Tuesday, May 31, 2011

నట దర్శకురాలు

   కనుక్కోండి చూద్దాం - 4


ఈ ఫోటోలో వున్న ఒకప్పటి ప్రముఖ నటి... అప్పట్లో ప్రముఖులైన ఒక నట దర్శకుడి భార్య.  ఈమె కూడా ఒక చిత్రానికి దర్శకత్వం వహించింది.

1 ) ఆ నట దర్శకుడు ఎవరు  ? 

2 ) ఆమె దర్శకత్వం వహించిన చిత్రమేది ?
 Vol. No. 02 Pub. No.244

Saturday, May 28, 2011

తెలుగు జాతి సాంఘిక చరిత్రకారుడు

ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథకర్త , తెలంగాణా రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య పునర్జీవనానికి కృషి చేసిన మహానుభావుడు సురవరం ప్రతాపరెడ్డి.

నిజాం కాలంలో నిరాదరణకు గురైన తెలుగు భాషావ్యాప్తికి, విద్యావ్యాప్తికి అలుపెరగని కృషి చేసిన సురవరం వారి జన్మదిన సందర్భంగా ఆంధ్రజ్యోతిలో వకుళాభరణం రామకృష్ణ గారి వ్యాసం చదవండి.


 http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2011/05/28/ArticleHtmls/28052011004010.shtml?Mode=1

Vol. No. 02 Pub. No. 243

ఆంధ్రుల అన్న

 ఆంధ్రులందరికీ ఆయనే అన్న 
తెలుగు తెరమీద ఆయనే రామన్న 

రాముడైనా, కృష్ణుడైనా
రావణుడైనా, దుర్యోధనుడైనా

అన్నైనా, తమ్ముడైనా 
ప్రియుడైనా, భర్త అయినా 
 
తండ్రి అయినా, తాత అయినా
ఆంధ్రభోజుడైనా, చంద్రగుప్తుడైనా 

ఏ పాత్రయినా ఆయనకే సాటి
పరకాయప్రవేశంలో ఆయనే మేటి

స్పురద్రూపం, గంభీరమైన నటన ఆయన సొత్తు
పులకరించింది ఆయన నటనకు జాతి యావత్తూ

మదరాసీలనిపించుకున్న మనల్ని తెలుగు వారనిపించిన ఘనత ఆయనది
ఘనకీర్తి కలిగిన తెలుగు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన పుట ఆయనది


 నందమూరి తారకరామారావు గారి జన్మదినం సందర్భంగా కళానీరాజనాలు సమర్పిస్తూ ................


 తారకరాముడి మీద రాసిన గతంలోని టపాలు....
నటరత్న- ముఖ్య జీవన ఘట్టాలు
తెలుగు తెర కృష్ణుని జన్మదినం
' వామ ' పక్ష కృష్ణుడు  

Vol. No. 02 Pub. No. 242

Friday, May 27, 2011

తెలుగు తేజం కందుకూరి

మూఢాచారాలతో కునారిల్లుతున్న మన సమాజాన్ని అభ్యుదయం వైపు నడిపించడానికి ప్రతీ యుగంలోనూ, ప్రతీ తరంలోనూ కొంతమంది మహనీయులు పుడుతుంటారు. వారు తమ జీవిత సర్వస్వాన్ని ధారభోసి సమాజోద్ధరణకు అంకితమవుతారు. అలాంటి కోవకు చెందిన మహానుభావుడు కందుకూరి వీరేశలింగం.

సమాజం లో పేరుకుపోయిన మూఢనమ్మకాల కుళ్ళును తొలగించడానికి  నడుం కట్టిన వీరేశలింగం సంస్కర్తలకే ఆదర్శంగా నిలిచారు. తెలుగువారు గర్వంగా చెప్పుకోగలిగిన మహనీయుల్లో ప్రథమశ్రేణిలో నిలిచిన వారు వీరేశలింగంగారు.

అతి బాల్య వివాహాలు, అతి వృద్ధవివాహాలు, కన్యాశుల్కం లాంటి దురాచారాలను రూపుమాపడానికి ఏర్పాటైన బ్రహ్మ సమాజం కొంతమంది చదువుకున్న వారిలో తప్ప ఇతరుల్లో ప్రభావం చూపకపోవడంతో సామాన్య జనులలో కూడా ఈ దురాచారాల దుష్ప్రభావాన్ని ప్రచారం చేసి అవి రూపుమాపడానికి కృషి చేసారు. వీటితో బాటు భర్త మరణంతో విధవలుగా ముద్ర పడి జీవితాంతం మోడులా బ్రతుకుతున్న స్త్రీలను ఉద్ధరించడానికి విధవా పునర్వివాహాలను ప్రోత్సహించారు.

తన వివేకవర్థని పత్రికను అవినీతి అక్రమాలపై  కొరడాగా ఝళిపించి పత్రికారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారు.
 తన ఆశయ సాధనకోసం ఏటికి ఎదురీది, ఎన్నో కష్టనష్టాలకోర్చిన కార్యసాధకుడు కందుకూరి.

 తెలుగు తేజం కందుకూరి వీరేశలింగంపంతులు గారి వర్థంతి నేడు. ఆ మహనీయునికి నీరాజనాలర్పిస్తూ.......

పంతులు గారు జరిపిన తొలి పునర్వివాహం విశేషాలు మీకోసం .............. 

http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_11.html


Vol. No. 02 Pub. No.241

ఆధునిక భారత రూపశిల్పి

 ప్రాజెక్ట్ లు ఆధునిక దేవాలయాలని నిర్వచించిన మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రు. స్వతంత్ర్య భారతదేశ నిర్మాణానికి కృషి చేసిన వారిలో నెహ్రు కుటుంబానికి ప్రముఖ స్థానమే వుంది. అందుకే ఇప్పటికీ మనదేశంలో ఆ కుటుంబానికి ప్రాధాన్యం తగ్గలేదు.

మన ప్రథమ ప్రధానిగా నెహ్రు ఈ దేశానికి అందించిన సేవలు మరువలేనివి. 1947 లో స్వాతంత్ర్యం సిద్ధించిన నాటినుంచి 1964 లో మరణించేవరకూ ప్రధానమంత్రిగా పనిచేసిన ఘనత నెహ్రుది. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ వెన్నంటి వుండి ఆయన వారసుడిగా పేరు పొందారు. ప్రధానిగా పార్లమెంటరీ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేసారు. విదేశీ వ్యవహారాల్లో మధ్యే మార్గం పాటించే విధానాన్ని అమలుచేసారు. అలీనోద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరు నెహ్రు. 

భారతదేశ సమగ్ర ఆర్థికాభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలు అమలులోకి తెచ్చినా. ఇండో చైనా ఘర్షణ నివారణకు పంచశీల అమలు చేసినా అది నెహ్రుకే చెల్లింది. ఎన్నో భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ లు. హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ లు తన హయాంలో ప్రారంభించారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, ఐ.ఐ.టి. , ఐ. ఐ. ఎం., ఎన్. ఐ. టి. లాంటి అత్యున్నత స్థాయి విద్యాసంస్థలు నెహ్రు హయాంలోనే ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపం వల్ల చదువుకు దూరం కావడం గమనించి వారికి నాణ్యమైన పాలు, ఆహారం పాఠశాలలలోనే అందించే పథకాన్ని ప్రారంభించారు. తద్వారా విద్యావ్యాప్తికి దోహదం చేసారు. గ్రామీణ ప్రాంతాల్లో వయోజనవిద్య వ్యాప్తికి కృషి చేసారు. కులవివక్షత, లింగవివక్షత నిర్మూలనకు చట్ట సవరణలు కూడా ఆయన హయాంలోనే జరిగాయి. 

సుమారు రెండు వందల సంవత్సరాలు పరాయి పాలకులు పీల్చి పిప్పిచేసిన భారతదేశ పునర్నిర్మాణానికి నెహ్రు చేసిన కృషి అనిర్వచనీయం. 

 జవహర్లాల్ నెహ్రు వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ............................

Vol. No. 02 Pub. No. 240

Wednesday, May 25, 2011

సినిమాల్లో సస్పెన్స్

సస్పెన్స్ చిత్రాల సృష్టికర్త అల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఓ సందర్భంలో సినిమాల్లో ' సస్పెన్స్ '  ని నిర్వచిస్తూ ........


 " సినిమాలో హఠాత్తుగా బాంబు పేలితే అది ఆశ్చర్యం.  కానీ అయిదు నిముషాల్లో బాంబు పేలబోతోందని ప్రేక్షకులకి తెలిసి, ఆ సినిమాలోని హీరోకి మాత్రం ఆ విషయం తెలియకపోతే అది సస్పెన్స్ "    Vol. No. 02 Pub. No. 239

Tuesday, May 24, 2011

ఎదిగిన మనిషి

మల్లంపల్లి  చంద్రశేఖర వీరభద్ర వరప్రసాద్ - ఈ పేరు చెబితే చాలామందికి తెలియదేమో ! ఈయన ఒకప్పుడు ఏలూరులో వ్యవసాయ శాఖలో పనిచేసారు. అప్పుడాయనకి తన ఉద్యోగం, తన లోకమే తప్ప మరో ప్రపంచం తెలీదు.అలాంటి సాదా సీదా ప్రభుత్వోద్యోగి తర్వాత ఎంతో ఎత్తుకి ఎదిగారు. అంటే దానర్థం ఆయన పొడుగు పెరిగారని కాదు. ఆ మాట కొస్తే ఆయన పొడుగు అయిదు అడుగులు మించలేదు. అయినా ప్రతిభకు ఒడ్డూ పొడుగూ అడ్డు కాదని నిరూపించారు. 

చాలా ఏళ్ళ తర్వాత 2005 లోననుకుంటాను. హైదరాబాద్ లో వున్న ఆయనింటికి ఓ మిత్రునితో కలసి వెళ్ళడం జరిగింది. ఆ ఇల్లు ఆ ప్రాంతం లోని ఇళ్ళతో పోలిస్తే చిన్నదే ! కానీ చూడ ముచ్చటగా వుంది.  ఆయనకీ మంచి అభిరుచి వుంది అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను. హాలు పెద్దదే ! కానీ హాల్లో ఫర్నిచర్ ఏమీ కనబడలేదు. నాలుగయిదు ప్లాస్టిక్ కుర్చీలు, ఓ ప్రక్కగా ఓ పాత చెక్క టేబుల్,  దాని ముందు మరో పాత వైర్ కుర్చీ, అందులో ఓ సాధారణ లుంగీ, బనియన్ తో ఆయన ఏదో రాసుకుంటూ కనిపించారు. పరిచయాలయ్యాయి. గతంలో ఆయనతో వున్న చిన్నపాటి పరిచయాన్ని గుర్తుచేసి, నా నేపథ్యం చెప్పగానే ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఆ తర్వాత అనుకోకుండా నేను ఆ ఇంట్లోనే  ఆయనతో బాటు కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. అప్పటికే ఎంతో ప్రసిద్ధుడు, అంతు తెలియని ఆస్తిపరుడు అయిన ఆయన నిరాడంబర జీవనం నన్ను ఆశ్చర్యపరచింది. ముఖ్యంగా ఆయన నేను అక్కడ వున్నన్ని రోజులు నా పట్ల కనబరిచిన  శ్రద్ధ మరచిపోలేను. నేను ఉదయం లేవగానే కాఫీ తాగానా లేదా అనేదానితో ప్రారంభించి రాత్రి ఏ సమయంలో వచ్చినా ఏమైనా తిన్నానా లేదా అని అడగడం నిజంగా ఆ స్థాయిలో వున్న ఏ వ్యక్తీ నుంచి ఆశించలేము. 

ఆయన గురించి కొన్ని అపోహలున్నాయి. ఆయన చాలా పిసినారి అని, ఎంత సంపాదించినా అనుభవించడం చేతకాదని  ఇప్పటికీ అందరూ చెప్పుకుంటారు. నిజమే ఆయన్ని దూరం నుండి చూసేవాళ్ళకి అలాగే కనిపిస్తారు. మొదట్లో ఆయన జీవనశైలి చూసి నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఆయనతో కొన్ని రోజులు గడిపిన అనుభవం, ఆయన చెప్పిన కొన్ని విషయాలు నా అభిప్రాయాన్ని మార్చాయి. ఆ పిసినారితనం వెనుక ఆయన ఆలోచనలు తెలిసాయి. అవి జీవితసారాలు. ఆయన జీవితమే కాక ఇతరుల జీవితాలు, వారి స్థితిగతులు ఎంత నిశితంగా గమనిస్తారో అప్పుడే అర్థమయింది. ఒకరకంగా చెప్పాలంటే ఆయన మంచి ఆర్థికవేత్త. సంపాదించే ప్రతి రూపాయిలో ఎంత ఖర్చుపెట్టాలి, ఎలా ఖర్చుపెట్టాలి, ఎంత పొదుపు చెయ్యాలి అనే విషయాల్లో ఆయనకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వుంది. తన చుట్టూ వున్న వ్యక్తుల వైఫల్యాలను తన విజయాలకు మెట్లుగా ఉపయోగించుకున్నారు. ఆడంబరాలకు, వ్యసనాలకు లోనై తాము చివరిదశలో నరకం అనుభవించడమే కాక తమ కుటుంబాలను వీధి పాలు చేసిన ఎందరినో నిశితంగా గమనించారు. అందుకే వాటన్నిటికీ దూరంగా ఉంటూ నలభై అయిదు సంవత్సరాలుగా ఓటమి, విశ్రాంతి అన్నది ఎరుగకుండా సాగిపోతున్నారు. 

ఆయనే........ 1966 లో  చిత్రసీమలో ప్రవేశించి ఇప్పటివరకూ విశ్రాంతి అన్నది లేకుండా పనిచేస్తున్న విలక్షణ నటుడు చంద్రమోహన్
ఆయన సహజ నటుడు. ఏ నటనానుభవం లేకుండా బి. యన్. రెడ్డి గారి ' రంగులరాట్నం ' చిత్రంతో ప్రారంభించి కథానాయికుడు, ప్రతినాయకుడు, సహాయనటుడు, క్యారెక్టర్ నటుడిగా.....ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు..... పోషిస్తున్నారు.... పోషిస్తూనే వుంటారు.

 నిన్న ( మే 23 )  చంద్రమోహన్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు 

 Vol. No. 02 Pub. No. 238

Sunday, May 22, 2011

ఆ కలం ఆగి ఏడాదయింది

ఆ కలం ఆగి ఏడాదయింది
ఆ సాహిత్యం దూరమై ఒక ఏడు గడిచింది

తెలుగు జాతి సరస్వతి సాహితీ నాదం ఆగిపోయింది
తెలుగు సినిమా సాహిత్య వైభవం మసకబారిపోయింది 

అంతులేని సాహిత్య పద సంపద వేటూరి
అంతములేని సాహితీ రతనాల గని వేటూరి 

మనకి దూరమై ఏడాది గడిచింది 
మనసు భారమై ఏడాది వగచింది

ఆ పాటకు మరణం లేదు అది సజీవం 
ఆ మాటకు తిరుగులేదు అది సత్యం

తెలుగు సాహిత్యమున్నంతవరకూ వేటూరి పాట వుంటుంది 
తెలుగు భాష ఉన్నంతవరకూ వేటూరి సాహిత్యం వుంటుంది

ప్రతి తెలుగు గుండెలో వేటూరి వున్నారు 
ప్రతి తెలుగు మదిలో వేటూరి నిండిపోయారు

ఆయన మనకు దగ్గరి దూరమయ్యారు 
ఆయన మనకు దూరమై దగ్గరయ్యారు 

 పుంభావ సరస్వతి వేటూరి సుందరరామ మూర్తి గారి ప్రథమ వర్థంతి సందర్భంగా వారికివే సాహితీ నీరాజనాలు 

 వేటూరి గారి గురించి గతంలో రాసిన టపాలు.......

తెలుగు పాటకు చిరునామా వేటూరి

రాలిపోయిన పువ్వు

సాహితీమూర్తి విశేషాలు

 కవి అంటే........

Vol. No. 02 Pub. No. 237

Friday, May 20, 2011

గుర్తుపట్టగలరా ?

  కనుక్కోండి చూద్దాం - 4


ఈ ప్రక్క ఫోటోలో వున్నా ముగ్గురూ భారత స్వాతంత్ర్య సమర రచనలో ప్రముఖ పాత్ర పోషించినవారు. వీరు ముగ్గురి పేర్లు కలిపి ఒకే జట్టుగా పిలిచేవారు. 

1 . వీరిని గుర్తుపట్టగలరా ?
2 . వీరిని ఏమని పిలిచేవారు ?
3 . వీరిలో ఒకరి వర్థంతి ఈరోజు. ఎవరిదో చెప్పగలరా ? ఈ ఫోటోలో ఆయన్ని గుర్తించండి ?Vol. No. 02 Pub. No. 236

ఆంధ్రకేసరి

 బ్రిటిష్ గుండుకెదురుగా గుండె నిలిపిన ధీశాలి
కష్టాలే సోపానాలుగా ఎంతో ఎదిగిన బుద్ధిశాలి

ఆయన జీవితమంతా పోరాట బాటే
ఆయన మనసంతా దేశభక్తి మాటే

ఆయన మాట శత్రువుల పాలిట సింహస్వప్నం
అందుకే అయ్యాడు ఆయన ఆంధ్రులందరికీ సింహం

........... ఆయనే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు

ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ...... 

ఆయన జీవిత విశేషాలు ' ఆంధ్రకేసరి ' చిత్రంలోని బుర్రకథలో వినండి...... 

Vol. No. 02 Pub. No. 235

Tuesday, May 17, 2011

బుద్ధం శరణం...


బుద్ధం శరణం గచ్చామి 
ధర్మం శరణం గచ్చామి 
సంఘం శరణం గచ్చామి

 బుద్ధపూర్ణిమ సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు 

ధర్మాన్ని బోధించేటపుడు బుద్ధ భగవానుడు ' పాళీ ' భాషలో చెప్పిన మూడు రత్నాలు ఈ క్రింది వీడియోలో.......

Vol. No. 02 Pub. No. 234

Sunday, May 15, 2011

వసుధైక కుటుంబం

  కుటుంబం... ఉమ్మడి కుటుంబం.
చల్లని హృదయాలకు చక్కని ప్రతిబింబం

మనసులన్ని పెనవేసి తలపులన్ని తలపోసి
మమతలు పండించేది మంచితనం పెంచేది

.....కుటుంబం... ఉమ్మడికుటుంబం

ఎవరికి వారైపోతే నవ్వులపాలవుతారు
కలసిమెలసి ఉంటేనే విలువ పెంచుకుంటారు
..... కుటుంబం... ఉమ్మడికుటుంబం

చెప్పుడు మాటలు వింటే ఎప్పటికీ చేటు
అడ్డుగోడలే వుంటే ఆ ఇంటికి చేటు
మిడిమేలపు బుద్ధులతో పెడదారిన పడతారు
కంటిముందు స్వర్గాన్నే కాలదన్నుకుంటారు

..... కుటుంబం... ఉమ్మడికుటుంబం
చెదిరిన హృదయాలకు చెరగని ప్రతిబింబం
కుటుంబం.... ఉమ్మడి కుటుంబం


భారతీయతకు ప్రతిరూపమైన వ్యవస్థ కుటుంబం 
సంఘం యొక్క ప్రాధమిక స్వరూపం కుటుంబం 
తరాల మధ్య సంస్కృతీ సంప్రదాయాల వారధి కుటుంబం
 
మనిషికి బుడి బుడి అడుగులు నేర్పేది కుటుంబం
మనిషికి తమదైన భాష నేర్పేది కుటుంబం
మనిషికి ప్రాథమిక పాఠశాల కుటుంబం  

సమాజ నిర్మాణంలో ప్రధానమైనది కుటుంబం 
అనుబంధాలకు, ఆత్మీయతకు నిలయం కుటుంబం
ఒకరిపట్ల మరొకరికి ఉండే బాధ్యత తెలిపేది కుటుంబం 

ఒకప్పుడు మనది ఉమ్మడి కుటుంబం 
కలతలు, కష్టాలు పంచుకునే కుటుంబం 
ఆనందాలు, సంతోషాలు కలబోసుకునే కుటుంబం 
ఒకరికి మరొకరు చేదోడు వాదోడుగా ఉండే కుటుంబం 
పండుగలు, పబ్బాలు కలసి చేసుకునే కుటుంబం 

మరి ఇప్పుడు పరిమితమైన చిన్న కుటుంబం 
కష్టాలు పంచుకునే వారు కరువైన కుటుంబం 
సంతోషాలు కలబోసుకునే వారు కనబడని కుటుంబం 
యాంత్రిక జీవనంలో ఒంటరిగా నలుగుతున్న కుటుంబం 
సినిమాలకు, రెస్టారెంట్లకు పరిమితమైన పండుగల కుటుంబం  

ప్రపంచం యావత్తు గుర్తిస్తున్న వ్యవస్థ కుటుంబం 
భారతదేశంలో విచ్చిన్నమవుతున్న వ్యవస్థ కుటుంబం 
ప్రపంచమంతా అవుతోంది ఒకే కుటుంబం 
మళ్ళీ కావాలి ప్రపంచానికాదర్శం మన కుటుంబం 
అప్పుడే మనదైన కుటుంబం.... వసుధైక కుటుంబం 

 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు 

 


 
Vol. No. 02 Pub. No. 233

Wednesday, May 11, 2011

ది గ్రేట్ ట్రైన్ రాబరీ

ఒక రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ ని రైలుకి సిగ్నల్ ఇవ్వకుండా బెదిరిస్తారు కొంతమంది దొంగలు.
వాటర్ ట్యాంక్ దగ్గర నక్కిన దొంగలు ఆగిన రైలు ఎక్కి మెసంజర్ మీద దాడి చేసి అతన్ని చంపి అతని దగ్గర వున్నా డబ్బు దోచుకుంటారు.
డ్రైవర్ మీద దాడిచేసి ఓ నిర్జన ప్రదేశంలో రైలు ఆపుతారు.
బోగీలనుంచి ఇంజన్ వేరు చేసి ప్రయాణికులను క్రిందకు దింపి వారిని దోచుకుంటారు.
ఇంజన్ లో ఎక్కి పారిపోతారు.
కొంతదూరంలో వున్న కొండల దగ్గర ఆపి దిగి గుర్రాలపై పారిపోతారు.
స్పృహ తప్పిన స్టేషన్ మాస్టర్ ని అతని కుమార్తె రక్షించి కట్లు విప్పుతుంది.
ఆటను అక్కడికి దగ్గరగా వున్న డాన్సు హాల్ కి వెళ్లి వారితో జరిగింది చెబుతారు. అందరూ ఆయుధాలు తీసుకుని దొంగల్ని వెదకడానికి బయిల్దేరుతారు.
దొంగలతో భీకర పోరాటం జరుగుతుంది.
చనిపోగా మిగిలిన దొంగలు డబ్బు లెక్కపెట్టేపనిలో వుండగా కొంతమంది వారిని చుట్టుముట్టి చంపేస్తారు.

ఇది 1903 లో విడుదలైన ' ది గ్రేట్ ట్రైన్ రాబరీ ' అనే మూకీ చిత్రం కథ. నిజానికి అప్పటివరకూ నిర్మించిన మూకీ చిత్రాలన్నీ కొన్ని దృశ్యాల మాలికలే. వాటిలో ప్రత్యేకంగా కథ అనేది ఉండేది కాదు.  అలాగే అప్పటివరకూ ఎడిటింగ్ అంటే ఆ దృశ్యాల కలయిక మాత్రమే ! ఈ చిత్రంతో తొలిసారిగా ఒక కథాక్రమం ప్రారంభమైంది. అలాగే అప్పటివరకూ తెలియని కొన్ని సాంకేతికాంశాలు ఈ చిత్రంతోనే ప్రారంభమయ్యాయి. క్రాస్ ఎడిటింగ్, డబుల్ ఎక్ష్పొజర్  , కెమెరాను సన్నివేశానికి అనుగుణంగా కదిలించడం, బయిట లొకేషన్లలో షూటింగ్ చెయ్యడం లాంటివి తొలిసారిగా వాడిన చిత్రమది. ఈ కొత్తదనాన్ని అప్పటి అమెరికా ప్రేక్షకులు బాగానే ఆదరించారు. చాలాకాలం కిక్కిరిసిన ప్రేక్షకులతో నడిచింది. మూకీ సినిమా అయినా, ఏ శబ్దాలు వినబడకపోయినా పిస్టల్ పేలినప్పుడల్లా ప్రేక్షకులు భయంతో చెవులు మూసుకునేవారట. కథా చిత్రాలకు నాంది పలికిన ఈ చిత్ర ప్రదర్శనా కాలం కేవలం 11 నిముషాల 43 సెకండ్లు .ఆ చిత్రం మీ కోసం...........


Vol. No. 02 Pub. No. 232

Tuesday, May 10, 2011

చలువ పందిళ్ళు

ఎండలు మండిపోతున్నాయి. పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. 

అదేమిటో నడివేసవిలోనే ఎక్కువగా పెళ్లి ముహుర్తాలుంటాయి. ప్రయాణాలూ వుంటాయి. పిల్లలకి వేసవి సెలవలు వుండడం అసలు కారణమనుకుంటే మరి ఇప్పటి పిల్లల్లో సగంమంది ఎర్రటి ఎండలో కూడా కాలేజీ లకు, స్కూళ్ళకు వెళ్తున్నారే ! అందుకని సెలవలతో సంబంధం లేకుండా....ఎండవేడి, ఉక్కపోత భరించలేకుండా వున్నా....... బస్సులు, రైళ్ళు కిక్కిరిసి వున్నా..... బస్సులవాళ్ళు స్పెషల్స్ పేరుతో, ఆటో వాళ్ళు ఇవ్వకేం చేస్తారనే ధీమాతో ఎక్కువ డబ్బులు దోచేస్తూ వున్నా.... జనం మాత్రం ప్రయాణాలు మానరు. పెళ్లిళ్లకు వెళ్ళడం మానరు.

ఈ వేసవి పెళ్ళిళ్ళలో అతిథిలు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి పూర్వకాలంలో.... అంటే ఈ షామియానాలు, కాటరింగులూ తెలియని కాలంలో చక్కగా అప్పుడే కోసుకొచ్చిన తాటియాకులతో పందిళ్ళు వేసేవారు. పెళ్లిరోజుకి కనీసం ఐదారు రోజులముందు పెళ్లికొడుకునో, పెళ్లికూతురినో చెయ్యడం ఆనవాయితీ. ఆ ముహూర్తం తో బాటు పందిరి వెయ్యడానికి కూడా ముహూర్తం పెట్టేవారు. శుభకార్యం అనగానే పందిరి వెయ్యడం కూడా శుభసూచకంగా భావించే రోజులవి. అందులో తాజా తాటియాకులతో వేసిన పందిరిని మరీ శ్రేష్టంగా  భావించేవారు. పైగా తాజా తాటియాకులు అదో రకమైన వాసన కలిగి వుంటాయి. నిజానికి ఆ వాసన మనలో తాజాదనాన్ని నింపుతుంది. కొన్ని చోట్ల ముఖ్యంగా మా కోనసీమలో కొబ్బరి ఆకులతో పందిరి వెయ్యడం ఆనవాయితీ. స్తంభాలకి పచ్చటి కొబ్బరియాకులు చుట్టేవారు. భవిష్యత్తులో కొత్తజంట కాపురం పచ్చగా ఉండాలనే పెద్దల ఆకాంక్షకు ప్రతిరూపంగా ఉండేవి ...అప్పటి పెళ్లి పందిళ్ళు. పెళ్ళికి ముందరే వేసిన పందిరి పదహారురోజుల పండుగ అయ్యేవరకూ తియ్యకపోవడం సాంప్రదాయం. 

ముహూర్తానికి గంట ముందు షామియానా వేసి,  పెళ్ళయిన గంట తర్వాత తీసేస్తున్న ఈ రోజుల్లో ఇప్పటి తరానికి తాటియాకుల పందిళ్ళ గొప్పదనం చెప్పినా అర్థం కాదేమో ! మన కళ్ళెదురుగా నిప్పులు చెరుగుతున్న ఎండ.... అయినా ఆ పందిరి క్రిందకు వెళ్ళగానే పలకరించే చల్లదనం.... అనుభవించాల్సిందే గానీ చెప్పనలవికాదు. దీని ముందు కృత్రిమంగా చల్లబరిచే ఎయిర్ కండిషనర్స్ ఎందుకు పనికొస్తాయి. సహజసిద్ధమైన చల్లదనాన్ని అనుభవించగలం కనుకనే ఆ పందిళ్లను చలువ పందిళ్ళు అన్నారు. 

పెళ్ళికి వెళ్లి చక్కని చలువ పందిరి క్రింద కూర్చుని పెళ్లి వారిచ్చే తాటియాకుల విసనకర్రతో విసురుకుంటూ.... కర్పూరం వాసన పీలుస్తూ.... మీదకు చిలికిన పన్నీరు సుగంధాన్ని అందుకుంటూ... పూసిన చందన సౌరభాన్ని ఆస్వాదిస్తూ.... .పెళ్లి వేడుకల్ని చూడడం..... ఒక అందమైన అనుభవం. చాలాకాలం తర్వాత కలిసిన బంధుమిత్రులతో ముచ్చట్లాడుకుంటూ.. మేలమాడుకుంటూ... మేళతాళాల నేపథ్యంలో కూర్చుని, కొసరి కొసరి వడ్డిస్తుంటే పంక్తి భోజనం చెయ్యడం ఎంతటి మధురానుభూతి.  బఫే భోజనాల కాలంలో ఎవరికివారు తమ ప్లేట్లు పట్టుకుని తమకి కావాల్సిన పదార్థాలు తామే వడ్డించుకుంటూ... ప్రక్కవారు ఇంత తింటారా... అన్నట్లు చూస్తున్నారేమోనన్న అనుమానంతో వేసుకున్న వాటిలో కొన్ని తీసేసి ....తిన్నారా అని అడిగేవాళ్ళే తప్ప... ఏం తింటున్నారని, ఏం కావాలని అడిగే వాళ్ళు కనబడక... పెళ్లి భోజనానికి వెళ్తున్నాం కదా అని ఇంట్లో వంట చేసుకోని పాపానికి  పస్తుండలేక నాలుగు మెతుకులు కతికి బయిట పడే ఈరోజుల్లో.... ఈ అనుభూతులు, అనుభవాలు అర్థం కావేమో ! ఇప్పటి తరం ఈ మధురానుభూతుల్ని కోల్పోతోందనేది నిజం. 

అప్పటి రోజుల్లో పెళ్ళికి హాజరయి వస్తే అది కొన్ని నెలల వరకూ చెప్పుకోగలిగే అనుభూతుల్ని మిగిల్చేది. ఇప్పుడు మంటపం దాటాక ఆ పెళ్లి గురించి తలచుకునే పరిస్థితి లేదు. కొన్నాళ్ళు  గడిచాక అసలు ఆ పెళ్లి జరిగిన విషయమే మరిచిపోతామేమో ! ఇప్పటి పెళ్ళిళ్ళలో ఆడంబరం, డాంబికం తప్ప ఆప్యాయతతో కూడిన పలకరింపులు... అనుభూతితో కూడిన వీడ్కోళ్ళు మృగ్యమైపోయాయి. యాంత్రికమైన జీవితాల ఫలితమా ? ఆధునీకరణ ప్రభావమా ? ఈ పరిస్థితికి కారణమేది ? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టమేమో ! 

ఒక్కోసారి అక్కడక్కడ ఎదురయ్యే కొన్ని సంఘటనలు, దృశ్యాలు గతకాలపు  జ్ఞాపకాలను తట్టి లేపుతాయి. అప్పుడు ఆ మధురానుభూతుల్లోనుంచి బయిటకు రావడం కొంచెం కష్టమైన పనే ! నాకు మొన్న అలాంటి పరిస్తితి ఎదురయింది. ఒకరోజు ఉదయమే లేచి బయిటకొస్తే మా ఎదురింటి దగ్గర వాళ్ళ అమ్మాయి పెళ్లి సందర్భంగా తాటియాకుల పందిరి వెయ్యడం కనబడింది. అది పూర్తయ్యే లోపున చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని బయిటకొచ్చాయి. పల్లెటూళ్ళలో కూడా షామియానాలు, బఫేలు రాజ్యమేలుతున్న ఈరోజుల్లో... నగరంలో ..ఇలా మండు వేసవిలో చలువపందిరిని వేయించిన ఆ దంపతుల అభిరుచిని అభినందించకుండా ఉండలేకపోయాను. నగరాల్లో కూడా అక్కడక్కడ తాటియాకులతో పందిరి వేసినా, వాటికి చాందిని పేరుతో గుడ్డలు కట్టి..అలంకారాలు చేసి  తాటియాకుల తాజాదనాన్ని మనకందనీయకుండా అడ్డుకట్టలు వేసేస్తున్నారు. అలా కాకుండా మావిడాకుల తోరణాలు తప్ప ఇంకేమీ అదనపు అలంకారాలు లేకుండా వేసిన స్వచ్చమైన చలువ పందిరిని చూసి ముచ్చటేసింది. అందుకే వెంటనే ఆ పందిరిని నా కెమెరాలో బంధించాను. ఆ అనుభూతిని మీక్కూడా పంచాలని ఇలా మీకందిస్తున్నాను. అందుకోండి.


Vol. No. 02 Pub. No. 231

Monday, May 9, 2011

దర్శకుడి తల్లి...? - జవాబు

కనుక్కోండి చూద్దాం - 41 _ జవాబు
ప్రమీలార్జునీయం, గూఢచారి 116, పట్టుకుంటే పదివేలు, ముహూర్తబలం, చెల్లెలికోసం, బందిపోటు భీమన్న, శబాష్ వదిన, మాస్టర్ కిలాడీ, అందరికీ మొనగాడు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎం. మల్లిఖార్జునరావు ఒకప్పటి ప్రముఖ సీనియర్ నటి కుమారుడు.ప్రశ్న : ఆ నటి ఎవరో చెప్పగలరా ?

జవాబు : సీనియర్ శ్రీరంజని గారు

సత్యం గారు కొంచెం దగ్గరగా జూనియర్ శ్రీరంజని అని చెప్పారు. వారికి ధన్యవాదాలు.

Vol. No. 02 Pub. No. 224a

తెలుగు మహిళా జాతిరత్నం

అణగదొక్కబడిన వర్గాలు, లింగ వివక్షతతో వెనుకబడ్డ స్త్రీలు, ఆర్ధిక పరిస్థితుల కారణంగా అలక్ష్యం చెయ్యబడ్డ పిల్లలు ఒకప్పుడు మన సమాజంలో చాలా ఎక్కువగా ఉండేవారు. తమ జీవితాలను త్యాగం చేసి, వారిని ఆ పరిస్థితులనుంచి బయిటకు తీసుకొచ్చి,  వారి అభ్యున్నతే లక్ష్యంగా అంకితమైన మహానీయులేందరో మనకు కనిపిస్తారు. అలాంటి వారిలో చెప్పుకోదగ్గ వారు శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్.

1909 వ సంవత్సరంలో కాకినాడకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దుర్గాబాయి 12 వ ఏటనే సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొన్నారు.  అప్పట్లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో నిర్వహించిన ఖాదీ ప్రదర్శనలో స్వచ్చంద సేవకురాలుగా పాల్గొని ప్రవేశానికి టికెట్ లేదనే కారణంతో జవహర్లాల్ నెహ్రుని కూడా లోనికి అనుమతించకుండా నిలిపివేసి సంచలనం సృష్టించారు. అంత పిన్న వయసులోనే గాంధీ సిద్ధాంతాలను వంటబట్టించుకుని ఖద్దరు ధారణతో బాటు ఆంగ్ల విద్యను బహిష్కరించారు.

ఎనిమిదేళ్ళ పసివయసులోనే దుర్గాబాయికి ఒక జమిందారీ కుటుంబంలోని యువకునితో వివాహం జరిగిపోయింది. యవ్వనంలోకి ప్రవేశించాక గానీ ఆమెకు వివాహమంటే ఏమిటో పూర్తిగా అవగాహన కాలేదు. తెలిసాక తన ప్రస్తానం కుటుంబ వ్యవస్థ వైపు కాదనీ, ప్రజాసేవ వైపనీ నిర్ణయించుకున్నారు. తాను అసలైన భార్య పాత్ర నిర్వహించలేనని భర్తకు నచ్చజెప్పి విడాకులు పొందారు. అప్పటినుంచి పూర్తిగా తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసారు.

గాంధీజీ బోధనల ప్రభావంతో 1930 లలో ముమ్మరంగా జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు.  ఆ ఉద్యమానికి దక్షిణభారత దేశంలో పథ నిర్దేశకుడైన టంగుటూరి ప్రకాశం పంతులుగారి వారసురాలిగా పేరు తెచ్చుకున్నారు. సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించి లాఠీ దెబ్బలు తిని మూడుసార్లు జైలుకెళ్లారు. మొదటిసారి వెల్లూరు జైలులో కలిసిన స్త్రీల పరిస్థితి ఆమెను కలచివేసింది. ఖైదు చెయ్యడానికి కనీసం తమ మీద మోపిన అభియోగాలేమిటో కూడా తెలియని అజ్ఞానంలో వున్నారు వారు. వారిని ఆ అజ్ఞానం నుంచి బయిట పడెయ్యడమే తన కర్తవ్యమని దుర్గాబాయి నిర్ణయించుకున్నారు. 1933 లో విడుదలయ్యాక మధ్యలో వదిలివేసిన చదువును కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పాసై మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి బి. ఏ. ( ఆనర్స్ ) పట్టా పుచ్చుకుని అక్కడే క్రిమినల్ లా లో న్యాయ పట్టా కూడా పొందారు. స్త్రీలకు అసాధ్యమనిపించే ఆ వృత్తిలో అప్పటిరోజుల్లో ఆమె క్రిమినల్ లాయర్ గా ప్రఖ్యాతి గాంచారు. న్యాయసహాయం కోసం తనదగ్గరకి వచ్చిన ఏ స్త్రీ కూడా ఉత్తి చేతులతో వెళ్ళకూడదనేది ఆవిడ సిద్ధాంతం.

రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యురాలిగా పనిచేసారు. భారత బృంద సభ్యురాలిగా దుర్గాబాయి చైనా దేశం సందర్శించారు. అక్కడ కుటుంబ న్యాయస్థానాల పనితీరును పరిశీలించిన ఆమె తిరిగివచ్చాక వాటిపై ప్రథాని నెహ్రూకు సమగ్ర నివేదిక ఇస్తూ మనదేశంలో వాటి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఆ రకంగా మనదేశంలో ఫ్యామిలీ కోర్ట్ వ్యవస్థ ప్రారంభానికి కారణమయ్యారు. దుర్గాబాయి గారు ప్రణాళికా సంఘ సభ్యురాలిగా, సాంఘిక సంక్షేమ శాఖ అధిపతిగా విధులు నిర్వర్తించారు.

దేశ సమగ్రాభివృద్ధికి జనాభా నియంత్రణే సరైన పరిష్కారమని నమ్మిన దుర్గాబాయి గారు ఆ విషయం మీద అనేక ప్రాంతీయ సదస్సులు నిర్వహించి సమగ్ర నివేదికలను తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు. అంధత్వ నివారణా సంస్థను ఏర్పాటు చేసారు.

1953 లో అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి, రిజర్వు బ్యాంకు మొదటి గవర్నర్ అయిన సి. డి. దేశ్ ముఖ్ గారిని వివాహం చేసుకున్నారు.

జ్ఞాన సముపార్జనలో మహిళలు వెనుకబడకూడదని ఆంధ్ర మహిళా సభను స్థాపించి ఆసుపత్రి, నర్సుల శిక్షణాలయం, అనేక విద్యాసంస్థలు, వృత్తి విద్యా సంస్థల్లాంటివెన్నో ప్రారంభించారు. అవి ఇప్పటికీ విజయవంతంగా నడుస్తున్నాయి. కేంద్ర సాంఘిక సంక్షేమ సంస్థను నెలకొల్పి, దానిద్వారా దేశంలో అనేక స్వచ్చంద సేవా సంస్థలు, స్వచ్చంద సేవకులు పెరగడానికి కారణమయ్యారు.

శాంతి, సాంఘిక సంక్షేమం, విద్య మొదలైన రంగాలలో దుర్గాబాయి చేసిన సేవలకు మెచ్చి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు పలు అవార్డులతో సత్కరించాయి. వాటిలో నెహ్రు లిటరసీ పురస్కారం, విద్యారంగంలో విశిష్ట సేవలందించిన వారికిచ్చే యునెస్కో పురస్కారం, భారత ప్రభుత్వ అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారాలు వున్నాయి.

ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన దుర్గాబాయి గారు స్వాతంత్ర్య సమరయోదురాలిగా, ప్రణాళికా రచయితగా, నిర్వాహకురాలిగా, విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా, పార్లమెంట్ సభ్యురాలిగా  జాతీయ స్థాయిలో  కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు. తెలుగు మహిళకు కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు.

  తెలుగు మహిళా జాతిరత్నం దుర్గాబాయి దేశ్ ముఖ్ జన్మదినం సందర్భంగా ఆవిడను, ఆమె సేవలను స్మరించుకుంటూ..........


Vol. No. 02 Pub. No. 230

Sunday, May 8, 2011

అమ్మంటే కమ్మని భావన

 అమ్మ అనేది ఒక కమ్మని భావన 
అమ్మతనమనేది ఒక అద్భుతమైన వరం
అమ్మంటే అంతులేని పెన్నిధి 
అంది వచ్చిన దేవత సన్నిధి 

అమ్మ పలుకు మధురం 
అమ్మ ప్రేమ మధురాతి మధురం
****************************************

చిన్ననాటి నీ లాలి నన్ను నిదురపుచ్చగా
ఈనాటి నీ లాలి  మేలుకొలుపు కాగా
అమ్మగా దీవించి కమ్మగా నిదురపో !

పలుకు తేనెల తల్లి పవళించవమ్మా !

***************************************

 మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో................ గత సంవత్సరం టపా....

అమ్మ అన్నది కమ్మని మాట


Vol. No. 02 Pub. No. 229

Saturday, May 7, 2011

సహజ నటి

 ఆమె నటనలో సహజత్వం వుట్టిపడుతుంది 
ఆమె వాచకంలో సహజత్వం తొణికిసలాడుతుంది
ఆమె నవరసాలను అద్భుతంగా పలికిస్తుంది 
ఆమె కరుణరస పోషణలో తనకు సాటిలేరని చాటింది 

ఆమే ఒకప్పటి ప్రముఖ నటి కన్నాంబ. 13 వ యేటనే రంగస్థల ప్రవేశం చేసిన ఆమె అక్కడ చంద్రమతి, సతీ సావిత్రి, అనసూయ లాంటి వైవిధ్యభరితమైన పాత్రలను ధరించారు.  1934 లో సీతాకల్యాణం చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేసారు. 1935 లో స్టార్ కంబైన్స్ వారి ' హరిశ్చంద్ర  ' చిత్రంలో ఆమె ధరించిన చంద్రమతి పాత్ర పేరు తెచ్చిపెట్టింది. అప్పటినుండి సుమారు 150 చిత్రాలలో వివిధ రకాల పాత్రలు ధరించారు. తమిళంలో ఆమె ధరించిన ' కన్నగి ' పాత్రతో ఆమె నటన ఉన్నత శిఖరాలు చేరింది. ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. అలాగే ఆమె కీర్తి కిరీటంలో మరో కలికితురాయి ' పల్నాటి యుద్ధం ' లో ఆమె ధరించిన నాయకురాలు నాగమ్మ పాత్ర. మహానటుడు గోవిందరాజుల సుబ్బారావుతో పోటీగా నిలిచింది. 

1941 లో కడారు నాగభూషణంతో వివాహ బంధం ఆమెను నిర్మాతను చేసింది. రాజరాజేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై ఇరువురూ తెలుగు, తమిళ భాషలలో సుమారు 30 చిత్రాలు నిర్మించారు.

కన్నాంబ లాగ సులువుగా హావభావాలు పలికించగల నటి ఇంతవరకూ ఎవరూ లేరు. ఇకముందు రారు. ఆ రోజుల్లో ఆమె కన్నీళ్ళ గురించి ఒక విషయం బాగా ప్రచారంలో ఉండేది. గ్లిజరిన్ అవసరం లేకుండా సన్నివేశానికి ఎన్ని అవసరమైతే అన్ని కన్నీళ్లు కళ్ళ నుండి ఒక్క నిముషం లోపునే తెప్పించగలిగేదని. 

ఈ కన్నీటి వెనుక ఓ విషాద గాథ వుంది. ఆమె చిత్రరంగంలో అంతటి ఉన్నత స్థాయికి చేరడానికి ముందు చాలా ఇబ్బందులు  ఎదుర్కొంది. ఒక పూట తిని, మరో పూట తినక... ఉన్న ఒక్క చీరను  సగం చేసి ఒక ముక్క ఒంటి మీద, మరో ముక్క దండెం మీద ఆరేసుకుని అష్టకష్టాలు పడింది. అందుకే అంత ఉన్నత స్థాయికి చేరుకున్నాక కూడా ఆమె కానీ ( అప్పటి నాణెం ) కూడా ఊరికే ఖర్చు పెట్టేది కాదు. వీధిలోకి వచ్చిన చీపుళ్ళు కూడా గీసి గీసి బేరమాడి కొనేది. అది పిసినారితనం అని కొందరు అనుకున్నా దాని వెనుక ఆమె కష్టాల కన్నీళ్లు వున్నాయి. అందుకే ఆమె నటనలో అంత సహజత్వం ఉట్టిపడేదేమో ! అలాగని ఆమెలో దాతృత్వం లేదనుకుంటే పొరబాటే ! అవసరమైన చోట అవసరమైన దానాలు బాగానే చేసేది. ' చచ్చేటపుడు ఆస్తిపాస్తులు నాతో తీసుకుపోతానా ' అని తరచూ అంటుండే కన్నాంబ చివరకి ఆ ఆస్తులేమీ మిగుల్చుకోకుండానే వెళ్ళిపోయింది.

నటిగా, నిర్మాతగా, గాయనిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన కన్నాంబ వర్థంతి ఈరోజు. ఆ సందర్భంగా ఆమెకు స్మృత్యంజలి.......
Vol. No. 02 Pub. No. 228

' మన ' సుకవి

మనసు కవి.... 'మన ' సుకవి ఆచార్య ఆత్రేయ 
చిన్న చిన్న పదాలు... పెద్ద పెద్ద అర్థాలు 
పాటైనా... మాటైనా...పదాలతో చదరంగం
ఆడుకుంటుంది ఆయన సాహిత్యాంతరంగం
తెలుగు చిత్ర రంగానికి ఆయనొక సువర్ణాభరణం
తెలుగు చిత్రరంగంలో ఆయనదొక సువర్ణాథ్యాయం 

విశ్వకవి రవీంద్రుని జన్మదినం రోజునే ఆత్రేయ జన్మించడం విశేషం. దానికాయన ' నేను కవి కావాలనే ఉద్దేశ్యంతో కావాలనే ఈరోజు పుట్టాను ' అనేవారు. 

ఆత్రేయగారికి చిన్న వయసులోనే నాటకాలమీద ఆసక్తి కలిగింది. ఒకసారి ఆయన తను చదివిన ప్రాథమిక పాఠశాలలో ప్రదర్శించిన నాటకంలో వేషం వేశారు. ఆ సమయానికి ఆత్రేయ గారి అన్నగారు ఊర్లో లేరు. అసలే సనాతన సాంప్రదాయాలు, చాందస భావాలు గల కుటుంబం.  ఆయన ఊర్నుంచి తిరిగి రాగానే విషయం తెలిసింది. అంతే ! ఆయన ఉగ్రనరసింహుడయ్యాడు. నాటకాల్లో వేషం వెయ్యడం ఒక తప్పైతే, దానికోసం మీసం తీసెయ్యడం మరో తప్పు. ఈ తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఆత్రేయగారి చేత గోమూత్రం తాగించారు. 

ఆత్రేయ ఓ సందర్భంలో మాట్లాడుతూ " ఒక సమాజం వారు ఏంటో అభిమానంతో ' అత్రేయగారూ ! మీకు మహాకవి, అభ్యుదయ కవి లాంటి బిరుదలక్కర్లేదు. మనసుకవి అని బిరుదు ఇవ్వదలిచాం ' అంటే మనసు మీద మనసు పెట్టిన కవిగా నన్నింతగా గుర్తించినందుకు ఆ బిరుదును త్యాగం చెయ్యగలను. ' మన ' సుకవి అంటే చాలు " అన్నారు.

ఆచార్య ఆత్రేయ గారి ఎనభైవ జన్మదినం సందర్భంగా ఆ ' మన ' సుకవి ని స్మరించుకుంటూ.......

ఆత్రేయ గారి మీద గత జన్మదినానికి రాసిన టపా, ఆయన పాటల జ్ఞాపకాల కదంబం  -


ఆత్రేయ గారి ఛలోక్తి-

మంద భాగ్యుడుVol. No. 02 Pub. No. 227

రవీంద్ర కవీంద్రుడు


నా జీవితంలోకి మేఘాలు వచ్చింది వర్షాన్ని మోసుకొచ్చేందుకో, తుఫానుకు సూచిక గానో కాదు. నా సంధ్యా సమయ ఆకాశంలో వర్ణాలు నింపడానికే  అవి వచ్చాయి !
 నా ఆశావాదానికి నాదైన వాదన వుంది. ఒకదారి మూసుకుపోతే మరోదారి  తెరుచుకుంటుంది...లేదా నేనే మరో దారి ఏర్పాటు చేసుకోగలను.
 మన ప్రతిమ  మట్టిలో కలసి శిదిలమైపోవడం... దేముడు సృష్టించిన మట్టి గొప్పదనాన్ని నిరూపించడానికే !
 మనలోని ఉన్నతమైన వినయమే మనల్ని ఉన్నత శిఖరాలవైపు నడిపిస్తుంది..

బెంగాలీ సాహిత్యాన్ని, సంగీతాన్ని ఒక అద్భుతమైన మలుపుతిప్పిన మహనీయుడు గురుదేవుడు రవీంద్రనాథ్ టాగోర్ కలం నుంచి జాలువారిన కొన్ని ఆణిముత్యాలు అవి.

అతి సున్నితమైన, అందమైన, తాజాదనం నిండిన పద్యాలతో కూడిన ' గీతాంజలి ' సృష్టికర్త రవీంద్రుడు.

యూరప్ నుంచి కాక ఇతర దేశాల నుంచి తొలిసారి నోబెల్ పురస్కారం అందుకున్న వ్యక్తీ రవీంద్రుడే ! 

 ఒకటిన్నర శతాబ్దం క్రితం కలకత్తాలో సంపన్న కుటుంబంలో జన్మించిన రవీంద్రనాథ్ టాగోర్ ఎనిమదవ ఏటనే రచనలు చెయ్యడం ప్రారంభించారు.  పదహారవ యేట ' భానుసింగో ' అనే కలం పేరుతో రాసిన కవిత్వం ప్రచురితమయింది. బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. అమృత్ సర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్మార్గానికి నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం 1915 లో ప్రకటించిన నైట్ హుడ్ బిరుదుని తిరస్కరించారు.

ప్రాక్పశ్చిమ సిద్ధాంతాలను మిళితం చేసే ఆలోచనతో ఒక ప్రయోగాత్మక పాఠశాల ప్రారంభించిన ఆయన 1921 లో దానిని విశ్వభారతి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసారు.

కవిగా, నవలాకారుడిగా, లఘుకథల రచయితగా, వ్యాసకర్తగా, నాటకకర్తగా, ప్రయోక్తగా, విద్యావేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, పండితుడిగా, అంతర్జాతీయవేత్తగా, చిత్రకారుడిగా, సంస్కృతీ పరిరక్షకుడిగా, ఉపన్యాసకారుడిగా, సంగీతకర్తగా,  గీతరచయితగా, గాయకుడిగా, కళాకారుడిగా....... ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా మన్ననలు అందుకున్నారు రవీంద్రనాథ్ టాగోర్.

రవీంద్రుని గీతం ' జనగణమన ' భారత జాతీయ గీతంగా ఎన్నుకోవడంతో బాటు ఆయన మరో గీతం ' అమర్ సోనార్ బంగ్లా ' బంగ్లాదేశ్ జాతీయగీతంగా ఎన్నుకోబడడం ఆయన రచనలకు లభించిన అరుదైన గౌరవం.

ఇంతటి అద్భుతమైన మేధావిని కన్న భరతమాతకు శతసహస్ర వందనాలు.

  రవీంద్రనాథ్ టాగోర్ 150 వ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ భారత్ బంగ్లాదేశ్ లు  సంయుక్తంగా జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ రోజు ( మే 7 వ తేదీ ) ఆ ఉత్సవాలను మనదేశంలో  ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభిస్తారు. బంగ్లాదేశ్ తరఫున ఆ దేశ ప్రణాళికా శాఖ మంత్రి  ఏకేకంద్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ దేశంలో జరిగే ఉత్సవాలకు మన దేశ ప్రతినిధిగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొంటున్నారు. 

 ఈ సందర్భంగా రవీంద్ర కవీంద్రునికి స్మృత్యంజలి  ....
Vol. No. 02 Pub. No. 226

Friday, May 6, 2011

మూకీల విశేషాలు

మూకీ చిత్రాల కాలంలో చాలా ఊళ్లలో విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. అందువలన చాలా చోట్ల సినిమా హాళ్ళలో ప్రొజెక్టర్లను చేతితో తిప్పవలసి వచ్చేది. అప్పటి ఆపరేటర్లు సెకనుకు 24 ఫ్రేములు తిరిగేలా ఏమాత్రం తడబాటు లేకుండా తిప్పేవారట. 

అలాగే మూకీ సినిమాలు కావడం వలన కథ, కథనాలు ప్రేక్షకులకు బాగా అర్థం కావడానికి సినిమా హాళ్ళలో వ్యాఖ్యాతలను పెట్టేవారు. వారు ఆ చిత్ర కథ వివరిస్తూ... అవసరమైన చోట ఆయా పాత్రల సంభాషణలను వాళ్ళే పలికేస్తూ...  అప్పుడప్పుడు  తమ సొంత వ్యాఖ్యలను జోడిస్తూ వుండేవారట. అవసరమైన చోట అవసరమైన శబ్దాలు కూడా వారు నోటితో పలికించి సన్నివేశాన్ని రక్తి కట్టించేవారట. పాత తరం హాస్యనటుడు కస్తూరి శివరావు ఈ వ్యాఖ్యాతల్లో అగ్రగణ్యుడు. ఆయన సినిమాల్లోకి రాకముందు ఇలా మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పనిచేసేవారు. ప్రముఖ చిత్రనిర్మాత కె. రాఘవ ఆయనకు సహాయకునిగా పనిచేసేవారు. కొన్ని చోట్ల వాద్యబృందాలను కూడా నియమించి నేపథ్య సంగీతం కూడా వినిపించేవారట.

అప్పట్లో చిత్రాలకు పంపిణీదారులు, హక్కుదార్లు అంటూ ఎవరూ ఉండేవారు కాదు. థియేటర్ యజమానులే కలకత్తాకో, బొంబాయికో వెళ్లి నిర్మాతల దగ్గర ప్రింట్ కొనుక్కుని తెచ్చుకుని ప్రదర్శించేవాళ్ళు.  ఆ రకంగా మధ్య దళారీలు ఉండేవారు కాదన్నమాట. ఆరోజుల్లో సాధారణంగా అమావాస్య రోజున మార్కెట్ సెలవు ఉండేది. దుకాణాలు మూసేసేవారు కాబట్టి ఆరోజు దుకాణాదారులు, ప్రజలు కూడా ఖాళీగా వుంటారు కాబట్టి ఆరోజే కొత్త సినిమాలు విడుదల చేసేవారు. తొలిరోజుల్లో వాల్ పోస్టర్లు ఉండేవి కాదు కనుక సినిమాల పబ్లిసిటీ కోసం కొంతమందికి వేషాలు వేసి ఎడ్లబళ్ళ మీద మేళ తాళాలతో ఊరేగించేవారట. సినిమా చూడటానికి వచ్చి టికెట్ కొన్న ప్రతీ ప్రేక్షకుడికీ కిళ్ళీ, సోడా ఉచితం అని కొన్నిచోట్ల ప్రకటించేవారట. కొత్త సినిమా విడుదలయినపుడు హాలును సర్వాంగ సుందరంగా అలంకరించేవారు.

భారతదేశంలో మొదటి చిత్రం ఫాల్కే నిర్మించిన ' రాజా హరిశ్చంద్ర ' ( మూకీ ) అయితే దక్షిణ భారతదేశంలో తొలి మూకీ చిత్రం ' కీచకవథ ' . దీన్ని 1918 లో నటరాజ మొదలియార్ నిర్మించారు.ఈ చిత్రం 35 రోజుల్లో నిర్మించబడింది.

ఈ నెల 3 వ తేదీన భారతీయ సినిమా తొంభై ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.......

Vol. No. 02 Pub. No. 225

Wednesday, May 4, 2011

దర్శకుడి తల్లి...?

  కనుక్కోండి చూద్దాం - 41 

 

ప్రమీలార్జునీయం, గూఢచారి 116, పట్టుకుంటే పదివేలు, ముహూర్తబలం, చెల్లెలికోసం, బందిపోటు భీమన్న, శబాష్ వదిన, మాస్టర్ కిలాడీ, అందరికీ మొనగాడు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎం. మల్లిఖార్జునరావు ఒకప్పటి ప్రముఖ సీనియర్ నటి కుమారుడు. 

ఆ నటి ఎవరో చెప్పగలరా ?


Vol. No. 02 Pub. No. 224

Tuesday, May 3, 2011

ఓ అద్భుతం ఆవిష్కృతమైన రోజు

సరిగ్గా తొంభై ఎనిమిదేళ్ళ క్రితం ఇదేరోజు ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. బొంబాయిలోని కార్నేషన్ సినిమాలో  తొలి  భారతీయ చలనచిత్రం ప్రదర్శితమైంది. అంతకుముందు కొన్ని దిగుమతి చేసుకున్న విదేశీ లఘు చిత్రాలు మాత్రమే చూడగలిగిన భారతీయులకు దాదా సాహెబ్ గోవింద ఫాల్కే పూర్తి నిడివి కథా చిత్రం చూపాడు. దీనికి సంవత్సరం క్రితం ' పుండలీక్ ' అనే చిత్రం వచ్చినా అది రంగస్థల నాటకాన్ని యథాతథంగా చిత్రీకరించినది కావడం వలన, చలనచిత్ర సాంకేతికతకు దూరంగా వుండడం వలన అన్ని హంగులతో వచ్చిన '  రాజా హరిశ్చంద్ర ' నే తొలి భారతీయ చిత్రంగా పరిగణిస్తారు.


చిన్న ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని ఆరంభించిన దాదా సాహెబ్ ఫాల్కే అనేక ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి చివరికి చిత్ర నిర్మాణాన్ని ఎంచుకున్నారు. ఆయన చూసిన ' డాటర్ అఫ్ ఇండియా ' అనే చిత్రం ఆయనలో ఈ బీజాన్ని నాటింది. అందులో భారతీయ సాంప్రదాయాలను వక్రీకరించిన తీరు ఆయన్ని కలచివేసింది. అలాగే ' ది లైఫ్ అఫ్ క్రిస్ట్ ' అనే చిత్రం మన పురాణ కథల్ని కూడా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయనలో కలిగించింది. తన జీవిత భీమా పాలసీని తాకట్టు పెట్టి పన్నెండువేల రూపాయిలు తీసుకుని లండన్ వెళ్ళారు. ఒక కెమెరా కొనుక్కొచ్చారు. చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ఆ చిత్రంలో నటించడానికి ఎంత ప్రయత్నించినా  స్త్రీలెవ్వరూ ముందుకు రాలేదు. చివరికి పురుషుల చేతనే స్త్రీ పాత్రలు ధరింపజేశారు. ' రాజా హరిశ్చంద్ర ' చిత్రం పూర్తయి 1913 వ సంవత్సరం మే 3 వ తేదీన విడుదలైంది. దాదా సాహెబ్ ఫాల్కేను భారత చలనచిత్ర పితామహుడిగా చరిత్రలో నిలిపింది.

అప్పటివరకూ మన దేశంలో విడుదలైన విదేశీ చిత్రాలు నాల్గురోజులు మించి ఆడలేదు. కానీ ' రాజా హరిశ్చంద్ర ' మాత్రం 23 రోజులు హౌస్ ఫుల్  కలక్షన్స్ తో నడిచి రికార్డు సృష్టించింది. ఆ ఉత్సాహంతో ఆయన ఇంకా చాలా మూకీ చిత్రాలు నిర్మించాడు. వాటి విజయం ఎంతోమందిని ఆకర్షించింది. పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. దాంతో చలనచిత్ర పరిశ్రమ ఎదిగింది. పన్నెండువేల రూపాయిలతో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు కొన్ని వేల మిలియన్ రూపాయిల వ్యాపారంగా అభివృద్ధి చెందింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా  కొన్ని లక్షలమందికి ఉపాధి కల్పిస్తోంది. సాంకేతికంగా ఎన్నెన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. ఎన్నో కళాఖండాలను ప్రజలకు అందించింది. ప్రజల దైనందిక జీవితంలో విడదీయలేని భాగమైంది.  దాదా సాహెబ్ ఫాల్కే ముందు చూపు ఫలితంగానే ఇది సాధ్యమైంది. 

భారత చలన చిత్ర పరిశ్రమ ఆరంభమైన రోజుగా ఈరోజును పరిగణించవచ్చు. అందుకే తొలి భారతీయ చలనచిత్రం ' రాజా హరిశ్చంద్ర ' విడుదలైన ఈరోజు ( మే 3 వ తేదీ ) ఓ అద్భుతం ఆవిష్కృతమైన రోజు అని చెప్పవచ్చు. ఆ అద్భుతాన్ని అందించిన ఫాల్కే గురించి, రాజా హరిశ్చంద్ర నిర్మాణ నేపథ్యం వగైరాల గురించి వివరాలు ఈ లఘు చిత్రంలో చూడండి....
Vol. No. 02 Pub. No. 223

Monday, May 2, 2011

పుల్లయ్య శతజయంతి

పుట్టిన ముగ్గురు భిడ్డలు చనిపోతే తర్వాత పుట్టిన నాలుగో బిడ్డ అయినా దక్కాలని ఎక్కడో కారడవుల్లో తపస్సు చేసుకుంటున్న సంజీవి తాత అనే బైరాగిని ఆశ్రయించింది ఆ తల్లి. ఆయన ఉపదేశం ప్రకారం మూడు వారాలపాటు దీక్ష తీసుకుని సముద్రపు ఒడ్డునే నిద్ర పోయింది. ఆ బైరాగి ఉపదేశం మీదే బిడ్డ పుట్టాక పులి విస్తరాకుల్లో దొర్లించి ' పుల్లయ్య ' అని పేరు పెట్టుకుంది ఆ తల్లి.

ఆ బిడ్డే పెరిగి పెద్దయి తెలుగు చలనచిత్ర రంగంలో దర్శకునిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న పి. పుల్లయ్య. 1939 లో ఆయన దర్శకత్వం వహించిన ' బాలాజీ ' చిత్రం నెగటివ్ అగ్నికి ఆహుతైపోయింది. అయితే వెంకటేశ్వరస్వామికి సంబంధించిన ఫ్రేములకి మాత్రం ఏమీ కాలేదట. దాంతో స్వామిని తల్చుకుని పుల్లయ్యగారు మళ్ళీ 1969 లో ' శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం ' నిర్మిస్తే ఆయన కాసుల వర్షం కురిపించాడు. ఆ చిత్ర నిర్మాణ సనయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహం ముందు వెలిగించే దీపానికి ఖర్చుకు వెరవకుండా స్వచ్చమైన ఆవునెయ్యి మాత్రమే వాడారట. ఆ సెట్లో పెట్టిన హుండీలో సందర్శకులు, ముఖ్యంగా మింట్ రోడ్ ప్రాంతాలనుంచి వచ్చిన షావుకార్లు తమ నల్లదనం దండిగా వేసేవారట.

ఎన్నో భక్తిరస, సంగీతభరిత చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించిన పుల్లయ్య గారు సినిమాల్లోకి రాకముందు కామిక్ పాటలు పాడేవారట. కొలంబియా కంపెనీ రికార్డులుగా అవి వెలువడ్డాయట. కొన్నాళ్ళు బ్రిటన్ కి చెందిన బ్రాడ్కాస్ట్ రికార్డింగ్ కంపెనీకి రిప్రజెంటేటివ్ గా పనిచేసి ఎం. ఎస్. సుబ్బులక్ష్మి, చౌడయ్య, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, అద్దంకి శ్రీరామమూర్తి, కపిలవాయి రామనాథ శాస్త్రి మొదలైన ఉద్దండుల చేత రికార్డులు ఇప్పించారు. 1937 లో ప్రముఖ నటి శాంతకుమారి గారిని వివాహమాడారు పుల్లయ్య.

1911 వ సంవత్సరం మే 2 వతేదీన జన్మించిన పి. పుల్లయ్య గారికి ఈరోజు శత జయంతి. ఆ సందర్భంగా ఆయన్ని  స్మరించుకుంటూ యు ట్యూబ్ లో ప్రణీత్ ఛానెల్లో ఉంచిన  పుల్లయ్య గారి దర్శకత్వంలో 1943 లో వచ్చిన ' భాగ్యలక్ష్మి ' చిత్రంలో సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని బి. నరసింహారావు స్వరకల్పనలో మాలతి, టంగుటూరి సూర్యకుమారి పాడిన  ఈ పాట చూడండి.
Vol. No. 02 Pub. No. 222

నేనెందుకు సినిమాలు తీస్తాను ?

" మీరెందుకు చిత్రాలను తీస్తారు ? " అని నన్నెవరైనా అడిగితే సమాధానం అంత తేలికగా చెప్పడానికి వీలుకాదు. అయితే నేను సినిమాలు తీయటానికి సంతృప్తికరమైన కారణాలు లేక కాదు. కాని ఆ కారణాల బాహుళ్యం వలన సమాధానం చెప్పటం కష్టం. 

నా సంతృప్తి కొరకు నేను సినిమాలు తీస్తాననటం ఆ ప్రశ్నకు నిజమైన జవాబు. 
సినిమా తీయడం అనే చర్యలో ప్రతీ క్షణం నాకు ఆనందం కలుగుతుంది. సినేరియోని, సంభాషణలను నేను సమకూర్చుకుంటాను. ఈ పనులు నాకు ఫాసినేటింగ్ గా వుంటాయి. 

నా నటులను నేనే నిర్ణయించుకుంటాను. ఒక్కొక్కసారి వృత్తి  కళాకారుల్లోనుంచి తీసుకుంటాను.. మరోసారి రోడ్ మీద పోయే జనంలోనుంచి ఎంపిక చేసుకుంటాను.  సినేరియో రాస్తున్నపుడు ఊహించుకున్న పాత్రలను సజీవ వ్యక్తుల్లో వెదకటం అనేది చాలా ఆనందాన్నిస్తుంది. 

 ఒక్కొక్కప్పుడు నా నటులతో బాటు నేను కూడా చాలా శ్రమపడి పనిచెయ్యాల్సివస్తుంది. మరొకప్పుడు అప్పుడే కొత్తగా కెమెరా ముందుకు వచ్చిన ఔత్సాహిక నటుడు కూడా మొదటి టేక్ లోనే నేను కోరిన విధంగా నటించవచ్చు.  

 షూటింగ్ అనేది సినిమా తీయటంలోని ప్రధానమైన శక్తుల సమీకరణ. దర్శకుడిగా నేను, సినిమా తీసే యంత్రం ఒకరికొకరు అనుబంధంతో ఏకమై పనిచేయటానికి పథకం వేసుకోవాలి. ఇది చాలా కష్టం. ఎంతో సహనం కావాలి. కానీ చక్కగా రూపొందించిన ఘట్టము,  తీసిన దృశ్యము వలన కలిగే ఆనందానుభూతి అనుభవైకవేద్యం. పడిన శ్రమకు సాఫల్యమది. 

ఎడిటింగ్ కూడా చాలా ఉత్సాహకరంగా వుంటుంది. కానీ ఇది బుద్ధికి సంబంధించింది. ఖచ్చితమైన, సున్నితమైన ఆలోచనలకు లోబడి కూర్పు అనేది పని చేస్తుంది. దృశ్యాలను అతికించడమనే ప్రత్యేకమైన పని వలన మాత్రమే చిత్రం జీవం పోసుకుంటుంది.

సృజనాత్మక ప్రక్రియే కాకుండా సినిమా తీయడం నన్ను.. నా దేశానికి, నా ప్రజలకు దగ్గరగా తీసుకుని వెడుతుంది. ప్రతి సినిమా చిత్రీకరణ విషయ గ్రహణానికి ఎంతో తోడ్పడుతుంది. నా ప్రజల్లోని భిన్నత్వాన్ని గ్రహించే అవకాశం కలిగిస్తుంది. నా చిత్రాలు విభిన్న జీవితాలను మిళితం చేసే ప్రక్రియను వెదికేందుకు దోహదం చేస్తాయి. దృశ్య, శ్రవణాలలో వున్న భిన్నత్వ, ఏకత్వాలను సమ్మేళన పరచి ఒక సృజనాత్మక కళా రూపాన్ని రూపొంచించటం అనేది ప్రతీ చిత్ర దర్శకుడు ఎదుర్కునే సవాలు. 

నేను, నా మొదటి చిత్రం ' పథేర్ పాంచాలి ' ( జీవన గీతం ) తీసేటప్పటికి నాకు వంగ గ్రామీణ జీవితం గురించి కొంతమేరకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాను. వంగదేశపు నేల, ఋతువులు, చెట్లు, చేమలు, అడవులు, బీళ్ళు, పువ్వులు, పాటలు, పొలంలో రైతుల మాటలు, బావి దగ్గర అమ్మలక్కల ముచ్చట్లు, ఎండలో తిరిగి వానలో తడిసే పిల్లలు ............. ఇవన్నీ నాకు అవగతం అయ్యాయి. 

నా కలకత్తా నగరం గురించి నాకు ఇప్పుడు ఇంకా బాగా తెలిసింది. దీనిమీద ఒక చిత్రాన్ని తీశాను. చూడ్డానికి ప్రపంచంలో మరే ఇతర నగరంలాగా వుండదు కలకత్తా. అయినా లండన్, న్యూయార్క్, టోకియో లలోని ప్రజల్లాగానే ఇక్కడకూడా ప్రజలు పుడుతుంటారు... బ్రతుకుతుంటారు... ప్రేమించుకుంటారు... ద్వేషించుకుంటారు... చివరికి చనిపోతుంటారు. ఇవన్నీ నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసి సినిమాలను తీసేందుకు ప్రోత్సహిస్తుంటాయి. నేను భారతీయుడినయినా ఈ చిత్ర విశ్వంలో నేనొక పాత్రనని గ్రహించాను. ఈ ప్రాంతీయత, ఈ విశ్వజన నేతల సహజీవనం నా చిత్రాల ద్వారా తెలియజెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను.

 .............. 1980 ప్రాంతంలో ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురించబడిన సత్యజిత్ రే ఇంటర్వ్యూ నుంచి కొన్ని భాగాలు అనువదించి 1982 లో మా కోనసీమ ఫిలిం సొసైటీ 5 వ వార్షికోత్సవం సందర్భంగా వెలువడిన ' చిత్రరసజ్ఞ ' ప్రత్యేక సంచికలో ప్రచురించాం.

ఈరోజు ( మే 2 వ తేదీ ) సత్యజిత్ రే జయంతి సందర్భంగా ఆ భాగాల్నిఇక్కడ అందిస్తున్నాను.

గత నెల ( ఏప్రిల్ ) 23 వ తేదీన సత్యజిత్ రే వర్థంతి సందర్భంగా ప్రచురించిన టపా -

భారత చలనచిత్ర ' కిరణం ' 
 

Vol. No. 02 Pub. No. 221

Sunday, May 1, 2011

దేశోద్ధారక విశ్వదాత


అమృతాంజనం, ఆంద్రపత్రిక అనగానే గుర్తుకు వచ్చే మహనీయుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని  ఎలకుర్రు గ్రామంలో జన్మించిన నాగేశ్వరరావు పంతులు గారు తండ్రి సాంప్రదాయ విద్య నేర్చుకోమన్నా తల్లి ప్రోద్బలంతో బందరు హిందూ హైస్కూల్లో చదివి మెట్రిక్ పూర్తిచేసారు.

అప్పట్లో ధార్వాడ నాటక సమాజ ప్రభావం పడి నాగేశ్వరరావు గారికి నాటకాల మీద ఆసక్తి పెరిగింది. హిందూ థియేటర్ ద్వారా నాటకాలలో వేషాలు వేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారంలో రుక్మిణి, హరిశ్చంద్రలో చంద్రమతి లాంటి స్త్రీ వేషాలు వేశారు.

నాగేశ్వరరావు పంతులు గారి కళాశాల విద్య గుంటూరు, మద్రాసులలో సాగింది. అక్కడ ఉండగానే 1890 లో రామాయమ్మ గారితో ఆయన వివాహం జరిగింది. తొలిరోజుల్లో ఆయన జీవితం నల్లేరు మీద నడక కాలేదు. 1892 లో బొంబాయిలోను, తర్వాత రెండేళ్లకు కలకత్తాలోను వ్యాపారాలు చేసారు. కలకత్తాలో ఆరోగ్యం సరిపడక కొన్నాళ్ళు స్వగ్రామం వచ్చిన ఆయన తిరిగి బొంబాయి చేరి కొన్ని ఉద్యోగాలు చేసారు. ఆంగ్లేయులకు చెందిన ' విలియం అండ్ కో ' అనే సంస్థలో పనిచేసి మంచి పేరు సంపాదించారు. దానికి ప్రతిఫలంగా ఆ యజమాని ఇంగ్లాండ్ వెళ్లి పోతూ ఆ సంస్థను నాగేశ్వరరావు గారికి అప్పగించాడు. ఇదే ఆయన జీవితంలో పెద్ద మలుపయింది. 1899 లో ' అమృతాంజనం ' తయారు చేసారు. దాంతో పేరు, డబ్బు రెండు ఆయన స్వంతమయ్యాయి. 

స్వాతంత్ర్య ఉద్యమంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించింది. ఆ రాష్ట్ర ప్రజలలో జాతీయ భావాన్ని పెంచడంలో పత్రికలు కీలకమైన పాత్ర పోషించాయి. ఇది నాగేశ్వరరావు పంతులు గారిని ఆలోచింపజేసింది. ఫలితంగా 1909 వ సంవత్సరం సెప్టెంబర్ 9 వ తేదీన ' ఆంధ్రపత్రిక ' ఆవిర్భవించింది. బొంబాయి నుంచి వారపత్రికగా ప్రారంభమైన ' ఆంధ్రపత్రిక ' 1914 ఏప్రిల్ 1 వ తేదీన మద్రాసునుంచి దినపత్రికగా వెలువడింది. స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రపత్రిక పాత్ర మరువలేనిది. గ్రంథాలయోద్యమానికి ఆయన అందించిన చేయూత విశిష్టమైనది. ఖద్దరు ఉద్యమంలో, హోంరూల్ ఉద్యమంలో ఇంకా అనేక జాతీయోద్యమాలలో కీలక పాత్ర పోషించారు. 1924 అక్టోబర్ లో మద్రాసులో కట్టమంచి రామలింగారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఆంధ్రమహాసభలలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికి ' దేశోద్ధారక ' బిరుదు ప్రదానం చేశారు. 1933 డిసెంబర్ 30 న గాంధి మహాత్ముని చేతుల మీదుగా ' విశ్వదాత ' బిరుదును అందుకున్నారు పంతులుగారు.

1930 లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1932 లో శాసనోల్లంఘన ఉద్యమంలోను పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన ఒప్పందం జరిగిన ' శ్రీబాగ్ ' నాగేశ్వరరావు పంతులుగారి స్వగృహమే !

సాహిత్యాభిలాషతో ఆయన 1924 లో ' భారతి ' మాసపత్రికను ప్రారంభించారు. ఆరోజుల్లో భారతిలో రచన ప్రచురింపబడడం రచయితలకు గర్వకారణంగా ఉండేది. పాల్కురికి సోమనాథుని బసవపురాణానికి, ఇంకా శతకకవుల చరిత్ర, శతకమంజరి లాంటి చాలా గ్రంథాలకు పీఠికలు రచించారు. ఆయన సాహిత్య ప్రస్థానంలో చెప్పుకోదగ్గది ' ఆంధ్ర వాజ్మయ చరిత్రము ' రచన. సుమారు అయిదారు సంబత్సరాల కాలాన్ని వెచ్చించి రచించిన గ్రంథం ఇది.

బహుముఖ ప్రజ్ఞాశాలిగా , రాజనీతిజ్ఞునిగా, గుప్తదాతగా, దేశభక్తునిగా, పత్రికాసంపాదకునిగా, ప్రచురణకర్తగా ప్రసిద్ధి చెందిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి జన్మదినం ఈరోజు ( మే 1 వ తేదీ). ఆ సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుంటూ...  

 


Vol. No. 02 Pub. No. 220

నవ్వుతూ బ్రతకాలిరా !


కల్లాకపటం తెలియనిది పసిపాప బోసినవ్వు
మచ్చలేని మనసుకు మరోరూపం స్వచ్చమైన నవ్వు

బ్రతుకు బరువు తగ్గించే పరమౌషధం నవ్వు

అసలైన మనశ్శాంతికి సరైన మందు నవ్వు

ఆనందకరమైన జీవితాన్ని అందించేది నవ్వు
నవ్వులేని జీవితం వాసనలేని పువ్వు

డా. కటారియా సందేశం
హాయిగా నవ్వగలిగినవాడు అదృష్టవంతుడు
స్వేచ్చగా నవ్వలేనివాడు  దురదృష్టవంతుడు

 స్వచ్చంగా నవ్వుదాం ! స్వేచ్చగా నవ్వుదాం !!
కల్మషరహిత సమాజానికి బాటలు వేద్దాం !!!


 ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ నవ్వుల నజరానా.....  

Vol. No. 02 Pub. No. 219

అరుణ పతాకం ఎగిరింది

అరుణ పతాకం ఎగిరింది కార్మికలోకం గెలిచింది 
మానవులంతా ఒకటని చాటే మరో ప్రపంచం పిలిచింది 
 
శ్రామిక లోకమంతా ఒకటేనని ఎలుగెత్తి చాటింది 
తమ ఐకమత్యమే తమ బలమని నిరూపించింది 

కార్మిక శక్తికి ఎదురనేదే లేదని నిరూపించిన రోజు 
కార్మికులే నవయుగ నిర్మాతలని నిరూపించిన రోజు 
కార్మికలోకం గెలిచినరోజు 
అరుణ పతాకం ఎగిరినరోజు 

ఆ రోజే.... ఆ రోజే... మేడే 
నేడే... నేడే.... మేడే 

 కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు  

మహాకవి శ్రీశ్రీ సాహిత్యం కే. వి. మహదేవన్ స్వరకల్పనలో ' మనుషులు మారాలి ' చిత్రంలోని పాట.....

Vol. No. 02 Pub. No. 218
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం