Monday, February 28, 2011

రాజ్యాంగ సంఘ సారధి

 బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్చా వాయువులు పీలుస్తున్న భారతదేశ పరిపాలనా వ్యవస్థను క్రమ పద్ధతిలో పెట్టడానికి ఏర్పాటు చేసినదే రాజ్యాంగ రచనా సంఘం. 1946 డిసెంబర్ 9 న ఏర్పాటైన ఆ సంఘానికి తొలి అధ్యక్షుడు డా. సచ్చిదానంద సిన్హా అయితే మలి అధ్యక్షుడు డా. రాజేంద్రప్రసాద్. 

1948 నుండి 1950 వరకూ రాజ్యాంగ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు డా. బాబూ రాజేంద్రప్రసాద్. 1949 వ సంవత్సరం నవంబర్ 26 న ఆమోదం పొందిన మన రాజ్యాంగం 1950 జనవరి 26 వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఆరోజే ఆ రాజ్యాంగ సంఘ సారధి భారత దేశ తొలి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి పన్నెండు సంవత్సరాలు మన రాష్ట్రపతిగా పని చేసిన బాబూ రాజేంద్రప్రసాద్ 1962 లో స్వచ్చంద పదవీ విరమణ చేసారు. ఆయన పదవీ విరమణ చేసిన కొద్దిరోజులకే ఆయన భార్య రాజ్ వంశీ దేవి మరణించారు. 
" నాకు పని చేసే శక్తి తగ్గిపోయింది. నేను జీవించే కాలం అయిపోయిందని, అంత్యకాలం సమీపించినదని గట్టిగా అనిపిస్తోంది " 
- ఇది డా. బాబూ రాజేంద్రప్రసాద్ తన అనుచరుడొకరికి రాసిన ఉత్తరంలోని భాగం. సరిగ్గా ఇది రాసిన నెలకు...  28 ఫిబ్రవరి 1963 న రాజేంద్రప్రసాద్ ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోయారు. 

 స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజ్యాంగ సంఘ సారధి, భారత తొలి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్ వర్థంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ.......     

డా. బాబూ రాజేంద్రప్రసాద్ విశేషాలతో గతంలోని టపా లింక్ .........
 మన తొలి రాష్ట్రపతి

Vol. No. 02 Pub. No. 160

Sunday, February 27, 2011

ఆజాద్

మెల్లగా స్వాతంత్ర్య సమరం మన దృష్టిలోంచి తొలగిపోతోంది. అంతః కలహాలు పెచ్చుమీరిన సమయంలో మన దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వారు సుమారు రెండు వందల సంవత్సరాలు  మన దేశాన్ని తమ వలస రాజ్యంగా చేసుకుని, ఇక్కడ వుండే సంపదను దోచుకుని, స్వేచ్చా స్వాతంత్ర్యాలు హరించి ప్రజల్ని బానిసలుగా మార్చేసారు. ఈ విషయం ఇప్పుడు పూర్తిగా చరిత్ర పుస్తకాలకే పరిమితమైంది. ఇప్పుడెవరికీ ఆ పుస్తకాలు చదివి ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్చకు కారణమైన ఆనాటి సంగ్రామాన్ని గురించి తెలుసుకునే ఓపిక గానీ, తీరిక గానీ వుండడం లేదు. విజ్ఞానం అందివ్వాల్సిన చదువు వృత్తి విద్యల పేరుతో డబ్బు సంపాదించే యంత్రాలను తయారుచేస్తూ వ్యాపారంగా మారిపోయింది. 
ఇంక స్వాతంత్ర్యాన్ని  సాధించడానికి జరిగిన సమరం గురించి, ఆ సమరం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల గురించి ఇప్పటితరానికి తెల్సేదేలా ? వాటినుంచి ఇప్పటి తరం స్పూర్తి పొందేదేలా ? ఎవరో కొందరు రాజకీయనాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం చరిత్రను తమకనుకూలంగా మలచుకుని చెప్పే కట్టుకథలే నిజమైన చరిత్రని నమ్ముతున్నారు గానీ, వాస్తవ చరిత్ర పరిశీలించే పరిస్థితి ఈనాడు కనిపించడం లేదు. ఆ చరిత్రనుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు బంగారం చేసుకునే బదులు నరకం చేసుకుంటున్నారు. అందుకే.... అప్పుడు పరాయి దేశస్తులు దోచుకున్నారు.... ఇప్పుడు మనవాళ్ళే మనల్ని దోచుకుంటున్నారు. 

 ఈ తరుణంలో అప్పటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి కొన్ని ముఖ్య సందర్భాలలోనైనా గుర్తు చేసుకోవడమే కాక మన తర్వాత తరాలవారికి వారి గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. 

అతి చిన్నవయసులోనే స్వాతంత్ర్య సంగ్రామంలోకి దూకి అందరికీ ఆదర్శంగా నిలిచి ఆ ఆశయం కోసమే తమ ప్రాణాలను అర్పించిన మహనీయులు మన స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఎంతోమంది వున్నారు. అహింస, శాంతి లతో భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించవచ్చని గాంధీజీ లాంటి నాయకులు నమ్మితే,  బ్రిటిష్ వాళ్ళు మన ప్రజల్ని హింసకు గురి చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చోవడం సరికాదని హింసకు హింసే సరైన జవాబని నమ్మిన వారూ వున్నారు. వారిలో సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ ప్రముఖులు. భగత్ సింగ్ కీ, ఆయన అనుయాయులైన సుఖదేవ్, రాజ్ గురు లకు గురుతుల్యుడైన మరో స్వాతంత్ర్య సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. 

మధ్యప్రదేశ్ లోని భావ్రా జిల్లాకు చెందిన చంద్రశేఖర్ వారణాసిలో సంస్కృతం అభ్యసించారు. గాంధీజీ బ్రిటిష్ వారిపై సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించే సమయానికి చంద్రశేఖర్ యువకుడు. ఆ ఉద్యమం అతన్ని ఆకర్షించి స్వాతంత్ర్య సమరంలోకి దూకేటట్లు చేసింది. 1919 అమృత్ సర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణ హోమానికి చలించిన చంద్రశేఖర్, భగత్ సింగ్ లాంటి వారు విప్లవబాట పట్టారు. అప్పటినుండి చంద్రశేఖర్ స్వేచ్చ అనే అర్థంలో తన పేరు చివర ' ఆజాద్ ' ను కలుపుకున్నారు. ఆ సమయంలోనే ఎట్టి పరిస్థితుల్లోను భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి తీరాలని ప్రతిజ్ఞ చేస్తూ తనను బ్రతికుండగా పోలీసులు పట్టుకోలేరని చాలంజ్ కూడా చేసారు. సామాన్య ప్రజలను అణిచివేస్తూ, స్వాతంత్ర్య యోధులను జైళ్లలో పెట్టి హింసించే బ్రిటిష్ అధికారులపైన తన సమర భేరిని మ్రోగించారు. కొంతమందిపై దాడి చేసి హతమార్చారు. భగత్ సింగ్ నీ, అతని అనుచరులకు కోవర్ట్ కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా శిక్షణనిచ్చారు చంద్రశేఖర్ ఆజాద్. వారిని దేశభక్తితో బాటు తెగువ, సాహసం గల యోధులుగా తీర్చిదిద్దారు. భవిష్యత్తులో భారతదేశం సోషలిస్ట్ దేశంగా ఎదగాలని కలలుగన్న చంద్రశేఖర్ హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసారు. 

  
ఆరోజు 1931 ఫిబ్రవరి 27 . ఒక నమ్మక ద్రోహి సమాచారంతో అలహాబాద్ లో అప్పటి అల్ఫ్రెడ్ పార్క్ లో వున్న చంద్రశేఖర్ ని బ్రిటిష్ పోలీసులు వలపన్ని చుట్టుముట్టారు. వారి దగ్గర చివరి బుల్లెట్ కూడా అయిపోయే వరకూ పోరాడుతూనే వున్నారు చంద్రశేఖర్ ఆజాద్. చివరికి నేలకొరగక తప్పలేదు. పాతిక సంవత్సరాల పిన్న వయసులోనే ఆ విప్లవ యోధుడు వీరమరణం పొందిన ఆ పార్కు పేరు తరవాత రోజుల్లో చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ గా మారింది.    


 ఈరోజు భారత స్వాతంత్ర్య సమర విప్లవ యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి సందర్భంగా స్మరించుకుంటూ......       
Vol. No. 02 Pub. No. 159

Saturday, February 26, 2011

సాక్షి జంట గురించి ఆరుద్ర

రచయిత ఆరుద్ర కు  బాపురమణ జంటకు అవినాభావ సంబంధం వుంది. బాపురమణల జంట పనిచేసిన దాదాపు అన్ని సినిమాలకు ఆరుద్ర పాటలు రాసారు. సినిమాలకు పాటలు రాయడం మానుకున్న తర్వాత కూడా ఆ జంట మీదున్న అభిమానంతో వారి చిత్రాలకు ప్రత్యేకంగా రాయడం విశేషం.


బాపురమణ జంట నిర్మించిన తోలి చిత్రం ' సాక్షి '. ఆ చిత్రంలో ఆరుద్ర పాటలు రాసారు. ఆ అనుభవాలను చెబుతూ ఆరుద్ర .............................


   సాక్షి చిత్రం ప్రారంభిస్తున్న రోజు - కొన్ని పాటలే రాయవలసిన నాకు అన్ని పాటల సన్నివేశాలు చెప్పారు. పది  నిముషాల్లో పాట రాసి భేష్ అనిపించుకున్నాను. నన్ను ఆ చిత్రంలో బహు యిబ్బంది పెట్టేసారు. మూడు నాలుగు నెలలైనా ఒక పాట నేను మొదలు పెట్టలేకపోయాను. ఆ సన్నివేశం అంత ఇబ్బందికరమైనది.  మరణం తప్పదని నిశ్చయించుకున్న మనసైన వాడిని మనువాడదలచిన పిల్ల పాడే పాట అది. పల్లవి తట్టడానికి అన్నాళ్ళు పట్టింది నాకు. పల్లవి దొరకగానే పది నిముషాల్లో రాసేసాను.

   బాపు గారు ' భేష్ ' అన్నారు. రమణగారు అనలేదు. భేష్ అనడం రమణగారికి చేతకాదు.... ఏదైనా మనసుకి బాగా పట్టేస్తే నోట్లో నాలుక మీద వేలు అడ్డంగా పెట్టి ఈల వేయడం తప్ప. రమణగారు ఇంకోలాగ అయినవాళ్ళ మధ్య ఆనందం ప్రదర్శించలేరు. ఆ తర్వాత ఎన్ని పాటలు రాసాను... ఎన్ని భేష్ లు అన్నారు.... ఎన్ని ఈలలు విన్నాను. 


బాపు గారి చేత ' భేష్ ' అనిపించి, రమణ గారి చేత ఈల వేయించిన ఆ పాట ..................
Vol. No. 02 Pub. No. 158

Friday, February 25, 2011

' విజయా ' రెడ్డి


 తెలుగు చలన చిత్రసీమ గర్వంగా చెప్పుకునే ఇప్పటి తరం జంట బాపురమణ అయితే 
తెలుగు చలన చిత్రసీమకే దిశానిర్దేశం చేసిన అప్పటి తరం జంట నాగిరెడ్డి - చక్రపాణి 


విడదీసి మాట్లాడలేని జంటలు ఈ రెండూ 
విధి వాళ్ళను విడదీసినా కాలం ఎప్పుడూ కలిపే ఉంచుతుంది 

భూత భవిష్యత్ వర్తమానాల్లేని కాలాతీతులు వాళ్ళు 
ఏ కాలానికైనా ఏ తరానికైనా ఆదర్శవంతులు వాళ్ళు   

రమణీయ కళాత్మక చిత్రాల సృష్టికర్త 
వెండి తెరపై వెన్నెల సంతకం నాగిరెడ్డి

కొత్తదనం పేరుతో వెకిలి చిత్రాలు తియ్యలేదు 
సంచలనం పేరుతో నేలవిడిచి సాము చెయ్యలేదు 
మన సాధారణ జీవితాలనే అందంగా మలిచారు
మామూలు సంఘటనలనే ఆహ్లాదంగా అందించారు 

అందుకే తెలుగు చిత్ర చరిత్రలో విజయా వారి చిత్రాలు అజరామరం 
అందుకే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో విజయా నాగిరెడ్డి చక్రపాణి లు శాశ్వతం 

' విజయా ' నాగిరెడ్డి గారి వర్థంతి సందర్భంగా వారికి వెన్నెల నీరాజనాలు............

 నాగిరెడ్డి గారి మీద గత టపాలు ..................

విజయా చందమామ

'విజయ' నాగిరెడ్డి


Vol. No. 02 Pub. No. 157

తన ఆత్మ గురించి ముళ్ళపూడి


శరీరాలు వేరైనా ఆత్మలోకటే  బాపురమణ లకి ................
తన ఆత్మ బాపు గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏమన్నారో చూడండి..........

   బాపు అంటే పని. రోజుకి ఇరవై గంటల పని. లొంగని గుర్రాల మీద సవారీకి కసి, పట్టుదల.  
                 
       బాపు కళాతపస్వి కాదు. అంటే గడ్డాలూ, విగ్గులూ పెంచేసి, గుహల్లో దూరిపోడు. తెల్లారగట్ట నాలుగ్గంటలకి లేచి ఓ రెండు గంటలు బొమ్మలేస్తాడు. తర్వాత సరదాగా ఓ రెండు గంటలసేపు బొమ్మలేసుకోవడం, ఆ తర్వాత ఇంకో గంటన్నర బొమ్మల ప్రాక్టీసు, ఆలసిపోతాడు గదా, అందుకని - ఓ రెండు గంటలసేపు హాయిగా బొమ్మలు గీయడం, అదయ్యాక తనకిష్టమైన కథలకి బొమ్మలు గియ్యడం, ఆ తర్వాత..... ఇదీ వరుస.

         ఈలోపున వచ్చేపోయే ఫ్రెండ్స్ తో జోక్స్ చెప్పుకోవడం, వాళ్లకి గ్రీటింగ్స్ కార్డ్స్ వేసి పెట్టడం, వాళ్ళ కథలకి బొమ్మలు వేసి పెట్టడం, కార్టూన్లు వేసి పెట్టడం - వాళ్ళని నుంచోమని, కూర్చోమని, చెయ్యలా పెట్టమని, చెయ్యిలా పెట్టమని, రకరకాల భంగిమలలో రేఖాచిత్రాలు వేసుకోవడం.........


...... ఇలా సాగుతుంది ప్రియమిత్రుని గురించి రమణ గారి వ్యాఖ్యానం. వారి అనుబంధం విడదీయలేనిది. Vol. No. 02 Pub. No. 156

Thursday, February 24, 2011

కవిత - విమర్శ దూరమైన రోజు

 భాషకు రెండు కళ్ళు రచన - విమర్శ 
రచన లేకుండా విమర్శ లేదు 
విమర్శ లేకుండా రచన రాణించదు

 
తెలుగు భాషలో భావకవితకు మారు పేరు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 

తెలుగు వారు గర్వించదగ్గ విమర్శకుడు, కవి, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి  మహాకవుల రచనలు వారివి కావు ప్రజలవి 
మహనీయుల జీవితాలు వారివి కావు ప్రజలవి 

వారు మన మధ్య భౌతికంగా లేకపోయినా  
రాసిన రచనలు, చేసిన మంచిపనులు మన మనసుల్లో నిలిచిపోతాయి 
వారికి మరణం ఉందేమో గానీ వాటికి మరణం లేదు 
అవి ఇప్పటికీ.......ఎప్పటికీ...... సజీవం  

కట్టమంచి వారు తెలుగు జాతిని విడిచి పోయిన రోజు 1951 ఫిబ్రవరి 24  
దేవులపల్లి వారు తెలుగు సాహితీలోకాన్ని విడిచి పోయింది సరిగా ముఫ్ఫై ఏళ్ళకి 1981 ఫిబ్రవరి 24 

 ఆ మహనీయుల వర్థంతి సందర్భంగా స్మరించుకుంటూ..................

దేవులపల్లి వారిపై గతంలో రాసిన టపాలు .........

దేవులపల్లి వారి అపురూప చిత్రాలు

అందరూ దిగ్దంతులే !

ఉద్యోగ భయం

సాంగుల గ్రంథం

దేవులపల్లి ' నిజలింగప్ప '

శ్రోతల్లో రకాలు - వక్తలు

నవయుగ వైతాళికుడు

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ

 

 కట్టమంచి వారిపై గతంలో రాసిన టపాలు .........

ఆంధ్ర విశ్వకళా పరిషత్తు రూపశిల్పి

కట్ట ' మంచి ' - ఆంధ్ర విశ్వకళా పరిషత్తు రూపశిల్పి - అనుబంధం

కట్టమంచి వారి చతురోక్తులు

 

Vol. No. 02 Pub. No. 155

హాస్య ప్రవాహం ఆగింది

 నిరంతర జల ప్రవాహం గోదావరిది 
సజీవ హాస్య ప్రవాహం ముళ్ళపూడిది 

గోదావరి ప్రవాహం నిలిచిపోయిందా 
హాస్య ప్రవాహం ఆగిపోయిందా 

తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపురూప జంట బాపు రమణ 
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం బాపు రమణ 

ఇప్పుడు బాపు గీతకు ముళ్ళపూడి రాత ఏది ?
ఇప్పుడు బాపు బొమ్మకు ముళ్ళపూడి పూత ఏది ? 

బాపు రమణ జంట పేరు ఇక వినబడదా ?
ఎందుకు వినబడదు ? వినబడుతూనే వుంటుంది
తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే వుంటుంది.

బాపు ఎప్పటికీ ఒంటరి కారు 
ఆయన ఆలోచనల్లో... ఆయన గీతల్లో.... ఆయన చిత్రాల్లో ...... 
అన్నిటిలోనూ ముళ్ళపూడి నిలిచి వున్నారు.... వుంటారు 
ఇది సత్యం..... ఇదే సత్యం.....

  ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారికి సాహితీ నీరాజనాలతో ................ 

Vol. No. 02 Pub. No. 154

Wednesday, February 23, 2011

విదేశీ మోజు


మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో
మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం ...... అలాగే మనకు విదేశాల మీద, వారి అలవాట్లు, ఆచార వ్యవహారాల మీద ఎంత ఆసక్తి, మోజు ఉంటాయో విదేశీయులకు కూడా మన సాంప్రదాయాల మీద మోజు వుండడం సహజం. మనమెప్పుడో మన వివాహ పద్ధతుల్లో విదేశీ పద్ధతుల్ని చాపక్రింద నీరులా కలిపెయ్యడం ప్రారంభించాం. మన వివాహ వ్యవస్థలో వున్న తంతులకి, మంత్రాలకి ఎప్పుడో మంగళం పాడేశాం. ఐదురోజుల తతంగాన్ని ఐదు గంటలకు ఇంకా వీలయితే గంటలోకి కుదించడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఆర్భాటాలు మాత్రం పెంచుకుంటూ పోతున్నాం. చక్కగా పలకరింపులతో పంక్తి భోజనం చెయ్యడం దగ్గర్నుంచి హడావిడిగా మన ప్రక్కన ఎవరున్నారో గమనించే తీరిక కూడా లేకుండా బఫే భోజనంతో నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని తెచ్చిన బహుమతిని వదూవరులకిచ్చేసి అభినందనలు చెప్పేసి వీలయితే మన హాజరుకు సాక్ష్యంగా వాళ్ళతో ఒక ఫోటో లాగించేసి ' బెస్ట్ అఫ్ లక్ ' తో బాటే బై కూడా చెప్పేస్తున్నాం. పెళ్ళివారు కూడా మండప అలంకారానికి, వాళ్ళ అలంకారానికి ఇచ్చిన ప్రాధాన్యత పెళ్లి తంతుకి ఇవ్వడం లేదు. 

మన వివాహ వ్యవస్థలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోతుంటే విదేశీయులను  మన వివాహ వ్యవస్థ ఎంతగా ఆకర్షిస్తోందో ప్రపంచ ప్రసిద్ధ నటుడు చార్లీ చాప్లిన్ మనవడి పెళ్లి గురించి చదివితే అర్థమవుతుంది.  

ఈనాటి ( ఫిబ్రవరి 23 ) ఈనాడు పత్రికలోని ఈ వార్త లింక్ ఇదిగో.........

 Vol. No. 02 Pub. No. 153

కళామతల్లి సేవలో తరించిన ప్రజానటుడు

 కొంతమంది కళను నమ్ముకుని బ్రతుకుతారు 
మరికొంతమంది కళను అమ్ముకుని బ్రతుకుతారు 

మొదటికోవకు చెందిన సిసలైన కళాకారుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

కొందరు ప్రజాసేవకు కళను ఎంచుకుంటారు 
మరికొందరు తాము ప్రజానటులమని చెప్పుకుంటారు 

కానీ ప్రజలకోసం నటుడైన అసలైన ప్రజానటుడు మిక్కిలినేని 
పదహారణాలా మూర్తీభవించిన తెలుగుతనం మిక్కిలినేని స్వంతం. 

స్వాతంత్ర్యోద్యంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రం చేసి క్విట్ ఇండియా అని జైలు కెళ్ళి లాఠీ దెబ్బలు తిన్న మిక్కిలినేనికి ఆ ఉద్యమాలు, అందులో అనుభవించిన హింసలు ప్రజానాట్యమండలి స్థాపనకు ప్రేరేపించాయి. మిత్రులతో కలసి స్థాపించిన ప్రజానాట్యమండలి ద్వారా ప్రజల సమస్యలపై అనేక నాటకాలు ప్రదర్శించారు. 

చిరకాలమిత్రుడు కే. యస్. ప్రకాశరావు నిర్మించిన ' దీక్ష ' చిత్రం ద్వారా చలనచిత్ర దీక్ష పుచ్చుకున్నారు. అక్కడనుంచి ' శ్రీకృష్ణార్జున విజయం ' వరకూ ఆయన సినీ జీవిత ప్రస్తానం కొనసాగింది. నటనను కేవలం నటనగానే చూసిన మహానుభావుడు ఆయన. తెలుగు నాటకరంగ చరిత్ర, ఆ రంగాన్ని సుసంపన్నం చేసిన మహానటుల విశేషాలు తమతరంతోనే మరుగున పడిపోకూడదన్న సదాశయంతో ఆయన ' ఆంధ్ర నాటకరంగ చరిత్ర ', ' నట రత్నాలు ' వంటి గ్రంధాలను రచించారు. తెలుగు ప్రజలకు ఇంతటి మహత్తరమైన సంపదను అందించిన మిక్కిలినేని మాత్రం తన సంపదను పెంచుకునే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు. కళామతల్లి సేవ చెయ్యడమే సంపద అనుకున్నారు కానీ సంపాదనల వెంట పరుగులు తియ్యలేదు.      

తెలుగు చలనచిత్ర సీమ మిక్కిలినేని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయింది. ప్రజానటుడు మిక్కిలినేనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ............

మిక్కిలినేని గారి జీవిత విశేషాల కోసం, అపురూప చాయా చిత్రాలకోసం ఈనాటి ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికల లింకులు చూడండి.
 https://www.andhrajyothy.com/pdffiles/2011/feb/23/Vij/vijayawada09.pdf
http://epaper.eenadu.net/svww_index1.php
http://epaper.sakshi.com/apnews/Vijayawada/23022011/details.aspx?id=809312&boxid=25571062

Vol. No. 02 Pub. No. 152

Tuesday, February 22, 2011

రెండు ఆణిముత్యాల జయంతి

తెలుగు చిత్ర రంగం గత తరంలో ఎందఱో ఆణిముత్యాల్లాంటి కళాకారులను అందించింది. ఆనాటి నటీనటుల్లో కొంతమందిని, వారి నటననీ తరాలు గడిచినా మర్చిపోలేం ! 

 ఈరోజు ( ఫిబ్రవరి 22 ) అలాంటి ఒక నటి, మరో నటుడి జయంతి 

ఆ నటి జూనియర్ శ్రీరంజని. ఆమె గురించి వివరాలతో గతంలో రాసిన టపా - 

భారత గానకోకిల లతామంగేష్కర్ తొలిసారిగా తెలుగులో గానం చేసిన పాటకు అభినయించినది జూనియర్ శ్రీరంజని. ' సంతానం ' చిత్రంలోని ఆ పాట, ఆమె అభినయం యు - ట్యూబ్ praneeth12394 ఛానల్ ద్వారా చూడండి...... 
ఇక ఆ నటుడు తన విలక్షణమైన నటనతో, గాత్రంతో రంగస్థలంపైన ఖ్యాతి గడించి చిత్ర రంగానికి వచ్చి అక్కడ కూడా తన ప్రత్యేకతను నిలుపుకున్న పువ్వుల సూరిబాబు. ఆయన వర్థంతి సందర్భంగా ఈ నెల 12 వ తేదీన రాసిన టపా లింక్ ..............

http://sirakadambam.blogspot.com/2011/02/blog-post_12.htmlఆ అణిముత్యాలిద్దరినీ స్మరించుకుంటూ ...............


Vol. No. 02 Pub. No.151

Sunday, February 20, 2011

హాస్యనాభం

అఖిలాంధ్ర ప్రేక్షకుల మనస్సులను తన హాస్యంతో ఆరు దశాబ్దాలుగా రంజింపజేసిన హాస్యనాభుడు పద్మనాభుడు కడప జిల్లా సింహాద్రిపురంలో జన్మించారు. చిన్నప్పట్నుంచి సినిమాల మీద మోజు పెంచుకున్న పద్మనాభం తమ ఊళ్ళోని టెంట్ సినిమా హాల్లో చూసిన సినిమాలలోని నటుల్నీ, సన్నివేశాల్నీ అనుకరించడం, పాటలు.. పద్యాలు పాడి అందరికీ వినిపించడం చేస్తూండేవారు. తన ఆరోయేట తొలిసారి ' చింతామణి ' నాటకంలో శ్రీకృష్ణుడిగా నటించారు.

1943 లో మద్రాసు చేరిన పద్మనాభం సైకిల్ మీద తిరుగుతూ, పద్యాలు పాటలు పాడుతూ అందర్నీ అలరించి వారిచ్చిన పదో పరకతో కాలక్షేపం చేసారు. కన్నాంబ గారిని, కడారు నాగభూషణం గారిని తన గానంతో మెప్పించిన పద్మనాభానికి ' పాదుకా పట్టాభిషేకం ' లో కోరస్ లో పాడే అవకాశం వచ్చింది. అప్పుడే పరిచయమైన గూడవల్లి రామబ్రహ్మం గారి ' మాయలోకం ' లో తోలి వేషం వేసారు. బాలనటుడిగా ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించారు.

1949 లో విజయా వారి ' షావుకారు ' చిత్రంలో వచ్చిన అవకాశం ' పాతాళ భైరవి ' తో స్థిరపడింది. హాస్యనటుడిగా విజయా వారి చిత్రాలతో బాటు అనేక చిత్రాల్లో నటించారు. మిత్రుడు, సహ నటుడు వల్లం నరసింహారావు గారితో కలసి 1964 లో రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి ' దేవత ' చిత్రం నిర్మించారు. తర్వాత వరుసగా పొట్టి ప్లీడర్, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, జాతకరత్న మిడతంభొట్లు లాంటి చిత్రాలు నిర్మించారు. విశేషమేమిటంటే ఈ చిత్రాలన్నిటిలో కథానాయకుడు పద్మనాభమే ! ఆ పాత్రలన్నీ హాస్య ప్రధానమైనవే !

1968 లో ఆయన నిర్మించిన ' శ్రీరామకథ ' చిత్రంతో దర్శకుడిగా మారారు. 1970 లో నిర్మించిన ' కథానాయిక మొల్ల ' చిత్రానికి బంగారు నంది అందుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా అరవై ఐదు సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని గడిపిన పద్మనాభం డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయస్సులో 20 ఫిబ్రవరి 2010 న కీర్తిశేషులయ్యారు.

 హాస్యనాభం పద్మనాభం మనల్ని వదలి వెళ్లి సంవత్సరం గడచిపోయింది. ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా హాస్య నీరాజనాలర్పిస్తూ.....* ఇందులోని పద్మనాభం గారి వీడియో క్లిప్స్ అందించిన ప్రణీత్ కు కృతజ్ఞతలతో ..........
http://www.youtube.com/user/praneeth12394

పద్మనాభం గారి గురించి గతంలో వ్రాసిన టపాల లింకులు.....
http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_20.html
http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_27.html 
http://sirakadambam.blogspot.com/2010/08/blog-post_3849.html

Vol. No. 02 Pub. No. 150

Saturday, February 19, 2011

తెలుగు సినిమా తల్లి


తెలుగు సినిమాలలో అమ్మ
నవరసాలను నటనలో పలికించే అమ్మమ్మ
ఇరవై ఏళ్ళకే అరవై ఏళ్ళ పాత్రలో ఒదిగిన నిర్మలమ్మ

మచిలీపట్నానికి చెందిన నిర్మల 1943 లో ' గరుడ గర్వభంగము ' తో చిత్రసీమలో ప్రవేశించారు. ఆవిడ సినీ జీవిత యాత్ర అంత సాఫీగా ఏమీ సాగలేదు. మళ్ళీ 1944 లో ' పాదుకా పట్టాభిషేకం ' చిత్రంలో అవకాశం వచ్చింది కానీ ప్రాముఖ్యం లేని పాత్ర కావడంతో ఎడిటర్ కత్తెరకు బలయిపోయింది. తర్వాత స్వస్థలానికి తిరిగివచ్చి చాలాకాలం బందరు , విజయవాడ ప్రాంతాల్లో నాటకాలలో వేషాలు వేసారు. 1954 లో సారధి వారు నిర్మించిన ' అంతా మనవాళ్ళే ' చిత్రంలో వల్లం నరసింహారావు ప్రక్కన హీరోయిన్ గా వచ్చిన అవకాశం ఇద్దరూ కొత్త వారైతే జనం చూడరనే కారణంగా చేజారిపోయింది. నిర్మల బక్కపలచగా వుండడం వలన భరణీ వారి ' చక్రపాణి ', వాహిని వారి ' బంగారు పాప ' చిత్రాల్లో వచ్చిన అవకాశాలు కూడా తప్పిపోయాయి. చివరకు మళ్ళీ 1959 లో వచ్చిన సారధి వారి ' భాగ్యదేవత ' ఆమెను కరుణించింది. అయితే అందులో కథానాయిక వేషం కాదు. ఆమెను తెలుగు చిత్రసీమకు తల్లిగా ఆ చిత్రం పరిచయం చేసింది. అందులో ఆమె సావిత్రి, రాజసులోచనలకు తల్లిగా నటించింది. అది మొదలు అనేక చిత్రాలలో ఆమె తల్లి పాత్రలు ధరించింది. 

ఓ ప్రక్క తనకంటే పెద్దవాళ్ళయిన హీరోలకు తండ్రిగా గుమ్మడి నటిస్తుంటే మరో ప్రక్క నిర్మలమ్మది కూడా అదే పరిస్థితి.  1969 లో వచ్చిన ' మనుషులు మారాలి ' ఆమెను అమ్మమ్మను కూడా చేసింది. అప్పట్నుంచి అనేక మంది హీరోలకు, హీరోయిన్లకు అక్కగా, తల్లిగా, బామ్మగా, అమ్మమ్మగా నటించారు. 2007 వ సంవత్సరంలో జరిగిన తెలుగు చలనచిత్ర వజ్రోత్సవ వేడుకలు ఆమె పాల్గొన్న ఆఖరి వేడుక. తర్వాత రెండు సంవత్సరాలకు 2009 వ సంవత్సరం ఫిబ్రవరి 19 వ తేదీన దివంగతులయ్యారు.  

 తెలుగు సినిమా తల్లి నిర్మలమ్మ వర్థంతి సందర్భంగా నీరాజనాలర్పిస్తూ..............

 Vol. No. 02 Pub. No. 149

కళా తపస్వి


లోకానికే నాథుడు కాశీ విశ్వనాథుడు 
తెలుగు చిత్రాధినాథుడు కాశీనాథుని విశ్వనాథుడు 

సృష్టి స్థితిలయ కారకుడు ఆ కాశీ విశ్వనాథుడు 
వెండితెర శ్రుతిలయల కారకుడు ఈ కాశీనాథుని విశ్వనాథుడు 

హాలాహలాన్ని గళాన్ని దాల్చిన గరళ కంఠుడు కాశీ విశ్వనాథుడు 
అదుపుతప్పిన చిత్ర రంగాన్నిఅందలమెక్కించిన మహానుభావుడు కాశీనాథుని విశ్వనాథుడు 

 హంగులు, ఆర్భాటాలు అక్కరలేని భోళా శంకరుడు కాశీ విశ్వనాథుడు 
అశ్లీలం, అసభ్యత లేని సజీవ చలన చిత్ర కళామూర్తి కాశీనాథుని విశ్వనాథుడు    

ఆత్మగౌరవం నుంచి శుభప్రదం దాకా సాగిన సుదీర్ఘ చిత్ర యానంలో కాశీనాథుడు 
శుభప్రదమైన చిత్రాలను అందించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలిపిన విశ్వనాథుడు

 గురువు గారి జన్మదినం సందర్భంగా నమస్సులతో .....................                విశ్వనాధ్ గారి గురించి గత సంవత్సరం వ్రాసిన టపా

తెలుగు చలనచిత్రరంగ ' స్వాతికిరణం '  లింక్ .............................

http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_19.html

Vol. No. 02 Pub. No. 148

Friday, February 18, 2011

తొలి తెలుగు చిత్ర కథానాయిక - జవాబులు

   కనుక్కోండి చూద్దాం - 37 - జవాబులు  


 ఈ ప్రక్క ఫోటోలో వున్నది తొలి తెలుగు చిత్ర కథానాయిక.
 1 .  ఆమె పేరేమిటి ?
 జవాబు : సురభి కమలాబాయి

 2 . ఆమె కథానాయికగా నటించిన ఆ చిత్రమేది ?
 జవాబు : తోలి తెలుగు టాకీ ' భక్త ప్రహ్లాద ' ( 1931 ). అంతే కాదు ఆ తర్వాత వరుసగా 1932 లో పాదుకా పట్టాభిషేకం, శకుంతల తో వరుసగా మూడు చిత్రాలలో నటించి హేట్రిక్ సాధించింది.

రంగస్థలం మీద తిరుగులేని సురభి కుటుంబానికి చెందిన ఆమెకు జన్మమిచ్చింది అక్షరాలా రంగస్థలమే ! ఆమె తల్లి వెంకుమాంబ కూడా రంగస్థల నటి. ఓసారి నాటక ప్రదర్శన జరుగుతుండగా ఆమెకు రంగస్థలం మీదే నొప్పులు ప్రారంభమైతే నాటకానికి విరామం ప్రకటించి తెరలు దించేసారు. అక్కడ ఆ రంగస్థలం మీదే ఆమెకు కమలాబాయి జన్మించింది. చివరిదాకా నటనే ఊపిరిగా బ్రతికింది.

Vol. No. 02 Pub. No. 144a

మనలోని గాడిదలు

 విన్ స్టన్ చర్చిల్ గారి సుభాషితం....

 మనం ఈ నాగరిక ప్రపంచంలోంచి సింహాల్నీ, పులుల్నీ తరిమేశాం. 
 కానీ మన బుద్ధిలోంచి గాడిదను మాత్రం తరమలేకపోతున్నాం ! 

Vol. No. 02 Pub. No. 147

Thursday, February 17, 2011

అడ్డమైన వాళ్ళు


ప్రముఖ రచయితలు మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, మునిమాణిక్యం నరసింహారావు గారు ఓసారి బందరులో ఓ హోటల్ కి వెళ్ళి కాఫీ తాగుతున్నారు. అక్కడే మరో ప్రక్క టేబుల్ దగ్గర కొంతమంది విద్యార్థులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ కబుర్లు ఆధునిక రచనల మీదకు మళ్ళింది. వాళ్ళిష్టమొచ్చినట్లు, ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. మధ్య మధ్యలో బూతులు కూడా చోటు చేసుకుంటున్నాయి.


ఆ మాటలు విని విని మునిమాణిక్యం గారికి చిర్రెత్తుకొచ్చింది. " అడ్డమైన వాళ్ళనీ హోటల్లోకి రానివ్వద్దని ఓనరుకి చెప్పాలి " అన్నారు.

వెంటనే మొక్కపాటి వారు " అయ్యా ! అంతపని చెయ్యకండి. అతడు అలా రానిచ్చాడు కాబట్టే మనం లోపలి రాగలిగాం ! " అన్నారు సీరియస్ గా ! 

Vol. No. 02 Pub. No. 146

Wednesday, February 16, 2011

అప్పుల వాళ్ళ బాధ

 మహాకవి శ్రీశ్రీ గారి కవిత్వంలో ఎంత ఆవేశం, ఆవేదన ఉంటాయో అంత చమత్కారాలు కూడా వుంటాయి. ఉదాహరణకు ఓసారి లండన్ లోని తెలుగు వారు ఏర్పాటు చేసిన సభలో శ్రీశ్రీ గారు చెప్పిన ఈ కవిత చూడండి....

అప్పులవాళ్ళ బాధ వుందే 
తస్సాదియ్యా చాలా ఇబ్బందే !
అయినా చెబుతున్నా ముందే 
బాధ వాళ్ళదయితే సుఖం మన్దే !


Vol. No. 02 Pub. No. 145

Tuesday, February 15, 2011

తొలి తెలుగు చిత్ర కథానాయిక

  కనుక్కోండి చూద్దాం - 37  
ఈ ప్రక్క ఫోటోలో వున్నది తొలి తెలుగు చిత్ర కథానాయిక.
1 .  ఆమె పేరేమిటి ?
2 . ఆమె కథానాయికగా నటించిన ఆ చిత్రమేది ?

Vol. No. 02 Pub. No. 144

Sunday, February 13, 2011

సజీవ కళా చిత్రం కళాధర్


*************************************************************************************************
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ లెవరు ?

..... అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు 
 
అజరామరమైన విజయావారి చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్న మహానీయులెవరు ?

అద్భుతమైన పనితనం, నైపుణ్యం గలిగిన ఆ కళాఖండాల సృష్టికర్తలెవరు ?

పాతాళభైరవి విగ్రహం, విజయావారి చందమామ లాంటి అద్భుతాలను ఆవిష్కరించినది ఎవరు ?
*************************************************************************************************
 అరవై నాలుగు కళల మాటేమోగానీ ఇరవై నాలుగు కళల సమాహారం మాత్రం చలన చిత్ర రంగం. అణు ప్రక్రియ అద్భుతాలూ సృష్టిస్తుంది... విలయమూ సృష్టిస్తుంది. దాన్ని ఉపయోగించే వ్యక్తుల వివేకాన్ని బట్టి వుంటుంది అద్భుతమా... విలయమా అన్నది. అలాగే చలనచిత్రాలలో కూడా కళాకారులు సవ్యంగా తమ కళా నైపుణ్యాన్ని చూపితే అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించిన వాళ్ళవుతారు. కళా నైపుణ్యం బదులు తమలోని వికారాల్ని ప్రదర్శిస్తే కళా విధ్వంసకులవుతారు. ఏ కళైనా మనిషి మనసుని రంజింపజేయాలి. అప్పుడే ఆది శాశ్వతంగా నిలబడుతుంది. 

అన్ని రసాలను మేళవించి, అన్ని కళలను రంగరించి తయారు చేసిన చిత్రాలు విజయా వారి చిత్రాలు. ఒకటి ఎక్కువా కాదు... మరొకటి తక్కువా కాదు. వారి చిత్రాల్లో అన్నీ సమతూకంలో అమరి వుంటాయి. అందుకే ఆ చిత్రాలు ఇప్పటికీ సజీవంగా ప్రతీ తెలుగువాడి గుండెలో నిలిచి వున్నాయి.  ఈ విషయంలో మాత్రం తరాల అంతరాల సమస్య తలెత్తదు. ఆ తరం నుండి ఈ తరం వరకూ అందరిదీ ఒకే మాట.

విజయా వారి విజయకేతనం పాతాళ భైరవి . అప్పటివరకూ చూడని  ఓ అద్భుత లోకాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన చిత్రం పాతాళభైరవి. సంఘటిత శ్రమ ( Team work ) కు నిదర్శనం ఆ చిత్రం. రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు, నృత్య దర్శకుడు, నటీనటులు............ వీరందిరితో బాటు కళా దర్శకులు.... అందరూ సమిష్టిగా చేసిన కృషి, నిర్మాతల ప్రోత్సాహం కలగలిపి తయారైన అద్భుత కళాఖండం పాతాళ భైరవి. ఆ చిత్రం త్వరలో షష్టి పూర్తి చేసుకోబోతోంది.ఆ సందర్భంగా ఆ చిత్రంతో బాటు ఇంచుమించుగా విజయావారి అన్ని చిత్రాలకు కళా దర్శకత్వ శాఖలో కీలక పాత్ర పోషించిన సజీవ కళా చిత్రం కళాధర్ గారి గురించి, వారి కళావిష్కరణల గురించి కొన్ని విశేషాలు..................
*************************************************************************************************
 తోటరాముణ్ణి పాతాళభైరవికి బలి ఇచ్చి మహాశక్తులు పొందాలనుకుంటాడు నేపాళ మాంత్రికుడు. కొలనులో స్నానం చేసి శుచిగా రమ్మని రాముడికి చెబుతాడు. అతని మాట ప్రకారం స్నానం చెయ్యడానికి కొలనులో దిగిన తోటరాముడు అక్కడున్న మొసలితో పోరాడి సంహరించగానే ఆ మొసలికి శాపవిముక్తి కలిగి యక్ష కన్యగా మారిపోతుంది. తోటరాముడికి మాంత్రికుడి మోసాన్ని తెలియజేస్తుంది. దాంతో మాంత్రికుడ్ని సంహరిస్తాడు రాముడు. వెంటనే సుమారు 20 అడుగులు ఎత్తున్న పాతాళ భైరవి విగ్రహం మూడు ముక్కలుగా విడిపోయి కూలిపోతుంది. 

ఇది పాతాళ భైరవి చిత్రంలోని పతాక సన్నివేశాల్లో ముఖ్యమైన సన్నివేశం. దీని చిత్రీకరణ జరుగుతోంది, ఆ విగ్రహాన్ని మూడు ముక్కలుగా పడెయ్యడానికి అన్నీ సిద్ధం చేసారు. అంతా ఖచ్చితంగా ఒకే టేక్ లో సరిగా జరిగిపోవాలి. రెండో టేక్ అవసరమైతే మాత్రం తప్పనిసరిగా మరో విగ్రహం వుండాలి. అప్పటికప్పుడు ఆది సాధ్యం కాదు. అందుకని ఆ విగ్రహం క్రింద పడినపుడు పాడవకుండా ఉండడానికి క్రింద పరుపులు వేస్తే  బాగుంటుందని సలహా ఇచ్చింది ఎవరో కాదు....... అప్పటికింకా జూనియర్ స్థాయిలో వున్న కళా దర్శకుడు కళాధర్. దీన్ని బట్టి పని మీద ఆయనకున్న శ్రద్ధ,  సునిశిత పరిశీలనా శక్తిని అర్థం చేసుకోవచ్చు.  
*************************************************************************************************

కలలు అందరికీ వుంటాయి. అయితే వాటిని సాకారం చేసుకోవడానికి మాత్రం అంకిత భావం, నిబద్ధత అవసరం. అవి పుష్కళంగా  వున్న కళాకారుడు కళాధర్. చిన్నతనంలో సరదాగా గీసిన గీతలకి ఒక రూపం కల్పించి... ఆ గీతలే తన జీవితంగా మలుచుకున్నారు కళాధర్.

కృష్ణా జిల్లాలో కనీసం సరైన రహదారి సౌకర్యం కూడా లేని ఒక మారుమూల పల్లెటూరిలో జన్మించిన సూరపనేని  వెంకట సుబ్బారావు పామర్రు ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనాధ్యాపకునిగా తన కళా జీవితం మొదలుపెట్టారు. అక్కడే ఆగిపోకుండా తన కళకు మెరుగులు దిద్దుకోవడంతో బాటు అర్హతా పరీక్షల్లో కూడా వుత్తీర్ణత సాధించారు. దాంతో కూడా సంతృప్తి చెందక తన కళకు రాణింపు రావాలనే కల నెరవేర్చుకోవడానికి మిత్రుల ప్రోత్సాహంతో మద్రాసు చేరారు.

దానికిముందు 1936 లో వెంకట నరసమ్మతో జరిగిన వివాహం ఆవిణ్ణి సుధాదేవి గాను, కళాకారుడైన సుబ్బారావుగారిని కళాధర్ గాను మార్చేసింది. ఆధునిక భావాలు కలిగిన ఆయన పినతండ్రి శోభనరావు గారు వీరి పేర్లు మార్చడంలో ప్రధాన పాత్ర పోషించారు.

అప్పటివరకూ బొంబాయిలోవుండి చిత్ర నిర్మాణంలో అనుభవం పొందిన ఎల్వీ ప్రసాద్ ను సారధి ఫిల్మ్స్ వారు మద్రాసు రప్పించి గృహప్రవేశం చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అందులో హీరో కూడా ఆయనే ! ఆ చిత్రానికి కళా దర్శకుడైన వాలి సుబ్బారావు గారికి సహాయకుడిగా చేరారు కళాధర్. ఆ చిత్రానికి ఆయన వేసిన స్కెచ్ లు వాలి గారికి నచ్చి చాలా భాగం పనిని కళాధర్ గారికి అప్పగించారు. అలా 1945 లో గృహప్రవేశం చిత్రంతో కళాధర్ గారి చలనచిత్ర రంగ గృహప్రవేశం జరిగింది.

సారధీ వారు అంతా కొత్తవారితో నిర్మించాలని తలపెట్టిన చిత్రానికి నటీనటుల ఎంపికలో ఎల్వీ ప్రసాద్ గారితో బాటు కళాధర్ గారు కూడా పాల్గొన్నారు. ఆ క్రమంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు లభించిన ఆణిముత్యం నందమూరి తారక రామారావు గారు. ఆ నటరాజాన్ని గుర్తించడంలో కళాధర్ గారు కూడా వుండడం విశేషం. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం జరుగకపోయినా 1949 లో ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో నటి కృష్ణవేణి నిర్మించిన ' మనదేశం ' చిత్రంలో ఎన్టీ రామారావు గారికి తొలి అవకాశం ఇచ్చారు.
 
ఎల్వీ ప్రసాద్ గారి సాహచర్యం గృహప్రవేశం చిత్రంతో ఆగిపోలేదు. ఆ చిత్ర నిర్మాణ సమయంలో సారధి వారి ఆఫీసులో ఇద్దరూ బస చెయ్యడం వల్ల వారి స్నేహం మరింత ఎదిగింది. ఆ స్నేహబంధం 1949 లో విజయా సంస్థ ప్రారంభ చిత్రం ' షావుకారు ' తో బలపడింది. దాంతో కళాధర్ గారి ' విజయ ' యాత్ర 1968 లో వచ్చిన ఉమా చండీ గౌరీ శంకరుల కథ వరకూ కొనసాగింది. అప్పట్లో విజయావారి చిత్రాలన్నీ తెలుగు, తమిళం భాషల్లో తయారయ్యేవి. రెండు భాషల్లో కూడా కళాధర్ పనిచేయడం విశేషం.
 ************************************************************************************************
 ఆరోజుల్లో సంవత్సరానికి ఒక సినిమా అతి శ్రద్ధగా, ఎంత ఖర్చు అయినా మంచి టెక్నికల్  ఎఫ్ఫెక్ట్ రావాలన్న ఉద్దేశ్యంతో  తీయడమే విజయాల శాతం ఎక్కువగా ఉండడానికి కారణం. రోజుకు ఎన్ని సీన్లు, ఎన్ని షాట్లు తీశామన్నది ప్రశ్న కాదు. కావలసినంత టైం తీసుకుని తక్కువ పని అయినా శ్రద్ధగా ముగించేవారు.

................. అంటారు కళాధర్.
*************************************************************************************************

కె. వి. రెడ్డి గారి అస్వస్థతతో విజయా వారి నిర్మాణ జోరు తగ్గింది. దాంతో కళాధర్ గారికి బయిటవారి చిత్రాలకు పనిచేసే వెసులుబాటు చిక్కింది. డి. వి. ఎస్. రాజు గారు, నవతా కృష్ణంరాజు గారు, వాసిరాజు ప్రకాశం గారు , విజయబాపినీడు గారు లాంటి నిర్మాతలకు, విఠలాచార్య, కె. విశ్వనాథ్, సి. ఎస్. రావు, సింగీతం శ్రీనివాసరావు, దాసరి, ఎన్. గోపాలకృష్ణ లాంటి దర్శకులతో పనిచేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమ అంతా దాదాపుగా మద్రాసు నుండి హైదరాబాద్ తరలి వెళ్ళినా అప్పటి తరం వారు కొందరు మద్రాసులోనే వుండిపోయారు. అందులో కళాధర్ కూడా ఒకరు. దానికి వయోభారం ఒక కారణమైతే, వారి పిల్లలు కూడా అక్కడ స్థిరపడడం మరో ప్రధాన కారణం.

ఒక చిత్ర నిర్మాణంలో కళా దర్శకుని పాత్ర కీలకమైంది. రచయిత రాసిన, దర్శకుడి మేధస్సులో మెదిలిన సన్నివేశానికి అనుగుణంగా భవనాలు, అలంకరణ సామగ్రి వగైరాలతో దృశ్య నేపథ్యాన్ని సిద్ధం చెయ్యాలి. పాత్రల ఔచిత్యాన్ని బట్టి ఆహార్యం, దుస్తులు రూపకల్పన చెయ్యాలి. దర్శకునితోనే కాక ఛాయాగ్రహకునితో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి. కెమెరాకి, లైటింగ్ కి అనుగుణమైన రంగులు వాడినపుడే సన్నివేశ ఔచిత్యం ఇనుమడిస్తుంది. అప్పుడే మనం సంపూర్ణమైన చిత్రాన్ని చూడగలం. అలా కథనూ, కథనాన్నీ అర్థం చేసుకుంటూ వాటికి అవసరమైన నేపథ్యాన్ని అందించడంలో అందివేసిన చెయ్యి కళాధర్ గారు.

ఈ సందర్భంలో మాధవపెద్ది గోఖలే గారితో కళాధర్ గారి అనుబంధాన్ని చెప్పుకోవడం సందర్భోచితం. విజయా వారి చిత్రాల టైటిల్స్ లో కళాదర్శకత్వం అనే టైటిల్ కార్డులో తప్పనిసరిగా కనిపించే జంట పేర్లు గోఖలే - కళాధర్ లు. కొన్ని విలువలకు, నియమాలకు కట్టుబడిన అద్భుత కళాదర్శకుడు మా గోఖలే. సుమారు ఇరవై సంవత్సరాలు ఏ పొరపొచ్చాలు లేకుండా ఆయన సాహచర్యంలో తెలుగు చలన చిత్ర చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించిన అద్భుత కళాఖండాల సృష్టిలో పాలుపంచుకున్నారు కళాధర్.

 విజయా సంస్థతో బాటు ఇతర సంస్థల చిత్రాలతో కలిపి సుమారు నాలుగున్నర దశాబ్దాలు పనిచేసిన కళాధర్ గారి వయసు ఇప్పుడు 96 సంవత్సరాలు. సంతృప్తికరమైన వృత్తి జీవితంతో బాటు పరిపూర్ణమైన, నిండైన వ్యక్తిగత జీవితానికి  ఉదాహరణగా నిలిచి త్వరలో శతవసంతాలను పూర్తిచేసుకోబోతున్న సజీవ కళా మూర్తి కళాధర్.

కళాధర్ గారు తన కళా జీవిత విశేషాలను ' సినిమా కళలో కళాధర్ ' అనే గ్రంథంలో అక్షర బద్ధం చేసారు. కళాతపస్వి క్రియేషన్స్ మల్లాది సచ్చిదానంద మూర్తి గారి అధ్వర్యంలో ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ ఎస్వీ రామారావు గారు, మాటూరు సూరిబాబు గారి రచనా సహకారంతో ఈ గ్రంథం తయారయింది.  తన అనుభవాలను సచిత్రంగా వివరించిన ఈ గ్రంథం ఇప్పటి కళా దర్శకులకు కరదీపిక.

ఆయన కళాజీవిత విశేషాలపై ఒక విహంగ వీక్షణం........

  
Vol. No. 02 Pub. No. 143

Saturday, February 12, 2011

' కంచు కంఠం ' సూరిబాబు

 కంచులా మ్రోగే కంఠస్వరంతో, కఠినంగా అనిపించే పద్యాలను పామరులకు సైతం అర్థమయ్యేలాగా సుస్పష్టమైన ఉచ్చారణతో పాడి అటు రంగస్థలాన్ని, ఇటు తెలుగు చిత్ర రంగాన్ని సుసంపన్నం చేసిన నటుడు పువ్వుల సూరిబాబు.

పువ్వు పుట్టగానే పరిమళించిందట. అలా సూరిబాబు ఆరేళ్ళ వయసులోనే బొబ్బిలి యుద్ధం నాటకంలో చిన రంగారావు పాత్ర పోషించాడు. దాంతో నాటకాల మీద మోజు బయిల్దేరింది. ఆది ఆయనతో బాటు పెరిగి పెద్దదై చదువును వదిలిపెట్టేలా చేసింది. అంతేకాదు... స్వగ్రామం కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా బొమ్ములూరు గ్రామం వదలి పోయేలా చేసింది. అక్కడనుంచి పారిపోయిన సూరిబాబు ఎక్కడో వున్న గద్వాల్ లో తేలాడు. అక్కడ వున్న గద్వాల్ సంస్థానం వారి నాటక సమాజంలో జేరాడు. రామదాసు నాటకంలో రాముడు, కృష్ణలీలలులో బాలకృష్ణుడు లాంటి వేషాలు వేసాడు. కొంతకాలానికి అక్కడనుంచి గుంటూరు వచ్చి దంటు వెంకట కృష్ణయ్య గారి సమాజంలో జేరాడు. అప్పట్లో ప్రముఖ నటుడు కొప్పరపు సుబ్బారావు గారి శిష్యరికం చేసి సుశిక్షుతుడైన నటుడిగా తయారయ్యారు సూరిబాబు.

అనంతరం గుడివాడలో స్వంతంగా నాటక సమాజాన్ని నెలకొల్పి అత్యున్నత సాంకేతిక విలువలతో నాటకాలు ప్రదర్శించారు. అయితే నష్టాలు రావడంతో దాన్ని మూసేసి 1936 లో తెనాలి జేరుకున్నారు.  అక్కడ కూడా అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆ సమయంలోనే ద్రౌపదీ వస్త్రాపహరణం తో చిత్రసీమలో ప్రవేశించారు. మాలపిల్ల చిత్రంలో ఆయన పాడిన 'కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ....' పాట వాడ వాడలా మార్మోగింది. చాలా చిత్రాల్లో నటించడమే కాక తన పాటలు, పద్యాలు తానే పాడుకున్నారు. అంతేకాదు పాటలను, ముఖ్యంగా పద్యాలను స్వరపరచడానికి సంగీత దర్శకులు సూరిబాబు గారి సహకారం తీసుకునేవారు. అలా మహాకవి కాళిదాసు చిత్రంలోని మాణిక్య వీణాం....... శ్లోకం స్వరకల్పనలో ఈయన హస్తం కూడా వుంది.

సూరిబాబు గారు తన భార్య రాజేశ్వరి గారి పేరు మీద రాజరాజేశ్వరి నాట్య మండలిని స్థాపించి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ముఖ్యంగా కొప్పరపు సుబ్బారావు గారు రచించిన ' తారాశశాంకం ' నాటకం వారికి ఎంతో పేరు తెచ్చింది. ఆయన రంగస్థలం మీద రామదాసు, రాముడు, చినరంగారావు, ధర్మారాయుడు, రంగారావు, గజేంద్రుడు, తక్షకుడు, కశ్యపుడు, నారదుడు, కంసుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విప్రనారాయణుడు, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, రారాజు, సుబుద్ధి లాంటి ఎన్నో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు.

ఆయన 1915 ఫిబ్రవరి 22 న జన్మించి  1968 ఫిబ్రవరి 12 న అస్తమించారు. రెండూ ఒకే నెలలో రావడం యాదృచ్చికం. ఈరోజు ( ఫిబ్రవరి 12 ) పువ్వుల సూరిబాబు వర్థంతి సందర్భంగా కళా నీరాజనాలు అర్పిస్తూ...

 

Vol. No. 02 Pub. No. 142

Friday, February 11, 2011

గంధర్వ గానం - HMV

--------------------------
11 ఫిబ్రవరి 1974 ....
--------------------------
ఇంద్ర సభ జరుగుతోంది. ఎక్కడనుంచో మధురమైన గానం వినబడింది. అంతే ! సుదీర్ఘ సమాలోచనలతో సందడిగా వున్న సభ నిశ్శబ్దమైంది. అందరూ చెవులు రిక్కించి వినసాగారు. పరవశులై మెల్లగా ఆ గానం వచ్చిన వైపే అందరూ బయిల్దేరారు. వారి దారి భూలోకానికి దారి తీసింది. ముందర దేవేంద్రుడు. వెనుక ఆయన పరివారం. అందరూ భారత దేశంలోని మద్రాస్ లో అడుగు పెట్టారు. అక్కడొక గాయకుడు మధురంగా గానం చేస్తున్నాడు.

ఆ గానం ముందు దేవసభలోని గంధర్వుల గానం దిగతుడుపే ! దేవేంద్రుడు నిగ్రహించుకొలేకపోయాడు. గానం ముగియగానే ఆ గాయకుణ్ణి సమీపించి ప్రశంసించాడు. తమతో పాటు స్వర్గానికి వచ్చి తమను తరింపజేయాల్సిందిగా వేడుకున్నాడు. ఆయనతో బాటు దేవతలందరూ కూడా వంత పాడారు. గంధర్వులైతే ఆ గాయకుని దగ్గర శిష్యరికం చేసి తమ విద్వత్తును మరింత అభివృద్ధి చేసుకోవాలని అభిలషించారు.

విశాల హృదయం కలిగిన ఆ గాయకుడు ఆలోచించాడు. తన గానం ఇప్పటివరకూ భూలోకానికే పరిమితం. సంగీతం విశ్వజనీనం. ఆది అన్ని లోకాలకూ అవసరమే ! గాయకుడు కేవలం ఒక చోటుకే పరిమితం కాకూడదు అనుకున్నాడు. అందుకే దేవేంద్రుని అభ్యర్ధన మన్నించి ఆయనతో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. దేవేంద్రుడు ముల్లోకాలను జయించినంత ఆనందించాడు. సకల స్వర్గ లాంచనాలతో ఆ గాయకుణ్ణి తమ లోకానికి తోడ్కొని వెళ్ళాడు. అమరలోకంలో ఉండవలసిన అద్వితీయ గానం ఈ తుచ్చ మానవులకు మాత్రమే పరిమితం కాకుండా... ఆ మాటకొస్తే అసలు లేకుండా చెయ్యగలిగినందుకు సంతోష పడ్డాడు.

HIS MASTER'S VOICE
ఇక్కడ భూలోకంలో సంగీత కుటుంబమంతా ఘొల్లుమంది. తమ జీవితాల్లో ఇంక చీకటే మిగిలింది అనుకుంది. దేవేంద్రుడు చేసిన అన్యాయానికి ఆగ్రహంతో కుతకుతా వుడికిపోయింది. ఆ విషాదం, ఆగ్రహం చల్లారాక ఆలోచించింది. దేవతలు ఆయన్ని తీసుకెళ్లగలిగారు గానీ ఆయన గానాన్ని కాదుగా ! అని సమాధాన పడ్డారు.ఆయన్ని భౌతికంగా తమకు దూరం చేసినా తమ గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తామని సంగీతాభిమానులందరూ ఒక్కటై ప్రతిజ్ఞ చేసారు.
------------------------
11 ఫిబ్రవరి 2011 .... 
------------------------
గగన విహారం చేస్తున్న దేవేంద్రునికి ఎక్కడ్నుంచో సుపరిచతమైన మధుర గానం వినబడింది. ఆ దిశగా పయనించిన ఇంద్రుడు మళ్ళీ భూలోకానికి వచ్చాడు.

అదే గానం... అదే మార్దవం..... అదే మాధుర్యం.

ఇదెలా సాధ్యం ?

అర్థం కాలేదు దేవేంద్రునికి.

ఆ గాయకుడు గత మూడున్నర దశాబ్దాలకు పైబడి తమ లోకంలో తన గానంతో అలరిస్తున్నాడే ! మళ్ళీ ఇక్కడికెలా వచ్చాడు ? తెలుసుకోవాలనుకున్నాడు. ప్రయత్నం ప్రారంభించాడు.

ఆంధ్ర దేశంలోని ప్రతీ ప్రాంతం తిరిగాడు. ఎక్కడ చూసినా ఆయన గానం వినిపిస్తోంది. ఏ వూరికెళ్ళినా, ఏ పేటకెళ్ళినా, ఏ వీధికెళ్ళినా ఆయన కంఠం వినిపిస్తోంది.

ఎందఱో గాయకులు,.... అందరూ ఆయన పాడిన పాటలే పాడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా టీవీల్లో, రేడియోల్లో, మ్యూజిక్ సిస్టమ్స్ లో, మొబైల్ ఫోన్లలో ఎక్కడ విన్నా ఆయన పాటలే వినిపిస్తున్నాయి. ఆయనకు తెలుగు ప్రజల్లో వున్న ఆరాధనా భావానికి దేవేంద్రుడు పులకించిపోయాడు. ఇన్ని దశాబ్దాలు గడిచినా వారి గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయిన ఆ గంధర్వ గాయకునికి జోహార్లు అర్పించాడు.

 తన గాన మాధుర్యాన్ని తెలుగు వారికి పంచిన... ఇంకా పంచుతూ వున్న గంధర్వ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్థంతి సందర్భంగా స్వర నీరాజనాలర్పిస్తూ ఆయన పాడిన లలిత గీతమాలిక ... 

 
  ఘంటసాల గారిపైన గతంలో రాసిన టపాల లింకులు ...................... 

http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_04.html
http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_1328.html
http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_11.html
http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_04.html

Vol. No. 02 Pub. No. 141

Thursday, February 10, 2011

కథానాయకుడెవరు ?

 ఈ అబ్బాయికి సంగీతం నేర్చుకోవాలని బలమైన కోరిక.

అదీ సంగీతానికి చిరునామా అయిన విజయనగరంలో.... అదికూడా కర్నాటక సంగీతంలో నిధిగా పేరుపొందిన ద్వారం వెంకట స్వామి నాయుడు గారి శిష్యరికంలో....

చేతిలో చిల్లిగవ్వ లేదు. పెద్ద వాళ్ళను అడిగితే అంతదూరం పంపుతారో లేదో తెలీదు. అందుకే తన చేతి వేలికున్న ఉంగరం నలభై రూపాయలకు అమ్మేశాడు. విజయనగరం చేరాడు.

సంగీత కళాశాల ప్రదానాధ్యాపకుడిగా వున్న ద్వారం వారిని కలుసుకున్నాడు. తనను ఆ కళాశాలలో చేర్చుకోవాలని కోరాడు. అప్పుడు కాలేజీకి సెలవులు. తెరిచాక చూద్దామన్నారు అయ్యవారు.

ఎక్కడ వుండాలి ? ఇదీ అతని సమస్య. దానికి కూడా మీరే దిక్కు అని ఆయన్నే వేడుకున్నాడు. అనుమతిస్తే కాలేజీ ఆవరణలోనే ఎక్కడైనా తలదాచుకుని, భుక్తికోసం వారాలు చేసుకుంటూ గడిపేస్తానన్నాడు. అన్నట్లుగానే కాలేజీలోనే బస చేసి, తన నోటి మంచితనంతో వూళ్ళో వారాలు ఏర్పాటు చేసుకున్నాడు.

సాఫీగా, ప్రశాంతంగా రోజులు సాగిపోతే ఇక చెప్పేదేముంది. ఒకరోజు ఆ కాలేజీ ఆవరణలో ఏదో దొంగతనం జరిగింది. సహజంగానే అందరికీ  కొత్తగా వచ్చి ఆవరణలో మకాం పెట్టిన  ఆ అబ్బాయి మీదనే అనుమానం వచ్చింది. అంతే..... అతన్ని అక్కడనుంచి వెళ్ళగొట్టారు. దాంతో అతను రోడ్డున పడ్డాడు. అంతేకాదు దొంగ అనే ముద్ర పడితే అందరూ అనుమానిస్తారు కదా ! వెలివేసినట్లు చూస్తారు కదా ! ( ఇప్పుడు కాదు లెండి ). అప్పటివరకూ ఏర్పాటయిన వారాలు పోయాయి. ఉండడానికి నీడతో బాటు తిండి కూడా కరువయ్యింది. పస్తులతో దిక్కు తోచక ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు.

ఇంతలో ఓ శుభవార్త. కళాశాలలో పోయిన వస్తువు దొరికింది. దొంగా దొరికాడు. అంతే ! ద్వారం వారు అతన్ని అనవసరంగా అనుమానించి వెళ్ళగొట్టినందుకు  పశ్చాతాప్త పడ్డారు. వెదికించి మరీ అతన్ని పిలిపించారు. కళాశాలలో జేర్చుకున్నారు. ఆ తర్వాత అతను ద్వారం వారికి ప్రియ శిష్యుడయ్యాడు. సంగీత విద్వాన్ సాధించాడు. సంగీతంలో నిధి అనిపించుకున్నాడు. ఎన్నెన్నో కీర్తి శిఖరాలు అధిరోహించాడు.

ఇంతకీ ఈ కథలో కథానాయకుడు ఎవరు ? ఎవరైనా చెప్పగలరా ? ప్రయత్నించండి. చాలామంది చెప్పగలరనే అనుకుంటున్నాను. 

Vol. No. 02 Pub. No. 140

Wednesday, February 9, 2011

మంద భాగ్యుడు

 ఆత్రేయ గారు ఓసారి ఓ నటుడితో
" ఓ సిగరెట్ వుంటే ఇవ్వవోయ్ "  అని అడిగారు.

దానికా నటుడు " లేదండీ ! మానేసాను " అన్నాడు.

" పోనీ మందుందా ? " అనడిగారు ఆత్రేయ.

" లేదు సార్ ! అదీ మానేసాను " అన్నాడా నటుడు.

ఆత్రేయ గారు నవ్వుతూ " ఇప్పటివరకూ మందు భాగ్యుడివే అనుకున్నాను. మంద భాగ్యుడివి కూడా అయ్యావన్నమాట " అన్నారు.

Vol. No. 02 Pub. No. 139

Tuesday, February 8, 2011

ఈ నటుడెవరు ? - జవాబు

   కనుక్కోండి చూద్దాం - 36 

 ఈ రెండు ప్రశ్నలకు ఇద్దరు వేర్వీరుగా సమాధానాలు చెప్పారు. మాధురి గారు మొదటి ప్రశ్నకు, జ్యోతి గారు రెండవ ప్రశ్నకు సరైన జవాబులే ఇచ్చారు. ' రేఖా చిత్రం ' బ్లాగు అప్పారావు గారు పేస్ బుక్ లో అడిగారు ' ఇంతకీ ఆ నటుడెవరు ?' అని.  రాజేంద్రకుమార్ గారు ఇతరులకు అవకాశం ఇవ్వడానికి ఆగినట్లున్నారు. సరైన సమాధానమిచ్చిన మాధురి..జ్యోతి గార్లకు, స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. ఇక జవాబులు .................

1 ) ఈ ప్రక్క స్టిల్ లో ఎన్టీ రామారావు గారి ప్రక్కన ఎర్రటి వలయంలో గుర్తు పెట్టిన నటుడు ఎవరో గుర్తుపట్టగలరా ?

జవాబు : శంకరాభరణం, సాగరసంగమం, స్వాతి ముత్యం లాంటి చిత్రాలను నిర్మించి తెలుగు చిత్ర ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన పూర్ణోదయ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు గారు.

2 ) ఈ స్టిల్ ఏ చిత్రంలోదో కూడా చెప్పగలరా ?

జవాబు : ఎన్టీయార్ నటించిన ' ఆత్మబంధువు ' చిత్రంలోనిది. ఇందులో ఏడిద నాగేశ్వరరావు ఎస్వీ రంగారావు కుమారునిగా నటించారు. 

Vol. No. 02 Pub. No. 137a

నవ్వులరాజు 'బాబు'

*******************************************************************************************


నిజం చెప్పాలంటే.... నా గతాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను ! నా దృష్టిలో గతాన్ని మరచిపోయిన మనుషులు..... చితిమీద చేర్చబడిన శవాల లాంటివారు. ఇలా ఎందుకంటున్నానంటే... గతంలో నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలే ముందు జీవితానికి దారి చూపిస్తాయి... 

*********************************************************************************************

నరసాపురంలో పుట్టి, మండపేటలో పెరిగి, రాజమండ్రిలో కళాకారుడిగా ఎదిగి, మద్రాస్ చేరి సినిమాల్లో హాస్య నటుడిగా స్థిరపడి అఖిలాంద్ర ప్రేక్షకుల్ని రాజబాబుగా అలరించిన  పుణ్యమూర్తుల అప్పలరాజు చెప్పిన మాటలవి.

ఆయనకు తొలి ప్రేక్షకులు రాజమండ్రి రిక్షా కార్మికులు. ఆయన మిమిక్రీని చూసి ఆనందించి.. ఆభినందించిన వారిని ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకున్నారు. తనను కష్టాల్లో ఆదుకున్న మిత్రులను, సినిమాల్లో వేషాల కోసం తన ఫోటోలు తీసి పెట్టిన బాబు ఫోటో స్టూడియో వారిని కూడా అనునిత్యం తలచుకునే సంస్కారవంతుడు రాజబాబు. 1960 లో మద్రాసులో అడుగుపెట్టిన రాజబాబు మిమిక్రీ చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ సినిమాల్లో వేషాలకోసం ప్రయత్నాలు సాగించారు. ఆ ప్రయత్నంలో ఆయన కొన్ని రోజులు కటిక ఉపవాసాలు కూడా చేసారు. ఆ సమయంలో మంచినీళ్ళు ఇచ్చి ఆదుకున్న ప్రముఖ నటి. నర్తకి రాజసులోచన ఇంటి వాచ్ మాన్ ను కూడా చివరిదాకా తల్చుకున్నారంటే..... వేషాలు దొరికాక కృతజ్ఞత చెప్పడానికి అతన్ని వెదుక్కుంటూ వెళ్ళారంటే...... ఆయన గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు.

ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావు గారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను తీసిన ' సమాజం ' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీ ప్రస్థానంలో తొలి అడుగు. రావికొండలరావు, డా. గరికపాటి రాజారావు గార్ల ప్రోత్సాహంతో రంగస్థలం మీద కూడా తనని తాను నిరూపించుకున్నారు.

అడపాదడపా చిన్న చిన్న వేషాలు వేసినా జగపతి వారి ' అంతస్తులు ' చిత్రం ఆయన నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన తిరిగి చూడలేదు. బిజీ అయిపోయారు. ఒక దశలో రోజుకు రెండు, మూడు షిఫ్ట్ లు పనిచేసిన సందర్భాలు కూడా వున్నాయి. హాస్య నటుడిగానే కాక కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. అందర్నీ నవ్వించి ఆనందపరచిన రాజబాబు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పరిచి ప్రతీ పుట్టిన రోజున ఒక ప్రముఖుణ్ణి సన్మానించి మూడురోజులపాటు నాటక ప్రదర్శనలను నిర్వహించేవారు. ఈ కార్యక్రమంలో తొలిసారిగా తన నట జీవితానికి ప్రేరణ అయిన అప్పటి హాస్య నటుడు బాలకృష్ణ గారిని సన్మానించారు. కేవలం బాలకృష్ణ గారి నటన కోసం రాజబాబు ' పాతాళభైరవి ' చిత్రాన్ని తొంభైసార్లు చూసారట.

మనిషి బ్రతికి వుండగా గొప్పవాడు అనిపించుకోవడం కాదు.... చచ్చిపోయిన తర్వాత... గొప్పగా బ్రతకాలి 
..............అంటుండే రాజబాబు అంతటి గొప్ప పేరు సంపాదించి 1983 వ సంవత్సరం ఫిబ్రవరి  7 వ తేదీన అకాల మృత్యువు పాలయ్యారు.    

ఆ నవ్వులరాజుని మరోసారి స్మరించుకుంటూ ................రాజబాబు గారి మీద గతంలో రాసిన టపా ఇక్కడ ...............

http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_3640.html

Vol. No. 02 Pub. No. 138

Sunday, February 6, 2011

ఈ నటుడెవరు ?

   కనుక్కోండి చూద్దాం - 36 

1 ) ఈ ప్రక్క స్టిల్ లో ఎన్టీ రామారావు గారి ప్రక్కన ఎర్రటి వలయంలో గుర్తు పెట్టిన నటుడు ఎవరో గుర్తుపట్టగలరా ?

క్లూ : ఈ నటుడు కొన్ని చిత్రాల్లో నటించి ఆ తర్వాత నిర్మాతగా మారి తెలుగు చలన చిత్ర రంగానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చిత్రాలను నిర్మించారు. నిర్మాతగా మారాక ఆయన నటించలేదు. కానీ ఆయన కుమారులు మాత్రం కొన్ని చిత్రాల్లో నటించారు. 

2 ) ఈ స్టిల్ ఏ చిత్రంలోదో కూడా చెప్పగలరా ?

Vol. No. 02 Pub. No. 137

Saturday, February 5, 2011

చల్లారాక......

 మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం తెలుగు సాహితీ ప్రియుల ఇళ్ళల్లో తిష్ట వేసింది. ఆయన రాసిన కాంతం కథలు, వాటిలోని ఛలోక్తులు గిలిగింతలు పెడతాయి.

ఓసారి మునిమాణిక్యం గారికి భార్య కాంతంతో తగవొచ్చింది. ఆయన కోపంతో వెళ్ళి వరండాలో కూర్చున్నారు. కాసేపటికి కాంతం గుమ్మం దగ్గరికి వచ్చి

" ఏమండోయ్ ! ఇక్కడ కాఫీ పెడుతున్నాను. మీ కోపం చల్లారాక..... చల్లారిన కాఫీ వేడిచేసుకుని తాగండి. నేను స్నానం చేసి మడికట్టుకోవడానికి పోతున్నా ! " అని చెప్పేసి వెళ్ళిపోయింది.   

Vol. No. 02 Pub. No. 136

Thursday, February 3, 2011

కొత్త అభినందన

మాటకు మాట పేరుతో రాసిన టపా చదివిన U . K . మిత్రులు శ్రీ వోలేటి వెంకట సుబ్బారావు గారు మార్క్ ట్వైన్ దే మరో రసగుళిక పంపారు. ఇది కూడా చదివి ఆనందించండి.................

మార్క్ ట్వైన్ ఓసారి తాను రాసిన పుస్తకాలలో ఒకదానిని తనకు బాగా సన్నిహితులైన మిత్రుల్లో ఒకరికి బహుకరించారు. ఆ పుస్తకం మొదటి పేజీలో ' మిత్రునికి అభినందనలతో.... ' అని రాసి సంతకం చేసి ఇచ్చారు.

తర్వాత చాలాకాలానికి మార్క్ ట్వైన్ సెకండ్ హ్యాండ్ పుస్తకాలమ్మే షాపుకి వెళ్ళినపుడు అదే పుస్తకం అక్కడ ఆయన కళ్ళబడింది. వెంటనే దాన్ని కొని మొదటి పేజీలో ఇంతకుముందు రాసిన వ్యాఖ్య క్రింద
" మరోసారి కొత్తగా అభినందనలతో.... " ( With my renewed compliments )
అని మళ్ళీ రాసి సంతకం చేసి ఆ మిత్రునికి పంపారు.     

Vol. No. 02 Pub. No. 135

Wednesday, February 2, 2011

నూరో పుట్టినరోజు

 సర్ విన్ స్టన్ చర్చిల్ తన ఎనభై రెండవ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆ సంబరాన్ని ఫోటోలు తీసిన ఓ యువకుడు చర్చిల్ తో

" సర్ ! ఇలాగే మీరు మీ నూరో పుట్టినరోజు జరుపుకోవాలని, ఆ ఉత్సవానికి  కూడా నేనే ఫోటోలు తియ్యాలని కోరుకుంటున్నాను " అన్నాడు.

చర్చిల్ అతణ్ణి ఓసారి ఎగాదిగా చూసి " అదేంటి బాబూ ! అలా అంటావు ? నీకా అనుమానం ఎందుకు వచ్చింది. నువ్వింకా ఆరోగ్యంగానే కనిపిస్తున్నావు కదా ! " అన్నారట. 

Vol. No. 02 Pub. No. 134

సజీవ శిలావిగ్రహం

మహాకవి శ్రీశ్రీ గారి చలోక్తుల గురించి చెప్పేదేముంది.

ఓసారి కొంతమంది అభిమానులు ఆయన దగ్గరకొచ్చి " మా వూళ్ళో మీ శిలా విగ్రహం పెడదామనుకుంటున్నాం. దానికి మీరు అంగీకరించాలి " అన్నారు.

అప్పుడు శ్రీశ్రీ గారు సీరియస్ గా " చాలా సంతోషం. కానీ ఒక్కమాట. నాకు డబ్బు చాలా అవసరంగా వుంది. ఆ విగ్రహం పెట్టడానికి ఖర్చయ్యే మొత్తం డబ్బు నాకిచ్చేస్తే మీరు ఏ సెంటర్లో నిలబడమంటే ఆ సెంటర్లో విగ్రహంలా నిలబడతాను " అనగానే ఆ వచ్చినవాళ్లందరూ మాయమైపోయారట.

Vol. No. 02 Pub. No. 133

Tuesday, February 1, 2011

జోడు గుర్రాల స్వారీ

విజయా వారి ' మాయాబజారు ' చిత్రం తెలుగు వారి మనస్సులో ఎంతగా నిలిచిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ చిత్రం గురించిన విశేషాలు ఎంత చెప్పుకున్నా ఇంకా ఎన్నో మిగిలిపోతుంటాయి. టీం వర్క్ అనేది సక్రమంగా వుంటే చక్కటి మధుర కావ్యాలు వెలువడతాయనడానికి సజీవ ఉదాహరణ మాయాబజారు.


ఆ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణుల పనితనం చిరకాలం చెప్పుకోదగింది. వారిలో ప్రత్యేకం కళా దర్శకులు మా. గోఖలే, ఛాయాగ్రాహకులు మార్కస్ బార్ట్లే ల ప్రతిభ. గోఖలే గారు అద్భుతమైన సెట్స్ కు రూపకల్పన చేసి అలరిస్తే, బార్ట్లే వెలుగు నీడలను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. సినీ అద్భుతాల్లో ఒకటిగా నిలిచిన అందమైన విజయావారి చందమామను సృష్టించింది ఈ జంటే !


ఒకసారి మార్కస్ బార్ట్లే గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక విలేఖరి  " మాయాబజారు చిత్రంలో ఘటోత్కచుడు వున్న అడవికి అభిమన్యుడు తల్లితో వచ్చినపుడు చుట్టూరా వున్న అడవంతా మండిపోవడం, దారికి అడ్డంగా గోడ ఏర్పడడం లాంటి మాయలు అద్భుతంగా చిత్రీకరించారు. ఆది మీ గొప్పతనమా ? గోఖలే గారి గొప్పతనమా ? " అని అడిగాడు.

దానికి బార్ట్లే గారు నవ్వుతూ " ఆ దృశ్యాలు అంత అద్భుతంగా రావడానికి నేను, గోఖలే గారు ఇద్దరూ కారణం కాదు. మా జోడు గుర్రాలను స్వారీ చేసిన మహానుభావుడు కె. వి. రెడ్డి గారిది. ఆ చిత్రం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం " అన్నారు.

ఎదిగిన కొద్దీ ఒదిగి వుండడం అంటే అదీ ...................   

Vol. No. 02 Pub. No. 132
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం