Monday, May 2, 2011

పుల్లయ్య శతజయంతి

పుట్టిన ముగ్గురు భిడ్డలు చనిపోతే తర్వాత పుట్టిన నాలుగో బిడ్డ అయినా దక్కాలని ఎక్కడో కారడవుల్లో తపస్సు చేసుకుంటున్న సంజీవి తాత అనే బైరాగిని ఆశ్రయించింది ఆ తల్లి. ఆయన ఉపదేశం ప్రకారం మూడు వారాలపాటు దీక్ష తీసుకుని సముద్రపు ఒడ్డునే నిద్ర పోయింది. ఆ బైరాగి ఉపదేశం మీదే బిడ్డ పుట్టాక పులి విస్తరాకుల్లో దొర్లించి ' పుల్లయ్య ' అని పేరు పెట్టుకుంది ఆ తల్లి.

ఆ బిడ్డే పెరిగి పెద్దయి తెలుగు చలనచిత్ర రంగంలో దర్శకునిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న పి. పుల్లయ్య. 1939 లో ఆయన దర్శకత్వం వహించిన ' బాలాజీ ' చిత్రం నెగటివ్ అగ్నికి ఆహుతైపోయింది. అయితే వెంకటేశ్వరస్వామికి సంబంధించిన ఫ్రేములకి మాత్రం ఏమీ కాలేదట. దాంతో స్వామిని తల్చుకుని పుల్లయ్యగారు మళ్ళీ 1969 లో ' శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం ' నిర్మిస్తే ఆయన కాసుల వర్షం కురిపించాడు. ఆ చిత్ర నిర్మాణ సనయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహం ముందు వెలిగించే దీపానికి ఖర్చుకు వెరవకుండా స్వచ్చమైన ఆవునెయ్యి మాత్రమే వాడారట. ఆ సెట్లో పెట్టిన హుండీలో సందర్శకులు, ముఖ్యంగా మింట్ రోడ్ ప్రాంతాలనుంచి వచ్చిన షావుకార్లు తమ నల్లదనం దండిగా వేసేవారట.

ఎన్నో భక్తిరస, సంగీతభరిత చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించిన పుల్లయ్య గారు సినిమాల్లోకి రాకముందు కామిక్ పాటలు పాడేవారట. కొలంబియా కంపెనీ రికార్డులుగా అవి వెలువడ్డాయట. కొన్నాళ్ళు బ్రిటన్ కి చెందిన బ్రాడ్కాస్ట్ రికార్డింగ్ కంపెనీకి రిప్రజెంటేటివ్ గా పనిచేసి ఎం. ఎస్. సుబ్బులక్ష్మి, చౌడయ్య, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, అద్దంకి శ్రీరామమూర్తి, కపిలవాయి రామనాథ శాస్త్రి మొదలైన ఉద్దండుల చేత రికార్డులు ఇప్పించారు. 1937 లో ప్రముఖ నటి శాంతకుమారి గారిని వివాహమాడారు పుల్లయ్య.

1911 వ సంవత్సరం మే 2 వతేదీన జన్మించిన పి. పుల్లయ్య గారికి ఈరోజు శత జయంతి. ఆ సందర్భంగా ఆయన్ని  స్మరించుకుంటూ యు ట్యూబ్ లో ప్రణీత్ ఛానెల్లో ఉంచిన  పుల్లయ్య గారి దర్శకత్వంలో 1943 లో వచ్చిన ' భాగ్యలక్ష్మి ' చిత్రంలో సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని బి. నరసింహారావు స్వరకల్పనలో మాలతి, టంగుటూరి సూర్యకుమారి పాడిన  ఈ పాట చూడండి.




Vol. No. 02 Pub. No. 222

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం