Thursday, August 4, 2011

' శాస్త్రీయ ' రచయిత

శాస్త్రానికి, సాహిత్యానికి మధ్య కొంత అంతరం కనబడుతుంది. శాస్త్రకారులు సాహిత్యం జోలికి ఎక్కువగా వెళ్లరు. వెళ్ళినా అందులో తమ శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించరు. తమకు తెల్సిన శాస్త్రాన్ని అక్కడక్కడ అవసరానికి వాడుకున్నా, శాస్త్రాన్నే విషయంగా తీసుకుని రచనలు చెయ్యరు. అందులోను తెలుగులో శాస్త్రీయ అంశాల నేపథ్యంలో రచనలు ఎక్కువగా కనిపించవు. కొంతమంది చేసినా అవి పాఠ్య పుస్తకాల కోవలోనే ఉంటాయిగానీ, సాధారణ పాఠకులకి ఆసక్తి కలిగించవు. అయితే అక్కడక్కడా శాస్త్ర విశేషాలని అందరికీ ఆసక్తి కలిగించేలా మలచి రచనలు చేసేవారు మనకి కనిపిస్తారు. అలాంటివారిలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన రచయిత మహీధర నళినీమోహన్ రావు గారు .

పండితోత్తములకు ప్రసిద్ధి కోనసీమలోని ముంగండ గ్రామం. మొగల్ పాదుషాల ఆస్థానంలో ప్రముఖుడిగా సత్కారాలు పొందిన జగన్నాథ పండితరాయలు పుట్టిన ఊరు ముంగండ అగ్రహారం. వేద పారాయణంతో, సాహితీ వ్యాసంగంతో నిండిన ఆ ఊళ్ళో ఓ పండిత కుటుంబానికి చెందినవారు మహీధర రామమోహన్ రావు గారు. చాందస భావాలు అధికంగా గల సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆయన ఆ చాందస భావాలను, కట్టుబాట్లను కాదని కమ్యూనిస్ట్ , సోషలిస్ట్ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. ప్రజాశక్తి, విశాలాంద్ర పత్రికలలో పనిచేసారు. అభ్యుదయ భావాలతో ఎన్నో రచనలు చేసారు. ఆయన కుమారుడే నళినీ మోహన్ రావు గారు.

భౌతిక శాస్త్రవేత్తగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన శాస్త్రీయ విషయాలతో చాలా పుస్తకాలు రాసారు. మామూలు పాఠకుడిని కూడా అవి ఆసక్తితో చదివిస్తాయి. అవి ఓ కథ చదువుతున్నట్లో, ఓ నవల చదువుతున్నట్లో వుంటాయి తప్ప పాఠం చదువుతున్నట్లు వుండవు.  శాస్త్రీయ పరిజ్ఞాన్ని పెంచుకోవడానికి అవి బాగా ఉపకరించేవి. ఆయన పుస్తకాలలో లాగే ఆయన ఉపన్యాస శైలి కూడా.... ఓ మిత్రుడు మన ముందు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెబుతున్నట్లు ఉండేది.

1974 - 75 ప్రాంతాలలో అని గుర్తు. నేను ఇంటర్ చదువుతున్న రోజులని మాత్రం బాగా గుర్తుంది. సందర్భం గుర్తులేదు గానీ ఓ సారి ఆయనకు మా ఊళ్ళో సన్మానం జరిగింది. ఆ సభలో ఆయన కొన్ని సైన్సు సంగతులను చెప్పిన తీరు నన్నే కాదు అందర్నీ ఆకట్టుకుంది. అప్పటికి సైన్సు విద్యార్థిని కనుకనో, అప్పటికే పత్రికలలో ఆయన వ్యాసాలూ, కొన్ని పుస్తకాలు చదివి వుండడం వల్లనో నాకు మాత్రం బాగానే అర్థమయినట్లు అనిపించింది. సభ ముగిసిన తర్వాత సైన్సు అంటే భయపడే కొందరు మిత్రులతో సహా అందరూ ఆ విశేషాలే ముచ్చటించుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికే అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నా ఆ విశేషాలు ఇంకా అందరికీ అవగాహనలోకి రాలేదు. ఆయన ఆ విశేషాలను వివరిస్తుంటే అందరూ ఎంతో ఆసక్తితో విన్నారు. అదీ నళినీ మోహన్ రావు గారి ప్రతిభ. పండితులకు కూడా క్లిష్టంగా కనిపించే శాస్త్రీయ విశేషాలను అతి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా మలచడంలో దిట్ట నళినీమోహన్ రావు గారు. ఇంతకంటే ఎక్కువగా వివరాలు గుర్తు లేవు.

ఇక ఆయన రచనల విషయానికి వస్తే... వాటి గురించి ప్రముఖ బ్లాగర్ వి. బి. సౌమ్య గారు 2007 లో అంతర్జాల పత్రిక ' పొద్దు ' లో రాసిన వ్యాసంలో చక్కగా వివరించారు. ఆ వ్యాసాన్ని ఈ క్రింది లింక్ లో చదవండి.  


మహీధర నళినీ మోహన్ రావు గారి పుస్తకాలన్నీ పిల్లలకోసం అన్నట్లుగా వున్నా సైన్సు తో అంతగా పరిచయం లేని వారిని కూడా ఆసక్తితో చదివిస్తాయి.

 ' శాస్త్రీయ ' రచయిత మహీధర నళినీ మోహన్ రావు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ....  

Vol. No. 02 Pub. No. 304

5 comments:

ఆ.సౌమ్య said...

మహీధర నళినీ మోహన్ రావు గారు రాసిన నసీరుద్దిన్ షా కథలు నాకెంతో ఇష్టం!

dhaathri said...

aayana science vyasalu chadavadaggavi ......english lo narlikar rasinattu....untayi...love j

Gomati Dittakavi Jonnalagadda said...

I used to read his stories in balajyoti..appatiki naaku physics ante teliidu...but know i know a little but i don't have his works...
:(

Vinay Datta said...

I, too, read his works in Baalajoti.

madhuri.

SRRao said...

* ఆ. సౌమ్య గారూ !
* ధాత్రి గారూ !
* గోమతి గారూ !
* మాధురి గారూ !

ధన్యవాదాలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం