స్వ' గతం '

లంకంత కొంప. చుట్టూ కావలసినంత ఆవరణ. ఆవులు, గేదెలతో సమృద్ది గా పాడి. కావల్సినంతమంది పనివాళ్ళు. ఇంటినిండా బంధువులు, స్నేహితులు.
ఇవన్నీ వింటుంటే ఇంతకంటే మించి జీవితానికి ఏం కావాలనుకుంటారు ఎవరైనా !
నిజమే ! ఇంకేం అక్కరలేదు. కానీ అవన్నీ ఒకప్పటి కలలుగా మిగిలిపోతే, ఆ గత వైభవాన్ని నెమరు వేసుకుంటే....... అదొక తీయని జ్ఞాపకం. కొన్ని అనుభవాలు చేదుగా ఉన్నా కొన్ని జ్ఞాపకాలు మధురంగా ఉంటాయి. మన జీవితంలో చేదు అనుభవం ఎదురయినపుడు ఆ తీపి జ్ఞాపకాలను తలుచుకుంటే కలిగే ఉపశమనం.......... మాటల్లో చెప్పలేం !
అలాంటి జ్ఞాపకాలే స్వ ' గతం ' .


శివరాత్రి అనుభవాలు

ఈ రోజు మహాశివరాత్రి. శివరాత్రి అనగానే బాల్యం నుంచీ అనేక జ్ఞాపకాలు. అందులో కొన్ని ఆ రోజు గోదావరిలో స్నానం చేసి ముక్తేశ్వరం. కోటిపల్లి శివాలయాలకు వెళ్ళడం, దైవదర్శనంతో బాటు అక్కడ జరిగే తీర్థాలలో తిరగడం ఒక మధురానుభూతి. 

అలాగే మరునాడు జరిగే ముమ్మిడివరం బాలయోగి దర్శనం, తీర్థం మరచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. మరీ చిన్నతనంలో ఆ రోజు బాలయోగి దర్శనం కోసం వచ్చే సినిమా తారల్ని చూడడానికి మా వీధి చివర కాలవ వొడ్డున నిలబడి ఉండడం, వచ్చే కార్లనీ, వెళ్ళే కార్లనీ వెదుకుతుండేవాళ్ళం. వాటిలో ఎవరైనా సినిమా తారలు కనిపిస్తే ఆనందంతో గెంతులు వేసేవాళ్ళం. అలా నాగయ్య గారు, ఎస్వీరంగారావు, అంజలీదేవి మొదలైన వారిని చూడటం జరిగింది. 

కొంచెం పెద్దయ్యాక అంటే హైస్కూలుకొచ్చాక స్కౌటు వాలంటీరుగా ముమ్మిడివరం వెళ్తూండేవాళ్ళం. ఇంటరులో ఉండగా అంటే 1972-73 లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఆ సంవత్సరం తీర్థంలో ఉద్యమాన్ని ప్రచారం చెయ్యడానికి కొంతమంది బృందంగా వెళ్ళాం. అక్కడికి ఇతర రాష్ట్రాలనుంచి ముఖ్యంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలనుంచి ప్రజలు వచ్చేవారు. మా ప్రచార ఉద్దేశ్యం ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వాళ్ళకు ఆ ఉద్యమాన్ని గురించి అవగాహన కల్పించడం. అందుకే దర్శనానికి వెళ్ళి వచ్చే ఇతర రాష్ట్రాల ప్రజల్ని గుర్తించి వారికి ఉద్యమ ఉద్దేశ్యాలను వివరించడం, కరపత్రాలు పంపిణీ చెయ్యడంలాంటివి చేసాం ! వాళ్ళలో చాలామంది ఈ వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం నాకింకా బాగా గుర్తుంది. కొంతమంది మాత్రం మా వచ్చీ రాని హిందీ భాష, తమిళులు ఇతరులతో సైగల భాషను చూసి భయపడి దూరంగా వెళ్ళిపోయేవారు. ఏమైనా మా ప్రయత్నం చాలావరకూ ఫలించిందనే చెప్పాలి. విద్యార్థులమైన మాతోబాటు ఉపాద్యాయులు, ఉద్యోగులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
1980 లో అనుకుంటా ! అప్పుడు నేను ఎం.కాం. ప్రైవేటుగా చదువుతూ, చిన్న ఉద్యోగం చేస్తూ తిరుపతిలో ఉండేవాడ్ని. శివరాత్రి రోజున బయిల్దేరి వచ్చాను. మర్నాడు అంటే బాలయోగి దర్శనం రోజు సంపూర్ణ సూర్యగ్రహణం. నాకు ఊహ తెలిసాక బాలయోగి దర్శనం రోజు మా కోనసీమ ప్రశాంతంగా ఉండగా చూడడం అదే మొదటిసారి. చాలా కాలం తర్వాత వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణం కావడం వలన ప్రజలంతా బయిటకు రావడానికి భయపడ్డారు. రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణం. వర్ణాలు మార్చుకుంటూ కొన్ని సెకన్లపాటు సూర్యుడు పూర్తిగా అదృశ్యమైన సన్నివేశం, ఆ అనుభూతి చెప్పనలవి కాదు. ఆ శివరాత్రికి అదొక వినూత్నమైన అనుభవం.

ఆ మరుసటి సంవత్సరం శివరాత్రి మరిన్ని మధురానుభూతుల్ని అందించింది. అప్పుడు విశ్వనాథ్ గారి ' సప్తపది ' షూటింగ్ నిమిత్తం అమరావతిలో ఉండటం జరిగింది.  అసలు ఆ షూటింగే ఒక మధురానుభూతి. అప్పటికే కొన్ని రోజుల్నుంచి ఆ ఊళ్ళోనే ఉండటం, ఎక్కువభాగం గుళ్ళోనే షూటింగ్ చెయ్యడంతో అక్కడి పూజారులు, అధికారులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. దాంతో ఆ రోజు ఉదయంనుండీ ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నామో ఇప్పుడు చెప్పలేను. ఆ రోజులో ఎక్కువ సేపు గుడిలో షూటింగ్ జరగకపోయినా బ్రేక్ సమయంలో మాత్రం వెళ్ళి దర్శనం చేసేసుకునే వాళ్ళం. సెంటిమెంటో, మరోటో గానీ సాయింత్రం మాత్రం కొంతసేపు షూటింగ్ చెయ్యాలని నిర్ణయించారు డైరెక్టరు గారు. సాయింత్రం రుద్రాభిషేకం జరుగుతుంటే వెళ్ళి కొంతసేపు చూసి, షూటింగ్ ఏర్పాట్లకోసం క్రిందకు వచ్చాం. మా పనిలో మేముండగా అప్పుడే గుడిలోంచి వచ్చిన విశ్వనాథ్ గారు పనిలో మునిగిఉన్న నన్ను చూసి ' దేముడ్ని దర్శనం చేసుకున్నావా ? ' అని అడగడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కాసేపు నోటమాట రాలేదు. ఆయనే మళ్ళీ ' అభిషేకమూర్తి వెలిగిపోతున్నాడు. ఈ పని తర్వాత చెయ్యొచ్చు. వెళ్ళు. వెళ్ళి దర్సనం చేసుకుని రా! ' అన్నారు. అంతేకాదు ఆయన చేతిలో ఉన్న కుంకుమ నాకిచ్చి పెట్తుకోమన్నారు. ఆప్పటివరకూ ఎప్పుడూ పని ధ్యాసలో మునిగి ఉండే ఆయనతో మాట్లాడడానికే కాదు ఆయన దగ్గరకు వెళ్ళడానికి కూడా సాహసం చేసే వాళ్ళం కాదు. అలాంటిది ఆయన నా దగ్గరకి వచ్చి అలా మాట్లాడటం నాకు గొప్ప అనుభూతిని మిగిల్చింది. 

ఆ తర్వాత రధోత్సవం చిత్రీకరణ. లక్షలాదిమంది భక్తుల మధ్య సాగుతున్న రథాన్ని చిత్రీకరించడం ఒక గొప్ప అనుభవం. అదేమీ షూటింగ్ కోసం చేసిన ఏర్పాటు కాదు. మహాప్రభంజనంలా సాగుతున్న రథంతో బాటు జన ప్రవాహాన్ని తప్పించుకుంటూ మమ్మల్ని, కెమెరాను, కెమెరా పట్టుకున్న యూనిట్ కెమెరామన్ బాబ్జీ ని కాపాడుకుంటూ యూనిట్ అంతా మాకు రక్షణ వలయం ఏర్పాటు చెయ్యడం, రథంతో బాటు అమరావతి వీధుల్లో పరుగులు.... అబ్బ అవొక తియ్యటి జ్ఞాపకాలు. అదొక వినూత్న అనుభవం.  ఆ రోజులు మళ్ళీ రావు. వచ్చినా భావి తరానికి ఆ అనుభవాలను పాఠాలుగా అందించడం తప్ప అంతంత సాహసాలు చేసే వయసు కాదిప్పుడు.

1986 లో ' జననీ జన్మభూమి ' చిత్రం షూటింగులో ఉన్న సమయంలో మా సీనియర్, నాకు మంచి మిత్రుడు, నా శ్రేయోభిలాషి, ప్రముఖ కెమెరామన్ మీర్ తండ్రి గారైన ప్రముఖ దర్సకులు స్వర్గీయ ఎస్. డి. లాల్ గారు బాలయోగి జీవితంపై డాక్యుమెంటరీ నిర్మించాలనుకోవడంతో ఆ శివరాత్రి మరో రకమైన అనుభవం. శివరాత్రి రోజు అర్థరాత్రి ప్రారంభమయ్యే బాలయోగి దర్సనం కోసం సాయింత్రంనుంచే అక్కడ వేచి ఉన్నాం. మాతోబాటు ముంబయి నుంచి మరో యూనిట్ కూడా చిత్రీకరణ కోసం వచ్చింది. దర్సనం ప్రారంభమైనా, తెల్లవారి పోయినా వాళ్ళకు గానీ, మాకు గానీ అనుమతి లభించలేదు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బాలయోగి ఈ చిత్రీకరణకు అంగీకరించడంలేదని ఆలయ కమిటీ సమాచారం. తెల్లవారుతుండగా ముంబయి యూనిట్ ఇక లాభంలేదని సర్దేసుకుని వెళ్ళిపోయారు. మాకు ఆశ చావక ఉదయం గం. 8-00 దాటేవరకూ వేచి ఉన్నాం. అయినా అనుమతి లభించకపోవడంతో చేసేదిలేక దూరంనుంచే కొన్ని షాట్స్ తీసుకుని వెనుదిరిగాం ! తర్వాత కొ్ద్దికాలానికే బాలయోగి మరణించడంతో ఆ ఉత్సవం ఆగిపోయింది. 
ఇవీ కొన్ని ముఖ్యమైన శివరాత్రి అనుభవాలు. గత కొన్ని సంవత్సరాలుగా వృత్తి కారణంగా మా ఊరికి దూరంగా ఉండటం, కుటుంబ బాధ్యతలు పెరగడం శివరాత్రి ఉత్సవాలకు వెళ్ళడం కుదరలేదు. ఇప్పటి పిల్లలకు చదువులు, సినిమాలు, టీవీ, ఇంటర్నెట్ లు తప్ప ఇలాంటి వాటిని పట్టించుకునే ఆసక్తి ఉండటంలేదు. అయినా మా పిల్లలకు అప్పుడప్పుడు బలవంతంగా ఈ విషయాలు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. ఎప్పటికైనా వాళ్ళలో కుతూహలం కలగక పోతుందా అనే ఆశ. 
********* 
                                                                                                           ........... స్వ' గతం ' - 001    


హోళీ జ్ఞాపకాలు

జీవితంలో కొన్ని మధురమైన జ్ఞాపకాలు శాశ్వతంగా మిగిలిపోతాయి. అప్పుడప్పుడు అవి గుర్తుకు వచ్చి మనల్ని మనకు జ్ఞాపకం చేస్తుంటాయి. అలాంటి ఒక జ్ఞాపకమే హోళీ జ్ఞాపకం. 

హోళీ హిందువుల పండుగే అయినా దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా చేస్తారు. హైదరాబాదు లాంటి పెద్ద నగరాలలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది గానీ ఆంధ్ర దేశంలో మిగిలిన ప్రాంతాలలో అంతగా కనిపించదు. రవాణా, సమాచార వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కొంత పెరిగిందనుకుంటాను. కానీ మా చిన్నతనంలో ఈ పండుగ గురించి స్కూళ్ళకు సెలవురోజుగానే తప్ప అంతగా అవగాహన వుండేది కాదు. హోళీలోని సరదా, దాని వెనుకవున్న ప్రయోజనం అనుభవంలోకి వచ్చింది మాత్రం కాలేజీ వదిలి బయిట ప్రపంచంలోకి అడుగుపెట్టాకే !

1981 లో అమరావతిలో కె. విశ్వనాథ్ గారి ' సప్తపది ' చిత్రం షూటింగ్ సుమారు 50 రోజులు నిర్విరామంగా ఒకే షెడ్యూల్ లో జరిగింది. నాకు చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి రోజులు. బెరుకు, బెరుకుగా వుండేది. కెమెరా విభాగంలో అప్రెంటిస్ గా చేరాను. కెమెరామన్ మా కజిన్ కస్తూరి. ఆయన కొన్ని సూత్రాలకు కట్టుబడి వుండేవాడు. చిన్నప్పట్నుంచీ ఫొటోగ్రఫీలో తనే నాకాదర్శం. పూనా ఫిల్మ్ ఇన్సిటిట్యూట్ లో బాలు మహేంద్ర సహాధ్యాయి. నాకు కూడా అక్కడే చదవాలని చాలా కోరికగా వుండేది. కానీ మా పెద్దల అనుమతి దొరకలేదు. కనుక మా ఇంట్లో వున్నయాషికా ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా ( అప్పటికి అది లేటెస్టు ) తో  ప్రయోగాలు చేసేవాడిని. మా వూళ్ళో అప్పట్లో చాలా ప్రసిద్ధిపొందిన  ఫొటోగ్రాఫర్ విజయా స్టూడియో సత్యనారాయణ చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. అలాగే అప్పుడప్పుడు మద్రాసునుంచి వచ్చినపుడు మా అన్నయ్య ఇంకా మంచి సూచనలు ఇవ్వడంతో బాటు 35 ఎం.ఎం. నెగెటివ్ ( అప్పట్లో 35 ఎం.ఎం. కెమెరాలు దాదాపుగా వుండేవి కాదు. మా కెమెరాకు అటాచ్మెంట్ వుండేది  )  కూడా పట్టుకు వచ్చి ఇచ్చేవాడు. సినిమా చిత్రీకరణలో ఒక మేగజైన్ ( కెమెరాలో ఫిలిం వుంచేది ) లో చివర 20, 30 అడుగుల ఫిలిం మిగిలితే అది ఒక షాట్ కి సరిపోదని భావిస్తే వాడరు. అలా మిగిలిన ఆ ముక్కని మేం స్టిల్స్ తీసుకోవడానికి వాడేవాళ్ళం. దాంతోనే నేను చాలా నేర్చుకున్నాను. అయితే అవన్నీ బ్లాక్ అండ్ వైట్. తర్వాత రోజుల్లో కలర్ రావడం, ఆ  ఫిలిం మీద కూడా ప్రయోగాలు చెయ్యడం కూడా జరిగిందనుకోండి. కానీ కలర్ లాబ్ లు అందుబాటులో లేకపోవడం వలన చాలా పరిమితులుండేవి. ఉపోద్ఘాతం ఎక్కువయింది. జ్ఞాపకాల గనిని తవ్వితే అంతే మరి. కనుక అవి మరోసారి. ఇక అసలు విషయంలోకి వస్తే.......

విశ్వనాథ్ గారి మొదటి సినిమా 'ఆత్మగౌరవం ' నుంచీ ఆయన చిత్రాలంటే నాకు ఇష్టంగానే వుండేది. అది వచ్చేటప్పటికి నాకు బాగా చిన్నతనం. కానీ తర్వాత రోజుల్లో వచ్చిన ' శారద ' , ' కాలం మారింది ' , ' ఓ సీత కథ ' , ' సీతామాలక్ష్మి ' లాంటి చిత్రాలన్నీ తప్పక చూసేవాడిని. ఆఖరికి ' శంకరాభరణం ' తర్వాత వచ్చిన ఫక్తు కమర్షియల్ సినిమా ' అల్లుడు పట్టిన భరతం ' తో సహా ! అభిమాన సంఘాలు వగైరాలేవీ పెట్టకపోయినా ఆయన్ని ఏకలవ్య శిష్యుడిగా ఆరాధించేవాడిని. అలాంటిది ఆయన సినిమాకే తొలిసారి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన్ని చూస్తే భక్తిభావం. కొంచెం భయం. కొంచెం బెరుకు. 

అమరావతిలో అప్పట్లో ఇప్పుడున్నన్ని సౌకర్యాలు వుండేవి కావు. అతి చిన్న పట్టణం. కొత్తగా కట్టిన రెండు గెస్ట్ హౌస్ లు మాత్రం వుండేవి. మేం అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో వున్న గ్రామంలో ఓ పెద్ద ఇంట్లో  బస. మా గదిలో మా విభాగంతో బాటు డైరెక్షన్ విభాగం కూడా వుండేవారు. వాళ్ళతో బాటు ఆ చిత్రంలో బాలనటుడు రవికుమార్ ( ఇప్పటి డబ్బింగ్ కళాకారుడు, మరో ప్రముఖ నటుడు, డబ్బింగ్ కళాకారుడు సాయికుమార్ తమ్ముడు ) కూడా వుండేవాడు. 
మేం షూటింగ్ కొచ్చామన్నట్లు వుండేది కాదు. అంతా ఒకే కుటుంబం అన్నట్లు కలిసి మెలిసి వుండేవాళ్ళం. అది ఎప్పటికీ మరచిపోలేని అనుభవం.

ఆరోజు హీరో హీరోయిన్ ల పెళ్ళి సీను చిత్రీకరిస్తున్నారు. సాయింత్రం నరసరావుపేటలో డైరెక్టర్ గారికి సన్మానముందని ఒక గంట ముందుగానే షూటింగ్ పేకప్ చెప్పేసారు. దానికి అయిదు నిముషాల ముందు అసోసియేట్ దర్శకుడు సాయిభాస్కర్ షూటింగ్ అవగానే మీటింగ్ వుందనీ వెళ్ళిపోవద్దని చెప్పారు. 
సరే పేకప్ అయింది. మేము లొకేషన్ వదిలి గెస్ట్ హౌస్ కి బయిలుదేరాం. నడుస్తుండగా వెనుకనుంచి ఎవరో నా వీపు మీద గట్టిగా చరిచారు. వెనక్కి తిరిగాను. సాయిభాస్కర్ , చేతినిండా రంగులతో నవ్వుతూ ' హేపీ హోలీ ' అంటూ నా ప్రక్కనున్న అసిస్టెంట్ డైరెక్టర్ కి రంగు రాయడానికి తిరిగారు. అప్పటికే నా వీపంతా రంగే ! కొత్త షర్టు పాడయిపోయింది. కొంచెం కోపం... కొంచెం బాధ. ఏమనాలో అర్థం కాలేదు. ఆయనతో మామూలుగా మాట్లాడాలంటేనే బెరుకుగా వుండేది. ఎందుకంటే ఆయన చాలా సీనియర్. అప్పటికే పేరు పడ్డ నిర్మాత. పైపెచ్చు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి ఏకైక పుత్రుడు. ఈ కారణాలన్నీ అప్పటి వరకూ ఆయనకు దూరంగానే వుంచాయి మమ్మల్ని. కానీ అప్పుడు ఆయన చిన్న పిల్లాడిలా చేతిలో రంగులతో మా యూనిట్ వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకుని మరీ రంగులు పులిమి శుభాకాంక్షలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడర్థమయింది ఆయన వ్యక్తిత్వం. అప్పటివరకూ జూనియర్స్ అయిన మేము అనుకునే వాళ్లం, విశ్వనాథ్ గారికే గురువైన అంత పెద్ద దర్శకుడి కొడుకు,  హిట్ చిత్రాల నిర్మాత అయిన భాస్కర్ అసోసియేట్ గా ఎందుకు చేరాడా అని. ఏమాత్రం గర్వం లేకుండా, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో కలసి పోయే మనస్తత్వం ఆయనది. మంచి స్నేహశీలి.  

గెస్ట్ హౌస్ చేరుకున్న మాకు అక్కడ ఏర్పాట్లేమిటొ అర్థం కాలేదు. ఏం చెయ్యాలో తోచక నిశ్శబ్దంగా ఓ ప్రక్కగా నిలబడ్డాం. ఎందుకంటే డైరెక్టర్ గారు అక్కడే వున్నారు మరి. కాసేపటికి ఆయన నరసరావు పేట బయిలుదేరి వెళ్ళిపోయారు. ఆయన కారు అలా వెళ్ళిందో లేదో కోలాహలం మొదలయిపోయింది. అప్పటికే మూతలేసి వున్న పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఒక దాని మూత తీసారు కో డైరెక్టర్ నండూరి విజయ్. ఒక మగ్గుతో రంగులు కలిపిన నీళ్ళు తీసి మా మీద పోసారు. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే విజయ్ గారు అలా పోసేసరికి అందరూ హుషారుగా కేరింతలు కొడుతూ రంగు నీళ్ళు చల్లుకోవడం మొదలు పెట్టాం. భయాలు, బెరుకులూ, భేషజాలూ, చిన్నా పెద్దా తారతమ్యాలూ ఏమీ లేకుండా అందరం ఒకళ్ళమీద ఒకళ్ళు రంగు నీళ్లు జల్లుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం....ఒకటే సందడి. మాతో కొందరు వూరివారు కూడా కలిసారు. ఇంతలో ఎవరో ఒక డప్పు తెచ్చారు. నృత్య దర్శకుడు శేషు గారు అది తీసుకుని దరువెయ్యడం మొదలు పెట్టారు. దానికి అందరూ చిందయ్యడం ప్రారంభించాం. పాటలు, డాన్సులు...ఒకటేమిటి....  సందడే సందడి. అలా సుమారు గంట పాటు ఆనంద పారవశ్యంలో మునిగి తేలిన మేం తర్వాత కృష్ణానదిలో అందరం ఒకేసారి స్నానాలు చేసాం. 

హోళీ సంబరం జూనియర్లుగా మాలో వుండే బెరుకుని పోగొట్టడమే కాకుండా మమ్మల్ని స్నేహితులుగా చేసేసింది. సీనియర్లతో మా అనుబంధాన్ని పెంచింది. అప్పుడర్థమయింది ఆ పండుగ విశిష్టత. 

సర్వమానవ సమానత్వం మన సాంప్రదాయాల్లో, సంస్కృతిలో పుష్కలంగా వుంది. మన మాటల్లో వుంది. కానీ మన చేతల్ల్లోనే లేదు మన మనసుల్లోనే లేదు.

సినిమా స్నేహాలు తాత్కాలికమైనవని అంటారు. సినిమా పూర్తయి గుమ్మడికాయ కొట్టేసాక ఎవరికి ఎవరో ! అలాంటిది ఆరోజు మొదలైన మా అనుబంధం చాలా కాలం కొనసాగింది. సాయి భాస్కర్ గారితో కలిసే అవకాశం తర్వాత కాలంలో రాకపోయినా అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్  ' బడి ' సాంబశివరావు, నాకు సీనియర్, ప్రముఖ టీవీ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సయ్యద్ మీర్ మొదలయిన వారు, ముఖ్యంగా కోడైరెక్టర్ నండూరి విజయ్... వీళ్ళందరితో ఇటీవలి వరకూ స్నేహసంబంధాలు కొనసాగుతూనే వున్నాయి. మరీ ముఖ్యంగా నేను దర్శకత్వం వహించిన >టీవీ సీరియల్ కి నా మీద అభిమానంతో నండూరి విజయ్ గారు కోరి వచ్చి మరీ కొన్ని ఎపిసోడ్లకు దర్శకత్వం వహించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిన విషయం. ఆయన విశ్వనాథ్ గారి దగ్గర ' ఓ సీత కథ ' నుంచి ప్రారంభించి అన్ని సినిమాలకు సహాయకుడిగా పనిచేసారు. 

అలా ఆ హోళీ తీపి జ్ఞాపకాల్ని మిగిల్చింది. మంచి స్నేహితుల్ని మిగిల్చింది. మరో హోళీ విశేషం. సరిగ్గా 19 సంవత్సరాల క్రితం 1991 లో హోళీ మార్చి నెల ఒకటవ తేదీన వచ్చింది. అదే రోజు మా పెళ్ళి జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఖచ్చితంగా కాకపోయినా సుమారుగా ఆ రెండూ ( హోళీ, మార్చి 1 ) కలసి వచ్చాయి. కొంతమంది హోళీ ఈ రోజు ( మార్చి 1 ) జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం హోళీ రోజున 'సప్తపది' సంబరం తలుచుకోకుండా ఉండను. ఈసారి నా జ్ఞాపకాల్ని బ్లాగు మిత్రులకు పంచుతున్నాను. ఆ రకంగా ఈ జ్ఞాపకాన్ని గ్రంధస్థం చేసుకుంటున్నాను. మరోసారి హోళీ శుభాకాంక్షలతో......                                              
                                                                                                       ......... స్వ'గతం' 002  



వేసవి ముచ్చట్లు - 01 

వేసవి కాలం వచ్చేసింది. బడికి సెలవలిచ్చేసారు. మాస్టారు అడిగారు - సెలవలకి ఏ ఊరు వెడుతున్నార్రా అని. చాలామంది అమ్మమ్మగారి ఊరు వెడతామని చెప్పారు. నేను కూడా అదే చెబుదామనుకున్నాను. కానీ ఎక్కడకు వెడతామో తెలీదే ! ఏం చెప్పాలి ? ఎప్పుడు బయిల్దేరుతారు ? అక్కడ ఏం చేస్తారు ? - అని కూడా చెప్పేస్తున్నారు పిల్లలందరూ. మరి నాకు మా పెద్దవాళ్ళు ఎక్కడికి తీసుకెడతారో, ఎప్పుడు తీసుకేడతారో అర్థం కాదు. ఒకే ఊరంటే చెప్పెయ్యచ్చు. కానీ అలా కాదే ! 


అమ్మతో అయితే అమ్మమ్మ వాళ్ళ వూరు నర్సాపురం, బామ్మతో అయితే బాబాయి వూరు గుంటూరు, ఇంకా అత్తయ్యల ఊళ్ళు, అవే కాకుండా మావయ్యతో నైతే మా పోలాలున్నశుద్ధ పల్లెటూరు నడవపల్లి..... ఇలా ఏ వూరైనా కావచ్చు. నాకే వూరెళ్ళాలన్నా ఇష్టమే ! కానీ ఒకటే చిక్కు. ఎప్పుడు తీసుకెడతారో తెలీదు. ఎందుకంటే వేసవి కాలం వచ్చిందంటే ఎండలూ, సెలవలతోబాటు  కొత్త ఊరగాయలు కూడా వచ్చేస్తాయి. దానికెంత హడావిడి. అసలే మా ఇల్లు ఎప్పుడూ సందడే సందడి ! వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. వాళ్ళు ఏసమయంలో వచ్చినా అప్పటికప్పుడు కూరలు చేసే అవకాశం లేకపోతే ఆవకాయ వేసి, కమ్మని పెరుగు పోసి అన్నం పెడితే చాలు, వాళ్ళు మహదానంద పడిపోయే వాళ్ళు. మాకు పాడి కూడా సుష్టుగానే వుంటుంది లెండి. 


మా ఇంట్లో ఊరగాయలు పెట్టే కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది . ఆది ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో, మమ్మల్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి తీసుకేడతారో తెలియదాయె ! మరి మాస్టారికి నేనేం చెప్పేది ? అందుకే ' నాకేం తెలీదండీ ! మా నాన్నారు ఎక్కడికి తీసుకేడితే అక్కడికి వెడతాను ' అని బుద్ధిగా చెప్పేసాను. 
సరే ! ఇంటికొచ్చాక అమ్మనడిగాను, ఈ సెలవల్లో ముందు ఎక్కడికి వెడతామని. " ఏమో తెలీదురా ? మీ నాన్న ఇష్టం " అనేసింది అమ్మ.  నా పోరు పడలేక వెళ్లి మీ నాన్ననడుగు అని కూడా అనేసింది. అమ్మ సులువుగానే చెప్పేసింది కానీ నాన్ననడగడమే ! అమ్మో ! నాకు భయం. అందుకే నోరు మూసుకుని సత్యం ఎప్పుడొస్తాడాని ఎదురు చూస్తున్నాను. సత్యమంటే మాకు కూరలు, ఇలా సీజన్లో వచ్చే అన్ని కాయలు, పళ్ళు తెచ్చి పెట్టే మనిషి.  

ప్రతి సంవత్సరం సత్యం ఈ సీజన్లో మామిడికాయల శాంపిల్స్  తేవడం, దాన్ని ఇంట్లో అందరూ పరీక్ష చెయ్యడం, అందరికీ నచ్చాక మాత్రమే మామిడికాయలు తేవడం చేసేవాడు. ఇదంతా వారం నుంచి పది రోజులు పడుతుంది. మరి ఊరగాయలంటే  మాటలా ?  సంవత్సరమంతా నిల్వ వుండాలిగా ! అందుకే అంత జాగ్రత్త. ఆవకాయకైతే తొక్క మందంగా, కండ తక్కువగా, పీచు ఎక్కువగా, టెంక గట్టిగా, ముక్క పుల్లగా వుండాలి. మాగాయ లాంటి వాటికైతే తొక్క పల్చగా, కండ ఎక్కువగా, ముక్క పుల్లగా వుండాలి. ఇన్ని పదునులు కుదిరితేనే అందరూ వప్పుకుంటారు. ఏదైనా కొంచెం తేడా వచ్చినా ఎవరైనా సర్డుకుంటారుగానీ మా నాన్నగారు మాత్రం సర్డుకోరు. అందుకే కాయ ఎంపిక అంత తొందరగా పూర్తయ్యేది కాదు. 

ఈ లోపు మరో ఘాటైన పని. కారాలు సిద్ధం చేసుకోవడం. ఊరగాయకు ప్రశస్తమైన బళ్ళారి మిరపకాయలు వచ్చాయి. అవి దంచడానికి మనుష్యులు కూడా వచ్చారు.  అంటే మామిడికాయ ఎంపిక అయిందన్న మాట. కారాలు దంచుతూండగానే కన్నీళ్ళతో బాటు ( ఘాటుకి ) కాయలు కూడా వచ్చాయి. అంటే మాకు చేతినిండా పని.  కళ్ళకు గంతలు కట్టుకుని తిరిగే ఎద్దున్న గానుగకు వెళ్లి దగ్గర కూర్చుని  అప్పటికప్పుడు ఆడి ఇచ్చే నూనెను తీసుకుని రావాలి. దానికి ఒకరు, కాయ తరగడానికి మరకత్తిపీట తేవడానికి మరొకరు బయిలుదేరాం. మా పేటలో మొత్తం ఇద్దరి ఇళ్లలోనే ఆ మరకత్తిపీటలున్నాయి . ఒకటి గంగాధరం మాస్టారింట్లో - మా వెనుక వీధిలో, మరోటి  సుబ్బారావు గారింట్లో  - మాకు ముందు రెండ్లో ఇల్లే ! ఎవరి కత్తిపీట ఖాళీగా వుందో ! ఈ సీజన్లో  మా పేట పేటంతా ముందే బుకింగ్ చేసేసుకుంటారు. అందుకని ఈ రోజు ఆ పీట ఎవరి ఇంట్లో వుందో వాళ్ళింటి  దగ్గర కాపలా వెయ్యాలి. మొత్తానికి సాధించి పట్టుకొస్తే పెద్దవాళ్లందరూ  మామిడి కాయలు తరగడం మొదలుపెట్టారు. మేము తరిగిన ముక్కల్లో జీడి తియ్యడం, కడిగిన మామిడికాయల్ని శుభ్రంగా తుడవడం లాంటి చిన్న చిన్న పనులు హుషారుగా చేసేస్తున్నాం.  

నూనె వచ్చేసింది. కారాలు దంచడం అయిపొయింది. ఆవపొడి, మెంతులు వగైరాలన్నీ కూడా దంచేసారు పని మనుష్యులు పాటలు పాడుకుంటూ, ఊసులు చెప్పుకుంటూ. ఈ లోపు ముక్కలు తయారు. ఇక బామ్మ రంగంలోకి దిగింది. ఇక ఎవ్వరూ ఆ వస్తువులను ముట్టుకోకూడదు. అందరూ ముట్టుకుంటే నిల్వ వుండవట. ఆవిడే పాళ్ళు కలిపింది. ఆ గుండంతా జాడీలలోకి ఎత్తింది. అమ్మ, పిన్ని వాళ్ళ పని కావలసినవి ఆవిడకు అందివ్వడమే ! వాళ్ళు  పాళ్ళు కలపడానికి కూడా బామ్మ  ఒప్పుకోదు. జాడీల్లో పెట్టాక, వాటికి మూతలు బిగించి కట్టాక అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం అయిపోతే ఇక మా వేసవి ప్రయాణం గురించి ఆలోచించడం మొదలుపెడతారన్నమాట. 
ఇక ప్రయాణానికి సిద్ధం కావాలి మరి..... మా వేసవి ప్రయాణ విశేషాలు మళ్ళీ చెబుతానే ..... !          

                                     రక్తకన్నీరు - ఓ జ్ఞాపకం                                                                

1970 ప్రాంతాల్లో పదవతరగతి చదివే రోజుల్లో మా వూళ్ళో రక్తకన్నీరు నాటక ప్రదర్శన ఏర్పాటయింది. అప్పటికే బుద్ధిమంతుడు, కథానాయకుడు లాంటి చిత్రాల్లో నాగభూషణంగారు చేసిన విలన్ పాత్రల ప్రభావం మా మిత్రబృందం మీద చాలా వుండేది. పైగా రక్తకన్నీరు నాటకం గురించి విని వుండడం, ఆ నాటక ప్రదర్శన ప్రచారంలో నాగభూషణం సంభాషణలను అదే రీతిలో పలుకడం ( ఆ ప్రచారం చేసిన అతని పేరు చౌదరి అని గుర్తు ) మా ఆసక్తిని మరింత పెంచాయి.  ఎలాగైనా ఆ నాటకం చూడాలి. కానీ ఎలా ? ఇంట్లో నాటకం చూస్తానంటే వప్పుకోరే ! టికెట్ కొనాలంటే డబ్బులివ్వడం మాట అలా వుంచి ఇల్లు కదలనివ్వకపోతే..... ? అందుకే ఇంటి దగ్గర చెప్పే ప్రశ్న లేదు. 
   
రోజూ ట్యూషన్ కి సుమారు రెండు కిలోమీటర్లు వెళ్ళవలసి వుండేది. ఆ రోజు మాస్టారికి ఏదో చెప్పి ట్యూషన్ నుంచి త్వరగా ముగ్గురు మిత్రులం బయిటపడ్డాం. ప్రదర్శన జరిగే ప్రాంతానికి చేరుకున్నాం. ఒక సినిమా థియేటర్ వెనుక ఖాళీ స్థలంలో చుట్టూ బారికేడ్లు, తడకలు కట్టి ఏర్పాటు చేసిన రంగస్థలం. లోపల జనం కిటకిటలాడుతున్నారు. పోలీసులు చుట్టూ కాపలా వున్నారు. నాటకం ప్రారంభమైంది. నాగభూషణం రంగస్థలం మీదకు రాగానే లోపల ఒకటే సందడి. ఆయన డైలాగ్ లు వినబడుతున్నాయి. మాకు ఆత్రం ఆగడం లేదు. ఎలాగైనా లోపలి వెళ్లాలని  దారి కోసం చుట్టూ తిరిగాం. ఉహు( ! లాభం లేదు. ఎక్కడా దారి కనబడలేదు. వెతగ్గా, వెతగ్గా ఒకచోట రెండు తడకల మధ్య కొద్దిగా ఖాళీ కనబడింది. అంతే ! అక్కడ సెటిల్ అయ్యాం. అక్కడ కొంచెం ఖాళీలోంచి వంతుల వారీగా చూడడం ప్రారంబించాం. రంగస్థలం పూర్తిగా కనబడేది కాదు. మధ్య మధ్యలో ఎవరోఒకరు అడ్డు వచ్చేవారు. అయినా అలాగే కొంతసేపు ప్రయత్నించాం. ఇంతలో లోపలేదో కలకలం. మాకు అడ్డంగా చాలామంది నిలబడ్డారు. దాంతో కనిపించేది కాస్తా కనిపించడం మానేసింది. టికెట్లు కొన్నవారి సీట్లు ఫ్రీ పాసులు మీద వచ్చిన వారు ఆక్రమించడంపై నాగభూషణం విసుర్లతో నిర్వాహకులు అప్రమత్తమై పాసుల వాళ్ళను లేపడం ఆ కలకలానికి కారణం. వాళ్ళందరూ ఆ తడికేలను ఆనుకుని నిలుచోవడం మాకు కనబడకుండా చెయ్యడం మేము నిరాశతో వెనుదిరగడానికి కారణం. అయినా అ గోలలో అప్పుడప్పుడు వినబడే డైలాగ్ ల కోసం చాలాసేపు అక్కడే తచ్చాడుతూ వున్నాం ! ఇదీ నా రక్త కన్నీరు జ్ఞాపకం. 

తర్వాత రోజుల్లో ఆయన నటించిన సింగిల్ ఎపిసోడ్ కు  పనిచేసే భాగ్యం కలగడం నా అదృష్టం. 


 
  వేసవి ముచ్చట్లు - 02 

వేసవి వచ్చిందంటే ముందుగా సెలవలు. ఆ తర్వాత ప్రయాణాలు. సాధారణంగా మొదటి మజిలీ ఎపుడూ అమ్మమ్మ ఇంటికే ! మా అమ్మమ్మగారి వూరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఊరిని ఆనుకుని ప్రవహించే వశిష్ట గోదావరి. అల్లంత దూరాన ఆ గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతం. దానికి ఆవల ఒడ్డే ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది. అక్కడకు వెళ్ళాలంటే చిన్నప్పుడు మా సరదా అంతా గోదావరి నదిని పడవలో దాటి వెళ్ళడం. 

ప్రస్తుతం వశిష్ట మీద సిద్దాంతం, చించినాడల దగ్గర, గౌతమి మీద ఆలమూరు, యానాంల దగ్గర వున్న వంతెనలు అప్పట్లో లేవు. కోనసీమ నుండి రాజమండ్రి  వెళ్ళాలంటే బొబ్బర్లంక వరకు బస్సు మీద వెళ్ళి అక్కడ నుంచి లాంచిలో గోదావరి ప్రయాణం చేసి వెళ్ళాలి. కాకినాడ వెళ్ళాలంటే కోటిపల్లి లేదా ఎదుర్లంక రేవులు దాటి వెళ్ళాలి. అలాగే నరసాపురం వెళ్ళాలంటే సఖినేటిపల్లి దగ్గర వశిష్టను దాటి వెళ్ళాలి. 

అప్పుట్లో కోనసీమలో అన్నీ ప్రైవేటు బస్సులే ! వాటి సంఖ్య కూడా తక్కువగానే వుండేవి. బస్టాండుకి వెడితే మనక్కావల్సిన బస్ వచ్చిందా లేదా, వస్తే ఎక్కడుందీ అని వెతుక్కోవల్సిన పని లేదు. అలాగని అక్కడ సమాచార కేంద్రము వుండేది కాదు. పి. ఏ . సిస్టం కూడా వుండేది కాదు. అసలు స్టేషన్ మేనేజర్, కంట్రోలర్, ట్రాఫిక్ ఇనస్పెక్టర్ లాంటి వారెవరూ వుండేవారు కారు. కానీ వీటన్నిటికీ కలిపి ఒక వ్యక్తి వుండేవాడు. అతనే బస్సులు ఏవి ఎప్పుడు వస్తున్నదీ, ఎప్పుడు బయిల్దేరుతున్నదీ పెద్దగా అరిచి చెప్పేవాడు. అందుకని అతను కంట్రోలర్ కం అనౌన్సర్. ఎవరైనా చదువురాని వాళ్ళు, వికలాంగులు, వృద్ధులు వస్తే వాళ్ళెక్కవలసిన బస్ దగ్గరకి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఎక్కించి, కండక్టర్, డ్రైవర్లకు జాగ్రత్తలు చెప్పి పంపేవాడు. ఇంకా స్త్రీలకు, పిల్లలకు లగేజీలను బస్సులోకి ఎక్కించడంలోను, వారికోసం బస్సును ఆపడంలోను సహాయపడేవాడు.     

ఇక బస్సెక్కితే సుమారు నాలుగు గంటల పైన ప్రయాణం తర్వాత సఖినేటిపల్లి  చేరుకునేవాళ్ళం. మధ్యలో గన్నవరం వద్ద గోదావరికి మరోపాయ అయిన వైనతేయం పైన కాటన్ దొర కట్టించిన ఆక్విడెట్ వంతెన మీద నుంచి వెడుతుంటే పైన కాలువ, క్రింద గోదావరి ప్రవహించడాన్ని చూడటం అప్పట్లో మాకదో వింత. క్రిందనున్న నీళ్ళు పైకి ఎలా వచ్చాయో అర్థమయ్యేది కాదు. 

సఖినేటిపల్లి చేరుకున్నాక అక్కడ రెండురకాల పడవలు వుండేవి. వాటిని రేవు పడవలు, పై పడవలు అనేవారు. ఇందులో రేవు నావలంటే ఎవరైనా టికెట్టు తీసుకుని ఎక్కవచ్చు. పై నావలంటే మనకోసం ప్రత్యేకంగా కొంత ఎక్కువ రుసుము తీసుకుని ఏర్పాటు చేసుకునేవి. రేవు నావ ఎక్కితే మనం మినీ భారతదేశం చూసేసినట్లే ! అందులో రకరకాల మనుష్యులు, జంతువులు, వాహనాలు.... ఒకటేమిటి అన్నీ వుండేవి. అవతలివొడ్డైన నరసాపురం చేరడానికి గాలి వాలుగా వున్నపుడు సుమారు 20 నిముషాలు పట్టేది. గాలి వాలు లేకపోతే సుమారు రెట్టింపు సమయం పట్టేది. అలాగే సముద్రానికి దగ్గరలో వుండటం వలన ఆటు పోట్లే ప్రయాణాన్ని ప్రభావితం చేసేవి. ఈలోపు అనేక రకాల పలకరింపులు, చర్చలు వగైరాలెన్నో జరిగిపోయేవి. అవతలివొడ్దు చేరాక అక్కడ జట్కాలు, సైకిల్ రిక్షాలు, ఒక్కోసారి ఒంటెద్దు బళ్ళు వగైరాలుండేవి.  వాటిని చూడగానే ఆనందంలో తేలిపోయేవాళ్ళం. అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోయినట్లేననే భావన మమ్మల్ని నిలబడనిచ్చేది కాదు. అక్కడ అందుబాటులో వున్న వాహనం ఎక్కి కూర్చొనేవాళ్ళం. 

ఇక అమ్మమ్మ వాళ్ళింట్లో... ................  ఆ ముచ్చట్లు మరోసారి !


వేసవి ముచ్చట్లు - 03


గోదావరి లాంటి అమ్మమ్మ ఆప్యాయత, వశిష్టుడిలాంటి తాతయ్య అనురాగం, పిన్నిల అభిమానం  కలగలిపిన ఆ ఇల్లంటే నాకెంతో ఇష్టం. నల్లని నాపరాయితో పెద్ద పెద్ద అరుగులు, వేసవిలో చల్లదనాన్నిచ్చే పెద్ద పెంకుటిల్లు. సిమెంటు, కాంక్రీటులు కాకుండా మట్టితో కట్టిన గోడలు ఎండ వేడికి సవాల్. మేము వెళ్ళేటప్పటికి మాకోసం జంతికలు, చేగోడీలు వగైరా ఎన్నో రకాల చిరుతిళ్ళు సిద్ధం చేసి పెట్టేది అమ్మమ్మ. అయినా రోజూ తాతయ్య బయిటనుంచి వచ్చేటపుడు తెచ్చే బేకరీ బిస్కట్లకోసం, జిలేబీకోసం ఎదురుచూసేవాళ్ళం. 

తాతయ్య పందిరి పట్టె మంచం మాకు అనేక రకాల ఆటలకు నెలవయ్యేది. దాని మీద బస్సు నడిపేసేవాళ్ళం. దుకాణం నడిపేసేవాళ్ళం. ఆఖరికి మా డాన్సులు, పాటకచేరీలకు అదే వేదిక. ఎండ సమయంలో పెద్దవాళ్ళందరూ భోజనాలు చేసి నిద్రపోతుంటే మేము చల్లగా జారుకుని ప్రక్కింటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ ఇంట్లో జామచెట్లు వుండేవి. కాయలు తియ్యగా వుండేవి. అవి కోసుకుని తింటూ కబుర్లు చెప్పుకుంటూ, ఆ చెట్ల కింద ఆడుకుంటూ గడిపేవాళ్ళం. మధ్యాహ్నం పెద్దవాళ్ళు లేచే సమయానికి ఇల్లు చేరుకుని వాళ్ళేసిన చివాట్లు తిని, పేచీలు పెట్టి డబ్బులు తీసుకుని పక్కనే వున్న పాత బజారులోకి వెళ్ళి వేరుశెనగలు, పుల్ల ఐస్ లు వగైరా చిరుతిళ్ళు కొ్నుక్కుని తినేవాళ్ళం. దగ్గరలోనే ముక్కోణపు ఆకారంలో ఒక ఆటస్థలం లాంటిది వుండేది. అక్కడ సిమెంటు జారుడుబల్ల వగైరాలుండేవి. ఒక్కోరోజు సాయింత్రం అక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. మరోరోజు కొంచెం దూరంలోని పార్కుకెళ్ళేవాళ్ళం. పాతబజారుకెళ్ళే  దారిలో ఒక చిన్న, పాత గుడి వుండేది. దాని తలుపులు ఎప్పుడూ తెరిచేవారు కాదు. పాతబజారుకి వెళ్ళి వచ్చేటపుడు, పార్కుకి వెళ్ళివచ్చేటపుడు ఆ గుడి తలుపుకి ఎప్పుడూ వేలాడుతూ వుండే తాళం కప్పను గంటలా మోగించి, దణ్ణం పెట్టుకుని రావడం ఓ అలవాటుగా మారిపోయింది. 
 
ప్రతి మనిషికీ భవిష్యత్తులో ఏర్పడే అభిరుచులు, ఇష్టాలకీ బీజాలు చిన్నతనంలో వుంటాయేమో ! బాగా చిన్నతనంలో అంటే సుమారు ఏడెనిమిది సంవత్సరాల వయసులో జరిగిన ఓ సంఘటన నా జీవితంలో సినిమా అభిరుచి కలగడానికి దోహదపడిందేమోనని ఇప్పటికీ అనుకుంటూ వుంటాను. ఓ రోజు బయిట ఎండ మండిపోతోంది. మేము పెద్దవాళ్ళు ఎప్పుడు పడుకుంటారా, ఎప్పుడు బయిట పడదామా అని ఎదురు చూస్తున్నాము. ఇంతలో ఆ వీధిలోనే వున్న మా తాతగారికి వరసకు తమ్ముడైన ఇంకో తాతగారింట్లో సినిమా వేస్తున్నారని ఎవరో చెప్పగా అక్కడికి పరుగుపెట్టాం. అక్కడకెళ్ళేటప్పటికి తలుపులు మూసి వున్నాయి. బయిట రోడ్డుమీద ఒక కుర్రాడు అద్దం పట్టుకుని అటూయిటూ కదుపుతూ వున్నాడు. లోపలినుంచి ఎవరో అరుస్తున్నారు. మేము నెమ్మదిగా తలుపు తోసుకుని లోపలకి వెళ్ళాం. లోపలంతా చీకటి. ఒక్కసారిగా లోపలున్న అందరూ అరిచారు, తలుపు వేసెయ్యమని. వేసేసి లోపలకి వెళ్ళేటప్పటికి మసకమసకగా గోడ మీద ఏదో బొమ్మ కనబడింది. కాసేపటికి అది స్పష్టంగా కనబడింది. నిజమే అది సినిమాలోదే ! మళ్ళీ కాసేపటికి అది మసక అవడం, కిటికీ దగ్గరున్న శర్మ మావయ్య ( ఆ తాతయ్య కొడుకు ) అద్దం సరిగా పెట్టరా అని గాఠిగా అరవడం, ఆ వెంటనే బొమ్మ స్పష్టంగా కనబడటం...... ఇదంతా మాకేదో వింతగా కనబడింది.  పెద్ద సినిమా హాల్లో సినిమా చూడటం తెలుసు గానీ ఇంట్లోనే సినిమా వేసేసుకోవచ్చునని అప్పుడే అర్థమయింది. కాకపోతే హాల్లో సినిమాలో బొమ్మలు కదులుతాయి, మాట్లాడుతాయి, పాటలు పాడుతాయి. ఇంట్లో సినిమాలోని బొమ్మలు కదలవు, మెదలవు, మాట్లాడవు కూడా ! అయినా అదో ఆనందం. అసలీ శర్మ మావయ్య తనింట్లోకి సినిమానెలా తీసుకురాగలిగాడా అని సందేహం కలిగింది నాకు. ( ఇంతకీ ఈ శర్మ మావయ్య తర్వాత రోజుల్లో మొన్నటివరకూ మెగాస్టార్, నేటి రాజకీయ నాయకుడు చిరంజీవికి డిగ్రీలో క్లాస్ మేట్, ఇద్దరూ మంచి స్నేహితులు ) విషయమేమిటో తెలుసుకోవాలనుకున్నాను. కొంతసేపటికి మావయ్య దగ్గరున్న ఫిలిం ముక్కలు అయిపోయాయి. సినిమా అయిపోయిందన్నాడు. అందరూ బయిటకెళ్ళి పోతున్నారు. నేను మాత్రం శర్మ మావయ్య అవన్నీ సర్దుకుంటుంటే అక్కడేవుండి పరిశీలించడం మొదలుపెట్టాను. కిటికీకి ఒక రెక్క మాత్రం తెరిచి మరో రెక్క మూసి వుంచాడు. దానికి పైనా, కిందా తుండు గుడ్డలు, దుప్పట్లతో మూసివేసి మధ్యలో మాత్రం ఒక అట్టను పెట్టాడు. దానికి ఫిలిం ముక్క పట్టేటంత రంధ్రం చేసాడు. బయిట ఒక స్టూలు మీద అద్దం వుంచి దాంతో ఎండ వెలుతురును ఆ రంధ్రం మీద పడేటట్లు ఏర్పాటు చేసాడు. ఎండ వాలు మారినప్పుడల్లా దాన్ని సరిచెయ్యడానికి ఒకణ్ణి అక్కడుంచాడు. ఇక ఆ రంధ్రంలో ఫిలిం ముక్క పెట్టి దాని ముందు ఒక భూతద్దాన్ని పెట్టేవాడు. దాంతో ఆ ఫిలింలోని బొమ్మ గోడమీద పెద్దగా కనబడేది. భూతద్దం వుండాల్సిన ప్రదేశం నుంచి జరిగినపుడు అలుక్కుపోయినట్లు, ఎండ వాలు మారినప్పుడు కాంతి తగ్గి మసకగా కనబడేది. ఇదేదో బాగుందనిపించి అప్పట్నుంచి కొన్ని సంవత్సరాల పాటు ప్రతీ వేసవి సెలవలకీ ఈ ప్రయోగం మాయింట్లో చెయ్యడం ప్రారంభించాను. పట్టువదలని విక్రమార్కునిలా చేసి చేసి మెల్ల మెల్లగా దాంట్లో  అభివృద్ధి సాధించి పది సంవత్సరాల వయసుకి ఒక డబ్బాలో భూతద్దాన్ని ఏర్పాటు చేసి, ఫిలిం రీలుని రెండు పుల్లలకి చుట్టి వాటిని తిప్పుతూ బొమ్మల్ని కదిలించే స్థితికి చేరుకున్నాను. అంటే అయిదోతరగతి చదివే రోజుల్లోనే ఒక మినీ సైలెంటు ప్రొజెక్టరు ని స్వయంగా తయారుచేసానన్నమాట. తర్వాత రోజుల్లో వార పత్రికలలో ప్రకటనలొచ్చేవి ' హోం ప్రొజెక్టర్ ' అని. అవి చూసి కొనుక్కోవాలనుకున్నాను. కానీ పెద్దవాళ్ళను అడిగేందుకు ధైర్యం చెయ్యలేకపోయాను. నేను ఎనిమిదో తరగతిలో వున్నపుడనుకుంటాను. నా మితృడొకడు దానికి డబ్బులు కట్టి తెప్పించాడు. అది చూసిన నేను కొనకపోవడం మంచిపనే చేసానని సంతోషించాను. ఎందుకంటే డబ్బా డాబు తప్ప నేను అట్టపెట్టెతో తయారు చేసిన దానికి, కొన్న దానికి పెద్ద తేడా ఏమీ లేదు, ఖర్చులో తప్ప.

అలాగే మన భవిష్యత్తు అభిరుచులకి, ఇష్టాలకి బీజం పడడానికి మనకిష్టమైన వ్యక్తుల ప్రభావం కూడా వుంటుంది. మా మూడో పిన్ని ప్రభావం నా అభిరుచుల మీద చాలా వుందనుకుంటాను. ఆమె నాట్యకళాకారిణి, లలిత సంగీత కళాకారిణి. కుటుంబ బాధ్యతలతో కొన్నేళ్ళుగా వాటన్నిటికీ దూరంగా వున్నా నా చిన్నతనంలో మాత్రం ఆమె ప్రభావం చాలా ఎక్కువగా వుండేది. నేను కళాకారుణ్ణి కాకపోయినా కళల పట్ల మక్కువ ఎక్కువ పెంచుకోవడానికి ఇదే కారణమయిందనుకుంటాను. తర్వాత రోజుల్లో నృత్య ప్రదర్శనలు, సంగీత కచేరీలు, నాటక ప్రదర్శనలు, చిత్రకళా ప్రదర్శనలు ఎక్కడ జరిగినా హాజరు కావడం, కాలేజీ స్థాయికొచ్చాక, ఆ తర్వాత అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గోవడం వీటన్నిటికీ ఆమె ప్రభావమేననుకుంటాను. 

.......................... ఆ విశేషాలు మరోసారి.    


వేసవి ముచ్చట్లు - 04

బాల రామాయణం - 1

వేసవి కాలం ప్రవేశించిందనగానే ముందుగా గుర్తుకొచ్చేది ప్రయాణాలు. ఆ సరదా ఓ ప్రక్క, మిత్రుల్ని ఓ రెండు నెల్లపాటు విడిచి వుండాలంటే బెంగ మరో ప్రక్కా ! ప్రస్తుతమున్న స్కూల్  విడిచి పెట్టి కొత్త స్కూల్ కి వెళ్ళేటప్పుడయితే ఈ బెంగ ఇంకా ఎక్కువ వుంటుంది. ఇప్పటి రోజుల్లో స్కూల్ నచ్చకపోతే / ఊరు మారితే ఏమో గానీ, నర్సరీనుంచి 10 వ తరగతి పూర్తయ్యేవరకూ ఒకే స్కూలూ, ఒకే బస్సు / ఆటో , ఒకే డ్రెస్సూ . కానీ మా చిన్నతనంలో మాత్రం ప్రైమరీ స్కూల్ అయితే హైస్కూల్  ( సాధారణంగా ఒక మాదిరి ఊళ్ళో ఒకటే హైస్కూల్  వుండేది ) లోకి వెళ్ళేవాళ్ళం.  అక్కడ కూడా సాధారణంగా ఇదే మిత్రబృందం. పెద్దగా మార్పులేమీ వుండేవికావు. అయినా 5 వ తరగతి పూర్తయ్యాక ఏదో బెంగ . ఆ బెంగలోంచే కొన్ని విచిత్రమైన ఆలోచనలు పుట్టుకొస్తాయి. కొన్ని వింత పనులు కూడా చేస్తాము. 
మా చిన్నప్పుడు మా పేటలో ప్రతి సంవత్సరం వినాయక చవితికి గణపతి నవరాత్రులు, విజయదశమికి దేవీ నవరాత్రులు చేసేవారు. మా ఊళ్ళో ఇవి చాలా ప్రాంతాల్లో చేసినా రెండూ కలిపి ఒకే ప్రాంతంలో చెయ్యడం మా పేట ప్రత్యేకత. నిజానికి మా పేట ఒక చిన్న లౌకిక రాజ్యమని చెప్పాలి.  అన్ని రకాల కులాలు, మతాల వారు కలసిమెలసి వుండేవారు. మా ఊళ్ళో రెండు కులాలకి ఆజన్మ వైరం. ఎప్పుడూ గొడవలు, అప్పుడప్పుడు హత్యలు జరుగుతుండేవి. అలాంటిది మా పేటలో మాత్రం ఆ రెండు కులాలు ప్రక్కప్రక్కనే కలసి జీవించేవారు. ఎక్కడ గొడవలు జరిగినా ఇక్కడ మాత్రం సామరస్యంగానే వుండేవారు. ఆ సామరస్యానికి ఈ ఉత్సవాలు వేదికలుగా వుండేవి. ఆ ఉత్సవాల్లో హరికథలు, బుర్రకథలతో బాటు పౌరాణిక నాటక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసేవారు.  వాటిని చిన్నప్పట్నుంచీ క్రమం తప్పక చూసేవాళ్ళం. అప్పుడు టీవీలు, కంప్యూటర్లు లేవు కదా , ఇల్లు కదలకుండా అతుక్కు పోవడానికి. ఊళ్ళో పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నా చిన్నతనం కాబట్టి అంతదూరం పంపేవారు కాదు. కానీ పేటలో కార్యక్రమాలకు అంతగా అభ్యంతరం చెప్పేవారు కాదు.  ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే మా అయిదో తరగతి పూర్తయ్యాక మేం చేసిన ఘనకార్యానికి ఇది నాంది కాబట్టి. 

అయిదో తరగతి పూర్తయి అందరూ విడిపోతామనుకుంటే  మాకు బాధ కలిగింది. అందుకే అందరం కలిసి ఏం చెయ్యాలా అని గాఠిగా ఆలోచించాం ! చివరికి నాటకం వేద్దామని నిర్ణయించాం. సరే ఏం నాటకం ? బాగా ఆలోచిస్తే మా హెడ్మాస్టారు చాలా ఆసక్తికరంగా చెప్పే ' రామాయణం ' కథే నాటకంగా వేద్దామనుకున్నాం. నాటకం వేయడం వెనుక వున్న పద్ధతులు అవీ మాకేమైనా తెలుసా ! పాడా  ! స్క్రిప్టు అనేదొకటి వుంటుందని మాకేమైనా తెలుసా ? ఇప్పుడడుగుతున్నా అసలు రామాయణం, భారతాలకు ప్రత్యేకంగా స్క్రిప్టు అవసరమంటారా ? అందులో  మా మాస్టారు అత్యంత నాటకీయ ఫక్కీలో రామాయణాన్ని వర్ణించి చెప్పేవారు. అది పూర్తిగా మా మనస్సులలో నాటుకుపోయింది. మేం చూసిన నాటకాల ప్రభావం మాకు వేష ధారణల మీద అవగాహన కలిగించాయి. అంతే అట్టలతో కిరీటాలు, కత్తులు, గదలూ తయారైపోయాయి. వాటికి తళుకు రేకులు అనే మెరిసే రంగుల కాగితాలతో అలంకరించాం ! రిహార్సల్సా ? అంటే ఏమిటి ? అదొకటుంటుందా ? అలాంటివేమీ తెలియనితనం. కానీ ప్రేక్షకులను రప్పించాలంటa ఏం చెయ్యాలో మాత్రం తెలుసు. అదెలా అంటారా ? మా వూళ్ళో ఏదైనా సినిమా విడుదలయిందనుకోండి. పెద్ద స్పీకర్లలో పాటలు పెట్టుకుని సినిమా బళ్ళు వస్తాయి. వాటిలోంచి పేపర్లు ( కరపత్రాలు ) విసురుతుంటారు. అవి మేం ఏరుకుని దాచుకునే వాళ్ళం. వాటిని సేకరించడంతో ప్రారంభమైన పుస్తకాలు, పేపర్ల సేకరణ హాబీ ఇప్పటి వరకూ వదల్లేదు. అలాగే ఊళ్ళో ఉత్సవాలకు కూడా కరపత్రాలేసి ఆహ్వానించడం మామూలే ! అందుకే మేం కూడా కరపత్రాలు పంచాలని నిర్ణయించాం ! మరి వాటి ముద్రణ ఎలా ? అర్థం కాలేదు. అందుకే మేమొక పథకం వేసాం ! అదేమిటంటే మేమందరం కూర్చుని తెల్లకాగితాలు చింపి కార్బన్ కాగితాలు పెట్టి చేతితోనే రాయడం మొదలు పెట్టాం ! మరి వాటి పంపిణీ ఎలా ? మాకు బండి లేదు. మైకు లేదు. అందుకే ఆ కాగితాల్ని పట్టుకుని మేమే ' రేపు మా స్కూల్లో రామాయణం గొప్ప నాటకం. నేడే చూడండి. ( రేపంటూ నేడే చూడమనడం ఏమిటని అడక్కండి. సినిమా బండిలో వాడు అలాగే అంటాడు ) ' అంటూ అరుచుకుంటూ  మేం అనుకున్న తేదీకి ముందు రోజు  మా నాలుగు వీధులు  కాగితాల్ని ఎగరేస్తూ  పరుగులెత్తాం. అమ్మయ్య ప్రచారం అయిపోయింది. ఇక మా ఏర్పాట్లన్నీ పూర్తయినట్లే ! అట్ట కిరీటాలు వగైరా, కర్రలతో విల్లులు, పుల్లలతో బాణాలు కూడా తయారైపోయాయి. ఇక డ్రెస్సులు మాత్రం ఎలా దొరుకుతాయో అర్థం కాలేదు. అందుకే మాకున్న మంచి డ్రెస్సుల్ని ఏరి పెట్టుకున్నాం ! ప్రదర్శన రోజు వచ్చింది. 

..................... మా ప్రదర్శన ఎలా జరిగిందంటారా ! ఆగండి మరి. తొందరపడకండి. మరో సారి ఆ విశేషాలు . 

 స్వ' గతం ' - ఓ మనవి 


ప్రతి మనిషికీ జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలుంటాయి. కొంతమంది అవి డైరీలలో రాసుకుని పదిలపరుచుకుంటారు. మరి కొందరు వాటిని తమ మనసులోనే దాచుకుంటారు. ఈ రెండవ కోవకు చెందిన వాణ్ణి నేను. చిన్నప్పట్నుంచీ ప్రతి కొత్తసంవత్సరంలోను డైరీలు సేకరించడం, మొదట్లో ఆర్భాటంగా కొన్నాళ్ళు రాయడం, తర్వాత భద్రంగా లోపల దాచడం అలవాటై పోయింది. 



ఏ వ్యక్తికైనా తర్వాత కాలంలో గత జ్ఞాపకాల్ని తవ్వుకుని నెమరు వేసుకోవడం ఓ తియ్యని అనుభూతి. ఆనందకరమైన విషయాలే కాదు ఒక్కోసారి బాధాకరమైన సంఘటనలు కూడా తదనంతర కాలంలో మనల్ని పలకరిస్తాయి. కొన్ని జ్ఞాపకాలు మనకి మధురానుభూతుల్ని పంచితే మరికొన్ని గతానుభవాలు భవిష్యత్తు సమస్యల పరిష్కారంలో సహకరిస్తాయి. మనకే కాదు మన తర్వాత తరం వారికి కూడా ఇవి మార్గదర్శకాలవుతాయి. ముఖ్యంగా జీవిత చరమాంకంలో ఆ జ్ఞాపకాలే మనకి ప్రధానమైన తోడూ - నీడా !  

ఎంతటి ఆరోగ్యవంతుడికైనా వయసు పెరిగే కొద్దీ మరుపు సహజంగా వస్తుంది. దాంతో కొన్ని తీయని జ్ఞాపకాలు మన మది పొరల్లోంచి తియ్యలేనివై పోతాయి. అందుకే డైరీ రాసే అలవాటు సరిగా లేని నేను చిన్నప్పట్నుంచీ నా అనుభవాల్నీ, అనుభూతుల్నీ ఇప్పటికైనా గ్రంథస్థం చెయ్యాలని అనుకున్నాను. అనుకున్నదే తడవుగా శిరాకదంబం లో స్వ' గతం ' అనే పేజీని ప్రారంభించి రాయడం మొదలు పెట్టాను. కొన్ని రాసాక చిన్నగా జ్ఞానోదయం లాంటిది అయింది. ఇవి పూర్తిగా నా వ్యక్తిగతం అంటే నాకు సంబంధించిన సొంత సొద. బ్లాగులో ప్రధానంగా నేను సేకరించి పెట్టుకున్న రకరకాల సమాచారం ఇస్తున్నాను. అది ఎవరి వ్యక్తిగత అభిరుచుల్ని బట్టి వాళ్ళకి ఆసక్తి గా వుండొచ్చు. కానీ నా సొంత సొద ఎవరికి ఆసక్తిగా వుంటుందీ...........? అని.  అయితే మరి కొంతమంది మిత్రులు చదివినట్లు, వాళ్ళకి నచ్చినట్లు దాఖలాగా వారి వ్యాఖ్యలున్నాయి. ఆ( ...... ఏదో మొహమాటానికి రాసుంటార్లే ... అనిపించింది. అందుకే గత కొంతకాలంగా మళ్ళీ ఏమీ రాయలేదు. వేసవికాలంలో ప్రారంభించి కొన్ని విశేషాలు రాసి, బాలరామాయణాన్ని సగంలో ఆపేశాను. 

కానీ శిరాకదంబం వార్షికోత్సవం తర్వాత కొందరు మిత్రుల వ్యాఖ్యలు చూస్తే నా సొద కూడా ఆసక్తి గానే వుందని అర్థమైంది. అలాగే అంతకుముందు వ్యాఖ్యలు రాసిన మిత్రులు మొహమాటానికి రాయలేదనీ, మనస్పూర్తిగానే రాసారని అర్థమైంది. అయితే అప్పుడే నాకు నిజమైన జ్ఞానోదయం అయిందని చెప్పొచ్చు.  అదేమిటంటే ఈ విశేషాలు బ్లాగు ప్రధాన పేజీలో కాకుండా వేరే పేజీలో రాయడం వలన చాలామంది దృష్టికి రాలేదని. 

ఇవి నా వ్యక్తిగత విశేషాలు. అవి ప్రధాన స్రవంతిలో కలపడం సరైంది కాదేమో ! అందుకే ఈ స్వ ' గతం ' పేజీలోనే కొనసాగిస్తాను. వీలైనప్పుడల్లా రాస్తాను. ప్రచురించిన ప్రతిసారి ప్రధాన పేజీ (Home  / ఇల్లు ) లో ఆ విషయం తెలియ పరుస్తాను. వీటిల్లో కొందరికి నచ్చేవి వుంటాయి....నచ్చనివి వుంటాయి. చదివి మీ అనుభూతుల్ని పంచుకుంటారని ఆశిస్తూ...

26 - 08 - 2010 at 2-00 a.m.



శారదా / దేవీ నవరాత్రులు

నాకు ఊహ తెలిసినప్పట్నుంచి పరిశీలిస్తే మా వూళ్ళో వినాయక చవితికి నవరాత్రి ఉత్సవాల సందడి ఎక్కువ. ఇంచుమించుగా ప్రతి పేటలోను ఒక పందిరి వుండేది. వినాయక చవితితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఊరంతా కోలాహలంగా వుండేది. అప్పట్లో ఇలాంటి ఉత్సవాల్లో సాధారణంగా పౌరాణిక పద్య నాటకాలు, హరికథలు, బుర్రకథలు, కూచిపూడి భరతనాట్యాలు, తోలు బొమ్మలాటలు వగైరా ప్రదర్శనలు వుండేవి. ఇవికాక కొన్ని చోట్ల సాయింత్రాలలో భజనలు, కోలాటాలు లాంటివి వుండేవి. సినిమాలొచ్చి తోలుబొమ్మలాటల్ని, నాటకాల్ని మింగేసినట్లుగా సాయింత్రాలు అవే సినిమా పాటలతో చేసే మేజువాణీలు, రాత్రి వేళల్లో రికార్డింగ్ డాన్సులు ఆక్రమించాయి. మిగిలిన కళారూపాల ప్రభ తగ్గుతూ వచ్చింది. 

దేవీ నవరాత్రులు విజయదశమితో ముగిసేవి. అయితే ఎందుకో మా వూళ్ళో దేవీ నవరాత్రి ఉత్సవాలు గణపతి నవరాత్రులంత ఎక్కువగా జరిగవి కావు. మా పేటలో మాత్రం రెండూ వైభవంగా జరిగేవి. ముఖ్యంగా దేవీ నవరాత్రులు కొంచెం ఘనంగా జరిగేవి. సుమారుగా నెలరోజుల తేడాలో వచ్చే ఈ రెండు ఉత్సవాలు మాకు సంబరాలు పంచేవి. పగలంతా మైకుల్లోంచి వచ్చే సినిమా పాటలు వినడం, సాయింత్రం ఏదో ఒక కార్యక్రమం. కొత్త సినిమా పాటలు వినడానికి అప్పట్లో వున్న ఒకే ఒక సాధనం ఈ ఉత్సవాల్లోని మైకుసెట్లే ! రేడియోల్లో అప్పట్లో విడుదల కాని చిత్రాల్లోని పాటలు వినిపించేవారు కాదు. ఇప్పట్లా ఆడియో ఫంక్షన్లు, మీడియా కవరేజిలు, దానికి ముందే ఇంటర్నెట్లో పాటలు దొరకడం ఇవన్నీ వుండేవి కావు కదా ! ఆయా సినిమాలు విడుదలయ్యే థియేటర్లలో, వారి పబ్లిసిటీ రిక్షాలలో ముందుగా వినిపించేవారు. ఇలా ఉత్సవాలప్పుడు మైకుల్లో విని బాగున్నవి మేము కూడా పాడేసుకునేవాళ్ళం. ఇప్పట్లా మ్యూజిక్ ప్లేయర్లు, సిస్టంలు అప్పుడేవి ? కేసెట్ ప్లేయర్లు వచ్చేవరకూ హెచ్. ఎం. వి. వారి లోగోలో వుండే గ్రామఫోన్లే ! అవి కూడా అందరి ఇళ్ళల్లో వుండేవి కావు. అసలు రేడియో వుంటే అప్పట్లో గొప్పే ! కమ్యూనికేషన్ రంగంలో మా కళ్ళ ముందు వచ్చిన పెనుమార్పులకు ఒక ప్రక్క ఆశ్చర్యంగానే వుంటుంది. మరో్ప్రక్క సాంకేతికంగా అభివృద్ధి చెందినంత స్థాయిలో వీటి వినియోగం విషయంలో అభివృద్ధి చెందలేదేమోననిపిస్తుంది. ఈ ఉత్సవాలకోసం ఎదురుచూడ్డానికి ఒక కారణం కొత్త పాటలు వినాలనే కోరిక కూడా ! 

ఇక నవరాత్రుల పందిళ్ళు అంత ఎక్కువగా కనబడకపోయినా చివరిరోజైన విజయదశమి రోజున జరిగే వేడుక కన్నుల పండుగ చేసేది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవం దేవిని రకరకాల వాహనాల మీద ఊరేగించడం ప్రారంభమయ్యేవి. పోటీలు పడి వాహనాలను తయారుచేసి అలంకరించేవారు. హంస వాహనాలు, గజ వాహనాలు, తురగ వాహనాలు  ఇలా రకరకాలు. 

గజ వాహనాల్లో జార్జ్ కార్నేషన్ క్లబ్ సభ్యులు చందాలు వేసుకుని తయారు చేయించే వాహనం అతి పెద్దదిగా వుండేది. దూరంనుంచి చూస్తే నిజంగానే దేవలోకం నుంచి ఐరావతం వస్తూందేమోననిపించేది. దాన్ని కోర్టు ఏనుగ్గా పిలిచేవారు. నిజానికి కోర్టులో బార్ సభ్యుల చందాలు తప్ప కోర్టుకి అధికారికంగా ఏవిధమైన సంబంధం లేకపోయినా కోర్టు ఆవరణలో తయారు చెయ్యడం వలన దాన్ని అలా పిలిచేవాళ్లం. అదీకాక ' కార్నేషన్ క్లబ్ ఏనుగు ' కంటే కోర్టు ఏనుగు అనడం సులభం కదా !  

ఇక గండు వీధి శేషశయన వాహనం వైభవం చూసి తీరాల్సిందే ! శేషుడుని పానుపుగా చేసుకుని మహావిష్ణువు శయనించడం, ప్రక్కన లక్ష్మీదేవి..... జీవం ఉట్టిపడుతూ వుండే ఆ విగ్రహాలను అందంగా అలంకరించే తీరు అందరినీ ఆకట్టుకునేది.
ఇక ఈ ఊరేగింపులలో ప్రత్యేకత రకరకాల వేషాలు, విన్యాసాలు, కోలాటాలు, భజనలు వగైరాలు. ఊరికి తలో వైపునుంచి బయిలుదేరే ఈ ఊరేగింపులన్నీ ఒక కూడలిలో అర్థరాత్రి సమయానికి కలిసేవి. అక్కడ కత్తిసాములు, కర్రసాములు.......... ఆ విన్యాసాలు చూడాల్సిందే ! అమ్మవారు పరాక్రమానికి ప్రతీక. ఆ పరాక్రమాన్ని తమలో నింపుకున్న యువకులు ఈ విన్యాసాలు పోటీలు పడి ప్రదర్శించేవారు. దీనికి ఆయా ప్రాంతాల్లోని తాలింఖానాల్లో సుమారు నెలరోజులు ప్రత్యేక శిక్షణ వుండేది. ఆ విన్యాసాలు పతాకస్థాయి కెళ్ళినపుడు చూస్తున్న అందరిలోనూ టెన్షన్ కలిగించేవి. ఒక్కోసారి నిజంగానే కొట్లాటలకు దారి తీసేవి. అప్పుడు వారిని గమనిస్తున్న పెద్దల జోక్యంతో సాధారణంగా సుహృద్భావంగానే ముగిసేవి. బహుశా క్రీడా స్పూర్తి అంటే ఇదేనేమో ! సుమారుగా తెల్లవారేవరకూ సాగే ఈ విన్యాసాల్ని చాలామంది ఆసక్తిగా చూసేవారు. అప్పుడు అవే వినోదం మరి. మళ్ళీ ఈ సంబరాలకోసం సంవత్సరం వేచి చూడడం...... అదో మధురమైన అనుభూతి. ఇప్పుడు ప్రపంచంలో ఎప్పుడు ఏం జరిగినా టెక్నాలజీ పుణ్యమాని మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది. దీని వలన మన జీవితాల్లో థ్రిల్ కోల్పోతున్నామేమో !
ఇంటర్మీడియట్ పూర్తి చేసే సమయానికి అంటే 1973 ప్రాంతానికి రికార్డింగ్ డాన్స్ ల జోరు బాగా పెరిగి నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు వగైరా దాదాపు కనుమరుగయిపోయాయి. ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే అదీ కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శించేవారు. అవి వెదుక్కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. మరో మార్పు అప్పుడప్పుడే ప్రవేశించిన 16 ఎమ్. ఎమ్. సినిమాల ప్రదర్శన. చిన్న ప్రొజెక్టర్ పెట్టుకుని ఒక సినిమా పందిట్లో ప్రదర్శించే ఏర్పాటు చెయ్యడం నిర్వహకులకు సులువుగా అనిపించడంతో త్వరలోనే అవి ఎక్కువై పోయి రికార్డింగ్ డాన్సుల్ని కూడా పక్కకు నెట్టే పరిస్థితి ఏర్పడింది. దాంతో క్రమేపీ జనాల్ని ఆకర్షించడానికి వాటిల్లో అశ్లీలం చోటు చేసుకుంది.

ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఉత్సవాల్లో లలితకళలకి పూర్వ వైభవం తేవాలని, అందుకు మా వంతు కృషి చేయాలని మాకనిపించింది. అందుకే 1975 లో శారదా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని సంకల్పించాం.  అప్పటికే కొంతమంది మిత్రులం కలసి ఓ బాలానంద సంఘం స్థాపించి ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు వగైరా నిర్వహిస్తూ చిన్న చిన్న నాటికలు వగైరా ప్రదర్శించేవాళ్లం. దానికి పొడిగింపుగా ( అప్పటికి బాలల స్థాయిని దాటి యువకుల స్థాయికి ఎదగడం జరిగినా ) ఆదే బాలానంద సంఘం పేరుతోనే ఆ ఉత్సవాలు ప్రారంభించాం. కొంతమంది పెద్దల ఆశీస్సులు కూడా వున్నాయి. నిథుల గురించి మాకప్పుడు అవగాహన లేదు. అందరూ చేసినట్లు కాకుండా ఏదో చెయ్యాలి అనే తపనే మా పెట్టుబడి. మా బాలానంద సంఘ సభ్యుల అందరి ఇళ్లలోనుంచి తలో వస్తువు తెచ్చి పందిరి వేశాం. మండపం పెట్టాం. అప్పటికే కొంతమంది పెద్దల సహకారాలతో సంగీత, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అందులో చాలామంది కళాకారులు ( కొంతమంది ప్రసిద్ధులు కూడా వున్నారు ) మా ఆశయాన్ని మెచ్చుకుని ఉచితంగానో, అతి తక్కువ మొత్తం తీసుకునే ప్రదర్శన ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇది మమ్మల్ని మరింత ఉత్సాహపరిచింది. కార్యక్రమాలు నిర్ణయించినపుడు ఆ ఉత్సాహంలో ఆలోచన రాలేదు. వారు ఉచితంగానో, తక్కువకో ఒప్పుకున్నా మిగిలిన ఏర్పాట్లు... ప్రక్క వాయిద్యాలు, మైకు వగైరాలు ఎలా అనే ప్రశ్న అప్పుడొచ్చింది మాకు. మాకేమీ అర్థం కాలేదు. మా ఇళ్ళల్లోనుంచి తెచ్చిన మొత్తం ప్రాథమిక ఖర్చులకే సరిపోయాయి. ఆ దేవి మీద భారం వేసి ఉత్సవాలు ప్రారంభించాం.
మా ప్రాంతంలోని అందరికీ కార్యక్రమ వివరాలతో కరపత్రాలు పంచాం. అందర్నీ ఆహ్వానించాం. అప్పటికే మారిన ట్రెండ్ ని బట్టి చాలామందిలో ఓ రకమైన స్తబ్దత నెలకొంది. చాలామంది ఈ కరపత్రాలని సరిగా చదవను కూడా లేదు. ఎమర్జెన్సీ కాలం కావడం వలన మైకులకి పోలీసులనుంచి అనుమతి దొరకలేదు. డి.ఎస్.పి. గారిని స్వయంగా కలిసి అభ్యర్థించినా అప్పటి పరిస్థితుల్ని బట్టి అనుమతి ఇవ్వలేకపోయారు. అయితే ఉత్సవాలు రోడ్ మీద కాకుండా మా ఇంటి ఆవరణలో జరుగుతుండడంతో పెద్ద శబ్దంతో కాకుండా పెట్టుకోవచ్చని, అయితే చుట్టుపక్కల ఎవరైనా అభ్యంతరం చెబితే మాత్రం తొలగించాల్సి వస్తుందని చెప్పారు. మొదటి రోజు ధైర్యంచేసి పెట్టాం. సాయింత్రం సమాచారశాఖ ' రామప్ప గుడి ' డాక్యుమెంటరీ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సంగీత కచేరీ, హరికథలకు వారి అనుమతితో వారి మైకులు వాడుకున్నాం. మొదట పెద్దగా జనం లేకపోయినా మైకుల్లో విన్న కొంతమంది ఏం జరుగుతోందో చూడాలని రావడంతో మా ఆవరణ నెమ్మదిగా నిండిపోయింది. పెద్ద ఆవరణ అవడంతో పదులు, పాతికలు అయితే కనబడరు. కనీసం వందమంది అయితే ఫర్వాలేదు. ప్రారంభంలో నిరుత్సాహపడ్డా తర్వాత పెరిగిన ప్రేక్షకుల్ని చూసి మళ్ళీ మాలో ఉత్సాహం పెరిగింది.

అయితే ఆ ఉత్సాహం మర్నాటికి ఆవిరై పోయింది. దానికి కారణం మా ఇంటి ఎదురుగానే కొత్తగా వచ్చిన జడ్జ్ గారు మర్నాడు ఉదయమే మమ్మల్ని పిలిచి మీకు అనుమతి ఎవరు ఇచ్చారని అడిగి, డి‌. ఎస్.పి.తో మాట్లాడేవరకూ కార్యక్రమాలు ఆపమని చెప్పడంతో నీరు కారిపోయాం. మొదటి రోజు కార్యక్రమ నిర్వహణ చూసిన మా ప్రాంత పెద్దలకి మా మీద నమ్మకం ఏర్పడి ఆ జడ్జ్ గారిని కలిసి అభ్యర్థించాక, మా కార్యక్రమాల కరపత్రాన్ని పరిశీలించాక పోలీసులతో మాట్లాడి ప్రత్యేక అనుమతి ఇచ్చారు. వ్యక్తిగతంగా మా ప్రయత్నాన్ని ఆయన అభినందించినా అప్పటి రాజకీయ పరిస్థితులు ఆ అథికారుల చేతులు కట్టేశాయి. అయినా కొంత రిస్క్ తీసుకుని మాకు అనుమతినిచ్చారు. అప్పటినుంచి ఆ జడ్జ్ గారి కుటుంబంతో మాకు చాలా అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారో గానీ ఆయన్ను, వాళ్ళ కుటుంబాన్నీ మాత్రం మర్చిపోలేను. అన్నట్లు ఆ కుటుంబం ప్రముఖ రచయిత్రి నాయని కృష్ణకుమారి గారికి ( బంధుత్వం సరిగా గుర్తులేదు గానీ ) దగ్గర బంధువులు. ఎలా నిథులు పోగుబడ్డాయో చెప్పలేనుగానీ అక్కడినుంచి అన్ని కార్యక్రమాలు అమ్మవారి దయవలన నిర్విఘ్నంగా జరిగిపోయాయి. ఆ విజయంతో అంతకు కొంతకాలం క్రితం మాకు చాలా సీనియర్లు నడిపి, ఉద్యోగ రీత్యా దూరప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఆగిన సాంస్కృతిక సంస్థ ' కళాభారతి ' పునరుద్ధరించి సుమారు మూడు సంవత్సరాలు సంగీత, నృత్య కార్యక్రమాల నిర్వహణతో బాటు, నాటకాలు కూడా ప్రదర్శించేవాళ్లం. నెలకు ఒకటి రెండు కార్యక్రమాలు  తప్పక ఏర్పాటు చేసేవాళ్లం.     

..........................ఆ విశేషాలు మరోసారి  ...

17-10-2010 at 10.30 P.M.


 బాల రామాయణం - 2 - లవకుశ 

బాల రామాయణానికి, లవకుశకు సంబంధమేమిటా అని ఆలోచించనక్కర్లేదు. ఇక్కడ బాలరామాయణం బాలలుగా మేము వేసిన రామాయణమే గానీ రాముడు బాలుడిగా వున్నప్పటి రామాయణం కాదు. ఇక అయిదో తరగతి చదివే మాకు రామాయణం నాటకంగా వెయ్యడానికి ప్రేరణ ఏమిటా అని బాగా ఆలోచిస్తే ...... ఒకటి మా ప్రధానోపాధ్యాయులు రామాయణాన్ని చెప్పే విధానం, రెండోది లవకుశ చిత్రం. 1963 లో విడుదలైన ఆ చిత్ర ప్రభావం అప్పట్లో మామీద ఎంత వుండేదో చెప్పడం కష్టం. ఆ చిత్రం విడుదలయ్యేటప్పటికి నాకు ఆరు సంవత్సరాలుంటాయేమో ! కానీ ఆ చిత్రం మొదటి సారి చూసినప్పటి విశేషాలు కూడా నాకు ఇప్పటికీ బాగానే గుర్తున్నాయని మా బాలరామాయణానికి ప్రేరణ ఏమిటా అని ఆలోచిస్తున్నపుడు అర్థమైంది.
మన జీవితంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిటిని వెంటనే మర్చిపోతాం. అంటే వాటికి మన జీవితంలో చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత వుండదు. కొన్నిటిని కొంతకాలం గుర్తు పెట్టుకుంటాం. మరికొన్నిటిని ఎంతకాలమైనా మర్చిపోలేము. అందులో కూడా కొన్ని మనల్ని నిత్యం వెంటాడుతూనే వుంటాయి. వీటిలో ఎక్కువగా చేదు సంఘటనలే వుంటాయనుకోండి. అది వేరే విషయం. కొన్ని జ్ణాపకాల పొరల్లో మరుగున పడినట్లున్నా అవసరమైనపుడు, సందర్భం వచ్చినపుడు మాత్రం బయిటకు వస్తాయి. ఇప్పుడు ఇది కూడా అలా వచ్చిందే !
మా ఊరికి చివర ( అప్పట్లో ) ఓ సినిమా హాలు వుండేది. పొలాల మధ్యన, విశాలమైన ఆవరణలో వున్న ఆ హాలుకి సినిమాకేళ్లాలంటే అదో పెద్ద ప్రయత్నం. కొద్దిగా భయం కూడా వుండేది. పోలాల మధ్యలో వుండడం, సినిమా సమయంలో తప్ప అక్కడ జన సంచారం పెద్దగా లేకపోవడంతో పాములు లాంటి వాటికి విడిదిలా వుండేది. శ్రీనివాస టాకీస్ అనే పేరుగల ఆ హాలులోనే లవకుశ విడుదలైంది. రజతోత్సవం చేసుకుందని గుర్తు. ఆ సినిమా చూడడం కోసం చుట్టుప్రక్కల పల్లెటూళ్లనుండి రెండెడ్ల/ జోడెడ్ల బళ్ళ మీద కుటుంబాలతో వచ్చి తమకు టికెట్లు దొరికేవరకూ వేచి వుండేవారు. కొంతమందైతే అక్కడే వంటలు చేసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం లాంటివి కూడా కానిచ్చేవారు. ఎంత ఆలస్యమైనా ఆ సినిమా చూసి కానీ వెళ్ళేవారు కాదు. బయిటకు సంభాషణలు, పాటలు వినబడుతుంటే పారవశ్యంతో వింటూ ఓ పిక్నిక్ కొచ్చిన అనుభూతి పొందేవారనుకుంటాను. అప్పట్లో ఎన్నిసార్లు చూశానో గుర్తులేదు కానీ చాలాసార్లే చూశానని మాత్రం గుర్తు. చుట్టు ప్రక్కల వూళ్లలో వుండే మా బంధువులకు, పరిచయస్థులకు ఆ సినిమా ఆడుతున్నన్నాళ్లూ మావూరో పుణ్యక్షేత్రం..... మా ఇల్లేమో వాళ్ళకు విడిది. అందులోనూ లంకంత కొంప, సమృద్ధిగా పాడి పంట.... ఇంకా లోటేమిటీ ? అందుకే చిన్న, పెద్ద, ముసలీ, ముతకా అని లేకుండా అందరూ కట్టగట్టుకుని వచ్చేవారు. ఎప్పుడూ వీధి మొహం చూడని వాళ్ళు, చూడడానికి నిషిద్ధమనిపించిన వాళ్ళూ కూడా వచ్చేవారు. జీవితంలో ఒక్కసారి కూడా సినిమా చూడని వాళ్ళు ఈ ఒక్క సినిమా తరించేశామని చెప్పుకోవడం గుర్తు. అంత సంచలనం కలిగించిందా చిత్రం. సహజంగానే మా మీద ఆ ప్రభావం బలంగా వుంది వుంటుంది. అందుకే నాటకం అంటే మాకేమీ తెలియకపోయినా, తెలిసే వయసు లేకపోయినా మాచేత ఆ ప్రయోగం చేయించిందేమో !
నాటకంరోజు వచ్చింది. మేం నాటకం ప్రదర్శించిన తీరు చెబితే పిల్ల చేష్టలుగా వుంటుంది గానీ మాకప్పుడు తెలిసిందంతే ! మా స్కూల్ పిల్లలు కొంతమంది, చుట్టు ప్రక్కల వాళ్ళు కొంతమంది మా ప్రేక్షకులు. అప్పటికి మాకు రంగస్థలి అంటే సరైన అవగాహన లేదు. అందుకే స్కూల్ అంతా మాకు రంగస్థలమే ! ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క చోట ప్రదర్శించాలని నిర్ణయించాం. ఉదాహరణకు అంతఃపుర దృశ్యాలు ఒక క్లాసు రూములో, అరణ్య దృశ్యాలు ఒక క్లాసు రూంలో, యుద్ధ దృశ్యాలు ఆరుబయిలులో.... ఇలాగన్నమాట.
సరే ! ఒక్కొక్కళ్ళు ఇంటి దగ్గరనుంచి తీసుకొచ్చిన పౌడర్లు పులుముకున్నాం. నాటకం కోసం ప్రత్యేకించిన దుస్తులు వేసుకున్నాం. కిరీటాలు వగైరా తగిలించుకున్నాం. దాంతో మేకప్ పూర్తయింది. ఇంక ప్రదర్శన మొదలయింది. రామాయణంలో పాత్రలు ఎక్కువ. మాలో నటులు తక్కువ. అందుకే ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు పాత్రలు ధరించాం. అంటే నాటకంలో బహుపాత్రాభినయం బహుశా మేమే ప్రవేశపెట్టామేమో ! అంతేకాక బహు రంగస్థల ప్రయోగం మాదేనేమో ! అవి ప్రయోగాలని మాకేం తెలుసు. అసలు నాటకమంటేనే తెలియని వయసే ! తర్వాత కాలంలో ఉన్నవ లక్ష్మినారాయణ గారి ' మాలపల్లి ' నవల నాటకంగా తీర్చిదిద్దినపుడు సుమారు పన్నెండో, ఇంకా ఎక్కువో రంగస్థలాల మీద సుమారు 50 మందికి మించిన నటీనటులతో ప్రదర్శించడం గొప్ప సంచలనం కలిగించింది. హైదరాబాద్ లో చిరకాలంగా ప్రదర్శించబడుతూ వుండేది. 1975 లో జరిగిన ప్రపంచ ప్రథమ తెలుగు మహాసభల సమయంలో ప్రతినిధిగా హాజరైన నేను ఆ నాటకం చూడాలని చాలా ప్రయత్నించాను కానీ అనివార్య కారణాల వల్ల నా కోరిక ఫలించలేదు. అది వేరే సంగతి.
అలా వేషాలు పూర్తయ్యాయి. మొదటి ఘట్టం శ్రీరామ జననం. సరే పూర్తయింది. తర్వాత విశ్వామిత్రుడు రాముణ్ణి అడవులకు తీసుకెళ్ళడం, సీతారామకళ్యాణం కూడా జరిగిపోయాయి. ఇంతవరకూ బాగానే వుంది. కానీ అరణ్యవాస ఘట్టంలో సీతాపహరణ జరిగాక జటాయువు సంహరణ ఘట్టంలో మాత్రం నాకు ఇబ్బంది ఎదురయింది. అదేమిటంటే జటాయువు వేషం కూడా నేనే వేశాను. సరైన అవగాహన లేకపోవడంతో రాముడు జటాయువుని పరామర్శించే ఘట్టం ఎలా మేనేజ్ చెయ్యాలో అర్థం కాలేదు. ఎందుకంటే రాముడు కూడా నేనేగా ! అప్పటికప్పుడు చర్చలు. ఏం చేసుంటామో ఆలోచిస్తూవుండండి........ మళ్ళీ మరోసారి.   


24 comments:

పరుచూరి వంశీ కృష్ణ . said...

చాలా చాలా బాగా రాసారండీ !
ఎండాకాలం అంటే నే సెలవలు గుర్తుకు వస్తాయి ..వస్తూనే ఒంటి పూట బడులు..ఆ తర్వాత సెలవలు...ఆ సెలవల్లో చదివే కధల పుస్తకాలు ..ఆడే ఆటలు ..తినే పుల్ల ఐస్ ..వివిధ భారతి లో వినే పాటలు.. ఇలా చెప్పుకుంటూ పొతే మీ బ్లాగ్ లో కామెంట్ లో నేనొక పోస్ట్ రాసేస్తానేమో !
మీ బ్లాగ్ చాలా బాగుంది మంచి మంచి విషయాలు అందచేస్తున్నందుకు ధన్యవాదములు

SRRao said...

వంశీకృష్ణ గారూ !
నా రాతలు, నా బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ చిన్నతనంలో ఆటవిడుపుగా మధురానుభూతుల్ని పంచే కాలం వేసవి. ఈ వేసవి పూర్తయ్యే లోపున చాలా జ్ఞాపకాలు మీతో పంచుకోవాలని వుంది. ప్రయత్నిస్తాను. మీకు నచ్చినవి చెప్పండి. నచ్చనివి కూడా చెప్పండి. సరి చేయడానికి ప్రయత్నిస్తాను.

సంతోష్ said...

మీ స్వగతంలోని తీపి జ్ఙాపకాలు బాగున్నాయండి.

SRRao said...

సంతోష్ గారూ !
ధన్యవాదాలు

Vinay Chakravarthi.Gogineni said...

asalu eppudu raasaru ivi just ippude kanabaddayi naaku baagunnayi sangatulu..........

SRRao said...

వినయ్ చక్రవర్తి గారూ !
అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడు, సమయం దొరికినపుడు జ్ఞాపకాలను తవ్వుకుంటూ రాయడం ప్రారంభించాను. ఎన్నో, ఎన్నెన్నో జ్ఞాపకాలు ఎంత వరకూ, ఎంత కాలం రాయగలనో తెలీదు గానీ ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. వీటిని చదవడం వల్ల మీ అందరికీ మానసికోల్లాసంతో బాటు కొన్ని జీవిత సత్యాలు కూడా తెలుస్తాయనే బ్లాగులో రాస్తున్నాను. continuity దెబ్బ తినకుండా వేరే పేజీలో రాస్తున్నాను. మీకు నచ్చినందుకు సంతోషం.

హరే కృష్ణ said...

చాలా చాలా బాగా రాసారు
తెలుగు బ్లాగు చరిత్రలో ఇంత ఓపిక గా పోస్ట్ రాసిన మీకు ఆభినందనలు రావు గారు
ఆ పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు

Anonymous said...

మీ తరువాతి ముచ్చట్లకోసం ఎదురు చూస్తున్నాం..
చాలా పెద్దవి వ్రాశారే..

బాగున్నది..

Rao S Lakkaraju said...

ఒక పోస్ట్ లోనే చాలా మధురస్మృతులు పెట్టారు. ఒక్కసారి చదివి అన్నీ అవగోట్టటం ఇష్టం లేదు. రోజుకు ఒకటి చదివి ఆ మధురిమను ఆస్వాదిస్తూ ఉంటాను.

రచన స్టయిలు బాగుంది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

కొత్త పాళీ said...

హబ్బ, వారానికి సరిపడ సరుకు అందించారుగా! మెల్లగా ఆస్వాదిస్తా

SRRao said...

* వాసూ !
* హరేకృష్ణ గారూ !
* తార గారూ !
* రావు గారూ !
* కొత్తపాళీ గారూ !

నాలుగు నెలల క్రితం రాసిన జ్ఞాపకాలకు స్పందించిన మీకందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కొనసాగిస్తాను.

Pammy said...

గురూ గారు..
తెలుగు సాహిత్యం పై మమకారం ఉన్న ఏ తెలుగోడి కైనా..
మీ బ్లాగ్ చాలా నచ్చుద్ది.. నచ్చి తీరాలి అంతే..
నా బ్లాగ్ ఎలా ఉండాలని అనుకున్నానో..
ఆ లక్షణాలన్నీ మీ బ్లాగ్ లో ఉన్నాయ్..
మీ బ్లాగ్ టోటల్ గా బాగా నచ్చేసింది..
నాకు, నా మాటకు సలహాలు ఇచ్చి..
ప్రోత్సహించ గలరని మనవి..

SRRao said...

రమేశ్ గారూ !
నా బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు. మీ కవితలు కూడా బాగుంటున్నాయి. నవీన భావాలు మీవి. సలహాలిచ్చెంత పెద్దవాడిని అని చెప్పలేను కానీ మీకు అవసరమైనపుడు, నాకు చెప్పాలనిపించినపుడు తప్పకుండా చెబుతాను. అవి మీకు వుపయోగపడితే సంతోషం. మీ అభిమానానికి మరోసారి ధన్యవాదాలు.

Vinay Datta said...

Am actually waiting to read more about your "Baala Raamaayanam".

SRRao said...

మాధురి గారూ !
ధన్యవాదాలు. త్వరలోనే తప్పక రాయడానికి ప్రయత్నిస్తాను.

Nunagoppala Chandramohan said...

mee swa'gatham' chaduvuthunnanu. baagaa vraashaaru. kallaku kattinattugaa unnaayi gathaalu.

DARPANAM said...

అనుభవాలను,అనుభూతుల్నిఎంతోఓపికతో పాటు
చదివించగలిగే మంచి శైలిలో వ్రాయటం నిజంగా అభినందనీయం

SRRao said...

* చంద్రమోహన్ గారూ !
నా అనుభవాలను మీరు ఆసక్తిగా చదువుతున్నందుకు ధన్యవాదాలు.

* సాంబమూర్తి గారూ !
నా అనుభవాలు, శైలి నచ్చినందులు ధన్యవాదాలు.

jags said...

చాలా చాలా బాగా రాసారండీ !
ఎండాకాలం అంటేనే సెలవలు గుర్తుకు వస్తాయి,ఒంటి పూట బడులు..ఆ తర్వాత సెలవలు...ఆ సెలవల్లో చదివే కధల పుస్తకాలు ..ఆడే ఆటలు ..ఒక్కసారినే అన్నీ చదివి అవగోట్టటం ఇష్టం లేదు. రోజుకు ఒకటి చదివి ఆ మధురిమను ఆస్వాదిస్తూ.
V J

గాయత్రి said...

Rao gaaru, me blog chaala chaala bagundi. mee anubhavaalanu chakkaga vivarinchaaru.bagundi..

SRRao said...

* jags గారూ !
* గాయత్రి గారూ !

ధన్యవాదాలు

Anonymous said...

meedi aa vooru?? maadi mummidivaram sir

SRRao said...

ప్రసాదరాజు గారూ !
మాది అమలాపురం సర్ !

Unknown said...

శ్రి రావు గారికి నమస్కారములు! మీ బ్లాగులో వ్రాసిన విషయాలూ మీ అనుభవాలు ప్రశంశనీయం గా ఉన్నాయి. కోనసీమ అమలాపురం ముమ్మిదివరం సినీమాలు వెసవి, ఆవకాయ, గత అనుభవాల గురించి ఇంత వివరంగా వ్రాయడం అందరికీ ఆనందదాయకం గా ఉంటుంది..అమలాపురం తో నాకు 20 యేళ్ళ అనుభందం ఉంది.మీ బ్లాగ్ ఆలస్యంగా చూస్థున్నాను

26/07/2013 గుమ్మా రామలింగ స్వామి

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం