Thursday, June 30, 2011

కవితాకళానిధి - సుత్తి వీరుడు



తెలుగు వారికి ' హరిశ్చంద్ర ' అందించిన గొప్ప రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతకవి. తెలుగు చలనచిత్ర తొలిదశలో అనేక చిత్రాలకు మాటలు - పాటలు అందించారు. కాళ్ళకూరి వారి పాత్ర సింగరాజు లింగరాజుకు ' వరవిక్రయం ' చిత్రంలో నటించడం ద్వారా జీవం పోశారు. ఇంకా కొన్ని చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు ధరించారు. 


బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి వర్థంతి నేడు. ఆయనకు కవితాకళా నీరాజనాలు అర్పిస్తూ....

 ఆయనపై గతంలోని టపా.......... 
 
 కవితాకళానిధి

*************

నటన అనేది ఒక వరం. పాత్రలో పరకాయప్రవేశం చేసి ప్రేక్షకులకి నటిస్తున్నట్లు తెలియకుండా నటించగలిగే సామర్థ్యం దైవదత్తం. ఆ వరం పొందిన నటుడు మామిడిపల్లి ( సుత్తి ) వీరభద్రరావు. ఏ పాత్ర పోషించినా, ఆ పాత్రలో తనదైన శైలి ప్రదర్శించినా ఆ పాత్ర కనబడదు... వీరభద్రరావు కనిపిస్తారు. ఆయన వీరభద్రరావని మనకి తెలుసు. కానీ ఆయన్ని ఆ పాత్ర అధిగమిస్తుంది. అందుకే ఆయన తెలుగు ప్రేక్షకులకి మామిడిపల్లి వీరభద్రరావుగా గుర్తుండరు.... ఎప్పటికీ ' సుత్తి ' వీరభద్రరావుగానే గుర్తుంటారు.

సుత్తి వీరభద్రరావు వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ......

ఆయన జయంతి సందర్భంగా రాసిన టపా.......

సుత్తి వీరుడు

Vol. No. 02 Pub. No. 269

Wednesday, June 29, 2011

పౌరాణికచిత్ర బ్రహ్మ

రామాయణాన్ని వాల్మీకి మహర్షి వ్రాసారు
మహాభారతాన్ని వ్యాస మహర్షి వ్రాసారు
తెలుగుతెర మీద ఆ పురాణాలని లిఖించిన మహర్షి కమలాకర కామేశ్వరరావు గారు

మన భావాల్ని వ్యక్తపరచడానికి భాష వుంది. ఆ భాషను అందమైన క్రమ పద్ధతిలో పలకడానికి, రాయడానికి వ్యాకరణం వుంది. భాషకే కాదు. కళకు కూడా వ్యాకరణం వుంటుంది. అందులోనూ సకల కళల సమాహారమైన చలనచిత్రం అందర్నీ ఆకట్టుకునేలా, చెప్పే విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఆ చిత్ర రూపశిల్పికి ఈ వ్యాకరణం తెలిసి వుండడం చాలా అవసరం. చలనచిత్ర వ్యాకరణాన్ని ఔపోసన పట్టిన అగస్త్యుడు కమలాకర కామేశ్వరరావు గారు.  కె. వి. రెడ్డి గారి బళ్ళో చదువుకున్న కామేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాలు అంటే కమలాకర వారే అనిపించే  స్థాయికి ఎదిగారు.  

పాండురంగ మహాత్మ్యం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణావతారం, పాండవవనవాసం, నర్తనశాల, వీరాంజనేయ, బాలభారతం లాంటి ఎన్నో పౌరాణిక చిత్రాలతో బాటు మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు లాంటి చారిత్రాత్మక చిత్రాలు, రేచుక్క పగటిచుక్క లాంటి జానపదాలు, పెంకిపెళ్ళాం, శోభ, గుండమ్మ కథ, కలసిన మనసులు, మాయని మమత లాంటి సాంఘిక చిత్రాలు రూపొందించి బహుముఖ ప్రజ్ఞాశాలినని నిరూపించుకున్నారు. 

మచిలీపట్టణం నుంచి వెలువడిన ప్రతిష్టాకరమైన ' కృష్ణాపత్రిక ' లో చలనచిత్ర విభాగంలో పనిచేసిన కామేశ్వరరావు గారు మారుపేరుతో పక్షపాతరహితంగా రాసిన చిత్ర సమీక్షలు తెలుగు చలనచిత్ర పితామహుడనదగ్గ హెచ్. యమ్. రెడ్డి గారిని ఆకర్షించాయి. కామేశ్వరరావు గారిని చిత్రరంగానికి పిలిపించాయి. హెచ్. యమ్. రెడ్డి, బి. ఎన్. రెడ్డి, కె. వి. రెడ్డి లాంటి లబ్ద ప్రతిష్టుల శిష్యరికం లభించింది. ఫలితంగా మరో అద్భుత చిత్ర బ్రహ్మ తెలుగు రంగానికి లభించారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు రాశిలో అర్థశతం మించకపోవచ్చు గానీ వాసిలో మాత్రం మిన్న అయినవి. కలకాలం గుర్తుండిపోయేవి కమలాకర చిత్రాలు. ప్రతీ చిత్రమూ ఆణిముత్యమే ! మన మనస్సులోనుంచి అంత త్వరగా చెరిగి పోయే ముద్రలు కావు ఆయన చిత్రాలు.  

నర్తనశాల చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిచ్చారు.... తెలుగు పౌరాణికాలను అంతర్జాతీయ స్థాయికి చేర్చారు.

 తెలుగు పౌరాణిక చిత్రాలకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన పౌరాణికచిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారి వర్థంతి సందర్భంగా కళానీరాజనాలు 
 
Vol. No. 02 Pub. No. 268

Tuesday, June 28, 2011

ఇద్దరు సాహితీమూర్తులు

 తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన భిన్నమైన దృక్పధాలు గలిగిన ఇద్దరు సాహితీమూర్తుల జన్మదినం ఈరోజు. 

కొందరు రచయితలు రాసినవి బాగానే వున్నట్లు అనిపించి కొంతకాలం పాటు మనకి గుర్తుంటాయి. తర్వాత మరుపుకు వచ్చేస్తాయి. కొందరు రాసిన రాతలు బాగా వుండి మన హృదయాలకు హత్తుకుని ఎంతకాలమైనా గుర్తుంటాయి. పాఠకులకి ఆ రచయితలతో అనుబంధం ఏర్పడిపోతుంది. వాళ్ళు అజరామరులు. వారు భౌతికంగా మన మధ్య వున్నా లేకపోయినా మన గుండెల్లో మాత్రం కలకాలం వుండిపోతారు. 

అటువంటి రచయితలలో ముళ్ళపూడి వారు అగ్రగణ్యులు. కొంతమంది కొన్ని వర్గాలకు, కొన్ని సిద్ధాంతాలకు, ఏదో ఒక వయసు వారిని రంజింపజేయడానికి పరిమితమైపోతారు. కానీ అందర్నీ అలరించి ఆకట్టుకోగలిగినవారు చాలా అరుదు. ఆ అరుదైన వారే ముళ్ళపూడి వెంకటరమణ గారు. 




ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా సురేఖ గారి ' రేఖాచిత్రం ' బ్లాగ్ లో ముళ్ళపూడి వారి స్మరణ ఈ లింక్ లో ...............  

RSS
ఈ రోజు మన బుడుగు గారి పుట్టిన రోజు !!

http://surekhacartoons.blogspot.com/2011/06/blog-post_28.html 

 

సాధారణంగా రాజకీయాలకు, సాహిత్యానికి చుక్కెదురు. గతకాలంలో స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్న కొందరు నాయకులు సాహిత్యంపై ఆసక్తితో కొన్ని రచనలు చేసినా వాటిలో చాలావరకు వారి అనుభవాల మాలికగానో, వారి ఆత్మకథలుగానో ఉండేవి. ఇప్పటి రాజకీయ నాయకుల్లో సాహిత్యాభిలాష వున్నవారు దాదాపుగా కనబడరు. కొందరు పూర్వాశ్రమంలో సాహితీ వ్యవసాయం చేసినా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారికి సమయం దొరకక ఆ వ్యవసాయం ఆగిపోతుంది. 

అయితే సాహిత్యాన్నీ, రాజకీయాలనీ రెండు చేతులతో సవ్యసాచిలా నడిపిన మహనీయుడు మన తొలి తెలుగు ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు. బహుభాషా కోవిదుడు. ఎన్నో గ్రంథాలు రచించారు. పీవీ గారి సాహితీ కృషికి నిలువెత్తు నిదర్శనం విశ్వనాథ సత్యనారాయణ గారి ' వేయి పడగలు ' కు ఆయన చేసిన హిందీ అనువాదం ' సహస్ర ఫణ్ '. 

 ఎందరికోసమో తన మేధస్సునుపయోగించి, ఎన్నో అడ్డంకులు చేదించి ఎవరి ఊహకు అందని పరిస్థితుల్లో ప్రధాని పదవిని చేపట్టారు. ప్రధానిగా కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. పదవీచ్యుతులైన తర్వాత కూడా ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్నారు. అన్నిటినీ మొక్కవోని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్న పీవీ మరణానంతరం కూడా అవమానాలకు గురి కావడం శోచనీయం. 

 

ఈరోజు మన తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా నివాళులు.

Vol. No. 02 Pub. No. 267

Monday, June 27, 2011

సాక్షి

రంగావఝుల రంగారావు - ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. తాము నటించిన తొలి చిత్రంలోనే  ప్రతిభ నిరూపించుకుని ఆ చిత్రం పేరునే తమ ఇంటి పేరుగా చేసుకున్న ' షావుకారు ' జానకి లాంటి వారెందరో ! ఆ కోవలోకి వచ్చే మరో ప్రముఖ నటుడు ' సాక్షి ' రంగారావు. బాపు గారి తొలి చిత్రం, రంగారావు గారి తొలిచిత్రం కూడా ' సాక్షి '. ఇద్దర్నీ చలనచిత్ర రంగంలో ప్రముఖుల్ని చేసిన చిత్రం ' సాక్షి '. 

గుడివాడకు సమీపంలోని కొండిపర్రు గ్రామానికి చెందిన రంగారావు గారు  ఆంధ్రవిశ్వకళాపరిషత్తు అందించిన మరో కళాకారుడు. అక్కడ పని చేస్తూ నాటకాలలో నటిస్తూ రంగస్థలం మీద పేరు తెచ్చుకున్న రంగారావు గారు చిత్రసీమలో కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. హాస్య పాత్రల్ని ఎంత సులభంగా పోషించగలరో కరుణ రసాన్ని కూడా అంతే సులువుగా తన నటనలో పలికించారు. సూక్ష్మగ్రాహి. ఎంత పెద్ద డైలాగ్ నైనా గుర్తుపెట్టుకుని సందర్భోచితంగా హావభావ విన్యాసాలతో ఒకే టేక్ లో చెప్పగలిగే నటుడు సాక్షి రంగారావు. విశ్వనాధ్ గారి, బాపు గారి చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆయన పోషించారు. 

చిన్నప్పట్నుంచీ ఆథ్యాత్మిక చింతన గల వ్యక్తి సాక్షి రంగారావు. ఆయన యవ్వనంలోకి అడుగుపెట్టాక ఓసారి శ్రీశైలం దర్శించాలనే సంకల్పం కలిగింది. ఖర్చులకి ఇంట్లో డబ్బులడిగితే ఇవ్వరనే భయంతో కాలినడకన తన మిత్రులతో కలసి బయిలుదేరారు. జేబులో కొంత చిల్లర తప్ప మరేం లేదు. మైళ్ళ దూరం నడిచారు. ఆకలేసినపుడు కొన్నిసార్లు చెరువు నీళ్ళతోనే కడుపు నింపుకునేవారు. అంత పొదుపుగా వెళ్ళినా శ్రీశైలం చేరేటప్పటికి వాళ్ళ దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. అయినా మల్లిఖార్జునస్వామిని చేరగాలిగామనే తృప్తితో నిండిపోయింది ఆ మనసు.  చివరిదాకా ఆ ఆథ్యాత్మిక చింతన కొనసాగింది. రామకృష్ణ పరమహంస మీద ఓ చిత్రాన్ని నిర్మించాలని ఆయన కలలు కన్నారు. తన కష్టార్జితాన్నంతా వెచ్చించి కొన్ని పాటలు కూడా రికార్డు చేయించారు. కానీ ఆయన కల నెరవేరలేదు. తన అరవైమూడో యేట మధుమేహ సంబంధిత సమస్యలతో స్వర్గస్తులయ్యారు. 

ఈరోజు సాక్షి రంగారావు వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులతో...........

సాక్షి రంగారావు గారి గురించి గతంలో రాసిన టపాలు.........


Vol. No. 02 Pub. No. 266

Sunday, June 26, 2011

మొదటి పురుష పాత్ర

చలనచిత్ర రంగ తొలిరోజుల్లో ప్రవేశించిన నటీనటుల్లో చాలామంది అంతకుముందు రంగస్థలం మీద నటించి పేరు తెచ్చుకున్నవారే ! అప్పట్లో వున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా స్త్రీ పాత్రల్ని చాలావరకూ పురుషులే ధరించేవారు. 

అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా రంగస్థలం మీద చంద్రమతి, తార, దేవదేవి లాంటి ఎన్నో స్త్రీ పాత్రల్ని  పోషించారు . తొలి రోజుల్లో ఆయనలోని నటనను వెలికి తెచ్చినవి స్త్రీ పాత్రలే ! అయితే ఆయన తొలిసారిగా తన పద్నాలుగేళ్ళ వయసులో ' పాండవోద్యోగ విజయాలు ' నాటకంలో పురుష పాత్ర ధరించడం జరిగింది. రంగస్థలం మీద ఆ పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. 
 
 
చాలాకాలం తర్వాత అక్కినేని వెండితెర మీద ఆదే పాత్రను ధరించే అవకాశం వచ్చింది. ఆయన సినీ నట జీవితంలో మైలు రాయిగా నిలిచిన ఆ పాత్ర ' మాయా బజార్ ' చిత్రంలో ధరించారు. ఆ పాత్ర అభిమన్యుడు. రంగస్థలం మీదే కాదు చిత్రరంగంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను.





Vol. No. 02 Pub. No. 265

Saturday, June 25, 2011

ప్రజల నెత్తిన పిడుగు

 ఉరుములేని పిడుగు... ప్రజల నెత్తిన పడ్డ పేద్ద గ్యాస్ బండ  
 అంతులేని అవినీతికి అంగుడెక్కడ రాజకీయ వ్యాపారంలో....
దోచుకోవడం... దాచుకోవడం... 
ప్రజల బ్రతుకు బండలు చెయ్యడం ప్రభుత్వాల వంతు..... 
బండబారిన.... మోడువారిన...
బ్రతుకును నిస్సహాయంగా, నిస్తేజంగా వెళ్లదియ్యడం ప్రజల వంతు.....  


డీజిల్ ధర మూడు రూపాయిలు పెరిగింది ..... ప్రభుత్వం 
అందువలన మేము కూడా ధరలు పెంచక తప్పలేదు.... వ్యాపారులు 
మీరెంతైనా పెంచుకోండి కానీ మా ఆస్తులు మాత్రం పెంచండి.....నాయకులు, అధికారులు 
కష్టార్జితమంతా మీ యెదాన పోసి మేమేం తిని బ్రతకాలి ? ......... ప్రజలు  



 అగ్ని ప్రమాదాలు లేవు.. ఆడపడుచుల వరకట్నఆత్మహత్యలు లేవు.....
ఎంత హాయి....ఇది నిజం... ఇది భారతదేశమే ! నమ్మండి.
ఎందుకంటే కిరోసిన్ ధర పెరిగింది... చావు కూడా ఖరీదయింది...... 
పేదల బ్రతుకు చీకటయ్యింది..... ప్రజల గుండె మండింది......

పెరిగింది స్వల్పమే..... పెరగాల్సింది చాలా వుంది..... అని సెలవిచ్చారు మంత్రివర్యులు 
ఇక ప్రజలు భోంచేయాల్సింది గాలి.... చీకటిని తరమాల్సింది తమ కడుపులోని మంటతో..... 




ఒప్పుకుంటే కుక్క మేకవుతుంది.... తలూపితే తల తాకట్టుకు వెడుతుంది....
దెబ్బకు దెయ్యం ఝడుస్తుంది... ప్రజలు కన్నెర్రజేస్తే ప్రభుత్వం కూలుతుంది....
ఆ సత్యం గ్రహిస్తే నల్లధనమూ బయిటకొస్తుంది... ఈ తత్త్వం ఒంటబడితే అవినీతీ అంతమవుతుంది.... 
అప్పడిక ధరలూ పెరగవు...... జీవన ప్రమాణాలూ తరగవు..... స్వార్థశక్తుల పెత్తనాలూ చెల్లవు.....  

ఇక మనకు కూడా ప్రజా విప్లవాలు తప్పవేమో ! శిశుపాలుర శిరస్సులు ఖండించే రోజు దగ్గరలోనే ఉందేమో !

గ్యాస్ సిలండర్ పై సుమారు 50 రూపాయిలు, డీజిల్ లీటర్ పై సుమారు 3 రూపాయిలు, కిరోసేన్ లీటర్ పై సుమారు 2 రూపాయిలు ఈ అర్థరాత్రి నుండే ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రజల నెత్తిన పిడుగులాంటి వార్త.

Vol. No. 02 Pub. No. 264

Tuesday, June 21, 2011

సంగీతం - ప్రపంచం

విశ్వవ్యాప్తమైనది సంగీతం
ఎల్లలు ఎరుగనిది సంగీతం

భాషతో సంబంధంలేనిది సంగీతం
భావమే ప్రధానమైనది సంగీతం

మనుష్యులను ఉత్తేజితుల్ని చేసేది సంగీతం
మనకి ఆత్మానందాన్ని కలిగించేది సంగీతం


శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి :
అందర్నీ.. అన్నిటినీ రంజింపజేసేది సంగీతం 

... ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా సంగీతజ్ఞులకు, సంగీత ప్రియులకు శుభాకాంక్షలు 

 ఈ సందర్భంగా మన దక్షిణ భారతానికి ప్రత్యేకమైన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి శ్రీమతి సుధా రఘునాథన్ హంసధ్వని రాగంలో ఆలపించిన ' జలజాక్ష ' వర్ణం వినండి....చూడండి.



Vol. No. 02 Pub. No. 263

Sunday, June 19, 2011

హాస్యబ్రహ్మ - మరో కోణం

 తోలుబొమ్మలాట - తెలుగు వారికి ప్రత్యేకమైన కళ. సినిమాలు అందుబాటులో లేని రోజుల్లో జానపదులకు అదే ఒక సినిమా. రామాయణ, భారత, భాగవత కథలను వారికర్థమయ్యే రీతిలో, భాషలో వినోదాన్ని మిళితం చేస్తూ సాగే కళారూపం. 

మొదట్లో బాగా బిగించి కట్టిన తెల్లని తెర వెనుక ఆముదం దీపాలు, ఇలాయి బుడ్డి ( కిరోసిన్ దీపం )  సాయంతో ప్రదర్శించేవారు. మేక, జింక లాంటి జంతువుల తోలును బాగా ఎండబెట్టి పారదర్శకంగా చేసి వాటితో బొమ్మలు తయారు చేసి సహజంగా లభించే రంగులు అద్దేవారు. తెర వెనుక భాగం మీద ఉంచిన ఆ బొమ్మలు పారదర్శకంగా వుండడం వలన వాటి వెనుకనున్న దీపం వెలుతురు వాటిలోనుంచి ప్రసరించి చాలా ఆక్షర్షణీయంగా కనిపించేవి. ఒక రకంగా కలర్ సినిమా చూస్తున్నట్లే ఉండేది. 

తర్వాత కాలంలో పెట్రోమాక్స్ దీపాలు వాడేవారు. ఆ తర్వాత కరెంట్ దీపాలు వాడటం వరకూ వచ్చి అప్పటికి సినిమాల ప్రభావం బాగా పెరగడం వలన క్షీణించడం ప్రారంభమైన ఆదరణ, తర్వాత టీవీల ప్రభావంతో పూర్తిగా ఈ కళారూపం కనుమరుగై పోయే పరిస్థితి దాపురించింది. అయితే అప్పట్లో సినిమాలకోసం దూరాలు వెళ్ళవలసి రావడం, సంప్రదాయకళ అనే ఉద్దేశ్యం ప్రజల్లో వుండడం వలన అన్ని ఉత్సవాలలోను ఇతర కళారూపాలతో బాటు, తోలుబొమ్మలాటను కూడాను తప్పనిసరిగా ప్రదర్శించేవారు. మేం కూడా గతంలో ఎన్నోసార్లు అలా తోలుబొమ్మలాట ప్రదర్శనలను ఏర్పాటు చేసాం  అప్పట్లో ప్రజలు కూడా ఆసక్తిగా తిలకించేవారు. టీవీ ప్రభావం మాత్రం చాలా వాటితో బాటు ఈ కళకు కూడా సమాధి కట్టేసింది. 
ఈ తోలుబొమ్మలాట కళాకారులకు కాకినాడ దగ్గరున్న మాధవపట్నం ప్రసిద్ధి. అలాగే అనంతపురం జిల్లాలో, ఇంకా కొన్ని చోట్ల కూడా ఈ కళాకారులు వున్నారు. వీరిలో ఎక్కువగా మరాఠా ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే. వీరు చెప్పే కథల్లో ముఖ్యంగా ' లంకాదహనం ' ప్రసిద్ధి చెందింది. ముగ్గురు, నలుగురు కళాకారులు తెర వెనుక  బొమ్మల్ని ఆడిస్తూ ఆయా పాత్రల సంభాషణలు, పద్యాలు, పాటలు పలకడం మాత్రమే కాకుండా ఆయా సన్నివేశాలను బట్టి అవసరమైన శబ్దాలను కూడా నోటితో పలికించేవారు. మరికొంతమంది వాయిద్యాలు వాయించేవారు. సాధారణంగా ఈ బృందమంతా ఒకే కుటుంబ సభ్యులతో ఏర్పడి ఉండేది.  ఇక తెర మీద ఆయా కథలననుసరించి పాత్రల బొమ్మలతో బాటు వినోదం కోసం కేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్క లాంటి హాస్య పాత్రలుండేవి.  ఇవి కథతో సంబంధం లేకుండా మధ్య మధ్యలో తెర మీదకు వచ్చి సందర్భం లేని, ముఖ్యంగా సమకాలీన అంశాల మీద చమత్కారాలతో కూడిన సంభాషణలతో ప్రేక్షకులను వినోదపరిచేవి. ఒక్కోసారి కొన్ని మోటు సంభాషణలు కూడా వాడేవారు. ఇప్పుడు ఆ కళకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఆ కళాకారులు ఇతర వృత్తులు వెదుక్కోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం శిల్పారామం పేరుతో ఈ కళలను అప్పుడప్పుడైనా ఆదరిస్తుండకపోతే ఈ మాత్రమైనా జీవించి ఉండేది కాదేమో ! 

అలాంటి తోలుబొమ్మలాట ను ఇక్కడ చూడండి.




మన చుట్టూ ఉండే మనుష్యులలో కనిపించే ప్రత్యేకతలను, అలవాట్లను పట్టుకుని వాటిలోనుంచి హాస్యాన్ని వెలికి తీసి తన చిత్రాల ద్వారా మనకందించి హాస్యబ్రహ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన రచయిత, దర్శకుడు జంధ్యాల. ఈయన కేవలం హాస్య రస చిత్రాలకే పరిమితం కాలేదు. జంధ్యాల చేసిన కొన్ని ప్రయోగాలు చూస్తే ఆయనలోని మరో కోణం కనబడుతుంది.

టీన్ ఏజ్ ప్రేమ కథతో, కథకు తగ్గ నటీనటులతో, అదీ క్రొత్త వారితో చేసిన ప్రయోగం... జంధ్యాల దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ' ముద్దమందారం '. ప్రదీప్, పూర్ణిమ నాయికనాయకులుగా పరిచయం చేసిన ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది.

నీలాలు కారేనా ?
 
కూచిపూడి నాట్య వైభవాన్ని నేపథ్యంగా తీసుకుని, ఒక జిప్సీ పిల్లను అద్భుతమైన కళాకారుడిగా తీర్చిదిద్దిన నాట్యాచార్యుని ప్రథానమైన అంశంగా తయారుచేసిన కథతో జంధ్యాల సృష్టించిన చిత్రం ' ఆనందభైరవి '. జాతీయ స్థాయి నటుడు గిరీష్ కర్నాడ్ ప్రథాన పాత్రలో, అప్పటికే ఉత్తరాదిన నాట్య కళాకారిణిగా ప్రసిద్ధి చెందిన మాళవిక సరుక్కాయి కథానాయికగా, ఇంకా ఎంతోమంది రంగస్థల, ఆకాశవాణి కళాకారులతో ఆ చిత్రం నిర్మించారు. ఆ చిత్రం జంధ్యాల కీర్తి కిరీటంలో కలికి తురాయి.

కొలువైతివా... రంగశాయి !

మనదేశంలో అతి సున్నితమైన వివాస్పద అంశం హిందూ ముస్లిం ఘర్షణ. ఆ అంశం ఆధారంగా చిత్రం నిర్మించడానికి పూనుకోవడం ఒక రకంగా సాహసమే ! జంధ్యాల గారు ఆ సాహసానికి పూనుకొని నిర్మించిన చిత్రం ' నెలవంక '. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే కోరికతో నిర్మించిన ' నెలవంక ' నేలవంక చూసిందని జంధ్యాల గారే మేం ఒకసారి నిర్వహించిన అభినందన సభలో తన సహజ ధోరణిలో అన్నారు. నిజానికి అందులో చమత్కారం కంటే బాధే ఎక్కువగా కనిపించింది. హిందూ జమిందారీ కుటుంబానికి చెందిన అమ్మాయి, ఒక పేద ముస్లిం కుటుంబానికి చెందిన అబ్బాయిల మధ్య ప్రేమ నేపథ్యంలో గ్రామాలలో హిందూ ముస్లిం సంబంధాలు, సోదర భావంతో మెలుగుతున్న వారి మధ్య చిచ్చుపెట్టే స్వార్థపరుల పన్నాగాలు మొదలైన వాటితో అల్లిన కథ ' నెలవంక '. హిందువులకు, ముస్లిములకు కూడా పవిత్రమైనది నెలవంక. ఆ కథ వివాదాస్పదం కాకపోయినా ఇతర కారణాలవల్ల ఆ చిత్రం పరాజయం పాలయింది. కానీ అందులో కొన్ని మంచి ప్రయోగాలున్నాయి. హిందువులు ముస్లిములు కలసి పాల్గొనే ఖవ్వాలీ లాంటి వాటితో బాటు ముస్లిములు ఆడించే ' లంకాదహనం ' తోలుబొమ్మలాట కూడా ఒకటి. పైన ఇచ్చిన తోలుబొమ్మలాట నెలవంక చిత్రంలోనిదే !

 ఈరోజు జంధ్యాల గారి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయనలోని మరో కోణాన్ని స్పృశించే ప్రయత్నమిది

Vol. No. 02 Pub. No. 262

నాన్నగారు - మూర్తీభవించిన వ్యక్తిత్వం

నాన్నగారు -  ఈ పదం ఊహ తెలిసిన దగ్గర్నుంచి ప్రతి ఒక్కరికీ తెలిసిన పదమే ! ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి అనుబంధం అమ్మతోనైతే రెండవ అనుబంధం తప్పనిసరిగా నాన్నతోనే ! మన జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఇద్దరి పాత్రా సమానమైనదే ! నవమాసాలు మోసి జన్మనిచ్చేది అమ్మ అయితే ఆ జన్మకు పరిపూర్ణమైన రూపమిచ్చేది నాన్న. అయితే చాలామందికి ఆమ్మ దగ్గరున్న చనువు నాన్న దగ్గర వుండదు. ముఖ్యంగా మగపిల్లలకి. నిజానికి వాళ్లకి తండ్రి ఒక రోల్ మోడల్. ఆయన్ని అనుకరించాలని చిన్నతనంలో ప్రయత్నిస్తారు కూడా !

మా నాన్న దగ్గర మాకంత చనువు ఉండేది కాదు.  ఆయనంటే కొంచెం భయం కూడా ఉండేది. అలాగని ఆయనేమీ కర్కోటకుడు కాదు కానీ కొంచెం సీరియస్ గానే ఉండేవారు. అధ్యాపక వృత్తిలో వుండడం వల్లనో, అభిరుచి వుండడం వల్లనో ఎక్కువ సమయం చదువుకే కేటాయించేవారు. మాతో గడపడానికి కేటాయించిన సమయం తక్కువ కావడమే మాకు అంత చనువు ఏర్పడకపోవడానికి కారణం. కొన్ని నియమాలకి, సిద్ధాంతాలకి కట్టుబడి ఉండేవారు.

ఆయన పాఠం చెబుతుంటే ఆ తరగతిలో సూది పడినా శబ్దం వినిపించేటంత నిశ్శబ్దంగా ఉండేది. ఏరోజూ ఆయన క్లాసుకి ఆలస్యంగా వెళ్ళేవారు కాదు. ఏ విద్యార్ధి అయినా ఆలస్యంగా వచ్చినా సహించేవారు కాదు. క్రమశిక్షణను ఖచ్చితంగా పాటించేవారు. పాఠం చెబుతుంటే అదొక గంగా ప్రవాహం. అంతరాయం కలిగించడానికి, ఆపడానికి ఎవరూ ప్రయత్నించేవారు కాదు. ఆంగ్ల మాధ్యమంలో బోధించేటపుడు మొత్తంమంతా ఆంగ్లంలోనే చెప్పేవారు. తెలుగు మాధ్యమంలో చెప్పేటపుడు సాధ్యమైనంత వరకూ అంటే అనువాదం చెయ్యలేని సాంకేతిక పదాల లాంటివి తప్ప ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా తెలుగులోనే చెప్పేవారు. ఇవన్నీ చిన్నప్పటినుంచీ అందరూ చెబుతుంటే వినడం జరిగినా ఈ విషయాలు నాకు డిగ్రీ చదువుతుండగా అనుభవంలోకి వచ్చాయి. బీకాం రెండవ , మూడవ సంవత్సరాల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివిన మాకు కొన్ని సబ్జెక్టులు నాన్న చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో మూడవ సంవత్సరంలో ఆఫీసు ఆర్గనైజేషన్ అండ్ సూపర్ విజన్ అనే ఐచ్చిక సబ్జెక్టు తెలుగు మాధ్యమంలోనే ఉండేది. దాన్ని బోధించేటపుడు ఈ తేడా స్పష్టంగా గమనించాను. అలాగే సబ్జెక్టులో పరిపూర్ణత కోసం, ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఆయన నిరంతరం కొత్త పుస్తకాలు, ఆర్టికల్స్ కొనడమో, సేకరించడమో చేసి చదవుతూండేవారు. అందుకే విషయ పరిజ్ఞానం విషయంలో ఎప్పుడూ ముందంజలో ఉండేవారు. 

మా చిన్నప్పుడు మా ముందు గది ట్యూషన్ కోసం వచ్చే విద్యార్థులతో నిండిపోయి ఉండేది. అయితే అందులో దాదాపు అందరూ మొహమాటానికి వచ్చేవారే ! డబ్బు కోసం మాత్రమే చదువు చెప్పేవారు కాదు. అలాగే ప్రతిభ కల విద్యార్థులకు కాక కొంచెం చదువులో వెనుకబడిన విద్యార్థులకు ట్యూషన్ చెప్పడానికి ఎక్కువ ఆసక్తి చూపేవారు. తర్వాత కాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా మంచి హోదాల్లో వున్న శిష్యులు వెదుక్కుంటూ వచ్చేవారు. వారిలో చాలామంది తమకు చదువు మీద లేని శ్రద్ధను ఆయన ఎలా కలిగించారో, అల్లరి చిల్లరిగా తిరిగే తమను ఎలా దారిలో పెట్టారో కథలు కథలుగా చెప్పేవారు. 

కొంతకాలానికి ఆయన అధ్యాపక సంఘ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం మొదలయ్యాక ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా ట్యూషన్లు చెప్పడం సరైన పధ్ధతి కాదు అనే నైతిక సూత్రానికి కట్టుబడి చెప్పడం పూర్తిగా మానేశారు. అక్కడనుంచి ప్రిన్సిపాల్ గా బాధ్యత చేపట్టేదాకా తన స్వార్థాన్ని చూసుకోకుండా అధ్యాపకుల సంక్షేమ కార్యకలాపాలకే అంకితమయ్యారు. 

ప్రిన్సిపాల్ గా కూడా ప్రతీదీ నియమ నిబంధనల ప్రకారం జరగాలనే పద్ధతికి కట్టుబడి పనిచేశారు. అడ్మిషన్ల విషయంలో సిఫార్సులకు తలొగ్గకుండా, కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే చేసి పాలకమండలితో విరోధం తెచ్చుకున్నారు. సుమారు సంవత్సరం పాటు జరిగిన ఆ పోరాటానికి విద్యార్థులు , ఊరిపెద్దలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ మద్దతునిచ్చారు. విచిత్రమేమిటంటే మెరిట్ లేని కారణంగా సీట్ ఇవ్వని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆయనకు తమ మద్దతునందించారు. అధికారం, డబ్బు ఒకవైపు, కేవలం నైతికత మరోవైపు జరిగిన పోరాటంలో నాన్న విజయం సాధించడం, ప్రభుత్వ మద్దతుతో ( పాలకమండలిలో చాలామంది అప్పటి అధికార పార్టీ మద్దతుదారులైనా కూడా ) మళ్ళీ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టడం ఒక అపూర్వమైన ఘట్టం. 


ఆ సమయంలో పాలకమండలి బెదిరింపుతో అధ్యాపకేతర సిబ్బంది సహకరించడానికి భయపడితే విద్యార్థులు, అధ్యాపకులలో కొందరు, పట్టణ ప్రజల్లో కొందరు ఆ బాధ్యతలను స్వచ్చందంగా నిర్వహించడం  ( బెల్ కొట్టడం దగ్గర్నుంచి అన్నీ ) మరిచిపోలేని విషయాలు. ఇంకా విశేషమేమిటంటే పాలకమండలిలో ముఖ్యులైన కొందరు బహిరంగంగా మద్దతివ్వగా మరికొందరి కుటుంబసభ్యులు తమ వారి చర్యలకు అసంతృప్తిని నా దగ్గర వ్యక్తపరచడం. బహుశా ఏ కళాశాల చరిత్రలోనూ ఇలాంటి సంఘటనలు జరుగలేదేమో ! ఆర్ధికబలం ఏమాత్రం లేకపోయినా ఆయన క్రమశిక్షణ, నియమ నిబంధనలు పాటించే విషయంలో ఎంతటివారినైనా లెక్కచెయ్యని తత్త్వం, నిజాయితీ, నిబద్ధత, అంతులేని పరిజ్ఞానం, అధ్యాపకుడంటే ఇలాగే వుండాలి అనిపించే వ్యక్తిత్వం అన్ని వర్గాల మద్దతునూ చేకూర్చి, కొండను పొట్టేలు ఢీకొన్నట్లుగా జరిగిన ఆ పోరాటంలో అంతటి ఘన విజయాన్ని దక్కించాయి. 

వృత్తిపరంగా కామర్సు బోధించినా వైద్యం, సాంకేతికాంశాలు, సాహిత్యం, కళలు లాంటి అనేక విషయాల మీద ఆసక్తి, అభిరుచి ఉండేవి. వాటికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో కొని చదివేవారు. ఇప్పటికీ ఆయనకు గుర్తుగా వాటిని భద్రంగా దాచుకున్నాను. నాన్న నాకిచ్చిన సంపద అదే ! ఆయన ఉన్నంత కాలం చిన్న చిన్న విషయాలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం మాకు ఉండేది కాదు. మా బంధువర్గంలో కూడా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే సలహా కోసం మొదట నాన్న దగ్గరికి వచ్చేవారు. కాలేజీకి వెళ్లి వచ్చాక దొరికే ఖాళీ సమయాన్ని చదవడంలోనూ, తోట పనిలోనూ, తోటి అధ్యాపకుల సమస్యలకు పరిష్కారాలు వెదకడంలోను గడిపేవారు. 

నాన్నదొక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. ఆయనకున్న చదువు, పరిజ్ఞానం నాకు రాకపోయినా, ఆయన ఆసక్తులలో కొన్ని వచ్చాయని మాత్రం చెప్పగలను, ఆయన వ్యక్తిత్వానికి సరితూగలేకపోయినా నియమ నిబంధనలను పాటించే విషయంలో రాజీ పడలేకపోవడం, నిజాయితీ... నిబద్ధతలను పాటించడం లాంటి కొన్ని లక్షణాలు మాత్రం తెలియకుండానే వచ్చాయేమో ! ఇవి నాకు జీవితంలో ఆర్థిక బలాన్ని ఇవ్వలేదు కానీ నైతిక బలాన్ని ఇస్తున్నాయి. నేను తప్పు చేయడంలేదు...ఎవరినీ మోసగించడం లేదు, నన్ను నమ్మి ఉపయోగించుకున్న వాళ్లకి న్యాయం చేస్తున్నాను ( కొన్ని సార్లు నాకు అన్యాయం జరిగినా ) అనే కొండంత తృప్తిని కలిగిస్తున్నాయి. ఇవన్నీ నాకు తెలియకుండానే నాన్న ద్వారా సంక్రమించినవే ! అప్పుడప్పుడు కొందరు మిత్రులు అంటూ వుంటారు... నాకు బ్రతకటం చేతకాదని. అంటే వారి అర్థం డబ్బు, ఆస్తులు సంపాదించడం చేతకాదని. వ్యక్తిత్వాన్ని చంపుకుని సంపాదించే అంతులేని సంపద కలిగిన వారికి లేని మనశ్శాంతి నాకు వుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆస్తులేమీ ఇవ్వకపోయినా అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని వారసత్వంగా ఇచ్చిన నాన్నను స్మరించుకుంటూ ......

అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా తండ్రులకూ, వారిని గౌరవించే పిల్లలకూ శుభాకాంక్షలు

Vol. No. 02 Pub. No. 261

Saturday, June 18, 2011

కొలువైతివా... రంగశాయి !

 ఆదిశేషుని పడగలనే శయ్యగా చేసుకుని ఠీవిగా పవళించిన ఆ నారాయణుని, ఆ శ్రీరంగశాయి వైభవాన్ని వీక్షించడానికి మూడులోకాల జనులకు ఒక్కొక్కరికి వేయి కన్నులున్నా సరిపోవేమో ? 
 ............దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యానికి మాళవిక, భాగవతుల వెంకట రామశర్మ చేసిన నాట్యం, గురువుగా గిరీష్ కర్నాడ్ అభినయం అద్భుతంగా మేళవించిన ఈ పాట.........

 కొలువైతివా... రంగశాయి ! హాయి ! కొలువైతివా... రంగశాయి !!
కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి
కొలువైతివా... రంగశాయి !

సిరి మదిలో పూచి తరచి రాగము రేపి
చిరునవ్వు విరజాజులేవోయి ! ఏవోయి !
కొలువైతివా... రంగశాయి !

సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట
పరచేటి ఎలదేటులేవోయి ఏవోయి
కొలువైతివా... రంగశాయి !

ఔరా.. ఔరౌరా ! ఔరా... ఔఔరా !!
రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి
వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి
సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి
ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి        

జిలి బిలి  పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి
ముజ్జగములు మోహంబున తిలకింపగ పులకింపగ
శ్రీ రంగ మందిర నవసుందరా పరా !      
                                                               // శ్రీ రంగ //
                                                              // శ్రీ రంగ //
 కొలువైతివా... రంగశాయి ! హాయి ! కొలువైతివా... రంగశాయి !!
కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి
కొలువైతివా... రంగశాయి !!1





Vol. No. 02 Pub. No. 260

నక్షత్ర వృక్షాలు

 పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వృక్షాన్ని పెంచితే మంచిదన్న విషయం ఈరోజు మిత్రులు డిప్యూటీ కలెక్టర్ శ్రీ రహమతుల్లా గారు మెయిల్ లో పంపిన సందేశం..... అందరికోసం.............

జన్మ నక్షత్రం  పెంచవలసిన వృక్షము
అశ్వని అడ్డసరము ,విషముష్టి ,జీడిమామిడి
భరణి దేవదారు ,ఉసిరిక
కృత్తిక అత్తి ,మేడి
రోహిణి నేరేడు 
మృగశిర చండ్ర ,మారేడు
ఆరుద్ర రేల ,చింత
పునర్వసు వెదురు ,గన్నేరు
పుష్యమి పిప్పలి
ఆశ్లేష నాగకేసరి ,సంపంగి
మఖ మర్రి
పుబ్బ మోదుగ
ఉత్తర జువ్వి
హస్త కుంకుడు ,సన్నజాజి
చిత్త తాటిచెట్టు ,మారేడు
స్వాతి మద్ది
విశాఖ నాగకేసరి ,వెలగ ,మొగలి
అనూరాధ పొగడ
జ్యేష్ట విష్టి
మూల వేగిస
పూర్వాషాఢ నిమ్మ ,అశోక
ఉత్తరాషాఢ పనస
శ్రవణం జిల్లేడు
ధనిష్ట జమ్మి
శతభిషం అరటి ,కడిమి
పూర్వాభాద్ర మామిడి
ఉత్తరాభాద్ర వేప
రేవతి విప్ప

Vol. No. 02 Pub. No. 259

Friday, June 17, 2011

నీలాలు కారేనా ?

 జీవితాంతం తోడుగా నీడగా ఉంటానని ప్రమాణం చేసి తనతో తీసుకొచ్చిన అమ్మాయికి అన్నీ తనే అయి అందర్నీ వదులుకుని వచ్చిన ఆమె బెంగ తొలిగించడానికి ప్రయత్నిస్తూ...............

నీలాలు కారేనా ? కాలాలు మారేనా ?
నీ జాలి పంచుకోనా ? నీ లాలి నే పాడలేనా ?

అంటూ .......

జాజి పూచే వేళ... జాబిల్లి వేళ ....
పూల డోల నేను కానా ? 

అని ఊరడిస్తాడు అ అబ్బాయి.
తనకోసం సిరులన్నీ వదలుకుని వచ్చిన ఆ అబ్బాయి పరిస్థితి చూసి బాధపడుతున్న అమ్మాయికి నచ్చజెబుతూ ....

సూరీడు  నెలరేడు సిరి గల దొరలే కారులే !  
పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే ! 

అంటాడు. ఇంకా .......

ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే !
కలిమిలేముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేద లోగిళ్ళులే ! 

అంటూ వాస్తవ పరిస్థితిని వివరిస్తాడు

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లో కలల కన్నుల్లో కలకారి పోవాలిలే !

................ అంటూ తన  అభీష్టాన్ని తెలియజేస్తాడు. అంతేకాదు ........

ఆ తారలో తేరి తళతళ మెరిసే రేయిలో  
ఒడిలో నువ్వుంటే ఒదిగి పోతుంటే కడతేరి పోవాలిలే ! 

...... అంటూ తన కోరికను స్థిరంగా, స్పష్టంగా చెప్పి ఆమె అనుమానాలను, భయాలను, బెంగలను తొలగిస్తాడు.

వేటూరి వారి కలం నుండి జాలువారిన.... బాలు గారి గళంలో పలికిన...... రమేష్ నాయుడు గారు స్వరకల్పన చేసిన..... ప్రదీప్, పూర్ణిమ అభినయించిన..... ఈ మధురగీతం చూడండి.....



Vol. No. 02 Pub. No. 258

Wednesday, June 15, 2011

మహాకవి స్మరణ

 ఆకాశ మార్గాన విహరిస్తున్న  కవిత్వాన్ని భూమార్గం పట్టించిన కవి శ్రీశ్రీ 
భావకవిత్వమే లోకం కాదు కవిత్వానికి అన్నీ అర్హమైనవేనన్న కవి శ్రీశ్రీ 

పీడిత తాడిత ప్రజల కష్టాలను, కన్నీళ్లను తలకెత్తుకున్న కవి శ్రీశ్రీ
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో తెలుసుకున్న కవి శ్రీశ్రీ

కవిత్వం కేవలం రాజభోజ్యం కాదని నిరూపించిన కవి శ్రీశ్రీ 
ప్రజల పక్షాన నిలిచేదే అసలైన కవిత్వమన్న కవి శ్రీశ్రీ   


 మహాకవి శ్రీశ్రీ వర్థంతి సందర్భంగా సాహిత్య నీరాజనాలర్పిస్తూ........ 

మహాకవిపై గతంలో రాసిన టపాలు.........

ఛలోక్తులు -
http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_11.html
http://sirakadambam.blogspot.com/2009/11/2.html
http://sirakadambam.blogspot.com/2009/10/blog-post_20.html 
http://sirakadambam.blogspot.com/2009/10/blog-post_12.html 
http://sirakadambam.blogspot.com/2010/05/blog-post_29.html 
http://sirakadambam.blogspot.com/2011/02/blog-post_02.html 
http://sirakadambam.blogspot.com/2011/02/blog-post_16.html 


 ఇతర విశేషాలు -
http://sirakadambam.blogspot.com/2009/11/dishantcom-jukebox.html 
http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_579.html
http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_26.html
http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_27.html 
http://sirakadambam.blogspot.com/2010/06/blog-post_15.html 
http://sirakadambam.blogspot.com/2011/01/blog-post_264.html


రచనలు
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_09.html 
http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_6657.html
http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_600.html
http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_30.html

Vol. No. 02 Pub. No. 257

Tuesday, June 14, 2011

గాయకుడు ఎవరు ? - జవాబు

    కనుక్కోండి చూద్దాం - 44_ జవాబు 

ఈ క్రింద ఇచ్చిన ప్లేయర్ లో జాతీయ బహుమతులు గెల్చుకున్న ఒక తెలుగు చిత్రం యొక్క టైటిల్స్ లో వచ్చే సంగీతం వినండి.
అందులో గానం చేసిన గాయకుడు ..... ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో.. ముఖ్యంగా కె. విశ్వనాధ్ గారి చిత్రాల్లో కొన్ని పాటలు పాడారు.
అంతేకాదు ఆయన శాస్త్రీయ సంగీతంలో దిట్ట.



ప్రశ్న : ఆ గాయకుడు ఎవరో చెప్పగలరా ?  

జవాబు : ఈ గానం ' మేఘసందేశం ' చిత్రం టైటిల్స్ సమయంలో వస్తుంది. గాయకుడు పూర్ణచందర్ . ఈయన  కర్నాటక సంగీతంతో బాటు హిందుస్తానీ సంగీతం కూడా గానం చేస్తారు. ఉర్దూ ఘజల్స్ పాడడంలో ప్రావీణ్యం సంపాదించారు. అనేక కచేరీలు చేసారు. గాత్రమే కాక ఆయన వయోలిన్ వాద్య కళాకారుడు కూడా ! మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి చాలా కచేరీలలో వయోలిన్ సహకారం అందించారు. 

పూర్ణచందర్ కి బంధువు, ఒకప్పటి నటుడు ముదిగొండ లింగమూర్తి గారి ప్రోత్సాహంతో మద్రాసులో అడుగుపెట్టి, తెలుగులో చలం నిర్మించిన సన్నాయి అప్పన్న చిత్రానికి మూలమైన కన్నడ చిత్రం షనాది అప్పన్న తో చలనచిత్ర సీమలో అడుగు పెట్టారు.

జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆనందభైరవి చిత్రానికి ఆయన పాడిన తిల్లానా చిత్రంలో లేకపోయినా రికార్డులుగా, కాసెట్లలోను విడుదలై ఆరోజుల్లో ప్రజాదరణ పొందింది. 

విశ్వనాథ్ గారి శుభలేఖ చిత్రంలో అక్కడక్కడ వినిపించే ఆలాపన కూడా పూర్ణచందర్ గానం చేసినదే ! చాలామంది ఆ గానం బాలు గారిదని భ్రమ పడ్డారు. దానికి బాలు గారు అప్పట్లో పత్రికా ముఖంగా వివరణ ఇచ్చారు కూడా ! 

విశ్వనాథ్ గారి శృతిలయలు  చిత్రంలో కూడా కొన్ని పాటలు పాడారు. వాటిలో రెండింటిని ఇక్కడ వినండి......



పై ప్రశ్నకు సమాధానమిచ్చిన సూర్యనారాయణ గారికి, సమీర గారికి ధన్యవాదాలు.

Vol. No. 02 Pub. No. 256a

Saturday, June 11, 2011

గాయకుడు ఎవరు ?

    కనుక్కోండి చూద్దాం - 4

ఈ క్రింద ఇచ్చిన ప్లేయర్ లో జాతీయ బహుమతులు గెల్చుకున్న ఒక తెలుగు చిత్రం యొక్క టైటిల్స్ లో వచ్చే సంగీతం వినండి.
అందులో గానం చేసిన గాయకుడు ..... ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో.. ముఖ్యంగా కె. విశ్వనాధ్ గారి చిత్రాల్లో కొన్ని పాటలు పాడారు. 
అంతేకాదు ఆయన శాస్త్రీయ సంగీతంలో దిట్ట.

ప్రశ్న : ఆ గాయకుడు ఎవరో చెప్పగలరా ? 



Vol. No. 02 Pub. No. 256

Friday, June 10, 2011

ఆహార్యం పునరావృతం

 చరిత్ర పునరావృతమవుతుందనడం మనం అప్పుడప్పుడు వింటూ వుంటాం. అలాగే మన చిత్రసీమలో వేషాలు, ఒక్కోసారి వేషధారణలు, ఆహార్యాలు కూడా పునరావృతమవుతాయనడానికి ఉదాహరణలు.

మాయాబజార్ చిత్రం నందమూరి తారకరామారావు గారిని వెండితెర కృష్ణుడిని చేసిన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. అంతకుముందు సొంతవూరు అనే చిత్రంలో కృష్ణుడిగా కనబడినా అది కొంచెం సేపే అవడం వల్ల ప్రజల్లోకి అంతగా చొచ్చుకుపోలేదు. అయితే మాయాబజార్ కృష్ణుడు అంత సులువుగా తయారుకాలేదు. ఆ వేషం, ఆహార్యం అంత అందంగా రూపొందడానికి ముందు ఎంతో కసరత్తు జరిగింది. కళాదర్శకుడు మా. గోఖలే గారి పర్యవేక్షణలో ఎందఱో కళాకారులు అనేక రేఖాచిత్రాలు గీసారు. అందులో సింహభాగం విజయా సంస్థకు ఆస్థాన కళాకారుడైన కళాధర్ గారు గీసినవి. చక్రపాణి గారి నేతృత్వంలోని పెద్దలు అవన్నీ పరిశీలించి చివరగా ఒక నిర్ణయానికొచ్చి కృష్ణునికి అంత అందమైన రూపాన్ని తీసుకొచ్చారు. అందుకే ఆ కృష్ణుడే తెలుగు వారి మనస్సులో నిలిచిపోయాడు. 

మళ్ళీ 39 సంవత్సరాలకి రామారావు గారి వారసుడు బాలకృష్ణ నటించిన " శ్రీకృష్ణార్జున విజయం " చిత్రంలో ఆనాటి " మాయాబజార్ " చిత్రంలో రామారావు గారికి ఉపయోగించిన ఆభరణాలు మొదలైనవి బాలకృష్ణకు ఉపయోగించారు. 

 


ఇప్పుడు బాపు గారి " శ్రీరామరాజ్యం" చిత్రంలో బాలకృష్ణకు... ఆనాడు వెండితెర రాముడికి " లవకుశ " చిత్రంలో ఉపయోగించిన కిరీటం ఉపయోగిస్తున్నారు. 





Vol. No. 02 Pub. No. 255

మరో ' కళ ' కరిగిపోయింది

 కళాకారుడు సున్నిత మనస్కుడు 
కళాకారుడు ఎప్పుడూ నిరంకుశుడు 

తన కళ గురించి కలలు కంటూ ఉంటాడు 
అవి నెరవేర్చుకోవడానికి ఏటికి ఎదురీదుతాడు 

తానూ అనుకున్నది ఆవిష్కరిస్తాడు 
దానికోసం ఎన్ని విమర్శలనైనా భరిస్తాడు 

కళ పంకజం లాంటిది 
బురదలో వున్నా మకిలి అంటదు 
కళాకారుడు వజ్రంలాంటి వాడు 
అతని కళకు ఎప్పుడూ కళంకం లేదు 

ఎవరి మెప్పుకో కళాకారుడు కాలేడు
ఆత్మతృప్తికి మాత్రమే అతను బానిస కాగలడు
ఎవరికో నచ్చడానికి కళాకారుడు కాలేడు
తనకి నచ్చింది మాత్రమే అతను చెయ్యగలడు 

రవిగాంచని చోట కవి గాంచున్ అన్నది నానుడి 
సామాన్యుడు చూడని లోకం కళాకారుడు చూడగలడు

పదిమంది మెప్పుకోసం మాత్రమే చేసేవాడు వ్యాపారి  
తను కళను పదిమందీ మెచ్చేటట్లు చేసేవాడు కళాకారుడు  

తనదైన లోకంలో విహరించేవాడు కళాకారుడు 
కళ కళ కోసమేనని నమ్మేవాడు కళాకారుడు 

...... అలా ఎవరేమనుకున్నా తనదైన లోకంలో విహరించి 
      ఒక కళాకారుడిగా తనదైన వ్యక్తిత్వం చూపించి 
      నిజమైన కళాకారుడిగా జీవించి
      కళా జీవితాన్ని ముగించిన

 ఎం. ఎఫ్. హుస్సేన్ కు కళాంజలులతో .......... 

Vol. No. 02 Pub. No. 254

Wednesday, June 8, 2011

నటరాజుకు నివాళులు

నిన్న కళాప్రపంచాన్ని ,మనందర్నీ వదలిపోయిన  ' తెలుగు నటరాజు ' నటరాజ రామకృష్ణ గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు పత్రికల్లో వచ్చిన ఆయన వివరాలతో కూడిన అక్షర నీరాజనం ......



Vol. No. 02 Pub. No. 253

Tuesday, June 7, 2011

నటరాజు అస్తమయం

 దివినుండి భువికి దిగివచ్చిన నటరాజు 
అవతారం చాలించి దివికేగాడు  ఈరోజు 

అంతరించిపోయిందనుకున్న ఆంధ్రనాట్యాన్ని పునర్జీవింపజేసారు
అంతులేని వైభవాన్ని తెచ్చిపెట్టి తనపనైపోయిందని వెళ్ళిపోయారు 

నవజనార్థనం అందించి పేరిణీ శివతాండవం చేసారు
ఆంధ్రనాట్య వైభవాన్ని ప్రపంచమంతా చాటారు 

గురుపరంపర కొనసాగించి శిష్య ప్రశిష్యులనెందరినో తయారు చేసారు 
తన కర్తవ్యం నేరవేరిందనే తృప్తితో అనంతదూరం పయనమయ్యారు

........ 1975 లో ప్రధమ ప్రపంచ మహాసభలు హైదరాబాద్ లో జరిగినపుడు తొలిసారిగా నటరాజ రామకృష్ణ గారి బృందం చేసిన ఆంధ్రనాట్యం... అందులో ముఖ్యంగా పేరిణి శివతాండవం చూసినపుడు ఒకరకమైన ఉద్వేగానికి లోనయ్యాను. అప్పుడు కలిగిన అనుభూతి ఇప్పుడు మాటలలో వర్ణించలేను. తర్వాత కొన్ని సందర్భాలలో ఆయన శిష్యులు కళాకృష్ణ మొదలైన వారి ప్రదర్శనలు చూసి ఆనందించినా తొలిసారి చూసిన ఆ ప్రదర్శనను మాత్రం ఇప్పటికీ మరచిపోలేను. ఆయన రాసిన గ్రంథాలలో చాలావాటిని చదవడంతో నాట్యశాస్త్రం మీద అవగాహన ఏర్పడింది. కళను తపస్సుగా భావించి జీవితాన్ని ధారబోసారు నటరాజ రామకృష్ణ గారు. ఆయన శిష్యులుగాను, ప్రశిష్యులుగాను ఆంధ్రనాట్యాన్ని అభ్యసించి తరించిన వారు అదృష్టవంతులు. 

 ఆంధ్రనాట్య నటరాజు... భరత కళాప్రపూర్ణ నటరాజ రామకృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.........


Vol. No. 02 Pub. No. 252

Monday, June 6, 2011

సుత్తి వీరుడు

 సినిమాలు, వాటిలోని పాత్రలు, ఆ పాత్రలు పలికే కొన్ని ప్రత్యేకమైన పదాలు జన బాహుళ్యంలోకి ఎలా చొచ్చుకుపోతాయో చెప్పడానికి విజయ వారి చిత్రాల్లో  పింగళి నాగేంద్రరావు గారు సృష్టించిన ' డింగరి ', ' గురూ ' లాంటి పదాలు ఉదాహరణగా చెబుతుంటాం ! ఆ తర్వాత అలాంటి విచిత్రమైన, కొత్తరకమైన పదాల్ని సృష్టించడంతో బాటు కొన్ని పదాల్ని,,,, వాటి అసలు అర్థమే మారిపోయేలా చేసిన రచయిత జంధ్యాల. అంతేకాదు. మన చుట్టూ కనిపించే కొన్ని విచిత్రమైన, ప్రత్యేకమైన మనస్తత్వం గల వ్యక్తులను తన చిత్రాల్లో పాత్రలుగా మలచిన దర్శకుడు కూడా జంధ్యాలే ! ఆయన సృష్టించిన వాటిల్లో ఇప్పటికీ, ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయిన, నిలిచిపోయే పదం ' సుత్తి ' . నిజానికి సుత్తి అనే  పదానికి మనకు తెలిసిన అర్థం కాకుండా మరో అర్థాన్ని జంధ్యాలగారు ఆపాదిస్తే ఆ పాత్రలో జీవించి, ఆ పాత్రకు శాశ్వతత్వాన్ని కల్పించడమే కాకుండా ' సుత్తినే ఇంటి పేరుగా మార్చేసుకున్న నటుడు వీరభద్రరావు. 


మామిడిపల్లి వీరభద్రరావుగా కోనసీమలోని అయినాపురం గ్రామంలో జన్మించిన ఈయన చిన్నతనంలోనే తండ్రి ఉద్యోగ రీత్యా విజయవాడ చేరారు. చదువు, ఉద్యోగం, నాటకాలు వగైరా అన్నీ విజయవాడలోనే ! ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రసిద్ధుడవడంతో బాటు రంగస్థలం మీద కూడా లబ్దప్రతిష్టులైన కళాకారులతో పనిచేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 




జంధ్యాల సహచరునిగా ఆయన ప్రోత్సాహంతో చిత్రరంగంలో అడుగుపెట్టి ఆయన మార్క్ కామెడీని అద్భుతంగా పండించి ప్రేక్షకులను నవ్వులజడిలో తడిపారు. తెలుగులో ఎన్ని రకాల తిట్లు వున్నాయో అన్నీ జంధ్యాల తన చిత్రాల్లో వాడుకున్నారు. అంతే కాదు అదే ఒరవడిలో కొత్త కొత్త తిట్లు కూడా కనిపెట్టి మరీ వాడారు. వాటిని తెర మీదకు ఒలికించింది జంధ్యాల అయినా పలికింది మాత్రం వీరభద్రరావు గారే ! జంధ్యాల సృష్టించిన పాత్రలకు, సంభాషణలకు అంత బాగా న్యాయం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరేమో !  

వీరభద్రరావు గారు సంభాషణలు పలికే తీరులో, ఆయన ప్రదర్శించే హావభావాలలో కృత్రిమత్వం ఎక్కడా కనబడదు. మన మధ్యన నిత్యం తిరిగే సగటు మధ్యతరగతి వ్యక్తి ఆయన నటనలో కనిపిస్తాడు. అందుకే ఆయన ఆలస్యంగా చిత్రరంగానికి వచ్చినా అచిరకాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులను చూరగొన్నాడు.  

వీరభద్రరావు గారు కేవలం హాస్య పాత్రలే కాక కరుణ రసాత్మకమైన పాత్రలు, దుష్ట పాత్రలు లాంటివి  కూడా ప్రతిభావంతంగా పోషించి తన నటనా సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.

ఈరోజు ఆయన జన్మదినం, .ఆ సందర్భంగా ఆయన్ని , ఆయన నటనను స్మరించుకుంటూ......

అంతకుముందు కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసినా ఆయనలోని నటుడిని ప్రేక్షకుల మనోఫలకంపై సుత్తి పెట్టి కొట్టిన చిత్రం ' నాలుగుస్థంబాలాట '. రక రకాల వేషాలు వేసి ప్రేక్షకులను రంజింపజేసిన వీరభద్రరావు గారి పయనం ' చూపులు కలసిన శుభవేళ ' లోని సుదీర్ఘ నడకతో 1988 జూన్ 30 న అంతమైంది. ఆ సుత్తిని, ఈ నడకనీ ఓసారి వీక్షించి వీరభద్రరావు గారికి నివాళులు అర్పిద్దాం ..........................



Vol. No. 02 Pub. No. 251
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం