ప్రాజెక్ట్ లు ఆధునిక దేవాలయాలని నిర్వచించిన మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రు. స్వతంత్ర్య భారతదేశ నిర్మాణానికి కృషి చేసిన వారిలో నెహ్రు కుటుంబానికి ప్రముఖ స్థానమే వుంది. అందుకే ఇప్పటికీ మనదేశంలో ఆ కుటుంబానికి ప్రాధాన్యం తగ్గలేదు.
మన ప్రథమ ప్రధానిగా నెహ్రు ఈ దేశానికి అందించిన సేవలు మరువలేనివి. 1947 లో స్వాతంత్ర్యం సిద్ధించిన నాటినుంచి 1964 లో మరణించేవరకూ ప్రధానమంత్రిగా పనిచేసిన ఘనత నెహ్రుది. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ వెన్నంటి వుండి ఆయన వారసుడిగా పేరు పొందారు. ప్రధానిగా పార్లమెంటరీ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేసారు. విదేశీ వ్యవహారాల్లో మధ్యే మార్గం పాటించే విధానాన్ని అమలుచేసారు. అలీనోద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరు నెహ్రు.
భారతదేశ సమగ్ర ఆర్థికాభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలు అమలులోకి తెచ్చినా. ఇండో చైనా ఘర్షణ నివారణకు పంచశీల అమలు చేసినా అది నెహ్రుకే చెల్లింది. ఎన్నో భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ లు. హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ లు తన హయాంలో ప్రారంభించారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, ఐ.ఐ.టి. , ఐ. ఐ. ఎం., ఎన్. ఐ. టి. లాంటి అత్యున్నత స్థాయి విద్యాసంస్థలు నెహ్రు హయాంలోనే ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపం వల్ల చదువుకు దూరం కావడం గమనించి వారికి నాణ్యమైన పాలు, ఆహారం పాఠశాలలలోనే అందించే పథకాన్ని ప్రారంభించారు. తద్వారా విద్యావ్యాప్తికి దోహదం చేసారు. గ్రామీణ ప్రాంతాల్లో వయోజనవిద్య వ్యాప్తికి కృషి చేసారు. కులవివక్షత, లింగవివక్షత నిర్మూలనకు చట్ట సవరణలు కూడా ఆయన హయాంలోనే జరిగాయి.
సుమారు రెండు వందల సంవత్సరాలు పరాయి పాలకులు పీల్చి పిప్పిచేసిన భారతదేశ పునర్నిర్మాణానికి నెహ్రు చేసిన కృషి అనిర్వచనీయం.
జవహర్లాల్ నెహ్రు వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ............................
Vol. No. 02 Pub. No. 240
No comments:
Post a Comment