Wednesday, July 6, 2011

సంగీత మురళి

కర్నాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన మహానుభావులెందరో వున్నారు. అయితే కర్నాటక సంగీతం అనగానే ఈ తరంలో వెంటనే స్పురణకు వచ్చే పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సంగీతాన్ని ఔపోసన పట్టిన మహానుభావుడు బాలమురళి. కర్ణాటక సంగీత ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన బాలమురళి వాగ్గేయకారుడు. త్యాగయ్య లాంటి వాగ్గేయకారులు రచించిన ఎన్నో కీర్తనలకు జీవం పోసిన బాలమురళి స్వయంగా కీర్తనలు రాసారు. కొత్త రాగాలు కనిపెట్టారు.

కోనసీమలోని శంకరగుప్తంలో సంగీత కుటుంబంలో పుట్టిన బాలమురళి త్యాగరాజు శిష్యపరంపరకు వారసుడైన బ్రహ్మశ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర శిష్యరికం చేశారు. ఆయన ఎనిమిదేళ్ళ వయసులో విజయవాడలో త్యాగరాజ గాన సభలో తొలి పూర్తి స్థాయి కచేరి చేశారు.

ప్రపంచం మొత్తం పర్యటించి వేనవేల కచేరీలు ఇవ్వడంతో బాటు ప్రముఖ హిందుస్తానీ విద్వాంసుడు భీమసేన్ జోషి తోనూ, ప్రముఖ వేణు విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా లాంటి ఉద్దండులతో కలసి జుగుల్బంది కార్యక్రమాలు ఇచ్చారు. అనేక భారతీయ భాషల్లో పాడటంతో బాటు తెలుగు, సంస్కృతం, తమిళ భాషల్లో కీర్తనలు రచించారు. అన్నమాచార్య, భద్రాచల రామదాసు కీర్తనలను తన గానంతో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.

గాత్రంలోనే కాక వయోల, వయోలిన్, కంజిర, మృదంగం లాంటి వాయిద్యాలలో కూడా నిష్ణాతులు. కర్నాటక సంగీత ప్రపంచంలోని ప్రసిద్ధ వాయిద్య కళాకారులు బాలమురళి గారి గాత్రానికి సహకారమందించడానికి ఉవ్విళ్ళూరుతూ వుంటారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళడంలో బాలమురళి కృతకృత్యులయ్యారు. సంగీతాన్ని వైద్య విధానంగా రూపొందించడంలో పరిశోధనలు చేస్తున్నారు.

 సంగీత మురళి బాలమురళి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ......

వేదిక మీదే కాదు వెండితెర మీద కూడా తన గానామృతాన్ని ఒలికించిన బాలమురళి కనిపించిన రెండు పాటలు చూడండి...........
Vol. No. 02 Pub. No. 273

4 comments:

Dr.Suryanarayana Vulimiri said...

రావు గారు, చాల చక్కగా వ్రాసారు బాలమురళి గారి గురించి. ఆయన చాల చమత్కారంగా కూడ మాట్లాడతారు. ఒకసారి అమెరికా వచ్చినపుడు మాకు వారు కోనసీమలో కచేరి యివ్వడానికి వెళ్ళినప్పటి సంఘటన తెలియజేసారు. ఆయనను ఒక మోతుబరి రైతు గారు రైల్వే స్టేషను నుండి కచేరీకి తన కారులో తీసుకెళుతూ ఇలా అన్నాడట. "ఆ కుడి పక్క, ఎడం పక్కా ఉన్న భూములు మనవే నండి. ఆయ్! అయితే ఇప్పుడు కౌలుకి ఇచ్చేసామండి". అప్పుడు బాల మురళి గారు "ఏం? కవులకేనా, గాయకులకు ఇవ్వొచ్చు కదా!". చాల నవ్వుకున్నాం ఆయన సమయ స్ఫూర్తికి. ఆ సంగీత కోవిదుని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

SRRao said...

సూర్యనారాయణ గారూ !

ధన్యవాదాలు.

Unknown said...

బాల మురళిగారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ' జీనియస్ '. ఆ కంఠస్వరం గానీ, ఉచ్చారణగానీ, అసమానమైన ప్రజ్ఞ గానీ వేరొకరికి రానేరాదు. సాక్షత్తు సరస్వతీ పుత్రుడు ఆయన. ఆయన తో కరచాలనం చేసి నమస్కరించే అవకాశం కలిగిన రోజు మేము ఎంత పులకరించిపోయామో మాటల్లో చెప్పలేను. ఆ సంగీత మూర్తికి భగవంతుడు మరెన్నో సంవత్సారలపాటు చక్కని ఆయురారోగ్యాలని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు.

SRRao said...

ప్రసీద గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం