తెలుగువారికి అష్టావధానం అనగానే గుర్తుకొచ్చే జంటకవులు తిరుపతి వెంకట కవులు. ఓసారి వారు అవధానం చేస్తుండగా కాశీనాథ శాస్త్రి అనే పృచ్ఛకుడు ఆ జంటకున్న‘ కింకవీంద్ర ఘటా పంచావన ‘ అనే బిరుదును అపహాస్యం చెయ్యడానికి ఇలా వక్రభాష్యం చెప్పాడట.
“ కింకవీంద్ర అంటే నీటి పక్షుల్లో గొప్పవైన అని, ఘటా అంటే గుంపు అని, పంచ అంటే వెడల్పయిన అని, అవనము అంటే ముఖం కలది అనీ అర్థాలు వస్తాయి. కనుక ఈ బిరుదుకు ‘ పెద్ద కొంగలు ‘ అంటే సరిగ్గా సరిపోతుంది “ అని వ్యాఖ్యానించాడు.
దానికి ఆ జంట కవుల్లో ఒకరైన చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి గారు తడుముకోకుండా ఇలా సమాధానమిచ్చారు.....
“నిజమే ! కాశీనాథుల వారు సెలవిచ్చినట్లు మా బిరుదుకు పెద్దకొంగలు అన్న అర్థం వస్తుంది. అయితే ‘ కా ‘ అంటే నీరు, ‘ ఆశి ‘ అంటే తిరుగునని అర్థాలు వస్తాయి. కనుక ‘ కాశీ ‘ అంటే చేపలు అని అసలు అర్థం వస్తుంది. కాశీనాథులు కనుక పెద్దచేపలు అవుతుంది. అంటే ఆయన పాలిట మేము పెద్దకొంగలమే ! “ అన్నారట.
ఇంకేముంది...! కాశీనాథుల వారి నోట మారు మాట వస్తే ఒట్టు.
Vol. No. 02 Pub. No. 305
3 comments:
Funtastic!
* వినయ్ !
ధన్యవాదాలు
అవీ... ఆ మహనీయుల మహితోక్తులు.అందుకే అంత రసస్ఫోరకంగా ఉంటాయి.
Post a Comment