Showing posts with label సామాన్యుడి సణుగుడు. Show all posts
Showing posts with label సామాన్యుడి సణుగుడు. Show all posts

Saturday, June 25, 2011

ప్రజల నెత్తిన పిడుగు

 ఉరుములేని పిడుగు... ప్రజల నెత్తిన పడ్డ పేద్ద గ్యాస్ బండ  
 అంతులేని అవినీతికి అంగుడెక్కడ రాజకీయ వ్యాపారంలో....
దోచుకోవడం... దాచుకోవడం... 
ప్రజల బ్రతుకు బండలు చెయ్యడం ప్రభుత్వాల వంతు..... 
బండబారిన.... మోడువారిన...
బ్రతుకును నిస్సహాయంగా, నిస్తేజంగా వెళ్లదియ్యడం ప్రజల వంతు.....  


డీజిల్ ధర మూడు రూపాయిలు పెరిగింది ..... ప్రభుత్వం 
అందువలన మేము కూడా ధరలు పెంచక తప్పలేదు.... వ్యాపారులు 
మీరెంతైనా పెంచుకోండి కానీ మా ఆస్తులు మాత్రం పెంచండి.....నాయకులు, అధికారులు 
కష్టార్జితమంతా మీ యెదాన పోసి మేమేం తిని బ్రతకాలి ? ......... ప్రజలు  



 అగ్ని ప్రమాదాలు లేవు.. ఆడపడుచుల వరకట్నఆత్మహత్యలు లేవు.....
ఎంత హాయి....ఇది నిజం... ఇది భారతదేశమే ! నమ్మండి.
ఎందుకంటే కిరోసిన్ ధర పెరిగింది... చావు కూడా ఖరీదయింది...... 
పేదల బ్రతుకు చీకటయ్యింది..... ప్రజల గుండె మండింది......

పెరిగింది స్వల్పమే..... పెరగాల్సింది చాలా వుంది..... అని సెలవిచ్చారు మంత్రివర్యులు 
ఇక ప్రజలు భోంచేయాల్సింది గాలి.... చీకటిని తరమాల్సింది తమ కడుపులోని మంటతో..... 




ఒప్పుకుంటే కుక్క మేకవుతుంది.... తలూపితే తల తాకట్టుకు వెడుతుంది....
దెబ్బకు దెయ్యం ఝడుస్తుంది... ప్రజలు కన్నెర్రజేస్తే ప్రభుత్వం కూలుతుంది....
ఆ సత్యం గ్రహిస్తే నల్లధనమూ బయిటకొస్తుంది... ఈ తత్త్వం ఒంటబడితే అవినీతీ అంతమవుతుంది.... 
అప్పడిక ధరలూ పెరగవు...... జీవన ప్రమాణాలూ తరగవు..... స్వార్థశక్తుల పెత్తనాలూ చెల్లవు.....  

ఇక మనకు కూడా ప్రజా విప్లవాలు తప్పవేమో ! శిశుపాలుర శిరస్సులు ఖండించే రోజు దగ్గరలోనే ఉందేమో !

గ్యాస్ సిలండర్ పై సుమారు 50 రూపాయిలు, డీజిల్ లీటర్ పై సుమారు 3 రూపాయిలు, కిరోసేన్ లీటర్ పై సుమారు 2 రూపాయిలు ఈ అర్థరాత్రి నుండే ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రజల నెత్తిన పిడుగులాంటి వార్త.

Vol. No. 02 Pub. No. 264

Monday, November 15, 2010

డబ్బు భలే జబ్బు

సమాజాన్ని నడిపించేది డబ్బు
ఆ డబ్బే మనుష్యుల్ని పట్టి పీడించే జబ్బు
మితిమీరి సంపాదించాలనుకోవడమే ఓ జబ్బు
ఆ జబ్బు పట్టిన మనిషి చేసేదంతా పెద్ద గబ్బు

ఆ జబ్బు చేసిన మనిషికి మనసు మనసులో వుండదు . ఆ డబ్బు సంపాదించడానికి నానా పాట్లు పడతాడు. నానా గడ్డీ కరుస్తాడు. ఉష్ణోగ్రత నార్మల్ గా వున్నప్పుడు అంత ప్రమాదం లేదు గానీ డబ్బు వైరస్ ప్రభావం పెరగడం ప్రారంభిస్తే మాత్రం అంతకంతకు టెంపరేచర్ పెరిగిపోతుంది. డబ్బు యావ ఎక్కువై పోతుంది. విచక్షణ నశిస్తుంది. ఒళ్ళు తెలియదు. ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఏం చేయబోతున్నారో తెలియదు. కళ్ళకు పొరలు కమ్మినట్లయి అన్నీ మసక మసకగా కనిపిస్తాయి. చుట్టూ వున్న వాళ్ళని గుర్తు పట్టలేరు. ముఖ్యంగా తన వాళ్ళని, తన మేలు కోరే వాళ్ళని అస్సలు గుర్తు పట్టలేరు. వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మినట్లయి నక్షత్రాలు కనబడినట్లు డబ్బు మాత్రమే కనబడుతుంటుంది. మీరు మందు పట్టించినా, ఇంజెక్షన్ చేసినా అంటే తిట్టినా, కొట్టినా వాళ్లకు తెలియదు. టెంపరేచర్ బాగా పెరిగి 104 డిగ్రీలు దాటితే సంధి ప్రేలాపన వస్తుంది అంటారు. అలాగే ఈ డబ్బు జబ్బు ముదిరిన వాళ్లకి కూడా ఇలాంటి ప్రేలాపనే వస్తుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మర్చిపోతారు. 

పాపం... అదో ట్రాన్స్. అదో లోకం. ఏదైనా జబ్బు చేసిన వాళ్ళు ఆది త్వరగా, పూర్తిగా తగ్గాలంటే సరైన మందు తీసుకోవాలి.  కొంతమంది అలౌకికానందం కోసం మత్తు పదార్థాలు లాంటివి తీసుకుంటారు. వీళ్ళకి ఆ అవసరం లేదు. డబ్బు అనే మాట చెబితే చాలు మత్తు దానంతటదే ఎక్కేస్తుంది. జబ్బు దానంతటదే పెరిగిపోతుంది. వాళ్లకి డబ్బే ఓ టానిక్. ఆస్పత్రి బెడ్ మీద దాదాపు కోమా లాంటి పరిస్థితుల్లో వున్నవాడైనా ఎక్కడైనా డబ్బు వచ్చే అవకాశం వుందంటే చాలు.  బెడ్ మీంచి అమాంతం దూకి పరుగుపెడతాడు.

ఈ జబ్బు చేసినవాళ్ళు డబ్బుంటే కొండ మీద కోతినైనా సులువుగా తీసుకురావచ్చని గట్టిగా నమ్ముతారు. పాపం వాళ్లకు తెలియదు అలా తెచ్చిన కోతిని గోలుసులేసి కట్టేసినా వీళ్ళకి ఈ డబ్బు జబ్బు తగ్గిపోగానే ఆ గొలుసులు తెంచుకుని పారిపోతుందని.  దానికీ తెలుసు డబ్బు లేకపోతే ఈ జబ్బు చేసిన మనిషి ఎందుకూ పనికిరాడని. పాపం ఈ విషయం మాత్రం ఈ జుబ్బు మనిషికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చెయ్యడు.


ఈ జబ్బు ముదిరిన వాళ్ళను గుర్తించడం చాలా కష్టం. అసలు ఏ జబ్బైనా అందులోను టి. బి. , కాన్సెర్ లాంటి దీర్ఘ రోగాల పాలిట పడ్డ వాళ్ళు రోజు రోజుకీ కృంగి కృశించి పోతారు. కానీ అదేమిటో డబ్బు జబ్బు వచ్చిన వాళ్ళు ( యావ వున్న వాళ్ళు ) మాత్రం ఆకలి దప్పులు మర్చిపోయినా పుష్టిగా బలంగానే కనబడుతారు. ఆది మనో బలమేమో మరి. అందుకే అంటారు. నమ్మకం లేని చోట ఎంత పవర్ ఫుల్ మందైనా పనిచెయ్యదని.... మనో బలాన్ని మించింది లేదని. అందులోనూ డబ్బు బలమాయే !

ఈ డబ్బు జబ్బు చేసిన వాళ్ళ పరిస్థితి ఒక్కోసారి విచిత్రంగా వుంటుంది. ఏ నిముషంలో ఏరకంగా ప్రవర్తిస్తారో, ఎవరిని దగ్గరకు తీస్తారో, ఎవరిని ఎప్పుడు దూరంగా పెడతారో చెప్పడం చాలా కష్టం. ఈ నిముషంలో మిత్రుడైన వాడ్ని మరునిముషంలో శత్రువుగా మార్చేస్తారు. ఈ నిముషంలో ఆత్మ బంధువు. మరు నిముషంలో బద్ధ శత్రువు. ఈ జబ్బున్న వాళ్ళలో కొంతమంది వుంటారు. వాళ్లకి నిలువెల్లా అనుమానమే ! అంటే ఈ జబ్బులో అదొక లక్షణమన్నమాట. తన చుట్టూ వున్నవాళ్ళందరూ తన దగ్గరున్న డబ్బుని దొంగిలిస్తారమేనని అనుక్షణం భయపడుతుంటారు. ఎవ్వరినీ నమ్మరు. చివరికి కట్టుకున్న జీవిత భాగస్వామిని, కన్న పిల్లల్ని కూడా ! తనల్ని మోసం చేసేస్తారేమోనని అడుగడుగునా అపోహ పడిపోతుంటారు. విచిత్రమేమిటంటే వీళ్ళలో చాలామంది ఇతరుల్ని ఏమార్చో, పరిమార్చో ఆ డబ్బు సంపాదించిన వారే ! స్వానుభవం గనుక వీళ్ళకు భయం ఎక్కువ. అనుమానం కూడా ఎక్కువే ! తన విద్యే తన మీద ఎవరైనా ప్రయోగిస్తారేమోనని.

ఇంకొంతమంది రోగులుంటారు. వాళ్ళు డబ్బే సమాజంలో తన హోదాని నిలబెట్టే సాధనమని గాఠిగా నమ్ముతారు. దానికోసం  ఏ అడ్డదారులైనా తొక్కి సంపాదించాలనుకుంటారు. డబ్బున్నవాడిని ఏ నీతినియమాలు, న్యాయాన్యాయాలు అడ్డుకోలేవని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. తాము ఎన్ని అక్రమాలు చేసినా, మోసాలు చేసినా ఆ డబ్బు తమని సంఘంలో గొప్ప వాళ్ళు గా నిలబెడుతుందని నమ్ముతారు. అందుకని డబ్బు సంపాదించే విషయంలో తన పర: బేధం వుండదు. సొంత మనుష్యుల్ని కూడా ఏం చెయ్యడానికైనా వెనుకాడరు. ఈ స్థితి ఈ జబ్బులో ప్రమాదకరమైన స్థితిగా చెప్పుకోవచ్చు. ఇంతగా ముదిరిన జబ్బు తగ్గాలంటే తప్పనిసరిగా సర్జెరీ లాంటిది చెయ్యాల్సిందే ! ఒక్కోసారి ఆది వికటించే ప్రమాదముంది కూడా ! అయినా అంతవరకూ వీళ్ళను తీసుకెళ్లడం కూడా కష్టమే !

ఈ జబ్బు చివరి దశలో మాత్రం వీళ్ళ పరిస్థితి ఘోరంగా వుంటుంది. అంటు రోగిలాంటి పరిస్థితి. అంటురోగిని ఎలా దూరంగా ఉంచుతారో అలాగే వీళ్ళను కూడా దూరంగా ఉంచుతారు. కాదు వీళ్ళే దూరం చేసుకుంటారు. ఆఖరి దశలో వీళ్ళను సరిగా పట్టించుకునే వాళ్ళుండరు. పెట్టేడు డబ్బు పట్టెడు అన్నం పెట్టదు. అందరి పొట్టలు కొట్టి సంపాదించిన డబ్బుతో తనకిష్టమైనవి తినడానికుండదు. ఒంటినిండా డబ్బు తెచ్చిన అనుబంధ జబ్బులు చాలా పేరుకుపోతాయి. కిలుం వదిలితే గానీ ఫలం దక్కదని ఓ సామెత. వీరి డబ్బు బలహీనతను కనిపెట్టిన వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకుంటారు. సాధారణంగా ఈ రోగులకి జబ్బు తగ్గాక గానీ ఆ విషయం తెలియదు. వంద రూపాయలు ఖర్చయ్యే చోట వెయ్యి రూపాయిలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంతకాలానికి తిరిగి చూసుకుంటే చేతులు కాలాక............ అన్నట్లుంటుంది. ఒకవేళ మన డబ్బు మనదగ్గరే భద్రంగా ఉందనుకుని ధీమాగా వున్నా ప్రమాదమే ! పండును ఎక్కువకాలం నిలవ చేస్తే కుళ్ళిపోయినట్లు డబ్బు కూడా మళ్ళిపోతుంది. తనవాళ్ళ, పరాయి వాళ్ళ కన్ను దాని మీద పడుతుంది. అంతకాలం నిద్రాహారాలు మాని, ఉచ్చనీచాలు మరచి సంపాదించిన ఆ డబ్బుని ఎలా స్వంతం చేసుకోవాలా అని ఆలోచించే వాళ్ళు చుట్టూ చేరుతారు. రకాల రకాల యుక్తులు కుయుక్తులు. మంచి ఉచ్చదశలో అందర్నీ శాసించే పరిస్థితిలో వున్న వాడు కాస్తా నైతిక ప్రవర్తన వల్లో, నిజంగానే జబ్బు చేసి అంపశయ్యపై ఉన్నప్పుడో పనికిరాని వాడవుతాడు. పరాయివాళ్ళే కాదు రక్త సంబంధీకులు కూడా ఎప్పుడు పోతాడ్రా బాబూ అతగాడి డబ్బు పంచుకుందాం అన్నట్లుగా గోతి కాడ నక్కల్లా కాచుక్కూర్చుంటారు.

మందు మితంగా పుచ్చుకుంటే జబ్బు తగ్గిస్తుంది డబ్బు అవసరమైనంత మేరకు సంపాదిస్తే మేలు చేస్తుంది  అతి సర్వత్ర వర్జయేత్ అన్న నానుడి డబ్బు విషయంలో మరింత నిజమేమో  ! లక్షల కోట్లు సంపాదించేస్తే అంతులేని కీర్తి వస్తుందన్నది... అదే శాశ్వతమన్నది భ్రమ మాత్రమే !  చనిపోయాక ' అమ్మయ్య పోయాడు ' అని కాక ' అయ్యో చనిపోయాడే ' అనిపించుకోవడమే కీర్తి శేషం ! బతికున్నప్పుడు తాత్కాలిక ప్రలోభాలకి లొంగి డబ్బు సంపాదనా యావలో పడి మంచిచెడ్డలు మరిచే వారికి కీర్తి  శేషులయ్యే అవకాశం ఎప్పటికీ రాదు. డబ్బు ఇచ్చే ఆనందం తాత్కాలికం. మంచితనం,  మానవత్వం ఇచ్చే ఆనందమే శాశ్వతం. గుడిసెలో వున్నా, రాజమహల్ లో వున్నా ఈ డబ్బు జబ్బు చెయ్యని వాడు ఎప్పుడూ రాజానే ! బతికినా చచ్చినా ఏనుగు ఎప్పుడూ విలువైనదే !  
అందుకని డబ్బుకు దాసోహం అని జబ్బు తెచ్చుకోకుండా ముందు జాగ్రత్తగా మితంగా సంపాదించడం ఆరోగ్యకరం.  
 


Vol. No. 02 Pub. No. 057

Saturday, October 30, 2010

క్రీడోత్సవాలకు మరో కొత్త ఆట

 మొన్ననే కామన్ వెల్త్ క్రీడలు ముగిసాయి. మళ్ళీ ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలు ఇంకా ఏవేవో వస్తాయి. వీటన్నిటికంటే ఇంగ్లీష్ వాళ్ళు మనకంటించిన క్రికెట్ ఎలాగూ వుంది. ఈ క్రీడా పోటీల నిర్వాహకులకి ఈసారి ఓ విజ్ఞప్తి చెయ్యాలని వుంది. వాళ్ళ క్రీడల జాబితాలో మరో కొత్త క్రీడను కలుపుకోమని చెప్పాలి. అందరం సామూహికంగా విజ్ఞప్తులు చెయ్యాలి. అవసరమైతే ఆందోళనలు చెయ్యాలి. ధర్నాలు, నిరాహారదీక్షలు, ర్యాలీలు.... ఇలా ఒకటేమిటి అనుకున్నది సాధించడానికి ఏమైనా చెయ్యాలి. ఎలాగైనా సాధించాలి.

ఇంతకీ అదేం క్రీడ అంటారా ? అక్కడికే వస్తున్నా ! కొంచెం ప్రాణాంతకమైనా మంచి ఉత్సుకత, సస్పెన్సు వగైరా పుష్కలంగా వుంటాయి. అసలు అవేమీ లేకపోతే ఆటలో థ్రిల్ ఉంటుందా ? కిక్ ఉంటుందా ? ఆమాటకొస్తే ఫుట్ బాల్, హాకీ.....చివరకి క్రికెట్ లో కూడా మనకు ఉత్కంఠగా వుంటుంది. ఆటగాళ్లకు ప్రాణసంకటంగానే వుంటుంది.... పాపం. వాళ్ళలోని క్రీడాస్పూర్తికి మనం పోటీలు పడి స్టేడియం అదిరిపోయేలాగా చప్పట్లు కొడతాం. బూరాలు ఊదుతాం. డప్పులు కొడతాం. డాన్సులు చేస్తాం. ఇవన్నీ టీవీల ముందు వుండి కూడా  చేస్తాం. మన చేష్టలతో వాళ్ళు ఉత్సాహంతో రెచ్చిపోయి ఇంకా బాగా ఆడతారని సంబరపడిపోతాం. ఇంతలో వాళ్ళు అవుట్ అయిపోయి పెవిలియన్ దారి పడుతుంటే మన ఒక్కసారిగా ఉత్సాహం చల్లబడిపోతుంది. ఇంతకీ వాళ్ళు మన ఉత్సాహానికి రెచ్చిపోయి ఆడాల్సింది పోయి వెన్ను చూపుతారెందుకు అని ఒకసారి సావధానంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మనకంత సావదానం, సావకాశం ఎక్కడుంటాయండీ ? అందుకే అంత దూరం ఆలోచించం. మనమిచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారా చెప్పండి. మన గోలకు అవతల జట్టు వాళ్లకు ఎంత ఒళ్ళు మండుతుందీ అన్నది మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు కనుకనే అబౌట్ టర్న్.

అసలు ఇంగ్లీషువాడు మనం తోటల్లోనూ, పొలంగట్ల మీద, రోడ్లమీద ఆడుకునే కర్రా బిళ్ళా ఆట చూసే క్రికెట్ కనిపెట్టాడని నాకో అనుమానం. మీక్కూడా అదే అనుమానం ఉందా ? ఉంటుంది మరి. ఆ ఆట అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది కదా ! అలాగే మనం తోటల్లోను... అదే పార్కుల్లో, పొలంగట్ల మీద... అదేనండీ పేవ్ మెంట్ల మీదా ( అవేక్కడున్నాయని నన్నడక్కండి ), ఇంకా రోడ్ల మీదా ఆడుకునే ఈ ఆట కూడా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని నా ఆశ. ప్రభుత్వం ప్రోత్సాహమిస్తే పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు, మాన్యులు, సామాన్యులు..... ఇలా ఒకరేమిటి అందరూ తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశం వస్తుంది. మిగిలిన ఆటల్లో క్రీడాకారులు కఠోర సాధనతో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంటుంటే ఈ ఆటలో ప్రజలందరూ క్రీడాకారులే ! అందరూ అంతర్జాతీయ స్థాయికి అవిరళంగా కృషి చేస్తున్నవారే ! మరి వాళ్ళనెందుకు ప్రోత్సహించకూడదూ ? ఇది నా మదిన దొలుస్తున్న ప్రశ్న.

ప్రతీ ఆటలోనూ రెండు జట్లుంటాయి. ప్రత్యేకమైన ప్రత్యర్థులుంటారు. వారి మధ్యనే పోటీ వుంటుంది. ఎదుటి జట్టుని మాత్రమే ఎదుర్కోవాలి తప్ప కనీసం రిఫేరీ మీదకైనా వెళ్ళకూడదు. అంటే వాటిలో స్వేచ్చ చాలా తక్కువ. మన ఆటలో స్వేచ్చ చాలా ఎక్కువ. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. జట్లు ఉండవు. ఎవరైనా ఎవరికైనా ప్రత్యర్థే ! ఎవరు ఎవరినైనా ఎంచుకోవచ్చు. అసలు ఎంచుకోకపోవచ్చు కూడా ! ఈ ఆటకు స్టేడియంలు అక్కరలేదు. క్రీడా శిక్షణా శిబిరాలక్కర్లేదు. కోచ్ లు అక్కర్లేదు. అన్నిటికంటే క్రీడాకారులకు పెద్ద పెద్ద పారితోషికాలక్కర్లేదు. చూసారా ఈ దేశానికి ఎంత డబ్బు ఆదానో ! రోడ్ వుంటే చాలు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండేదైతే మరీ మంచిది. బాల్, బాట్ లాటివి ఏవీ అక్కర్లేదు. ఒక చిన్న సాధనం మాత్రం అవసరం. అసలు ఈ ఆటకు అదే కీలకం. ఆటగాడికి శిక్షణ, నైపుణ్యం వగైరా లనవసరం. ఇప్పటికైనా అర్థం అయిందా ? అవలేదా ! వస్తున్నా .....వస్తున్నా ! అక్కడికే వస్తున్నా !

ఈ మధ్య మనం రోడ్ మీద నడుస్తున్నా, ద్వి/ త్రి/చతుశ్చక్ర వాహనం మీద వెళ్తున్నా తప్పనిసరిగా ఉండవలసిన వాటిలో మరో వస్తువు చేరింది. ఆ వస్తువే మనల్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చే ఆటలో నిపుణుల్ని చేస్తోంది. నడుస్తూ, డ్రైవ్ చేస్తూ తమలోకంలో తాము వున్నట్లు, పరిసరాలతో పనిలేనట్లు తమలో తామే మాట్లాడుకుంటూ వెళ్ళే లోకాతీతులు మీకందరికీ దర్శనమిచ్చే వుంటారు. అదిగో వాళ్ళే ఈ క్రీడాకారులు. ఫుట్ బాల్, బాట్ లాంటి వాటిలాగ వాళ్ళ చేతుల్లో ఉండే క్రీడా సాధనమేమిటో ఎవరైనా ఊహించగలరా ?

అదేనండీ సెల్ ఫోన్. దాంతో రోడ్ మీద మన క్రీడాకారులు చేసే విన్యాసాలు చూసి తీరాలి. మిగిలిన ఆటలు చూడాలంటే పెద్ద మొత్తాలు ఖర్చుపెట్టి టికెట్స్ కొనాలి. అక్కడ తోపులాటల్లో ఇరుక్కోవాలి. అవేమీ లేకుండా ఫ్రీగా దొరుకుతున్న వినోదం. ఒకరు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెడుతుంటారు. మనం ఎదురు వెళ్ళామనుకోండి. మనల్ని చూసి ప్రక్కకు తప్పుకుంటారనుకుంటాం కదా ! ఊహు( ! తప్పుకోరు. మనకడ్డుగానే మనం ఎటు తిరిగితే అటు తిరుగుతారు. మన కాళ్ళల్లో కాళ్ళు పెట్టి మనల్ని పడగొట్టాలని చూస్తారు. మనం ఎన్ని తిట్టినా వాళ్ళ ధోరణిలో వాళ్ళుంటారు తప్ప మనల్ని పట్టించుకోరు. చూసారా వాళ్ళకెంత ఏకాగ్రతో ! మనల్ని పడగొట్టాలనే గానీ మరే ధ్యేయం లేనట్లు ఎంత సీరియస్ గా ఆడుతుంటారో ! ఆ ఆటలో సాధారణంగా మనమే ఓడిపోతామనుకోండి. ఎందుకంటే మనం ఆ ఆటలో నిష్ణాతులం కాదు కదా !

పోలో ఆట గుర్రపు స్వారీ చేస్తూ కూడా ఆడుతారు. అలాగే కొంతమంది సెల్ క్రీడాకారులు బైక్ లు డ్రైవ్ చేస్తూ ఆడే ఈ ఆట బహు ముచ్చటగా వుంటుంది. మనం బైక్ మీద వేడుతున్నామనుకోండి. మన ముందు వెడుతున్న ఓ బైక్ హటాత్తుగా స్లో అవుతుంది. కొద్ది క్షణాల్లోనే ఆ రౌతు ( బైక్ స్వారీ చేస్తున్న వ్యక్తి ) తల ఓ ప్రక్కకి ఒరిగిపోతుంది. వెనుకనున్న మనం పాపం అతని మెడకి ఏమైందోనని ఖంగారు పడతాం. హటాత్తుగా బైక్ వేగం పెరుగుతుంది. మనకి మళ్ళీ ఖంగారు. ఆ బైక్ అటూ ఇటూ ఊగుతుంది. ఓ ప్రక్కకి ఒరుగుతుంది. ఇదంతా ఆటలోని భాగమని తెలియని మనకి ఖంగారు మరింత పెరుగుతుంది. మన బైక్ వేగం పెంచి అతని ప్రక్కకి వెడతాం. ఏవో మాటలు వినబడతాయి. పరిశీలనగా చూస్తే ఒరిగిపోయిన మెడ క్రింద నలిగిపోతూ కనిపిస్తుంది సెల్ ఫోన్. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలా జోరబడ్డాడో మనకి ప్రత్యక్షంగా తెలియదు గానీ ట్రాఫిక్ పద్మ వ్యూహంలో అతను సాక్షాత్తూ అభిమన్యుడి లాగే కనబడతాడు. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం క్రీడాకారులకి అర్జున అవార్డులిచ్చినట్లు గానే ఈ సెల్ క్రీడాకారులకి అభిమన్య అవార్డులిచ్చి ప్రోత్సహించాలి. వీరు అలా సెల్ మాట్లాడుతూ రోడ్ మీద ఆట ఆడే తీరు బహు రమ్యం గా వుంటుంది. సడెన్ గా స్పీడ్ పెరుగుతుంది. మళ్ళీ స్లో అవుతుంటుంది. తన మానాన తాను పోతున్న వాహనం మీదకో, నడిచి వెడుతున్న మనిషి మీదకో వేడుతుంటుంది. ఖంగారు పడి తప్పుకోవడం వాళ్ళ వంతు. లేకపోతే ఔటే ! ఇదంతా చూస్తున్న రోడ్ మీద ప్రేక్షకులకి ఎంత ఉత్కంఠ ! అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీల్లో కూడా అంతటి ఉత్కంఠ వుండదేమో !

ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం వీళ్ళు తమ ఆటకు బ్రేక్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళ శత్రువులు ( పోలీసులు )  వుంటారు కదా ! ఆది కూడా ఒక కారణం. అసలు ఈ దేశంలో క్రీడా స్పూర్తి లేదు. క్రీడాకారులకు స్వేచ్చ లేదు. లేకపోతే హాయిగా రోడ్ మీద ఆటను ప్రాక్టీసు చేస్తున్న వాళ్ళ మీద కేసులా ? వాళ్ళు రేపొద్దున్న అంతర్జాతీయంగా రికార్డులు సృష్టిస్తే మాత్రం సన్మానాలు చేస్తారు. ఏమిటో ఈ న్యాయం ? చట్టాలు మార్చమని కూడా ఆందోళన చెయ్యాలి.

అసలు ప్రత్యర్థులను ఓడించడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఇంకెవరూ వుండరేమో ! అప్పటివరకూ రోడ్ కి ఓ ప్రక్కగా వెడ్తున్న వీళ్ళకు ఫోన్ రావడం పాపం ... రోడ్ మధ్యలోకి వచ్చి వెనుక వచ్చే ప్రత్యర్థుల్ని చిత్తు చెయ్యడానికి వీళ్ళు చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ళు వెళ్ళరు. వీళ్ళని వెళ్ళనివ్వరు. హార్న్ కొట్టినా వినిపించుకోరు. అడ్డు తప్పుకోరు. చివరికి వాళ్ళ బైక్ కి మన బైక్ తగిలి ఆక్సిడెంట్ అవుతుందేమోననే భయంతో మనం సడెన్ బ్రేక్ వేసి.. దాంతో బైక్ స్కిడ్ అయి క్రింద పడి దెబ్బలు తిని ఈ ఆటలో ఓడిపోయి అయోమయంగా చూస్తుంటే విజయగర్వంతో ఆగకుండా ముందుకు సాగిపోయే ఈ నిర్వికార క్రీడాకారులకు ఏ అవార్డు ఇచ్చి సత్కరించాలో అర్థం కాదు. ఈ విషయం నిర్ధారించడానికి ఓ కమిటీ వెయ్యాలి. వాళ్ళతో పోటీ పడలేని వాళ్ళు అంటే సెల్ ఫోన్ లేని వాళ్ళని, వున్నా డ్రైవ్ చేస్తూ, రోడ్ మీద నడుస్తూ సెల్ ఫోన్ లు మాట్లాడడం చేతకాని వాళ్ళని, ఆ క్రీడాకారుల్ని ఓడించే సామర్థ్యం లేనివాళ్ళని ఆ భగవంతుడే కాపాడాలి. యుద్ధంలోను, క్రీడల్లోనూ గెలుపోటములు దైవాధీనాలు. కానీ ఈ ఆటలో మాత్రం గెలుపు ఖచ్చితంగా సెల్ ఫోన్ డ్రైవర్లదే !

నీతి : దుష్టులను దూరంగా ఉంచవలెను. డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడే వాళ్లకు మనమే వీలైనంత దూరంగా ఉండవలెను. ఇది నా స్వానుభవం.

 Vol. No. 02 Pub. No. 045

Tuesday, October 19, 2010

కీర్తి కండూతి



అనంతమైన కీర్తి సంపాదించాలని, తమ పేరు దశదిశలా మార్మోగిపోవాలని, ఆ కీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచివుండాలని ఎవరికుండదు చెప్పండి ? అందుకే అందరూ ఆ కీర్తి కోసం తహతహలాడిపోతారు.

కొందరు ఈ విషయాన్ని నేరుగా వప్పుకోరు. ' అబ్బే ! నాకలాంటి కొరికలేమీ లేవండీ ! ఏదో నా జీవనం సాఫీగా గడిస్తే చాలు. మా పిల్లలు చక్కగా స్థిర పడితే అంతకంటే కావాల్సిందేముంటుంది. శేష జీవితాన్ని కృష్ణా, రామా అంటూ గడిపేస్తాను ' అంటూంటారు. వాళ్ళనే మీ గొప్పతనానికి మెచ్చి మీకు సన్మానం చెయ్యాలనుకుంటున్నాం అని చెప్పండి. ' అబ్బే ! సన్మానం చేయించుకునేంత గొప్పతనం నాలో ఏముంది చెప్పండి. ఏదో నా విధి నేను నిర్వర్తించాను. అంతే కదా ! ' అంటూనే పక్కవాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో నాకు సన్మానం చేస్తారట. వద్దన్నా వినడం లేదు అని చెబుతారు. ' పోనీలే ఆయన మొహమాట పడుతున్నాడు. ఈసారికి మరొకరిని వెదుక్కుందాంలే అని మనం అనుకునేలోగా పరోక్షంగా అంగీకారం తెలియజేసేస్తారు. సన్మానమంటే ఎవరికి చేదు చెప్పండి.

ఇంకా కొంతమంది వుంటారు. వాళ్ళకి ఇలాంటి సన్మానాలు, ప్రచారాలు చేయించుకోవాలని కోరిక బలంగా వుంటుంది. కానీ ఎవరిని, ఎలా అడగాలో తెలీదు. తెలిసినా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారోనని సంకోచం. ఎవరి వల్లనైనా తమకు ప్రచారం వస్తుందని అనిపిస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతూ వుంటారు, ఎప్పటికైనా గుర్తించి తమకు సన్మానమో, మరోటో చేసి ప్రచారం కల్పిస్తారనే ఆశతో

మరికొంతమంది వుంటారు. తమకు ప్రచారం కావాలనుకోండి. మీడియా వాళ్ళను పిలిచి ఏదో ఒక విషయం మీద మాట్లాడేస్తుంటారు. ఈ మధ్య మీడియాలో వచ్చిన పోటీ ధోరణి వీళ్ళకు మరింత ఆలంబన. ఒకవేళ వాళ్ళు రారేమోననిపిస్తే ఏ స్టార్ హోటల్ లోనో విందు కార్యక్రమం, ఇతర ఆకర్షణలు ఏర్పాటు చేసి రప్పిస్తారు. మరి తిన్న విశ్వాసం చూపించాలి కదా అందుకే మర్నాడు మీడియాలో ఈయన మాటలు వచ్చేస్తాయి. అవి మామూలుగా వుంటే జనం ఒకసారి చూస్తారు. వివాదాస్పదంగా వుంటే ఇంక చెప్పనక్కర్లేదు. మరో కొన్ని రోజులు మీడియాకు విందు. ఈయనకు పసందు. దీనివలన కలిసొచ్చేది ఏమిటయ్యా అంటే పైకి కారణాలేమి చెప్పినా ఈయనకు అదో తృప్తి

వీళ్లలోనే మరో రకం. మీడియాను పోగెయ్యలేకపోయినా చుట్టూ పదిమందిని పోగేసి అక్కడ లేని వాళ్ళ గురించో, ప్రపంచ రాజకీయాల గురించో, చరిత్రలో లేని చారిత్రాత్మక విషయాల గురించో..... ఏదో విషయం గురించి మాట్లాడేస్తూ వుంటారు . ఆ విన్న వాళ్ళంతా ' అబ్బో మీకెన్ని విషయాలు తెలుసండీ ! ' అంటూ ఆశ్చర్యపోతుంటే... అబ్బో ..... ఆ సంతృప్తే వేరు

కీర్తి కండూతికి ఎన్నో అవతారాలు. అందులో మరో అవతారం అంటే మరో రకం వున్నారు. వీళ్ళు తమను తాము గొప్పవాళ్ళుగా వూహించేసుకుని చుట్టూ వున్నవాళ్లు ఆథములని వాళ్ళను వుద్ధరించడానికే తాము అవతరించామని చెప్పుకుంటూ సంతృప్తి చెందుతూ వుంటారు. వంగి వంగి దణ్ణాలు పెట్టే వాళ్ళకు వందలు వందలు సమర్పించుకుంటారు.  వళ్లు వంచి పనిచేసే వాళ్ళను తమకు దణ్ణం పెట్టలేదనే కారణంతోనో, మరో కారణంతోనో దూరం చేసుకుంటారు. తమకు బాజా వాయించేవాళ్ళకు పంచభక్ష్య పరమాన్నాలు..... కష్టసుఖాలన్నిటిలో తోడునీడగా నిలిచే కుటుంబసభ్యులకు పచ్చడి మెతుకులు. బయిట అందరూ నా గొప్పతనానికి అడుగడుగునా మెచ్చుకుంటున్నారు, ఇంట్లో మాత్రం వీసమెత్తు విలువలేదు.....ఇదీ వారి ఫిర్యాదు. బయిట వాళ్లయితే తమ స్వార్థం కోసం తప్పనిసరై మెచ్చుకుంటారని,  ఇంట్లో వాళ్ళకు అడుగడుగునా మెచ్చుకునే అవసరం లేదని, వాళ్ళకు వీరి పట్ల బాధ్యత వుంటుందే కానీ స్వార్థం కాదనీ  అర్థం కాదు. అర్థం అయినా అది ఒప్పుకునేందుకు అహం అడ్డొస్తుంది. ఎందుకంటే పొగడ్తలనే భ్రమలో బతికేస్తుంటారు కదా !

 ఈ కీర్తి కండూతి మహా చెడ్డది. దీనిలో పీకలదాకా మునిగిపోయిన వాళ్ళు స్వజనాన్ని దూరం చేసుకుంటారు. ఉన్నదంతా ఊడ్చుకుపోయాక పరజనం దూరం అయిపోతారు. నిజానికి అందరిలోనూ ఈ కీర్తి కండూతి అంతో ఇంతో అంతర్లీనంగా వుంటుంది. కాకపోతే కొంతమంది బయిట పడతారు. కొంతమంది గుంభనంగా వుంటారు. ఎవరైనా తమ స్వార్థంకోసమో, నిస్వార్థంగానో  మనల్ని పొగడ్తలతో ముంచెత్తినపుడు వివేకం వుపయోగిస్తే సమస్య వుండదు. 

ఏమైనా ఈ కీర్తి కండూతిని తగిన మోతాదులో వాడాలి.  శృతి మించితే వికటించి కళ్ళు మూసుకుపోతాయి.... చెవులు వినిపించవు.... బుద్ధి పనిచేయదు.... విచక్షణ నశిస్తుంది. ఆలోపతీ మందుల కంటే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ చాలా వుంటాయి. అన్నీ ఉడిగాక... సర్వం హరించుకు పోయాక జ్ణానోదయం అయినా ప్రయోజనం లేదు. బెల్లంకోసం వచ్చిన ఈగలు అది ఖాళీ అవగానే ఎగిరిపోతాయి. తమని సదా అంటిపెట్టుకుని మంచిచెడ్డల్లో అండగా నిలిచే తన మనుష్యులు దూరం అవుతారు. చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. మనుష్యుల నైజమే అంత అనుకోండి. తమకందుబాటులో వున్నదాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అంతరిక్షంలో వున్నవాటికోసం అర్రులు చాస్తారు. 

మనలోని గొప్పతనం వల్లో, మన ప్రవర్తన వల్లో, మన మంచితనం వల్లో కీర్తి దానంతట అది రావడం ఎంత మంచిదో..... కీర్తిని బలవంతంగా తెచ్చుకోవాలనుకోవడం, కొనుక్కోవాలనుకోవడం అంత చెడ్డది. 

కీర్తి హానికరం కాదు. కీర్తి కండూతి మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. కీర్తికోసం కాక ఒక ప్రయోజనం కోసం కృషి చేస్తే...  వస్తే దానంతట ఆదే వస్తుంది. లేకపోతే ఆత్మ సంతృప్తైనా మిగులుతుంది. కేవలం కీర్తికోసం మాత్రమే కృషి చేస్తే చివరకు అది అపకీర్తినే మిగులుస్తుంది. 

మనవి : ఈ వ్యాసంతో బాటు మానవ జీవితాల్లో కనిపించే ఇలాంటి విషయాల గురించి నా అనుభవంలో నాకు కలిగిన భావాలకి అక్షర రూపం తేవాలనే వుద్దేశ్యంతో రాయడం ప్రారంభించాను. మనసులో మెదిలినపుడు కొన్ని విషయాలని రాసి పెట్టుకున్నాను.  అయితే వాటికి మెరుగులు దిద్ది పూర్తి చేసి ప్రచురించడం ప్రారంభిద్దామనుకునే లోగా మా ఇంటర్నెట్ కనెక్షన్ లో గత నెల 24 వ తేదీ నుంచి సమస్య వచ్చింది. బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్. వారితో ఒక రకంగా యుద్ధం చేశాక, జి‌ఎం వరకూ వెళ్ళాక విజయదశమికి ముందురోజు అంటే సుమారు 20 రోజుల తర్వాత  పూర్తి పరిష్కారం దొరికి మామూలుగా పనిచేస్తోంది. 

ఈలోపు అనుకోకుండా ఇదే కీర్తి అనే విషయం మీద ప్రముఖ రచయిత శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు అంతర్జాల పత్రిక కౌముది లో అక్టోబర్ 11 వతేదీన ఓ ఆడియో సహిత వ్యాసం ప్రచురించారు. అద్భుతమైన ఉదాహరణలతో వున్న ఆ మహానుభావుడి వ్యాసం ఇక్కడ చదవండి. గొల్లపూడి గారికి, కౌముది వారికి కృతజ్ణతలతో......   

Vol. No. 02 Pub. No. 040

Saturday, June 12, 2010

'ఆటా'డిస్తా !

ఈ రోజు రియాల్టీ షోల మీద మానవ హక్కుల కమిషన్ తీర్పు వచ్చింది. సహజంగానే విస్తృతంగా, వాడిగా, వేడిగా చర్చలు జరుగుతున్నాయి. ప్రజా సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తుంటే, ఆ షోలలో పాల్గొనే పిల్లల తల్లితండ్రులు, పిల్లలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాదు చేయిస్తున్నారు. దీనికి కూడా తెరవెనుక దర్శకత్వం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికంతటికీ వీళ్ళందర్నీ 'ఆటా' డిస్తున్నది ' డబ్బే ' ! ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం.

ఈ రోజు ఒక ఛానల్లో జరుగుతున్న చర్చల్లో  పెద్దలతో వాదిస్తున్న ఒక బాలుడి వాదన వెనుక స్క్రిప్ట్, దర్శకత్వం ఎవరివో తెలుసుకోలేనంత అజ్ఞానంలో ప్రేక్షకులు లేరనుకుంటాను. కాకపోతే అందరిలోనూ సహజంగానే ఉండే ఉదాసీనత వలన కావలసినంత నిరసన రావడంలేదు. సరైన నిరసన వస్తే ఇలాంటి ' ఆట ' లు సాగవేమో ! ఇప్పుడు ఈ తీర్పు వచ్చాకా మనందరం కాసేపు ఆవేశపడిపోతున్నాం ! తర్వాత మన పనుల్లో మనం మునిగిపోతాం ! వాళ్లకి చట్టంలోనూ, న్యాయ వ్యవస్థలలోను, రాజ్యాంగంలోను వున్న లొసుగులు తెలుసు. లేదా తెలుసుకుంటారు. లొసుగులు లేకపోతే ఉన్నవాటికి వారికి అనుకూలమైన అర్థాలు అన్వయిస్తారు. పై కోర్ట్ లకి వెడతారు. లేదా డబ్బుతో బాధితుల్ని తమకి అనుకూలంగా తిప్పుకుంటారు.

దీనికి నిదర్శనం ఈ రోజు ఛానల్లో వాదించిన కుర్రవాడు నిర్వాహకుల్ని సమర్థించిన తీరు , మరో ఛానల్లో ఒక తల్లి వాదనలు వింటే అర్థమవుతోంది. డబ్బు కోసం మేం పిల్లల్ని హింసించడం లేదని వాదిస్తున్న ఆ తల్లికి, మిగిలిన తల్లిదండ్రులకి నాకు తెలిసిన విషయం ఒకటి చెబుతాను. రెండు సంవత్సరాల క్రితం ఆ కుర్రవాడి  పరిస్థితి విజయవాడలో చాలామందికి తెలుసు. అప్పట్లో ఆ కుర్రవాడిని వెంటబెట్టుకుని అతని తల్లి నగరంలోని పెద్దల దగ్గరికి, సంస్థల కార్యాలయాలకి ప్రతినెలా మొదటి వారంలో ఎక్కే గుమ్మంగా, దిగే గుమ్మంగా తిరగడం నాకు బాగా తెలుసు. ఆ కుర్రవాడిలో టాలెంట్ నచ్చి , అతని భవిష్యత్తుకు ఆర్ధిక ఇబ్బందులు ఆటకం కాకూడదని కొందరు ప్రతినెలా ఇచ్చే డబ్బుకోసమే అలా తిరిగేవారు. ఇలా ఇంకా ఎంతోమంది ఈ స్థాయి పిల్లల తల్లిదండ్రులు ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. సొంత పిల్లలనే బలిచేస్తున్నారు.

ఈ షోల పుణ్యమాని పిల్లలు అంగడి సరుకులై పోయారు. తల్లిదండ్రులు వారిని అమ్ముకుంటున్నారు. నిర్వాహకులు కొనుక్కుని తమకు కోట్లు సంపాదించి పెట్టే సరుకుగా తయారుచేసి  ప్రేక్షకుల మీద వదులుతున్నారు. డబ్బు కోసం పిల్లల్ని ఇలా తయారు చెయ్యడం కొంతమంది చేస్తుంటే, మరో రకం తమ పిల్లలు తెర మీద కనబడాలని, ఉన్నతమైన స్థానంలో చూడాలనే పిచ్చితో ఎదురు పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏ రకమైన తల్లిదండ్రులైనా నలిగిపోతున్నది మాత్రం పిల్లలే !


ఒక ప్రక్క  తీర్పు వచ్చింది. మరోప్రక్క వేడిగా చర్చ జరుగుతోంది. ఆ సమయంలోనే మరో ఛానల్ అలాంటి కార్యక్రమమే  ప్రసారం చేస్తోంది. త్వరలోనే నిషేధించిన కార్యక్రమం పాత వేషం తీసేసి  కొత్త రూపంతో, కొత్త పేరుతో వస్తుంది. నిరసన తెలియజేసే మానవతావాదుల్ని పరిహసిస్తూ తల్లిదండ్రులందరూ నిర్వాహకుల పక్షమే జేరుతున్నారు. డబ్బెవరికి చేదు ?

ఈ ఫీట్లన్నీ ఎందుకంటే బ్రహ్మ పదార్ధం లాంటి టి. ఆర్. పి. రేటింగుల కోసమే ! అవేమో కొంతమంది జేబులో ఇరుక్కు పోయాయి మరి. తమ జేబులోకి రావాలంటే ఇలాంటి జిమ్మిక్కులు తప్పదు. దానికోసం, ఆది తెచ్చే డబ్బు కోసం  పిల్లల్ని, తల్లిదండ్రుల్నీ, ప్రేక్షకుల్నీ, నిరసనకారుల్నీ ఇలాంటి  కార్యక్రమాల నిర్వాహకులు 'ఆటా' డిస్తూనే వుంటారు. 



Vol. No. 01 Pub. No.319

Tuesday, May 11, 2010

జీవితచక్రం

నాడు దర్జాగా తిరిగిన దర్జీ చక్రం
నేడు రోడ్ల పాలైన పరిణామ క్రమం

ఒకప్పుడు బట్టలు టైలర్ మేడ్
మరిప్పుడు అవే రెడీమేడ్


కంపెనీల మెరుస్తున్న బట్టలు
కొట్టాయి కాలుతున్న పొట్టలు

ఒకప్పుడు మన దగ్గరకే జనం
మరిప్పుడు జనం దగ్గరకే మనం



పని దొరికితేనే కడుపులు నిండేది 
చక్రం తిరిగితేనే జీవిత చక్రం తిరిగేది

అప్పుడే మా జీవితాల్లో వెలుగులు నిండేది
లేకపోతే చీకటే మాకు మిగిలి వుండేది  







Vol. No. 01 Pub. No. 289

Thursday, April 8, 2010

కిడ్నాప్

డబ్బుకోసం ధనవంతుల పిల్లల కిడ్నాప్ 
కక్ష తీర్చుకోవడానికి కావాల్సిన వాళ్ళ కిడ్నాప్
ఎన్నికల్లో గెలవడానికి ప్రత్యర్థి కిడ్నాప్
రాక్షస వివాహానికి నచ్చిన అమ్మాయి కిడ్నాప్
అప్పు రాబట్టుకోవడానికి బాకీదారుల కిడ్నాప్
............... ఇలా కిడ్నాప్ లలో ఎన్నో రకాలు

కానీ ఇదో కొత్త రకం కిడ్నాప్
విద్యా వ్యాపారుల దుర్మార్గాలకి పరాకాష్ట
ఫీజు కట్టలేదని అభం, శుభం తెలియని విద్యార్థిని స్కూల్ యాజమాన్యం నిర్బంధం.
ఫీజు కట్టనిదే ఇంటికి పంపబోమని తండ్రికి తెలియజేసిన ప్రైవేటు యాజమాన్యం.
మాకు డబ్బే ముఖ్యం..... మానవతా విలువలు ముఖ్యం కాదు
అని డంకా మీద దెబ్బ కొట్టి చెప్పిన విద్యా వ్యాపారులు
విద్య మన దేశంలో అందని ఫలమైపోయింది... అంగడి సరుకై పోయింది.
వెర్రి తలలు వేస్తున్న విద్యా వ్యాపారానికిది నిదర్శనం

గురువారం నాటి ఆంధ్రజ్యోతి లోని ఈ వార్త చూడండి.

Vol. No. 01 Pub. No. 247

Friday, March 5, 2010

ఓం సచ్చిదానంద....

ఇప్పుడెక్కడ చూసినా సచ్చిదానందమే !
అంతా మాయ ! జగమంతా మిథ్య !!
మా కేళీ లీలా విలాసాలోకటే సత్యం !
భక్తులకు ముక్తి వేదాంతం
మాకు రక్తి సిద్దాంతం
మా బోధనలే మీకు శిరోధార్యాలు
మీ ' సేవ 'లే మాకు అలౌకికానందాలు
ఎందరో స్వాములు, గురువులు, బాబాలు
అందరికీ వందనాలు
అందుకే మహాకవి దృష్టిలో మిథ్యావాది .............

మాయంటావా ? అంతా
మిథ్యంటావా ?
నా ముద్దుల వేదాంతీ !
ఏమంటావూ ?
కనబడినది కనబడదని
వినబడినది వినబడదని
జగతి మరుపు, స్వప్నం, ని
శ్శబ్దం ఇది
మాయ ! మాయ !
మాయంటావూ ! అంతా
మిథ్యంటావూ !!

ఓం సచ్చిదానంద..............



Vol. No. 01 Pub. No. 214

Tuesday, February 9, 2010

మేరా భారత్ మహాన్

మనం దేశ పౌరులుగా అనేక రకాల పన్నులు కడుతున్నాం. కానీ అందులో ఎంతభాగం ప్రజా సంక్షేమం కోసం వినియోగమవుతోంది, ఎంతభాగం నాయకుల సంక్షేమం కోసం వినియోగమవుతోంది అనేది పట్టించుకోం ! ఒకసారి కొన్ని నిజాలు తెలుసుకుందాం !

మన
దేశంలో ఒక పార్లమెంట్ సభ్యుని ( M.P. ) గౌరవ వేతనాలు, భత్యాలు ఇలా ఉన్నాయి.
  • నెల జీతం : రు. 12, 000/-
  • నియోజక వర్గ ఖర్చు (నెలకు ) : రు. 10, 000/-
  • కార్యాలయ ఖర్చులు (నెలకు ) : రు. 14, 000/-
  • ప్రయాణ భత్యం : కిలోమీటరుకు రు. 8/- (ఉదాహరణకు రాజధాని ఢిల్లీ నుండి దక్షిణ కొసనున్న కేరళకు మారుగా 6, 000 కిలోమీటర్లు ) చొప్పున రు. 48, 000/-
  • పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నపుడు రోజు వారీ భత్యం : రు. 500/-
  • రైలు ప్రయాణ ఖర్చులు : దేశంలో ఎక్కడినుండి ఎక్కడికైనా, ఎన్నిసార్లు అయినా రైలులో మొదటి తరగతి . సి. ఉచితం.
  • విమాన ప్రయాణం : వాణిజ్య తరగతిలో భార్య లేదా భర్త / వ్యక్తిగత సహాయకుడు తో సంవత్సరానికి 40 సార్లు ఉచితం.
  • వసతి : ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుల హాస్టల్ లో ఉచితం.
  • విద్యుత్ ఖర్చులు : నివాసానికి 50, 000 యూనిట్ల వరకూ ఉచితం
  • ఫోన్ ఖర్చులు : 1, 70, 000 కాల్స్ వరకూ ఉచితం
  • మొత్తం ఖర్చులు : ఒక్కొక్క సభ్యునికి సంవత్సరానికి సుమారుగా రు. 32, 00, 000/- అంటే నెలకు సుమారు రు. 2, 66, 000/-
  • పదవీకాలానికి ( 5 సంవత్సరాలకు ) మొత్తం ఖర్చు : రు. 1, 60, 00, 000/-
  • పార్లమెంట్ సభ్యుల మీద మొత్తం ఖర్చు : అయిదు సంవత్సరాలకు మొత్తం 534 సభ్యుల మీద దేశం పెడుతున్న ఖర్చు రు. 8, 54, 40, 00, 000/- అంటే సుమారు రు. 855 కోట్లు .

ఇదంతా మనం ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు లోనుండి పెడుతున్న ఖర్చు.
ఇక సామాన్యులకవసరమైన సరుకుల ధరలు పెంచకపోతే ఎలా సమకూడుతుంది ?

Vol. No. 01 Pub. No. 191

Friday, December 25, 2009

ఉదాసీనతా నీ విశ్వరూపం !!!

అధికారం, ధనం, పలుకుబడి ముందు
సభ్యత, సంస్కారం తలవంచుకుంటున్నాయా ?
రాజకీయాలకు విలువలు లేవా ?
విశృంఖలత్వమే వాటి చిరునామాగా మారిపోతోందా ?
స్వార్థ రాజకీయాలు ..........
రాజకీయ స్వార్థాలు .........
ఉద్యమాలను బలితీసుకుంటున్నాయి
విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకుంటున్నాయి
సామాన్య ప్రజల జీవితాలను బలి తీసుకుంటున్నాయి
ప్రజలిచ్చిన అధికారంతో అందాలాలెక్కుతున్నాయి
మదమెక్కిన జంబుకాలు ప్రజా భవనాలనే
రాసలీలా మందిరాలుగా మార్చేస్తున్నాయి
వారికా భవనాలేవరిచ్చారు ? అధికారమెవరిచ్చారు ?
హోదా ఎవరిచ్చారు ? ధనమెవరిచ్చారు ?
వారికి ఇలా కళ్ళు నెత్తికెక్కడానికి కారణమేమిటి ?
ఇంకేమిటి ? ప్రజల ఉదాసీనతే !
అదే ఈనాటి రాజకీయాలకు పెట్టుబడి
ఎప్పటికైనా ప్రజల్లో ఈ ఉదాసీనత తొలిగిపోతుందా ?

Vol. No. 01 Pub. No. 143
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం