Thursday, April 15, 2010

పిల్లలతో ఆట

బాల్యం ఎంత మధురమైనది
పెద్దతనంలో తీపి జ్ఞాపకాల్నిస్తుంది 

మరి ఆ బాల్యంలో మాధుర్యం నేడు కరువైపోతోంది
పెద్దతనానికి చేదు జ్ఞాపకాలే మిగులుస్తోంది
 
బాల కార్మికులను రక్షించడానికి చట్టాలున్నాయి
మరి ఈ బాల కార్మికులను రక్షించడానికి ఏ చట్టాలున్నాయి ?

తమ పిల్లల్ని హింసిస్తే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు
తల్లిదండ్రులే హింసిస్తే ఆ పిల్లల్ని కాపాడేవారెవరు ?

ఆడుతూ పాడుతూ చదువుకుని బంగారు భవిష్యత్తు బాట వేసుకోవాలా ?
ఆటా పాట అంటూ తల్లిదండ్రులకు డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోవాలా ?

తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలా ?
తమ తాత్కాలికావసరాల కోసం వారి భవిష్యత్తును తాకట్టు పెట్టాలా ?

ఒకప్పుడు పిల్లలకు తెరమీద నటించే అవకాశం రావడం అదో అద్భుతం
తమ పిల్లలని నటింపజేయడం ఓ సరదా ! పిల్లలే పూర్తిగా నటించిన సినిమాలు చాలా తక్కువ. కేవలం ఒకటి రెండు సీన్లుకే పరిమితమయ్యేవారు. అరుదుగా అక్కడక్కడా పూర్తి నిడివి బాల పాత్రలుండేవి.
వాటిల్లో నటించే పిల్లలు ఎక్కువగా సినీ రంగంలో పనిచేస్తున్న వారి పిల్లలే అయ్యేవారు. లేదా కొంతమంది ఉత్సాహంకొద్దీ తమ పిల్లల్ని ఒకటి లేక రెండు సినిమాల్లో నటింపజేసేవారు. వారి భవిష్యత్తుకు ఆటంకం కలగడానికి అప్పటి తల్లిదండ్రులు అంతగా ఇష్టపడేవారు కాదు. అయితే డబ్బు కోసం పిల్లల్ని సినిమాల్లో నటించడానికి పంపే తల్లిదండ్రులు ఆ రోజుల్లో కూడా వున్నా ఆర్థికంగా ఇబ్బందులుండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపని చేసేవారే ఎక్కువగా వుండేవారు.
 
కానీ ఇప్పుడు బుల్లి తెరనిండా నాట్యం చేస్తున్న పిల్లలే !  అవి నాట్యాలనడం కంటే విన్యాసాలనడం మేలేమో ! ఇవి చేస్తున్న పిల్లలకు తాము చేస్తున్నది ఏమిటో అవగాహన వుందా ? ఏ లక్ష్యం కోసం ఆ పని చేస్తున్నారో వారికి తెలుసా ? భవిష్యత్తులో వీటి ప్రభావమేమిటో వారికి అవగాహన వుందా ? ఎవరికోసం తాము ఈ కసరత్తులు చేస్తున్నామో వారికి అర్థమవుతుందా ? ముమ్మాటికీ కాదు . ఇవేమీ వాళ్లకు తెలీదు. అర్థమయ్యేంత జ్ఞానం వారికి వుండదు. ఈ ఆట పాటా కార్యక్రమాల్లో బహుమతులు గెలుచుకున్న పిల్లలకు అదే వృత్తి కాగలదా ? ఒకవేళ అయినా ఎంతకాలం ఆ వృత్తిలో వుండగలరు ? ఎంత డబ్బు సంపాదించగలరు ? అసలు అంతమంది విజేతల్లో ఎంతమంది తమ గమ్యస్థానం అనుకునే సినిమా రంగానికి చేరుకోగలుగుతున్నారు ?

హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో శిక్షణ పేరుతో హింసకు గురవతూ అందమైన బాల్యాన్ని తాకట్టు పెట్టుకోవడం అవసరమా ?

 అనారోగ్యం చేసినా, కదలలేని పరిస్థితుల్లో వున్నా పోటీలకు తయారు చెయ్యడం కోసం వాళ్ళని హింసించే తల్లిదండ్రులు,
బహుమతి రాకపోతే నిన్ను ఏం చేస్తానో చూసుకో అని బెదిరించే తల్లిదండ్రులు, ఓడిపోతే కెమెరా ఎదురుగా మేమేం బాధపడటంలేదని, కృషి చేసినా అదృష్టం కలసిరాలేదని, ఇదో చాలెంజ్ గా తీసుకుంటామని సన్నాయినొక్కులు నొక్కి. ఇంటికెళ్ళాక మా పరువు తీసావని గొడ్డును బాదినట్లు బాదే తల్లిదండ్రులు....... ఇలా పిల్లలని తమ కంటిపాపల్లా పెంచాల్సింది పోయి వాళ్ళెంత చిత్రహింస అనుభవించినా  తమకి డబ్బు, కీర్తి సంపాదించి పెట్టాలని శాసించే తల్లిదండ్రుల గురించి మీకు తెలుసా ? తమ అవసరాలకీ, తమ ఆడంబరాలకీ పిల్లల్ని బలి చేసే హక్కు ఆ తల్లిదండ్రులకు ఎవరిచ్చారు ? తమ అభిరుచుల్ని పిల్లలపై బలవంతంగా రుద్దడం ఎంతవరకూ సమంజసం ?

 ఇది బాల కార్మిక నిరోధ చట్టం పరిధిలోకి రాదా ? గృహహింసా నిరోధ చట్టం లాగే బాల హింసా నిరోధ చట్టం వుందా ? లేకపోతే అలాంటి చట్టాల్ని తెచ్చి ఈ హింసనుంచి బాలల్ని కాపాడలేమా ? 

ఈ పరిస్థితికి కారణమెవరు ?
వ్యాపారం పేరుతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న చానల్స్ వారా ?
ఈ బాల హింసను నిరోధించలేని ప్రభుత్వమా ?
తమ పిల్లలతోనే వ్యాపారం చేస్తున్న తల్లిదండ్రులా ?

ఇప్పటి పరిస్థితి ఇదైతే గతంలో కొంతమంది బాల నటుల పరిస్థితి గురించి స్వామి చిత్రానం గా ప్రసిద్ధికెక్కిన కె. వి. రావు గారు కొంతకాలం క్రితం విజయచిత్రలో రాసారు. రావు గారు తెలుగు చిత్ర సీమలో సహాయ దర్శకుడిగా సుమారు అయిదు దశాబ్దాలు ప్రముఖ దర్శక నిర్మాత  బి.ఏ సుబ్బారావు గారి దగ్గర, బాపు గారి దగ్గర చాలా చిత్రాలకు సహకార దర్శకుడిగా, సహ దర్శకుడిగా పనిచేశారు. ఆయన తన అనుభవంలో చూసిన కొన్ని సంఘటనలను ఏర్చి కూర్చి రాసిన  వ్యాసం నుంచి కొన్ని భాగాలు....... 

 తన తల్లిని తండ్రి వదిలేసిన కారణంగా తాను నటించి తల్లిని పోషించాల్సి వచ్చింది ఒక బాలనటుడికి. బాల నటుడిగా అగ్రశ్రేణికి చేరాడు. ద్విపాత్రాభినయం కూడా చేసాడు. కానీ, చదువుకోలేదు. సెట్ లోకి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడే డైరెక్టర్ గారి పిల్లల్ని ( తన ఈడు వారిని ) చూసి సెట్ బయిటకు వెళ్లి " తాను స్కూల్ కు వెళ్ళడం లేదనీ, వాళ్ళలా ఇంగ్లీష్ మాట్లాడలేననీ భోరున ఏడ్చాడు. 
' చదువుకుంటున్న ఆ పిల్లలకన్నా నువ్వే గొప్ప - కొన్ని వేలమందికి తెరమీద కనబడి - వాళ్ళందర్నీ నువ్వు నవ్విస్తున్నావు ' అని ఓదార్చి షాట్ కి తీసుకెళ్ళాను.
************ 
షూటింగ్లో 11 గంటలకు పిల్లలందరికీ బిస్కట్లు, పాలు, హార్లిక్స్ ఇచ్చేవారు. ఓ బాలనటుడు- తనకిచ్చిన బిస్కట్లు తినకుండా దాచుకునేవాడు. ' ఎందుకయ్యా దాచుకుంటున్నావు  అని అడిగితే - 
' నాకు బిస్కట్లు వద్దండీ - పొద్దున్న టిఫిన్ తిన్నా కదండీ - ఇవి మా చెల్లాయికి  పట్టుకెడ్తానండీ ! ' అన్నాడు. 
' ఫర్వాలేదు - నువ్వు తినేయ్. వెళ్ళేటపుడు మీ చెల్లాయికి పట్టుకెళ్డువుగాని ' అని చెబితే అప్పుడు తిన్నాడు. 
' సార్ ! అతనికి షర్ట్ యిచ్చారు గదండి. నాకూ షర్టిప్పించండి "  అన్నాడు.
" నీ షర్ట్ బాగుంది. అంచేత నీ షర్ట్ మార్చలేదు. " 
" అది కాదండి. నాకు ఈ షర్ట్ ఒక్కటే వుందండీ - అందుకని " అని చెప్పాడు. 
ఇతను చెబుతున్నది నిజమేనా అని అతన్ని తీసుకువచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ సప్లయిర్ని అడిగాను. 
" నిజమేనండీ ! వీళ్ళ అమ్మని నాన్న వదిలేసాడు. తల్లినీ, చెల్లినీ పోషించాల్సింది వీడే - తల్లి కూడా అప్పుడప్పుడు వేషాలు వేస్తుంది. చెల్లెలు చదువుకుంటోంది. వీడు యాక్టు చేసి తల్లినీ, చెల్లెల్నీ పోషించాలి. చెల్లిని మాత్రం సినిమాలోకి దింపను. చదివిస్తాను అంటాడు " అని నిజం చెప్పాడు. ఆ కుర్రాడికి సరిపోయే రెండు షర్టులు చెల్లెలికి రెండు గౌన్లు యిప్పించాను.

*************   

ఎంతో చురుగ్గా వుండే అయిదేళ్ళ పాపని ఆమె తల్లినీ తండ్రినీ కాదని, తన దగ్గర వుంచుకుని ' బాలనటి ' ని చేసింది ఓ అమ్మమ్మ. ఒకరోజున ఆ పాప ' మొదటి టేకు ' ను ' ఓకే ' చెయ్యలేదు. అయినా చాలా బాగా చేసింది. 
ఆ రాత్రి మొదటి టేకు ఓకే  చేయలేదన్న కోపంతో ఆ పసిపాప కంట్లో అమృతాంజనం పెట్టింది అమ్మమ్మ. ఆ పాప ఒకటే ఏడుపు. అమ్మమ్మని చీవాట్లు పెట్టి, ఆ పాపను ఆ రాత్రి నాదగ్గరే పడుకో బెట్టుకున్నాను.

*********** 
ఓ నాడు ఓ పాప చెప్పింది.
' మా మ్మమ్మ నాకు పట్టు పరికిణీ, జూకాలూ, నెక్లెసూ, గాజులూ, అన్నీ తెస్తుంది. తెలుసా ? " అంది.
నిజమే అనుకుని సంతోషించాను. 
ఆ సాయింత్రం అమ్మమ్మ వచ్చింది - కారు నిండా ప్యాకెట్లే !
" వాటిలో ఆ పాపకోసం తెచ్చిన ఓ ఆర్ట్ సిల్క్ పరికిణీ, గిల్ట్ నగలూ వున్నాయి. మిగరావి అన్నీ ఆమె కోసం కొనుక్కున్న కంచి పట్టు చీరలూ, వెంకటగిరి నేత చీరలూ, ఆమె భర్తకోసం సేలం అంచు పంచెలూను !
*************
ఒక బాల నటుడు బాగా నటిస్తాడని తెలిసి, అతణ్ణి డైరెక్టర్ గారికి చూపించాలనుకున్నాను. ఆ కుర్రాడి తండ్రి -
" మా వాడికి రేపు 7 గం.లకే షూటింగ్ - 6 గం.లకి ఇంటి దగ్గర బయిల్దేరుతాం. మీరు 5 గం.లకి మాయింటికి రండి.ఆరు లోపల డైరెక్టర్ కి చూపించేసి, షూటింగ్ కి వెళ్ళిపోతాం " అన్నారు. 
" సరే " అని 5 గం.లకి వాళ్ళ యింటికి వెళ్ళాను. 
ఆ బాల నటుడు యింకా లేవలేదు. ( రాత్రి షూటింగ్ చాలా ఆలస్యమైందట )
నిద్రపోతున్న ఆ కుర్రాడిని అలాగే మోసుకెళ్ళి బాత్ రూం లో కుళాయి కింద కూలేసి కుళాయి తెరిచారు. అది శీతాకాలం. 
కొడుకుని నటుడిని చేయాలనా ? వాడిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనా ? ఆ తండ్రి వుద్దేశం అర్థంకాలేదు.

...................... ఎంతటి అభివృద్దో కదా ~ !!

తృష్ణ గారి ' ఏమిటో ఈ ఆట ?! ' టపా చదివాక ఎప్పటి నుండో రాయాలనుకుంటూన్న మనసులోని  ఆవేదన బయిటకు వచ్చింది.

Vol. No. 01 Pub. No. 254

14 comments:

Saahitya Abhimaani said...

రావుగారూ ప్రస్తుతం కొన్ని చానేల్సులో జరుగుతున్న దారుణం గురించి బాగా చెప్పారు. ఈ డాన్సు ప్రోగ్రాములు పద్నాలుగు సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ వారిని పాల్గొనకుండా నిషేధించాలి. పాపం ఆ పిల్లలచేత చేయించే విన్యాసాలు (డాన్సా అది??) చూస్తుంటే జుగుప్సాకరంగా ఉన్నాయి.

నిజమే బాల కార్మిక చట్టం ఏమయ్యింది. ఆ అధికారుల పిల్లలు కూడా ఈ చానేల్సులో గెంతటం లేదుకదా!!!

ఆ.సౌమ్య said...

మీ బాధనే నేనూ చాలా రోజులుగా పడుతున్నానండీ. మొన్న సుజాత గారి బ్లాగులో కూడా ఇదే విషయాన్నీ రాసాను. ఆ చిన్ని జీవితాలకి ఇప్పటినుండే పోటీతత్వం నేర్పించి వాళ్ల బతుకులతో ఆడుకుంటున్నారు. బడి, ఆటలు, చిన్నవయసు సరదాలు అనేవి వదిలేసి రోజులో 15-16 గంటలు శిక్షణ, ప్రాక్టీసు అని వాళ్ళ చిన్నరి జీవితాలని బలి తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు చేసే నృత్యాలనీ దిక్కుమలైన పాటలకే. ఆ పాటలకి అర్థాలు వాళ్లకి తెలుసో తెలియవో కూడా. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే, ఓరోరి యోగి నన్ను కొరికేయరో అని పాడుతూ నర్తిస్తూ,జుగుప్సాకరమైన హావభావ ప్రకటనలిస్తూ....హయ్యో ఈ మొగ్గలకి ఏం తెగులు పట్టిస్తున్నారో అనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకి బుద్ది ఎక్కడకిపోయిందో తెలియట్లేదు.

తృష్ణ said...

చాలా బాగా రాసారండీ.
టి.వీ కార్యక్రమాల్లో పాల్గొవటం ఒక ఎత్తైతే, పోటి రిజల్ట్స్ విని వాళ్ళు ఏడవటం మరో దుఖ్ఖ:కరమైన విషయం. చిన్న చిన్న పిల్లల్ని పాడించి,డాన్స్ చేయించి మరీ ఏడిపిస్తూఉంటారు...
మనం బ్లాగుల్లో మన ఆవేదనను మాత్రమే తెలుపగలము..
అధికారంలో ఉన్న పెద్దలెవరో ఒకరు కాస్త బాధ్యత తీసుకుని ఈ సమస్యను గురించి ఆలోచిస్తే బాగుంటుందని నాకనిపిస్తుందండీ.

SRRao said...

* శివ గారూ !
* సౌమ్య గారూ !
* తృష్ణ గారూ !

ధన్యవాదాలు

Padmarpita said...

పోస్ట్ చదివాక ఎందుకో మనసంతా భాధతో నిండింది.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

This is really pathetic. Can't we file a PIL on this issue?

Saahitya Abhimaani said...

పిల్ వెయ్యాలా. కోర్టువారూ చూస్తూనే ఉంటారుగా ఇటువంటి వెర్రి మొర్రి కార్యక్రమాలను. ప్రస్తుతం మీడియా పరిస్తితి ఎలా ఉందంటే కోర్టువారు వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచి "సువ్వొ మొటొ" గా కొన్ని కేసులు తమంతటతామే తీసుకుని, ఎక్జెంప్లరీగా కొన్ని తీర్పులు ఇవ్వాలి అప్పుడుగాని మీడియాకి పట్టిన ఈ జాడ్యం వదలదు.

ఊకదంపుడు said...

అవునండీ పిల్లవాడిని వయసుకు మించి పరిగెత్తిస్తే తప్పు, చిన్న తనంలోనే దొంగ స్వాములోరి వేషంకట్టిస్తే హక్కుల ఉల్లంఘన, అంతే కాని, ఇలా రెహార్సల్స్ అనీ , ప్రాక్టీస్ అని వేడించి, ఆ లైట్ల వేడిలో గంటలు గంటలు షూటింగ్ లో నిలబెట్టి, ఆనక నువ్వు ఓదిపోయావు, నువ్వు తప్పుచేశావు అని మాటలతో హింసిస్తే తప్పు కాదు

ఊకదంపుడు said...

అవునండీ పిల్లవాడిని వయసుకు మించి పరిగెత్తిస్తే తప్పు, చిన్న తనంలోనే దొంగ స్వాములోరి వేషంకట్టిస్తే హక్కుల ఉల్లంఘన, అంతే కాని, ఇలా రెహార్సల్స్ అనీ , ప్రాక్టీస్ అని వేడించి, ఆ లైట్ల వేడిలో గంటలు గంటలు షూటింగ్ లో నిలబెట్టి, ఆనక నువ్వు ఓదిపోయావు, నువ్వు తప్పుచేశావు అని మాటలతో హింసిస్తే తప్పు కాదు

SRRao said...

* వెంకట గణేష్ గారూ !
* శివ గారూ !
మీరు చెప్పిన విషయాలు నిజమే ! కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు ?

* ఊక దంపుడు గారూ !
తమకు ఉచితంగా పబ్లిసిటీ ఇస్తున్న మీడియా మీద యుద్ధం చెయ్యడానికి ఎన్ని గుండెలుండాలి ? అందుకని ఈ తెరవెనుక భాగోతాలను ఎవరూ తప్పు పట్టరు.

SRRao said...

పద్మార్పిత గారూ !
కొన్ని విషయాలు తెలియకుండా వుండటమే మంచిదేమో ! తెలిస్తే బాధ తప్పదు. ఆ ఆటల వెనుక జరిగే తంతు, దానికి బలయ్యే పిల్లల గురించి ప్రత్యక్షంగా తెలియడంతో పెద్దల ధన, కీర్తి దాహాలకు బలవుతున్న బాల్యాన్ని చూడలేక నాలో గూడుకట్టుకున్న ఆవేదన ఇలా బయిటకొచ్చింది. ఆ పిల్లల తల్లిదండ్రులు మారాలి తప్ప ఎవరూ ఈ పరిస్థితిని మార్చలేరని నా అభిప్రాయం.

Vinay Datta said...

I read in the newspapers that the Supreme Court gave a ruling barring children below the age of seven from participating in reality shows.

I know about the present situation but I'm shocked to know the plight of the yester year child artists. I didn't know all this. Aa pillalaki naa johaarlu. Paapam, entha kashta pettinaa, thera meeda adbhuthangaa natinchaaru.

hkpt said...

నేను ఇటీవల మాటీవీ లో వస్తున్న Super Singer 6 కార్యక్రమాన్ని కూడా ఇదే కోవలో చేర్చుతాను. 11-12 సంవత్సరాల బాలబాలికల చేత అశ్లీలమైన సినిమా పాటలు పాడిస్తున్న ప్రోగ్రాం అది. ఈ సీరీస్ లో పూర్వపు కార్యక్రమాన్ని చూసి, అందులో పలుకుతున్న కొత్త తెలుగు కంఠాలని మెచ్చుకోకుండా వుండలేక పోయాను. కానీ పోనుపోను కొత్త సినిమాల చవకరకం content పెంచుకుపోయారు దాని నిర్వాహకులు. ఇందుకు విరుద్ధంగా SPB గారు తన "పాడుతా తీయగా" కార్యక్రమాన్ని అత్యున్నత ప్రమాణాల్లో నడుపుతున్నారు. (మాకు ఈటీవీ రాదు, అది వేరే సంగతి). నిజానికి అలాటి TV కార్యక్రమం నభూతో నభవిష్యతి.

- తాడేపల్లి హరికృష్ణ

SRRao said...

హరికృష్ణ గారూ !
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఒక రూపాన్ని నిషేధిస్తే మరో రూపంలో మన ముందుకు తెస్తున్నారు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం