Thursday, April 7, 2011

ఆరు నూర్లు

 ఆరు నూర్లు. షట్ శతం........ ఎలా పలికినా ఆరు వందలే ! 

నిన్న సుజాత గారి మరణం గురించి రాస్తూ ఒక విషయం గమనించాను. ఇప్పటివరకూ ఎప్పుడూ లెక్కలు చూసుకోకపోయినా నిన్న గమనించిన విషయం..... 
14 ఆగష్టు 2008 న ' శిరాకదంబం ' ప్రారంభించినప్పటి నుంచి నిన్నటి వరకూ అంటే 06 మార్చి 2011 వరకూ గడిచినవి 600 రోజులు. టపాల సంఖ్య 596 . అంటే ఇంకొక నాలుగు టపాలు ప్రచురిస్తే రెండూ సమానమయ్యే అవకాశం వుంది. అందుకే అనుకోకుండా కలిసొచ్చిన ఈ అవకాశాన్ని అందుకోవాలని ఇంతకుముందు రాసి పెట్టుకున్న వాటిని కొంచెం సంస్కరించి ప్రచురించాను. వీటితో  ఈరోజు వరకూ  ' శిరాకదంబం ' ద్వారా వెలువడినవి మొత్తం 600 టపాలు. ఈ టపాయే 600 వ టపా. 



 ఇందులో ఎన్ని టపాలు చదువరులకు నచ్చాయో, ఎన్ని నచ్చలేదో నేను ఖచ్చితంగా అంచనా వెయ్యలేను గానీ లోకో భిన్న రుచిః అన్నట్లు అందర్నీ మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదేమో ! అందులోను విభిన్న విషయాలు రాస్తున్నపుడు, గతంలో  ఎక్కడైనా ప్రచురిచతమైన లేదా విన్న విషయాలు ఎత్తి రాసినపుడు సహజంగానే కొన్ని బేధాభిప్రాయాలు తలెత్తుతాయి. రెండు, మూడు సందర్భాలలో తప్ప నాకు ఆ సమస్య ఎదురు కాలేదు. అవి కూడా పెద్ద సమస్యలు కావు. అలాగని నేను ప్రచురించేవన్నీ నూటికి నూరు శాతం సరైనవేనని నేను భావించడంలేదు. నేను కూడా ఎక్కడో అక్కడ చదివో, చూసో రాసినవే ! అయితే నేను ప్రచురించే ప్రతి అంశం ఒకచోట మాత్రమే కాకుండా వీలైనన్ని ఎక్కువచోట్ల పరిశీలించి వాస్తవానికి దగ్గరగా వుంది అనిపించినప్పుడే ప్రచురించడానికి సాహసిస్తాను. కొన్ని అలా పరిశీలించడానికి వీలు కాకపోవచ్చు. ముఖ్యంగా చలోక్తుల విషయంలో... కొన్ని ఛలోక్తులు కొంతమంది పెద్దల పేర చలామణీలో వుంటాయి. వాటిలో నిజనిజాలేమిటో మనకి తెలీదు. తెలుసుకోవడం కష్టసాధ్యం కూడా ! అటువంటప్పుడు ఆ ఛలోక్తిని ఆస్వాదించడమే సరైనదని సర్డుకుపోవడమే మంచిదేమో !
 
ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యలు 1832. అందులో నా జవాబులు సుమారుగా 650 తీసేస్తే  మిగిలినవి 1182. వీటిని విశ్లేషిస్తే సుమారుగా అన్నీ నన్ను ప్రోత్సహిస్తూ రాసినవే ! ప్రశంసలు ఎక్కువగానే వున్నా అవన్నీ హృదయపూర్వకంగా మెచ్చుకున్నవేనని నమ్ముతాను. ఎందుకంటే ఈ బ్లాగు మిత్రులేవరికీ అనవసరంగా మెచ్చుకోవలసిన అవసరం లేదు. దానివల్ల వాళ్ళకి ఒరిగేది కూడా ఏమీ లేదు. అలాగే నా రాతల్లో దొర్లిన చిన్న చిన్న తప్పుల్ని కూడా ఎత్తి చూపి నన్ను నేను సరి చేసుకోవడానికి దోహదపడ్డ మిత్రులు కూడా వున్నారు. అంతేకానీ నా రాతల్ని వ్యతిరేకించిన వారు గానీ, వాటిని వివాదాస్పదంగా చూసిన వారు గానీ దాదాపుగా లేరనే చెప్పాలి. ఈ దృష్ట్యా నా రాతలు నచ్చినా, నచ్చకపోయినా వ్యతిరేకించినవారు మాత్రం లేరనే అనుకోవచ్చేమో !

విభిన్న విషయాలలో కొందరికి కొన్ని నచ్చుతాయి. మరికొన్ని ఇంకొందరికి నచ్చుతాయి. ఇంకా కొన్ని ఎవరికీ నచ్చకపోవచ్చు. నాకు మాత్రం అన్నీ నచ్చే రాస్తాను. అంతమాత్రం చేత చదవరులందరికీ కూడా నచ్చి తీరాలని అనుకోను. కానీ కొన్ని విషయాలు రాసేటపుడు మాత్రం ఈ విషయం మీద ఎవరైనా స్పందిస్తే బాగుండుననిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొన్ని విషయాల మీద కొన్ని అనుమానాలు మనసులో వున్నపుడు ఎవరైనా వాటికి స్పందించి తమకు తెలిసిన విషయాలు చెబితే సరి చేసుకోవచ్చునని ఎదురుచూస్తాను. కానీ అలా సరి చేసిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటప్పుడు నా దగ్గరున్న సమాచారం సరైనదేనని నమ్మేయ్యాల్సొస్తుంది.

రాశి ఎక్కువగానే వున్నా వాసి తక్కువేమోననే శంక నన్ను పీడిస్తూ ఉంటోంది. ఎందుకంటే ఎవరో రాసిన విశేషాలో, ఎవరో చెప్పిన చలోక్తులో నేను తిరగ రాయడమే కానీ నా స్వంత రచనలనేవి ఎక్కువగా లేకపోవడం వలన. ఈ విషయంలో కొత్తపాళీ గారి లాంటి మిత్రులు నన్ను హెచ్చరించారు ( ప్రోత్సహించారు ) కూడా ! కాకపొతే కొన్నిసార్లు సమయాభావమో, మరికొన్నిసార్లు నేను రాసింది నాకు నచ్చకో ప్రచురించడం లేదు. అలా ప్రచురించకుండా డ్రాఫ్ట్ లు గా ఉండిపోయినవి, కాగితాల మీద, సిస్టం ఫైళ్లలోనూ చాలా వున్నాయి. వీటన్నిటికంటే ముందు నా ముందు కొండలా ఉండిపోయిన పాత పత్రికల ఖజానా ! ఇప్పటివరకూ ఎంత రాసినా నా సేకరణలో ఇంకా పావు వంతుకు కూడా పూర్తి కాలేదు. ఒక్కోసారి ఎంపిక కూడా కష్టమైపోతోంది. ఇక స్వంత రచనలు కూడా ప్రణాళిక ప్రకారం వారానికొకటైనా ప్రచురించాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఇకనైనా గట్టిగా ప్రయత్నించాలి. అప్పుడైనా విమర్శనా వ్యాఖ్యలోస్తాయేమో చూడాలి.

ఇక ఈ 600 రోజుల బ్లాగింగులో నేను సంపాదించుకున్న ఆస్తి మంచి మిత్రబృందం. ముందే చెప్పినట్లు నన్ను గానీ, నా రాతల్ని గానీ ద్వేషించేవారు లేరనే అనుకుంటున్నాను. ఒకవేళ వున్నా మొహమాటానికో, మరో కారణం చేతో ఎవరూ బయిటపడలేదు. శిరాకదంబం ' అబిమాన మిత్రులు ' గా చేరిన వారే కాకుండా క్రమం తప్పకుండా అనుసరిస్తున్నవారు ఇంకా చాలామందే వున్నారు. అలాగే ఈ బ్లాగు పుణ్యమాని ట్విటర్ లోను, ఫేస్ బుక్ లోను... ఇంకా ఇతర సోషల్ సైట్ల ద్వారా అనుసరిస్తున్న వారిలో చాలా మంది ప్రముఖులు కూడా వుండడం నాకు చాలా ఆనందం కలిగిస్తున్న విషయం. ఆయా సైట్లలో నాకు మిత్రులుగా చేరి ప్రోత్సహిస్తున్న వారి సంఖ్య వెయ్యి దాటింది. బ్లాగర్ వారి లెక్కల ప్రకారం ప్రతి రోజూ శిరాకదంబం వీక్షిస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. ఇంతకుముందు రోజూ 100 నుండి 200 మధ్య వుండే వీక్షకుల సంఖ్య గత నాలుగయిదు నెలలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 300 నుంచి 800 మధ్య వుంటోంది. నూతన్ ప్రసాద్ గారి స్మరణగా ' నిత్య నూతన ప్రసాదం ' ప్రచురించిన రోజున ఆ సంఖ్య 769 , ఉగాది ఊసులు ప్రచురించిన ఉగాది రోజున 789 గా వుంది. ఈ లెక్కలు నిజమే అయితే ఆనందమే ! ఏది  ఏమైనా ఇలా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వీక్షకుల సంఖ్య పెరగడం కూడా మంచి బలాన్నిస్తోంది. ఉపయోగించే విషయాన్ని అందించినా, అందించకపోయినా హాని కలిగించే విషయాలను అందించడం లేదనే విషయం వీక్షకుల పెరుగుదలను బట్టి అర్థమవుతోంది. ఇది బలుపే గానీ వాపు కాదేమో !

చివరగా ఈ బ్లాగు బంధంతో కొంతమంది మిత్రులు నాకు కేవలం ప్రోత్సాహమివ్వడమే కాకుండా మైల్స్ ద్వారా కూడా తమకు తెలిసిన సమాచారాన్ని పంచుకోవడం, కొన్ని కొత్త కొత్త అంశాలను సూచించడం చెయ్యడం నా అదృష్టం. అయితే అలా నా టపాలను సంపన్నం చేసిన వారి పేర్లు కృతజ్ఞతగా ప్రచురించకపోవడం కేవలం వారి సూచన మేరకే కానీ నా కృతఘ్నత కాదు. అజ్ఞాతంగానే ఉండడానికి ఇష్టపడ్డ నా శ్రేయోభిలాషులైన మిత్రులకు ఇలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇలాగే మిత్రులందరి ప్రోత్సాహం, సహకారం వుంటే బ్లాగుల్లోనే మరికొన్ని ప్రయోగాలు చెయ్యాలని వుంది.
 శత సహస్ర వందనాలు 
ఆరు వందల రోజుల్లో షట్ శత టపాలకు రోజుకు సరాసరి ఆరు నూర్ల వీక్షకుల ప్రోత్సాహమే కారణం. వారందరికీ శత సహస్ర వినయపూర్వక వందనాలు. అలాగే నాకు అణువణువునా సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న నా మిత్రుడు, మా కంపెనీ చైర్మన్ అయిన శ్రీ కూచిమంచి సుబ్రహ్మణ్యం గారికి, మా కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు చెప్పక తప్పదు. ఈ ప్రోత్సాహం ఇలాగే ఇకముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ......

 మరో విశేషం :  ఇప్పుడే తెలిసిన మరో విశేషం మిత్రులతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. బ్లాగర్ వాళ్ళు  2010 మే నెలనుంచి వీక్షకుల లెక్కలు తెలిపే సదుపాయం ప్రారంభించారు. ఈ పదకొండు నెలల ఏడు రోజులలో ఈ క్షణం వరకూ ' శిరాకదంబం '  వీక్షించిన వారి సంఖ్య 50,125 . ముఖ్యంగా ఈరోజు వీక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో  1111 .  

Vol. No. 02 Pub. No.196

11 comments:

Saahitya Abhimaani said...

రావుగారూ, అద్భుతం. ఈ శుభసందర్భంగా మీకు అభినందనలు. మీరు ఇలాగే అనేకానేక తెలియని విషయాలు ఎన్నో మా అందరికీ తెలియచేయాలని నా ఆకాంక్ష.

Unknown said...

అభినందనలు
మాధురి

ఆ.సౌమ్య said...

చాలా బావుంది....600 టపాలే...రావు గారూ మీరు నిజంగా గ్రేట్. మీకు అభినందనలు. ఈ విజయోత్సాహంతో మీరు 600 ని 1600 గానూ 2600 గానూ.....చేసుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

గిరీష్ said...

Heartly Congrats mastaru..:)

తృష్ణ said...

Rao gaaru, That's really really great. Hearty congratulations.

జ్యోతి said...

Hearty congratulations.

SRRao said...

* శివ గారూ !
* మాధురి గారూ !
* ఆ. సౌమ్య గారూ !
* గిరీష్ గారూ !
* తృష్ణ గారూ !
* జ్యోతి గారూ !

మిత్రులందరి ఆదరాభిమానాలే నాకు కొండంత అండ. అందరికీ ధన్యవాదాలు.

జయ said...

రావ్ గారు, మీకు ఆరువందల శుభాకాంక్షలు.

SRRao said...

జయ గారూ !
మీకు కూడా ఆరువందల ధన్యవాదాలు

chandramohan said...

Rao garu! congratulations! chaala blagulakanna meedi merugaina blogu. cinee visheshalatho batu mee anubhavaalu kooda valuablegaa untunnayi. ee vishayam mee visitors sankhye chebuthundi. blgullo prathyekatha kaligina blogulu konne unnayi. vatillo mee blogu okati. konchem current affairs (political) meeda kooda shraddha pettandi.

SRRao said...

చంద్రమోహన్ గారూ !

మీ అభిమానానికి, విశ్లేషణకు ధన్యవాదాలు. వర్తమాన విషయాలమీద కూడా అప్పుడప్పుడు రాస్తూనే వున్నాను. కాకపొతే అసలైన రాజకీయమంటే ఆసక్తి వున్నా రాజకీయం అనే మాటకు అర్థం మారాక ఆ ఆసక్తి తగ్గిపోయింది. రాజకీయాలు కుళ్ళిపోయాయి అనే మాట చాలా చిన్నదిగా అనిపిస్తోంది. అయినా మీ మాట ప్రకారం ప్రయత్నిస్తాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం