Tuesday, November 29, 2011

మార్గశీర్షం....

 కార్తీకం వెళ్ళి మార్గశీర్షం ప్రవేశించింది. మాసాల్లోకెల్లా మార్గశిరం విశిష్టమైనదంటారు.
ఆ విశిష్టత ఏమిటో...
నమో శ్రీ సూర్యనారాయణం అంటూ సాగే స్వరగంగా ప్రవాహం ఎలా వుంటుందో......
విదేశీ వాద్యాలమీద స్వదేశీ రాగాలను సాధ్యం చేసిన ఘనులెవరో ......
తెలుపుతూ......
ఇంకా అనేక విశేషాలతో వెలువడిన.... శిరాకదంబం వెబ్ పత్రిక తాజా సంచికలో....

వార్తావళి
 గాయక సార్వభౌమ జయంతుత్సవం

  
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 080

Wednesday, November 23, 2011

' మా తెలుగు తల్లి ' కవికి గుర్తింపు...?

 1975  లో హైదరాబాద్ లో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అంత పెద్ద ఎత్తున, అంత వైభవంగా మళ్ళీ జరగలేదేమో ! అప్పటికి విద్యార్థిగా వున్న నాకు ఆ సభలకు ప్రతినిధిగా హాజరయ్యే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఎంతోమంది తెలుగు వెలుగుల్ని చూడగలిగే అదృష్టం కలిగింది. ఆ సభలకు ప్రతినిధులుగా దేశ విదేశాల్లోని తెలుగు వారెందరో వచ్చారు.

ప్రధాన వేదికగా లాల్ బహదూర్ స్టేడియం వున్నా అనేక సదస్సులు, సమావేశాలు నగరంలోని పలుచోట్ల జరిగేవి. అలా రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంతో తెలుగు జాతి పులకించిపోయింది. దానికి కారణం అప్పటివరకూ రేడియో ద్వారా, రికార్డుల ద్వారా మాత్రమే వినబడుతూ వచ్చిన గేయం, స్వరం వేదికపైన ప్రత్యక్షమై సభికులందరికీ వీనుల విందుతో బాటు కనుల విందు కూడా చేసింది.

ఆ గేయమే ' మా తెలుగు తల్లికి మల్లె పూదండ '


ఆ గేయాన్ని మధురంగా, భావయుక్తంగా ఆలపించి ప్రతీ తెలుగు వాడినీ పులకింప జేసిన గాయనీమణి టంగుటూరి సూర్యకుమారి. అప్పటికే ఇంగ్లాండ్ లో స్థిరపడి అక్కడి పౌరసత్వం కూడా తీసుకున్న ఆమె గురించి తెలియని తెలుగు వారుండరు. గాయనిగా, నటిగా ... బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు వారందరికీ ఆమె సుపరిచితమే ! అలాంటి గాన సరస్వతి వేదిక మీద ప్రత్యక్షంగా కనిపించడమే కాక ఆ గేయాన్ని పాడి వినిపించడం అందర్నీ అలరించింది. దాంతో అందరూ తమ హర్షధ్వానాలు తెలియజేసారు. పూలదండలతో, ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కోలాహలానికి సూర్యకుమారి గారు స్పందిస్తూ

" నా పాటకు ఇంతగా ప్రశంసల వర్షం కురిపించినందుకు చాలా సంతోషం. కానీ ఇంతటి గొప్ప పాట రాసిన అచ్చ తెలుగు కవి...... అరుగో....... అక్కడ జనం మధ్యలో ఇరుక్కుని నలిగిపోతున్నారు. ముందు ఆ మహాకవి గొప్పతనాన్ని గుర్తించి గౌరవిస్తే ఇంకా సంతోషిస్తాను "అనగానే జనమంతా ఆయన వైపు తిరిగారు. ఆయనే ఆహార్యంలో సాదా సీదాగా కనిపించే శంకరంబాడి సుందరాచారి. అంతవరకూ తమ మధ్యలోనే వున్నా ఆయన్ని గుర్తించని సభికులు వెంటనే తమ చేతులే ఆసనంగా చేసి వేదికపైకి తీసుకొచ్చి ఘనంగా సన్మానించారు. ఆయనకు మళ్ళీ లాల్ బహదూర్ స్టేడియంలోని ప్రధాన వేదికపైన కూడా ప్రజలందరి సమక్షంలో సన్మానం జరిగింది.
 గ్లామర్ , ఆర్భాటాలు ఉంటేగానీ ప్రతిభను త్వరగా గుర్తించరేమో తెలుగు వారు. Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 079

Tuesday, November 22, 2011

ఇతిహాసములు అంటే.......

 పురాణములు అనగా ఏమిటి ? వాటిలో అంతర్లీనంగా వున్న విశేషాలేమిటి అన్నది క్రిందటి వారం తెలుసుకున్నాం కదా ! ఈ వారం ఇతిహాసములు అంటే ఏమిటి ? పురాణములకు, ఇతిహాసౌలకు ప్రధానముగా వున్న బేధమేమిటి అన్న విషయాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు  
' ఆథ్యాత్మికం ' పేజీ లో ...........

ఇంకా ఎన్నో విశేషాలతో శిరాకదంబం తాజా సంచిక విడుదలయింది. ఈ సంచికలోని రచనలు చదివి పత్రిక మీద, రచనల మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు ఈ క్రింది మెయిల్ చిరునామాకు తెలియజెయ్యండి.

sirarao@gmail.com

ఈ శనివారం లోపు వచ్చే అభిప్రాయాలని వచ్చే సంచికలో అభిప్రాయ కదంబంలో ప్రచురించబడును. పత్రిక పురోభివృద్ధికి మీ సూచనలు, సలహాలు, రచనలు వగైరా చాలా అవసరం.

విషయసూచిక ఇదిగో..............

 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 078

Friday, November 18, 2011

' శకపురుష ' వేదాంతం

నృత్య కళామతల్లికి ప్రీతిపాత్రమైనది గ్రామం కృష్ణా జిల్లాలోని కూచిపూడి. ఆ గ్రామమే నాట్య సరస్వతీ నిలయం. అక్కడ నిత్యం నటరాజు తాండవం చేస్తుంటాడు. సిద్ధేంద్రయోగి కలలరూపం కూచిపూడి నాట్య సంప్రదాయం. అక్కడ ప్రతీ కుటుంబం ఆ నాట్య కళామతల్లి సేవలో తరిస్తుంటుంది.

తెలుగు వారి కళా వైభవానికి చిహ్నమైన ఆ కూచిపూడి గ్రామంలో నాట్యానికి అంకితమైన కుటుంబంలో వేదాంతం రామయ్య అన్నపూర్ణమ్మ దంపతులకు లభించిన నటరాజ ప్రసాదం  రాఘవయ్య. అయిదు సంవత్సరాల లేత వయసులో చింతా వెంకటరామయ్య గారి శిష్యరికం లభించింది. రాఘవయ్య గారికి నాట్యం మీద ఆసక్తి, అంకిత భావం కలిగించడానికి గురువు గారి పాత్ర ప్రధానమైనది.  దాంతో ఆయన ప్రతిభ బహుముఖాలుగా విస్తరించింది. నాట్యం, సంగీతం, నటనలతో బాటు తాళజ్ఞానం అపారంగా లభించింది. ఏడు సంవత్సరాల వయస్సులో ప్రహ్లాదుడిగా ఆరంగేట్రం చేసారు రాఘవయ్య. ఆ మొదటి ప్రయత్నమే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి బంగారు పతకం సాధించి పెట్టింది. ఇది కూచిపూడి నాట్య  సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. ఆయన లోహితాస్య, కుశలవులు లాంటి ఎన్నో  పాత్రలు పోషించారు. నాట్యానికి తగ్గ గానం ఆయనలోని విశిష్టత. ఇవన్నీ ఒక ఎత్తైతే చింతా వెంకటరామయ్య గారు తీర్చిదిద్దిన ఉషాకన్య పాత్ర రాఘవయ్య గారి కళాజీవితంలో మరో ఎత్తు. ఆ వేషం, అభినయం, గానం ఆయన కళా జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. అప్పటి నుంచి సీత, లీలావతి, చంద్రమతి, శశిరేఖా, మోహిని, సత్యభామ లాంటి స్త్రీ పాత్రల్లో ఆయన అందంగా ఒదిగిపోయారు.

తర్వాత కాలంలో రాఘవయ్య గారు కొందరు మిత్రుల సహకారంతో స్వంతంగా ప్రభాకర నాట్యమండలిని స్థాపించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అందులో వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తి లాంటి ప్రముఖులు సభ్యులుగా వుండేవారు. అప్పటివరకూ కూచిపూడి నాట్యంలో చిరకాలంగా వస్తున్న  కొన్ని మూఢ సంప్రదాయాలకు స్వస్తి పలికి ఆధునికతను జొప్పించి ప్రశంసలందుకున్నారు రాఘవయ్య. సుమారు పద్దెనిమిదేళ్ళ పాటు తన కళా వైశిష్ట్యాన్ని ప్రజలకు పంచారు. ఈ కాలాన్ని రాఘవయ్య యుగంగా చరిత్రకారులు వర్ణించారు. రాఘవయ్య గారి శ్లోకాభినయానికి, పదాభినయానికి ఆనాటి మేధావుల ప్రశంసలు లభించాయి. హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారి చేతుల మీదుగా శకపురుష బిరుదునందుకున్నారు రాఘవయ్య .

తెలుగు సినిమా మొదలైన దశాబ్దంలోనే వేదాంతం రాఘవయ్య గారి తెరంగేట్రం కూడా జరిగింది. 1932  లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గార్ల సమక్షంలో మద్రాసులో జరిగిన నాట్య కళాపరిషత్తు లో రాఘవయ్య గారి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసారు గూడవల్లి రామబ్రహ్మం గారు. నాగేశ్వరరావు పంతులుగారు ఆ ప్రదర్శనకు ముగ్ధులై రాఘవయ్యగారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చెయ్యాల్సిందిగా రామబ్రహ్మం గారికి సూచించారు. అయితే దీనికి గురువుగారి అనుమతి లభించలేదు రాఘవయ్యగారికి. అయినా పలువురి ప్రోత్సాహంతో ' మోహిని రుక్మాంగద ' చిత్రంలో నాట్యం చేసారు. కానీ అనుకున్నంత పేరు రాలేదు. దాంతో నిరుత్సాహపడినా రామబ్రహ్మం గారి ప్రోత్సాహంతో ' రైతుబిడ్డ ' చిత్రంలో చేసిన దశావతారాలు నృత్యం ఆయనకి చిత్రసీమలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పిమ్మట గరుడ గర్వభంగం, పంతులమ్మ, స్వర్గసీమ, సీతారామజననం, త్యాగయ్య, యోగి వేమన లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు నృత్యదర్శకత్వం వహించారు.

రాఘవయ్య గారిలోని సృజనాత్మకత, ప్రతిభ, తపన నృత్య దర్శకత్వంతో తృప్తి పడలేదు. ఫలితంగా మిత్రులు డి. ఎల్. నారాయణ, సముద్రాల, సుబ్బరాయన్ గార్ల సహకారంతో  వినోదా పిక్చర్స్ వెలసింది. మొదటి చిత్రంగా ' స్త్రీ సాహసం ' విడుదలయింది. రెండవ చిత్రంగా శరత్ బాబు నవలను అద్భుత దృశ్య కావ్యంగా మలచిన చిత్రం ' దేవదాసు ' రాఘవయ్య గారి ప్రతిభను లోకానికి చాటింది. ఆ తర్వాత తెలుగు తెర దృశ్య కావ్యాలు అనదగ్గ ' అనార్కలి ', ' చిరంజీవులు ', ' భలేరాముడు ',  ' సువర్ణ సుందరి ', ' బాలనాగమ్మ ', ' ఋణానుబంధం ', ' ఆడబ్రతుకు ', ' రహస్యం ', ' సతీ సక్కుబాయి ', ' సప్తస్వరాలు ' లాంటి ఎన్నో చిత్రాలను అందించారు రాఘవయ్య.

బహుముఖ ప్రజ్ఞాశాలి వేదాంతం రాఘవయ్య గారి వర్థంతి సందర్భంగా కళా నీరాజనాలు సమర్పిస్తూ......


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 077

Thursday, November 17, 2011

స్థితప్రజ్ఞత

ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆత్మస్థైర్యం చెక్కు చెదరకుండా ఉండగలగడం అందరికీ సాధ్యం కాదు. దానికి ఎంతో మనోనిబ్బరం వుండాలి. మహనీయులకు గానీ అది సాధ్యం కాదు.

కాంగ్రెస్ కు స్వర్ణయుగం మన దేశ స్వాతంత్ర్యానికి ముందు కాలమనే చెప్పవచ్చు. నిజానికి కాంగ్రెస్ చరిత్రను స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత అని విడదీసి చూస్తే పూర్వ భాగంలో అధిక భాగం త్యాగధనుల పార్టీగా వుండేది. అలాంటి ఒక త్యాగధనుడు, ఆంధ్రుడు బులుసు సాంబమూర్తి గారు.  అప్పటి కాంగ్రెస్ నాయకుడు. స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాత్ర మరచిపోలేనిది. ఆ ఉద్యమ కాలంలో ఆయనను అరెస్ట్ చేసి నానా హింసలకు గురి చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆయన నోట్లో మలమూత్రాలను కూడా పోసి తమ పాశవికతను ప్రదర్శించారట అప్పటి బ్రిటిష్ పోలీసులు. దేశ స్వాతంత్ర్యం కోసం అలాంటి ఘోరాలెన్నిటినో అనుభవించిన దేశభక్తుడు, త్యాగధనుడు సాంబమూర్తి గారు.  

1923  లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ కాకినాడలో జరుగుతోంది. ఆ సభకు దేశం నలుమూలనుండీ ప్రముఖ కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారు. ఆ ఆహ్వాన సంఘానికి బులుసు వారు కార్యదర్శి. మూడురోజులపాటు జరిగే ఆ సభలకు అన్ని ఏర్పాట్లు ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అద్భుతమైన ఏర్పాట్లు చేసారు. రాబోయే అతిధులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆ ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది నుండి వచ్చే అతిధులకు ఆంధ్ర భోజనం రుచి మర్చిపోకుండా వుండేటట్లు చెయ్యడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. సాంబమూర్తి గారికి ఊపిరి సలపడం లేదు. మహాసభల తేదీలు సమీపిస్తున్నాయి.

 ఆ సమయంలో ఒక పెను విషాదం. సాంబమూర్తి గారి ఏకైక కుమారుడు టైఫాయిడ్ బారిన పడి మరణించాడు. ఆయనకు అంతులేని శోకాన్ని మిగిల్చాడు. ఆ సమయంలో కూడా ఆయన ఆ శోకాన్ని దిగమింగారు. తనపైన ఉన్న బాధ్యతను గుర్తు చేసుకున్నారు. అంతే ! ఆ శోకాన్ని కర్తవ్యం జయించింది.

ఆ కాంగ్రెస్ మహాసభలు న భూతో న భవిష్యతి అన్నట్లు జరిగాయి. అందరూ ఆయన చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. జరిగిన విషాదం తెల్సుకున్న భారత కోకిల సరోజినీ నాయుడు సాంబమూర్తి గారి స్థితప్రజ్ఞతకు చలించి అప్పటికప్పుడు ఆ సభలో ఆశువుగా గీతాన్ని ఆలపించారని అంటారు.

అందుకేనేమో తెలుగు జాతి ఆయనను ' మహర్షి ' అనే బిరుదుతో గౌరవించింది.


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 075

Tuesday, November 15, 2011

పురాణములు అంటే..... ! ఇంకా చాలా .... ఈ వారం

ప్రతీవారం విభిన్న విషయాల సమాహారంగా మిమ్మల్ని అలరిస్తున్న ' శిరాకదంబం ' వెబ్ పత్రిక ఈ వారం సంచికలో......

 పత్రికపైనా, రచనల పైనా మీ అమూల్యాభిప్రాయలను కోరుకుంటూ....
Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 03 Pub. No. 074

Sunday, November 13, 2011

గానలీల... సుశీల

మధురగానానికి మరోపేరు సుశీల
అందరినీ మురిపించును ఆమె గాన లీల
గంధర్వలోకంలో తేలియాడించును ఆ సంగీత హేల
వెలిగించును మన మదిలో స్వరలయల సంగమ జ్వాల  

మల్లెలు పూచినా... వెన్నెల కాచినా.. అది సుశీలమ్మ గానమే !
సెలయేరు చిరుసవ్వడి... కోకిల కుహు కుహు గానం సుశీలమ్మ స్వరమే !
ఆ స్వరం నిత్య నూతనం ఆ గానం అనితరసాధ్యం
ఆ స్వర గంగా ప్రవాహం గాన సరస్వతికి నిత్యాభిషేకం 


గానకోకిల సుశీలమ్మ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ....

సుశీలమ్మ పై గతంలోని టపాలు - 

కోకిలమ్మ పుట్టినరోజు
ప్లాటినం ఈ తెలుగు గానం Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 03 Pub. No. 073

Saturday, November 12, 2011

తాజ్ మహల్ కట్టించమంటే.....

  ఓసారి ఓ పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రముఖ కవి ఆరుద్ర ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్నారు.

ఒక విలేఖరి ఆరుద్ర గారితో " మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారో గానీ ఈ గడ్డంతో మీరు మొగల్ పాదుషా షాజహాన్ లాగ కనిపిస్తున్నారు " అన్నాడు.

వెంటనే ఆరుద్ర గారు ఆ గెడ్డం సవరించుకుంటూ " ఈ మాట నాతో అంటే అన్నారు గానీ  మా ఆవిడ దగ్గర మాత్రం అనకండి. ఇప్పుడు ఆవిడ తానో ముంతాజ్ ననుకుని ఏ తాజ్ మహలో కట్టించమంటే గెడ్డం పెంచినంత సులువు కాదు కదా ! " అన్నారట.


Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 072

Friday, November 11, 2011

కార్తీకపౌర్ణమి ప్రత్యేక పూజలు...


అమ్మవారికి ప్రీతిపాత్రమైనది కుంకుమ పూజ. అయ్యవారికి అంటే మహేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది రుద్రాభిషేకం. అందులోను ఏకాదశ రుద్రాభిషేకం......

కార్తీక పౌర్ణమి సందర్భంగా 10  - 11  - 2011 వ తేదీ గురువారం సాయింత్రం విజయవాడ, గురునానక్ నగర్ రోడ్, గెజెటెడ్ ఆఫీసర్స్ కాలనీ లోని మిహిర పూజా మందిరంలో జరిగిన కుంకుమ పూజ, ఏకాదశ రుద్రాభిషేకం నుంచి కొన్ని భాగాలు......

.
Vol. No. 03 Pub. No. 072

Tuesday, November 8, 2011

ఏనుగే హీరో

వరుసగా జంతువులతో చిత్రాలు తీసి ఘన విజయాలు స్వంతం చేసుకున్న సంచలన నిర్మాత శాండో ఎం. ఎం. ఎ. చిన్నప్ప దేవర్. జంతువులే ఆయన చిత్రాల్లో హీరోలు. ఆయన చిత్రాల్లో ఎంత పెద్ద హీరో అయినా ఆ జంతువుల ముందు జీరోనే ! 

దేవర్ హిందీలో ధర్మేంద్ర తో ' మా ' అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో ఏనుగు కూడా నటించింది. ఆ చిత్ర నిర్మాణం పూర్తయింది. రష్ చూసాక ధర్మేంద్ర తన పాత్ర చూసుకుని నీరసపడ్డాడు. నిజానికి ఆయన పాత్ర కంటే ఏనుగు పాత్రకే ప్రాధాన్యత ఎక్కువగా వుంది. ఆమాటే దేవర్ తో చెబుతూ  ... 

' ఇలా అయితే నా ఇమేజ్ దెబ్బతింటుంది. ఫాన్స్ బాధ పడతారు. ఏనుగు చేత డాన్సు కూడా చేయించారు. కనీసం అదైనా తీసెయ్యొచ్చు కదా ! ' అన్నారు. 

 ఆ మాట విన్న దేవర్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా ? 

' ఈ చిత్రంలో హీరో ఏనుగే ! నువ్వు సపోర్టింగ్ ఆర్టిస్ట్ వి మాత్రమే ! ' 


Vol. No. 03 Pub. No.071

Monday, November 7, 2011

కార్తీక పౌర్ణమి.... ఈ వారం...

 ఈ గురువారం ( 10  - 11  - 2011  ) వ తేదీ కార్తీక పౌర్ణమి..... 

శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో మరో ముఖ్యమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ పర్వదిన విశిష్టత, ఆచరణ, ఇతర మతాలకు ఈ పౌర్ణమితో వున్న సంబంధం మొదలైన విశేషాలు శిరాకదంబం వెబ్ పత్రిక ఆథ్యాత్మికం పేజీ లో చూడండి. 

ఈ వారం పత్రికలో...........


Vol. No. 03 Pub. No. 070

ఈద్ ముబారక్....

ముస్లిం సోదరులకు పవిత్రమైన పర్వదినం బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు
 
Vol. No. 03 Pub. No. 069

Saturday, November 5, 2011

దాశరథితో కాసేపు.....

  ఏ దివిలో విరిసిన పారిజాతమో ! 
ఈ భువిలో వెలిసిన కవితారత్నము

తెలుగు జాతికి దొరికిన అదృష్టం
తెలుగు భాష చేసుకున్న పుణ్యం

తెలంగాణా విముక్తికై గర్జించిన సింహం
తెలుగు జాతి ఐక్యతకోసం తపించిన కలం

నిజాం పాలనలో తెలుగు జాతి కడగండ్లను నిరసించిన గళం
నిజాం కాలంలో తెలుగు భాష ఉన్నతికోసం తపించిన కలం

తెలుగు వారికి సాహితీ విందు చేసిన కవి దాశరథి
తెలుగు వారికి కర్ణామృతాన్ని అందించిన సాహితీమూర్తి

కవి దాశరథి గారి వర్థంతి సందర్భంగా సాహితీ నివాళులు అర్పిస్తూ ................

 దాశరథి గారి మేనకోడలు శ్రీమతి దుర్గ డింగరి తెలుగు వన్ రేడియో టోరి క్లాసిక్ ఛానల్లో రేపు ఆదివారం (  06 - 11 - 2011  ) మధ్యాహం గం. 12 .00  లకు " పాటలపల్లకి " కార్యక్రమంలో దాశరథి గారి స్వరం వినే భాగ్యం కలుగజేస్తున్నారు. దాశరథి గారి అభిమానులు, సినీ సంగీత, సాహిత్య ప్రియులు ఈ కార్యక్రమాన్ని విని ఆనందించగలరని భావిస్తున్నాను. 


దాశరథి గారి గురించి గతంలో రాసిన టపా ..........


దాశరధీ... కవితా పయోనిధీ !


Vol. No. 03 Pub. No. 068

Thursday, November 3, 2011

భవిష్యద్దర్శనం


' ఆంధ్రరత్న ' బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మహా మేధావి. భవిష్యత్తును అంచనా వెయ్యడంలో దిట్ట. ఆయన ఓసారి మాట్లాడుతూ.... 

" ఆంధ్రుల్లో ముగ్గురు మేధావులున్నారు. వారిలో ఒకరు నేను.  కానీ పెద్దగా పైకి  రాను. ఎందుకంటే అల్పాయుష్కుడిని. 


రెండవవారు కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆయన గొప్ప ప్రతిభావంతుడు. అయితే ఆయనకు వాక్ స్థానంలో శని వున్నాడు. అందుకే ఆయనకు విరోధాలు, విరోధులు ఎక్కువే !
ఆ కారణంగా ఆయన ఉన్నత స్థానానికి చేరుకోవడం కష్టమే ! 

ఇక మూడవ వారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన నవగ్రహమాలికా యోగ జాతకుడు. భవిష్యత్తులో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు " అన్నారు. 

ఈ మాటల్లో ఎంత నిజముందో పరిశీలిద్దాం.....

దుగ్గిరాల వారు నలభై సంవత్సరాలు వయసు దాటకుండానే మరణించారు.   
కట్టమంచి వారు విద్యావేత్తగా, విమర్శకుడిగా పేరు తెచ్చుకున్నా విశ్వవిద్యాలయ స్థాయిని దాటలేదు. 
ఇక భారత రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. 

Vol. No. 03 Pub. No. 067

Wednesday, November 2, 2011

పూర్వాశ్రమంలో...... ? - జవాబు


  కనుక్కోండి చూద్దాం - 56_జవాబు అ ) ప్రముఖ నటులు కృష్ణంరాజు గారు ' చిలకా గోరింక '  చిత్రంతో చిత్రసీమలో ప్రవేశించారని తెలుసు కదా ! దానికి ముందు ఆయన ఏం చేసేవారో చెప్పగలరా ?

జవాబు కృష్ణంరాజు ' ఆంధ్ర రత్న ' పేరుతో ఒక పత్రికను నడిపారు.
ఆ ) మరో నటుడు భానుచందర్ పూర్తి పేరు మాదూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుప్రసాద్. ఆయన సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో చెప్పగలరా ?

జవాబు )  మద్రాస్ ( చెన్నై ) దూరదర్శన్ కేంద్రంలో అనౌన్సుర్ గా పనిచేసారు. Vol. No. 03 Pub. No. 068a
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం