Showing posts with label సాహిత్య విశేషాలు. Show all posts
Showing posts with label సాహిత్య విశేషాలు. Show all posts

Monday, June 17, 2013

శ్రీపాద వారి ' క్రొత్తచూపు '

  తెలుగు కథా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. 

21 వ శతాబ్దం తొలి రోజులంటే ఛాందస వాదం రాజ్యమేలుతున్న కాలం. ముఖ్యంగా స్త్రీలు సంప్రదాయ బంధనాల్లో మగ్గుతున్న రోజులవి. స్త్రీ అభ్యుదయం అనే మాట ఎత్తడానికే జంకే కాలమది. ఆ రోజుల్లో ఆడవారు చదువుకోవడమే ఒక నేరం. అసలు గడప దాటి బయిటకు వెళ్ళడమే అపరాధం. అలాంటిది ఒక స్త్రీ మగవారికే స్వంతమనుకునే సాముగరిడీలు కూడా నేర్చుకుంటే....... కుస్తీలు పడితే .... ఊహించడానికి కూడా వీలు లేదు అప్పుడు. అప్పుడేమిటి ? ఇప్పుడు కూడా స్త్రీలలో ఎంత శాతం సాము గరిడీలు, కుస్తీలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు ? ఇష్టపడినా ఎంతవరకూ సాధ్యమవుతోంది ? ఆరు, ఏడు దశాబ్దాల క్రితమే అది సాధ్యమని నిరూపించారు శ్రీపాద వారు తమ కథ‘ క్రొత్త చూపు ’ లో .......
స్త్రీ అభ్యుదయం అంటే ఏమిటో తెలిపే ఈ కథా పరిచయం ‘ శబ్దకదంబం ‘ శీర్షికలో...  శ్రీమతి ఎర్రమిల్లి శారద స్వరంలో... 
శిరాకదంబం 02_032 సంచిక 32 వ పేజీలో వినండి.    

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 082

Sunday, March 31, 2013

శ్రీమదధ్యాత్మ రామాయణము - తత్వ దీపిక


ఆంధ్ర పద్యకవితా సదస్సు ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమము

మధురకవి, అవధానధురీణ, పండిత శ్రీ నేమాని రామజోగి సన్యాసి రావు గారి ఉపన్యాసము

శ్రీ కామాక్షి పీఠం ప్రవచన మందిరంలో, అమలాపురం
2013 మార్చి 31 వ తేదీ సాయింత్రం గం. 04.30 లకు




Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No. 071

Saturday, November 5, 2011

దాశరథితో కాసేపు.....

  ఏ దివిలో విరిసిన పారిజాతమో ! 
ఈ భువిలో వెలిసిన కవితారత్నము

తెలుగు జాతికి దొరికిన అదృష్టం
తెలుగు భాష చేసుకున్న పుణ్యం

తెలంగాణా విముక్తికై గర్జించిన సింహం
తెలుగు జాతి ఐక్యతకోసం తపించిన కలం

నిజాం పాలనలో తెలుగు జాతి కడగండ్లను నిరసించిన గళం
నిజాం కాలంలో తెలుగు భాష ఉన్నతికోసం తపించిన కలం

తెలుగు వారికి సాహితీ విందు చేసిన కవి దాశరథి
తెలుగు వారికి కర్ణామృతాన్ని అందించిన సాహితీమూర్తి

కవి దాశరథి గారి వర్థంతి సందర్భంగా సాహితీ నివాళులు అర్పిస్తూ ................

 దాశరథి గారి మేనకోడలు శ్రీమతి దుర్గ డింగరి తెలుగు వన్ రేడియో టోరి క్లాసిక్ ఛానల్లో రేపు ఆదివారం (  06 - 11 - 2011  ) మధ్యాహం గం. 12 .00  లకు " పాటలపల్లకి " కార్యక్రమంలో దాశరథి గారి స్వరం వినే భాగ్యం కలుగజేస్తున్నారు. దాశరథి గారి అభిమానులు, సినీ సంగీత, సాహిత్య ప్రియులు ఈ కార్యక్రమాన్ని విని ఆనందించగలరని భావిస్తున్నాను. 


దాశరథి గారి గురించి గతంలో రాసిన టపా ..........


దాశరధీ... కవితా పయోనిధీ !


Vol. No. 03 Pub. No. 068

Thursday, October 20, 2011

చదవాలే కానీ చూడకూడదు !

 మాట కరుకు, మనసు వెన్న.... తెలుగు సాహితీకారులకి జ్ఞాన పీఠాన్ని రుచి చూపిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకో ఉదాహరణ...... 

బందరులో కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు. ఎండాకాలం. అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది. 

ఆ అబ్బాయి " విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? " అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్లి పోయింది. ఎంతసేపైనా లోపల్నుంచి ఎవరూ రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసాడు. వంటిల్లు కనబడింది. ఎండాకాలం ఆవకాయ సీజను కదా ! దానికోసం లోపల పచ్చి మామిడికాయల రాసి పోసి వుంది. దాని ముందు కత్తిపీట పెట్టుకుని కూర్చుని ఒక పెద్దాయన కాయలు తరుగుతున్నాడు. వంటాయన కాబోలు అనుకున్నాడా అబ్బాయి. ఆ శ్రమకు, వేడికి బయిటకు వస్తున్న చెమటలు తుడుచుకుంటూ తరిగేస్తున్నరాయన. ఈ అబ్బాయి ఆయన్ని పిలిచి విశ్వనాథ వారిని గురించి అడిగాడు. తరగడం ఆపి ఓసారి ఇతన్ని పరీక్షగా చూసి లోపలి రమ్మని పిలిచారు. 

ఆ అబ్బాయి లోపలి వెళ్ళాడు.  " నీ పేరేమిటి ? " అని అడిగారాయన. చెప్పాడా అబ్బాయి. ఏం చదువుతున్నావంటే చెప్పాడు. ఊరు, పేరు.... ఇలా ఒక్కొక్కటే అడుగుతుంటే అతనికి విసుగొచ్చింది. 

" ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడా ? " అనడిగాడు. 

" ఆయనతో నీకేం పని " అని ఎదురు ప్రశ్న వేసారు ఆ పెద్దాయన. 

" పనేం లేదు. ఊరికే చూసి పోదామని. అంతే ! " అన్నాడా అబ్బాయి తాపీగా. 

అంతే...  ఆ పెద్దాయనకు కోపం ముంచుకొచ్చింది.  

" వచ్చిన ప్రతీవాడికీ నేనేం ధర్మ దర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేం చూస్తావు నా పిండాకూడు. ఎలాగూ వచ్చావు. నాలుక్కాయలు తరిగేసి పో ! నాక్కాస్త సాయం చేసినట్లేనా వుంటుంది " అని గయ్యిమన్నారు. 

దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ వారని అర్థమయింది. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. అంతే ! ఆ మహానుభావుడి మనసు వెన్నలా కరిగిపోయింది.  ఆ అబ్బాయిని లేవదీసి...

" లేరా అబ్బాయ్ ! నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా ! " 

...... అని ఆ పూట భోజనం పెట్టి, సాహితీ తాంబూలంగా కొన్ని పుస్తకాలు ఇచ్చి పంపారు. 
విశ్వనాథవారి మాటల చమత్కారం అదీ !

Vol. No. 03 Pub. No. 062

Friday, September 30, 2011

పాటబడి పెద్ద

విజయనగరం పేరు చెప్పగానే గజపతుల వైభవంతో బాటు సంగీత, సాహిత్య వైభవం కూడా మన కళ్ళ ముందు మెదులుతుంది. ముఖ్యంగా సంగీత రంగాన్ని సుసంపన్నం చేసిన ఎందఱో కళాకారులకు విజయనగరం పుట్టినిల్లు. పుట్టింది కృష్ణా జిల్లా అయినా ఘంటసాల మాస్టారు సంగీతజ్ఞుడిగా తయారయింది విజయనగరంలోనే ! స్వర కోకిలమ్మ సుశీలమ్మను మనకందించింది కూడా విజయనగరమే ! గురజాడ రచనలకు వేదిక అయింది కూడా విజయనగరమే ! వీరికే కాదు ఇంకా ఎందఱో సాహితీవేత్తలకు కూడా విజయనగరం స్థానం కల్పించింది.

ఆ విజయనగరానికే తలమానికమైన సంగీత కళాశాల అదే.... ఒకప్పటి సంగీత పాఠశాల చరిత్ర సుమారు ఎనిమిదిన్నర దశాబ్దాలనాటిది. కర్ణాటక సంగీత రంగాన్ని సుసంపన్నం చేసిన ఎందఱో మహానుభావులు ఆ కళాశాలనుంచి తయారయ్యారు. మరెందరో మహనీయులు ఆ కళాశాల కీర్తిని ఇనుమడింపజేసారు. ఆ పాఠశాల తొలి అథ్యక్షులుగా హరికథా పితామహ శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు 1935 లో నియమితులయ్యారు. 

సాధారణంగా ఇతరులైతే తమ హోదాను పాఠశాల అథ్యక్షులు అనే రాసుకుంటారు. కానీ నారాయణదాసు గారు  తమ హోదాను రాసుకోవలసి వచ్చినప్పుడు శుద్ధ వ్యావహారికంలో ' పాటబడి పెద్ద ' అని రాసుకునేవారట.  ఎంత చక్కటి పలుకుబడి...... 



ఓసారి పురిపండా అప్పలస్వామి గారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా చర్చ ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభమైన వ్యావహారిక భాషోద్యమం మీదకి మళ్ళింది. ఆయన అకస్మాత్తుగా ఒక ప్రశ్న వేసారు. 

" ' తవ్వోడ ' అనే మాట ఎప్పుడైనా విన్నారా ? " అని అడిగారు. 

మేము బుర్రలు గోక్కున్నాం. ఆ పదం అసలు తెలుగు పదమేనా ? లేక మరేదైనా భాషా పదమా ? అనే సందేహం వచ్చింది. 

ఆ విషయమే అప్పలస్వామి గారిని అడిగాం. అది తెలుగు భాషకు చెందినదే అని చెప్పారు. 

ఎంత ఆలోచించినా ఆ పదం ఏమిటో, దాని అర్థం ఏమిటో అప్పుడు మాకు తట్టలేదు. చివరికి ఆయనే ఆ పదం గురించి వివరించారు. 

మీకెవరికైనా ఆ పదం గురించి తెలిస్తే చెప్పగలరా ?

 Vol. No. 03 Pub. No. 045

Saturday, September 10, 2011

తెలుగుభారతి ముద్దు బిడ్డ విశ్వనాథ

 ఒక్క సంగీతమేదో పాడునట్లు భా 
     షించునప్డు విన్పించు భాష  
విష్పష్టముగ విన్పించునట్లు స్ప
     ష్టోచ్చారణంబున నొనరు భాష
రసభావముల సమర్పణ శక్తి యందున 
     నమర భాషకు దీటైన భాష
 జీవులలోనున్న చేవ యంతయు చమ 
      త్కృతి పల్కులన్ సమర్పించు భాష
భాషలొక పది తెలిసిన ప్రభువుచూచి 
భాషయననిద్దియని చెప్పబడిన భాష 
తనర ఛందస్సులోని యందమ్ము నడక 
      తీర్చిచూపించినట్టిది తెలుగు భాష
వృత్తులు పాకముల్ రీతులు శైలులు 
      లావణ్య మొప్పెడు లలిత భాష 
ఎద్ది సంభవమౌనొ అద్ది సంధానించి
     ఉచితత్వమున్ గూర్త నొదుగు భాష
ఎన్నియొయ్యారంబులేని పోనగజేసి
     నడిపింపగలయట్టి గడుసు భాష 
పాలించి దక్షిణాపథమెల్ల నొకనాడు 
     ప్రభుత నిరూపించు రాజభాష 
అల్ల భాషయొక్క నధికత్వమంతయు
     శక్తి నెరపగలుగు జనుల మీద    
అన్ని కాలములను నాధారపడియుండు
     తెలుగు భాషయన్న దివ్యభాష


....... తెలుగు భాష సొగసు గురించి ఇంత బాగా చెప్పగలవారెవరు ?
తెలుగుభారతి ముద్దు బిడ్డ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కన్నా...

రామాయణ కల్పవృక్షాన్ని తెలుగు భారతి పెరట్లో నాటిన మహాకవి విశ్వనాథ
కిన్నెరసానికి నడకలు నేర్పి ఆంధ్ర దేశమంతా పారించిన మధురకవి విశ్వనాథ
నవలా సాహిత్యాన్ని వేయి పడగలతో అలంకరించిన సవ్యసాచి విశ్వనాథ
ప్రబంధం, కథ, కవిత, గేయం, విమర్శ.... అన్నీ ఆయనకు నల్లేరు మీద నడక
ఆధునిక యుగంలో శ్రీనాథునితో పోల్చగలిగిన గొప్ప కవి ఎవరు విశ్వనాథ కాక

విశ్వనాథవారు ఆథునికులలో ప్రాచీనుడు.... ప్రాచీనులలో అథునికుడు
ఆయన తెలుగు కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేసిన జ్ఞానపీఠాలంకృతుడు

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి జయంతి సందర్భంగా నీరాజనాలు అర్పిస్తూ.........


Vol. No. 03 Pub. No. 030

ఇద్దరు ప్రముఖ రచయిత్రులు...?- జవాబు

   కనుక్కోండి చూద్దాం - 52 _ జవాబు 

  ఈ ప్రక్కఫోటోలో కనిపిస్తున్నది ఇద్దరు ప్రముఖ రచయిత్రులు. పాత ఫోటో కావడం, అంత స్పష్టంగా లేకపోవడం వలన సులభంగా గుర్తుపట్టడానికి ఒక క్లూ..... వీళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళు. 
 ప్రశ్న : ఇద్దరు రచయిత్రుల పేర్లు చెప్పగలరా ?  
 
జవాబు : ఒకరు ( కుడిప్రక్క ) రచయిత్రి శ్రీమతి గోవిందరాజు సీతాదేవి గారు, ఇంకొకరు కొంతకాలం పాటు ఆంధ్ర పాఠకలోకాన్ని  ఉర్రూతలూగించిన రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి. 

 
Vol. No. 03 Pub. No. 024a

Friday, September 9, 2011

ప్రజాకవి ' గొడవ '

సత్యాహింసల 
  యేబదేండ్ల కృషి 
క్షణంలో 
  అయిపోయెను మసి

బాపూజీ బ్రతికిన యప్పటి 
సత్యహింసల దుప్పటి 
బొంకుల బొంతగా మారెను 
ఘనతలు శాంతము దీరెను 

ఉదయం కానే కాదనుకోవడం నిరాశ 
ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ 
ఈ చీకటి వుండదు 
సూర్యుడు తప్పక ఉదయిస్తాడు  

మాయలోకము మాయజనుల 
మనసులో గల మాటయొకటి
పైకి నుడివెడి పలుకు ఒకటి 
చేయదలచిన చేష్ట యొకటి 


      అవనిపై జరుగేటి అవకతవకలు జూచి 
      ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు 

పరుల కష్టముజూచి కరగిపోవును గుండె 
మాయమోసము జూచి మండిపోవును ఒళ్ళు 
పతిత మానవుజూచి చితికిపోవును మనసు 
       ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు

అవకతవకలు నేను సవరింపలేనపుడు
" పరుల కష్టాలతో పనియేమి మాక " నెడు
అన్యులను గనియైన హాయిగా మనలేను 
       ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు


 ........... ఇదీ కాళోజి ' గొడవ ' . ఆయనదెప్పుడూ వ్యవస్థతో  గొడవ పడే తత్వమే  ! 
 ఆయన జీవితమే ఉద్యమం. ఉద్యమమే ఆయన ఊపిరిగా జీవించాడు. 

అవినీతి, అన్యాయం పెచ్చుమీరినప్పుడు
దౌర్జన్యం, దుర్మార్గం హద్దు మీరినప్పుడు
మానవత్వం మృగ్యమైనప్పుడు
మనిషి మనిషిగా జీవించలేనప్పుడు

ఆయన కెరటమై నిలువెత్తు పొంగాడు
ఆయన ఉద్యమమై ఉవ్వెత్తున లేచాడు
కలాన్ని ఖడ్గంగా చేసాడు
ఫల్గుణ శక్తితో విజృంభించాడు

తెలంగాణా వైతాళికుడు కాళోజి
మాటలలో, చేతలలో, వేషభాషలలో
మూర్తీభవించిన తెలంగాణా కాళోజి

నేను ప్రపంచ పౌరుడినన్న  కాళోజికి
తెలంగాణా అంటే అంతులేని అభిమానం
రవీంద్రునిలా అది దురభిప్రాయం కాదు

తన భాష, తన ప్రాంతం, తన ప్రజలు
అభివృద్ధి చెందాలనేది ఆయన ఆశయం
అందుకోసమే ఉద్యమించాడు

" ఇప్పటి కవులందరూ సూత్ర పారాయణ వరకే...
 నా, మా, మన అనే దశలను పూర్తి చేసినపుడే కవి పరిపూర్ణుడవుతాడు. ఇక్కడ నా..  అంటే నేను. మా.. అంటే
తన భార్యాపిల్లలు అని. మన.. అంటే మనందరం అని అర్థం. ఈ స్థాయిలో కవిత్వం రాసినప్పుడే అది ముందడుగు అవుతుంది. ఈ క్రమంలో నేను ' నా ' దాటి ' మా ' దగ్గరనే వున్న. అలాగే ఇప్పుడున్న కవులందరూ అక్కడే ఆగారు. కానీ ప్రభుత్వానికి నేరుగా వ్యతిరేకంగా రాసింది గరిమెళ్ళ సత్యనారాయణ ఒక్కడే ! అట్లాంటి కవులు ఇంకా రావాలే ! " అనేవారు కాళోజి.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రముఖకవి దాశరథితో బాటు కాళోజి కూడా పాల్గొన్నారు. కాళోజీ రచించిన ' నా గొడవ ' కావ్యం మొదటి మూడు ప్రచురణలకు దాశరథి పీఠికలు రాసారు.

" కాళోజీ ఇరవదవ శతాబ్దంలో తెలంగాణా ప్రప్రథమ ప్రజాకవి. కాళోజీ అనగా కల్లలకూ, కపటాలకూ లాలూచీ పడని జీవితం అని అర్థం. అతని గేయాలకు గానీ, అతనికి గానీ అర్థం చెప్పవలసిన అవసరమే లేదు. అసలు అవే అర్థంకాని ఈ సమాజపు మహొద్గ్రంథానికి విపుల టిప్పణి వంటివి " అన్నారు దాశరథి మొదటి ప్రచురణలో. 

' నా గొడవ ' మొదటి ప్రచురణ ఆవిష్కరణ సందర్భంలో మహకవి శ్రీశ్రీ మాట్లాడుతూ ...

" కాళొజీ నిఖిలాంధ్ర కవి. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివినవారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ " అని ప్రస్తుతించారు. 

ప్రజా ఉద్యమాలకోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే కాళోజీ జీవించారు.

ప్రజాకవి కాళన్న జయంతి సందర్భంగా నివాళులు  అర్పిస్తూ......



Vol. No. 03 Pub. No. 029

Saturday, September 3, 2011

సాహితీ ధ్రువతార

 మరో సాహితీ ధ్రువతార రాలిపోయింది
 ఆయన పాత్రికేయుడు మాత్రమే కాదు.... సాహితీవేత్త కూడా.....
ఆయన సాహితీవేత్త మాత్రమే కాదు..... పరిశోధకుడు కూడా.....
ఆయన పరిశోధకుడు మాత్రమే కాదు.... విజ్ఞానవేత్త కూడా.....
ఆయన విజ్ఞానవేత్త మాత్రమే కాదు......... సాహితీ సుక్షేత్రంలో అన్నీ

పత్రికలకు విలువ నేర్పినవారు
అనువాదకులకు అర్థాలు నేర్పినవారు
నరావతారాన్ని చదువరులకు చూపించినవారు
తెలుగువారందరికీ విశ్వదర్శనం చేయించినవారు
విజ్ఞానగ్రంథాల రచనలో విశ్వరూపం ప్రదర్శించినవారు 

పెద్దలకోసం పెద్ద గ్రంథాలు అనువుగా రాసారు
తెలుగులో విజ్ఞాన సాహిత్యం లేదనే కొరత తీర్చారు
పిల్లలకోసం బాల సాహిత్యం సులువుగా తెనిగించారు
మార్క్ ట్వైన్ ఆంధ్రుడిగా పుట్టి తెలుగులో స్వయంగా రాసాడా అనిపించారు

ఆ ధ్రువతార రాలిపోయింది..... ఆ సాహితీవనం వాడిపోయింది
ఆయన కలం ఆగిపోయింది..... ఆయన గళం మూగవోయింది
అయినా ఆయన రచనలు సాహితీవినీలాకాశంలో ఎప్పటికీ ద్రువతారలే !
అయినా ఆయన పంచిన విజ్ఞానం సాహితీవనంలో ఎప్పటికీ వాడని కుసుమాలే !!

రాలిపోయిన మరో సాహితీ ధ్రువతార నండూరి రామమోహనరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ..... 


నండూరి వారు తీర్చిదిద్దిన ఆంధ్రజ్యోతి ఈనాటి సంచికలో ఆయన గురించి ఈ క్రింది లింకులలో ......

సంపాదకీయం .....
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2011/09/03/ArticleHtmls/03092011004004.shtml?Mode=1

తుర్లపాటి వారి జ్ఞాపకాలు ....
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2011/09/03/ArticleHtmls/03092011004011.shtml?Mode=1

Vol. No. 03 Pub. No. 023

Monday, August 1, 2011

భాషామతల్లి ఔన్నత్యం

భారతీయ భాషలు, సాహిత్యం విశిష్టమైనవి. అందులో మనదైన తెలుగు భాషలో సాహిత్యం అనేక పోకడలు పోయింది. అనేక విన్యాసాలు చేసింది. భాషను, సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన, చేస్తున్న సాహితీస్రష్టలేందరో మనకి వున్నారు. అందుకే మనదైన భాషను  సజీవంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీదా వుంది. 


తెలుగు సాహిత్యంలో ద్వర్థి కావ్యం అనేది ఓ విచిత్రమైన ప్రక్రియ. అందులో అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన రచన ' రాఘవ పాండవీయం ' ప్రముఖమైనది. ఒకే పద్యంలో రామాయణ, భారత అర్థాలు వచ్చేటట్లు రెండు అర్థాలతో రచించడం ఆ కావ్య ప్రత్యేకత. 

దీనిపైన క్లిక్ చెయ్యండి 
భారతీయ భాషలన్నిటికీ మూలమైన భాష, తల్లి భాష సంస్కృతం.  ప్రపంచంలోని కొన్ని భాషల్లో కూడా సంస్కృత మూలాలు ఉన్నాయంటారు. అంతులేని సాహితీ సంపద సంస్కృతంలో వుంది. ఇటీవల ఆధునిక సూపర్ కంప్యూటర్లకు అత్యంత అనువైన భాషగా నాసా గుర్తించిందట. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో సంస్కృతానికి ఆదరణ బాగా పెరుగుతోంది. సంస్కృతం భాషకు పుట్టినిల్లుగా చెప్పుకునే భారత దేశంలో పుట్టిన మనందరం మళ్ళీ ఆ భాష వికాసానికి కృషి చేస్తే బాగుంటుంది. కనీసం ఇలాంటి విశేషాలను అందరికీ తెలియజేసి ఆ భాష గొప్పతనాన్ని తద్వారా భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి.  

సంస్కృతంలో పద్నాలుగవ శతాబ్దానికి చెందిన దైవజ్ఞ సూర్య పండితుడు అనే కవి రామకృష్ణ విలోమ కావ్యం వ్రాసారు. ఇందులో పద్యాన్ని మామూలుగా మొదటినుంచి చివరకు చదివితే రామాయణార్థం, తిరగేసి అంటే చివరినుంచి మొదటికి చదివితే భారతార్థం వస్తుంది. ఈ కావ్య పరిచయాన్ని పేస్ బుక్ లో మిత్రులు శ్రీ మణికంఠ ప్రసాద్  గారు అందించారు. దాన్ని ఇక్కడ అందిస్తున్నాను.


అలాగే రామకృష్ణ విలోమ కావ్యం లింక్ కూడా ఆయన అందించారు. అయితే ఇది పూర్తి పాఠం కాకపోవచ్చు. ఆ లింక్ .................. 



Vol. No. 02 Pub. No. 300

Friday, July 8, 2011

కవికోకిల రసధారలు


కోనసీమ కవికోకిలగా లబ్దప్రతిష్టులైన డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారి సాహిత్య కళాసాగరులు. వారికి ప్రకృతి పట్ల ఆరాధన, దేశాభిమానం, ప్రకృతికి మూలాధారమైన పరమేశ్వరుడంటే భక్తి మెండు. ప్రాచీన అధునాతన కవితా వారధిగా సుమారు నాలుగు తరాల శ్రోతలకు లక్ష్మీపతిరావు గారు సుపరిచితులు. అమలాపురం శ్రీ కోనసీమ భానోజీ రామర్సు కళాశాలలో తెలుగు విభాగ అధిపతిగా పనిచేశారు.



చిలకాకు పచ్చ పైరు పైట వయ్యారం, గలగల పారే సెలయేళ్ళలో సరిగమల సంగీతం చూడటం, పువ్వువంటి మనసుతో హాయిగా నవ్వుతూ వలపు చిలికి పదిమందిని పలుకరించడం ప్రకృతినుంచి లక్ష్మీపతి రావు గారు సహజంగా నేర్చుకున్న లక్షణం.

రసహృదయులు, సమ్రాట్టులు, కవులకు పల్లకి పట్టిన దీదేశం.... రాల్ కరిగించెడి అమరగానమున పరవశించిన దీదేశం.... అంటూ భరతమాతను హిమాలయమంత ఎత్తు సింహాసనంపై అధిష్టించి కీర్తించిన లక్ష్మీపతిరావు గారి గుండెలోతుల్లో దేశభక్తి ప్రస్ఫుటమవుతుంది. హిమగిరి చల్లన, జలనిధి నల్లన, రెంటి నడుమ కన్నతల్లి పచ్చన - పచ్చపచ్చనా.... అంటూ భారతమాత సౌభాగ్యం చూసి మురిసిపోతారు లక్ష్మీపతిరావు గారు. ఆకాశవాణికి ఆస్థానకవిగా అనేక పాటలు రచించారు. ముఖ్యంగా అనేక దేశభక్తి గేయాలు వ్రాశారు. ఎన్నో కవితా కుసుమాలు వెదజల్లారు. మరెన్నో కవితా సమీక్షా గ్రంథాలు వెలువరించారు.

చిరకాలంగా నిరంతరాయంగా కొనసాగిన ఆయన సాహితీ వ్యవసాయం  గత సంవత్సరంతో ఆగిపోయింది. ఆ కవితా కలంలో సిరా నిండుకుంది.


కోనసీమ కవికోకిల డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా వారి కలం నుంచి వెలువడిన...  గ్రామఫోన్ రికార్డులుగా వెలువడి ప్రజాదరణ పొందిన.... బాలు, జానకి, కోవెల శాంత ఆలపించిన పంచరత్నాలు..............  

* " దేవుడిచ్చిన తియ్యనైన కవిత సొమ్ముల కమ్మెడు కవినికాను నేను " అని భక్తపోతనవలె చాటుకున్న డాక్టర్ లక్ష్మీపతిరావు గారు రచించిన  "  ఆంధ్ర పుణ్యక్షేత్రాలు " రసరమ్య గీతాలు - గ్రామఫోను రికార్డు విన్నవారికవి అమృతధారాపాతాలు - భక్తి పారవశ్యంలో క్షేత్రధర్శన భావావేశాలు, అనిర్వచనీయ అనుభూతులు కలిగించాయనడం అతిశయోక్తి కాదనుకుంటా ! గీతాలను పద్మభూషణ్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తొలినాళ్లలో శ్రీమతి జానకి గారితో కలసి  అలపించడంతో తేనెలూరు చక్కెర రసాగ్రాన నర్తించినట్లే - మనసు తేలికై హాయిగ ఊయలూగినట్లే !

* ఏ శుభకార్యము చెసినా, వ్రతమాచరించినా  ముందుగా విఘ్ననాయకుడైన వరసిద్ధి వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. విషయాన్ని లక్ష్మీపతిరావు గారు రసరమ్యంగా పలికిస్తారు. 

* కలతలోపడి పరితపించే జీవుల వెతలు తీర్చే స్వామివి నువ్వు - దయచూడవా గజముఖ గణనాయికా ! సర్వమంగళ నాయికా ! అంటూ గణనాధుడిని ఎంత ఆర్ద్రంగా వేడుకోవచ్చో  తన పాటలో వర్ణిస్తారు.


* పసుపుకుంకుమలే స్త్రీలకు సౌభాగ్యం. సిరిసంపదలిచ్చే బంగారుతల్లి కథే వరలక్ష్మీవ్రతం. తన కలంనుండి జాలువారిన కథను జానకిగారి గళంలో పలికించారు లక్ష్మీపతిరావు గారు.

* పాలకడలిలో వెలసిన పూబోణి, పాలమనసుతో పాలింపరావే కళ్యాణకారిణీ - అంటూ కాంతుని యెదపై కాపురముండి ఎడబాటన్నదే ఎరుగని జగదేక పావనిని భాగ్రమూ, సౌభాగ్యములిచ్చి కాపాడమని ఎంత మురిపెంగా కోరుకోవచ్చో ఓ పాటలో వివరించారు.   



డాక్టర్ లక్ష్మీపతిరావు గారు స్వర్గస్తులైన సందర్భంలో గత సంవత్సరం రాసిన టపా .......

మధురకవి అస్తమయం 

Vol. No. 02 Pub. No. 274

Friday, June 17, 2011

నీలాలు కారేనా ?

 జీవితాంతం తోడుగా నీడగా ఉంటానని ప్రమాణం చేసి తనతో తీసుకొచ్చిన అమ్మాయికి అన్నీ తనే అయి అందర్నీ వదులుకుని వచ్చిన ఆమె బెంగ తొలిగించడానికి ప్రయత్నిస్తూ...............

నీలాలు కారేనా ? కాలాలు మారేనా ?
నీ జాలి పంచుకోనా ? నీ లాలి నే పాడలేనా ?

అంటూ .......

జాజి పూచే వేళ... జాబిల్లి వేళ ....
పూల డోల నేను కానా ? 

అని ఊరడిస్తాడు అ అబ్బాయి.
తనకోసం సిరులన్నీ వదలుకుని వచ్చిన ఆ అబ్బాయి పరిస్థితి చూసి బాధపడుతున్న అమ్మాయికి నచ్చజెబుతూ ....

సూరీడు  నెలరేడు సిరి గల దొరలే కారులే !  
పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే ! 

అంటాడు. ఇంకా .......

ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే !
కలిమిలేముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేద లోగిళ్ళులే ! 

అంటూ వాస్తవ పరిస్థితిని వివరిస్తాడు

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లో కలల కన్నుల్లో కలకారి పోవాలిలే !

................ అంటూ తన  అభీష్టాన్ని తెలియజేస్తాడు. అంతేకాదు ........

ఆ తారలో తేరి తళతళ మెరిసే రేయిలో  
ఒడిలో నువ్వుంటే ఒదిగి పోతుంటే కడతేరి పోవాలిలే ! 

...... అంటూ తన కోరికను స్థిరంగా, స్పష్టంగా చెప్పి ఆమె అనుమానాలను, భయాలను, బెంగలను తొలగిస్తాడు.

వేటూరి వారి కలం నుండి జాలువారిన.... బాలు గారి గళంలో పలికిన...... రమేష్ నాయుడు గారు స్వరకల్పన చేసిన..... ప్రదీప్, పూర్ణిమ అభినయించిన..... ఈ మధురగీతం చూడండి.....



Vol. No. 02 Pub. No. 258

Wednesday, January 12, 2011

పుస్తకాల పండుగ

 జనవరి నెల ప్రారంభమే ఒక సంరంభం విజయవాడ పుస్తక ప్రియులకు.
ప్రతీ కొత్త సంవత్సరం సరికొత్త పుస్తకాలతో ముస్తాబవుతుందీ నగరం.
ఒకప్రక్క చలి. మరో ప్రక్క పుస్తకాల లోగిలి.

1989 లో నేషనల్ బుక్ ట్రస్ట్  వేసిన బీజం ఇప్పుడు మహావృక్షమైంది. 1990 లో విజయవాడ లోని పుస్తక ప్రచురణ కర్తలు, విక్రేతలు విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం పేరుతో ఒక సంఘంగా ఏర్పడి 1991 నుండి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఆ సంవత్సరం 84 స్టాల్స్ వుంటే ఈ సంవత్సరం 290 స్టాల్స్ ఏర్పాటయ్యాయి. గతేడాది సుమారు రెండు కోట్ల రూపాయిల వ్యాపారం జరుగగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉండొచ్చని ప్రాథమిక అంచనా.

టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఎంతగా అభివృద్ధి చెందినా పుస్తకాల మీద మోజు తగ్గలేదు. సరిగదా పెరుగుతోందనిపించింది పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న జనాన్ని....ముఖ్యంగా యువతను చూస్తే.......
యువత పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడుతోందని, తెలుగు భాష మీద, సాహిత్యం మీద మమకారం సన్నగిల్లిపోయిందని బాధపడుతున్న వారికి ఈ పుస్తక ప్రదర్శన జవాబు చెప్పింది. ఎంతోమంది యువకులు, ముఖ్యంగా టీనేజ్ దశను ఇప్పుడిప్పుడే దాటుతున్న వారు మన దేవులపల్లి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, ముళ్ళపూడి, బాపు, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, రంగనాయకమ్మ లాంటి వారి సాహిత్యం కూడా ఆసక్తిగా పరిశీలించడం కనిపించింది. వారు చదువుతున్నారా లేదా అన్నది ప్రక్కన పెడితే వారిలో ఆయా పుస్తకాల గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలగడమే శుభసూచకం. ఇదొక ప్రారంభం అనుకుందాం. అలాగే పాత సినిమాలపైన, కళాకారులపైన వచ్చిన పుస్తకాలపైన కూడా వారు ఆసక్తి చూపడం గమనించాను. ఇటీవలే విడుదలైన తెలుగు నాటకాలు, తెలుగు హాస్య నాటికల సంకలనాలపైన కూడా చాలామంది.... ముఖ్యంగా యువత ఆసక్తి కనబరిచారు.

 పదకొండురోజులపాటు జరిగిన 22 వ పుస్తకాల పండుగ ఈరోజుతో ( జనవరి 11 వ తేదీతో ) విజయవంతంగా ముగిసింది. విజయవాడ వాసులకు ఆనందాన్ని పంచింది. ఇలాగే కలకాలం ఈ పండుగ జరగాలని విభిన్నమైన కొత్త కొత్త పుస్తకాలతో పుస్తకప్రియుల్ని అలరించాలని, పుస్తకం సజీవంగా వుండాలని కోరుకుంటూ.....
                                                                                                                               
" అక్షర రూపం దాల్చిన 
ఒకేఒక్క సిరాచుక్క 
లక్ష మెదళ్ళకు కదలిక "

Vol. No. 02 Pub. No. 114
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం