Wednesday, April 7, 2010

పిల్లల ఆటలు - గుజ్జనగూళ్ళు

బాల్యం మధురమైనది.
ఆటపాటలతో గడపాల్సిన దశ బాల్యం
బాల్యంలో మనోవికాసానికి, స్నేహశీలత పెంపొందడానికి,
క్రీడాస్పూర్తి పెరగడానికి ఆటలు, కళలు దోహదపడతాయి.
దురదృష్టవశాత్తూ ఈరోజుల్లో ఈ రెంటికీ ఆదరణ తగ్గిపోయింది. 
చదువు వ్యాపారమయ్యాక ఆటలకి సమయం చాలడంలేదు.
ఆటలు కూడా వ్యాపారమయ్యాక క్రీడాస్పూర్తి లోపించింది.
కళ కళ కోసమే అనే ఆలోచన దాదాపుగా కనుమరుగైపోయింది.
కళ కూడా వ్యాపారంకోసమే అనే ధోరణి ప్రబలిపోయింది.

వేసవి సెలవలోచ్చేసాయి. కనీసం ఈ సెలవల్లోనైనా పెద్దలందరూ ఆలోచన చేసి
తమ పిల్లలకు, మనుమలకు తాము చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్ని పరిచయం చేసి
వాళ్లకు మన సంస్కృతిని తెలుసుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది.

ఇక  గుజ్జనగూళ్ళు గురించి ఒకసారి పరిశీలిద్దాం.
ముందుగా మిత్రుల అభిప్రాయాలను పరిశీలిస్తే .......
1.  జ్యోతి గారు తాము గతంలో పిల్లల ఆటల మీద రాసిన సమగ్ర వ్యాసం లింకు పంపారు. చాలా వివరంగా చర్చించారు. కాకపోతే అందులో గుజ్జనగూళ్ళు కిచ్చిన పధ్ధతి ' ఓమన లేదా వామన గుంటలు' అనే ఆటకు సంబంధించినది.
2. సీతారాం గారు గుజ్జనగూళ్ళు  అనే మాటకు అర్థాన్ని చాలావరకు వివరించడానికి ప్రయత్నించారు.
3. కౌటిల్య గారు కూడా అర్థాన్ని వివరించడానికి చాలావరకు ప్రయత్నించి చాలా దగ్గరగా వచ్చారు.
మిగిలిన మిత్రులు మందాకిని గారు, మాధురి గారు, సౌమ్య గారు, అజ్ఞాత గారు తమకు తెలిసినంతవరకూ వివరించారు.
ముందుగా అందరికీ ధన్యవాదాలు చెబుతూ గుజ్జనగూళ్ళు అనే మాట పూర్వాపరాలు వివరించడానికి ప్రయత్నిస్తాను.

అన్నప్రాసన నాడే ఆవకాయా ! 

చంటి పిల్లలకు అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టలేం కదా !
అందుకని గతంలో ( ఈ కాలంలో నేను ఎక్కువగా ఎక్కడా చూడలేదు ) వారికి తేలికగా జీర్ణమయ్యే ఓ పదార్థాన్ని తయారుచేసేవారు. బియ్యం, బెల్లం కలిపి ఉడికించి నెయ్యి వేసి బాగా కలిపి గుజ్జులాగా చేసేవారు. దానిని గోరుముద్దలు అంటే కొద్దిగా బొటనవేలి పైభాగాన వుంచుకుని పిల్లల్ని పాటలు పాడుతూ లాలించి, బుజ్జగించి  నోటికందించి తినిపించేవారు.

అలా గుజ్జు రూపంలో వున్న కూడు కనుక గుజ్జనగూడు అయింది.

ఇక ఆట రూపాన్ని తీసుకుంటే సాధారణంగా పిల్లలు పెద్దల్ని అనుకరించడం సహజం. ఆ అనుకరణ మనకి ఆటల్లో కూడా కనిపిస్తుంది. బొమ్మల పెళ్ళిళ్ళు చెయ్యడం, అమ్మానాన్న ఆటలాడుకోవడం వగైరా ఇలాంటివే ! ఈ ఆటల్లో నిజంగా గానీ, ఉత్తుత్తినేగానీ వంట చెయ్యడం, వడ్డించడం చేస్తారు. బహుశా ఈ అనుకరణ వల్లనే ఈ ఆటకు కూడా గుజ్జనగూళ్ళు అనే పేరు వచ్చివుండవచ్చు.

ఈ ఆట ఆడే పధ్ధతి గురించి మరో విధానం కూడా గుజ్జనగూళ్ళు - సందేహం టపాలో ప్రస్తావించడం జరిగింది. ఆ విధానానికి కూడా గుజ్జనగూళ్ళు అనే పేరు వున్నట్లు నేను ఒకచోట చదివాను. అయితే ఆది సరికాదేమోనన్న ఆలోచనతో సందేహం వెలిబుచ్చడం జరిగింది. దానికి మిత్రులు కూడా అదే అభిప్రాయాన్ని తెలియజేశారు. కనుక పైన వివరించిన అర్థమే సరైనదని అనుకోవచ్చు.

శబ్దరత్నాకరము లో ఇచ్చిన వివరణ ( పుట 282 ) :   1.  ( గుజ్జు + ఎన + కూళ్ళు ) బాల క్రీడా విశేషము; 2 . బాలికలాడుకొనునప్పుడు గురుగులతో వండిన వంటకము.

ఒక్క విషయం. మనకే స్వంతమైన, మన సంస్కృతిలో భాగమైన ఇలాంటి విశేషాల్ని మనం మరచిపోకుండా వుండడానికి, ముందుతరాలకి పరిచయం చేసి వాటిని సజీవంగా వుంచడానికి అప్పుడప్పుడు ఇలా గుర్తుచేసుకోవడం మంచిదేమో ! ఆలోచించండి.
బాపు గారు అందించిన ఆరుద్ర గారి బాలల ఆటల సాహిత్యం కె.వి.మహదేవన్ స్వరకల్పనలో పి.బి.శ్రీనివాస్ గళంలో వినండి.Vol. No. 01 Pub. No. 245

7 comments:

కౌటిల్య said...

రావు గారూ,
చాలా బాగా చెప్పారు...మా ఇళ్ళల్లో ఇప్పటికీ చిన్నపిల్లలకి గుజ్జెనే పెడతారు...మొన్న మా అక్కకి అబ్బాయి పుడితే మా అక్క వాడి అన్నప్రాశన అవ్వగానే ఫారిన్ వెళ్ళిపోయింది..వెళ్తూ నాల్గు నెలలకి సరిపడా గుజ్జెన బియ్యం చేయించుకుని పట్టుకెళ్ళింది...బియ్యం,కందిపప్పు నేతిలో వేయించి,బెల్లం కొద్దిగా కలిపి తిరగల్తో విసురుతారు.(ఇప్పుడు మిషన్ పట్టిస్తున్నారనుకోండి)...తర్వాత అది రోజూ కొంచెం ఉడికించి,బాగా నెయ్యి వేసి కలిపి బుజ్జాయికి గోరుముద్దలు తినిపిస్తారు...

Vinay Datta said...

the lyric of the song not clear. please give in a post.

Vinay Datta said...

The song of the 1 st game in the last post:

paisaki rendu draakshaa pallu

badi pillalandaru konukkondi

aakupachha, gulaabi rangu andulo

aakhari pillanu pattukondi.

Though girls played this mainly, boys younger to the girls joined them in moving in a line.

SRRao said...

కౌటిల్య గారూ !
ఆధునికత పేరుతో ఆరోగ్యకరమైన, ఉపయుక్తమైన చాలా విషయాలు విస్మరిస్తోంది నేటి తరం. మీ ఇంట్లో ఇంకా ఈ పధ్ధతి పాటించడం అభినందించాల్సిన విషయమే ! వీలు చేసుకుని మీరు మరికొంతమందికి దీనివలన కలిగే లాభాలు చెప్పండి.

SRRao said...

మాధురి గారూ !
పాటలో కొద్దిగా distortion వున్న మాట నిజమే గానీ సాహిత్యం బాగానే వినబడుతోంది. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. అయినా మీకోసం లిరిక్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
మీరు నేనడిగిన ఆట పద్ధతికి వాడే పాటను ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

Kadanbari kusuma said...

గుజ్జనగూళ్ళు essay - useful infrmn

Om Shanti said...

ఓం శాంతి, కాకతాళీయంగా గుజ్జనగూడు అర్థం కోసం ప్రయత్నించి యిక్కడ తేలినందుకు సంతోషంగా వుంది. పదహారవ శతాబ్దంలోనే అన్నమాచార్య శృంగార సంకీర్తన (నిజానికి చిన్న తిరుమలయ్య వ్రాసినది) "గుజ్జనగూడు వండెనే కోమలి నేడు/గొజ్జు వెన్నెల బాయట గొమ్మలు దాను",ఏకంగా యీ వంటకానికి కావలసిన అన్ని దినుసులు, వండే విధానం క్షుణ్ణంగా వివరించింది శృంగారపు ఉపమానంగా అయినప్పటికీ.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం