బుడి బుడి నడకలు నేర్చుకున్నాకే పరుగెత్తడం నేర్చుకుంటారు
తప్పటడుగులు వేయడం వచ్చాకే తప్పుటడుగుల మర్మం తెలుసుకుంటారు
సుదీర్ఘ జీవన యానంలో ఒక సంవత్సర కాలం తక్కువేమీ కాదు
వెనుదిరిగి చూసుకుంటే సాధించినదేమిటో, సాధించాల్సింది ఏమిటో తెలుస్తుంది
ఈరోజు ఆగష్టు 14 వ తారీఖు
సరిగా సంవత్సరం క్రితం అనుకోకుండా '
శిరాకదంబం ' ప్రారంభమైంది
అందులో చెప్పడానికి, రాయడానికి చాలా కనిపించింది
నచ్చినవి, మెచ్చినవి, భద్రంగా దాచుకున్నవి బయిట పెట్టడం ప్రారంభించాను
ఎంత రాసినా తరగడం లేదు.. ఎంత రాసినా తృప్తి కలగడం లేదు
ఇంకా రాయాలి.. నా దగ్గరున్నవి, నాకు తెలిసినవి అన్నీ అందరికీ పంచాలి
అనుకుంటుండగానే సంవత్సరం గడిచిపోయింది
ఇంకెంతకాలం రాయగలనో... ఇంకెన్ని విషయాలు రాయగలనో...!
చదివేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, మొట్టికాయలు వేసే వాళ్ళు
............ ఇలా ఎంతోమంది కనిపించారు ఈ బ్లాగులోకంలో
అవును ఇదో లోకం
ఇందులో పడితే బయిట ప్రపంచం కనబడదు
కష్టాల, బాధల, అశాంతుల కేకలు వినిపించవు
మన లోకం మనది.... మన రాతలు మనవి
మనకి తెలిసింది రాస్తాం !..... మనకనిపించింది రాస్తాం !!
శిరాకదంబం గణాంకాలు -
సంవత్సర కాలంలో రాసిన మొత్తం టపాలు ( అనుబంధాలతో కూడా కలిపి ) - 376
సంవత్సర కాలంలో వచ్చిన వ్యాఖ్యలు
( టపాలతో సంబంధం లేనివి, నా జవాబులు, రిపీట్ అయినవి కాక ) - 761
శిరాకదంబం అభిమాన మిత్రులుగా చేరినవారు
( చేరకపోయినా అభిమానం కురిపిస్తున్నవారు అనేకమంది ) - 20
శిరాకదంబం సందర్శకులు
( బ్లాగులో ఉంచిన విడ్జెట్ ద్వారా మాత్రమే !
ఆది కూడా ప్రారంభించిన
నెల తర్వాత పెట్టినది. మిగిలిన లింక్ లలో విషయం తెలీదు
) - 20928
' కళాకారులకు బలం ప్రేక్షకుల చప్పట్లే ' అన్నారు ఒక రచయిత
బ్లాగర్లకు వ్యాఖ్యలే బలం అంటున్నారు బ్లాగు మిత్రులు
ఆ వ్యాఖ్య మెచ్చుకోలైనా, విమర్శైనా, తిట్లయినా ఏవైనా
టపా రాసాక చకోర పక్షిలా బ్లాగరు ఎదురుచూసేది వ్యాఖ్యలకోసమే !
శిరాకదంబం లో తొలిసారి వ్యాఖ్యలు రాసినవారు
rayraj గారు
, నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారు,
భావన గారు
ఆది ఏడవ టపా -
తెలుగు భాషను మనం పరిరక్షించుకోగలమా ?
తొలి వ్యాఖ్యలు రాసిన ఈ ముగ్గురికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిజానికి అప్పుడు వారు కొన్ని ప్రశ్నలేసారు. వాటికి అప్పుడు సరిగా సమాధానం చెప్పగలిగానో.. లేదో గానీ తెలుగు సంప్రదాయాల్ని, సంస్కృతినీ భావితరాలకు అందించే కార్యక్రమం చేపట్టాలనేది నా చిరకాల వాంఛ . అన్నీ వ్యాపారాత్మకమైపోయిన ఈ రోజుల్లో ఇది కష్ట సాధ్యమైన విషయమే ! అయినా ఏటికి ఎదురీదడం విశేషం గానీ వాలుకి కొట్టుకుపోవడం విశేషం కాదేమో ! అందుకే చాలాకాలంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. దానికి బ్లాగుల ద్వారా మిత్రులైన కొందరు ప్రోత్సాహం, సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. అలాగే కొంతమంది చిన్ననాటి మిత్రులు సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు. పూర్తిగా కార్యరూపం దాల్చాక వివరాలు ఇస్తాను.
ఈ బ్లాగుల వల్ల కొత్తగా ఎంతోమంది మిత్రులను పొందగలిగాను. ఎన్నో భావాలు, ఉల్లాసాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు...మరికొన్ని విషాదాలు కూడా బ్లాగుల్లో చూసాను. అయితే నా అదృష్టం నాకు మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహించే మిత్రులు ఈ బ్లాగులోకంలో లభించారు.... లభిస్తున్నారు.
ఈ సంవత్సరంలో కొన్ని మధుర జ్ఞాపకాలు -
1 . ' కొత్తపాళీ ' నారాయణస్వామి గారి ' రంగుటద్దాల కిటికీ ' పుస్తకావిష్కరణ సభలో పాల్గోవడం, అక్కడ ' తెలుగు పద్యం ' భైరవభట్ల కామేశ్వరరావు గారు, ' నవ్వులాట ' శ్రీకాంత్ గారు, ' తెలుగు కళ ' పద్మకళ గారు, తెలుగు భాషా వికాసానికి అవిరళ కృషి చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ నూర్ రహమతుల్లా గారు మొదలైన వారి పరిచయ భాగ్యం లభించింది.
2 . జనవరిలో విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఈ - తెలుగు డెమో నిర్వహణలో పాల్గోవడం, ఆ సందర్భంగా డి.ఎస్.కె. చక్రవర్తి గారు, కశ్యప గారు, సతీష్ గారు, ప్రసాద్ గారు మొదలైన బ్లాగర్లను కలవడం జరిగింది.
3 . సంక్రాంతికి ' సాహిత్య అభిమాని ' శివరామ ప్రసాద్ గారు విజయవాడ వచ్చిన సందర్భంలో కొంతమంది విజయవాడ బ్లాగర్లు కలవడం జరిగింది.
శిరాకదంబం అనే ఒక బ్లాగు వుందని అంతర్జాలంలో అందరికీ తెలియపరిచి తద్వారా కొంతమంది చదువరులను సంపాదించేందుకు దోహదపదడంలో కూడలి, హారం, మాలిక లాంటి బ్లాగు అగ్రిగేటర్లు, తెలుగు పీపుల్ డాట్ కామ్, ఇండ్యా రాక్స్, వెబ్ దునియా - తెలుగు లాంటి సైట్స్, పేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ బజ్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పాత్ర మరువలేనిది.
సంవత్సరం గడిచిందంటే బుడి బుడి నడకల స్థాయి నుంచి ధీమాగా తొలి అడుగు వేసే స్థితికి చేరుకున్నామనుకుంటాను. ఇన్నాళ్ళూ చేయి పట్టుకు నడిపించిన వారెందరో పేరు పేరునా చెప్పడం కష్టమైనా సీనియర్ లూ, జూనియర్ లూ అనే తేడాలేకుండా బ్లాగు మిత్రులందరూ తమ సలహాలు, సూచనలతో
శిరాకదంబం ను ప్రోత్సహిస్తూనే వున్నారు. ఇందులో కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ అని లెఖ్ఖలు చెప్పడం ఉచితం కాదనుకుంటాను. బ్లాగర్లే కాదు ఇతర మార్గాల ద్వారా చదవరులు కూడా
శిరాకదంబం చూసి తమ అభిప్రాయాల్ని తెలుపుతూనే వున్నారు. ప్రోత్సహిస్తూనే వున్నారు. ఇలా
శిరాకదంబం బలోపేతం కావడానికి దోహదపడుతున్న వారెందరో ................ అందరికీ శతకోటి వందనాలు. ముందు ముందు కూడా ఇలాగే మిత్రులందరూ తమ సలహాలు, సూచనలు, విమర్శలతో
శిరాకదంబం ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ.............
Vol. No. 01 Pub. No. 374