Friday, April 30, 2010

కల కానిది... విలువైనది

 కల కానిది... విలువైనది బ్రతుకు 
కన్నీటి ధారలలోనే బలి చేయకు 

అంటూ జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన మహాకవి

గాలి వీచి పూవులా తీగ నేల రాలిపోగా 
జాలివీడి అటులేదాని వదలివైతువా 
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా !!

అంటాడు. మానవనైజంలో చెడుతో బాటు మంచి కూడా అంతే పాళ్ళలో వుంటుంది. ఆ మంచితనాన్ని గుర్తు చేస్తారు శ్రీశ్రీ.

అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి కలవరించనేలా
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో !!

అని నిరాశలో మునిగిపోయిన వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు మహాకవి .

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్య మున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే 
ఏదీ తనంతతానై నీ దరికిరాదు
శోధించి సాధించాలి, అదియే ధీర గుణం !!

అంటూ ధైర్యం చెబుతూ కర్తవ్య బోధ చేస్తారు శ్రీశ్రీ.

అతి తేలికైన పదాల్లో, సరళమైన భాషలో అంతులేని జీవిత సత్యాలను ప్రబోధిస్తారు శ్రీశ్రీ.
సాహిత్యానికి కావలసింది పదాడంబరం కాదు భావ ప్రకటన అని ప్రకటించారు శ్రీశ్రీ.
సినిమా సాహిత్య ప్రక్రియ మరే ఇతర ప్రక్రియకు తీసిపోనిదని ఋజువు చేశారు శ్రీశ్రీ.
మహాప్రస్థానంలాంటి రచనలతో మహోన్నతాలకెదిగిన ఆయన
సినిమా సాహిత్యాన్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళచ్చని  నిరూపించారు
ఏం రాసినా, ఏది రాసినా ఆయనకే చెల్లు
ఎవరెన్ని అన్నా, ఎవరేం అనుకున్నా
ఆయన పథం ఆయనది.. ఆయన విధానం ఆయనది
అందుకే ఆయన మహాకవి  అయ్యారు, ప్రజల కవి అయ్యారు.

కల కానిది.... పాట పూర్వాపరాల గురించి ' పాడవోయి భారతీయుడా ' సంకలనంలోని శ్రీశ్రీ గారి మాటల్లో...............
**************************************************************************
అన్నపూర్ణా పిక్చర్స్ వారి ' వెలుగు నీడలు ' లోని ఈ పాటకు ట్యూన్ వెదకడానికి సంగీత దర్శకుడు పెండ్యాల 15 రోజులు కృషి చేశారు. ట్యూన్ ఓకే అయిన తరువాత తెలుగు పాట నేను, తమిళ పాట నారాయణ కవి రాశాము. సాధారణంగా అన్నపూర్ణా సంస్థలో ముందుగా ట్యూన్ నిర్ణయించడం జరుగుతుంది. సంగీతం విషయంలో మధుసూదనరావు గారికి మంచి అభిరుచి వుంది. హిందీలో రాజ్ కపూర్ కి ఉన్నట్లు. అందుకే వీరుద్దరి చిత్రాలలోని పాటలు నాలుగు కాలాలపాటు నిలిచేవిగా వుంటాయి.
ఎంతవరకూ నిజమో నాకు తెలియదుగానీ ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తి ' కలకానిది, విలువైనది ' అన్న పాటను విని ఆ ప్రయత్నం విరమించుకున్న ఉదంతం ఎవరో చెప్పగా విన్నాను. 
 ******************************* ******************************************

' అగాధమౌ జలనిధిలోన ఆణిముత్య మున్నటులే ' అన్న వాక్యం నారాయణకవిదని శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా నేనెక్కడో చదివినట్లు బాగా గుర్తు. తనది కాని విషయాన్ని నిజాయితీగా అంగీకరించే సంస్కారం మహాకవి శ్రీశ్రీది. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆయన ప్రభావం తెలుగు కవిత్వం మీద ఇప్పటికీ వుంది. ఎప్పటికీ వుంటుంది.

మహాకవి శ్రీశ్రీ శతజయంతి వేడుకలు నేటితో ( ఏప్రిల్ 30 )  ముగుస్తున్నాయి. ఆయన్ని స్మరించుకోవడమంటే తెలుగు కవిత్వాన్ని, సినీ కవిత్వాన్ని మరోసారి సమీక్షించుకోవడమే ! ఆ మహాకవికి కవితాంజలులు.
సామ్యవాద కవితా దర్సనం-మహాప్రస్థానం
శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం మొదలైన గీతాలు
శ్రీశ్రీ కవితాప్రస్థానం

Vol. No. 01 Pub. No. 277

Thursday, April 29, 2010

మహాకవికి తీరని కోరికలు

 మనిషి ఎంతటివాడైనా కోరికలకు అతీతుడు కాదు. కొన్ని కోరికలు సునాయాసంగా తీరుతాయి. మరికొన్ని కొంచెం కష్టపడితే తీరతాయి. అయితే కొన్ని మాత్రం తీరని కోరికలగానే మిగిలిపోతాయి.

మహాకవి శ్రీశ్రీ గారికి కూడా కొన్ని కోరికలుండేవి. అయితే అవి తీరని కోరికలే ! ఎందుకంటే అవి తీరకుండానే ఆయన మరణించారు. వాటిలో ముఖ్యమైన కొన్ని ...........

* ఆయనకు రెండు కథల మీద మోజుగా వుండేది. అవి ఒకటి రుక్మిణీ కళ్యాణం కథ. మరోటి కవి తిక్కన - ఖడ్గతిక్కన, ఈ ఇద్దరి జీవితాలలోని విశేషాలను మిళితం చేసి ఒకే కథగా రూపొందించాలని ఆయన కోరిక.  అంతే కాదు. ఈ రుక్మిణీ కళ్యాణం కథనీ, కవి - ఖడ్గ తిక్కన కథనీ చలన చిత్రాలుగా తీయాలని కోరికగా వుండేది.


* " నెరవేరితే నిలువుటద్దం సైజులో ' మహాప్రస్థానం ' ను ఆచ్చువేయించాలని ఉంది. ఇవి గొంతెమ్మ కోరికలే ! నా జన్మలో నేరవేరుతాయా ? " అనేవారట ఆ మహాకవి.

చివరకి ఈ రెండు కోరికలూ నెరవేరలేదు. ఆ మహాకవి శత జయంతి సందర్భంగా ఎవరైనా పూనుకుని కనీసం ఆయన రెండో కోరికైన ' మహాప్రస్థానం ' నిలువుటద్దం సైజులో అచ్చు వేయిస్తే ఆయన కోరిక నేరవేర్చినట్లుంటుంది. ఎవరైనా ఆలోచిస్తే బాగుండును.

మహాప్రస్థానం 
మహాప్రస్థానం: మహాకావ్యం
శ్రీ శ్రీ మహాప్రస్థానం: సమాలోచనం 

ఆ మహాకవికి ఇష్టమైన పాటలుగా పేర్కొన్న వాటిలో ఒకటి ' తోడికోడళ్ళు ' చిత్రంలో ' నలుగురు కలసి, పొరువులు మరచి, చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం  ' ........ మీకోసం........
  Vol. No. 01 Pub. No. 276

మేడే కవిత్వోత్సవం

2010 మేడే రోజున విజయవాడలో కవిత్యోత్సవం జరుగబోతోంది. కవిత - 2009 సంకలనం కూడా ఆవిష్కృతమవుతోంది. ఆ వివరాలు ఇక్కడ.....................
ఇంకా స్పష్తర కావాలంటే ఇమేజ్ పైన క్లిక్ చెయ్యండి.

Vol. No. 01 Pub. No. 273a

పంచమ వేదం

ఋగ్వేదం నుంచి వాయిద్యం 
యజుర్వేదం నుంచి అభినయం 
సామవేదం నుంచి సంగీతం 
అధర్వణవేదం నుంచి భావ ప్రకటన 

ఉద్భవించాయంటారు. నాలుగు వేదాలలోని లక్షణాలను సంతరించుకున్నది కనుక నాట్యాన్ని ' పంచమవేదం ' అంటారు.
 నాట్యానికి రాజు ' నటరాజు '.

సుమారు రెండు వేల సంవత్సరాలకు పూర్వం భరతముని రాసిన ' నాట్యశాస్త్రము ' మనకి నాటక కళను నేర్పింది. నాట్యమేళ సాంప్రదాయం శాస్త్రీయ కళగా రూపొందడానికి నాట్యశాస్త్రం దోహదపడింది.

క్రీ.శ. 3 వ లేదా 4 వ శతాబ్దంలో నందికేశుడు రచించినట్లుగా చెప్పబడుతున్న ' భరతార్ణవం ' అప్పటివరకూ అమలులోవున్న ఏకపాత్రకేళికా సాంప్రదాయాన్ని కళాఖండాలుగా తీర్చిదిద్దింది. దీనికి సంక్షిప్త రూపమైన ' అభినయ దర్పణం ' నాట్యాచార్యులకు భగవద్గీతలాంటిదని చెబుతారు.


క్రీ.శ. 1253-54 ప్రాంతంలో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని బావమరిది అయిన జాయపసేనాని ' నృత్త రత్నావళి ' రచించాడు. ఈయన కృష్ణాజిల్లాలోని దివిసీమకు చెందిన వాడుగా చరిత్ర.. జాయపను చిన్నప్పుడే గణపతి దేవుడు ఓరుగల్లుకు తీసుకువెళ్ళి గుండయామాత్యుడనే నాట్యాచార్యుని దగ్గర జేర్చి నాట్యకళను నేర్పించాడు. ఆనాటి నాట్య శాస్త్రాలను, సాంప్రదాయాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి తన అనుభవములను కూడా జోడించి ' నృత్తరత్నావళి ' ని రచించాడు.


దేవగిరిని పాలించిన యాదవరాజుల ఆస్థాన విద్వాంసునిగా వున్న శార్జ్ఞ్గదేవుడు తాను రచించిన ' సంగీత రత్నాకరము ' అనే గ్రంథములో భారత నాట్య రీతుల్లో వచ్చిన మార్పుల్ని వివరించాడు.


భారత దేశంలో సంస్కృతం రాజభాషగా వున్న కాలంలో ఇన్ని రకాల నృత్య రీతులు లేవు. దేశమంతటా ఒకే రకమైన శాస్త్రీయ నృత్యకళ వుండేది. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం పెరిగి, సంస్కృతం ప్రాముఖ్యం తగ్గడంతో ప్రాంతాల వారీగా నృత్య రీతులు అభివృద్ధి చెందాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న తెలుగు భాష సంగీతానికి, సాంస్కృతిక వికాసానికి అనువైన భాషగా పండితులు, విద్వాంసులు గుర్తించారు. దాంతో తెలుగు భాషలో అనేక నృత్య సంగీత రచనలు వెలువడ్డాయి. అందుకే దక్షిణాదిన ప్రధానంగా తెలుగు పాటే వినబడుతుంది.


ప్రాచీన కాలంలో మతానికి, కళలకి దగ్గర సంబంధముండేది. అందుకే దేవాలయ శిల్పాలలో మనం నాట్యకళను దర్శించవచ్చు. యజ్ఞయాగాది క్రతువుల్లో సంగీత నృత్యాలు భాగమై వుండేవి. బౌద్ధ, జైన మతాలు కూడా నాట్యకళను ప్రోత్సహించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. శాతవాహన, ఇక్ష్వాక రాజుల చరిత్రలలో ఈ ప్రస్థావన కనిపిస్తుంది. హాలుని గాథాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథలలో కూడా నాట్య ప్రస్థావన వున్నట్లు చెబుతారు. గుజరాతీ, కన్నడ భాషల్లో వున్న జైన మత గ్రంథాలలో నృత్యభంగిమలు, నర్తనరీతుల గురించి వున్నట్లు తెలుస్తోంది. తర్వాత కాలంలో వ్యాప్తిలోకి వచ్చిన శైవ, వైష్ణవ సాంప్రదాయాలు రెండూ నాట్యకళకు పెద్దపీటే వేసాయని చెప్పవచ్చు.

ఇక తెలుగు కళను సుసంపన్నం చేసిన కూచిపూడి నాట్య సాంప్రదాయం కృష్ణాజిల్లాలోని ఒక చిన్న గ్రామమైన ' కూచిపూడి ' నుంచి వచ్చింది. క్రీ.శ. 13 లేదా 14 వ శతాబ్దులలోనే ఈ సాంప్రదాయానికి మూలాలు వున్నట్లు చెబుతారు. ఆ ప్రాంతానికి చెందిన నృత్యకళా ప్రవీణుడు, వాగ్గేయకారుడు అయిన సిద్ధేంద్ర యోగి ' భామాకలాపం ' రచించి కూచిపూడి భాగవతులకు నేర్పించాడు. క్రీ.శ. 1506-09 ప్రాంతాలలో కూచిపూడి భాగవతులు హంపీ విజయనగరంలో ప్రదర్శనలిచ్చినట్లు ఆధారాలున్నాయి. ఇవి ప్రధానంగా నృత్య రూపకాలు. కూచిపూడికి దగ్గరలోనే ' మువ్వగోపాల పదాలు ' రచించిన మహాకవి క్షేత్రయ్య నివసించిన మొవ్వ గ్రామం వుంది. ఈ విషయం మీద చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నట్లుగా తోస్తుంది. అక్కడికి సమీపంలో ఒకప్పుడు శాతవాహనుల రాజధాని అయిన శ్రీకాకుళం కూడా వుంది. ' కృష్ణలీలాతరంగిణి '  రచించిన నారాయణ తీర్థులువారు కూడా శ్రీకాకుళానికి చెందిన వారేనని ఒక వాదన.

ఇప్పుడు మనం భరతనాట్యంగా పిలుచుకుంటున్న సాంప్రదాయాన్ని మహారాష్ట్ర రాజైన రెండవ శరభోజి ఆస్థానంలో విద్వాంసులుగా వున్న నలుగురు సోదరులు రూపొందించిన సదిర్ లేదా దాసి ఆట నుండి రూపాంతరం చెందింది. ఐతే ఇది భరతనాట్యంగా 1930 తర్వాతే విస్తృత ప్రచారం పొందిందట. క్రీ.శ. 17 వ శతాబ్దంలో కథకళి , ఆ తర్వాత కాలాల్లో ఒడిస్సీ, మణిపురి, కథక్ మొదలైన సాంప్రదాయాలు మన దేశంలో రూపుదిద్దుకున్నాయి.ఇవన్నీ మూడు వందల సంవత్సరాల కాలంలోనివే !


ఆంధ్ర దేశంలో నాట్య సాంప్రదాయం రెండు రకాలు . ఒకటి నట్టువ మేళం. రెండు నాట్యమేళం. నట్టువమేళం ఏకపాత్ర నృత్యము. ఇది ఎక్కువగా దేవదాసీ సాంప్రదాయంగా వుండేది. నాట్యమేళం సామూహికంగా ఎక్కువ పాత్రలతో రూపకాలుగా వుండేది. కూచిపూడి ఆ సాంప్రదాయానికి చెందినదే. వీటిని ' యక్షగానాలు ' అని కూడా పిలిచేవారు.
అలాగే ఆలయాల్లో చేసే ఆగమ శాస్త్ర నర్తనం, రాజాస్థానాలలో చేసే ఆస్థాన నర్తనం, కలాపాలు, భాగవతాలతో కూడిన ప్రబంధ నర్తనం అనే మూడురీతులు ప్రచారంలో వుండేవి. ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ గారు ఈ మూడు రీతుల్నీ సమన్వయ పరుస్తూ ' ఆంధ్ర నాట్యం ' అనే కొత్త రీతిని ప్రచారంలొకి తెచ్చారు. అలాగే ఆయన జాయప సేనాని రచించిన ' నృత్తరత్నావళి ' నుంచి ' పేరిణి ' అనే నృత్యాన్ని గ్రహించి ' పేరిణి శివతాండవం ' పేరుతో పునరుద్ధరించారు.

సూక్ష్మంగా మన నాట్య కళా చరిత్ర ఇది. అంతర్జాతీయ నాట్య దినోత్సవం ( ఏప్రిల్ 29 ) సందర్భంగా ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ..... ఎందరో కళాకారులు మన నాట్య కళా సాంప్రదాయాన్ని సుసంపన్నం చేసారు. అందులో ముఖ్యమైన వారిని ఈ శుభసందర్భంగా తలచుకుందాం ! Vol. No. 01 Pub. No. 274

Wednesday, April 28, 2010

బిందు పూర్వక హకార ప్రాస

మహాకవి శ్రీశ్రీ గారు ఆధునిక కవిత్వానికి ప్రతీక అయినా ప్రాచీన కవిత్వ ప్రభావం ఆయనపై ఎంత వుందో తెలుసుకోవడానికి ఈ సంఘటనే ఉదాహరణ.
     **************************************** 
అంహో దుర్భరమాయె భారతము ! గ
                గర్వాంధుల్, దురార్భాట సం 
 రంహుల్,  స్వార్తపరుల్ చరింతురిట ! నీ
                రల్ సేయు ఘోరాలప
సింహంబోయిన లేచి, నేనిక మహా 
               క్ష్వేళాధ్వనిన్ వీరలన్
సంహారం బొనరించు శక్తిని జగ 
              న్మాతా ! ప్రసాదింపుమా ! 


*  *  *

సినిమాకు పద్యం రాయడం అంటే నాకు చాలా ఇష్టం. నవతా ప్రొడ్యూసర్ కృష్ణంరాజు గారు తమ " పంతులమ్మ " చిత్రంలోని శివాజీ నాటకానికొక పద్యం కావాలంటే ఇది రాశాను. రాసిన తర్వాత ఎవరో - కృష్ణంరాజుగారే కాబోలును - ఇందులోని తుది పాదంలో యతి భంగమయిందన్నారు. ( ' సం ' తో ' న్మా ' యతి కుదరదనుకొని ) దానికి ముందు పాదంలోని ' వీరలన్ ' లో ఉన్న నకారపు పొల్లుతో ' న్మా ' కి యతి కుదిరిందన్నారు. ఇటువంటి చందో రహస్యాలు చాలామందికి తెలియవు. దీర్ఘాక్షరంతో ప్రారంభమైన కంద పద్యంలో నాలుగింట జగణం వెయ్యకూడదని కొందరికి తెలియదు.  
బిందు పూర్వక హకార ప్రాస నిర్వహించడం కష్టం. విశ్వనాథ సత్యనారాయణగారు తమ విశ్వేశ్వర శతకంలో  ' అ(హోవారణ కుంభ పాటనకళోధచ్చ్వేత భూ భ్రుద్ధరీ సింహస్వామి ' అని ప్రారంభించి నాలుగో పాదంలో ' నచాహం హంతవ్య ' అని ప్రాస చేశారు. సంస్కృతంలో వారు ప్రాస వాడితే నేనెందుకు ఇంగ్లీషులో వాడకూడదని..

సింహాలకు Zoo లుండును 
సంహారమే సృష్టియగును సామాన్యంగా 
అంహస్సెయగును పుణ్యము 
Somehow మన కవనధారా స్రవియించు ...

అని రాశాను. 

*******************************************

............... అంటారు మహాకవి శ్రీశ్రీ తన పాటల సంకలనం ' పాడవోయి భారతీయుడా ' లో .......

శ్రీశ్రీ గారి చెప్పుకోదగ్గ పాటల్లో ఒకటి నటుడు పద్మనాభం నిర్మించిన ' దేవత ' చిత్రంలోని ' బొమ్మను చేసి ప్రాణం పోసి...' పాట గురించి......

" బొమ్మను చేసి ప్రాణము పోసి 
ఆడేవు నీకిది వేడుక..........."  అనే పల్లవి వేటూరిది. అతని అనుమతి మీద, పద్మనాభం కోరిక మీద ప్రారంభంలోని సాకీతో సహా దీన్ని పూర్తి చేసాను. కీర్తిశేషుడు కోదండపాణి తయారు చేసిన బాణీ రచయితను తికమాట పెట్టేదిగా ఉంది. కష్టపడి నేను రాసిన పాటలలో ఒకటిగా దీనిని చెప్పుకోవాలి.

........... అంటారు శ్రీశ్రీ తన ' పాడవోయి భారతీయుడా ' సంకలనం లో .
Vol. No. 01 Pub. No. 273

భమిడిపాటి వారికి గుర్తు

 హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వర రావు గారికి ఓసారి పెద్ద సమస్య వచ్చిపడింది. ఆయన రాజమండ్రిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కాలంలో ఎక్కడికెళ్ళినా అభిమానులనుంచి, శిష్యులనుంచి నమస్కార బాణాలు విరివిగా పడేవి. అయితే ఓసారి అకస్మాత్తుగా ఆయన్ని ఎవరూ పట్టించుకోక పోవడం, పలకరించకపోవడం, నమస్కారాలందించకపోవడం.... ఇంతెందుకు... జగమెరిగిన హాస్యబ్రహ్మను అసలెవరూ గుర్తించకపోవడం జరిగింది. ఇలా హఠాత్తుగా అందరూ తననెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో కామేశ్వరరావు గారికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకిలా జరుగుతోందని ఆలోచిస్తే విషయం బోధపడింది.

కామేశ్వరరావు గారికి అప్పట్లో మెడ మీద చిన్న కణితి వుండేది. దాన్ని కప్పి వుంచడం కోసం ఆయన తన జుట్టును వత్తుగా, అచ్చం భావకవిలా గిరజాలతో పెంచారు. అయితే శస్త్రచికిత్స చేయించి ఆ కణితిని తీసేయడంతో అవసరం తీరిపోయిందని జుట్టు కూడా తగ్గించేసారు. వత్తైన గిరజాల  జుట్టుతో ఆయనను చూడడానికి అలవాటు పడ్డ వాళ్ళు తలకట్టు మారడంతో గుర్తుపట్టలేకపోయారు. దాంతో పలకరింపులు, నమస్కారాలు కూడా మాయమైపోయాయి. ఈ విషయం గ్రహించిన భమిడిపాటి కామేశ్వరరావు గారు సరాసరి తనకు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్ళారు.

" అయ్యా ! డాక్టర్ గారూ ! మీరు ఎలాగైనా నా కణితిని నాకు తిరిగి తెప్పించండి.  లేకపోతే నన్నెవరూ గుర్తుపట్టటం లేదు. " అన్నారట. అప్పుడు చూడాలి డాక్టర్ గారి పరిస్థితి...!!

హాస్య బ్రహ్మ జయంతి సందర్భంగా ఆయనకు నవ్వుల పువ్వులు సమర్పించుకుంటూ .................

తెలుగు వికీపీడియా లో హాస్యబ్రహ్మ

హాస్యబ్రహ్మ గురించిన గత టపాలు :
హాస్యబ్రహ్మ  ఛలోక్తులు
ధుమాలమ్మ ఓఘాయిత్యం - కథా పరిచయం

భమిడిపాటి వారి అందుబాటులో వున్న రచనలు :

ఈడు జోడు: ఆరు రంగాలుగల రూపకం
రాక్షస గ్రహణం: ఏడు రంగాలుగల రూపకం
వినయ ప్రభ: ఏడు రంగాలుగల రూపకం
మాటవరస: సర్వ సామాన్య విషయముల గురించిన తేలిక రచనల సంపుటి
ప్రణయరంగం: ఏడు రంగాలుగల రూపకం
వసంతసేన: తొమ్మిది రంగాలుగల రూపకం
గుసగుస పెళ్లి: తొమ్మిది కథలు
 
Vol. No. 01 Pub. No.271

Tuesday, April 27, 2010

సినిమాల్లో పాటల గురించి శ్రీశ్రీ

బొమ్మలు మాట్లాడటం ప్రారంభించాక హాలీవుడ్లో  తయారైన మొట్టమొదటి టాకీ చిత్రం సంగీత ప్రధానమైనది. అప్పుడే సాహిత్యంతో కూడిన పాటలు స్వరబద్ధమైన సంగీతంతో బాటు సినిమా రంగ ప్రవేశం చేశాయి. అలాగే ఇండియాలో తయారైన మొదటి హిందీ చిత్రం ' ఆలం ఆరా ' గానరస ప్రధానమైనదే. దీన్ని మద్రాసులో ప్రదర్శించినప్పుడు నేనూ చూసాను. ఏం చూసాను, ఏం విన్నానో ఇప్పుడు జ్ఞాపకం లేదు గానీ బ్లాకులో టికెట్లు కొనలేదని మాత్రం జ్ఞాపకంగా చెప్పగలను. అప్పటికింకా మనదేశం అంత అభివృద్ధి సాధించలేదు. కనీసం అప్పటికింకా మనకి స్వరాజ్యమైనా రాలేదు.

నేను మొదటే చెప్పాను. సినిమాకి పాటల అవసరాన్ని సందేహిస్తున్నానని. ( ఆ అవసరం లేకపోతే నేను నిరుద్యోగినై పోతానేమో అన్నది వేరే సంగతి ! ) ఒక్క పాటలే అన్న మాటేమిటి ? సినిమాకు అక్కరలేనిదంటూ ఏమైనా వుందా అనేది నా ధర్మ సందేహం. ఈ రెండో దానికి నా మొదటి సందేహం తీరిపోయింది. అవును మన సినిమాల్లో పాటలుండాలి. తెలుగు పుస్తకాల్లో అచ్చుతప్పుల్లా.

నా మొదటి పాట ' కాలచక్రం ' అనే చిత్రంలో మొదటి నిమిషాలలోనే వచ్చింది. అదే నా ' మహాప్రస్థానం ' పాట. అప్పటికే కొంత చప్పుడు చేసిన ఆ పాటను వాళ్ళు కావాలన్నారు. నేను సరేనన్నాను. దానికిగాను నాకు ముట్టిన పారితోషికం సినిమా హాల్లోకి ఉచిత ప్రవేశం. బందా కనకలింగేశ్వరరావు, ముంజులూరి కృష్ణారావు, కపిల కాశీపతి, లక్ష్మీరాజ్యం మొదలైనవారు నటించిన ' కాలచక్రం ' కాలగర్భంలో కలసిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు దాన్ని స్మరించేవాళ్ళే లేరు.

ఆ తర్వాత చాలా కాలానికి ' ఆహుతి ' అనే చిత్రంతో నేను సినిమారంగంలోకి స్థిరప్రవేశం చేసాను. ' ఆహుతి ' చిత్రం కూడా కాలానికి ఆహుతి అయిపోయింది. కానీ తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ చిత్రంగా ఆది చరిత్ర సృష్టించింది. అందులోని ' ప్రేమయే జనన మరణ లీల ' అనే పాట ఇప్పటికీ తరచుగా మన రేడియోలలో వినబడుతూ వుంటుంది. ఆ పాట ప్రజాదరణ పొందటానికి అందులోని సాహిత్య పుష్టికన్నా సాలూరి రాజేశ్వరరావు సొంత బాణీ, ఘంటసాల కమనీయ కంఠం ముఖ్య కారణాలని నేననుకుంటున్నాను. సాహిత్య విలువలకైతే ' హంసవలె ఊగుచు రావే ' అనే పాటను నేనెక్కువ లైక్ చేస్తాను.

' ఆహుతి ' చిత్రం విడుదలైంది 1950 లో. అదే సంవత్సరం నా ' మహాప్రస్థానం ' గీతాలు గ్రంథరూపం దాల్చాయి. 
                                      
                                                                                   ................. మహాకవి శ్రీశ్రీ             Vol. No. 01 Pub. No. 270

Monday, April 26, 2010

సినిమాల గురించి శ్రీశ్రీఈ ఇమేజ్ పైన క్లిక్ చెయ్యండి.
 సినిమా అనేది ఒక బ్రహ్మాండమైన ఆయుధం. దానిని వినియోగించగల బ్రహ్మాండమైన కళాస్రష్ట మనలో ఇంకా బయలుదేరలేదు. ప్రస్తుతం ఆది చిటికెన వేలంతటి మనుషుల చేతిలో వున్నది. వారు కూడా దానిని తమ అల్ప ప్రయోజనాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. బిర్లా, టాటాలు 501 సబ్బును, సిమ్మెంటు బస్తాలను ఉత్పత్తి చేస్తున్నట్లుగానే మన ప్రొడ్యూసర్లు ఈనాడు చిత్రనిర్మాణం చేస్తున్నారు.
అసలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడా మన ప్రొడ్యూసర్లకు పరిపాటి అయింది. ఇది ఎంత అసందర్భంగా ఉన్నదో చెబుతా వినండి. ఆహారం విక్రయించడం ఒక వ్యాపారంగా నడపడం 20 వ శతాబ్దంలోనే ప్రారంభమయింది. ప్రతివాడూ తిండి కోసం హోటల్ కు వెళ్ళాలి. అతడికి ప్రతిసారీ ఆహారం ( మంచిది ) లభించకపోవచ్చు. అయినా రోజూ హోటల్ కు వెళ్లక తప్పదు.


ఆహారం వలెనే ఈనాడు మానవునికి సినిమాకూడా ఒక అవసరం - అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు. కానీ కంపుకొట్టే వేరుశెనగ నూనెతో చేసే వంటకాలనుకాని ప్రజలు ముట్టరని, వాటికి వాళ్ళు అలవాటు పడ్డారని యజమాని చెబితే ఎంత అసందర్భంగా ఉంటుందో ఉత్తమ చిత్రాలను నిర్మిస్తే ప్రజలు చూడరని చెప్పడం కూడా అలాగే వున్నది.


నాటకానుభవం లేని కవులు సినిమారచయితలుగా వస్తే, యతిప్రాసలు రానివారు కవిత్వం చెప్పడానికి పూనుకున్నట్లే ఉంటుంది. సినిమా రచయితలకు నాటకానుభవం ఉండి తీరాలి. శ్రీ పింగళి నాగేంద్రరావు గారికి అట్టి అనుభవం ఉన్నందువల్లనే " పాతాళ భైరవి " ( ఆంధ్ర ప్రభ లోని వ్యాసం లింక్ ) వంటి కాకమ్మ పిచికమ్మ కథలో అంత ' డ్రమెటిక్ ఎఫెక్ట్ ' తీసికొని రాగలిగారు.


సాధ్యమైనంత ఎక్కువ యాక్షన్ తోనూ, సాధ్యమైనన్ని తక్కువ సంభాషణలతోను నిర్మించినపుడు చిత్రం ఉత్తమంగా వుంటుంది. అందుకు సహాయభూతం కాగల నాటకానుభవం వున్న రచయిత తప్పకుండా దర్శక పదవిని ఆక్రమించవచ్చు. డైరెక్టర్ అంటే ' స్టార్ట్ ' , ' కట్ ' అని కేకలు వేసేవాడు మాత్రమే కాదు.


ఏమైనా ఏప్రజలకు తగిన ప్రభుత్వం ఆ ప్రజలకు లభించినట్లుగానే, ఆయా ప్రజల స్థాయిని బట్టి ఆయా సినిమాల స్థాయి కూడా వుంటుంది.


సుమారు మూడు దశాబ్దాల క్రితం ఆంధ్రజ్యోతి వార పత్రికలో  ప్రచురించిన మహాకవి శ్రీశ్రీ గారి వ్యాసం నుండి..........  

Mahasankalpam: Vacana kavita sankalanam, 1940-1975 = Mahasankalpam, an anthology of modern Telugu poetry from 1940 to 1975
  మహాకవిగారి సొంతగళం నుండి ప్రవహించిన  మహాప్రస్థాన గీతం  ......Vol. No. 01 Pub. No. 269

Sunday, April 25, 2010

వేసవి ముచ్చట్లు

అందరికీ వేసవి సెలవలిచ్చేసారు. పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ అమ్మమ్మలు, మామయ్యలు, అక్కలు, బావలు వగైరా బంధువుల ఇళ్ళకి ప్రయాణమవుతుంటే పెద్దలు సంవత్సరమంతా తినడానికి ఉపయోగించే ఊరగాయ పచ్చళ్ళు తయారీలో మునిగిపోతారు. ఇది ఒకప్పటి మన జీవనచిత్రం.


ప్రస్తుతం రెడీమేడ్ గా దొరుకుతున్న పచ్చళ్ళు మన డైనింగ్ టేబుల్ ని అలంకరిస్తున్నాయి.  ఇంకా అప్పటి తరం వాళ్ళుంటే మాత్రం అప్పటి పద్ధతుల్లో కారం దంపించడం, నూనె ప్రత్యేకంగా గానుగ ఆడించడం చెయ్యకపోయినా బజార్లో రెడీ గా దొరికే కారాలు, నూనెలు వగైరా తెచ్చుకుని సమ పాళ్ళలో కలుపుకోవడం ఇప్పటికీ కనబడుతుంది.  వేసవి కాలంలో ఊరగాయ పచ్చళ్ళు పెట్టడం ఒక గతకాలపు జ్ఞాపకం. అప్పుడది ఇంటిల్లపాదికీ పని. సంవత్సరమంతా అన్నంలోకి ఒక మధురమైన ఆధరువు.
అలాగే వేసవి సెలవలు పిల్లలకు ఆటవిడుపు. ఇప్పట్లా పోటీ చదువులు, వేసవి శిక్షణా శిబిరాలు తెలియని రోజుల్లో ఆ సెలవలకు బంధువుల ఇళ్ళకు వెళ్ళడం, ఆ సెలవలన్నీ ఆట, పాటలతో ప్రకృతిమాత  ఒడిలో గడిపి వేసవి తాపాన్నుంచి ఉపశమనం పొందడం, బడులు తెరిచే సమయానికి కొత్త శక్తితో రావడం............ ఇదంతా గత తరం జ్ఞాపకాలే ! అప్పటి నా ముచ్చట్లు   స్వ ' గతం ' పేజీలో రాస్తున్నాను. ఒక్కసారి ఆ పేజీ తెరవండి.  ఆ ముచ్చట్లు పంచుకోండి.  

Vol. No. 01 Pub. No. 268

Saturday, April 24, 2010

నట వి 'శారద '

తెలుగు చలన చిత్ర ఊర్వశి, నట విశారద శారద పై శ్రీ వి. ఏ. కే. రంగారావు గారు ఆంధ్రజ్యోతి లో రాసిన వ్యాసం కోసం ఎడమ ప్రక్కన ఇమేజ్ మీద క్లిక్ చెయ్యండి లేదా ఈ లింక్ కు వెళ్ళండి .
శనివారం చెన్నైలో జరిగిన పురస్కార విశేషాలు 
ఇక్కడ చూడండి.


Vol. No. 01 Pub. No. 267

నాద ' స్వర ' జానకి

ఆమె స్వరమే నాదస్వరం
ఆమె స్వరమే రాగమయం

ఆమె స్వరం ముద్దుపలుకులు పలుకుతుంది
ఆమె స్వరం ముదుసలి పదాలు కూడా పాడుతుంది

ఆమె పాటకు కోకిల ఆశ్చర్య పోతుంది
ఆమె పాటకు సన్నాయి మూర్చనలు పోతుంది

ఆమె పుట్టింది తెలుగునాట
ఆమె పెరిగింది తానై సంగీతమంతటా   


ఆమె తొలి అడుగు తమిళనాట
ఆమె మలి ఆడుగు తెలుగుపాట

ఆమె స్వరం పారిజాతమై పరిమళాలు వెదజల్లింది
ఆమె స్వరం ఎల్లలు లేని సంగీత ప్రపంచమంతా విహరించింది

ఆమె పాట ప్రధాన భారత భాషలన్నిటిలో  వినిపించింది
ఆమె పాట సింహళ, ఆంగ్ల, జపనీస్, జర్మన్ భాషల్లోనూ ధ్వనించింది
                                   రాగం ఆమె స్వరం
గానం ఆమె ప్రాణం

గానాన్ని ఆమె ప్రేమిస్తుంది
జనం ఆమె గానాన్ని ప్రేమిస్తారు

అందుకే ఏ గాయని అందుకోలేనన్ని అవార్డులు ఆమె సొంతం
అందుకే ఏ గాయని పొందలేనన్ని ప్రజల రివార్డులు ఆమె ధనం 

ఆమె భారతజాతికి  తెలుగుగడ్డ సగర్వంగా అందించిన గాన కోకిల
ఆమే అన్ని కాలాలలోనూ తన గానామృతాన్ని పంచుతున్న ఎస్. జానకి అనే తెలుగు కోకిల 

ఎం. ఎల్. ఏ . తో మొదలైన ఆమె గాన ప్రస్థానం కారైకుర్చి అరుణాచలం నాదస్వరంతో పోటీపడి
ఇరవై వేల పైబడిన పాటలతో భారత శ్రోతల్ని మురిపించింది ... మురిపిస్తోంది... మురిపిస్తుంది.

ఏప్రిల్ 23 వ తేదీ ఆ మధుర గాయని పుట్టిన రోజు సందర్భంగా స్వరపుష్పాలతో శుభాకాంక్షలు ....
Vol. No. 01 Pub. No. 266

Friday, April 23, 2010

హిందీ చిత్ర సీమలో తొలి తెలుగు హీరో

హిందీ చిత్ర సీమలో మన తెలుగు నటీమణులు వహీదా రెహ్మాన్, రేఖ, శ్రీదేవి లాంటి వారు విజయ బావుటా నెగురవేసారు. కానీ తెలుగు నటులు హిందీలో పేరు తెచ్చుకున్న సందర్భాలు చాలా తక్కువ.  అందులో తొలితరంలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి మనకందరికీ బాగా తెలిసిన ఎల్వీ ప్రసాద్. ఈయన తొలి భారతీయ టాకీ చిత్రం ' ఆలం ఆరా ' లో రెండు, మూడు వేషాలను వేశారు. 

అంతకుముందే అంటే మూకీ యుగంలోనే బొంబాయి చిత్రసీమలో ప్రవేశించి హీరోగా ఎదిగి హిందీ , ఉర్దూ మొదలైన భాషల్లో సుమారు 170 చిత్రాల్లో నటించిన తెలుగువాడు పైడి జైరాజ్. వీటిలో అధిక భాగం హిందీ చిత్రాలే !

భారత కోకిల సరోజినీ నాయుడు జైరాజ్ కు పినతల్లి అవుతారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో చదివి సినిమాలపై మోజుతో 1929 లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యోయేట 1930 లో తొలిసారిగా " స్పార్క్లింగ్ యూత్ " అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో " ట్రయంఫ్ ఆఫ్ లవ్ " అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు.  1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన " షికారి " ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో పెద్ద హీరో గా పేరు తెచ్చుకున్నారు. నిరుపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరొయిన్ ల సరసన నటించారు. అనేక విజయాలనూ చవిచూశారు.

నటుడిగానే కాక మొహర్, మాలా, ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ' సాగర్ ' చిత్రానికి నిర్మాత కూడా ఆయనే ! ఎక్కువగా షాజహాన్, పృధ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్, అల్లావుద్దీన్, చంద్రశేఖర ఆజాద్ లాంటి చారిత్రక పాత్రల్ని ధరించిన జైరాజ్ తెలుగు వాడై వుండి కూడా  ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించకపోవడం విచారకరం.   

భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక పురస్కారం ' దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ' జైరాజ్ కు 1980 లో లభించింది.

SHAHJEHAN
Leatherface [VHS] 
Chhoti Bahu [VHS]Vol. No. 01 Pub. No. 265

క్రొత్త ఆలోచనలకు సత్కారం

జీసస్ ని శిలువ వేశారు. సోక్రేటిస్ కి విషం ఇచ్చి తాగమన్నారు. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ లని తుపాకులతో కాల్చి చంపారు. దేశానికి క్రొత్త ఆలోచన నిచ్చిన వాళ్ళని మృత్యువుతో సత్కరించడం ఈ లోకం ఆచారం.  

ప్రముఖ రచయిత, నటులు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి
" సత్యంగారి ఇల్లెక్కడ ? " నాటికలోని ఒక డైలాగ్.


 Search Amazon.com for telugu plays
Search Amazon.com Books for telugu plays
Vol. No. 01 Pub. No. 264

Thursday, April 22, 2010

తొలి లవకుశ ఘనత

 1931 లో తెలుగు సినిమాకు మాటలోస్తే తెలుగునాట చిత్ర ప్రదర్శనశాలలు మూకీ నుంచి టాకీలుగా మారడానికి మరో మూడు సంవత్సరాలు పట్టింది. 1934 వరకూ ప్రదర్శన శాలల్లో  టాకీలు ప్రదర్శించేటపుడు మద్రాస్, బెంగుళూరు లనుంచి సౌండ్ బాక్స్ లు తెచ్చి మాటలు విడిగా వినిపించేవారు. సౌండ్ ప్రొజెక్టర్లు లేకపోవడమే దీనికి కారణం. ఆ పరిస్థితినుంచి మూకీ ప్రదర్శనశాలల్ని టాకీ ప్రదర్శనశాలలుగా మార్పించిన ఘనత 1934 లో వచ్చిన తొలి లవకుశ చిత్రానికి దక్కింది.

చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో  వచ్చిన ఆ చిత్రంలో పారేపల్లి సుబ్బారావు రాముడిగా నటించారు. ఆయన రంగస్థలం నటులు. అక్కడ ఆయన ' రాధ ' వేషానికి ప్రసిద్ధులు. సీతగా శ్రీరంజని నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దాంతో ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన చమ్రియా సంస్థ ప్రదర్శన శాలలకి ఒక షరతు పెట్టింది. తమ దగ్గర సింప్లెక్స్ ప్రొజెక్టర్, సౌండ్ బాక్స్ లు కొంటేనే లవకుశ ప్రింట్ ఇస్తామన్నారు. దాంతో ప్రదర్శనశాలల వారందరూ అవి కొనుక్కుని తమ మూకీ ప్రదర్శన శాలల్ని టాకీ శాలలుగా మార్చేశారు. ఆ రకంగా తెలుగునాట టాకీ ప్రదర్శన శాలల ఆవిర్భావానికి తొలి లవకుశ దోహదపడింది. 

Search Amazon.com Music for telugu film
Search Amazon.com for telugu film

Vol. No. 01 Pub. No. 263

భూమి కోసం ....

ఈ రోజు ప్రపంచ ధరిత్రి దినోత్సవం. భూమి కోసం భూమిని రక్షించుకుంటే  ఆ భూమాత  మనల్ని రక్షిస్తుందని అందరూ గుర్తుచేసుకుంటారని ఆశిస్తూ.........

 
Vol. No. 01 Pub. No. 262

Wednesday, April 21, 2010

విశ్వనాథ ' నాయక '

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆజానబాహుడు. ఆయన ఒకసారి గుంటూరు హిందూ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వేదిక మీదకు వస్తుండగా పైనున్న ఆ కళాశాల ప్రిన్సిపాల్ వల్లభజోస్యుల సుబ్బారావు గారు విశ్వనాథ వారికి చెయ్యి అందిస్తూ

" జలధివిలోలవీచి విలసత్కలకాంచి సమంచితా వనీతల............"

అంటూ శర్మిష్టను నూతిలోంచి బయిటకు తియ్యడానికి యయాతి తన చెయ్యి అందించే సందర్భంలోని పద్యం పాడారు.  అది విన్న విశ్వనాథ వారు

" నాలాంటి పొడవైన నాయిక, మీ ప్రిన్సిపాల్ లాంటి పొట్టి నాయకుడు వుంటే...... అహా ! ఎంత సొగసు ఆ సరాగం !! "
 అంటూ వేదికనలంకరించారు.

Visvanatha kavita vaibhavam: Kavi samrat Visvanathavari kamaniyapadyalaku ramaniya vyakhya

Vol. No. 01 Pub. No. 261

Tuesday, April 20, 2010

ఎప్పుడో ' లేచింది మహిళాలోకం '

మహిళలు తలచుకుంటే సాధించలేనిది లేదని తెలుగు చలన చిత్ర రంగం ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే నిరూపించారు కొందరు మహిళలు. వారిలో మొదటి మహిళా తెలుగు నిర్మాతగా  దాసరి కోటిరత్నం గురించి గతంలో టపా రాయడం జరిగింది.

మరో మూడేళ్ళకు అంటే 1938 లో విశాఖపట్నానికి చెందిన ఆంధ్రా సినీ టోన్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ( ఆ పేరుతోనే విశాఖలో ఫిలిం స్టూడియో కూడా నిర్వహించారు ) ' భక్త జయదేవ ' అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఆ చిత్రంలో రెండుచింతల సత్యనారాయణ, సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. ఆ చిత్రానికి హిరెన్ బోస్ అనే బెంగాలీ ఆయన దర్శకుడు. అయితే ఆయన సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రం కావడంతో చిత్ర నిర్మాణం సరిగా సాగలేదు. నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితి.

 నిర్మాణం ఆగిపోతొందన్న అందరి అందోళనలను తొలగిస్తూ దర్శకత్వంతో బాటు ఎడిటింగ్ కూడా నిర్వహిస్తూ, కథానాయిక పాత్ర ధరించి ఆ చిత్రాన్ని పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరచిన నారీ శిరోమణి ' సురభి కమలాబాయి ' . తొలి తెలుగు కథానాయిక ( భక్త ప్రహ్లాద - 1931 ) కాక తొలి మహిళా దర్శకురాలిగా కమలాబాయి ని చెప్పుకోవచ్చు. అయితే చిత్రం టైటిల్స్ లో హిరెన్ బోస్ పేరే కనబడుతుంది. చివరకు డబ్బాల్లో మగ్గిపోకుండా ఆ చిత్రం పూర్తయి విడుదల చేసేందుకు కారణభూతురాలు ఒక మహిళ కావడం, అదీ తెలుగు చిత్రరంగం ఇంకా శైశవ దశలోనే ఉన్న రోజుల్లో అవడం విశేషమే కదా ! 


నటుల్నీ, సాంకేతిక నిపుణులని సంఘటితపరచి ఆదాయాన్ని అందరూ సమంగా అనుభవించాలనే  సిద్ధాంతాన్ని ఆనాడే అమలుపరచిన తొలి తెలుగు మహిళా నిర్మాత దాసరి కోటిరత్నం.

ఈనాడు మన చిత్రసీమలో ఎక్కడికెళ్ళినా వినిపించే మాట " నిర్మాత బాగుంటే పరిశ్రమ బాగుంటుంది ". కానీ ఆ మాట అమలు కొచ్చేసరికి శూన్యమే ! చిత్రం ప్రారంభించేవరకే నిర్మాత పాత్ర అవుతోంది. అనేక కారణాలవలన చిత్రం ఆగిపోతే పట్టించుకుని ఆ నిర్మాతకు అండగా నిలబడే వారే కరువయ్యారు. చాలా సందర్భాల్లో అనేక చిత్రాలు మధ్యలోనే ఆగిపోవడం, లేదా విడుదలకు నోచుకోకపోవడం సర్వ సాధారణమైపోయింది. అయితే నిర్మాత సంక్షేమమే పరిశ్రమ సంక్షేమం అని మాటలతో కాక చేతలతో ఆనాడే నిరూపించిన మరో మహిళ సురభి కమలాబాయి.

ఈ ఇద్దర్నీ చిత్ర పరిశ్రమ - ముఖ్యంగా పరిశ్రమలోని మహిళామణులు అప్పుడప్పుడైనా స్మరించుకుంటే బాగుంటుంది.

Search Amazon.com DVD for telugu movies dvd
The songs of Tyāgarāja: English translation with originals (The heritage of Andhra)

Vol. No. 01 Pub. No. 260

ఉరుములేని పిడుగు

నెల్లూరు నెరజాణలంటే ఎంత ప్రసిద్దో వేరే చెప్పనక్కరలేదు.
హరికథలకు ఆదిభట్ల నారాయణదాసు గారు ఎంత ప్రసిద్ధులో చెప్పాలా ?
నెల్లూరు నెరజాణలకు, దాసుగారికి సంభంధం ఏమిటంటారా ..............

ఆదిభట్లవారు హరికథలలోనే కాదు... రసికతలోనూ లబ్ద ప్రతిష్టులే !
ఒకసారి ఆయన నెల్లూరు వెళ్ళడం తటస్థించింది. సరే ! ఎలాగూ నెల్లూరుకొచ్చాం కదా ఈ నెరజాణల సంగతేంటో చూద్దాం అని బయిల్దేరారు. అలా వీధి వెంట నడుస్తుండగా ఒక ఇంటి గుమ్మంలో నిలబడిన ' జాణ ' నారాయణ దాసు గారి మీద చెంబుడు నీళ్ళు చల్లి ' మబ్బులేని వాన ' అంది నవ్వుతూ ......

దాంతో ఆదిభట్ల వారు ఉలిక్కిపడ్డారు. ఆశ్చర్య పోయారు. కొంచెం కోపం కూడా వచ్చింది. ఆ నెరజాణకు తగిన శాస్తి చేయ్యాలనుకున్నారు.
అంతే ! ఒక్క అంగలో ఆమె దగ్గరకెళ్ళి వీపు వంచి ఒక్క పిడిగుద్దు వేసి ' ఉరుములేని పిడుగు ' అని వెనక్కి వచ్చేశారు.

Harikatha pitamaha Srimadajjadadibhatta Srinarayanadasa jivita caritramu: Yaksaganamu
Harikatha pitamaha Srimadjjadadi Bhatla Narayanadasa jayantutsava sancita
Search Amazon.com ClassicalMusic for karnatic
 Vol. No. 01 Pub. No. 259
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం