Friday, May 6, 2011

మూకీల విశేషాలు

మూకీ చిత్రాల కాలంలో చాలా ఊళ్లలో విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. అందువలన చాలా చోట్ల సినిమా హాళ్ళలో ప్రొజెక్టర్లను చేతితో తిప్పవలసి వచ్చేది. అప్పటి ఆపరేటర్లు సెకనుకు 24 ఫ్రేములు తిరిగేలా ఏమాత్రం తడబాటు లేకుండా తిప్పేవారట. 

అలాగే మూకీ సినిమాలు కావడం వలన కథ, కథనాలు ప్రేక్షకులకు బాగా అర్థం కావడానికి సినిమా హాళ్ళలో వ్యాఖ్యాతలను పెట్టేవారు. వారు ఆ చిత్ర కథ వివరిస్తూ... అవసరమైన చోట ఆయా పాత్రల సంభాషణలను వాళ్ళే పలికేస్తూ...  అప్పుడప్పుడు  తమ సొంత వ్యాఖ్యలను జోడిస్తూ వుండేవారట. అవసరమైన చోట అవసరమైన శబ్దాలు కూడా వారు నోటితో పలికించి సన్నివేశాన్ని రక్తి కట్టించేవారట. పాత తరం హాస్యనటుడు కస్తూరి శివరావు ఈ వ్యాఖ్యాతల్లో అగ్రగణ్యుడు. ఆయన సినిమాల్లోకి రాకముందు ఇలా మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పనిచేసేవారు. ప్రముఖ చిత్రనిర్మాత కె. రాఘవ ఆయనకు సహాయకునిగా పనిచేసేవారు. కొన్ని చోట్ల వాద్యబృందాలను కూడా నియమించి నేపథ్య సంగీతం కూడా వినిపించేవారట.

అప్పట్లో చిత్రాలకు పంపిణీదారులు, హక్కుదార్లు అంటూ ఎవరూ ఉండేవారు కాదు. థియేటర్ యజమానులే కలకత్తాకో, బొంబాయికో వెళ్లి నిర్మాతల దగ్గర ప్రింట్ కొనుక్కుని తెచ్చుకుని ప్రదర్శించేవాళ్ళు.  ఆ రకంగా మధ్య దళారీలు ఉండేవారు కాదన్నమాట. ఆరోజుల్లో సాధారణంగా అమావాస్య రోజున మార్కెట్ సెలవు ఉండేది. దుకాణాలు మూసేసేవారు కాబట్టి ఆరోజు దుకాణాదారులు, ప్రజలు కూడా ఖాళీగా వుంటారు కాబట్టి ఆరోజే కొత్త సినిమాలు విడుదల చేసేవారు. తొలిరోజుల్లో వాల్ పోస్టర్లు ఉండేవి కాదు కనుక సినిమాల పబ్లిసిటీ కోసం కొంతమందికి వేషాలు వేసి ఎడ్లబళ్ళ మీద మేళ తాళాలతో ఊరేగించేవారట. సినిమా చూడటానికి వచ్చి టికెట్ కొన్న ప్రతీ ప్రేక్షకుడికీ కిళ్ళీ, సోడా ఉచితం అని కొన్నిచోట్ల ప్రకటించేవారట. కొత్త సినిమా విడుదలయినపుడు హాలును సర్వాంగ సుందరంగా అలంకరించేవారు.

భారతదేశంలో మొదటి చిత్రం ఫాల్కే నిర్మించిన ' రాజా హరిశ్చంద్ర ' ( మూకీ ) అయితే దక్షిణ భారతదేశంలో తొలి మూకీ చిత్రం ' కీచకవథ ' . దీన్ని 1918 లో నటరాజ మొదలియార్ నిర్మించారు.ఈ చిత్రం 35 రోజుల్లో నిర్మించబడింది.

ఈ నెల 3 వ తేదీన భారతీయ సినిమా తొంభై ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.......

Vol. No. 02 Pub. No. 225

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం