కోనసీమ కవికోకిలగా లబ్దప్రతిష్టులైన డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారి సాహిత్య కళాసాగరులు. వారికి ప్రకృతి పట్ల ఆరాధన, దేశాభిమానం, ప్రకృతికి మూలాధారమైన పరమేశ్వరుడంటే భక్తి మెండు. ప్రాచీన అధునాతన కవితా వారధిగా సుమారు నాలుగు తరాల శ్రోతలకు లక్ష్మీపతిరావు గారు సుపరిచితులు. అమలాపురం శ్రీ కోనసీమ భానోజీ రామర్సు కళాశాలలో తెలుగు విభాగ అధిపతిగా పనిచేశారు.
చిలకాకు పచ్చ పైరు పైట వయ్యారం, గలగల పారే సెలయేళ్ళలో సరిగమల సంగీతం చూడటం, పువ్వువంటి మనసుతో హాయిగా నవ్వుతూ వలపు చిలికి పదిమందిని పలుకరించడం ప్రకృతినుంచి లక్ష్మీపతి రావు గారు సహజంగా నేర్చుకున్న లక్షణం.
రసహృదయులు, సమ్రాట్టులు, కవులకు పల్లకి పట్టిన దీదేశం.... రాల్ కరిగించెడి అమరగానమున పరవశించిన దీదేశం.... అంటూ భరతమాతను హిమాలయమంత ఎత్తు సింహాసనంపై అధిష్టించి కీర్తించిన లక్ష్మీపతిరావు గారి గుండెలోతుల్లో దేశభక్తి ప్రస్ఫుటమవుతుంది. హిమగిరి చల్లన, జలనిధి నల్లన, ఆ రెంటి నడుమ కన్నతల్లి పచ్చన - పచ్చపచ్చనా.... అంటూ భారతమాత సౌభాగ్యం చూసి మురిసిపోతారు లక్ష్మీపతిరావు గారు. ఆకాశవాణికి ఆస్థానకవిగా అనేక పాటలు రచించారు. ముఖ్యంగా అనేక దేశభక్తి గేయాలు వ్రాశారు. ఎన్నో కవితా కుసుమాలు వెదజల్లారు. మరెన్నో కవితా సమీక్షా గ్రంథాలు వెలువరించారు.
చిరకాలంగా నిరంతరాయంగా కొనసాగిన ఆయన సాహితీ వ్యవసాయం గత సంవత్సరంతో ఆగిపోయింది. ఆ కవితా కలంలో సిరా నిండుకుంది.
కోనసీమ కవికోకిల డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా వారి కలం నుంచి వెలువడిన... గ్రామఫోన్ రికార్డులుగా వెలువడి ప్రజాదరణ పొందిన.... బాలు, జానకి, కోవెల శాంత ఆలపించిన పంచరత్నాలు..............
* " దేవుడిచ్చిన తియ్యనైన కవిత సొమ్ముల కమ్మెడు కవినికాను నేను " అని భక్తపోతనవలె చాటుకున్న డాక్టర్ లక్ష్మీపతిరావు గారు రచించిన " ఆంధ్ర పుణ్యక్షేత్రాలు " రసరమ్య గీతాలు - ఆ గ్రామఫోను రికార్డు విన్నవారికవి అమృతధారాపాతాలు - భక్తి పారవశ్యంలో క్షేత్రధర్శన భావావేశాలు, అనిర్వచనీయ అనుభూతులు కలిగించాయనడం అతిశయోక్తి కాదనుకుంటా ! ఈ గీతాలను పద్మభూషణ్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తొలినాళ్లలో శ్రీమతి జానకి గారితో కలసి అలపించడంతో తేనెలూరు చక్కెర రసాగ్రాన నర్తించినట్లే - మనసు తేలికై హాయిగ ఊయలూగినట్లే !
* ఏ శుభకార్యము చెసినా, ఏ వ్రతమాచరించినా ముందుగా ఆ విఘ్ననాయకుడైన వరసిద్ధి వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. ఆ విషయాన్ని లక్ష్మీపతిరావు గారు రసరమ్యంగా పలికిస్తారు.
* కలతలోపడి పరితపించే జీవుల వెతలు తీర్చే స్వామివి నువ్వు - దయచూడవా గజముఖ గణనాయికా ! సర్వమంగళ నాయికా ! అంటూ ఆ గణనాధుడిని ఎంత ఆర్ద్రంగా వేడుకోవచ్చో తన పాటలో వర్ణిస్తారు.
* పసుపుకుంకుమలే స్త్రీలకు సౌభాగ్యం. సిరిసంపదలిచ్చే బంగారుతల్లి కథే వరలక్ష్మీవ్రతం. తన కలంనుండి జాలువారిన ఆ కథను జానకిగారి గళంలో పలికించారు లక్ష్మీపతిరావు గారు.
* పాలకడలిలో వెలసిన పూబోణి, పాలమనసుతో పాలింపరావే కళ్యాణకారిణీ - అంటూ కాంతుని యెదపై కాపురముండి ఎడబాటన్నదే ఎరుగని ఆ జగదేక పావనిని భాగ్రమూ, సౌభాగ్యములిచ్చి కాపాడమని ఎంత మురిపెంగా కోరుకోవచ్చో ఓ పాటలో వివరించారు.
డాక్టర్ లక్ష్మీపతిరావు గారు స్వర్గస్తులైన సందర్భంలో గత సంవత్సరం రాసిన టపా .......
మధురకవి అస్తమయం
Vol. No. 02 Pub. No. 274
No comments:
Post a Comment