Showing posts with label ఛలోక్తులు. Show all posts
Showing posts with label ఛలోక్తులు. Show all posts

Tuesday, June 25, 2013

తెలివి తక్కువ తనంలో హాస్యం


తెలివి తక్కువ తనంలో నుంచి కూడా ఒకప్పుడు చెప్పరాని హాస్యం ఉత్పన్నమవుతూ వుంటుంది. చెప్పిన విషయం అర్థంకాని స్థితి ఏదో అనుకొని, ఏదో చెయ్యడం దానివల్ల హాస్య రసాలు కావడం ఒకప్పుడు జరుగుతూ వుంటుంది. 

..... తటవర్తి జ్ఞానప్రసూన గారు ' రావూరు కలం ' శీర్షికన అందించిన " తెలివి తక్కువ తనంలో హాస్యం " శిరాకదంబం 02_032 సంచిక 21 వ పేజీలో...   

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 091

Thursday, February 9, 2012

నాటకాల చెళుకులు

 చెళుకులు - భమిడిపాటి 01 

హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు నాటకాల మీద వేసిన చెళుకులు
****************************************************************************************************
పుల్లంరాజు : ఆ నాటకంలో వేషం వేసే ఆయనకి అంతకంతకు చెముడు ముదురుతోంది. 
విస్సన్న : వినిపించుకోవడం మానేసాడు. ఆ వినికిడి శక్తి కాస్తా ఎగిరి చక్కాపోయింది. 
పుల్లంరాజు : ఏం ? ఎందుకు మానేసాడు ? 
విస్సన్న : ఏమో ! రంగం మీద ఆయన అభినయించేటప్పుడు పుట్టే అరుపులు, తిట్లూ ఇంకా ఎన్నేళ్ళని వినగలడూ ?
 ***************************************************************************************************
 ***************************************************************************************************
వేషధారి : ఏమండోయ్. మేనేజర్ గారు. మూడో అంకం రెండో సీనులో నేను బ్రాందీ పుచ్చుగోవలసి వస్తుంది. తెప్పించి ఉంచారా ?
మేనేజర్ : తప్పకుండా బాబూ ! అదీ తెప్పించాను. అయిదో అంకం ఒకటో సీనులో నువ్వు పుచ్చుగోవలసిన విషం కూడా సిద్ధం ఇందాకే చేయించి వుంచాను.
**************************************************************************************************** 

 Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 03 Pub. No. 115

Friday, February 3, 2012

నో గో కలర్

కస్తూర్బా గాంధీ గారికి ఆంగ్లంలో ప్రవేశం అంతంత మాత్రం. 

ఆవిడ ఓసారి తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచెంగోడ్ వెళ్లారు. అక్కడ గాంధీజీ ఆశ్రమం వుంది. ఆ ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. గాంధీ దంపతులకు సన్నిహితుడైన రాజాజీ ఆమె కూడా వుండి ఆశ్రమంలోని అన్ని విభాగాలు చూపించి వివరిస్తున్నారు. అలా ఖాదీ వస్త్రాలపై అద్దకం చేసే విభాగం వద్దకు వచ్చారు. ఆ పనిని పరిశీలిస్తున్న కస్తూర్బాకు ఒక సందేహం వచ్చింది. ప్రక్కనే వున్న రాజాజీని ఇలా అడిగారు. 
" దిస్ కలర్ గో " 
రాజాజీ గారికి అర్థమైపోయింది కస్తూర్బా మాటల్లోని భావం. అక్కడ అద్దుతున్న రంగులు వెలిసిపోతాయా అన్నది ఆవిడ సందేహం. 
 రాజాజీ సహజంగా చమత్కార భాషణులు. అందుకే వెంటనే " నో ! దిస్ ఈజ్ ' నో గో కలర్ ' ! " అన్నారట. దాంతో చుట్టూ వున్న వాళ్ళు నవ్వారట. అంతే... కస్తూర్బా గారికి ఎక్కడో తేడా వచ్చిందని అర్థమైపోయింది.
" ఏం ? నేనేమైనా తప్పు మాట్లాడానా ? " అని అడిగారట. 
దానికి రాజాజీ " లేదు లేదు. ఇది కస్తూర్బా ఇంగ్లీష్ " అని మరో చమత్కారం విసిరారట. 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 112

Sunday, January 22, 2012

కంద పద్య పాదాలు

 మనసుకవి ఆత్రేయ గారు పాటలు, మాటలే కాదు. పద్యాలూ కూడా బాగా వ్రాసేవారు. 
నిజానికి ఆయనకు పద్యమంటే చాలా ఇష్టం. అందులోనూ కంద పద్యమంటే మరీ ఇష్టం. 
అయన మాటల్లో చమత్కారం అడుగడుగునా తొంగి చూసేది. 

 ఓసారి ఆయన మిత్రులతో బాతాఖానీలో మునిగి వున్నారు. అదే సమయంలో రోడ్డు మీద ఓ జంట నడుచుకుంటూ వెడుతున్నారు. ఆ జంటలో భర్త బాగా పొడుగ్గా, భార్య పొట్టిగా వున్నారు. 


ఆ వింత కాంబినేషన్ ని చూసిన ఓ మిత్రుడు ఆత్రేయ గారితో 
 ' విచిత్రంగా వున్నారు కదూ ! వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తోంది ? ' అని అడిగాడు. 

వెంటనే ఆత్రేయ తడుముకోకుండా 
' వాళ్ళకేం ! బ్రహ్మాండంగా వున్నారు...... కంద పద్య పాదాల్లా ! ' అన్నారట.  


Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 106

Saturday, December 10, 2011

జడ్జికి శిక్ష

గతంలో ఇంచుమించుగా ప్రతి కళాశాలలోనూ ' మాక్ పార్లమెంట్ ' నిర్వహించేవారు. పార్లమెంట్ లో వాద ప్రతివాదాలు ఎలావుంటాయో విద్యార్థులకు తెలిసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. అలాగే మాక్ న్యాయస్థానాలు కూడా జరుగుతూ వుండేవి.

ఒకప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకుడిగా పనిచేసిన ఎ. యస్. రామన్ విద్యార్థిగా వుండగా ఒక ప్రపంచ న్యాయస్థానం కార్యక్రమం జరిపారు. అందులో కేసు ' సైన్స్ మానవాళికి హాని చేస్తోంది '  అనే విషయం గురించి. సైన్స్ తరఫున సూరి భగవంతం గారు, ప్రజల తరఫున మామిడిపూడి రంగయ్య గారు వాద ప్రతివాదులు.

మూడు గంటలకు సరిపడా కార్యక్రమం రూపొందించారు. ఆ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఉండమని సి. ఆర్. రెడ్డి గారిని కోరారు. మూడు గంటలే కదా అని రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇరువైపులా వున్నది సామాన్యులా ? ఒకరు తర్వాత కాలంలో భారత దేశం గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడిగా ఎదిగిన వారు. మరొకరు తర్వాత రోజుల్లో రచయిత, విమర్శకుడు గా ఖ్యాతి వహించిన వారు. వాద ప్రతివాదాలు నిరాఘాటంగా తొమ్మిది గంటలు సాగాయి.

చివరికి రెడ్డి గారు న్యాయమూర్తిగా తన తీర్పుని సైన్స్ కి అనుకూలంగా ఇచ్చారు. అయితే శిక్ష విషయానికొచ్చేటప్పటికి ఆయన సహజ ధోరణిలో
" నిజానికి ఈరోజు దోషిగా బోనులో నుంచున్నది సైన్స్ కాదు.... నేను. ఇంత సమయం అవుతుందని తెలియక ఈ న్యాయమూర్తి పదవికి ఒప్పుకున్నాను. అందుకే నాకు బాగా శిక్ష పడింది "
అనడంతో అందరూ ఘొల్లుమన్నారు. 


 ప్రముఖ విద్యావేత్త, సాహితీ విమర్శకుడు కట్టమంచి రామలింగ రెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ..........

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 086

Thursday, December 8, 2011

కృష్ణపక్షం


మనసు కవి ఆత్రేయ చమత్కార భాషణం గురించి చాలా చెప్పుకోవచ్చు. భవిష్యద్దర్శనం చెయ్యగల మేధావి కూడా ఆయన. నిజాలను నిర్భయంగా చెప్పుకునే గొప్ప వ్యక్తిత్వం ఆయనది.

ఒకసారి ఒక నిర్మాత ఆత్రేయ గారి రచన, దర్శకత్వంలో ' అన్నమాచార్య ' చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. దానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి.


ఆ సందర్భంలో జరిగిన ఓ ఇష్టాగోష్టిలో ఒక మిత్రుడు ఆయన్ని
" ఆత్రేయ గారూ ! కలం పేరుగా మీరు ఈ పేరే పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది ? " అని అడిగారు.

దానికి ఆత్రేయ గారు నిట్టూరుస్తూ
" అప్పుడు ఆలోచించలేదు. ఆత్రేయ అంటే చంద్రుడు కదా ! చంద్రుడికి వృద్ధి, క్షీణతలు వుంటాయని గ్రహించి వుండవల్సింది. ప్రస్తుతం నా జీవితంలో ' కృష్ణపక్షం ' నడుస్తోంది " అన్నారు.

అలాగే ఆ ' అన్నమాచార్య ' చిత్ర నిర్మాణం ఆగిపోయింది.


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 084

Saturday, November 12, 2011

తాజ్ మహల్ కట్టించమంటే.....

  ఓసారి ఓ పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రముఖ కవి ఆరుద్ర ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్నారు.

ఒక విలేఖరి ఆరుద్ర గారితో " మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారో గానీ ఈ గడ్డంతో మీరు మొగల్ పాదుషా షాజహాన్ లాగ కనిపిస్తున్నారు " అన్నాడు.

వెంటనే ఆరుద్ర గారు ఆ గెడ్డం సవరించుకుంటూ " ఈ మాట నాతో అంటే అన్నారు గానీ  మా ఆవిడ దగ్గర మాత్రం అనకండి. ఇప్పుడు ఆవిడ తానో ముంతాజ్ ననుకుని ఏ తాజ్ మహలో కట్టించమంటే గెడ్డం పెంచినంత సులువు కాదు కదా ! " అన్నారట.


Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 072

Wednesday, October 12, 2011

ఎవరు గొప్ప ?

హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారికి, విజయనగరం రాజా ఆనంద గజపతి మహారాజు గారికి స్నేహం మెండు. 

ఓసారి ఇద్దరూ ఢంకా పలాస్ ఆడుతున్నారు. నారాయణదాసు గారికి మూడు రాజులు పడ్డాయి. ఆయనకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. రెచ్చిపోయి పందెం కాస్తున్నారు. అయితే రాజుగారికి మూడు ఆసులు పడ్డాయి. కానీ ఆ విషయం ఆయన బయిట పెట్టలేదు. దాసు గారి ఉత్సాహాన్ని అడ్డుకోవడం ఇష్టం లేక ఆయనా పందెం కాస్తున్నారు. రసవత్తరంగా పందెం సాగుతోంది. కొంతసేపటికి ఆదిభట్ల వారి దగ్గర డబ్బులు నిండుకున్నాయి. ఆ విషయం గ్రహించి రాజు గారు ఉదారంగా దాసు గారినే ముందుగా ముక్కలు తిప్పమన్నారు. ఆయన తన దగ్గరున్న మూడు రాజుల్ని తిప్పారు గర్వంగా ! రాజు గారు చిరునవ్వుతో తన దగ్గరున్న మూడు ఆసుల్ని చూపించారు. ఆదిభట్ల వారు తెల్లబోయారు. 

పందెం డబ్బు రాజుగారు స్వంతం చేసుకుంటుండగా దాసుగారు అమాయకంగా మొహం పెట్టి 

" అయితే రాజా వారూ ! రాజులకంటే ఆసులే గొప్పవన్నమాట !!

అన్నారు. దాసుగారి మాటల్లో చతురతని గ్రహించిన రాజు గారు ఫకాలున నవ్వుతూ పందెం డబ్బంతా దాసు గారికి ఇవ్వడమే కాకుండా మంచి బహుమతితో సత్కరించారట.   

Vol. No. 03 Pub. No. 056

Friday, October 7, 2011

అధికారికి ప్రేమలేఖ

  డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు బందరు జాతీయ కళాశాల పాలకమండలి కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఓ రోజు ఆయనకో లేఖ అందింది. అందులో ...........

" ప్రాణేశ్వరీ ! అనుకోకుండా ఊరికి వెడుతున్నాను. కనుక ఈ మూడురోజులూ మనకి వియోగం, విరహవేదన తప్పవు...... " అంటూ ఇంకా ఏదేదో రాసి వుంది. అది ప్రేమ లేఖ అని పట్టాభి గారికి అర్థమయింది గానీ ఎవరు రాసారో, తనకెందుకు వచ్చిందో మాత్రం అర్థం కాలేదు.  సాధారణంగా ప్రేమలేఖల్లో వుండేటట్లే సంభోదనలో గానీ, సంతకంలో గానీ కొసరు పేర్లే గానీ అసలు పేర్లు లేవు. అందుకనే ఆయనకేమీ అర్థం కాలేదు.

ఎటూ పాలుపోక తన మిత్రుడు కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు గారికి ఆ ఉత్తరం చూపించారు పట్టాభిగారు. అది చదివిన కృష్ణారావు ఆ చేతివ్రాత నిశితంగా పరిశీలించి ఆ రాత ప్రముఖ సాహితీకారుడు, చిత్రకారుడు అయిన అడవి బాపిరాజు గారిదని గుర్తుపట్టారు. కానీ బాపిరాజు గారు రాసిన ప్రేమలేఖ పట్టాభి గారికెలా వచ్చిందో అర్థం కాలేదు. ఆ విషయమే ఆయన్ని అడిగారు కృష్ణారావు గారు. అప్పుడు ఆలోచిస్తే ఇద్దరికీ విషయం బోధపడింది. ఏమిటంటే............


అప్పట్లో అడవి బాపిరాజు గారు జాతీయ కళాశాలకు ప్రధానాచార్యులుగా వుండేవారు. ఆయన ఆ సమయంలో స్వంత పని మీద ఊరికి వెళ్ళారు. బహుశః ఆ విషయం తెలియజేయ్యడానికి సమయం లేక ఆయన భార్యకు ఈ లేఖ రాసి ఉంటారని... పట్టాభి గారికి సెలవు మంజూరు కోరుతూ సెలవు చీటీ రాసి ఉంటారని... అయితే కవరు మీద చిరునామాలు తారుమారు అయి ఉంటాయని నిర్థారణకు వచ్చి నవ్వుకున్నారు పట్టాభి గారు, కృష్ణారావు గారు.


Vol. No. 03 Pub. No. 053

Thursday, September 29, 2011

కవిసమయం

డా. సి. నారాయణరెడ్డి గారు మంచి వక్త. మీదు మిక్కిలి చమత్కార సంభాషణ ఆయన ప్రత్యేకత. ఆయన ఉపన్యాసం ఆద్యంతం ఆకట్టుకోవడానికి సందర్భానుసారంగా ఆయన వదిలే చమత్కార బాణాలే ప్రధాన కారణం. భాషా విన్యాసాలతో సాగిపోతుంది ఆయన ఉపన్యాసం. 

సినారె గారు ఓసారి విశాఖపట్నం లో ఓ సభలో మాట్లాడుతూ... 


  " ఇది విశాఖ. శ్రీశ్రీ వంటి కవిని సృష్టించిన ఫలవృక్ష శాఖ. 
  అమ్మా ఓ ముద్ద పెట్టు అంటాడు కవి. మనస్సు ఆర్ద్రమవుతుంది. 
  అమ్మాయీ ఓ ముద్దు పెట్టు అంటాడు రసరాజ్య యువకవి. మనస్సు ప్రేమార్ద్రమవుతుంది. 
  కవికి మాట్లాడే సమయం తెలియాలి. కవి సమయమూ తెలియాలి " 

.... అనగానే చప్పట్లే చప్పట్లు.  

Vol. No. 03 Pub. No. 044

Sunday, September 18, 2011

కీర్తి తెచ్చిన తంటా

  మనకి అఖండ కీర్తి రావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఒక్కోసారి ఆ కీర్తి కూడా కొన్ని చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. దానికి ఉదాహరణ ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల రచయిత సోమర్సెట్ మామ్ ఉదంతం.

ఒకసారి మామ్ భార్యా సమేతంగా స్పెయిన్ దేశం వెళ్లారు. అక్కడ ఆయనకు తన పుస్తకాలమీద ప్రచురణ కర్తల నుంచి పెద్ద మొత్తంలో రాయల్టీ లభించింది. ఇంతవరకూ బాగానే వుంది గానీ అంత పెద్ద మొత్తాన్ని అక్కడినుంచి తీసుకెళ్ళడానికి స్పెయిన్ దేశ చట్టాలు ఒప్పుకోవు. అందుకని ఏం చెయ్యాలో మామ్ కి అర్థం కాలేదు. బాగా అలోచించి ఆ డబ్బును అక్కడే సరదాగా కాలక్షేపం చేసి ఖర్చు చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.

మాడ్రిడ్ లోని అత్యంత ఖరీదైన హోటల్లో బస చేసి భార్యతో కలసి రాజభోగాలు అనుభవించారు మామ్. చాలావరకు ఖర్చు అయ్యాక ఇక తన దేశానికి బయిలుదేరాడు. హోటల్ ఖాళీ చేసే క్రమంలో యాజమాన్యాన్ని బిల్ ఇమ్మని అడిగాడు. దానికి ఆ యాజమాన్యం చెప్పిన సమాధానం సోమర్సెట్ మామ్ ని విస్తుపోయేటట్లు చేసింది. 

" అయ్యా ! మీలాంటి గొప్ప రచయిత మా హోటల్లో బస చెయ్యడమే మా అదృష్టం. మీరు ఇక్కడ బస చెయ్యడం వల్ల మా హోటల్ ప్రతిష్ట కూడా పెరిగి మా వ్యాపారం రెట్టింపు అయింది. దానికి మేమే మీకు ఋణపడి వుంటాం. ఇంకా మీ దగ్గర బిల్లు తీసుకోవడమా ? మామీద దయవుంచి మా కోరికను కాదనకండి. ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మా సేవలు మీకు ఉచితమే ! " అన్నాడా హోటల్ యజమాని.

ఇంకేం చేస్తారు సోమర్సెట్ మామ్ తన కీర్తే తనకు తంటా తెచ్చాక..... !

Vol. No. 03 Pub. No. 037

Thursday, September 15, 2011

ఆంధ్ర ' కే ' సరి


ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి బిరుదు అన్న విషయం ఆంధ్రులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రుల పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఆయనకు లబించిన బిరుదమది. ఆయనకు ఆంధ్రులలో ఎంత పేరున్నా రాష్ట్ర స్థాయిని దాటి కేంద్ర స్థాయికి చేరుకోలేకపోయారు.


కట్టమంచి రామలింగారెడ్డిగారు సి. ఆర్. రెడ్డి గా ప్రసిద్ధులు. ఆయన విద్యావేత్త, కవి, విమర్శకుడు...మీదు మిక్కిలి సంభాషణా చతురుడు. ఆయన వ్యంగ్య బాణాలు విసరడంలో దిట్ట. ఆయన నోటివెంట శ్లేషలు అలవోకగా పలుకుతాయి.

ఓసారి రెడ్డిగారు ప్రకాశం గారిని గురించి మాట్లాడుతూ ఆయన బిరుదును విరిచి  ఆంధ్ర ' కే ' సరి  అని అన్నారట. 



Vol. No. 03 Pub. No. 033

Sunday, August 21, 2011

గతజన్మలో ఆవు

 కృష్ణాపత్రిక వ్యవస్థాపకులు ముట్నూరి కృష్ణారావు గారు మంచి హాస్య చతురుడు. ఒకసారి ఆయన, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, చెరుకువాడ నరసింహం గారు కలసి ఒక ఊరు వెళ్లారు. అప్పుడు అక్కడ దట్టంగా మబ్బులు పట్టి సన్నగా వాన పడుతోందట. ఎవరినో పిలవడానికి నరసింహం గారు కారు దిగారట. కృష్ణారావు గారు, బ్రహ్మయ్య గారు కార్లోనే కూర్చున్నారు. వాన జల్లుల నుంచి తప్పించుకోవడానికి నరసింహం గారు తెల్ల వస్త్రాన్ని తల మీద కప్పుకుని కారు దిగారట. ఆ దారిలో ఒక ఆబోతు నిలబడి వుందట. ఆ మబ్బుల మసక వెలుతురులో సరిగా కనబడక పోవడం చేతనో ఏమో ఆ ఆబోతు నరసింహం గారి వెంట పడిందట. ఆయన పరుగెత్తి దాన్ని తప్పించుకోవడానికి దగ్గరలోని ఓ అరుగెక్కేసారట.

ఈ దృశ్యాన్ని చూసిన కృష్ణారావు గారు నవ్వుతూ " నరసింహం గారు క్రితం జన్మలో ఆవు అయివుంటారు " అన్నార్ట .   

Vol. No. 03 Pub. No. 008

Thursday, August 11, 2011

పవర్ కట్

 మనకి ఎంత పవరున్నా చాలదు. అందుకే ఇప్పుడే కాదు. ఎప్పుడూ పవర్ కట్టులే ! పవర్ కట్ లేని రోజులు, జీవితం ఊహించలేమేమో ! 
 

ఆంధ్రకేసరిగా ఎంత గర్జించినా ప్రకాశం పంతులుగారిలో హాస్య చతురత కూడా పుష్కలంగానే ఉండేది. ఆయన ముఖ్యమంత్రిగా వుండగా కూడా పవర్ కట్ అమలులో ఉండేది. రాజీనామా చేసాక ఆయన ఓసారి సెక్రటేరియట్ కి పనుండి వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళేటప్పటికి కరెంటు పోయిందట. సిబ్బంది అంతా పనులు ఆపేసి కూర్చున్నారట. వారిని చూసి ప్రకాశం పంతులు గారు........


" ఏమిటీ ఖాళీగా కూర్చున్నారు ? పని చెయ్యడానికి మీక్కూడా నాలాగే పవర్ కట్టయిందా ? " అన్నారట.
 
Vol. No. 02 Pub. No. 313

Tuesday, August 9, 2011

కమీషన్ పద్ధతిలో పరిపాలన


కొంతకాలం పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన పీలుమోడి పార్శీ వ్యక్తి. పార్శీలు వ్యాపార దక్షత గలవారు. అంతే కాదు నీతినిజాయితీలకు పెట్టింది పేరు. పీలుమోడి స్థూలకాయుడు. ఆయన సంభాషణలు చమత్కారాలతో నిండి వుండేది.

ఒకసారి ఆయన పార్లమెంట్లో ప్రసంగిస్తూన్న సమయంలో మనదేశంలో అప్పటికే వేళ్లూనిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుటిల రాజకీయాలు లాంటి వాటి నిర్మూలనా మార్గాల మీద చర్చ జరుగుతోంది. పీలుమోడి వీటి నిర్మూలనకు ఒక పరిష్కారం సూచిస్తూ.......

“ మనదేశం ఈ దుస్థితి నుంచి బయిటపడాలంటే ఒక్కటే పరిష్కారం. దేశం మొత్తాన్ని పార్శీలకు మానేజింగ్ ఏజెన్సీ పద్ధతిలో అప్పగించడమే ! మాకు కేవలం 5 శాతం కమీషన్ ఇస్తే చాలు. ప్రజలకు స్వచ్చమైన, నీతివంతమైన పరిపాలన అందిస్తాం. మాకు వ్యాపార దృక్పధమే గానీ ఆశ్రిత పక్షపాతం వుండదు. మేము వుండేదే తక్కువ సంఖ్యలో కాబట్టి కుర్చీ కోసం కుమ్ములాట కూడా వుండదు “ అన్నారు.

అప్పటి పార్శీల సంగతేమో ఇప్పుడు కొంతమంది నాయకులు మాత్రం  ప్రజలు తమ పరిపాలనకు జీవితకాలపు... ఇంకా చెప్పాలంటే వంశపారంపర్య హక్కులు ఇచ్చేశారనుకుంటున్నారు. దానికోసం ప్రజలకు 5 శాతం కమీషన్ కూడా ఇచ్చేస్తారు కూడా... ఉదారంగా ! పాపం... నిజంగానే వాళ్ళకా హక్కులు ఇచ్చేస్తే పోలా ... !!!


Vol. No. 02 Pub. No. 309

Friday, August 5, 2011

కింకవీంద్ర ఘటా పంచావన


తెలుగువారికి అష్టావధానం అనగానే గుర్తుకొచ్చే జంటకవులు తిరుపతి వెంకట కవులు. ఓసారి వారు అవధానం చేస్తుండగా కాశీనాథ శాస్త్రి అనే పృచ్ఛకుడు ఆ జంటకున్నకింకవీంద్ర ఘటా పంచావన ‘  అనే  బిరుదును అపహాస్యం చెయ్యడానికి ఇలా వక్రభాష్యం చెప్పాడట.

           “ కింకవీంద్ర అంటే నీటి పక్షుల్లో గొప్పవైన అని, ఘటా అంటే గుంపు అని, పంచ అంటే వెడల్పయిన అని, అవనము అంటే ముఖం కలది అనీ అర్థాలు వస్తాయి. కనుక ఈ బిరుదుకు పెద్ద కొంగలు అంటే సరిగ్గా సరిపోతుంది  అని వ్యాఖ్యానించాడు.

దానికి ఆ జంట కవుల్లో ఒకరైన చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి గారు తడుముకోకుండా ఇలా సమాధానమిచ్చారు.....
నిజమే ! కాశీనాథుల వారు సెలవిచ్చినట్లు మా బిరుదుకు పెద్దకొంగలు అన్న అర్థం వస్తుంది. అయితే కా అంటే నీరు, ‘ ఆశి అంటే తిరుగునని అర్థాలు వస్తాయి. కనుక కాశీ అంటే చేపలు అని అసలు అర్థం వస్తుంది. కాశీనాథులు కనుక పెద్దచేపలు అవుతుంది. అంటే ఆయన పాలిట మేము పెద్దకొంగలమే ! “   అన్నారట.

ఇంకేముంది...! కాశీనాథుల వారి నోట మారు మాట వస్తే ఒట్టు. 



Vol. No. 02 Pub. No. 305

Thursday, July 28, 2011

క్రమాక్రమాలు


హాస్య బ్రహ్మ, గణపతి సృష్టికర్త చిలమర్తి లక్ష్మీనరసింహం గారు చెప్పిన పిట్ట కథ.......


ఒక ఊరిలో కాస్త కలిగిన కుటుంబంలోని బ్రాహ్మణుడు వేదం చదువుకున్న వారెవరైనా సరే తనింటికి వస్తే భోజనం పెడతానని ప్రకటించాడు. వేదం రాని వారికి ఆ అవకాశం లేదని కూడా చెప్పేవాడు. ఆ మాట ప్రకారమే వేద పండితులు ఎవరు తన ఇంటికి వచ్చినా లేదనకుండా భోజనం పెట్టి వారిని ఉచిత రీతిని సత్కరించి పంపేవాడు.

ఒకసారి ఒక వేసవి కాలంలో మిట్టమధ్యాహ్నం ఎండ మండిపోతున్న వేళ ఓ బీద బ్రాహ్మణుడు ఆకలి దప్పికలతో మాడుతూ ఈ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. అతని షరతులు తెలుసుకున్న ఆ బీద బ్రాహ్మణుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎందుకంటే అతనికి వేదం రాదు. అతని బాధను కూడా గుర్తించకుండా అన్నదాతయైన బ్రాహ్మణుడు ' మీకు వేదం వచ్చునా ? ' అని ఆ బ్రాహ్మణుడిని అడిగాడు. ఆకలితో బాధపడుతున్న ఆ రెండవ వ్యక్తి తనకు వేదం వచ్చునని, భోజనం చేసిన తరువాత తనను పరీక్షించవచ్చునని చెప్పాడు. గృహస్థుడా మాటలకు అంగీకరించి చాలా గౌరవంగా అతనికి భోజనం పెట్టాడు. మర్యాదలు చేశాడు. కొంతసేపు విశ్రమించి లేచిన తర్వాత పరీక్ష ఇస్తానని బ్రాహ్మణుడు చెప్పాడు. కొంతసేపు నిద్రపోయి లేచిన తర్వాత కూడా అతడు వేదం చదివే దృష్టిలో లేకపోవడం చేత గృహస్థుడు అతనిని మళ్ళీ అడిగాడు. అందుకా బ్రాహ్మణుడు సమాధానం చెబుతూ ముందు ' క్రమము ' చెపుతానని ఇలా మొదలు పెట్టాడు.

' అయ్యా ! మీరు బ్రతికి వుండగా మీ కుమారుడు చనిపోవుట అక్రమము. మీ కుమారుడు జీవించి వుండగా మీరు చనిపోవుట క్రమము ' అని పలికాడు. ఇంటి యజమాని కోపించి అతనిని కొట్టబోగా అందరూ చేరి అతనిని వారించి బ్రాహ్మణుడి యుక్తికి మెచ్చుకుని ఆకలితో వున్నవారికి అందరికీ భోజనం పెట్టడం మంచిది కానీ, వేద పండితులకే భోజనం పెడతాననడం మంచిది కాదని చెప్పి అతనిని మందలించారు.


Vol. No. 02 Pub. No. 293

నవ్వుకు కారణం !


ఒకప్పటి చైనా ప్రధాన మంత్రి చౌ ఎన్ లే ని ఒకసారి ఒక అమెరికన్ పత్రికా ప్రతినిధి కలుసుకున్నాడు. సంభాషణ ప్రారంభిస్తూ

" నేను రెండవ ప్రపంచయుద్ధం ముందూ మీ దేశానికి వచ్చాను. తర్వాతా వచ్చాను. అప్పటి చైనాకి, ఇప్పటి చైనాకి చాలా తేడా కనిపిస్తోంది " అన్నాడు.

ఆ వ్యాఖ్యకు చౌ ఎన్ లే ముఖంలో ఏ విధమైన ప్రత్యేకమైన భావం కనిపించలేదు ఆ విలేఖరికి. కమ్యూనిస్టుల పరిపాలనలో దేశం బాగా వుందని, ప్రజలు హాయిగా వున్నారని చెబుతారని ఆ విలేఖరి భావం.

కానీ చౌ ఎన్ లే

" ఏమిటి మీకు కనిపించిన తేడా ? " అని అతి మామూలుగా అడిగారు.

అప్పుడు ఆ విలేఖరి " ఆ రోజుల్లో చైనా ప్రజలు నవ్వుతూ, తుళ్లుతూ హాయిగా నవ్వుకునేవారు . ఆఖరికి రిక్షా తొక్కే వాడు కూడా స్వేచ్ఛగా జోకులు వేస్తూ మాట్లాడేవాడు. మరి ఇప్పుడు ఎవరి ముఖం చూసినా నవ్వు కనబడడం లేదు. అంతా సీరియస్ గా కనిపిస్తున్నారు " అన్నాడు.

పెట్టుబడిదారీ వ్యవస్థలోని వారికి కమ్యూనిజం అంటే చులకన భావం వుండేది. కనుకనే పెట్టుబడిదారీ దేశమైన అమెరికాకు చెందిన ఆ విలేఖరి వ్యాఖ్యలో వ్యంగం, విమర్శ వుంది. అది చౌ ఎన్ లే గమనించారు. అందుకే

" ఓహో ! ఆదా ! దానికి కారణం వుంది. గతంలో మా ప్రజల జీవనం చాలా దుర్భరంగా వుండేది. అప్పుడు ఆ కష్టాల్ని, బాధల్నీ మర్చిపోవడానికి లేని నవ్వు తెచ్చుకుని నవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అందరూ హాయిగా, ఆనందంగా వున్నారు. ఇక నవ్వు... కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ? అంతా శ్రద్ధగా, సీరియస్ గా తమ పని తాము చేసుకుపోతున్నారు. జీవితం హాయిగా గడిచిపోతోంది. ఇంతకంటే ఏం కావాలి ? ఇక నవ్వుకోవడానికి సమయం ఎక్కడిది ? "

ఆ విలేఖరి సంగతి ఇంకా చెప్పాలా ?


Vol. No. 02 Pub. No. 292
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం