Showing posts with label వందన కదంబం. Show all posts
Showing posts with label వందన కదంబం. Show all posts

Sunday, August 14, 2011

బ్లాగులోకంలో మలి అడుగు

 ఈరోజుతో బ్లాగులోకంలో శిరాకదంబం అడుగుపెట్టి అప్పుడే రెండు సంవత్సరాలు పూర్తయిపోయాయి. 

  2009 లో అనుకోకుండా బ్లాగులోకంలోకి తొంగి చూసిన నన్ను సూదంటు రాయిలా ఆకట్టుకుంది. అప్పటికే బ్లాగులోకంలో లబ్దప్రతిష్టులైన వాళ్ళందరి బ్లాగులను పరిశీలించడం ప్రారంభించాను. ఫలితంగా ఆ సంవత్సరం ఆగష్టు 14 న అనుకోకుండా ఈలోకంలో అడుగుపెట్టాను. అప్పటికి నాకు ఎంతకాలం ఈ బ్లాగు నడుపగలనో తెలీదు. నేను రాసినవి ఎంతమందికి నచ్చుతాయో తెలియని పరిస్థితి. కానీ సీనియర్లందరూ వెన్ను తట్టి ప్రోత్సహించారు. నేను గత పాతిక ముఫ్ఫై సంవత్సరాలుగా సేకరించి దాచుకున్న విశేషాలనే అందిస్తున్నానని వాళ్ళందరికీ తెలుసు. కానీ గత సంవత్సరకాలంలో చాలామంది కొత్త మిత్రులు నా బ్లాగుకు రావడం ప్రారంభించారు. అందులో చాలామంది యువతరానికి చెందిన వాళ్ళవడం విశేషం. వారిని గతకాలపు విశేషాలు ఆకర్షించడం మరీ విశేషం. అందుకే వారికోసం గత సంవత్సరం నేను ఎక్కువగా ప్రముఖుల జయంతులను, వర్థంతులను... ఇంకా కొన్ని ప్రముఖ దినాలను పాటిస్తూ ప్రత్యేకంగా రాయడం ప్రారంభించాను. దీనివలన వారి లేదా ఆ తేదీల విశిష్టత ఇప్పటి యువతరానికి తెలియడమే కాదు.... ఆ సందర్భాలను వారు గుర్తు పెట్టుకునేలా చెయ్యడానికి వీలవుతుందని నా భావన ! ఈ సంవత్సరం ఒక క్రొత్త ప్రయోగం ప్రారంభిస్తున్నాను. ఆ వివరాలు చివరిలో..... 

నేను పుట్టిన హిందూ మతాన్ని, సంప్రదాయాల్ని నేనెంతో ప్రేమిస్తాను. అలాగే ఇతర మతాల్ని, వారి విశ్వాసాల్ని కూడా గౌరవిస్తాను. అది నాకు ఎలా అలవడిందో తెలియదు గానీ చిన్నప్పటినుంచీ అలవడింది. అలాగే కులం గురించి మాట్లాడటమంటే నాకు చాలా ఇబ్బందిగా వుంటుంది. ఎందుకంటే అన్ని కులాల్లోను, మతాలలోను నన్ను అభిమానించే, ప్రేమించే మిత్రులున్నారు. 

 అన్నిటికంటే నేను పుట్టిన గడ్డ భారతదేశం ఆంటే చాలా చాలా ఇష్టం. ఇతర దేశాల గురించి తెలుసుకోవడం కూడా ఇష్టమే ! తెలుగు భాష ఆంటే మహా ప్రీతి. ఇతర భాషలను గౌరవించడం కూడా ఇష్టమే ! 

బీడుగా పడి వున్న లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాటన్ దొర ఆంటే ఇష్టం. 
తెలుగుకు వెలుగు ప్రసాదించిన బ్రౌన్ దొర ఆంటే చాలా ఇష్టం. 
వాళ్ళు తమ దేశాన్ని, భాషను మాత్రమే గౌరవించి మన దేశాన్ని, భాషను నిర్లక్ష్యం చేసి వుంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించండి.

 చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళేటప్పుడు రోడ్ మీద కొన్ని ఆకర్షణలు కనిపించేవి. మోళీ సాహెబ్ ఆటలు, గారడీలు, సినిమా బళ్ళు, సర్కస్ వచ్చినప్పుడు ఏనుగులు, ఒంటెలు వగైరాలతో జరిపే ఊరేగింపులు లాంటివి. అలాగే రోడ్ నే కాన్వాస్ గా చేసుకుని బొగ్గుముక్కలతో అందమైన బొమ్మలు గీసే చిత్రకారులు కూడా ! ఇలాంటివి కనబడినప్పుడు అక్కడే నిలబడి తదేకంగా తన్మయత్వంతో చూసి క్లాసుకి ఆలస్యంగా వెళ్లి టీచర్ల చేత చీవాట్లు తిన్న సందర్భాలెన్నో వున్నాయి. కళలన్నా, కళాకారులన్నా అంత మక్కువ. కళాకారుడెవరు ? ఏ స్థాయి వాడు ? ఏ మతస్థుడు ? ఏ కులస్థుడు ? అన్న ఆలోచన లేదు.... రాదు.... అప్పటికీ... ఇప్పటికీ... వారి కళ మాత్రమే కనిపించేది.

మా ఇంట్లో వున్న ఖరీదైన పటంలోని రవివర్మ గీసిన దేవుడి బొమ్మ  చూసినా, రోడ్ మీద బొగ్గులతో గీసిన దేవుడి బొమ్మ చూసినా ఒకే రకమైన ఆనందం కలిగేది. త్యాగరాయ గాన సభలో వెంపటి చినసత్యం గారి బృందం చేసిన నాట్యం చూసి ఎంత ఆనందం పొందేవాడినో... మోళీ సాహెబ్ వాయించే డోలక్ కి అనుగుణంగా చేసే అమ్మాయి నృత్యం చూసినా అంతే ఆనందం పొందేవాడిని. ఇంకా చెప్పాలంటే నవరాత్రి పందిళ్ళలో మేజువాణీలు, రికార్డింగ్ డాన్సులను కూడా ఒక స్థాయి వరకూ చూసి ఆనందించేవాడిని. బాలమురళి కచేరీ నన్ను ఎంత మురిపించేదో, రైల్లో చిడతలు వాయిస్తూ.. అమ్మాయి చేయి పట్టుకుని నడుస్తూ... అడుక్కునే గుడ్డివాని పాట విన్నా అలాంటి అనుభూతే కలిగేది. ఇలాంటి పోలికలు చెబితే ఎవరికైనా కోపం రావచ్చేమోగానీ ఇది నిజంగా నిజం. నా రసాస్వాదన స్థాయిని చెప్పడానికే ఇది చెప్పవలసి వచ్చింది. ఇదేదో గొప్ప విషయం అని నేననుకోవడం లేదు. చాలామందిలో ఇలాంటి స్థితే ఉండొచ్చు. అయితే అందరూ బహిరంగంగా చెప్పుకోకపోవచ్చు. ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా చెప్పుకున్నాను. గత రెండేళ్లలో నన్ను బాధపెట్టిన ఒకే ఒక వ్యాఖ్య... ఆ సందర్భం. పంటికింద రాయిలా బాధ పెట్టిన కారణంగా ఈ వార్షిక నివేదికలో ఒకసారి తలచుకోకుండా ఉండలేకపోయాను. అంతేకానీ ఇంకా పొడిగించడానికి కాదు. ఇక మిగిలిన అందరూ నా రాతల్ని విశ్లేషిస్తూ, ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు రాసిన వారే ! వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం నా బాధ్యత. 

ఇక గతసంవత్సరపు గణాంకాలలోకి వెడితే..... 

రాసిన మొత్తం టపాలు ( అనుబంధాలతో కూడా కలిపి )           - 734
    గతసంవత్సర కాలంలో రాసిన మొత్తం టపాలు                  - 358

    వచ్చిన మొత్తం వ్యాఖ్యలు                                          - 2141  
    గతసంవత్సర కాలంలో వచ్చిన వ్యాఖ్యలు                
   ( టపాలతో సంబంధం లేనివి, నా జవాబులు, 
రిపీట్ అయినవి కాక )                                                 - 1097

     శిరాకదంబం అభిమాన మిత్రులుగా చేరినవారు, మొత్తం         -   73  
    గతసంవత్సర కాలంలో చేరిన వారు                                - 53
    శిరాకదంబం మొత్తం సందర్శకులు
   ( 14 వ తేదీ 00.00 గం. వరకూ )                         - 1 ,16 , 450
   గతసంవత్సర కాలంలో సందర్శకులు                             -     95 , 522

ఈ సంవత్సరకాలంలో ఇంతగా అభివృద్ధి , సాధించడానికి తోడ్పడిన మిత్రులు, అభిమానులు, అగ్రిగేటర్లు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు... అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకుంటూ... ఒక విన్నపం. 

 ఈ రెండు సంవత్సరాల మీ ఆదరాభిమానాలను పురస్కరించుకుని శిరాకదంబం  ని ఒక ప్రయోజనకరమైన వెబ్ పత్రికగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈరోజు నుంచి మీకు అందిస్తున్నాను. దీనికి కొందరు అంతర్జాల మిత్రులు  ప్రోత్సాహం, సహకారం అందించడానికి ముందుకు రావడం చాలా ఆనందదాయకం. దీన్ని ఆడియో వీడియో పత్రికగా రూపొందించాలని ప్రయత్నం. శిరాకదంబం వెబ్ పత్రికను కూడా ఆదరించి, ఆ పత్రిక అభివృద్ధికి తగిన సలహాలు, సూచనలు అందిస్తారని ఆశిస్తూ... పత్రిక లింక్....

ఒక్కసారి పై లింక్ నొక్కి పత్రికలో అడుగు పెట్టి చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుకుంటూ.... వందన కదంబాలు.  

చివరగా రెండు సంవత్సరాలు పూర్తి అవడానికి కొద్దిసేపటి ముందు ( 13 వ తేదీ 8:50 PM ) ఒక క్రొత్త అభిమాని మెయిల్ లోవ్యక్తపరచిన అభిప్రాయం... 

Dear sir,

ఇవ్వాళంతా మీ బ్లాగులోనే గడిపాను.  చదివి చదివి ఆనందించడం లో మునిగి పోయాను.

మీకా మాట చెప్పాలని వాఖ్యలో వ్రాద్దామనుకున్నా కానీ ,

దేనికని వ్రాయను, అన్నీ బాగుంటే,

మళ్ళీ అనుమానమొచ్చింది, దేనికైనా వాఖ్య వ్రాసే స్థాయి నాకుందా అని .

Thank you sir,

for creating a good blog

Chandu. S

Vol. No. 03 Pub. No. 001

Sunday, June 5, 2011

కాలగమనంలో మరో మజిలీ



















కాలం....దానిపని అది చేసుకుపోతూంటుంది
కాలం...ఒక ప్రవాహం...ఎవరికోసం..దేనికోసం ఆగదు

బాల్యం...ఒక తీపి జ్ఞాపకం 
చీకూ చింతా లేని జీవితం 

యవ్వనం ... ఒక మధురానుభవం
ఎన్నో అనుభూతులు, అనుభవాల సంగమం 

వృద్ధాప్యం... ఒక జీవితానుభవం
పరిపూర్ణమైన జీవితానికి ప్రతిరూపం 

మొదటి రెండు మజిలీలు పూర్తి చేసుకుని మూడో మజిలీ పొలిమేరల్లో వుండి....ఈ యాభై నాలుగేళ్ళ జీవితంలో సాధించింది ఏమిటీ అంటే ఆస్తులు, అంతస్తులు కాదు.... భోగభాగ్యాలు అంతకన్నా కాదు..... అంతకంటే విలువైన ....అంతులేని....అపారమైన నిదినిక్షేపాలు. అవే... ఇంటా బయిటా ఆత్మీయుల, స్నేహితుల ఆప్యాయతలు, అనురాగాలు. 
అంతర్జాలంలో శిరాకదంబం తో ప్రారంభించి పేస్ బుక్, ట్విట్టర్, తెలుగు పీపుల్ డాట్ కామ్, ఇండ్యారాక్స్, మై స్పేస్, ఫ్యాన్ బాక్స్,  వెయిన్, నెట్ లాగ్, జోర్పియా లాంటి అనేక సోషల్ సైట్ల ద్వారా ఎంతోమంది స్నేహితులు  ఏర్పడ్డారు. నిజానికి వీరందరికీ ప్రత్యక్షంగా నాతో కంటే నా శిరాకదంబం తోనే అనుబంధం ఎక్కువ. ఆ రాతలు చదివి చాలామంది ఆప్తులుగా మారిపోయారు... అనుబంధం పెంచుకున్నారు. 

ఇంతకంటే నాకేమి ఆస్తి కావాలి ? ఈ ఆప్యాయమైన పలకరింపులు చాలవా ? అందుకే ఈ బంధాలు కలకాలం వుండాలని కోరుకుంటూ......  


 మీ 
శి. రా. రావు



 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక విన్నపం... మిత్రులందరూ తమకు వీలైనంతవరకూ పర్యావరణ పరిరక్షణకు కృషి చెయ్యండి... భావి తరాలకు ఆనందకరమైన జీవితాన్నిఅందించండి


Vol. No. 02 Pub. No. 250

Thursday, April 7, 2011

ఆరు నూర్లు

 ఆరు నూర్లు. షట్ శతం........ ఎలా పలికినా ఆరు వందలే ! 

నిన్న సుజాత గారి మరణం గురించి రాస్తూ ఒక విషయం గమనించాను. ఇప్పటివరకూ ఎప్పుడూ లెక్కలు చూసుకోకపోయినా నిన్న గమనించిన విషయం..... 
14 ఆగష్టు 2008 న ' శిరాకదంబం ' ప్రారంభించినప్పటి నుంచి నిన్నటి వరకూ అంటే 06 మార్చి 2011 వరకూ గడిచినవి 600 రోజులు. టపాల సంఖ్య 596 . అంటే ఇంకొక నాలుగు టపాలు ప్రచురిస్తే రెండూ సమానమయ్యే అవకాశం వుంది. అందుకే అనుకోకుండా కలిసొచ్చిన ఈ అవకాశాన్ని అందుకోవాలని ఇంతకుముందు రాసి పెట్టుకున్న వాటిని కొంచెం సంస్కరించి ప్రచురించాను. వీటితో  ఈరోజు వరకూ  ' శిరాకదంబం ' ద్వారా వెలువడినవి మొత్తం 600 టపాలు. ఈ టపాయే 600 వ టపా. 



 ఇందులో ఎన్ని టపాలు చదువరులకు నచ్చాయో, ఎన్ని నచ్చలేదో నేను ఖచ్చితంగా అంచనా వెయ్యలేను గానీ లోకో భిన్న రుచిః అన్నట్లు అందర్నీ మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదేమో ! అందులోను విభిన్న విషయాలు రాస్తున్నపుడు, గతంలో  ఎక్కడైనా ప్రచురిచతమైన లేదా విన్న విషయాలు ఎత్తి రాసినపుడు సహజంగానే కొన్ని బేధాభిప్రాయాలు తలెత్తుతాయి. రెండు, మూడు సందర్భాలలో తప్ప నాకు ఆ సమస్య ఎదురు కాలేదు. అవి కూడా పెద్ద సమస్యలు కావు. అలాగని నేను ప్రచురించేవన్నీ నూటికి నూరు శాతం సరైనవేనని నేను భావించడంలేదు. నేను కూడా ఎక్కడో అక్కడ చదివో, చూసో రాసినవే ! అయితే నేను ప్రచురించే ప్రతి అంశం ఒకచోట మాత్రమే కాకుండా వీలైనన్ని ఎక్కువచోట్ల పరిశీలించి వాస్తవానికి దగ్గరగా వుంది అనిపించినప్పుడే ప్రచురించడానికి సాహసిస్తాను. కొన్ని అలా పరిశీలించడానికి వీలు కాకపోవచ్చు. ముఖ్యంగా చలోక్తుల విషయంలో... కొన్ని ఛలోక్తులు కొంతమంది పెద్దల పేర చలామణీలో వుంటాయి. వాటిలో నిజనిజాలేమిటో మనకి తెలీదు. తెలుసుకోవడం కష్టసాధ్యం కూడా ! అటువంటప్పుడు ఆ ఛలోక్తిని ఆస్వాదించడమే సరైనదని సర్డుకుపోవడమే మంచిదేమో !
 
ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యలు 1832. అందులో నా జవాబులు సుమారుగా 650 తీసేస్తే  మిగిలినవి 1182. వీటిని విశ్లేషిస్తే సుమారుగా అన్నీ నన్ను ప్రోత్సహిస్తూ రాసినవే ! ప్రశంసలు ఎక్కువగానే వున్నా అవన్నీ హృదయపూర్వకంగా మెచ్చుకున్నవేనని నమ్ముతాను. ఎందుకంటే ఈ బ్లాగు మిత్రులేవరికీ అనవసరంగా మెచ్చుకోవలసిన అవసరం లేదు. దానివల్ల వాళ్ళకి ఒరిగేది కూడా ఏమీ లేదు. అలాగే నా రాతల్లో దొర్లిన చిన్న చిన్న తప్పుల్ని కూడా ఎత్తి చూపి నన్ను నేను సరి చేసుకోవడానికి దోహదపడ్డ మిత్రులు కూడా వున్నారు. అంతేకానీ నా రాతల్ని వ్యతిరేకించిన వారు గానీ, వాటిని వివాదాస్పదంగా చూసిన వారు గానీ దాదాపుగా లేరనే చెప్పాలి. ఈ దృష్ట్యా నా రాతలు నచ్చినా, నచ్చకపోయినా వ్యతిరేకించినవారు మాత్రం లేరనే అనుకోవచ్చేమో !

విభిన్న విషయాలలో కొందరికి కొన్ని నచ్చుతాయి. మరికొన్ని ఇంకొందరికి నచ్చుతాయి. ఇంకా కొన్ని ఎవరికీ నచ్చకపోవచ్చు. నాకు మాత్రం అన్నీ నచ్చే రాస్తాను. అంతమాత్రం చేత చదవరులందరికీ కూడా నచ్చి తీరాలని అనుకోను. కానీ కొన్ని విషయాలు రాసేటపుడు మాత్రం ఈ విషయం మీద ఎవరైనా స్పందిస్తే బాగుండుననిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొన్ని విషయాల మీద కొన్ని అనుమానాలు మనసులో వున్నపుడు ఎవరైనా వాటికి స్పందించి తమకు తెలిసిన విషయాలు చెబితే సరి చేసుకోవచ్చునని ఎదురుచూస్తాను. కానీ అలా సరి చేసిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటప్పుడు నా దగ్గరున్న సమాచారం సరైనదేనని నమ్మేయ్యాల్సొస్తుంది.

రాశి ఎక్కువగానే వున్నా వాసి తక్కువేమోననే శంక నన్ను పీడిస్తూ ఉంటోంది. ఎందుకంటే ఎవరో రాసిన విశేషాలో, ఎవరో చెప్పిన చలోక్తులో నేను తిరగ రాయడమే కానీ నా స్వంత రచనలనేవి ఎక్కువగా లేకపోవడం వలన. ఈ విషయంలో కొత్తపాళీ గారి లాంటి మిత్రులు నన్ను హెచ్చరించారు ( ప్రోత్సహించారు ) కూడా ! కాకపొతే కొన్నిసార్లు సమయాభావమో, మరికొన్నిసార్లు నేను రాసింది నాకు నచ్చకో ప్రచురించడం లేదు. అలా ప్రచురించకుండా డ్రాఫ్ట్ లు గా ఉండిపోయినవి, కాగితాల మీద, సిస్టం ఫైళ్లలోనూ చాలా వున్నాయి. వీటన్నిటికంటే ముందు నా ముందు కొండలా ఉండిపోయిన పాత పత్రికల ఖజానా ! ఇప్పటివరకూ ఎంత రాసినా నా సేకరణలో ఇంకా పావు వంతుకు కూడా పూర్తి కాలేదు. ఒక్కోసారి ఎంపిక కూడా కష్టమైపోతోంది. ఇక స్వంత రచనలు కూడా ప్రణాళిక ప్రకారం వారానికొకటైనా ప్రచురించాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఇకనైనా గట్టిగా ప్రయత్నించాలి. అప్పుడైనా విమర్శనా వ్యాఖ్యలోస్తాయేమో చూడాలి.

ఇక ఈ 600 రోజుల బ్లాగింగులో నేను సంపాదించుకున్న ఆస్తి మంచి మిత్రబృందం. ముందే చెప్పినట్లు నన్ను గానీ, నా రాతల్ని గానీ ద్వేషించేవారు లేరనే అనుకుంటున్నాను. ఒకవేళ వున్నా మొహమాటానికో, మరో కారణం చేతో ఎవరూ బయిటపడలేదు. శిరాకదంబం ' అబిమాన మిత్రులు ' గా చేరిన వారే కాకుండా క్రమం తప్పకుండా అనుసరిస్తున్నవారు ఇంకా చాలామందే వున్నారు. అలాగే ఈ బ్లాగు పుణ్యమాని ట్విటర్ లోను, ఫేస్ బుక్ లోను... ఇంకా ఇతర సోషల్ సైట్ల ద్వారా అనుసరిస్తున్న వారిలో చాలా మంది ప్రముఖులు కూడా వుండడం నాకు చాలా ఆనందం కలిగిస్తున్న విషయం. ఆయా సైట్లలో నాకు మిత్రులుగా చేరి ప్రోత్సహిస్తున్న వారి సంఖ్య వెయ్యి దాటింది. బ్లాగర్ వారి లెక్కల ప్రకారం ప్రతి రోజూ శిరాకదంబం వీక్షిస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. ఇంతకుముందు రోజూ 100 నుండి 200 మధ్య వుండే వీక్షకుల సంఖ్య గత నాలుగయిదు నెలలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 300 నుంచి 800 మధ్య వుంటోంది. నూతన్ ప్రసాద్ గారి స్మరణగా ' నిత్య నూతన ప్రసాదం ' ప్రచురించిన రోజున ఆ సంఖ్య 769 , ఉగాది ఊసులు ప్రచురించిన ఉగాది రోజున 789 గా వుంది. ఈ లెక్కలు నిజమే అయితే ఆనందమే ! ఏది  ఏమైనా ఇలా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వీక్షకుల సంఖ్య పెరగడం కూడా మంచి బలాన్నిస్తోంది. ఉపయోగించే విషయాన్ని అందించినా, అందించకపోయినా హాని కలిగించే విషయాలను అందించడం లేదనే విషయం వీక్షకుల పెరుగుదలను బట్టి అర్థమవుతోంది. ఇది బలుపే గానీ వాపు కాదేమో !

చివరగా ఈ బ్లాగు బంధంతో కొంతమంది మిత్రులు నాకు కేవలం ప్రోత్సాహమివ్వడమే కాకుండా మైల్స్ ద్వారా కూడా తమకు తెలిసిన సమాచారాన్ని పంచుకోవడం, కొన్ని కొత్త కొత్త అంశాలను సూచించడం చెయ్యడం నా అదృష్టం. అయితే అలా నా టపాలను సంపన్నం చేసిన వారి పేర్లు కృతజ్ఞతగా ప్రచురించకపోవడం కేవలం వారి సూచన మేరకే కానీ నా కృతఘ్నత కాదు. అజ్ఞాతంగానే ఉండడానికి ఇష్టపడ్డ నా శ్రేయోభిలాషులైన మిత్రులకు ఇలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇలాగే మిత్రులందరి ప్రోత్సాహం, సహకారం వుంటే బ్లాగుల్లోనే మరికొన్ని ప్రయోగాలు చెయ్యాలని వుంది.
 శత సహస్ర వందనాలు 
ఆరు వందల రోజుల్లో షట్ శత టపాలకు రోజుకు సరాసరి ఆరు నూర్ల వీక్షకుల ప్రోత్సాహమే కారణం. వారందరికీ శత సహస్ర వినయపూర్వక వందనాలు. అలాగే నాకు అణువణువునా సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న నా మిత్రుడు, మా కంపెనీ చైర్మన్ అయిన శ్రీ కూచిమంచి సుబ్రహ్మణ్యం గారికి, మా కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు చెప్పక తప్పదు. ఈ ప్రోత్సాహం ఇలాగే ఇకముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ......

 మరో విశేషం :  ఇప్పుడే తెలిసిన మరో విశేషం మిత్రులతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. బ్లాగర్ వాళ్ళు  2010 మే నెలనుంచి వీక్షకుల లెక్కలు తెలిపే సదుపాయం ప్రారంభించారు. ఈ పదకొండు నెలల ఏడు రోజులలో ఈ క్షణం వరకూ ' శిరాకదంబం '  వీక్షించిన వారి సంఖ్య 50,125 . ముఖ్యంగా ఈరోజు వీక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో  1111 .  

Vol. No. 02 Pub. No.196

Saturday, August 14, 2010

బ్లాగు లోకంలో తొలి అడుగు

బుడి బుడి నడకలు నేర్చుకున్నాకే పరుగెత్తడం నేర్చుకుంటారు
తప్పటడుగులు వేయడం వచ్చాకే తప్పుటడుగుల మర్మం తెలుసుకుంటారు
సుదీర్ఘ జీవన యానంలో ఒక సంవత్సర కాలం తక్కువేమీ కాదు
వెనుదిరిగి చూసుకుంటే సాధించినదేమిటో, సాధించాల్సింది ఏమిటో తెలుస్తుంది



ఈరోజు ఆగష్టు 14 వ తారీఖు
సరిగా సంవత్సరం క్రితం అనుకోకుండా ' శిరాకదంబం ' ప్రారంభమైంది
అందులో చెప్పడానికి, రాయడానికి చాలా కనిపించింది
నచ్చినవి, మెచ్చినవి, భద్రంగా దాచుకున్నవి బయిట పెట్టడం ప్రారంభించాను
ఎంత రాసినా తరగడం లేదు.. ఎంత రాసినా తృప్తి కలగడం లేదు
ఇంకా రాయాలి.. నా దగ్గరున్నవి, నాకు తెలిసినవి అన్నీ అందరికీ పంచాలి
అనుకుంటుండగానే సంవత్సరం గడిచిపోయింది

ఇంకెంతకాలం రాయగలనో... ఇంకెన్ని విషయాలు రాయగలనో...!
  
చదివేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, మొట్టికాయలు వేసే వాళ్ళు
............ ఇలా ఎంతోమంది కనిపించారు ఈ బ్లాగులోకంలో
అవును ఇదో లోకం
ఇందులో పడితే బయిట ప్రపంచం కనబడదు
కష్టాల, బాధల, అశాంతుల కేకలు వినిపించవు
మన లోకం మనది.... మన రాతలు మనవి
మనకి తెలిసింది రాస్తాం !..... మనకనిపించింది రాస్తాం !!

శిరాకదంబం గణాంకాలు -
సంవత్సర కాలంలో రాసిన మొత్తం టపాలు ( అనుబంధాలతో కూడా కలిపి ) - 376
సంవత్సర కాలంలో వచ్చిన వ్యాఖ్యలు
( టపాలతో సంబంధం లేనివి, నా జవాబులు, రిపీట్ అయినవి కాక )          - 761
శిరాకదంబం అభిమాన మిత్రులుగా చేరినవారు
( చేరకపోయినా అభిమానం కురిపిస్తున్నవారు అనేకమంది )                   -   20
శిరాకదంబం సందర్శకులు 
( బ్లాగులో ఉంచిన విడ్జెట్ ద్వారా మాత్రమే !  ఆది కూడా ప్రారంభించిన
నెల తర్వాత పెట్టినది. మిగిలిన లింక్ లలో విషయం తెలీదు )                   - 20928


' కళాకారులకు బలం ప్రేక్షకుల చప్పట్లే ' అన్నారు ఒక రచయిత
బ్లాగర్లకు వ్యాఖ్యలే బలం అంటున్నారు బ్లాగు మిత్రులు
ఆ వ్యాఖ్య మెచ్చుకోలైనా, విమర్శైనా, తిట్లయినా ఏవైనా
టపా రాసాక చకోర పక్షిలా బ్లాగరు ఎదురుచూసేది వ్యాఖ్యలకోసమే !

శిరాకదంబం లో తొలిసారి వ్యాఖ్యలు రాసినవారు
rayraj  గారు , నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారు, భావన గారు
ఆది ఏడవ టపా - తెలుగు భాషను మనం పరిరక్షించుకోగలమా ? 
తొలి వ్యాఖ్యలు రాసిన ఈ ముగ్గురికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిజానికి అప్పుడు వారు కొన్ని ప్రశ్నలేసారు. వాటికి అప్పుడు సరిగా సమాధానం చెప్పగలిగానో.. లేదో గానీ తెలుగు సంప్రదాయాల్ని, సంస్కృతినీ భావితరాలకు అందించే కార్యక్రమం చేపట్టాలనేది నా చిరకాల వాంఛ . అన్నీ వ్యాపారాత్మకమైపోయిన ఈ రోజుల్లో ఇది కష్ట సాధ్యమైన విషయమే ! అయినా ఏటికి ఎదురీదడం విశేషం గానీ వాలుకి కొట్టుకుపోవడం విశేషం కాదేమో ! అందుకే చాలాకాలంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. దానికి బ్లాగుల ద్వారా మిత్రులైన కొందరు ప్రోత్సాహం, సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. అలాగే కొంతమంది చిన్ననాటి మిత్రులు సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు.  పూర్తిగా కార్యరూపం దాల్చాక వివరాలు ఇస్తాను. 

ఈ బ్లాగుల వల్ల కొత్తగా ఎంతోమంది మిత్రులను పొందగలిగాను. ఎన్నో భావాలు, ఉల్లాసాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు...మరికొన్ని విషాదాలు కూడా బ్లాగుల్లో చూసాను. అయితే నా అదృష్టం నాకు మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహించే మిత్రులు ఈ బ్లాగులోకంలో లభించారు.... లభిస్తున్నారు. 

ఈ సంవత్సరంలో కొన్ని మధుర జ్ఞాపకాలు  -
1 . ' కొత్తపాళీ ' నారాయణస్వామి గారి ' రంగుటద్దాల కిటికీ ' పుస్తకావిష్కరణ సభలో పాల్గోవడం, అక్కడ ' తెలుగు పద్యం ' భైరవభట్ల కామేశ్వరరావు గారు, ' నవ్వులాట ' శ్రీకాంత్ గారు, ' తెలుగు కళ ' పద్మకళ గారు, తెలుగు భాషా వికాసానికి అవిరళ కృషి చేస్తున్న డిప్యూటీ కలెక్టర్  నూర్ రహమతుల్లా గారు మొదలైన వారి పరిచయ భాగ్యం లభించింది.
2 . జనవరిలో విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఈ - తెలుగు డెమో నిర్వహణలో పాల్గోవడం, ఆ సందర్భంగా డి.ఎస్.కె. చక్రవర్తి గారు, కశ్యప గారు, సతీష్ గారు, ప్రసాద్ గారు మొదలైన బ్లాగర్లను కలవడం జరిగింది.
3 . సంక్రాంతికి ' సాహిత్య అభిమాని ' శివరామ ప్రసాద్ గారు విజయవాడ వచ్చిన సందర్భంలో కొంతమంది విజయవాడ బ్లాగర్లు కలవడం జరిగింది.

శిరాకదంబం అనే ఒక బ్లాగు వుందని అంతర్జాలంలో అందరికీ తెలియపరిచి తద్వారా కొంతమంది చదువరులను సంపాదించేందుకు దోహదపదడంలో కూడలి, హారం, మాలిక లాంటి బ్లాగు అగ్రిగేటర్లు, తెలుగు పీపుల్ డాట్ కామ్, ఇండ్యా రాక్స్, వెబ్ దునియా - తెలుగు లాంటి సైట్స్, పేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ బజ్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పాత్ర మరువలేనిది.   

సంవత్సరం గడిచిందంటే బుడి బుడి నడకల స్థాయి నుంచి ధీమాగా తొలి అడుగు వేసే స్థితికి చేరుకున్నామనుకుంటాను. ఇన్నాళ్ళూ చేయి పట్టుకు నడిపించిన వారెందరో పేరు పేరునా చెప్పడం  కష్టమైనా సీనియర్ లూ, జూనియర్ లూ అనే తేడాలేకుండా బ్లాగు మిత్రులందరూ తమ సలహాలు, సూచనలతో శిరాకదంబం ను ప్రోత్సహిస్తూనే వున్నారు. ఇందులో కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ అని లెఖ్ఖలు చెప్పడం ఉచితం కాదనుకుంటాను. బ్లాగర్లే కాదు ఇతర మార్గాల ద్వారా చదవరులు కూడా శిరాకదంబం చూసి తమ అభిప్రాయాల్ని తెలుపుతూనే వున్నారు. ప్రోత్సహిస్తూనే వున్నారు. ఇలా శిరాకదంబం బలోపేతం కావడానికి దోహదపడుతున్న వారెందరో ................ అందరికీ శతకోటి వందనాలు. ముందు ముందు కూడా ఇలాగే మిత్రులందరూ తమ సలహాలు, సూచనలు, విమర్శలతో శిరాకదంబం ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ.............


Vol. No. 01 Pub. No. 374

Saturday, February 27, 2010

పదివేల వందనాలు

బ్లాగు మిత్రులు, వీక్షకులు అయిన శ్రేయోభిలాషులందరికీ పదివేల వందనకదంబాలు
ఈ నెల 14 వ తేదీతో బ్లాగు ప్రారంభించి ఆరునెలలు అయితే మరో పద్నాలుగు రోజులకు
అంటే నేటితో పదివేల హిట్లు పూర్తయ్యాయి. ఇందుకు కారణమైన అందరికీ పదివేల కృతజ్ఞతలు.







Vol. No. 01 Pub. No. 210

Monday, February 15, 2010

ఆరుమాసాల సహవాసం


శిరాకదంబం ప్రారంభించి నిన్నటికి ( 14 వతేదీ ) ఆరునెలలు గడచిపోయాయి. తెలుగులో బ్లాగులనేవి ప్రారంభమై చాలాకాలమైనా ఏడున్నర నెలల క్రితం వరకూ నేను అజ్ఞానంలోనే ఉండిపోయాను. నెలన్నర అధ్యయనం చేసి గత సంవత్సరం ( 2009 ) ఆగస్టు 14 వతేదీన నేను కూడా బ్లాగు ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి, ప్రారంభించడం ఎలా అనేది పెద్దగా ఆలో్చన లేకుండా ప్రారంభించేసాను. తర్వాత ప్రశ్న ఏం రాయాలి ? మొదట్లో నా భావాలు రాసాను. తర్వాత నా పుస్తకాల ఖజానాలోని విశేషాలను అందించడం మొదలు పెట్టాను.

నా బ్లాగుకి మొదటి వ్యాఖ్య 7 వ టపాకు వచ్చింది. మొదటి వ్యాఖ్యాతలు రాయరాజ్ గారు, నరసింహ గారు, భావన గారు . తర్వాత నా రాతలు చదువుతూ వ్యాఖ్యానం చేసిన మిత్రులు చిలమకూరు విజయమోహన్ గారు, ధరణీ రాయ్ గారు, వినయ్ చక్రవర్తి గారు, కొత్తపాళీ గారు, రవిచంద్ర గారు, బోనగిరి గారు, శివ గారు, జయ గారు , సృజన గారు , మంచుపల్లకీ గారు, సుభద్ర గారు, తృష్ణ గారు, పద్మార్పిత గారు, బుజ్జి గారు, తెలుగు తూలిక మాలతి గారు, వెంకటరమణ గారు, శేఖర్ పెద్దగోపు గారు, మాలాకుమార్ గారు, అమ్మఒడి ఆదిలక్ష్మి గారు, భాస్కర రామిరెడ్డి గారు, వైద్య భూషణ్ గారు, వరూధిని గారు, హరేకృష్ణ గారు, చిన్ని గారు, శ్రీనిక గారు, నేదునూరి గారు, జ్యోతి గారు, ఆచార్య ఫణీంద్ర గారు, మురళీమోహన్ గారు, అప్పారావు శాస్త్రిగారు, సూర్యుడు గారు, ఉష గారు, ఫణి గారు, శిశిర గారు, వాసు గారు, కంది శంకరయ్య గారు, మాడీ గారు, కొత్త రవికిరణ్ ( పూలవాన ) గారు, జలసూత్రం గారు, పరిమళం గారు, నా యిష్టం గారు, వేణు శ్రీకాంత్ గారు, కార్తీక్ గారు, సంతోష్ గారు, నిషిగంధ గారు, సి.బి.రావు గారు, సునీత గారు, సందీప్ గారు, ఆదిత్య గారు, గిరిధర్ గారు, గొర్తి బ్రహ్మానందం గారు, గీతాచార్య గారు, రాజన్ గారు, కెక్యూబ్ వర్మ గారు, రావు గారు, ఊకదంపుడు గారు, సురేష్ బాబు గారు, నాయని ఆదిత్యమాధవ్ గారు, కె.కె. గారు, చెర్రీస్ వరల్డ్ గారు, మహీ గ్రాఫిక్స్ వారికి, సిరిసిరిమువ్వ గారు, రాజన్ గారు, రవి గారు, నాగప్రసాద్ గారు, చదువరి గారు, నాగబ్రహ్మారెడ్డి గారు, అశ్వినిశ్రీ గారు, భైరవభట్ల కామేశ్వర రావు గారు, నెలబాలుడు గారు, ప్రేరణ గారు, ఫణి యలమంచలి గారు, వినయ్ చాగంటి గారు, చంద్రలేఖ 45 గారు, రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు, రావు ఎస్. లక్కరాజు, హర్ష గారు, రాంగోపాల్ గారు, ఆమ్రపాలి గారు, నిరంజన్ గారు, చెప్పుదెబ్బలు పూలదండలు గారు, మధురవాణి గారు, థింకర్ గారు, సురేష్ మ్యూజింగ్స్ గారు ఇంకా అనేకమంది అజ్ఞాతలు. వీరే కాకుండా నా బ్లాగులో వ్యాఖ్యానించకపోయినా స్వయంగా ఫోన్ లో వ్యాఖ్యలు అందించే నవ్వులాట శ్రీకాంత్ గారు, కొత్త రవికిరణ్ గారు....... ఇంతమంది ఇస్తున్న ప్రోత్సాహమనే టానిక్ తాగి నా బ్లాగు బలం పెరిగింది. నాకు తెలుసు. నా బ్లాగులో వ్యాఖ్యలు తక్కువే ! నేను కూడా టపా రాసాక దాని మీద మిత్రుల స్పందనకు ఎదురు చూస్తాను, కానీ ఏ వ్యాఖ్య రాకపోయినా నిరుత్సాహపడను. ఆ రకమైన టపా మిత్రులకు ఎందుకు నచ్చలేదని విశ్లేషించుకుంటాను. దానికి తార్కాణం. చిత్రవైభవం పేరుతో తెలుగు చిత్ర చరిత్రకు సంబంధించిన విశేషాలు ఒక వరుసలో సచిత్రంగా అందించటం ప్రారంభించాను. కానీ వాటికి అంతగా స్పందన రాలేదు. మరి అలా వరుసగా సీరియల్ లాగ ఇవ్వడం మిత్రులకు నచ్చలేదో లేక అంతాకానీ, కొంతకానీ అయ్యాక టోకుగా వ్యాఖ్యానించాలని ఆగారో అర్థం కాలేదు. ఆ విశేషాలను వేరొక పద్ధతిలో ఇస్తే ఎలాగుంటుందనిపించింది. ఏమైనా ఒక అర్థవంతమైన వ్యాఖ్య మనకి సరైన దిశా నిర్దే్శం చేస్తుందని నమ్ముతాను. నా రాతలకు మిత్రులిచ్చిన వ్యాఖ్యలన్నీ నా అదృష్టవశాత్తూ అర్థవంతమయినవే అనుకుంటున్నాను. ' మీ టపా బాగుంది ' అని రాసారని కాదు. మొహమాటానికో, మరో ప్రయోజనానికో కాకుండా హృదయ పూర్వకంగా చేసే మెచ్చుకోలు వ్యాఖ్య కూడా అర్థవంతమైనదే ! నా రాతలకు వచ్చిన కొద్ది మెచ్చుకోలు వ్యాఖ్యలు అలాంటివే అని నమ్ముతాను. అలాగే చాలా వ్యాఖ్యలలో విశ్లేషణలు కూడా ఉన్నాయి. నా రాతలు చదివిన వాళ్ళందరూ వ్యాఖ్యలు రాయాలని లేదు కదా ! రాత నచ్చినా వ్యాఖ్య రాయలేక పోవడానికి అనేక కారణాలుంటాయి. అయితే మన రాతలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది మాత్రం వ్యాఖ్యలు తెలియజేస్తాయి. అవి తిరస్కారాలైనా, పురస్కారాలైనా !

ఈ సందర్భంగా మరోవిషయం. ఒక సోషల్ నెట్ వర్క్ లో పరిచయమైన ఒక మిత్రుడు సూటిగా నన్నో ప్రశ్న వేసాడు. మీరు బ్లాగెందుకు రాస్తున్నారు ? సమాజాని ఉద్ధరించడానికా లేక రచనల ద్వారా సమాజంలో మీకొక గుర్తింపు తెచ్చుకుందుకా ? అని. అతనికి నేనిచ్చిన సమాధానం. నా రాతల వల్ల సమాజాన్ని ఉద్ధరించగలననే అత్యాశ నాకు లేదు. నేను రచయితనో, కవినో, సంఘ సంస్కర్తనో కానని నాకు తెలుసు. నాకు తెలిసిన, నేను చదువుకున్న విషయాలు నా దగ్గరే దాచుకోకుండా పదిమందికీ చెబుదామని, ఏదైనా విషయం గురించో, సమస్య గురించో నాలో కలిగే భావాల్ని పదిమందితో పంచుకుందామని మాత్రమే రాస్తున్నాను. అవి కొంతమందికైనా నచ్చితే, ఆహ్లాదం కలిగిస్తే, ఉపయోగపడితే మంచిదే ! ఇక సమాజంలో గుర్తింపుకోసమైతే ఇప్పుడు దాని అవసరం నాకెంతవరకూ ఉందో నా ప్రొఫైల్ చూస్తే తెలుస్తుందన్నాను. పేరు తెచ్చుకునే అవకాశాలు నా చేతిలో పుష్కలంగా ఉన్న కాలంలోనే ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు అవసరమా ? అదీకాక పాపులర్ అవడానికి ప్లాట్ ఫాం ఇది కాదేమోననుకుంటాను. చాలా మార్గాలున్నాయి. ఆ మార్గాల్లో ప్రయత్నం చేస్తే పేరుతో బాటు, డబ్బు కూడా సంపాదించవచ్చేమో ! కానీ నాకా ఆశా, ఆసక్తి రెండూ లేవు. అందుకే పుస్తకాలు, మంచి స్నేహాలు తప్ప మరే ఆస్తి పాస్తులు లేవు.

బ్లాగ్లోకంలో ఆరునెలల సహవాసంలో ఎందరో కొత్త మిత్రులు పరిచయమయ్యారు. ఎన్నెన్నో భావాలు, అభిప్రాయాలు పరిచయమయ్యాయి. సహజంగా వివాదాలకు నేను దూరం. అందుకే వివాదాస్పద అంశాలకు కూడా దూరంగా ఉంటాను. వ్యక్తిగత దూషణలను, అభ్యంతకర వ్యాఖ్యాలను నేను సమర్థించలేను. అందుకే వాటికి దూరంగా ఉంటాను. అంతమాత్రం చేత ఆయా మిత్రులకు దూరమని కాదు. ఈ ఆరునెలలలోనే కొత్తపాళీ గారి పుస్తకావిష్కరణ సంబరంలోను, ఇ-తెలుగు వర్క్ షాప్ లోను పాల్గొనడం, సాహిత్య అభిమాని శివ గారితో కలయిక నాకెంతో ఆనందం కలిగించిన విషయం. రాబోయే కాలంలో బ్లాగు మిత్రులందరి భాగస్వామ్యం ఉండే శీర్షికలు నడపడానికి ప్రయత్నిస్తున్నాను. వాటికి మీ అందరి ప్రోత్సాహం మరింతగా ఉంటుందని, అలాగే తప్పుటడుగులు వేస్తే హెచ్చరికలు చేస్తుంటారని ఆశిస్తున్నాను.

మిత్రులందరికీ ' శిరాకదంబం ' అర్థవార్షికోత్సవం ( ఫిబ్రవరి 14 ) సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.

Vol. No. 01 Pub. No. 198

Wednesday, November 11, 2009

వందన కదంబం

శతమంటే వంద. వంద పూర్తయ్యాక వందనం చెయ్యడం సాంప్రదాయం ! అందుకే మీకోసం..........

Tuesday, October 13, 2009

వందన కదంబం 2

బ్లాగు మిత్రులందరికీ మరో మారు వందనాలు
బ్లాగు అనే ప్రక్రియ ప్రారంభమయి చాలాకాలమైనా వృత్తి పరమైన కారణాలవలన ఇప్పటివరకూ ఇందులోకి తొంగి చూడలేక పోయాను. ఈ మధ్య ఖాళీగా ఉండే సమయం పెరిగి కొత్త ప్రాజెక్ట్ తయారీ పని ఈసారి కంప్యూటర్ మీద చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ సమయం దీంతో గడపడం వలన బ్లాగులని సందర్శించడం జరిగింది. పుస్తకాల మీద ముఖ్యంగా పత్రికల మీద ఉన్న మక్కువతో గత ముఫ్ఫై ఏళ్ళుగా దాచుకున్న ఎంతో విలువైన సమాచారాన్ని క్రోడీకరించే పని ఇంతకాలంగా చెయ్యలేక పోయాను. ఇటీవలే ఆ పని ప్రారంభించాను. నేను సేకరించిన సమాచారాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశ్యంతో తొందరపడి బ్లాగు ప్రారంభించేసాను . తొందరపడి అని ఎందుకంటున్నానంటే సమాచారాన్ని క్రోదీకరించటం పూర్తయ్యాక మొదలుపెట్టి ఉంటే సమగ్రంగా, క్రమ పద్ధతిలో పెట్టి అందించేవాడిని . కానీ బండెడు పుస్తకాలంటారే అది నిజంగా నిజం. అతిశయోక్తి కాకుండా బండెడు పైనే ఉంటాయి నా దగ్గర . ఇంతకాలం తోచిన, లేదా అవసరమైన పుస్తకాలు వెతుక్కుని తీసుకోవడమే జరుగుతోంది. కానీ ఈ పని అనుకున్నంత సులువుగా అయ్యేటట్లు లేదు. అందుకే ఇంకా క్రమ పద్ధైతిలో అందించలేకపోయినా ప్రస్తుతం కొంతవరకే అందిస్తున్నాను . త్వరలో సమగ్రంగా అందిస్తాను అనడం అహంకారం అవుతుంది. అందుకని వీలైనంత సమగ్రంగా అందించే ప్రయత్నం చేస్తాను. ఒక్క విషయం. నేనందించే సమాచారం ఇదివరకే తెలిసున్న వాళ్లు మన బ్లాగర్లలో చాలా మంది ఉండవచ్చు నా రాతల్లో ఏమైనా లోపాలు, దిద్దుబాట్లు ఉంటే దయజేసి తెలియజెయ్యండి. వీలైనంతవరకూ సరైన సమాచారాన్ని తెలియని వారికి అందివ్వడానికి వీలవుతుంది.

                   రేపటితో నేను బ్లాగు ప్రారంభించి రెండు నెలలు పూర్తవుతాయి. ఈ రోజు వీక్షకుల సంఖ్య 1000 దాటింది.  రాశి పెరిగినందుకు సంతోషమే ! కానీ వాసి పెంచుకుని మరింతమంది వీక్షకుల్ని సంపాదించాలని నా చిన్న కోరిక. ఎంతవరకూ సఫలీకృతమవుతుందో ? నా బ్లాగు దర్శిస్తున్న మిత్రులందరికీ మరోసారి వందన కదంబం.

Friday, August 14, 2009

వందన కదంబం

అందరికీ వందనాలు !
తెలుగు బ్లాగ్ ప్రపంచంలో విభిన్న విషయాల సమాహారంగా ఈ కదంబాన్ని కూర్చాలనే సదుద్దేశ్యంతో ఈ బ్లాగ్ ప్రారంభిస్తున్నాను. సహ్రుదయులందరు తమ సూచనలు, సలహాలతో కదంబానికి మరింత సుగంధాన్ని అద్దుతారని అశిస్తూ ....
మీ
శిరా
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం