Saturday, April 22, 2017

అక్షయతృతీయ... వివేకచూడామణి... స్వరరహస్యవేదీ !... ఇంకా....

మాతృదినోత్సవం సందర్భంగా " అమ్మతనం - కమ్మదనం " శీర్షికన ప్రత్యేక సంచిక వెలువడుతోంది. ఆ సందర్భంగా మాతృమూర్తుల నుంచి తమ పిల్లలతో ఆత్మీయతానుబంధాల గురించి రచనలను ఆహ్వానిస్తున్నాం. రచనలు అందవలసిన చివరి తేదీ 30 ఏప్రిల్ 2017. వివరాలకు శిరాకదంబం తాజా సంచిక 04 వ పేజీలో చూడండి లేదా editorsirakadambam@gmail.com లో సంప్రదించండి.
***********************************************
'అక్షయతృతీయ' గురించిన అసలు నిజం ఏమిటి ? సింహాచల వరాహ నరసింహస్వామి ' చందనోత్సవం',' ఆదిశంకరుల జయంతి' గురించిన విశేషాలు, ఆదిశంకరుల ' వివేకచూడామణి ', ఎస్.పి. బాలు ' స్వరరహస్యవేదీ! ', " మహాకవి శ్రీశ్రీ " గారి తో.లే.పి......ఇంకా చాలా.....ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 06_014 


Visit web magazine at www.sirakadambam.com  

Vol. No. 08 Pub. No. 019

Wednesday, April 19, 2017

అభిజ్ఞాన శాకుంతలం 01 
ప్రధమాంకములో ధనుర్బాణములను చేత పట్టుకొని ఒక లేడిని అనుసరించుచు సూతునితోసహా రధము పై దుష్యంతమహారాజు పాత్ర ప్రవేశించును.ఆ లేడిని తరుముతూ రాజు బాణమును ఎక్కుపెట్టినంతలో వైఖానసుడు ప్రవేశించి బాణముతో లేడిని కొట్టవద్దని రాజును వారించే సందర్భములో కాళిదాసు ఒక అద్భుతమైన శ్లోకమును రచించినాడు. ఆ శ్లోకము--

     నఖలు న ఖలు బాణ: సన్నిపాత్యో యమస్మిన్
     మృదుని మృగశరీరే పుష్పరాశా వివాగ్ని:
     క్వ! బత! హరిణకానాం జీవితం చాతిలోలం
     క్వ చ నిశితనిపాతా: సారపుంఖా: శరా స్తే!!
      అతి మృదువైన ఈ మృగశరీరము మీదికి బాణమును వేయుట పుష్పరాశి పై అగ్నిని విసిరినట్లు అగును. నీకిది తగదు.అతి చంచలములైన ఈ లేళ్ళ ప్రాణములు ఎక్కడ? మిక్కిలి వేగవంతములును, పదునైనవియునగు నీ బాణముల శక్తి ఎక్కడ? నీ బాణమును ఉపసమ్హరింపుము అని వైఖానసుడు దుష్యంతుని వారించిన ఈ శ్లోకములో రాబోవు కధనంతటినీ కాళిదాసమహాకవి సూచించినాడు.
రాజునకు చేయబడిన ఈ ధర్మోపదేశములో నొక చమత్కారమున్నది. ముందు జరుగబోవు కధలో గాంధర్వవిధిని దుష్యంతుడు చేపట్టిన శకుంతల భార్య హోదాలో రాజాస్థానమునకు పోగా అగతికయై, దీనయైన ఆ ఇల్లాలిని దుష్యంతుడు (దుర్వాసుని శాపవశమున) త్రోసిపుచ్చును. దీనురాలైన భార్యను రక్షింపవలసిన మహారాజు నిరపరాధిని యైన యామెను శాపవశమున శిక్షింపబోవును.ఈ కధ అంతయూ వైఖానసుని ధర్మోపదేశమున స్ఫూర్తిమంతముగా నున్నది. పౌరవులకు సాయకములు (బాణములు) దీనజన రక్షణకు కానీ నిరపరాధులను శిక్షించుటకు కాదు  అని దుష్యంతుడు ఎక్కుపెట్టిన బాణమును వైఖానసుడు ఉపసం హరింపజేయును. ఇదంతయూ కాళిదాసుని కళాభిజ్ఞతకు, లోకజ్ఞతకు నిదర్శనము.  


- ఎర్రమిల్లి శారద


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 018

మధుర గాయకుని పరిచయం - ఒక జ్ఞాపకం


1961 సంవత్సరం -
 కాకినాడ లోని గవర్నమెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో 5 - సంవత్సరాల  B .E., డిగ్రీ కోర్సు లో మూడవ సంవత్సరం  చదువుతున్నాను. అప్పట్లో ఈ కోర్స్ లో చేరి చదివే విద్యార్ధినుల సంఖ్య చాలా తక్కువగా - అంటే నామమాత్రం ఉండేది. మా విద్యార్ధులు అందరినీ ఒక రెండు వారాల పాటు దక్షిణ భారత దేశ యాత్ర ( వైజ్ఞానిక - వినోద యాత్ర ) లో భాగంగా  మైసూరు, హంపి, బెంగళూరు, మద్రాసు నగరాలకు తీసుకువెళ్ళి, అవి చూడడం పూర్తి అయ్యాకా, మా అందరికీ మద్రాసు లోనే వీడ్కోలు చెప్పి, అక్కడ నుండి 4, 5 రోజులలో ఎవరికి వారుగా కాకినాడ చేరుకోమని - మా కూడా వచ్చిన ఉపాధ్యాయ బృందం  చెప్పారు.. మేమంతా కలిసి షుమారు పాతిక మంది  దాకా ఉన్నాము. మాకు మద్రాసు లో ఉండేందుకు నుంగంబాకం లోని లయోలా కళాశాల  హాస్టల్ భవనం లో ఉచిత వసతి ని కల్పించారు.
సరే ! మాలో ఎవరి అభిరుచులు వారివి కదా !
నా మటుకు నాకు యా రోజుల్లో ప్రత్యేకించి బ్లాక్ & వైట్ తెలుగు - హిందీ సినిమా పంచ ప్రాణాలు. సినిమా కళాకారులంటే  వల్లమాలిన ఇష్టం – భక్తి – గౌరవం - ఇంకా ఇలా ఎన్నో... ఎన్నో! వాళ్ళ  అడ్రెసులు సేకరించి వాళ్ళకి ఉత్తరాలు వ్రాసి - వారి  నుండి ప్రత్యుత్తరాలు, ఫోటోలు వస్తే - పొంగి పోతూ - వాటిని భద్రం గా దాచుకోవడం నాకు పరిపాటి.
చూడవలసిన ప్రదేశాలు అన్నిటినీ చూడడం అయిపొయింది కనుక - ఇక మిగిలిందల్లా, నేను చూడాలనుకున్న వ్యక్తులు - నా దృష్టి లో ముఖ్యం గా నేను అభిమానించే వారు 'ముగ్గురు'
ఆ ముగ్గురిలో ఒకరు : సుప్రసిద్ధ నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు.


మద్రాసు మహానగరము లో ఆ రోజులలో ఆటో లు అరుదు. అద్దె టాక్సీలు మాత్రం తిరిగేవి. మనకు ఎక్కువగా అందుబాటు లో ఉండేవి సిటీ బస్సులు, లోకల్ రైళ్ళు .. ఇంకా APG II - నటరాజా సర్వీస్ అనే వాళ్ళం.- రెండు కాళ్ళ నడక. కాళ్ళల్లో చక్రాలు తిరగాలంటే వాటికి ఇంధనం అక్కర లేదు గానీ - కడుపు నిండా తిండి వుంటే చాలు. అప్పుడు అడుగు తడబడకుండా  ముందడుగు పడుతుంది.
మాంబళం స్టేషన్ లో ఎలక్ట్రిక్ ట్రైన్ దిగి టి. నగర్, ఉస్మాన్ రోడ్ పట్టుకుని కాలి నడక న వెడుతూ, ఇంటి నెంబర్లు వెతుక్కుంటూ  వెళ్లి - చివరకు 35 నెంబరు ఇంటిదగ్గర ఆగి చూసాను. ముందు గేటు, ప్రక్కన ప్రహరీ గోడలో బిగించిన బోర్డు మీద " ఘంటసాల " అన్న అక్షరాలు.! ఆ అక్షరాలను చూస్తుంటే సాక్షాత్తూ ఆయన దర్శనం కలిగినంత ఆనందం కలిగింది. మెల్లగా గేటు తోసి – లోపలకి అడుగు పెట్టాను. పెద్దాయనను చూడబోతున్నామన్న ఆనందాన్ని కప్పి వేస్తూ - ఒక పక్క భయం - ఇంకొక పక్క తడబాటు - వేరొక పక్క ఉత్కంఠ ! ముందు గది లో చాలామందే కూర్చుని ఎదురుగా వేరొక కుర్చీ లో కూర్చున్న "ఆయన" తో మాట్లాడుతున్నారు. ఆ " ఆయనే " మన ఘంటసాల గారని - అంతకు ముందే ఫోటో లో చూచి ఉన్న కారణంగా - వెంటనే గుర్తుపట్టగలిగాను. ఆయనతో అప్పటి వరకు ఉన్న వ్యక్తులు ఒకరొకరే ఆయన వద్ద శెలవు తీసుకుని వెళ్ళిపోగా - ఇక చివరికి – ఆయనా – నేను - ఇద్దరమే మిగిలాము అక్కడ. ఆయన కు నమస్కరించి - నన్ను పరిచయం చేసుకున్నాకా , ఆయన చిరు నవ్వుతో వేసిన ప్రశ్న ను మాత్రం ఈనాటికీ మరువలేను.
" బాబూ! నువ్వు పాడతావా ? " అని-
" లేదండీ " అని ఆయనకు కాస్త బెరుకు గా సమాధానం చెప్పి -- నా కూడా తెచ్చుకున్న పుస్తకం లో ఆయన ఆటోగ్రాఫ్  తీసుకుని - ఆయన కు ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చాను. శ్రీ ఘంటసాల గారిని కలిసిన సందర్భం మొదటిది - చివరిదీ కూడా అదే !
అటు తరువాత ఆయన 1974 లో కాలం చేసే పర్యంతం ఆ మహానుభావునితో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిపేవాడిని. నా ఉత్తరాలను ఆయనకు స్వయంగా చదివి వినిపించేదానినని ఆయన సతీమణి సావిత్రమ్మ గారు నాతో తరచూ అంటూ వుంటారు. ఆమె మాటలు నాకు తేనె పలుకులు లా తోస్తాయి.
అమెరికా ప్రభుత్వం, ఇతర తెలుగు సంస్థల ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఆయన తన బృందం తో కలిసి అమెరికా లోని అనేక ప్రముఖ నగరాలలో పాట కచేరీ లను చేసి ఎంతోమంది శ్రోతలను అలరించారు. తన ఈ పర్యటనను దిగ్విజయం గా పూర్తి చేసుకుని ఆయన స్వదేశం చేరుకుంటున్న సందర్భం గా మిత్రులు సంగీత – సాహిత్య - నృత్య కళాకారులు – విమర్శకులు - శ్రీ వి. ఏ. కె. రంగారావు గారు ఊహా ఎంటర్ ప్రైజెస్ తరఫున " శ్రీ ఘంటసాల " గారి గురించిన వ్యాసాలు, ఆయన పాడిన లలిత గీతాలతో కూర్చిన ఒక పుస్తకాన్ని శ్రీ బాపు గారు వేసిన ముఖచిత్రం తో వెలువరించారు. శ్రీ ఘంటసాల గారి సంతకం తో  అపురూపమయిన కానుక గా ఆ పుస్తకాన్ని నేను అందుకున్నాను. ఆయన అన్నా, ఆయన గాత్రం అన్నా ఉన్న అభిమానం ఈ పరిచయంతో పదింతలయింది.

- ఓలేటి వెంకట సుబ్బారావు

 
Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 08 Pub. No. 17

ముట్నూరి కృష్ణారావు పంతులు గారుఆంద్రప్రదేశ్ లోని ఉత్తమ శ్రేణికి చెందిన సంపాదకులలో మణి కిరీటం వంటివారు శ్రీ ముట్నూరి కృష్ణారావు పంతులు గారు. వేదాంతము, దేశభక్తి, సాహిత్యము త్రివేణి సంగమం ఆయన సంపాదకీయాలలో ఉరికెత్తుతూ తెలుగువారిని 
ముంచెత్తుతూ  ఉండేవి. హిమవన్నారము వంటి ఆయన రూపం, మంచు వంటి తెల్లని దుస్తులు ధరించి, తెల్లని తలపాగా చుట్టి ఆయన ఠీవిగా నడుస్తుంటే బందరులో ప్రజలు దారి లో తప్పుకోనేవారుట.
కృష్ణా జిల్లా తరఫున వెలువడే కృష్ణా పత్రికకు 1903 లో సహాయ సంపాదకులుగా పని చేశారు. 1905 లో గుంటూరు మండలం విడిపోయిన సందర్భంలో కొండా వెంకటప్పయ్యగారు గుంటూరు వెళ్లిపోవడంతో ఆనాటి నుంచి కృష్ణారావు గారు కృష్ణాపత్రికకు సంపాదకులయారు. 
దేశానికి స్వాతంత్ర్యం రాని రోజుల్లో కృష్ణారావు గారు ప్రజలను ఉత్తేజపరుస్తూ భావ స్ఫోరకమైన సంపాదకీయాలు వ్రాసేవారు. ఆయన పత్రికలో సాహిత్యానికి, నాటకానికి, చిత్రకళలకుఆధ్యాత్మికతకు ప్రముఖ స్థానం ఇచ్చి కృష్ణాపత్రికను ఉన్నత శిఖరంపై అధిష్టింపచేసారు. కృష్ణాపత్రికలో ఒక వ్యాసం గాని, ఒక కధ గాని, ఒక గేయం కాని ప్రచురితమైతే రచయితలకు ఎంతో గర్వకారణం గా వుండేది.  
కృష్ణారావు గారు చాలా గంభీరమైన వ్యక్తి. కాని హాస్యోక్తులు విసురుతూ వుండేవారు. వారి గంభీరత గురించి ఒక సంఘటన వివరిస్తాను. కాంగ్రెసు ప్రచారం ఊళ్ళల్లో విరివిగా సాగుతున్న రోజులవి. డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు, చెరుకువాడ నరసింహం పంతులుగారు, గురుజాడ రాఘవ శర్మ గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు వూళ్ళకు వెడుతూ కృష్ణారావు గారిని కూడా ఆహ్వానించేవారు. వారు వెళ్లి ఉపన్యాసాలివ్వడానికి అంగీకరించే వారు కాదు." పోనీ మా వెంట రండి..... కొంత గౌరవం ఏర్పడుతుంది " అని వారు బలవంతం చేసి తీసుకు వెడుతూ వుండేవారట. ఒకసారి అలా వెళ్ళినపుడు పట్టాభి గారు " కృష్ణారావూ వేదిక మీద కూర్చో. అధ్యక్షుడు గానూ ఉంటావు....... అందరికి కనిపిస్తావు అన్నారుట. సభా ప్రారంభంలో కృష్ణారావు గారు పక్కనున్న వ్యక్తిని వేలితో సౌజ్ఞ చేసారుట, సభ ప్రారంభించమన్నట్లు. తరువాత వారిని అంటే – మౌనం గానే ఆజ్ఞాపించారట. అలా అందరూ అయిన తరువాత సభ పూర్తి అయింది అంతా లేవవచ్చు అన్నట్లు చేతితోనే చెప్పారట.
సభకు వచ్చిన ఒక రైతు " పాపం ! ఏమిచేస్తాం ! మనిషి చూస్తే మహారాజులా వున్నాడు. మాట మాత్రం లేదు.... భగవంతులా పుట్టించాడు గావున్ను...... ఆ రూపానికి మాట కూడా వుంటే ఎంత  గొప్పవాడయ్యే వాడో ! అని ఎంతో విచార పడ్డాడట.
- తటవర్తి జ్ఞానప్రసూన
  
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 016
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం