కొంతకాలం పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన పీలుమోడి పార్శీ వ్యక్తి. పార్శీలు వ్యాపార దక్షత గలవారు. అంతే కాదు నీతినిజాయితీలకు పెట్టింది పేరు. పీలుమోడి స్థూలకాయుడు. ఆయన సంభాషణలు చమత్కారాలతో నిండి వుండేది.
ఒకసారి ఆయన పార్లమెంట్లో ప్రసంగిస్తూన్న సమయంలో మనదేశంలో అప్పటికే వేళ్లూనిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుటిల రాజకీయాలు లాంటి వాటి నిర్మూలనా మార్గాల మీద చర్చ జరుగుతోంది. పీలుమోడి వీటి నిర్మూలనకు ఒక పరిష్కారం సూచిస్తూ.......
“ మనదేశం ఈ దుస్థితి నుంచి బయిటపడాలంటే ఒక్కటే పరిష్కారం. దేశం మొత్తాన్ని పార్శీలకు మానేజింగ్ ఏజెన్సీ పద్ధతిలో అప్పగించడమే ! మాకు కేవలం 5 శాతం కమీషన్ ఇస్తే చాలు. ప్రజలకు స్వచ్చమైన, నీతివంతమైన పరిపాలన అందిస్తాం. మాకు వ్యాపార దృక్పధమే గానీ ఆశ్రిత పక్షపాతం వుండదు. మేము వుండేదే తక్కువ సంఖ్యలో కాబట్టి కుర్చీ కోసం కుమ్ములాట కూడా వుండదు “ అన్నారు.
అప్పటి పార్శీల సంగతేమో ఇప్పుడు కొంతమంది నాయకులు మాత్రం ప్రజలు తమ పరిపాలనకు జీవితకాలపు... ఇంకా చెప్పాలంటే వంశపారంపర్య హక్కులు ఇచ్చేశారనుకుంటున్నారు. దానికోసం ప్రజలకు 5 శాతం కమీషన్ కూడా ఇచ్చేస్తారు కూడా... ఉదారంగా ! పాపం... నిజంగానే వాళ్ళకా హక్కులు ఇచ్చేస్తే పోలా ... !!!
Vol. No. 02 Pub. No. 309
No comments:
Post a Comment