Monday, November 29, 2010

దృష్టి దోషం

వేదిక - 01

 నరుడి కంటిచూపుకి నల్ల రాయి పగులుతుందని సామెత. ఎవరైనా మనం కట్టుకున్న కొత్త బట్టలకేసి తదేకంగా చూస్తే మనకి నచ్చదు. మనం కొనుక్కున్న కొత్త వాహనాన్ని పరిశీలనగా చూస్తే ఎక్కడ ఆక్సిడెంట్ అయిపోతుందోననే అనుమానం. ఇలా అన్నిటికీ దిష్టి పెట్టేస్తున్నారని మనం కష్టపెట్టేసుకుంటాం.

చిన్నపిల్ల పాలు తాగుతుంటే ఎవరి కంటా పడకుండా  చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ! అన్నం తినడానికి పేచీలు పెడుతుంటే ఎవరో దిష్టి పెట్టారని ఖంగారు పడి అర్జెంటుగా కాస్త ఉప్పో, మిరపకాయలో దిగతుడిచి పడేస్తాం. ఇంకొంతమంది కొంచెం ముందడుగు వేసి ఆ మిరపకాయల్ని నిప్పుల్లో వేసి ఇంట్లోని వాళ్ళ చేతేకాక చుట్టు పక్కల వాళ్ళందరి చేతా కూడా కళ్ళమ్మట నీళ్ళు తెప్పిస్తారు.

పంట చేలో ఏపుగా ఎదిగిన పంటమీద ఎవరి దృష్టి పడకుండా గడ్డితో బొమ్మను చేసి దానికి లాగూ చొక్కా తొడిగి దానిపైన కుండను తలగా తగిల్చి సున్నపు బొట్లు పెట్టి తృప్తి పడిపోతాం. పంట మీదనుంచి మనుష్యుల దృష్టే కాకుండా పశుపక్ష్యాదుల దృష్టి కూడా మరల్చేసామనుకుంటాం.

కొత్త ఇల్లు కడుతున్నామనుకోండి. దానికి గోడలు, తలుపులు ఇంకా పెట్టకముందే ఎదురుగా దిష్టి బొమ్మను తగిలిస్తాం. దాని వలన కట్టుబడి మీదనుంచి చూసేవాళ్ల దృష్టి మళ్ళుతుందని మన ఆలోచన. కడుతున్న ఇల్లేమిటి ? మనం ఉంటున్న ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళమీద, ఇంట్లో వున్న వస్తువులమీద పరాయివాళ్ళ దృష్టి పడకుండా ఉండడానికి గుమ్మడికాయను అలంకరించి కడతాం. అలా చేస్తే దృష్టి దోష నివారణతో బాటు దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని నమ్ముతాం.

కొంతమంది మనుష్యులకు ఈ దృష్టి దోషాన్ని ఆపాదించడం కూడా మనం చూస్తుంటాం. ఒక్కొక్క వ్యక్తి కనుక ఎవరివైపేనా తదేకంగా చూస్తే ఆ మనిషో లేక ఆ వస్తువో నాశనం అవుతాయని నమ్ముతుంటాం. వాళ్ళకెదురు పడడానికి ఎవరూ ఇష్టపడరు. 

* ఈ నమ్మకాలు నిజమేనా ? వీటిని మూఢ నమ్మకాలుగా పరిగణించవచ్చా ?
* ' కంటి చూపుతో చంపేస్తా ' అన్నట్లు అసలు మనిషి దృష్టికి ఇతరుల్ని, వస్తువుల్ని నాశనం చేసే శక్తి ఉందా ?  ఒకవేళ వుంటే ఆది ఎప్పుడూ ఉంటుందా ? ప్రత్యేక సందర్భాలలో బయిటకు వస్తుందా ? అలాంటి సందర్భాలేమిటి ?
* ఈ దృష్టి దోషాన్ని ఒక మనిషికి ఆపాదించడం ఎంతవరకూ సబబు ?
* అసలు దృష్టిలో దోషముంటుందేమో గానీ దృష్టికి దోషముంటుందా ?

ఇవన్నీ నాకర్థం కాని ప్రశ్నలు. వీటికి జవాబులు తెలిసిన మిత్రులు, పెద్దలు సహేతుకమైన సమాచారమిచ్చి ఈ విషయంలో అందరికీ ఉండే అపోహలు తొలిగిస్తే బాగుంటుంది. అయితే కొన్ని విన్నపాలు. వ్యాఖ్యల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. కానీ అవి ఎవరినీ కించపరిచేవిగా మాత్రం వుండకూడదు. ఎదుటి వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూనే అందులోని మంచి చెడ్డలు ఆమోదయోగ్యమైన పద్ధతిలో చర్చించమని మనవి. ఈ చర్చ కేవలం ఈ విషయానికి మాత్రమే పరిమితం అని గమనించ ప్రార్థన.

Vol. No. 01 Pub. No. 069

Sunday, November 28, 2010

నలుపు - తెలుపు - జవాబులు

 కనుక్కోండి చూద్దాం - 33 - జవాబులు 

నలుపు - తెలుపు పేరుతో గతంలో ఒక పత్రికలో వచ్చిన నవల సినిమాగా రూపొంది ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది.
ఆ నవలాకారుడే ఆ చిత్ర నిర్మాత కూడా ! చేస్తున్న వృత్తిని వదలి ప్రవృత్తినే వృత్తిగా చేసుకున్న ఆయన నటుడు కూడా !


జ్యోతి గారు సరైన జవాబే ఇచ్చారు. దాన్ని మాదురి గారు సమర్థించారు. ఇద్దరికీ ధన్యవాదాలు. 


1 . ఆ చిత్రం పేరు ఏమిటి ?
జవాబు : చెల్లెలి కాపురం, అమృతా ఫిల్మ్స్ నిర్మాణం, కె. విశ్వనాథ్ దర్శకత్వం

2 . ఆ నిర్మాత, రచయిత ఎవరు ?
జవాబు : నటుడు బాలయ్య గారు. ఈయన సినీ రంగంలో అడుగు పెట్టక ముందు మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేశారు. తొలుత మద్రాస్ సెంట్రల్ పాలిటెక్నిక్ లోను, తర్వాత కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లోను అధ్యాపకుడిగా పనిచేశారు. అనంతరం కె. సి. పి. లిమిటెడ్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేశారు.
1958 లో విడుదలైన ఎత్తుకు పై ఎత్తు చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేశారు. తనకి తెలిసిన ఓ సంఘటన ఆధారంగా రాసిన నలుపు - తెలుపు నవలా ధారావాహికంగా ' తుఫాన్ ' పత్రికలో ప్రచురించబడింది. ఆ తర్వాత తానే నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా చెల్లెలి కాపురం పేరుతో ఆ నవలనే సినిమాగా నిర్మించారు. ఈ క్రింద ఇచ్చిన లింకు లలో ఈ చిత్రాన్ని చూడవచ్చు.

చెల్లెలి కాపురం ; భాగం - 1

చెల్లెలి కాపురం ; భాగం - 2

Vol. No. 02 Pub. No. 068a

Saturday, November 27, 2010

నలుపు - తెలుపు

 కనుక్కోండి చూద్దాం - 33

నలుపు - తెలుపు పేరుతో గతంలో ఒక పత్రికలో వచ్చిన నవల సినిమాగా రూపొంది ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది.
ఆ నవలాకారుడే ఆ చిత్ర నిర్మాత కూడా ! చేస్తున్న వృత్తిని వదలి ప్రవృత్తినే వృత్తిగా చేసుకున్న ఆయన నటుడు కూడా !


1 . ఆ చిత్రం పేరు ఏమిటి ?
2 . ఆ నిర్మాత, రచయిత ఎవరు ?

Vol. No. 02 Pub. No. 068

Friday, November 26, 2010

విషాదంలోనూ వినోదమే !


విషాదంలోనుంచి వినోదం సృష్టించడంలో ప్రపంచ ఖ్యాతి గడించిన కళాకారుడు చార్లీ చాప్లిన్. ఆ ఒరవడిని అంది పుచ్చుకున్న తెలుగు నటుడు రేలంగి వెంకట్రామయ్య. తెలుగు చిత్రరంగంలో హాస్యనటులకు సుస్థిర స్థానం కల్పించిన నటుడు రేలంగి. ఆయన తెరమీద నవ్వినా, ఏడ్చినా ప్రేక్షకులకు వచ్చేవి కన్నీళ్లు కాదు.....నవ్వులే ! తెర మీద కనిపించినపుడే కాదు నిజజీవితంలో కూడా ఆయన ఎక్కడ కనిపించినా జనం నవ్వేవారు.


ఆయన
కారు దిగితే నవ్వు....
నడిస్తే నవ్వు......
ఆగితే నవ్వు.....
మాట్లాడబోతే నవ్వు.....
మాట్లాడకపోతే నవ్వు......
ఏం చేసినా నవ్వే ! ఏం చెయ్యకపోయినా నవ్వే !
................అలా సాగింది ఆయన నవ్వుల ప్రవాహం

1955 లో హైదరాబాద్ లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ లో ప్రముఖ నటుడు స్థానం నరసింహారావు గారి  చేతుల మీదుగా రేలంగి వెంకట్రామయ్య గారికి ఘన సన్మానం జరిగింది. ఆ సన్మానానికి రేలంగికి నోట మాట రాలేదు. గొంతు పూడుకుపోయింది. కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు. ఆది చూసి ప్రేక్షకుల నవ్వులు.
అప్పుడు చూడండి రేలంగి గారి పరిస్థితి. ఎలాగో గుండె దిటువు చేసుకుని నేను నిజంగానే ఏడుస్తున్నానని ప్రకటించారు. ఆయన పరిస్థితి అర్థమైన కొంతసేపటికి ప్రేక్షకుల నవ్వులు ఆగాయి.
స్థానం వారు " ఎందుకు బాబూ నీకీ కన్నీళ్లు ? " అని అడిగారు.
గద్గద స్వరంతో రేలంగి గారు " గతంలో నాటకాల్లో వేషం వెయ్యాలని కోరికతో మీదగ్గరకొచ్చి అడిగాను. నువ్వు నాటకాలేం వేస్తావు పొమ్మన్నారు. ఈరోజు మీ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం....... నిజంగా ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ ఆనంద భాష్పాలు " అన్నారు. సభంతా గంభీర వాతావరణంతో నిండిపోయింది.
వినోదంలో ఎంత ఆనందాన్ని పంచగలడో విషాదంలో అంత అనుభూతిని పంచగల సమర్థుడు రేలంగి వెంకట్రామయ్య. హరికథకుడిగా, హార్మోనియం వాయిద్యకారుడిగా, రంగస్థల నటుడిగా ప్రారంభమైన రేలంగి 1935 లో శ్రీ కృష్ణ తులాభారం చిత్రంతో మలుపు తిరిగింది. హాస్యనటుడిగానే కాక గాయకుడిగా కూడా ఆయన కొన్ని పాటలు పాడారు.

తెలుగు చిత్రాల్లో హాస్యానికి రాచబాట వేసిన రేలంగి వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ................Vol. No. 02 Pub. No.067

Wednesday, November 24, 2010

ఛాన్స్ మిస్

ఇప్పుడు హిందీ తారల గమ్యస్థానం దక్షిణాది అయితే గతంలో దక్షిణాది తారల చూపు బాలీవుడ్. జాతీయ స్థాయి తారలుగా ఎదగడానికి ఆది రాచబాటగా భావించేవారు. ఆ రోజుల్లో ............

ఆంధ్రుల అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి రెండు సార్లు హిందీ చిత్రాల్లో నటించే అవకాశం తప్పిపోయింది.

ఒకటి - సాధనా వారు నిర్మించిన ' సంసారం ' చిత్రాన్ని జెమిని వారు హిందీలో అక్కినేని గారితో నిర్మించాలనుకున్నారు. కానీ ఆ సమయంలో ఆయన చేతిలో చాలా చిత్రాలు వుండడం వలన కాల్ షీట్స్ కుదరక ఆ ప్రతిపాదన విరమించుకున్నారు.

మరొక సందర్భం - అన్నపూర్ణ సంస్థనుండి వచ్చిన తొలి చిత్రం ' దొంగ రాముడు ' ఎంతటి ఘన విజయం సాధించిందో సినిమా ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విజయం హిందీ నిర్మాతల్ని టాలీవుడ్ బాట పట్టించింది. ఆ చిత్రం హక్కులకోసం చాలామంది హిందీ నిర్మాతలు అన్నపూర్ణ వారిని సంప్రదించారు. అయితే అన్నపూర్ణ వారికి తామే ఆ చిత్రాన్ని హిందీలో నిర్మిస్తే ఎలావుంటుందనే ఆలోచన వచ్చింది . అక్కినేని గారు కథానాయికుడిగా కె. వి. రెడ్డి గారి దర్శకత్వంలోనే ఆ చిత్రాన్ని హిందీలో కూడా నిర్మించాలని ఏర్పాట్లు మొదలుపెట్టారు. అప్పటికే ఉత్తరాదిన పంపిణీరంగంలో ప్రసిద్ధి చెందిన ఏ. వీ. యం. వారితో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.
సావిత్రి పాత్రకు మీనాకుమారిని, జమున పాత్రకు నందాను, రేలంగి పాత్రకు ఓం ప్రకాష్ ను, సూర్యకాంతం పాత్రకు మనోరమను ఎంపిక చేశారు. అయితే అన్నపూర్ణ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఆ సమయంలో తీవ్రమైన అనారోగ్యం చేసింది. డాక్టర్లు ఏ విధమైన మానసిక వత్తిడి ఉండకూడదని సంపూర్ణ విశ్రాంతి అవసరమన్నారు. దాంతో ఆ చిత్ర పునర్నిర్మాణ హక్కులు ఏ. వీ. యం. వారికి ఇచ్చేశారు.

అలా అక్కినేని రెండు సార్లు హిందీ చిత్రాల్లో నటించే ఛాన్స్ మిస్ అయ్యారు. ' దొంగ రాముడు ' చిత్రంలో నిత్య సత్యాలను బోధించే సముద్రాల గారి సాహిత్యాన్ని పెండ్యాల నాగేశ్వరరావు గారు స్వరపరచగా సుశీలమ్మ పాడిన పాట మీకోసం .................
సాహిత్యం కోసం http://en.wikipedia.org/wiki/Donga_Ramudu లింక్ లో చూడండి.

Vol. No. 02 Pub. No. 066

కత్తిరింపులు


ఓసారి హైదరాబాద్ లోని నగర కేంద్ర గ్రంధాలయంలో కవి సమ్మేళనం జరుగుతోంది. దానికి ముఖ్య అతిధిగా డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు వచ్చారు. ఆచార్య ఎన్. గోపి అధ్యక్షత వహించారు. సినారె గారి ఉపన్యాసాలలో సహజంగా చమత్కారం పాలు ఎక్కువ.

ఆరోజు ఉపన్యాసం ప్రారంభిస్తూ ఆయన
" వేదికనలంకరించిన డా. గోపి, డా. ఎస్వీ, డా. శిఖా ...... " అని ఆగారు. ఆహ్వానితులందరూ గొల్లున నవ్వారు.

నారాయణరెడ్డి గారు కొనసాగిస్తూ
" అవును మరి .... అధ్యక్షత వహించిన గోపి పేరులో రెండు అక్షరాలే వున్నాయి ! వేదిక మీద కూర్చున్న డా. ఎస్వీ సత్యనారాయణ గారు వాడుకలో ఎస్వీ అని రెండు అక్షరాలకి కత్తిరించుకుని వాడుతున్నారు కదా ! మరో డాక్టర్ శిఖామణి కూడా వాళ్ళతో సమానంగా వేదిక మీద కూర్చున్నాడు. అందర్నీ సమానంగా చూడాలి కదా ! అందుకే ఆయన పేరును కూడా నేను వాళ్ళతో సమానంగా రెండు అక్షరాలకు కత్తిరించాను " అని చమత్కరించారు సినారె.

Vol. No. 02 Pub. No. 065

Monday, November 22, 2010

తిరస్కారం - ఘనవిజయం ... జవాబులు

  కనుక్కోండి చూద్దాం..... 32 - జవాబులుసూర్య గారు చాలా వేగంగా సమాధానం చెప్పారు. కానీ తెలుగు తప్ప మిగిలిన భాషలలోని పేర్లు చెప్పలేదు. వారికి ధన్యవాదాలు.

1970 వ దశకంలో తమిళంలో ఒక ప్రముఖ దర్శకుడు విభిన్నమైన కథాంశంతో స్క్రిప్ట్ తయారుచేసుకుని ఫిలిం ఫైనాన్సు కార్పోరేషన్ కి పంపాడు. లేత వయసు కథానాయిక, వికలాంగుడు- అమాయకుడైన కథానాయకుడు గల ఆ స్క్రిప్ట్ సినిమాగా తీస్తే పెట్టుబడి తిరిగిరాదని సందేహించి వెనక్కి త్రిప్పి పంపారు వారు.
అయితే ఆ దర్శకుడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా తిరిగి కొంతమందిని ఒప్పించి పెట్టుబడి పెట్టించి మొత్తానికి సినిమా తీసాడు. ఆ చిత్రాన్ని తెలుగులో మరో ప్రముఖ దర్శకుడు పునర్నిర్మించాడు. ఆ చిత్రంలో నటించిన కథానాయిక ఆ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని తర్వాతి కాలంలో భారత దేశంలో అగ్ర కథానాయికగా ఎదిగింది. అదే చిత్రాన్ని హిందీలో కూడా నిర్మించారు. అలా ఫిలిం ఫైనాన్సు కార్పోరేషన్ తిరస్కరించిన ఆ స్క్రిప్ట్ మూడు భాషల్లో చిత్రాలుగా నిర్మింపబడి ఘనవిజయం సాధించింది.

1 . మూడు భాషల్లోనూ ఆ చిత్రం పేర్లేమేమిటి ?                           
జవాబు - పదునారు వయదినిలై ( తమిళం ) , పదహారేళ్ళ వయసు ( తెలుగు ) , సోల్వా సావన్  ( హిందీ )  
   
2 . పట్టు వదలని ఆ తమిళ చిత్ర దర్శకుడు ఎవరు ?           
జవాబు    : భారతీ రాజా


అగ్ర శ్రేణి తారగా వెలిగిన ఆ  నటి శ్రీదేవి అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను .


కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ' పదహారేళ్ళ వయసు ' లోని వేటూరి గారి సాహిత్యం, చక్రవర్తి సంగీతం కలబోసిన మధుర గీతం .........................Vol. No. 02 Pub. No. 063a

Sunday, November 21, 2010

కర్పూరదీపం..కార్తీకదీపం

 కార్తీకదీపం..... జ్వాలాతోరణం.....
ఆకాశదీపాలు వెలిగించడం
అభిషేకాలు, పూజలు 
జ్వాలాతోరణం దాటడం  
......... కార్తీకపౌర్ణమి విశేషాలు 

మిత్రులందరికీ కార్తీకపౌర్ణమి శుభాకాంక్షలుVol. No. 02 Pub. No. 064

తిరస్కారం - ఘనవిజయం

  కనుక్కోండి చూద్దాం..... 32

1970 వ దశకంలో తమిళంలో ఒక ప్రముఖ దర్శకుడు విభిన్నమైన కథాంశంతో స్క్రిప్ట్ తయారుచేసుకుని ఫిలిం ఫైనాన్సు కార్పోరేషన్ కి పంపాడు. లేత వయసు కథానాయిక, వికలాంగుడు- అమాయకుడైన కథానాయకుడు గల ఆ స్క్రిప్ట్ సినిమాగా తీస్తే పెట్టుబడి తిరిగిరాదని సందేహించి వెనక్కి త్రిప్పి పంపారు వారు.
అయితే ఆ దర్శకుడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా తిరిగి కొంతమందిని ఒప్పించి పెట్టుబడి పెట్టించి మొత్తానికి సినిమా తీసాడు. ఆ చిత్రాన్ని తెలుగులో మరో ప్రముఖ దర్శకుడు పునర్నిర్మించాడు. ఆ చిత్రంలో నటించిన కథానాయిక ఆ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని తర్వాతి కాలంలో భారత దేశంలో అగ్ర కథానాయికగా ఎదిగింది. అదే చిత్రాన్ని హిందీలో కూడా నిర్మించారు. అలా ఫిలిం ఫైనాన్సు కార్పోరేషన్ తిరస్కరించిన ఆ స్క్రిప్ట్ మూడు భాషల్లో చిత్రాలుగా నిర్మింపబడి ఘనవిజయం సాధించింది.

1 . మూడు భాషల్లోనూ ఆ చిత్రం పేర్లేమేమిటి ? 
2 . పట్టు వదలని ఆ తమిళ చిత్ర దర్శకుడు ఎవరు ?

Vol. No. 02 Pub. No. 063

Thursday, November 18, 2010

అరేబియా నోము

ప్రేమే నేరమౌనా !
ప్రేమే నేరమౌనా !
మాపై పగేలా ?

వేదనగానే మా వలపంతా వేసారునా !        
.............

ఏ కొరనోము నోచుకోన్నానో 
ఏ కొరనోము నోచుకోన్నానో ................ ఈ వాక్యంతో చరణం ప్రారంభమవుతుంది. ఈ పాట 1949 నాటి ' లైలా మజ్ను ' చిత్రం లోనిది. భానుమతి పాడిన ఈ పాట సి. ఆర్. సుబ్బరామన్ సంగీత దర్శకత్వం వహించగా సీనియర్ సముద్రాల రాసారు. 

ఈ పాటలోని పై వాక్యంలో చాలా పెద్ద తప్పు కనిపెట్టేసానన్న సంతోషంతో ఒకాయన సీనియర్ సముద్రాల గారిని 
" అయ్యా ! ఈ కథ అరేబియా దేశానిది కదా ? అరేబియా వాళ్ళు నోములు కూడా నోచుకుంటారా ? అలా రాసారు " అని అడిగాడట.
పండితుల దగ్గరా కుప్పిగంతులు ? దానికి సీనియర్ సముద్రాల గారు నవ్వుతూ 
" చాలా బాగుంది. అసలు అరేబియా పిల్ల తెలుగులో మాట్లాడుతుందా ? ఆది చెప్పు ముందు " అన్నారట. 
ఇక దీనికి సమాధానం ఉంటుందా ?  

Vol. No. 02 Pub. No. 062

Wednesday, November 17, 2010

బాలరాజు కుర్చీ

 అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఆరవ చిత్రం బాలరాజు
అక్కినేనికి గ్లామర్ హీరోగా గుర్తింపు తెచ్చిన చిత్రం బాలరాజు

ఆంధ్ర దేశమంతా అప్పుడే బాలరాజు మీసాలు మొలిచాయి
తారల ఫ్యాన్ మెయిల్ ను తుఫాన్ మెయిల్ గా మార్చింది బాలరాజు  

' బి ', ' సి ' సెంటర్లు ' ఎ ' సెంటర్లుగా మార్చేసింది బాలరాజు 
కొత్త సినిమా హాళ్ళకు పునాదులేసింది బాలరాజు


ఇంత ఘన చరిత్ర కలిగి అక్కినేని వారికి తెలుగు చిత్ర సీమలో పదిలమైన స్థానాన్ని కల్పించిన బాలరాజు, ఆ రోజుల్లో ఆయనకి కూర్చునేందుకు కుర్చీ కూడా ఏర్పాటు చెయ్యలేకపోయింది. ఆ వైనంబెట్టిదనిన...........

బాలరాజు షూటింగ్ సమయంలో కాల్ షీట్ ఉదయం ఏడు గంటలకంటే అక్కినేని ఒక గంట ముందే అంటే ఉదయం ఆరు గంటలకే స్టూడియోకి వచ్చేవారు. అయితే అప్పటికింకా సిబ్బంది ఎవరూ వచ్చేవారు కాదు. హీరో గారికి కూర్చునేందుకు కుర్చీ కూడా ఉండేది కాదు. సిబ్బంది వచ్చేవరకూ ఆయన నిలబడి వుండాల్సివచ్చేది. ఇక ఇది పని కాదని అక్కినేని వారే తన ఇంటినుంచి ఓ కుర్చీని కారులో వేసి తెచ్చుకునేవారు. ఆనాటి శోభనాచల స్టూడియోలోని ఓ వెలగ చెట్టు క్రింద ఆ కుర్చీ వేసుకుని కూర్చునేవారు. మేకప్ సిబ్బంది వచ్చేవరకూ ఏ న్యూస్ పేపరో చదువుకుంటుండేవారు.

ఈ బాలరాజు కుర్చీ వ్యవహారం చూసి ఇదేదో హీరోకుండాల్సిన లక్షణాల్లో ఒకటి అనుకున్నారో ఏమో తర్వాతి కాలంలో హీరోలందరూ స్వంత కుర్చీలు తెచ్చుకోవడం సంప్రదాయమైంది. 

ఘంటసాల గారి గురించి ఆ బాలరాజు ఆడిన ఓ మాట..... పాడిన ఓ పాట ................Vol. No. 02 Pub. No. 061

ఈద్ ముబారక్

 త్యాగాల పండుగ ఈద్ అల్ అధా
అల్లా ఆదేశాలను పాటించిన రోజు

 ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు 


Vol. No. 02 Pub. No. 060

Tuesday, November 16, 2010

కత్తి కాంతారావు

ఆయన ఇంటి పేరు ఎవరికీ తెలియదు.
ఆయన ఇంటి పేరు కత్తి అయిపొయింది.
ఆయన కత్తివీరుడు అయిపోయాడు.

ఎన్టీరామారావు, నాగేశ్వరరావు తిరుగులేని హీరోలుగా వెలుగుతున్న కాలంలో వారితో సమానమైన స్థాయి హీరోగా నిలబడిన ఏకైక నటుడు కాంతారావు. నల్లగొండ జిల్లా గుదిబండ గ్రామంలో 1923 లో జన్మించిన కాంతారావు పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు.

ఆయన తన గ్రామ మునసబు గా వున్న రోజుల్లో వారి గ్రామానికి సురభి నాటక సమాజం వారు రావడం జరిగింది. మునసబు హోదాలో కాంతారావు గారికి ఆ ప్రదర్శనలకు ఆహ్వానం అందింది. ఆ నాటకాలను చూసాక ఆయనలోని నటుడు నిద్ర లేచాడు. వారితో బాటు తిరుగుతూ వివిధ నాటకాల్లో నటించారు. ఆ అనుభవమే సినిమాలలో తనకు బాగా ఉపయోగపడిందని నమ్మేవారాయన.

కత్తి పట్టిన జానపద వీరుడు అంటే ఇప్పటికీ కూడా మొదటగా గుర్తుకు వచ్చేది కాంతారావు గారే ! విఠలాచార్య, కాంతారావు గార్ల కలయిక జనపదులకు మహదానందం.

అగ్ర కథానాయకుల సరసన మరో అగ్ర నటుడిగా వెలుగొందిన ఆయన ఆస్తులు మాత్రం ఆ స్థాయిలో ఉండేవికావు. అయితేనేం ఆయన సంపాదించిన అమూల్యమైన ఆస్తి ప్రజాభిమానం. అగ్ర కథానాయకునిగా ఉన్నరోజుల్లో కూడా తోటి అగ్ర నాయకుడు ఎన్టీ రామారావు గారితో కలిసి చాలా చిత్రాల్లో నటించారు. అన్ని రకాల పాత్రలు పోషించారు. పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలతో బాటు కథానాయకుడిగానే కాక కాలానుగుణంగా అనేకరకాల వివిధ పాత్రలు ధరించారు.

తెలుగు చిత్ర సీమలో రాముడు, కృష్ణుడు పాత్రలకు రామారావు గారు ఎలాగో నారదపాత్రకు కాంతారావు గారు అలాగ ప్రాణ ప్రతిష్ట చేశారు. పాండవ వనవాసం, నర్తనశాల లాంటి చిత్రాల్లో కృష్ణునిగా రామారావు గారి ప్రక్కన నటించారు కూడా .

ఆయన నటుడే కాదు నిర్మాత కూడా ! ' సప్తస్వరాలు ' , ' గుండెలు తీసిన మొనగాడు ', ' స్వాతి చినుకులు ' లాంటి చిత్రాలు నిర్మించారు. అయితే చిత్ర నిర్మాణం ఆయనకు కలసి రాలేదు. ఆర్థికంగా కృంగదీసింది.

కత్తి వీరుని జన్మదినం సందర్భంగా స్మృత్యంజలి ..........................
Vol. No. 02 Pub. No. 059

Monday, November 15, 2010

కొంటె బొమ్మల బాపు

కొంటె బొమ్మల బాపు 
కొన్ని తరముల సేపు
గుండెలూయల లూపు
ఓ కూనలమ్మా !

అన్నారు ఆరుద్ర.
అది అక్షర సత్యం. 
బాపు గారి బొమ్మల్లో తెలుగుదనం ఉంది.
బాపు గారి గీతల్లో కొంటెదనం ఉంది
ఆ బొమ్మలు తెలుగు వారి ఖజానా
ఆ బొమ్మలు తెలుగు వారి మూలధనం

ఆ మూలధనాన్ని పెంచి, ఆ ఖజానాని స్వంతం చేసుకోవాలనుకునే వాళ్లకు బాపు గారిస్తున్న సందేశం...........
Vol. No. 02 Pub. No. 058

డబ్బు భలే జబ్బు

సమాజాన్ని నడిపించేది డబ్బు
ఆ డబ్బే మనుష్యుల్ని పట్టి పీడించే జబ్బు
మితిమీరి సంపాదించాలనుకోవడమే ఓ జబ్బు
ఆ జబ్బు పట్టిన మనిషి చేసేదంతా పెద్ద గబ్బు

ఆ జబ్బు చేసిన మనిషికి మనసు మనసులో వుండదు . ఆ డబ్బు సంపాదించడానికి నానా పాట్లు పడతాడు. నానా గడ్డీ కరుస్తాడు. ఉష్ణోగ్రత నార్మల్ గా వున్నప్పుడు అంత ప్రమాదం లేదు గానీ డబ్బు వైరస్ ప్రభావం పెరగడం ప్రారంభిస్తే మాత్రం అంతకంతకు టెంపరేచర్ పెరిగిపోతుంది. డబ్బు యావ ఎక్కువై పోతుంది. విచక్షణ నశిస్తుంది. ఒళ్ళు తెలియదు. ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఏం చేయబోతున్నారో తెలియదు. కళ్ళకు పొరలు కమ్మినట్లయి అన్నీ మసక మసకగా కనిపిస్తాయి. చుట్టూ వున్న వాళ్ళని గుర్తు పట్టలేరు. ముఖ్యంగా తన వాళ్ళని, తన మేలు కోరే వాళ్ళని అస్సలు గుర్తు పట్టలేరు. వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మినట్లయి నక్షత్రాలు కనబడినట్లు డబ్బు మాత్రమే కనబడుతుంటుంది. మీరు మందు పట్టించినా, ఇంజెక్షన్ చేసినా అంటే తిట్టినా, కొట్టినా వాళ్లకు తెలియదు. టెంపరేచర్ బాగా పెరిగి 104 డిగ్రీలు దాటితే సంధి ప్రేలాపన వస్తుంది అంటారు. అలాగే ఈ డబ్బు జబ్బు ముదిరిన వాళ్లకి కూడా ఇలాంటి ప్రేలాపనే వస్తుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మర్చిపోతారు. 

పాపం... అదో ట్రాన్స్. అదో లోకం. ఏదైనా జబ్బు చేసిన వాళ్ళు ఆది త్వరగా, పూర్తిగా తగ్గాలంటే సరైన మందు తీసుకోవాలి.  కొంతమంది అలౌకికానందం కోసం మత్తు పదార్థాలు లాంటివి తీసుకుంటారు. వీళ్ళకి ఆ అవసరం లేదు. డబ్బు అనే మాట చెబితే చాలు మత్తు దానంతటదే ఎక్కేస్తుంది. జబ్బు దానంతటదే పెరిగిపోతుంది. వాళ్లకి డబ్బే ఓ టానిక్. ఆస్పత్రి బెడ్ మీద దాదాపు కోమా లాంటి పరిస్థితుల్లో వున్నవాడైనా ఎక్కడైనా డబ్బు వచ్చే అవకాశం వుందంటే చాలు.  బెడ్ మీంచి అమాంతం దూకి పరుగుపెడతాడు.

ఈ జబ్బు చేసినవాళ్ళు డబ్బుంటే కొండ మీద కోతినైనా సులువుగా తీసుకురావచ్చని గట్టిగా నమ్ముతారు. పాపం వాళ్లకు తెలియదు అలా తెచ్చిన కోతిని గోలుసులేసి కట్టేసినా వీళ్ళకి ఈ డబ్బు జబ్బు తగ్గిపోగానే ఆ గొలుసులు తెంచుకుని పారిపోతుందని.  దానికీ తెలుసు డబ్బు లేకపోతే ఈ జబ్బు చేసిన మనిషి ఎందుకూ పనికిరాడని. పాపం ఈ విషయం మాత్రం ఈ జుబ్బు మనిషికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చెయ్యడు.


ఈ జబ్బు ముదిరిన వాళ్ళను గుర్తించడం చాలా కష్టం. అసలు ఏ జబ్బైనా అందులోను టి. బి. , కాన్సెర్ లాంటి దీర్ఘ రోగాల పాలిట పడ్డ వాళ్ళు రోజు రోజుకీ కృంగి కృశించి పోతారు. కానీ అదేమిటో డబ్బు జబ్బు వచ్చిన వాళ్ళు ( యావ వున్న వాళ్ళు ) మాత్రం ఆకలి దప్పులు మర్చిపోయినా పుష్టిగా బలంగానే కనబడుతారు. ఆది మనో బలమేమో మరి. అందుకే అంటారు. నమ్మకం లేని చోట ఎంత పవర్ ఫుల్ మందైనా పనిచెయ్యదని.... మనో బలాన్ని మించింది లేదని. అందులోనూ డబ్బు బలమాయే !

ఈ డబ్బు జబ్బు చేసిన వాళ్ళ పరిస్థితి ఒక్కోసారి విచిత్రంగా వుంటుంది. ఏ నిముషంలో ఏరకంగా ప్రవర్తిస్తారో, ఎవరిని దగ్గరకు తీస్తారో, ఎవరిని ఎప్పుడు దూరంగా పెడతారో చెప్పడం చాలా కష్టం. ఈ నిముషంలో మిత్రుడైన వాడ్ని మరునిముషంలో శత్రువుగా మార్చేస్తారు. ఈ నిముషంలో ఆత్మ బంధువు. మరు నిముషంలో బద్ధ శత్రువు. ఈ జబ్బున్న వాళ్ళలో కొంతమంది వుంటారు. వాళ్లకి నిలువెల్లా అనుమానమే ! అంటే ఈ జబ్బులో అదొక లక్షణమన్నమాట. తన చుట్టూ వున్నవాళ్ళందరూ తన దగ్గరున్న డబ్బుని దొంగిలిస్తారమేనని అనుక్షణం భయపడుతుంటారు. ఎవ్వరినీ నమ్మరు. చివరికి కట్టుకున్న జీవిత భాగస్వామిని, కన్న పిల్లల్ని కూడా ! తనల్ని మోసం చేసేస్తారేమోనని అడుగడుగునా అపోహ పడిపోతుంటారు. విచిత్రమేమిటంటే వీళ్ళలో చాలామంది ఇతరుల్ని ఏమార్చో, పరిమార్చో ఆ డబ్బు సంపాదించిన వారే ! స్వానుభవం గనుక వీళ్ళకు భయం ఎక్కువ. అనుమానం కూడా ఎక్కువే ! తన విద్యే తన మీద ఎవరైనా ప్రయోగిస్తారేమోనని.

ఇంకొంతమంది రోగులుంటారు. వాళ్ళు డబ్బే సమాజంలో తన హోదాని నిలబెట్టే సాధనమని గాఠిగా నమ్ముతారు. దానికోసం  ఏ అడ్డదారులైనా తొక్కి సంపాదించాలనుకుంటారు. డబ్బున్నవాడిని ఏ నీతినియమాలు, న్యాయాన్యాయాలు అడ్డుకోలేవని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. తాము ఎన్ని అక్రమాలు చేసినా, మోసాలు చేసినా ఆ డబ్బు తమని సంఘంలో గొప్ప వాళ్ళు గా నిలబెడుతుందని నమ్ముతారు. అందుకని డబ్బు సంపాదించే విషయంలో తన పర: బేధం వుండదు. సొంత మనుష్యుల్ని కూడా ఏం చెయ్యడానికైనా వెనుకాడరు. ఈ స్థితి ఈ జబ్బులో ప్రమాదకరమైన స్థితిగా చెప్పుకోవచ్చు. ఇంతగా ముదిరిన జబ్బు తగ్గాలంటే తప్పనిసరిగా సర్జెరీ లాంటిది చెయ్యాల్సిందే ! ఒక్కోసారి ఆది వికటించే ప్రమాదముంది కూడా ! అయినా అంతవరకూ వీళ్ళను తీసుకెళ్లడం కూడా కష్టమే !

ఈ జబ్బు చివరి దశలో మాత్రం వీళ్ళ పరిస్థితి ఘోరంగా వుంటుంది. అంటు రోగిలాంటి పరిస్థితి. అంటురోగిని ఎలా దూరంగా ఉంచుతారో అలాగే వీళ్ళను కూడా దూరంగా ఉంచుతారు. కాదు వీళ్ళే దూరం చేసుకుంటారు. ఆఖరి దశలో వీళ్ళను సరిగా పట్టించుకునే వాళ్ళుండరు. పెట్టేడు డబ్బు పట్టెడు అన్నం పెట్టదు. అందరి పొట్టలు కొట్టి సంపాదించిన డబ్బుతో తనకిష్టమైనవి తినడానికుండదు. ఒంటినిండా డబ్బు తెచ్చిన అనుబంధ జబ్బులు చాలా పేరుకుపోతాయి. కిలుం వదిలితే గానీ ఫలం దక్కదని ఓ సామెత. వీరి డబ్బు బలహీనతను కనిపెట్టిన వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకుంటారు. సాధారణంగా ఈ రోగులకి జబ్బు తగ్గాక గానీ ఆ విషయం తెలియదు. వంద రూపాయలు ఖర్చయ్యే చోట వెయ్యి రూపాయిలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంతకాలానికి తిరిగి చూసుకుంటే చేతులు కాలాక............ అన్నట్లుంటుంది. ఒకవేళ మన డబ్బు మనదగ్గరే భద్రంగా ఉందనుకుని ధీమాగా వున్నా ప్రమాదమే ! పండును ఎక్కువకాలం నిలవ చేస్తే కుళ్ళిపోయినట్లు డబ్బు కూడా మళ్ళిపోతుంది. తనవాళ్ళ, పరాయి వాళ్ళ కన్ను దాని మీద పడుతుంది. అంతకాలం నిద్రాహారాలు మాని, ఉచ్చనీచాలు మరచి సంపాదించిన ఆ డబ్బుని ఎలా స్వంతం చేసుకోవాలా అని ఆలోచించే వాళ్ళు చుట్టూ చేరుతారు. రకాల రకాల యుక్తులు కుయుక్తులు. మంచి ఉచ్చదశలో అందర్నీ శాసించే పరిస్థితిలో వున్న వాడు కాస్తా నైతిక ప్రవర్తన వల్లో, నిజంగానే జబ్బు చేసి అంపశయ్యపై ఉన్నప్పుడో పనికిరాని వాడవుతాడు. పరాయివాళ్ళే కాదు రక్త సంబంధీకులు కూడా ఎప్పుడు పోతాడ్రా బాబూ అతగాడి డబ్బు పంచుకుందాం అన్నట్లుగా గోతి కాడ నక్కల్లా కాచుక్కూర్చుంటారు.

మందు మితంగా పుచ్చుకుంటే జబ్బు తగ్గిస్తుంది డబ్బు అవసరమైనంత మేరకు సంపాదిస్తే మేలు చేస్తుంది  అతి సర్వత్ర వర్జయేత్ అన్న నానుడి డబ్బు విషయంలో మరింత నిజమేమో  ! లక్షల కోట్లు సంపాదించేస్తే అంతులేని కీర్తి వస్తుందన్నది... అదే శాశ్వతమన్నది భ్రమ మాత్రమే !  చనిపోయాక ' అమ్మయ్య పోయాడు ' అని కాక ' అయ్యో చనిపోయాడే ' అనిపించుకోవడమే కీర్తి శేషం ! బతికున్నప్పుడు తాత్కాలిక ప్రలోభాలకి లొంగి డబ్బు సంపాదనా యావలో పడి మంచిచెడ్డలు మరిచే వారికి కీర్తి  శేషులయ్యే అవకాశం ఎప్పటికీ రాదు. డబ్బు ఇచ్చే ఆనందం తాత్కాలికం. మంచితనం,  మానవత్వం ఇచ్చే ఆనందమే శాశ్వతం. గుడిసెలో వున్నా, రాజమహల్ లో వున్నా ఈ డబ్బు జబ్బు చెయ్యని వాడు ఎప్పుడూ రాజానే ! బతికినా చచ్చినా ఏనుగు ఎప్పుడూ విలువైనదే !  
అందుకని డబ్బుకు దాసోహం అని జబ్బు తెచ్చుకోకుండా ముందు జాగ్రత్తగా మితంగా సంపాదించడం ఆరోగ్యకరం.  
 


Vol. No. 02 Pub. No. 057

Sunday, November 14, 2010

సినీ భీష్ముని నిర్యాణం

భారతంలో భీష్ముడు అజాత శత్రువు. కురు పాండవులిద్దరికీ హితుడే !
సినీ భారతంలో డి . వి. యస్. రాజు గారు కూడా అజాత శత్రువే ! అందుకే ఆయన ' భీష్మ ' అయ్యాడు.
కొంతమందితో ఎంత ఎక్కువ పరిచయమున్నా, ఎంతకాలం పరిచయమున్నా ఎక్కువకాలం గుర్తు పెట్టుకోలేము.
కొంతమందితో ఎంత తక్కువ పరిచయమున్నా, ఎంత తక్కువకాలం పరిచయమున్నా ఎల్లకాలం మరచిపోలేము.
ఈ రెండవ తరగతి మనిషి డి. వి. యస్. రాజు గారు.
సౌమ్యత, స్నేహశీలత ఆయనకు ఆభరణాలు.

రాజకీయాలతో సన్నిహితమున్న వ్యక్తి. కానీ తనకోసం రాజకీయాలను వాడుకోని మహామనిషి. మహానటుడుగా ఉన్నకాలంలోనూ, ముఖ్యమంత్రిగా వున్న కాలంలోనూ ఎన్టీరామారావుగారికి సలహాలివ్వగలిగే స్థితిలో వున్నా కూడా ఏనాడు తన స్వార్థానికి ఈ స్నేహాన్ని ఉపయోగించుకోలేదు.

ఆ పెద్దాయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ 1987 వ సంవత్సరంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ అధ్యక్షునిగా ఉన్నకాలంలో మా ఫిలిం సొసైటీ ద్వారా ఇండియన్ పనోరమ చిత్రాలు ప్రదర్శించాలనే సంకల్పంతో వున్న అతి కొద్ది పరిచయాన్ని వుపయోగించి ఆయన్ని కోరాను. ఆ సంవత్సరమే ప్రభుత్వం అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆ విభాగంలో ప్రదర్శించే  చిత్రాలు దేశంలోని కొన్ని ఎంపిక చేసిన నగరాలలో కూడా ప్రదర్శించాలని నిర్ణయించింది. మన రాష్ట్రంలో ఆ నగరాలను ఎంపిక చేసే బాధ్యత ఎఫ్. డి. సి. తీసుకుంది. నా అభ్యర్థనను మన్నించి మా సొసైటీకి ఆ అవకాశానికిచ్చి మా అమలాపురం లాంటి చిన్న పట్టణానికి ఆ భాగ్యాన్నందించారు. ఈ ఎంపికకు ఆయన తీసుకున్న శ్రద్ధ ఎలాంటిదో చెప్పడానికి ఆయన సూచనతో ఆంధ్రప్రదేశ్ లో అమలాపురం అనే పట్టణం వుందని కూడా తెలియని ఒక ఎఫ్. డి. సి. అధికారి నాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని ఏర్పాట్లు చెయ్యడం నిదర్శనం.

రాజు గారు రాజదర్పం చూపడం నాకు తెలీదు. నిత్యకృషీవలుడు అనే మాట ఆయనకు సరిగ్గా సరిపోతుంది. అందరికీ మంచి జరగాలని, మంచి చెయ్యాలని ఎల్లప్పుడూ కోరుకునే ఆ మహామనిషి లేకపోవడం తెలుగు చిత్రసీమకు తీరని లోటు.

డి. వి. యస్. రాజు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ..............

Vol. No. 02 Pub. No. 056

Saturday, November 13, 2010

ప్లాటినం ఈ తెలుగు గానం

 తెలుగు పాటకు ప్లాటినం
తెలుగుజాతికి గర్వ కారణం
మధురమైన పాటల నందనం
గానకోకిలమ్మ సుశీలమ్మకు వందనం


తెలుగు పాట పాడింది
యావత్ జాతి నాట్యమాడింది 
తమిళ, కన్నడ పాటలు పాడింది
ఆ భాషా శ్రోతల ఆరాధ్య గాయని అయింది
ఆమె గానానికి తనువంతా పులకించింది
ఆమె పాట విని జగమంతా పరవశించింది

ఆ గానవాహిని కలకాలం సాగిపోవాలని
తెలుగు జాతి ఆ వాహినిలో పులకించి పోవాలని
.............. కోరుకుంటూ
 గానకోకిలమ్మ  సుశీలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు  

క్రిందటి జన్మదిన శుభాకాంక్షలు ఈ లింక్ లో చూడండి.

http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_13.html

Vol. No. 02 Pub. No. 55

Friday, November 12, 2010

జారిపోయిన జంట కవిత్వం

తెలుగు సాహితీ సంపద పెరుగుదలకు ఎందఱో సాహితీవేత్తలు, కవులు తమ వంతు కృషి చేశారు. వారిలో కొంతమంది జంట కవులు కూడా వున్నారు. వారిలో కొప్పరపు కవులు, తిరుపతివెంకట కవులు.... ఇలా ఎన్నో జంటలు విడివిడిగానే కాక జంటకవులుగా ప్రసిద్ధులు.


ఒకసారి ప్రముఖ కవులు దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు, గుర్రం జాషువా గారు కలసి జంటగా కవిత్వం చెప్పాలని సంకల్పించారు. ఇతర జంట కవుల్లాగే తమ పేర్లు కలసివచ్చేలాగా తమ జంటకు ఒక పేరు పెట్టుకోవాలని ఆలోచించారు. ఎంత ఆలోచించినా వీరికి తమ పేర్లలోనుంచి సరిపోయే పేరు దొరకలేదు. ఏ రకంగా చూసినా పిచ్చి జాషువా అనో , జాషువా పిచ్చి అనో, దీపాల గుర్రం అనో ...... ఇలా ఏదో పెట్టుకోవాల్సి వస్తోంది. ఎంత కసరత్తు చేసినా తమ పేర్లతో కుదిరే కుదురైన అందమైన పేరు దోరక్క చివరికి జంటగా కవిత్వాన్ని చెప్పే ఆలోచనే విరమించుకున్నారట. దాంతో మరో కవుల జంట తెలుగు సాహిత్యం చేజారిపోయింది.  


Vol. No. 02 Pub. No. 054

Wednesday, November 10, 2010

అయిదుగురు ముఖ్యమంత్రులు - జవాబులు

 కనుక్కోండి చూద్దాం..... 31 - జవాబులు 

ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి పోటీ పడ్డ అందరికీ ధన్యవాదాలు. ఆ. సౌమ్య గారు కొంచెం ఆలోచిస్తే చెప్పగలిగేవారేనేమో ! Wit Real గారు చాలావరకూ సరిగానే చెప్పారు గానీ సంస్థ పేరు విషయంలో చాలా ఛాయస్ తీసుకున్నారు. వీరుభోట్ల వెంకట గణేష్ గారు అన్నీ సరిగానే చెప్పడమే కాకుండా మంచి వివరణ ఇచ్చారు. కొత్తపాళీ గారు సంస్థని సరిగానే ఊహించినా ఎందుకో పేర్లు విషయంలో కొంచెం ఆలోచించినట్లున్నారు. మలక్పేట రౌడి గారు అన్నీ సరిగానే చెప్పారు. అజ్ఞాత గారు చెప్పిన జానకి రామచంద్రన్ గారు ఒకప్పుడు నటి అయినా ఎక్కువ చిత్రాలు చెయ్యలేదు. AVM చిత్రాల్లో చేసిన దాఖలాలు లేవు. మిత్రులేవరిదగ్గరైనా దీనికి సంబంధించిన సమాచారం వుంటే తెలియజెయ్యగలరు.


దక్షిణ భారత దేశంలోని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణసంస్థలో 
వివిధ విభాగాలలో అయిదుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు.

అ.) ఆ సంస్థ పేరేమిటి ?          

జవాబు : AVM ప్రొడక్షన్స్    


ఆ.) ఆ అయిదుగురు ముఖ్యమంత్రులు ఎవరు?  
జవాబు : 1 . నందమూరి తారక రామారావు  - సంఘం, రాము లాంటి చిత్రాల్లో నటించారు.
            2 . ' ఓర్ ఇరవు ' అనే చిత్రానికి సి. ఎన్. అణ్నాదురై రచయిత 
            3 .  ' పరాశక్తి ' చిత్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి రచయిత
            4 . తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎమ్జీఆర్
            5 . జయలలిత చాలా చిత్రాల్లో నటించారు. 

Vol. No. 02 Pub. No. 53a

Tuesday, November 9, 2010

అయిదుగురు ముఖ్యమంత్రులు


 కనుక్కోండి చూద్దాం..... 31 


దక్షిణ భారత దేశంలోని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలో వివిధ విభాగాలలో అయిదుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు.

అ.. ఆ సంస్థ పేరేమిటి ?

ఆ. ఆ అయిదుగురు ముఖ్యమంత్రులు ఎవరు ?
Vol. No. 02 Pub. No. 053

Monday, November 8, 2010

సి. యస్. ఆర్. హస్త సాముద్రికం

 తెలుగు చిత్ర రంగంలో కొన్ని పాత్రల గురించి ప్రస్తావన వస్తే కొంతమంది నటులు ప్రత్యేకంగా గుర్తుకువస్తారు. భారతంలోని శకుని పాత్ర పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది చిలకలపూడి సీతారామాంజనేయులు. సి. యస్. ఆర్. గా ప్రసిద్ధుడైన ఈయన రంగస్థలం నుండి చిత్రరంగానికోచ్చిన వారే ! 1930 దశకంలో కథానాయకుడిగా వెలిగిన ఈయన 1950 దశకంలో క్యారెక్టర్ నటుడిగా మారారు. దేవదాసులో పార్వతిని పెళ్ళాడిన జమిందారు పాత్రలో ఆయన నటన ఎవరూ మర్చిపోలేరు. ఆ చిత్ర నిర్మాణ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆయన మాటల చమత్కారానికి నిదర్శనం.

దేవదాసు షూటింగ్ విరామ సమయంలో సెట్ బయిట కూర్చున్న సావిత్రితో సి. యస్. ఆర్.
" అమ్మాయీ ! ఏదీ నీ చెయ్యి చూపించు " అన్నారు.

సావిత్రి  తన చెయ్యి చూపించి ఆయన ఏం చెబుతారా అని కుతూహలంగా చూస్తోంది . కాసేపు తదేకంగా ఆ చెయ్యిని పరిశీలించిన సి. యస్. ఆర్.
" నీకు మూడు ముఖ్యమైన విషయాలు చెబుతాను. అవి
ఒకటి నిన్నెవరూ సరిగా అర్థం చేసుకోరు.
రెండు నీ ప్రతిభకు తగ్గ వేషం దొరకడానికి ఇంకా కొంత కాలం పట్టవచ్చు
మూడు నీకు అప్పుడప్పుడూ స్టమక్ ట్రబుల్ వస్తూంటుంది " అన్నారు.

సావిత్రి ఆశ్చర్యపోయి " ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు ? " అని అడిగింది.

దానికి సి. యస్. ఆర్. నవ్వుతూ " ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది. ఎవరి చెయ్యి చూసినా ఈ మూడు విషయాలు మాత్రం సులువుగా చెప్పెయ్యొచ్చు . ఇవి అందరికీ అన్వయించే విషయాలే ! " అన్నారు. 

Vol. No. 02 Pub. No. 052

Saturday, November 6, 2010

భమిడిపాటి వారి ' దీపావళి '

నిన్న దీపావళి. ఈ దీపావళి పండుగ చిన్నతనంలోని చిలిపి జ్ఞాపకాలను వెలికి తెచ్చింది. అవన్నీ ఒక మాలగా గుదిగుచ్చి అందిద్దామని ప్రయత్నిస్తుండగా గతంలో చదివిన హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారి ' దీపావళి ' వ్యాసం గుర్తుకొచ్చింది. నా అనుభవాలని గుర్తు చేసే ఆ వ్యాసంలోని కొంత బాగం ఇక్కడ అందిస్తున్నాను. గిలిగింతలు పెట్టే ఆ భాగాన్ని అందుకుని ఆస్వాదించండి.
దీపావళిలో ‘ దీపం ‘ వేసి చూడకుండానే కొందరు మాట్టాడతారు. వెనక ఒక రాక్షసుడు చచ్చిపోయాడు గనుక వాడి నిమిత్తం మనం పిండివంటల్తో భోంచెయ్యాలనీ, దీపావళి నాటికి వాన్లు వెనకట్టడం జరుగుతుంది గనుక లోగడ పుట్టిపెరిగిన క్రిమి కీటకాదులు ( నలకలడయోరభేధ: ) సమూలంగా నశించడానికి దేశం అంతా తలంట్లుపోసుగుని బాణాసంచా కాల్చాలనీ, అల్లుళ్ళని పిలవడానికి ఆదే సందర్భంగనుక వాళ్ళ ముఖతేజం ఎక్కువ చేసే నిమిత్తం మతాబాలు కాల్పించాలనీ, మొదలైన పూర్వగాథలకి తడుముకోనూ లేదు. 

దీపావళి కాల్పులికి దరిద్రుడూ, ధనికుడూ వివక్షత లేదు, గానీ పిన్నా పెద్ద వివక్షతా, ఖర్చూ బేఖర్చూ వివక్షతా, కసీ బేకసీ వివక్షతా ఉన్నాయి. పిన్నలకి ఏదో ఇంత తగలేయ్యాలనీ, పెద్దలకి ఖర్చులేకుండా ఉంటే సరి ఇంకా తగలెయ్యమనీ ! దరిద్రుడైనా సరే కసి ఉంటే తల తాకట్టేట్టయినా సరే నరకాసురుణ్ణి దహనం చేస్తాడు. ఇంతవరకింకా దీపావళిలో దీపంసంగతి అప్రధానం అయిందే కానీ, ఆరిపోలేదు. 

ప్రధాన విషయం చప్పుడు ! ఎంత గొప్పచప్పుడు చేస్తే అంతా గొప్ప దీపావళి యోధుడు. దరిద్రుడు కాగితపు టపాకాయను పేల్చడం, ( సంచీ లామడిచి, ఒకవైపు చిల్లు చేసి, గాలి పోరించి, అది పొంగిన తరవాత నేల మీద పెట్టి ఒకటిచ్చుగుంటే ఠప్పుమనేవి ), ఖాళీ డబ్బాలు వాయించడం, డబ్బాలోరాళ్లేసి వేళ్లాడ గట్టి రెండు మూడు రకాల కర్రల్తో బాదడం - తరవాత తాటాకు టపాకాయలు ! ఇవేనా లేకుండా ఎవరూ ? ఇవి క్రమేపీ చౌకఅవడం కద్దు. మేఘదర్శనం అయేసరికి ఇవి కాళ్ళుపారజాచేస్తాయి. మరీ నాసిరకం పేలకపోయినా నాలిక గీసుకోవచ్చని కొందరు కొనడం. ఇవి పెల్తే ఒట్టి పేలుడే ! కానీ ఎడా పెడా ఎడా పెడా వాయించినట్టు పేలే సీమటపాకాయలు. ఎల్లానూ సీమ సీమే ! కొందరికి కసి ఆగక రెండుమూడు సీమటపాకాయల గుత్తులు కిరసనాయలు డబ్బాలోపడేసి అవి చెడామడా క్షోభపడిపోతోంటే ' వెయ్ వెయ్ ' అని కేకలేస్తూ డబ్బాని చావగొట్టడం ! 
గోడటపాకాయలని కూడా వస్తుండేవి  అరుగులమీద పరధ్యానంగా కూచున్న వాళ్ళు ఉలిక్కిపడేటట్లు ఒక్ఖటి గోడనిబాదేసి, దీపావళివీరుడు పరక్షోభగురించి నవ్వుకుంటూ పోతుండేవాడు. అవే నేల్నెట్టి జబ్బనేప్పెట్టేలాగా కొట్టేవాళ్లు కొందరు.వీట్లని మించిపోయినవి ఔట్లు. ఔట్లు పేల్చేవాళ్లు మహాధ్వనికారుల్లో జమ.ఒక దీపావళి రౌతు ఒక ముసలాయనతో చెప్పకుండా ఔటు పేల్చేసరికి ఆయనగుండే ఆగిపోయింది. అది ఆగిపోవడంవల్ల తెలిసింది గాని లేకపోతే ఆయనకి గుండె ఉన్నసంగతి తేలకపోయేదిగదా అన్నాడు ఆ రౌతు. 
వెలుగు గురించిన ఆరాధనలో మతాబాలు సార్థకం అయినా, అవి కాల్చడం అనేదాన్లో పౌరషం లేదు పొమ్మన్నారు. ఎందుకంటే - ప్రతి సందర్భంలోనూ ప్రతీవాళ్లూ మతాబా కాల్చగలరు గనుక ! కాల్చడంలో ఒకచోటనుంచి మరోచోటుదాకా వెళ్ళి ఇతరుల్ని బాధపెట్టే బాపతైన తూటాల వంటి వాట్లకి ఘరానాఎక్కువ. ఎడంచేత్తో అంటించిన తూటా పట్టుగుని ఇటూ అటూ రవ్వలు చిమ్ముతూ, ఒకవేళ చీదినా, అరిచెయ్యి దానిమ్మకాయ పగిలినట్టు పగిలినా, కిక్కురుమనకుండా చివరదాకా నిల్చేవాళ్లూ, 'బాబోయ్ ' అని తోకముడిచేవాళ్లూ ఉండేవాళ్ళు. కానీ, ఎంత ఎత్తుకి వేడితే అంత గొప్పవాడు అనేది దీపావళిలోనూ నిజమే. దీపావళి భటుడి అసలు అస్త్రం జువ్వ.అతడు జువ్వల రంగడు. జువ్వవదలడం కొత్తగా నేర్చుగునేవాళ్ళు తాటాకు చూర్లకీ చుట్టుపక్కజనానికీ భయకారణంగా ఉండేవాళ్లు. ఆరి తేరిన వాళ్ళు అల్లాంటిపన్లు చెయ్యక, ఊరవతలకిపోయి పాతిగముఫ్ఫై గజాల్లో ఎదరేదరగా నుంచుని, జువ్వలు నేలబారుగా వదిలి, పోటీ చేసుగునేవాళ్లు. దెబ్బలు తగిలినవాళ్ళని తక్కిన వాళ్ళు ఇంటికి మోసుకెళ్ళేవాళ్లు. అవీ ఇనీ కొనడంకంటే మనమే కట్టుగుంటే సొమ్ముకిమించిన సరుకొస్తుంది అనేగడుసుదనంతో వ్యవహరించి, యథాశక్తిగా కాళ్ళూ, వేళ్లూ, చేతులూ, చర్మమూ, వొళ్లూ, ఇల్లూ, ప్రాణమూ ధారపోసిన దీపావళి మత భక్తులుంటుంటారు - సంస్థ స్థాపించిన వాళ్ళ ఉద్దేశం ఈభక్తి కాదేమో అనితోస్తుంది. ఏమిటో, చెప్పలేం ! కొంత పిరికి తనం, కొంత దారిద్ర్యం, కొంత ఇతరులకి బాధ గలిగి దెబ్బలాట కోస్తారనే భయం - ఇవన్నీ ఉండడంవల్ల, నేను ఏ మతాబా అగ్గిపుల్లేనా కాల్చి ఉంటాను, గాని ఒకటోరకమైన మతాబాయేనా కాల్చినట్టు జ్ఞాపకంలేదు.
ఇదో రకం : 
" బాణాసంచా అంటే చెవి కోసుగుంటారు. సూర్యాస్తమయాలు చూసి ఆనందించలేరు కొందరుజనం " అంటాడు ఒక కవి.

 


Vol. No. 02 Pub. No. 051

Friday, November 5, 2010

దిబ్బు దిబ్బు దీపావళి ...........

దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి
..............


గోగు మొక్కల దివిటీలు
దుష్టశక్తులను తరిమే కమిచీలు
పిల్లలకు అవి రక్షణ కవచాలు 
ఏవీ ఎక్కడా ఆ దివిటీలు ....
ఇక అవి గతకాలపు జ్ఞాపకాలుమతాబులు.... కాకర పువ్వోత్తులు......
చిచ్చుబుడ్లు..... పటాసులు........
చిన్ని చిన్ని బుడతల కళ్ళల్లో మెరిసే కాంతులు
చెడును పారద్రోలి మంచిని తెచ్చిన నవ్యక్రాంతులు


 కుళ్ళు, కుత్సితాలును పారద్రోలే రోజు
అన్యాయం, అక్రమాలను రూపుమాపే రోజు
స్వార్థం, అధర్మాలను అంతం చేసే రోజు
 దోపిడీలను, దౌర్జన్యాలను అరికట్టే రోజు
మనకి అసలైన దీపావళి ఆ రోజు 

చైతన్య దివిటీలు వెలిగిద్దాం
అజ్ఞానపు చీకట్లు తొలగిద్దాం
దుష్టశక్తులను తరిమికొడదాం !

అందుకే దిబ్బు దిబ్బు దీపావళి ........

Vol. No. 02 Pub. No. 050

Thursday, November 4, 2010

నరకాసుర సంహారం చేద్దాం !


భూమాత పుత్రుడు నరకాసురుడు
బ్రహ్మ వరం ప్రజలపాలిట శాపమయింది
అహంకారం హద్దులు దాటింది
దుర్మార్గం దుష్టత్వం విజృంభించింది
అన్యాయం అరాచకం ప్రబలింది


ధర్మ సంస్థాపకుడు శ్రీకృష్ణుడు
దుర్మార్గుడైన నరకాసురుడ్ని
సత్యభామా సహితుడై సంహరించాడు
దుర్మార్గానికి స్వ పర భేధం లేదని నిరూపించాడు

అరాచకాలు అంతమైన రోజు
అకృత్యాలకు భరత వాక్యం పలికిన రోజు
నరకాసురవధ జరిగిన రోజు
 ఆరోజే నరక చతుర్దశి

 తెల్లవారు ఝామునే మేలుకోవడం
తలారా స్నానాలు చెయ్యడం
మిఠాయి తినడం.. బాణాసంచా కాల్చడం
చెడుపై విజయాన్ని సంబరంగా జరుపుకోవడం

మరి ఈనాడు మన చుట్టూ నరకాసురులెందరో
ఆ నరకాసురులను చంపే కృష్ణుడెక్కడున్నాడో ...
నిజానికి మనలోని మాత్సర్యం, అహంకారాలే నరకాసురులు
వాటిని అంతం చెయ్యగలిగితే మనం కూడా సత్యభామా శ్రీకృష్ణులం 

Vol. No. 02 Pub. No. 049

Wednesday, November 3, 2010

శంకరశాస్త్రి....శారద.... ? - జవాబులు

  కనుక్కోండి చూద్దాం - 3 0 - జవాబులు 

ఈ ప్రశ్నలకు స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. మాధురి గారు మొదటి ప్రశ్నకు సరైన సమాధానమిచ్చారు. లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారు, కేకే గారు ఇచ్చిన సమాధానాలు అప్పట్లో కొన్ని ఆలోచనలు మాత్రమే ! పూర్తిగా నిర్ణయించినవి కావు. ఇక జవాబులు చూడండి.

 తెలుగు చిత్ర రంగంలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో రెండు ప్రధానమైన పాత్రలు శంకరశాస్త్రి, ఆయన కూతురు శారద.
ఈ పాత్రలను పోషించిన సోమయాజులు గారు, రాజ్యలక్ష్మి చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ పాత్రలకు ముందుగా నిర్ణయించింది వారిని కాదు.

మరి ముందుగా అనుకున్న ......
* శంకరశాస్త్రి ఎవరు ?
జవాబు : కృష్ణంరాజు గారు. అయితే అంతటి ఉదాత్తమైన పాత్ర ఔచిత్యానికి తన రెబెల్ హీరో ఇమేజ్ అడ్డు వస్తుందేమోననే సందేహం వ్యక్తపరచడంతో.... చాలా ఆలస్యంగా అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రముఖ రంగస్థల నటుడు జే. వి. సోమయాజులు గారిని ఎంపిక చెయ్యడం జరిగింది.  

* శారద ఎవరు ?
జవాబు : తొలుత ఈ పాత్రకు అప్పడప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న జ్యోతిని అడిగారు. అయితే ఆ పాత్ర ప్రాధాన్యం తక్కువ అనే ఉద్దేశ్యంతో ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆ పాత్ర కూడా అప్పట్లో పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టిన రాజ్యలక్ష్మిని వరించింది. 

Vol. No. 02 Pub. No. 046a

Monday, November 1, 2010

కర్తవ్యం

కీర్తిశేషులు భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు చాలా సన్నిహితులు. ఇద్దరి మధ్యా అంతులేని ఆత్మీయత ఉండేది.  విలువలు పాటించే ఆ రోజుల్లో కర్తవ్యానికి స్నేహం అడ్డు రాకూడదని నమ్మిన వారు.

ఓసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. సుభాష్ చంద్రబోస్ కు పోటీగా గాంధీగారి అభ్యర్థిగా పట్టాభిగారు నిలబడ్డారు. ఆ సందర్భంలో ముట్నూరి కృష్ణారావు గారు తన పత్రికలో పట్టభిగారిని ఘాటుగా విమర్శిస్తూ సంపాదకీయం రాసారు. ఈ విషయం తెలిసి తనకు అత్యంత ఆత్మీయుడు, తన గురించి సంపూర్ణంగా తెలుసున్న మిత్రుడు కృష్ణారావు గారు అలా రాసినందుకు పట్టభిగారు చాలా బాధపడ్డారు.

వారిద్దరికీ ఆత్మీయులైన కొందరు ఈ విషయాన్ని ముట్నూరి వారి దగ్గర చెప్పారు. అప్పుడాయన  తన తల మీద వున్న తలపాగాను తీసి బల్ల మీద పెట్టారు.
" ఇప్పుడు పట్టాభిని ఎవరైనా పల్లెత్తు మాటన్నా చీల్చి చెండాడేస్తాను " అన్నారు ముట్నూరివారు.

తలపాగా వృత్తి చిహ్నం. వృత్తి ధర్మం ఆయన చేత పట్టాభిగారిపై విమర్శలు చేయించింది.
స్నేహం వ్యక్తిగతం. ఆ స్నేహం ఆయన చేత మిత్రునికి రక్షణ కల్పించింది.

కర్తవ్యం వేరు......... వ్యక్తిగతం వేరు.........

................ అవీ అప్పటి పత్రికారంగ విలువలు.

Vol. No. 02 Pub. No. 048

రెండో రాముడు

గతంలో రంగస్థల నాటకాలు సుదీర్ఘంగా సాగేవి. అందుకని రాముడు, కృష్ణుడు వంటి ముఖ్య పాత్రలను ఇద్దరు ముగ్గురు నటులు ధరించేవారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు..... ఇలా ఆ పాత్రని ఫలానా నటుడు ధరిస్తాడని అని కరపత్రాల్లో ముద్రించేవారు.

అలాగ కాదుగానీ  మనకి వెండి తెర రాముడు అంటే గుర్తుకొచ్చేది నందమూరి తారక రాముడే ! ఆయన్ని తప్ప ఊహించుకోలేకుండా వున్న పరిస్థితుల్లో ఆయనే తన స్వంత చిత్రం ' సీతారామకల్యాణం ' లో మరో రాముణ్ణి ప్రవేశపెట్టారు. ఆ రాముడే హరనాథ్.

హరనాథ్ తండ్రి నటుడు అవ్వాలని మద్రాస్ చేరి సహకార దర్శకుడిగా మారారు. హరనాథ్ కి కూడా సినిమాల మీద, నటన మీద ఆసక్తి వున్నా తండ్రి తన అనుభవంతో విధించిన ఆంక్షల కారణంగా బి.ఏ. పూర్తి చేసేవరకూ ఆవైపు తొంగి చూడలేదు. ఇంటర్ మద్రాస్ లో చదివేటపుడు బాపు రమణలు ఆయన సహాధ్యాయులు. కాకినాడలో బి.ఏ, చదివేటపుడు ప్రముఖ నిర్మాతలు వి. బి. రాజేంద్రప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు లు సహాధ్యాయులు.

తండ్రి వల్లో, మిత్రుల వల్లో హరనాథ్ కు సినిమాలలో అవకాశం రాలేదు.  బి.ఏ. పూర్తిచేసి మిలిటరీలో చేరే ఉద్దేశ్యంతో మద్రాస్ కొచ్చిన హరనాథ్ ఒకరోజు కోడంబాక్కం బస్సు స్టాప్ లో నిలబడి వుండగా అప్పట్లో ప్రముఖ కళాదర్శకుడైన సూరన్న చూసి తన కారు ఆపి ' సినిమాలో వేషం వేస్తావా ? ' అని అడిగాడు. తన చిరకాల కోరిక తీరే అవకాశం తనని వెదుక్కుంటూ వచ్చినందుకు షాక్ తిన్న ఆయన్ని నవశక్తి గంగాధరరావు గారికి పరిచయం చేశారు సూరన్న. అతని రూపం, హావభావాలు నచ్చి గుత్తా రామినీడు దర్శకత్వంలో తాను నిర్మించబోయే చిత్రంలో అవకాశం ఇచ్చారు గంగాధరరావు గారు.    

అలా హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో చిత్రీకరించబడ్డ మొదటి చిత్రం ' మా ఇంటి మహాలక్ష్మి ' తో 1959 లో చిత్రరంగ గృహప్రవేశం చేసిన హరనాథ్ 60 వ దశకంలో తెలుగు చిత్ర సీమలో ప్రముఖ హీరోల సరసన చేరాడు. బడ్జెట్ చిత్రాల హీరో గా, పురాణ పాత్రలకు సరిపోయే ఆకారంతో, చూడ చక్కని రూపంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. జమున, హరనాథ్ జంట అప్పటి ప్రేక్షకుల కన్నుల పంట.  ' భీష్మ ' ( 1967 ) చిత్రంలో కృష్ణుడిగా,  ' శ్రీరామకథ '   ( 1969 ) లో మరోసారి రాముడిగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 130 చిత్రాల్లో నటించిన హరనాథ్ చివరి చిత్రం ' నాగు ' .  దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తొలిసారి హీరోగా నటించిన ' పగడాల పడవ ' చిత్రంలో హరనాథ్ ఓ ప్రముఖ పాత్ర పోషించారు. ఆ చిత్రం విడుదల కాలేదు.

ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి అన్ని లక్షణాలు వున్న వ్యక్తి కొన్ని అవలక్షణాల బారిన పడితే తన పతనం తానే కోరి తెచ్చుకున్నట్లవుతుందని చెప్పడానికి హరనాథ్ జీవితమే ఒక ఉదాహరణ.

ఈరోజు ( నవంబర్ 1 )  హరనాథ్ వర్థంతి. ఆయనలోని నటుడిని స్మరించుకుంటూ ..............Vol. No. 02 Pub. No. 047
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం