలి. అప్పుడే మరింత మంది ఉత్సాహంగా తమ ఆసక్తిని చూపుతారు. ఈ కళల శిక్షణ అనేది అందని పండులా కాకుండా సాధారణ విద్యాభ్యాసంలో భాగమయ్యే విధంగా ప్రణాళికలు తయారుచెయ్యాలి. అప్పుడే ఈ కళలు విలసిల్లుతాయి. మన సంస్కృతీ సాంప్రదాయాలు పరిరక్షించబడతాయి.

మన నాట్యశాస్త్ర గమనంలో కొన్ని కీలకమైన ఘట్టాలను తెలుపుతూ రాసిన గత సంవత్సరం టపా ................

పంచమ వేదం

http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_29.html 

 

 అంతర్జాతీయ నాట్య దినోత్సవ శుభాకాంక్షలతో.......

' సప్తపది ' చిత్రంలో సబిత భమిడిపాటి చేసిన తాండవ నృత్యం. ఇందులో మృదంగతాండవం చేసినది శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు.





Vol. No. 02 Pub. No. 216

Thursday, April 28, 2011

లంకాదహనకాండ

 తెలుగు చలనచిత్రసీమలో పేర్ల సెంటిమెంట్, కాంబినేషన్ సెంటిమెంట్ లాంటి సెంటిమెంట్లెన్నో పనిచేస్తూ వుంటాయి. అవన్నీ వట్టి మూఢనమ్మకాలో, చాదస్తాలో లేక నిజాలో చెప్పడం చాలా కష్టం. అది ఫలితం మీద ఆధారపడి వుంటుంది. అయితే ' లంకాదహనం ' సెంటిమెంట్ మాత్రం చిత్రసీమలో బలంగానే పనిచేసింది.

తొలి ' లంకాదహనం '  చిత్రాన్ని 1936 లో కాళ్ళకూరి సదాశివరావు గారి దర్శకత్వంలో రాధా ఫిలిం కంపెనీ నిర్మించింది. ఆ చిత్రంలో ఆంజనేయుడిగా సి. నటేశం అనే ఆయన నటించాడు. ఆ చిత్రం విడుదలయ్యాక విచిత్రంగా ఇంచుమించు అన్ని థియేటర్ల లోను వెండితెర కాలిపోయేది. ఎందుకలా జరిగేదో ఎవరికీ అంతుపట్టలేదు.

ఆ తర్వాత సుమారు అరడజనుసార్లు ' లంకాదహనం ' చిత్రం నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. ప్రతీసారి అవి మొదలు కాకపోవడమో, పూర్తయి విడుదల అవకుండా నిలిచిపోవడమో జరిగేది. దీనికి కారణం మాత్రం అగ్నిప్రమాదాలే ఎక్కువ. ఒకాయన తిథి, వార, నక్షత్రాలన్నీ చూసుకుని మంచి ముహూర్తం నిర్ణయించి తాను ' లంకాదహనం ' చిత్రం నిర్మిస్తున్నట్లు పత్రికలలో ప్రకటించాడు. ఆ వెంటనే ఆయన ఇల్లు తగలబడిపోయింది. మరొకాయన ఇవేమీ పట్టించుకోకుండా చిత్రం నిర్మించడానికి సన్నాహాలు ప్రారంభించాడు. చేతికి అందివచ్చిన ఆయన కొడుకు హఠాత్తుగా మరణించడంతో ఆయన ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.

అప్పటికి చాలామంది ' లంకాదహనం ' అన్న పేరు వల్లనే ఈ ఉపద్రవాలన్నీ జరుగుతున్నాయని నమ్మడం మొదలుపెట్టారు. అందుకే ఇంకొకాయన ఇదే కథకు పేరు మార్చి ' సుందరకాండ ' అని పెట్టి నిర్మించాడు. అప్పుడు కూడా పరశురామ ప్రీతి జరిగింది.  ఇలా కాదని ఇంకో పెద్దమనిషి అటూ ఇటూ కాకుండా ' లంకాయాగం ' అనే పేరుతో చిత్రనిర్మాణానికి పూనుకోగానే ఆయన పెరట్లోని గడ్డివామి తగలబడిపోయింది.

ఇవన్నీ నిజంగానే ఆ పేరు మహాత్మ్యమో, యాదృచ్చికమో తెలీదుగానీ మళ్ళీ ఎవరూ ఆ పేరుతో సినిమా తియ్యడానికి సాహసించలేదు.

- ప్రముఖ రచయిత, ఫిలిం జర్నలిస్ట్  డా. ఇంటూరి వెంకటేశ్వరరావు గారి సమాచారం ఆధారంగా.........

గతంలో ఉత్సవాలు, సంబరాలలో రంగస్థల నాటకాలు తప్పనిసరి. అందులోను పౌరాణిక పద్య నాటకాలదే వైభవం. పేరు బడ్డ నటులు, సమాజాలే కాక గ్రామాలలో ఉత్సాహవంతులైన యువకులు కూడా నాటకాలు వెయ్యడానికి పూనుకునేవారు. అయితే వారు వృత్తిరీత్యా అనుభవమున్న నటులు కాకపోవడంతో కొన్ని సందర్భాలలో రసాభాస జరిగేది. ఇలాంటి సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ' లంకాదహనం ' నాటకం నటరత్న నందమూరి తారక రామారావు గారి స్వంత చిత్రం ' ఉమ్మడికుటుంబం ' చిత్రంలో వుంది. ఆ సన్నివేశాన్ని ఇక్కడ చూసి ఆనందించండి.   



Vol. No. 02 Pub. No. 215

Wednesday, April 27, 2011

కవితాకళానిధి


తెలుగులో ' సత్య హరిశ్చంద్ర ' నాటకాలు చాలా వచ్చాయి. వాటిలో మేటిగా నిలిచింది మాత్రం బలిజేపల్లి లక్ష్మీకాంతకవి రచించిన నాటకమే ! అందులోని సంభాషణలు, పద్యాలు నేటికీ సజీవంగానే వున్నాయి. నాటకరంగంలో పేరు తెచ్చుకున్న నటులు, ఇతర కళాకారులతో బాటు రచయితలు కూడా తొలి రోజుల్లో చిత్రరంగానికి వచ్చారు. నాటకరంగంతో బాటు ఆ రంగాన్ని కూడా సుసంపన్నం చేసారు. బలిజేపల్లి వారు కూడా ఆ కోవలోకే వస్తారు.

గుంటూరు హిందూ కళాశాలలో తెలుగు అథ్యాపకులుగా, కర్నూలు రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమాస్తాగా పనిచేసిన బలిజేపల్లి వారు అందరూ బాలలతో నిర్మించిన ' ధ్రువ - అనసూయ ' తో బాటు విజయదశమి, జరాసంధ, మార్కండేయ, వరవిక్రయం, మైరావణ, మళ్ళీపెళ్ళి, బాలనాగమ్మ, గరుడ గర్వభంగం, తాశిల్దారు, సీతారామజననం, భీష్మ, ముగ్గురు మరాఠీలు, మదాలస, కృష్ణప్రేమ వంటి చాలా చిత్రాలకు మాటలు, పాటలు రాసి తన సాహిత్య సుగందాల్ని చిత్రరంగానికి కూడా అందించారు. 

లక్శ్మీకాంతకవి గారు మంచి రచయితే కాదు... మంచి నటులు కూడా ! ' వరవిక్రయం ' చిత్రంలో ఆయన ధరించిన పిసినారి సింగరాజు లింగరాజు పాత్ర చెప్పుకోదగ్గది. ' భూకైలాశ్    ' చిత్రంలో పౌరాణిక భాషను వ్యావహారికంలోకి మారుస్తూ ఆయన చేసిన ప్రయోగం ఆ తర్వాత వచ్చిన పౌరాణిక చిత్రాలలో రచనకు ఆదర్శంగా నిలిచింది. 

బలిజేపల్లి వారి సాహిత్యంలో గాలిపెంచల సంగీతం నిర్వహించిన టంగుటూరి సూర్యకుమారి పాడిన ' కృష్ణప్రేమ ' చిత్రంలోని ఓ మధురగీతం .....   




Vol. No. 02 Pub. No. 214

Tuesday, April 26, 2011

టూరింగ్ సినిమా

 మీకు తెలుసా ?  

 బొంబాయిలో  1904 లో మానెక్ డి. సేత్నా అనే ఆయన టూరింగ్ సినిమా ప్రారంభించి ' ది లైఫ్ అఫ్ జీసస్ క్రైస్ట్ ' అనే రెండు రీళ్ల సినిమా ప్రదర్శించాడు.

అయితే దానికి మూడు సంవత్సరాల ముందే అంటే 1901 వ సంవత్సరంలోనే  రఘుపతి వెంకయ్య గారు  టూరింగ్ సినిమా ప్రారంభించారు. అంటే మన దేశంలో తొలిసారి సినిమా చూపించింది తెలుగు వారేనన్నమాట.

అంతేకాదు. దక్షిణ భారతదేశంలో తొలి పెర్మనెంట్ సినిమా థియేటర్ ' గెయిటీ ' ని నిర్మించింది కూడా రఘుపతి వెంకయ్య , ఆయన కుమారుడు సూర్య ప్రకాష్ గారలే !



Vol. No. 02 Pub. No. 213

Monday, April 25, 2011

తెలుగు కళా'సూర్య'



తెలుగు పౌరుషానికి ప్రతీక ఆంధ్రకేసరి 
తెలుగు కళావైభవానికి ప్రతీక సూర్య 

గుండుకెదురెళ్లి వలసపాలకులను నిలిపిన ధీశాలి ప్రకాశం 
తన పాటతో జన ప్రవాహాన్ని నిలిపివేయగలిగిన కళాకారిణి సూర్య





 ఆంధ్రకేసరి వంశంలో పుట్టి ఆంధ్ర కళా వైభవాన్ని దశదిశలా వ్యాపింపచేసిన విదుషీమణి  టంగుటూరి సూర్యకుమారి. 

ఆమెకోసం చిన్నతనంలోనే పాత్రలు సృష్టించబడ్డాయి
ఆమె పాడిన పాటలు వ్యాపారులకు వరంగా మారాయి
అందాల సుందరి కిరీటం ఆమెకొక అదనపు అలంకారం 
ప్రపంచ రంగస్థలం ఆమెకు సాదర స్వాగతం పలికింది

పురుషులే స్త్రీ పాత్రలు ధరించే పరిస్థితి వున్న కాలంలో పురుష పాత్ర ధరించిన నటి సూర్యకుమారి. 1943 లో వచ్చిన ' కృష్ణప్రేమ ' చిత్రంలో నారద పాత్ర ధరించారు. తెలుగుతో బాటు సంస్కృతం, తమిళం, గుజరాతీ, హిందీ, ఆంగ్ల భాషల్లో పాటలు పాడారు. నటించారు.

స్వాతంత్ర్య సమరంలో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాయి ఆమె పాటలు
సాంస్కృతిక రాయబారిగా అమెరికా పర్యటింపజేసింది ఆమె నటన

మన వలస పాలకులైన ఆంగ్లేయులకు భారత కళలను నేర్పింది
భారత కథలపై పరిశోధనలో అల్ఫ్రెడ్ హిచ్ కాక్ కే సహకరించింది

ప్రాక్ పశ్చిమ కళా సాంస్కృతిక వారధి టంగుటూరి సూర్యకుమారి
రాజమండ్రిలో పుట్టి  ఇంగ్లాండ్ లో మెట్టిన ఆంధ్ర వనిత సూర్యకుమారి

 మన తెలుగు తల్లికి  మల్లెపూదండ సమర్పించిన తెలుగు తేజం టంగుటూరి సూర్యకుమారి గారి వర్థంతి సందర్భంగా గీతసుమాంజలి ............
 



Vol. No. 02 Pub. No. 212

Saturday, April 23, 2011

జానకీ స్వరం

ప్రతీ సంవత్సరం వసంత కాలంలో మాత్రమే కమ్మగా గానం చేస్తుంది కోకిల 

అప్పుడెప్పుడో పురాణకాలంలో అప్పుడప్పుడు దివి నుండి ఆటవిడుపుకోసం భువికి దిగివచ్చి ఉద్యానవనాలలో విహరిస్తూనో, సరస్సుల్లో జలకాలాడుతూనో గంధర్వులు తమ గాన మాధుర్యాన్ని పంచేవారట.

కానీ ఇక్కడ... ఈ భూమ్మీద.... ఈ భారతదేశంలో... అదీ ఆంధ్రదేశంలో ఒక కోకిల మాత్రం నిరంతరం.... అన్ని కాలాల్లోనూ.... అన్ని పరిస్థితుల్లోను గానం చేస్తూనే వుంది.

అప్పుడెప్పుడో కాకుండా, అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడూ, ఎల్లప్పుడూ మనకి గంధర్వగానం వీనులవిందు చేస్తూనే వుంది.


 ఆ గాంధర్వ కోకిల జానకి మధుర స్వరం
తెలుగు శ్రోతలకు ఆ సుస్వరం ఒక వరం

 కలకాలం ఆ స్వరం తెలుగునాట స్వరమధువులు ఒలికించాలని కోరుకుంటూ గాయని 
 ఎస్. జానకి గారికి జన్మదిన శుభాకాంక్షలతో............


శ్రీమతి జానకి గారు పాడిన డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారి రచన .........





 స్వరకోకిల జానకి గారి గురించి గత సంవత్సరం టపా ..........
నాద ' స్వర ' జానకి

Vol. No. 02 Pub. No. 211

భారత చలనచిత్ర ' కిరణం '

సుమారు యాభై మూడేళ్ళ క్రితం పారిస్ నగరంలో ఇది జరిగింది. ఓ యువకుడు కాలక్షేపానికి ఆ మహానగరంలోని ఒక సినిమా థియేటర్ లోనికి ప్రవేశించాడు టికెట్ తీసుకుని. ఆ యువకుడి పేరు ఫ్రాన్సిస్ లా బోర్డే.  అప్పటికి అతను అనామకుడే ! ఆ థియేటర్ లో ఆ రోజు ప్రదర్శిస్తున్న సినిమా దర్శకుడు కూడా అప్పటికి అనామకుడే ! అప్పటికి ఆ చిత్రం చూడడం పూర్తి చేసిన తర్వాత కనుకొలుకులలో నీటి బిందువులు కనిపించాయి. హృదయం చలించింది కూడా ! పేదరికం అంత దుర్భరంగా ఉంటుందని ఫ్రాన్సిస్ లా బోర్డే కి ఆనాటివరకూ తెలీదు. ఆ పేదరికాన్ని, దారిద్ర్యాన్ని స్వయంగా చూడడానికి 1956 చలికాలంలో పారిస్ నుంచి లా బోర్డే కలకత్తాకు వచ్చాడు. హౌరా స్టేషన్ బయిట రోడ్డుమీద ఫీల్ఖానా బస్తీ కుష్టురోగులను చూసి లాబోర్డే చలించి పోయాడు. నాటినుంచి కలకత్తాలోనే మానవ సేవకుడిగా , సంఘసేవకుడిగా స్థిరపడిపోయాడు. లా బోర్డే ఎన్నో కుష్టురోగుల గృహాలు, అనాథ శరణాలయాలు స్థాపించాడు. ఆ రోజు యాభైమూడేళ్ళ క్రితం ఆ సాయింత్రం పారిస్ లో లా బోర్డే కన్నార్పకుండా చూసిన చిత్రం సత్యజిత్ రే ' పథేర్ పాంచాలి ' . అప్పటికి అనామకుడైన ఆ చిత్ర దర్శకుడు సత్యజిత్ రే.


భారతదేశ చలన చిత్ర రంగానికి వెలుగు దీపం సత్యజిత్ రే. ఆయన చిత్రాలు సజీవ చిత్ర రూపాలు. భారత చలన చిత్రాలను ప్రపంచానికి చూపించింది సత్యజిత్ రే. తన చిత్రాలద్వారా భారత దేశానికి అంతర్జాతీయంగా ఖ్యాతి తీసుకొచ్చిన మహా దర్శకుడు. 

ఆయన చిత్రాల్లో పాత్రలు నేలవిడిచి సాము చెయ్యవు. అవన్నీ రోజూ మన చుట్టూ కనబడే మనకి పరిచయమున్న వ్యక్తులే ! ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉండే కష్టాలు, కన్నీళ్లు... వాటితో వాళ్ళు నిరంతరం పడే రాజీ ప్రధానంగా కనిపిస్తాయి.  ఆదర్శాలు వల్లించడం, ఊహల్లో తేలిపోవడం ఆయన చిత్రాల్లో కనబడదు. కేవలం ఆయా జీవితాల సజీవ చిత్రణ మాత్రమే కనబడుతుంది. 

 అలాంటి మహోన్నత దర్శకుడు సత్యజిత్ రే గారి వర్థంతి సందర్భంగా కళా నీరాజనాలతో............



విన్నపం : ఈ టపాలో ఒక పొరబాటు దొర్లింది. నిజానికి ఈ రోజు ( ఏప్రిల్ 23 ) సత్యజిత్ రే గారి వర్థంతి. పొరబాటున జయంతిగా పేర్కొనడం జరిగింది. ఆయన జయంతి మే 2 వ తేదీన.జరిగిన పొరబాటుకి క్షంతవ్యుణ్ణి. ఆ పొరబాటును సవరించాను. గమనించగలరు.


Vol. No. 02 Pub. No. 210

Friday, April 22, 2011

పిలచిన బిగువటరా !


  
ఈ నయగారము....ఈ వయ్యారము...
......అంటూ షష్టిపూర్తి జరుపుకుంటున్న చిత్రం ' మల్లీశ్వరి ' చిత్రంలో గానంలోను, అభినయం లోను వయ్యారమొలికించిన భానుమతి ఆ చిత్రం స్వర్ణోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.....



" మల్లీశ్వరి చిత్ర విజయం ఒక్కరిది కాదు. అందరి కృషితోనే విజయవంతమైంది. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే అప్పట్లో మల్లీశ్వరి చిత్రం లోని పాటలు రేడియోలో ప్రసారం చేయనీకుండా నిలిపివేయడం.
మల్లీశ్వరి చిత్రం లో వేసిన సెట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. కృష్ణదేవరాయలు సభకు ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ అద్భుతంగా వేసారు. దర్శకుడు బి. ఎన్. రెడ్డికి మంచి అభిరుచి ఉండటంతో దానికి అణుగుణంగా సెట్స్ ను తయారు చేయించారు.

ఇక సంగీతం విషయానికొస్తే సాలూరి రాజేశ్వరరావులోని క్రియేటివిటీని వెలికి తీయడం ఒక్క భానుమతి వల్లే అవుతుంది. ఆయనకు నౌషాద్ సంగీతం అంటే ఇష్టం. అయితే ఆ ప్రభావం ఇందులో పడకుండా జాగ్రత్త తీసుకుని ఆయన వద్ద మంచి ట్యూన్లు చేయించాం ! ఇక్కడ ఇదే ఇంట్లో ( భానుమతి గారిల్లు ) సంగీతం సమకూర్చాము. నేను పాడే పాటలు నాకిష్టమైన కాఫీ రాగం, కమాసు, సింధుభైరవి, యమన్ కళ్యాణ్ రాగాల్లో సమకూర్చుకున్నాను.
పిలచిన బిగువటరా ( కాఫీ రాగం ), ఎందుకే నీకింత తొందరా ( కమాసు ), ఎవరేమని అందురో ( దర్బారీ రాగం ) , మనసున మల్లెలు ( యమన్ కళ్యాణ్ రాగం ), జయ జయ ( కళ్యాణి రాగం ) పాటలకు సంగీతం సమకూర్చుకున్నాను.

అప్పటికి నాకు 23 సంవత్సరాలు. అప్పటికే కొన్ని పిక్చర్స్ లో చేసిన సీనియర్ నటిని. నేను వేసినందునే మల్లీశ్వరి అంత హిట్ అయింది " అని గర్వంగా చెప్పుకున్నారు.
 
అది గర్వం అయి వుండదు. ఆత్మ విశ్వాసం కావచ్చు. ఏమైనా మల్లీశ్వరిగా తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయిన భానుమతి వయ్యారాలొలికించిన ఈ పాట ఆ చిత్ర షష్టిపూర్తి సందర్భంగా.............   




Vol. No. 02 Pub. No. 209

భూమాతకు వందనం

భూమాతకు వందనం
కరుణామయికి వందనం

నీలో స్వార్థం లేదు...
నీకు వివక్షత లేదు...

ఈ విశ్వంలోని ప్రతీ ప్రాణీ నీ సంతానమే ! 
నీ సృష్టిలోని పిల్లలందరూ నీకు సమానమే !

అందుకే అందరికీ సమానంగానే సంపదను అందించావు
అందుకే అందరి ఆకలినీ సమానంగానే తీర్చాలనుకున్నావు

కానీ నువ్విచ్చిన ఆహారం మాలో స్వార్థాన్ని పెంచింది
నువ్విచ్చిన సంపద మాలో మత్సరాన్ని పెంచింది

బలం కలవాడిదే రాజ్యమైంది
ముందుగా వాడి ఆకలి తీరింది

బలహీనుడు ఆశక్తుడయ్యాడు
ఎప్పటికీ వాడి ఆకలి తీరదు

మానవత్వం కంటే ధనం విలువ పెరిగింది
దానికోసం అడ్డదారులు తొక్కుతున్నారు

నువ్విచ్చిన అమూల్యమైన సంపద సహజవనరులు
అవన్నీ స్వార్థపరుల దౌష్ట్యానికి బలయిపోతున్నాయి

తాత్కాలిక సుఖాలకు ప్రాధాన్యం పెరుగిపోతోంది
శాశ్వత ప్రయోజనాలు కనుమరుగైపోతున్నాయి

అందుకేనేమో అప్పుడప్పుడు నీ ఉనికిని గుర్తు చేస్తున్నావు
ప్రళయాలు, భూకంపాల రూపంలో నీ బిడ్డల్ని శిక్షిస్తున్నావు

కానీ తల్లీ .. నీ ఆగ్రహ జ్వాలల్లో మాడిపోయేది అధికంగా సామాన్యులే
వారి సమాదుల్నే పునాదులుగా చేసుకునేది మళ్ళీ ఆ ' మాన్యులే '

ఈ స్వార్థపరుల్నీ, అవినీతిజలగల్నీ మాత్రమే మట్టు పెట్టే మంత్రమేదీ లేదా నీ దగ్గర
అమాయకులనీ, పీడిత జనాన్నీ వారి నుంచి రక్షించే మంత్రదండమేదీ లేదా నీ దగ్గర

ఉంటే వెంటనే బయిటకు తియ్యి తల్లీ ! నీకు వందనాలు !!
ఉంటే వెంటనే ప్రయోగించు తల్లీ ! నీకు శతకోటి వందనాలు !!

ప్రతీ మనిషి అవసరానికి సరిపడా భూమాత అందిస్తుంది 
కానీ అతని అత్యాశకు సరిపడా మాత్రం కాదు 
- మహాత్మాగాంధీ 




Vol. No. 02 Pub. No. 208

Thursday, April 21, 2011

అరవై యేళ్ళ క్రితం......

తెలుగు చలనచిత్ర సీమకు సంబంధించినంతవరకూ 1951 వ సంవత్సరం చాలా విశిష్టమైనది. ఇంకా చెప్పాలంటే  ఆ సంవత్సరం తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించడానికి అన్ని అర్హతలు వున్నది. సినిమా అనేది సకల కళల సమాహారమని నిరూపితమైన సంవత్సరం. మళ్ళీ యాభై ఒకటో సంవత్సరం వస్తే బాగుంటుందేమో !

సినిమా అనేది భారీగా డబ్బుతో చేసే వ్యాపారమని, వ్యాపార విలువలు తప్ప కళలు కూడు పెట్టవని నమ్మేవారికి ఒక్కసారి 1951 ని గుర్తు చేస్తేనైనా తమ  అభిప్రాయం మార్చుకుంటారేమో ! ఇంతకీ 1951 విశిష్టత ఏమిటో ఒకసారి చూద్దాం........

తరతరాలుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న పాతాళభైరవి, మల్లీశ్వరి చిత్రాలు విడుదలయింది ఈ సంవత్సరమే ! విజయా సంస్థను నిలబెట్టి మనకు అజరామరమైన చిత్రాలను అందించడానికి పునాది వేసిన చిత్రం ' పాతాళభైరవి ' అయితే, బి. యన్. రెడ్డి గారి లోని కళా పిపాసను మనందరికీ పంచేటట్లు చేసిన చిత్రం ' మల్లీశ్వరి '. 


అల్లావుద్దీన్ అద్భుతదీపం లాంటి అరబియన్ నైట్స్ కథను తీసుకుని దానికి అనేక వన్నెలు చిన్నెలు అద్ది తయారుచేసిన అసలు సిసలు జానపద కథ ' పాతాళభైరవి '.


శ్రీకృష్ణదేవరాయలు కాలంలో జరిగినట్లు చెప్పబడే ఒక చిన్న సంఘటన ఆధారంగా తయారుచేసుకున్న కథ ' మల్లీశ్వరి '. అదొక మధురమైన వెండితెర దృశ్యకావ్యం. సంగీత, సాహిత్య, నృత్య, శిల్ప...... ఇలా ఒకటేమిటి సమస్త కళలను సమపాళ్ళలో రంగరించిన ' మల్లీశ్వరి ' చిత్రం నభూతో నభవిష్యతి. 






*  ' పాతాళభైరవి ' చిత్రంతో  కె.వి.రెడ్డి, పింగళి కాంబినేషన్ ప్రారంభమైతే,  ' మల్లీశ్వరి ' చిత్రంతో అప్పటికే భావకవిగా ప్రసిద్ధులైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చిత్ర రంగ ప్రవేశం చేసి తన పాటలతో మనందరి మనసున మల్లెలు పూయించారు.



*  ఆ సంవత్సరమే విడుదలయిన ' దీక్ష ' చిత్రంతో  ' పోరా బాబూ పో... పోయి చూడు ఈ లోకం పోకడ ' అంటూ ప్రవేశించారు మరో రచయిత ఆత్రేయ . 





*  ఆ సంవత్సరమే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ' ఆకాశరాజు ' చిత్రంతో రంగ ప్రవేశం చేసారు. 





* అంతకుముందు ' ఆహుతి ' అనే డబ్బింగ్ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమైనా, నేరుగా తెలుగు పాటలతో మహాకవి శ్రీశ్రీ పరిచయమైంది ' నిర్దోషి ' చిత్రంతో



ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు కలిగిన 1951 సువర్ణ సంవత్సరం మళ్ళీ రావాలని  కోరుకోవడం తప్పు కాదేమో !


Vol. No. 02 Pub. No. 207

Wednesday, April 20, 2011

గోవు పాడిన పాట వెనుక......


గోవు మాలచ్చిమికీ కోటి దండాలు.........

హిందువులకు గోవు పరమ పవిత్రమైనది. పండగలకి, పబ్బాలకి గోవుని పూజించడం మన సాంప్రదాయం. మాంసం కోసం ఏ జంతువును వదించినా పెద్దగా స్పందించని హిందువులు గోవద నిషేధంపై అనేక ఉద్యమాలు చేసారు. గోసంరక్షణ సమితిలు నెలకొల్పారు.

అలాంటి ' గోవు హృదయంలో జొరబడి దాని స్వభావమంతా పూసగుచ్చినట్లు చెప్పారే ! ' అని ఘంటసాల గారి చేత ప్రశంసలు అందుకున్న కొసరాజు గారి పాట ' గోవుల గోపన్న ' చిత్రంలోనిది. రాజ్యం ప్రొడక్షన్స్ వారు అక్కినేని నాగేశ్వరరావు, భారతి, రాజశ్రీ తారాగణంగా సి. యస్. రావు గారి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి మూలం ' ఎమ్మె తమ్మన్న ' అనే కన్నడ చిత్రం. దాన్ని తెలుగుతో బాటు తమిళంలో ' మాట్టుకారవీలన్ ' గా, హిందీలో ' జిగ్రీ దోస్త్ ' గా పునర్నిర్మించారు..

' గోవుల గోపన్న ' చిత్రంలో ఆవుది కూడా ఓ ప్రధానమైన  పాత్ర. కనుక ఆవుపై కూడా ఓ పాట పెట్టాలని నిర్ణయించారు. ఆ పాట రాసే పనిని ప్రముఖ రచయిత కొసరాజు గారికి అప్పగించారు. గోవు మదిలో మెదలడానికి ఆస్కారమున్న ఆలోచనల్ని ఊహించి మరీ రాయమని సూచించారు దర్శకులు సి. యస్. రావు గారు. కొసరాజు గారు ఏమి రాసి పట్టుకొచ్చినా తాను ట్యూన్ చేస్తానని ఘంటసాల అన్నారు.  దాంతో కొసరాజు గారు మొదట పల్లవి రాసి పట్టుకెళ్లారు. అది....

వినరా వినరా నరుడా !
తెలుసుకోర పామరుడా !
గోమాతను నేనేరా ! నాతో సరిపోలవురా !

..... ఈ పల్లవి దర్శకులు సి. యస్. రావు గారికి, సంగీత దర్శకులు ఘంటసాల గారికి నచ్చింది.  అందులో నవ్యత కనబడింది. అదే ఒరవడిలో చరణాలను రాయమన్నారు. కొసరాజు గారు కొన్ని చరణాలు రాయగా అందులోనుంచి కొన్నిటిని ఎంపిక చేసారు సి. యస్. రావు గారు. పల్లవిలో గొప్ప ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించిన గోవు తర్వాత చరణాలలో కూడా ఆ స్తైర్యాన్నే కొనసాగించింది. 

కొసరాజు గారు నిజంగానే గోవు హృదయంలో జొరబడి ఈ పాట రాస్తే.... ఆ  గోవులో పరకాయ ప్రవేశం చేసినట్లు ఘంటసాల గారు అద్భుతంగా ఈ పాటను గానం చేసారు. ఆ అద్భుతమైన పాట మీ కోసం......



 
Vol. No. 02 Pub. No. 206

Tuesday, April 19, 2011

దేవులపల్లి వారి తొలి సినిమాపాట

మల్లీశ్వరి చిత్ర దర్శకులు బి. యన్. రెడ్డి గారు సందర్భం చెబుతూ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారితో ' నేనడిగిన సమయానికి రాసివ్వడం కుదరకపోయినా సాధ్యమైనంత త్వరగా పాట రాసిస్తే సంతోషిస్తాను ' అన్నారు.  

' అలాగే ' అని తలూపారు దేవులపల్లి వారు. 

అన్నట్లుగానే రెండు రోజుల్లో పాట రాసి తీసుకొచ్చి రెడ్డి గారికి చూపించారు. భారీ వర్ణనలతో, సంస్కృత సమాసాలతో నిండి పామరులకేమాత్రం అందని భాషలో ఉందా రచన. అది చూసిన బి. యన్. గారు కృష్ణశాస్త్రిగారి పాండిత్యానికి ఓ ప్రక్క సంతోషిస్తూనే .......

" మన కథ ప్రకారం ఈ పాట ఓ పల్లెటూళ్ళో పద్మశాలీల కుటుంబంలో మేనత్త మేనమామ బిడ్డలు పాడుకునేది. అందుకని వారి సహజ సిద్ధమైన భాషలో వుంటే బాగుంటుంది " అన్నారు.

దేవులపల్లి వారు " అలాగా ? " అంటూ కళ్ళు మూసుకున్నారు. రెండు నిముషాలు అలోచించి కళ్ళు తెరిచారు. అరగంటలోపే ఆ పాటను మార్చి రాసేసారు. ఆ రచన చూసి బి. యన్. రెడ్డి గారు ఆనందం చెప్పనలవికాదు. వెంటనే రాజేశ్వరరావు గారికి బాణీ కోసం ఆ పాటనిచ్చారు    

ఆ పాట ' రావిచెట్టు తిన్నె చుట్టూ......' 




తన తొలి సినిమా అనుభవం గురించి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన సినిమా పాటల సంకలనం '
మేఘమాల ' లో వివరిస్తూ ....

" నా మొదటి చిత్రం మల్లీశ్వరితోనే సినిమాకు పాటలు రాయడం నేర్చుకున్నాను. సినిమా మీడియంకు కావాల్సిన శిల్పాన్ని, భాషను అప్పుడే అలవరచుకున్నాను " అంటారు.

ఒక రంగంలో ప్రవేశిస్తూనే అన్నీ తెలిసిపోయాయనుకోవడం, అదేమైనా బ్రహ్మ విద్యా ? అనుకోవడం మానవ సహజం.  కానీ అప్పటికే మహాకవిగా ప్రఖ్యాతిగాంచిన కృష్ణశాస్త్రి గారు సినిమాలకు రచనను అప్పుడే నేర్చుకున్నాననడం ఆయన  నిబద్ధతకు, చిత్తశుద్ధికీ నిదర్శనం.  

Vol. No. 02 Pub. No. 205

Saturday, April 16, 2011

నవ్వుల గని

నవ్వించడం ఒక యోగం
ఆ యోగసాధన చేసిన కర్మయోగి చార్లీ చాప్లిన్
తన సాధనని తనకే పరిమితం చేసుకోకుండా ప్రపంచానికి పంచి తరింపచేసాడు
ఆ నవ్వులో వినోదముంది... విషాదముంది.... విజ్ఞానముంది
ఆయన జీవితంలోనూ అంతులేని విషాదముంది
ఆ విషాదం నుంచే వినోదం పుట్టుకొచ్చింది
అందుకే ఆయన చిత్రాలు సజీవమయ్యాయి
తరతరాలకూ ప్రీతి పాత్రమయ్యాయి
టాకీలోచ్చాక కూడా తన చిత్రాలు మూకీలుగానే నిర్మించాడు   
భావ వ్యక్తీకరణకు సంభాషణలతో పనిలేదని నిరూపించాడు
సినిమా మీడియంకు పెద్ద బాలశిక్ష ఆయన చిత్రాలు
హంగులు, ఆర్భాటాలు లేకపోయినా ఇప్పటికీ నిత్యనూతనాలు
నేటి దర్శకులు, నిర్మాతలు అనుసరించాల్సిన సినిమా వ్యాకరణకర్త చాప్లిన్


 ప్రపంచాన్ని నవ్వులతో ముంచెత్తిన చార్లీ చాప్లిన్ జయంతి సందర్భంగా ఆయనకు హాస్య నీరాజనం  







చార్లీ చాప్లిన్ పై గతంలోని టపాలు -
 
నవ్వుల విషాదం


Vol. No. 02 Pub. No. 204

Friday, April 15, 2011

కూత ఘనం...ఇదో క్విజ్


ఇవ్వాళా రేపు మనం టీవీ చానల్స్ లోనో, ఇతరత్రానో అనేక విషయాల మీద ప్రశ్నావళి ( క్విజ్ ) కార్యక్రమాలు చూస్తున్నాం. ఆ కార్యక్రమాల్లో విషయ పరిజ్ఞానమున్న కొందరు పాల్గొని క్విజ్ మాస్టర్ అడిగే ప్రశ్నలకు జవాబులివ్వడం, వాటి ఆధారంగా వారికి మార్కులివ్వడం, ఎక్కువ మార్కులు సంపాదించిన వారు బహుమతులు గెలుచుకోవడం జరుగుతుంటుంది. 


ఇక్కడో క్విజ్ కార్యక్రమం చూపిస్తున్నాను. ఇది సంగీతం గురించిన క్విజ్. ఇందులో పాల్గొన్నది మాత్రం ఒక్కరే !  మీరు చూసి ఎన్ని మార్కులిస్తారో, ఎన్ని బహుమతులిస్తారో మరి........ 
..... ఇక ఆ పాల్గొన్నవారి వివరాలు మీరు మార్కులు, బహుమతులు ఇచ్చాక......


Vol. No. 02 Pub. No.

Thursday, April 14, 2011

అపర భగీరథుడు

 కొంతమంది తమకోసం పుడతారు. మరికొంతమంది తమవారికోసం పుడతారు. ఇంకాకొంతమంది తమ చుట్టూ వున్నా వారికోసం పుడతారు. 

ఈ చివరి కోవకు చెందిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రస్తుతం కర్ణాటకరాష్ట్రంలో భాగంగా వున్న చిక్ బళ్లాపూర్  జిల్లాలోని ముద్దనహళ్లి అనే గ్రామంలో తెలుగు కుటుంబంలో జన్మించిన విశ్వేశ్వరయ్య కర్ణాటకతో బాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసి వ్యవసాయం విస్తరించడానికి దోహదపడ్డారు. దానితో బాటు విద్యుత్ ప్రాజెక్టులు, వరద నీటి ప్రాజెక్టులు లాంటి ఇంకా ఎన్నో రకాల ప్రాజెక్టుల రూపకల్పనకు కారణభూతుడయ్యారు.

చిన్ననాటే తండ్రి మరణంతో ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇంజనీరింగ్ పూర్తి చేసి అప్పటి బొంబాయి ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరారు. పూణే ప్రాంతంలో మొదటిసారిగా ఆటోమాటిక్ వరద గేట్లు ప్రవేశపెట్టి విజయం సాధించారు.
నిజాం నవాబు అభ్యర్థనతో హైదరాబాద్ నగరాన్ని తరచూ ముంచెత్తుతున్న మూసీ నది వరద ఉధృతిని అరికట్టేందుకు పథకాలు ప్రారంభించారు. దాంతో అప్పటివరకూ నగరప్రజలను పట్టి పీడిస్తున్న వరద సమస్యకు పరిష్కారం లభించింది.
సముద్ర తీరప్రాంత భూమికోత నుండి విశాఖపట్నం నౌకాశ్రయాన్ని రక్షించే పథకాన్ని రచించారు విశ్వేశ్వరయ్య.

కర్ణాటకలో ఎన్నో పరిశ్రమల స్థాపనలో, ప్రాజెక్టుల నిర్మాణంలో, సాంకేతిక విద్యారంగాభివృద్ధిలో, వాణిజ్య సంస్థల ప్రారంభంలో విశ్వేశ్వరయ్య గారి పాత్ర ఎనలేనిది. మైసూరు మహారాజా ఆహ్వానంతో వారి సంస్థానంలో చీఫ్ ఇంజనీర్ గా, మైసూరు దివాన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రజలకు ఆయన చేసిన మేలును గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం ' నైట్ కమాండర్ ' పురస్కారంతో సత్కరించింది. స్వాతంత్ర్యానంతరం 1955 లో భారత ప్రభుత్వం ' భారతరత్న ' బిరుదుతో సత్కరించారు.

ప్రతి సంవత్సరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులైన ఇంజనీర్లలో ప్రథముడిగా, ఎన్నదగిన వాడిగా పేరుపొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వర్థంతి ( ఏప్రిల్ 14 ) సందర్భంగా స్మృత్యంజలి.  

Vol. No. 02 Pub. No. 202

రాజ్యాంగ నిర్మాత


భారత రాజ్యాంగ నిర్మాణ సారధి భీమ్ రావు రాంజీ అంబేద్కర్ 
బాబాసాహెబ్ గా పిలుచుకునే అంబేద్కర్ దళిత జాతిలో పుట్టి అనేక కష్టనష్టాలకోర్చి ఉన్నత చదువులు చదివి, ఉన్నత పదవులను చేపట్టి దళితుల సంక్షేమానికి అహరహం కృషిచేసిన మహానుభావుడు. 


అంబేద్కర్ జయంతి సందర్భంగా ( ఏప్రిల్ 14 ) ఆ మహనీయునికి నివాళులు

 అంబేద్కర్ పై గతంలో రాసిన టపా....

Vol. No. 02 Pub. No. 203

Wednesday, April 13, 2011

అపర శకుని

 రారాజు సుయోధనుడు భీష్మ పితామహుడని సర్వ సైన్యాధ్యక్షునిగా ప్రకటించి అందుకు గుర్తుగా భీష్ముడికి రాజ ఖడ్గం అందించాడు. ఆ సందర్భంలో సుయోధన సార్వభౌముడిని భీష్మాచార్యులవారు భుజం తట్టి అభినందించారు.


" కట్..... రీటేక్ ! " అన్నారు దర్శకులు బి. ఏ. సుబ్బారావు గారు.
అంటూనే " ఏం ? మీ భుజం అలా అదిరిందేమిటి ? " అనడిగారు సుయోధనసార్వభౌమ పాత్రదారిని.
ఆయన ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటే " ఇప్పుడు అలా జరగదులెండి డైరెక్టర్ గారూ ! ఈసారి ఆయన భుజం మీద మెల్లగానే చెయ్య వేస్తాను " అన్నారు భీష్మాచార్య పాత్రలో జీవిస్తున్న నందమూరి తారకరామారావు గారు. ఆ మహానటుడితో నటించే అవకాశం కలిగినందుకు ఆనంద పారవశ్యంలో వున్న తనను ఆయన తన భుజం తట్టగానే ఒళ్ళు జలదరించి ఆ నటుడికి భుజం అదిరినట్లనిపించింది. అంతటి సూక్షమైన విషయాన్ని కూడా గ్రహించిన ఆ మహానటుడికి మనస్సులోనే నమస్కరిస్తూ రెండో టేక్ లో అద్భుతంగా చేసి తారకరాముడి ప్రశంసలు పొందారు.


ఈ సన్నివేశ చిత్రీకరణకు ముందు ఆ నటుడ్ని ఎన్టీయార్ కి పరిచయం చెయ్యగానే " మానవజన్మ దుర్లభం. అందులో అందర్నీ అలరించే నటుడిగా జన్మించడం సుకృతం. అది నిలబెట్టుకోవడం మన కర్తవ్యం " అంటూ నిండుమనసుతో ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వదించినట్లే ఆ తర్వాత కాలంలో అంతటి పేరు తెచ్చుకున్న ఆ నటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి. 

 ధూళిపాళ రంగస్థలం నుంచి చిత్రసీమకు మాయాబజార్ చిత్రంతో పరిచయమయ్యారు. అదే మాయాబజార్ చిత్రంతో అపర శకునిగా పేరుతెచ్చుకున్న సి. యస్. ఆర్. అనంతరం మళ్ళీ ఆ పాత్రలో అంతటి పేరు తెచ్చుకున్న నటుడు ధూళిపాళ. విలక్షణమైన పాత్రలెన్నో పోషించిన ఆయన చివరి దశలో సన్యాసాశ్రమం స్వీకరించారు. ఆయన స్వస్థలం గుంటూరులో హనుమంతుని ఆలయం నిర్మించారు.

 ఈరోజు ( ఏప్రిల్ 13 ) ధూళిపాళ సీతారామశాస్త్రి గారి వర్థంతి సందర్భంగా ఆయనకు కళానీరాజనాలు. 

Vol. No. 02 Pub. No. 201

గానగంధర్వుడి తొలి పాట... ? - జవాబులు


 కనుక్కోండి చూద్దాం - 40 - జవాబులు 


గాన గంధర్వుడు కే. జే. యేసుదాసు సంగీత రంగంలో సవ్యసాచి. కర్నాటక, హిందుస్తానీలతో బాటు తెలుగు సహా సుమారు పదిహేడు భాషలలో పాటలు పాడారు. 

1 ) యేసుదాసు పాడిన తొలి తెలుగు పాట ఏది ? 

 జవాబు :  ఓ... ! నిండు చందమామ...నిగనిగలా భామా !

2 ) ఆ పాట ఏ చిత్రంలోనిది ?

జవాబు :  1964 లో వచ్చిన ' బంగారు తిమ్మరాజు ' చిత్రంలోనిది.

3 ) ఆ పాట రచయిత, సంగీత దర్శకులు ఎవరు ?

జవాబు :  రచయిత - ఆరుద్ర , సంగీత దర్శకుడు - ఎస్. పి. కోదండపాణి

ఆ పాట ఇక్కడ వినండి......



Vol. No. 02 Pub. No. 198a

Tuesday, April 12, 2011

సీతారాముల కళ్యాణం చూతము రారండీ...!

చూచువారికి చూడముచ్చటట....
సీతారాముల కళ్యాణం చూతము రారండీ !
ఎన్నిసార్లు చూసినా అదొక కమనీయమైన వేడుక సీతారాముల కళ్యాణం
ఎన్నిసార్లు చేసినా అదొక ప్రజా సంక్షేమం కోరే లోక కళ్యాణం



 మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో ...................... 




Vol. No. 02 Pub. No. 200

Monday, April 11, 2011

ప్రత్యక్ష పురాణం

ఒకప్పటి మద్రాసు నగరంలోని స్వాగత్ హోటల్ లోని ఒక గది. ఇద్దరు వ్యక్తులు ఆ గది దగ్గరకు వచ్చి కాలింగ్ బెల్ నోక్కబోయారు. లోపలినుంచి ఏవో శబ్దాలు వినబడ్డాయి. అవేమిటో వినాలని ఇద్దరూ చెవులు రిక్కించారు. లోపల ఎవరో ఇద్దరు గొడవ పడుతున్నట్లున్నారు. చాలా తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరుగుతోంది. వాళ్ళకేమీ అర్థం కాలేదు. బెల్ నొక్కడం మానేసి అలా వింటూ వుండిపోయారు. కొంతసేపటికి లోపల్నుంచి శబ్దాలు ఆగిపోయాయి. ధైర్యం చేసి బెల్ నొక్కారు. తలుపు తెరుచుకుంది. లోపలి వ్యక్తి నవ్వుతూ ఈ ఇద్దర్నీ లోపలికి ఆహ్వానించారు. లోపలి వెళ్ళిన ఆ ఇద్దరూ అంతా పరిశీలనగా చూసారు. ఎక్కడా రెండవ వ్యక్తి కనబడలేదు. వారి అవస్థ గమనించిన ఆ గదిలోని వ్యక్తి విషయం అడిగారు. 

" ఇందాక ఈ గదిలో ఎవరో ఇద్దరు గొడవ పడినట్లు వినిపించింది. మీరు కాక ఎవరున్నారా అని చూస్తున్నాం " అన్నారిద్దరూ. 
దానికి లోపలి వ్యక్తి నవ్వి " ఇద్దరూ నేనే ! ఇంకొకరెవరూ ఇక్కడ లేరు. మీరు విన్న వాదన ఈ స్క్రిప్ట్ లోది. రేపు మీ షూటింగ్ కి కావాల్సిన సీన్లు సిద్ధం చేస్తున్నాను. ఆ సీన్లలో వాదించుకునేవారి సంభాషణలను నేను అనుకుంటూ రాస్తున్నానంతే ! " అన్నారు.  
అప్పటికి వచ్చిన వారికి విషయం అర్థమయింది. కుదుటపడ్డారు.

ఆ వచ్చినవారు జెమిని పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ శాఖ వాళ్ళు. ఆ సంస్థ అప్పట్లో నిర్మిస్తున్న ' భామావిజయం ' చిత్రం స్క్రిప్ట్ కోసం వచ్చిన సందర్భం. ఆ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ గారు.

రాధాకృష్ణ గారు సంభాషణలు రాసేటపుడు వాటిని ఆయా పాత్రల  స్వరబేధంతో పైకి అనుకుంటూ రాయడం అలవాటు. అది పరోక్షంగా వినే వాళ్లకు వేర్వేరు వ్యక్తులు మాట్లాడినట్లే వుండి ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతినిచ్చేది. అందుకే అందరూ నిద్రపోయే సమయంలో అర్థరాత్రి పూట రాయడం భమిడిపాటి వారికి అలవాటు. 

...... ఇదీ భమిడిపాటి రాధాకృష్ణ గారి ప్రత్యక్ష పురాణం

Vol. No. 02 Pub. No. 199

Sunday, April 10, 2011

గానగంధర్వుడి తొలి పాట... ?

 కనుక్కోండి చూద్దాం - 40 


గాన గంధర్వుడు కే. జే. యేసుదాసు సంగీత రంగంలో సవ్యసాచి. కర్నాటక, హిందుస్తానీలతో బాటు తెలుగు సహా సుమారు పదిహేడు భాషలలో పాటలు పాడారు. 

1 ) యేసుదాసు పాడిన తొలి తెలుగు పాట ఏది ? 

2 ) ఆ పాట ఏ చిత్రంలోనిది ? 

3 ) ఆ పాట రచయిత, సంగీత దర్శకులు ఎవరు ? 

Vol. No. 02 Pub. No. 198

Friday, April 8, 2011

ఎంత దూరమీ పయనం....

 ఎంత దూరమీ పయనం.... అంటూ సంగీత ప్రపంచంలోకి ప్రవేశించి తన విలక్షణమైన, మధురమైన గానంతో అలరించి సరిగా 22 సంవత్సరాల క్రితం దివి నుంచి భువికేగిన గంధర్వ గాయకుడు ఎ. ఎం. రాజా.

టాకీలతో బాటు 1931 లో చిత్తూరులో జిల్లా రామాపురంలో పుట్టి తన పందొమ్మిదవయేట మద్రాసులో అడుగుపెట్టి బి. ఏ. లో చేరారు. అప్పుడు జరిగిన సంగీతం పోటీలలో గెలుచుకున్న ప్రథమ బహుమతి ఆయనకు ' ఎంత దూరమీ పయనం ..... ' అనే పాటను పాడే అవకాశం ఇచ్చింది. హెచ్. ఎం. వి. సంస్థ ఈ పాటను ప్రైవేటు రికార్డుగా విడుదల చేసింది. తన  ఇరవైయవయేట ఏ.వి. యమ్. వారి ' సంసారం ' తమిళ చిత్రంతో 1951 లో చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జెమిని వారి ' బహుత్ దిన్ హుయే ' హిందీ చిత్రంలో పాడారు. ' మరు మగళ్ ' అనే మళయాళ చిత్రానికి అనువాదమైన ' ఆకలి ' అనే చిత్రానికి తోలి తెలుగు పాట పాడారు. 

1954 వ సంవత్సరం రాజా సంగీత జీవితం మలుపు తిరిగిన సంవత్సరం. ఆ సంవత్సరం విడుదలైన రాజకపూర్ అనువాద చిత్రం ' ప్రేమలేఖలు ' చిత్రంలో జిక్కితో కలసి పాడిన పాటలు రాజాకు ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టాయి.  ఆ తర్వాత వరుసగా ఆదుర్తి సుబ్బారావు గారి మొదటి చిత్రం ' అమరసందేశం ' , ' విప్రనారాయణ ' , ' మిస్సమ్మ ' ..... ఇలా చెప్పుకుంటూ పొతే చాలా చిత్రాలలో అనేక పాటలు రాజా స్వంతమయ్యాయి. ఈ ప్రభంజనం అప్పటికే ప్రసిద్ధుడైన గాయకుడు ఘంటసాలకు కొంతకాలం అవరోధమైంది. ఆయన చేత పాడించుకునే వారే కరువయ్యారు. బి. ఎన్. రెడ్డి గారి దర్శకత్వంలో పొన్నలూరి బ్రదర్స్ వారి ' భాగ్యరేఖ ' చిత్రంలో రాజా పాడిన పాటలు ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. అందులో ఆయన పాటలు ప్రాచుర్యం పొందడంతో ఆ నిర్మాతలే తమ తర్వాత చిత్రం ' శోభ ' తో 1958 లో రాజాను సంగీత దర్శకుడిని చేసారు.

ఎన్నో చిత్రాల్లో ప్రేమ గీతాలు పాడిన ఏ. ఎం. రాజా, జిక్కి జంట  ఆ సంవత్సరమే తమ గాన బంధాన్ని శాశ్వత సంబంధంగా మార్చుకున్నాయి.

రాజా సంగీతం సమకూర్చిన ' కళ్యాణ పరిశు ' తమిళ చిత్రం, దాని తెలుగు రూపమైన ' పెళ్ళికానుక ' చిత్రాలకు  అవార్డులతోబాటు ప్రేక్షకుల రివార్డులు కూడా భారీగానే లభించాయి.

రాజా మృదుమధురమైన పాటలను పాడడం, స్వరపరచడమే కాక 1953 లో వచ్చిన ' పక్కింటి అమ్మాయి ' చిత్రంలో ప్రధాన పాత్ర ధరించారు కూడా !

సుమారు వివిధ భాషలలో పదివేల పాటలను పాడి,  సుమారు వంద చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏ. ఎం. రాజా జీవితం విషాదాంతం. మదురైలో సంగీత కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తూ కదిలే రైలు ఎక్కబోయి ప్లాట్ ఫారం మీదనుండి జారిపోయి రైలుకి, ప్లాట్ ఫారం కి మధ్య ఇరుక్కుని చనిపోయారు. 
ఎంత దూరమీ పయనం.... అంటూ మొదలుపెట్టిన ఆయన సంగీత ప్రయాణం ఈ సంఘటనతో ముగిసింది.


ఈరోజు ( ఏప్రిల్ ) 8 వ తేదీ ఏ. ఎం. రాజా వర్థంతి సందర్భంగా
ఆ అమరగాయకునికి స్వరనీరాజనాలు అర్పిస్తూ ........ 



Vol. No. 02 Pub. No. 197

Thursday, April 7, 2011

ఆరు నూర్లు

 ఆరు నూర్లు. షట్ శతం........ ఎలా పలికినా ఆరు వందలే ! 

నిన్న సుజాత గారి మరణం గురించి రాస్తూ ఒక విషయం గమనించాను. ఇప్పటివరకూ ఎప్పుడూ లెక్కలు చూసుకోకపోయినా నిన్న గమనించిన విషయం..... 
14 ఆగష్టు 2008 న ' శిరాకదంబం ' ప్రారంభించినప్పటి నుంచి నిన్నటి వరకూ అంటే 06 మార్చి 2011 వరకూ గడిచినవి 600 రోజులు. టపాల సంఖ్య 596 . అంటే ఇంకొక నాలుగు టపాలు ప్రచురిస్తే రెండూ సమానమయ్యే అవకాశం వుంది. అందుకే అనుకోకుండా కలిసొచ్చిన ఈ అవకాశాన్ని అందుకోవాలని ఇంతకుముందు రాసి పెట్టుకున్న వాటిని కొంచెం సంస్కరించి ప్రచురించాను. వీటితో  ఈరోజు వరకూ  ' శిరాకదంబం ' ద్వారా వెలువడినవి మొత్తం 600 టపాలు. ఈ టపాయే 600 వ టపా. 



 ఇందులో ఎన్ని టపాలు చదువరులకు నచ్చాయో, ఎన్ని నచ్చలేదో నేను ఖచ్చితంగా అంచనా వెయ్యలేను గానీ లోకో భిన్న రుచిః అన్నట్లు అందర్నీ మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదేమో ! అందులోను విభిన్న విషయాలు రాస్తున్నపుడు, గతంలో  ఎక్కడైనా ప్రచురిచతమైన లేదా విన్న విషయాలు ఎత్తి రాసినపుడు సహజంగానే కొన్ని బేధాభిప్రాయాలు తలెత్తుతాయి. రెండు, మూడు సందర్భాలలో తప్ప నాకు ఆ సమస్య ఎదురు కాలేదు. అవి కూడా పెద్ద సమస్యలు కావు. అలాగని నేను ప్రచురించేవన్నీ నూటికి నూరు శాతం సరైనవేనని నేను భావించడంలేదు. నేను కూడా ఎక్కడో అక్కడ చదివో, చూసో రాసినవే ! అయితే నేను ప్రచురించే ప్రతి అంశం ఒకచోట మాత్రమే కాకుండా వీలైనన్ని ఎక్కువచోట్ల పరిశీలించి వాస్తవానికి దగ్గరగా వుంది అనిపించినప్పుడే ప్రచురించడానికి సాహసిస్తాను. కొన్ని అలా పరిశీలించడానికి వీలు కాకపోవచ్చు. ముఖ్యంగా చలోక్తుల విషయంలో... కొన్ని ఛలోక్తులు కొంతమంది పెద్దల పేర చలామణీలో వుంటాయి. వాటిలో నిజనిజాలేమిటో మనకి తెలీదు. తెలుసుకోవడం కష్టసాధ్యం కూడా ! అటువంటప్పుడు ఆ ఛలోక్తిని ఆస్వాదించడమే సరైనదని సర్డుకుపోవడమే మంచిదేమో !
 
ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యలు 1832. అందులో నా జవాబులు సుమారుగా 650 తీసేస్తే  మిగిలినవి 1182. వీటిని విశ్లేషిస్తే సుమారుగా అన్నీ నన్ను ప్రోత్సహిస్తూ రాసినవే ! ప్రశంసలు ఎక్కువగానే వున్నా అవన్నీ హృదయపూర్వకంగా మెచ్చుకున్నవేనని నమ్ముతాను. ఎందుకంటే ఈ బ్లాగు మిత్రులేవరికీ అనవసరంగా మెచ్చుకోవలసిన అవసరం లేదు. దానివల్ల వాళ్ళకి ఒరిగేది కూడా ఏమీ లేదు. అలాగే నా రాతల్లో దొర్లిన చిన్న చిన్న తప్పుల్ని కూడా ఎత్తి చూపి నన్ను నేను సరి చేసుకోవడానికి దోహదపడ్డ మిత్రులు కూడా వున్నారు. అంతేకానీ నా రాతల్ని వ్యతిరేకించిన వారు గానీ, వాటిని వివాదాస్పదంగా చూసిన వారు గానీ దాదాపుగా లేరనే చెప్పాలి. ఈ దృష్ట్యా నా రాతలు నచ్చినా, నచ్చకపోయినా వ్యతిరేకించినవారు మాత్రం లేరనే అనుకోవచ్చేమో !

విభిన్న విషయాలలో కొందరికి కొన్ని నచ్చుతాయి. మరికొన్ని ఇంకొందరికి నచ్చుతాయి. ఇంకా కొన్ని ఎవరికీ నచ్చకపోవచ్చు. నాకు మాత్రం అన్నీ నచ్చే రాస్తాను. అంతమాత్రం చేత చదవరులందరికీ కూడా నచ్చి తీరాలని అనుకోను. కానీ కొన్ని విషయాలు రాసేటపుడు మాత్రం ఈ విషయం మీద ఎవరైనా స్పందిస్తే బాగుండుననిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొన్ని విషయాల మీద కొన్ని అనుమానాలు మనసులో వున్నపుడు ఎవరైనా వాటికి స్పందించి తమకు తెలిసిన విషయాలు చెబితే సరి చేసుకోవచ్చునని ఎదురుచూస్తాను. కానీ అలా సరి చేసిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటప్పుడు నా దగ్గరున్న సమాచారం సరైనదేనని నమ్మేయ్యాల్సొస్తుంది.

రాశి ఎక్కువగానే వున్నా వాసి తక్కువేమోననే శంక నన్ను పీడిస్తూ ఉంటోంది. ఎందుకంటే ఎవరో రాసిన విశేషాలో, ఎవరో చెప్పిన చలోక్తులో నేను తిరగ రాయడమే కానీ నా స్వంత రచనలనేవి ఎక్కువగా లేకపోవడం వలన. ఈ విషయంలో కొత్తపాళీ గారి లాంటి మిత్రులు నన్ను హెచ్చరించారు ( ప్రోత్సహించారు ) కూడా ! కాకపొతే కొన్నిసార్లు సమయాభావమో, మరికొన్నిసార్లు నేను రాసింది నాకు నచ్చకో ప్రచురించడం లేదు. అలా ప్రచురించకుండా డ్రాఫ్ట్ లు గా ఉండిపోయినవి, కాగితాల మీద, సిస్టం ఫైళ్లలోనూ చాలా వున్నాయి. వీటన్నిటికంటే ముందు నా ముందు కొండలా ఉండిపోయిన పాత పత్రికల ఖజానా ! ఇప్పటివరకూ ఎంత రాసినా నా సేకరణలో ఇంకా పావు వంతుకు కూడా పూర్తి కాలేదు. ఒక్కోసారి ఎంపిక కూడా కష్టమైపోతోంది. ఇక స్వంత రచనలు కూడా ప్రణాళిక ప్రకారం వారానికొకటైనా ప్రచురించాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఇకనైనా గట్టిగా ప్రయత్నించాలి. అప్పుడైనా విమర్శనా వ్యాఖ్యలోస్తాయేమో చూడాలి.

ఇక ఈ 600 రోజుల బ్లాగింగులో నేను సంపాదించుకున్న ఆస్తి మంచి మిత్రబృందం. ముందే చెప్పినట్లు నన్ను గానీ, నా రాతల్ని గానీ ద్వేషించేవారు లేరనే అనుకుంటున్నాను. ఒకవేళ వున్నా మొహమాటానికో, మరో కారణం చేతో ఎవరూ బయిటపడలేదు. శిరాకదంబం ' అబిమాన మిత్రులు ' గా చేరిన వారే కాకుండా క్రమం తప్పకుండా అనుసరిస్తున్నవారు ఇంకా చాలామందే వున్నారు. అలాగే ఈ బ్లాగు పుణ్యమాని ట్విటర్ లోను, ఫేస్ బుక్ లోను... ఇంకా ఇతర సోషల్ సైట్ల ద్వారా అనుసరిస్తున్న వారిలో చాలా మంది ప్రముఖులు కూడా వుండడం నాకు చాలా ఆనందం కలిగిస్తున్న విషయం. ఆయా సైట్లలో నాకు మిత్రులుగా చేరి ప్రోత్సహిస్తున్న వారి సంఖ్య వెయ్యి దాటింది. బ్లాగర్ వారి లెక్కల ప్రకారం ప్రతి రోజూ శిరాకదంబం వీక్షిస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. ఇంతకుముందు రోజూ 100 నుండి 200 మధ్య వుండే వీక్షకుల సంఖ్య గత నాలుగయిదు నెలలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 300 నుంచి 800 మధ్య వుంటోంది. నూతన్ ప్రసాద్ గారి స్మరణగా ' నిత్య నూతన ప్రసాదం ' ప్రచురించిన రోజున ఆ సంఖ్య 769 , ఉగాది ఊసులు ప్రచురించిన ఉగాది రోజున 789 గా వుంది. ఈ లెక్కలు నిజమే అయితే ఆనందమే ! ఏది  ఏమైనా ఇలా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వీక్షకుల సంఖ్య పెరగడం కూడా మంచి బలాన్నిస్తోంది. ఉపయోగించే విషయాన్ని అందించినా, అందించకపోయినా హాని కలిగించే విషయాలను అందించడం లేదనే విషయం వీక్షకుల పెరుగుదలను బట్టి అర్థమవుతోంది. ఇది బలుపే గానీ వాపు కాదేమో !

చివరగా ఈ బ్లాగు బంధంతో కొంతమంది మిత్రులు నాకు కేవలం ప్రోత్సాహమివ్వడమే కాకుండా మైల్స్ ద్వారా కూడా తమకు తెలిసిన సమాచారాన్ని పంచుకోవడం, కొన్ని కొత్త కొత్త అంశాలను సూచించడం చెయ్యడం నా అదృష్టం. అయితే అలా నా టపాలను సంపన్నం చేసిన వారి పేర్లు కృతజ్ఞతగా ప్రచురించకపోవడం కేవలం వారి సూచన మేరకే కానీ నా కృతఘ్నత కాదు. అజ్ఞాతంగానే ఉండడానికి ఇష్టపడ్డ నా శ్రేయోభిలాషులైన మిత్రులకు ఇలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇలాగే మిత్రులందరి ప్రోత్సాహం, సహకారం వుంటే బ్లాగుల్లోనే మరికొన్ని ప్రయోగాలు చెయ్యాలని వుంది.
 శత సహస్ర వందనాలు 
ఆరు వందల రోజుల్లో షట్ శత టపాలకు రోజుకు సరాసరి ఆరు నూర్ల వీక్షకుల ప్రోత్సాహమే కారణం. వారందరికీ శత సహస్ర వినయపూర్వక వందనాలు. అలాగే నాకు అణువణువునా సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న నా మిత్రుడు, మా కంపెనీ చైర్మన్ అయిన శ్రీ కూచిమంచి సుబ్రహ్మణ్యం గారికి, మా కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు చెప్పక తప్పదు. ఈ ప్రోత్సాహం ఇలాగే ఇకముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ......

 మరో విశేషం :  ఇప్పుడే తెలిసిన మరో విశేషం మిత్రులతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. బ్లాగర్ వాళ్ళు  2010 మే నెలనుంచి వీక్షకుల లెక్కలు తెలిపే సదుపాయం ప్రారంభించారు. ఈ పదకొండు నెలల ఏడు రోజులలో ఈ క్షణం వరకూ ' శిరాకదంబం '  వీక్షించిన వారి సంఖ్య 50,125 . ముఖ్యంగా ఈరోజు వీక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో  1111 .  

Vol. No. 02 Pub. No.196

అసలు పేరు - కొసరు పేరు

 ఇప్పటి సినిమాలకు అసలు పేరు ఒకటి, కొసరు పేరు మరొకటి ఉంటున్నాయి. అంటే అసలు పేరు ఒకటైతే, దానికో ట్యాగ్ లైన్ అంటూ కొసరు పేరు తగిలిస్తున్నారు. దీని అవసరానవసరాలు ప్రక్కన పెడితే కొన్నిసార్లు ఈ కొసరు పేర్లు అసలు పేరుకు కొనసాగింపుగా, మరికొన్నిసార్లు వివరణగా, ఇంకొన్నిసార్లు గందరగోళం లేకుండా చేసేందుకు ఉపయోగపడతాయి. తెలుగు చలనచిత్ర రంగ తొలిరోజుల్లో కొన్ని చిత్రాలకు కూడా ఇలాగే రెండు మూడు పేర్లు పెట్టడం జరిగింది.

వాహినీ పిక్చర్స్ వారు 1939 లో  నాగయ్య, కాంచనమాలతో ' వందేమాతరం  ' చిత్రాన్ని నిర్మించారు. పేరు దేశభక్తిని సూచిస్తున్నా ఆ చిత్ర ప్రధాన కథాంశం మాత్రం నిరుద్యోగ సమస్య. అయితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇలా జాతీయ భావాలు ప్రచారం చేసే చిత్రాలను నిషేధించేది. ఆ భయం చేత ఆ చిత్రానికి ' మంగళసూత్రం ' అనే కొసరు పేరు పెట్టారు. ఇప్పటి ట్యాగ్ లైన్ లాగే వందేమాతరం పేరు క్రింద చిన్న అక్షరాలతో మంగళసూత్రం కనిపిస్తుంది. 

ఇలా కొసరు పేరుగా వున్న ' మంగళసూత్రం ' 1944 ప్రాంతంలో అసలు పేరుగా మారి రెండు కొసరు పేర్లను తనతో కలుపుకుంది. ఆ వైనం ఏమిటంటే........ గతంలో సిక్కిం లెఫ్టినెంట్ గవర్నర్ గాను, మహారాష్ట్ర కు గవర్నర్ గాను పనిచేసిన కోన ప్రభాకరరావు గారు నటుడు, నిర్మాత కూడా. ఆయన తొలుతగా నిర్మించిన వినోదాత్మక చిత్రానికి ' ఇది మా కథ ' అని పేరు పెట్టారు. తర్వాత అంతకంటే ' మా యిద్దరి కథ ' అన్న పేరు సరిగా సరిపోతుందని భావించి మార్చారు. కానీ విడుదలకు ముందు ఎందుకో అదే చిత్రానికి ' మంగళసూత్రం ' అన్న పేరును ఖాయం చేసారు. ఇన్నిసార్లు పేర్లు ప్రకటించాక ప్రేక్షకులు తికమక పడతారేమోనని మంగళసూత్రం పేరు క్రింద చిన్న చిన్న అక్షరాలతో ఇది మా కథ, మా యిద్దరి కథ పేర్లు కూడా వేసారు. 

అలా గమ్మత్తుగా మంగళసూత్రం ఒకసారి కొసరు పేరైతే, మరోసారి అసలు పేరయింది.  

Vol. No. 02 Pub. No. 195

సుజాత భక్తి

 రెండు మనసులు కలిస్తే  వాటి మధ్య కులాలకు, మతాలకు తావుండదు. దీనికి ఉదాహరణ సుజాత వైవాహిక జీవితం. సుజాత హిందువైతే ఆమె భర్త జయకర్ క్రిస్టియన్. ఈ బేధం వారి ప్రేమకు గానీ, వైవాహిక జీవనానికి గానీ అడ్డు రాలేదు.

గతంలో పేరుపొందిన తారలు షూటింగ్ కి తమతో బాటు విరామంలో విశ్రాంతి తీసుకోవడానికి స్వంత కుర్చీలను కూడా తీసుకెళ్ళేవారు. అవి మారిపోకుండా వాటి మీద తమ పేర్లు రాయించుకోవడమో, కవర్లపైన ఎంబ్రాయిడరీ చేయించుకోవడమో చేసేవారు. సుజాత కుర్చీపైన మాత్రం ఆమె భర్త జయకర్ పేరు వుండేది.

సుజాతకు భక్తి ఎక్కువ. ఇంట్లో ఆమెకు ప్రత్యేకంగా పూజ గది కూడా వుంది. షూటింగ్ కి బయిలుదేరిన ప్రతీసారి తమ వీధిలో వున్న గుడిలోని గణపతిని ప్రార్థించడం ఆమెకు అలవాటు. షూటింగ్ కి వచ్చినపుడు కూడా ఆమె చేతిలో ' శ్రీరామజయం ' పుస్తకం వుండేది. విరామంలో ఆమె ఆ పుస్తకంలో శ్రీరామజయం రాస్తూ వుండేది. అలా రోజుకి కనీసం వందనుంచి వెయ్యి వరకూ వీలుని బట్టి రాస్తూ వుండేది. 

Vol. No. 02 Pub. No. 194

ప్రపంచ ఆరోగ్యం

ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజల ఆరోగ్య రక్షణకై తీసుకోవాల్సిన చర్యలను ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం ఆరోగ్య దినోత్సవ థీమ్ గా ' ఔషధ నిరోధంపై పోరాటం ' ప్రకటించింది. ఈరోజు చర్య తీసుకోకుంటే రేపు నివారణ ఉండదని కూడా తమ ప్రకటనలో చేర్చింది. అంతేకాదు. సూక్ష్మజీవుల నిర్మూలన,  నిరోధం కోసం పోరాటం చెయ్యాలని.... తద్వారా మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పూనుకుంది. దానికోసం ఓ షట్ సూత్ర ప్రణాళికను రూపొందించింది. ఆ ప్రణాళికలోని అంశాలు ......

1 . ప్రజల భాగస్వామ్యంతో జవాబుదారీతనంతో ఒక సమగ్ర ఆర్ధిక ప్రణాళికను రూపొందించి అమలు చెయ్యాలి.  
2 . పరిశోధనశాలలను అభివృద్ధి చెయ్యడంతో బాటు పర్యవేక్షణను కూడా బలోపేతం చెయ్యాలి. 
3 . అవసరమైన పరిమాణంలో అత్యవసర మందుల పంపిణీని నిరంతరాయంగా ఖచ్చితంగా జరిగేటట్లు  చూడాలి. 
4 . పాడి పరిశ్రమతోబాటుగా అన్ని రంగాల్లోనూ విచ్చలవిడిగా జరుగుతున్న మందుల వాడకాన్ని నియత్రించడం, హేతుబద్ధమైన వాడకాన్ని మాత్రమే ప్రోత్సహించడం చెయ్యాలి. రోగుల విషయంలో సరైన శ్రద్ధ తీసుకోవాలి.
5 . అంటువ్యాధుల వ్యాప్తిని నియత్రించడం, నిరోధించడం కట్టుదిట్టంగా అమలు చెయ్యాలి. 
6 . కొత్త విధానాల పరిశోధనను అభివృద్ధి చెయ్యాలి. 

ఔషధ నిరోధంపై పోరాటం
ఈరోజు చర్య లేకుంటే రేపు నివారణ లేదు

Vol. No. 02 Pub. No. 193

సు ' జాత '

 రోజూ ఏదో సమయంలో నెట్ చూడడం లేదా టీవీ వార్తలు చూడడం అలవాటు. ఈరోజు కొంచెం పనివత్తిడి ఎక్కువగా వుండి సాయింత్రం వరకూ ఏదీ చూడలేదు. అందుకే సుజాత గారి మరణవార్త ఆలస్యంగా తెలిసింది. తెలిసాక ఏదో రాయాలని అనుకున్నాను గానీ ఏం రాయాలో తెలియలేదు.



మనకి ప్రస్తుతం మంచి నటులు, నటీమణులు కరువై పోతున్నారు. వారసత్వాలు, కులమతాలు, ఆశ్రిత పక్షపాతాలు, కొన్నిచోట్ల డబ్బు, ఇతర ఆకర్షణలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మంచి నటీనటులు దొరుకుతారని కోరుకోవడం అత్యాశేనేమో ! నటన కంటే వీటికే పెద్ద పీట వేస్తోంది చిత్ర పరిశ్రమ. అలాంటప్పుడు గత తరం నాయికగా, ఈ తరం క్యారెక్టర్ నటిగా రెండు తరాల మధ్య వారధిగా నిలిచిన సుజాత కనుమరుగైపోవడం బాధాకరం. నెమ్మదిగా ఒకరొకరే వెళ్ళిపోతున్నారు. అంటే ఇకపైన మంచి నటన అనేది చిత్రరంగంలో కరువైపోతుందేమో !

తెలుగుని తెలుగులా మాట్లాడలేని, అసలు తెలుగే రాని, అంగాంగ ప్రదర్శనే నటన అని, ప్రేక్షకులు కూడా తమనుంచి అదే కోరుకుంటున్నారనే భ్రమలో తాము ఉండి, పరిశ్రమను వుంచి ప్రేక్షకుల నెత్తిన బలవంతంగా అవే రుద్దుతున్న పరాయి భాషా నటీమణులు సుజాతను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. నటనలో మాత్రమే కాదు. ప్రవర్తనలో కూడా ఆమె నుంచి నేర్చుకోవలసింది కూడా ఎంతైనా ఉంది. భాషా బేధం లేకుండా ఇతర భాషలు కూడా నేర్చుకుని సంభాషణలను స్వంతం చేసుకుని, అర్థం చేసుకుని వాటిలోని భావ ప్రకటనను తన నటనలో చూపగల దిట్ట సుజాత.

ఆమె మరణంతో మరో మంచి నటీమణిని పరిశ్రమ కోల్పోయింది. ఆమెకు ఇదే అశ్రు నివాళి.


Vol. No. 02 Pub. No. 192

Tuesday, April 5, 2011

బళ్ళైన ఓడలు

ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ తారామణి అంజలీదేవి.  వంద చిత్రాలు పూర్తిచేశాక రిటైర్ అయిపోవాలనుకున్నారు. ఆ కారణంగా కొంతకాలం సినిమాలను అంగీకరించలేదు. ఇది 1960 నాటి మాట. అప్పట్నుంచీ ఆమె చాలా కష్టాలను చవిచూశారు. సుమారు పద్దెమినిది సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సంపదంతా ఆదాయపు పన్ను బకాయి క్రింద పోయింది. వ్యాపార ప్రయత్నం చేస్తే బెడిసికొట్టింది. అప్పులు తెచ్చి అశోక్ కుమార్, మనోజ్ కుమార్, వైజయంతిమాల తారాగణంగా ' ఫూలోం సే సజో ' అనే హిందీ చిత్రం నిర్మిస్తే దురదృష్టవశాత్తూ అది పరాజయం పాలయ్యింది. ఫైనాన్షియర్స్ వత్తిడి అధికమైంది. ఆమె ఆస్తిపాస్తుల్ని కోర్టు స్వాధీనం చేసుకుని వేలం వేసారు. ఇదంతా చలనచిత్ర పరిశ్రమ కళ్ళారా చూసింది. రకరకాల పుకార్లు షికారు చేసాయి. అంజలికి మతి చెడిందన్నారు. ఎక్కడికో పారిపోయిందన్నారు. ఆత్మహత్యా ప్రయత్నం చేసిందన్నారు.

అంజలీదేవి సత్య సాయిబాబాకు భక్తురాలని అందరికీ తెలిసిన విషయమే ! ఆ సమయంలో ఆమె సత్య సాయిబాబా దర్శనం చేసుకుంది. ఆయన ' ఇది నీకు పరీక్షా సమయం. ధైర్యంతో ఎదుర్కో. చీకటి పోయి వెన్నెల వస్తుంది ' అని ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఆమెకు ఒక తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ' అక్కడనుంచి ఆ భగవానుని దీవెనతోనే క్రమ క్రమంగా కోలుకున్నాను' అన్నారామె. 

ఓడలు బళ్ళైన కష్టకాలంలో ధైర్యమిచ్చే మాటలే కొండంత అండనిస్తాయి. అందుకే అంజలీదేవికి సత్య సాయిబాబా మీద అంత గురి కుదిరిందేమో !   

Vol. No. 02 Pub. No. 191
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం