Showing posts with label అనుభవాలు. Show all posts
Showing posts with label అనుభవాలు. Show all posts

Sunday, May 13, 2012

క్షమాస్వరూపిణి

చిత్రం : శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన
మనకు జీవితాన్నిచ్చిన ...... 
ఆ జీవితానికి వెలుగు నిచ్చిన ....... 
ఆ  వెలుగుకో విలువనిచ్చిన ..... 
అమ్మకు మనమేం ఇవ్వగలం..... 
అమ్మ త్యాగానికి విలువేమి కట్టగలం.... 
అవసరం తీరాక, వయసు మళ్ళాక.....   
అంత శ్రద్ధగానూ చూసుకుని ఋణం తీర్చుకుంటే చాలు. 
ఏ  వృద్ధాశ్రమానికో, శ్మశానానికో అప్పగించకుండా వుంటే అదే పదివేలు. 

యాంత్రిక మవుతున్న, కుచించుకు పోతున్న  మనస్సులు సంవత్సరానికి ఒక్కసారైనా అమ్మని, ఆమె త్యాగాన్నీ  ఒక్కసారి మనసారా తలుచుకోవాలని కోరుకుంటూ ............    

 అమ్మలందరికీ మాతృ దినోత్సవ వందనాలతో.................... 


గతంలోని టపాలు : 


అమ్మంటే కమ్మని భావన
జానపద గీతం ఆమె స్వరంలో పదం పాడింది. అఖిలాంధ్ర శ్రోతల మనస్సులను పరవశింపజేసింది. ఆవిడే వింజమూరి సీత, అనసూయ జంటలో శ్రీమతి అనసూయ. 
మాతృ దినోత్సవం సందర్భంగా జానపద గీతాలకు తల్లి లాంటి ఆమెతో  పరిచయ  కార్యక్రమం శ్రీమతి దుర్గ డింగరి టోరి రేడియోలో పాటలపల్లకిలో ఈరోజు మధ్యాహ్నం గం. 12.30 నుండి గం. 02.30 వరకూ ( సమయంలో మార్పు జరిగింది ) నిర్వహిస్తున్నారు. విని అనందించండి......     




.

ఆమ్మకున్న అంతులేని సహనాన్ని, క్షమాగుణాన్ని వివరించే శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన గారి వ్యాసం చదవండి.......


క్షమాస్వరూపిణి 


          అమ్మ అన్న మాట తలుచుకోగానే మనసు ఆర్ద్రమై పోతుంది. కళ్ళు ఆమె పాదాల మీదకు వెళ్ళిపోతాయి, భావాలు పవిత్రతను సంతరించుకొని ఆమెకు అంకితమయి పోతాయి. కళ్ళు తెరిచిన క్షణం నుంచి కనిపించే దేవత  అమ్మ. అమ్మ అనే పదంలోనే క్షమాగుణం దాగి ఉందేమో ?  మా అమ్మకి విపరీతమైన సహనం, ఆ సహనం చూసి అవతల వాళ్ళు జుట్టు పీక్కొంటారు, ఇదెక్కడి సహనం బాబూ ! అని, కానీ మా అమ్మ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తన సహనాన్ని వదులుకోలేదు. సహనం వున్న వాళ్ళకే నిత్య జీవితంలో చిన్నవి, పెద్దవి సమస్యలు ఎదురౌతూ వుంటాయి. చిరునవ్వుతో వాటికి స్వాగతం పలుకుతూ వుంటారు.
              మా నాన్నగారి తండ్రి అయిదు ఊళ్ళు కరిణీకం చేసి ఆస్తిపాస్తులతో దర్జాగా పెరిగాడు. అన్నగారి దగ్గర అన్నిటికి " సరే “ " సరే " అనడంతో ఆస్తి అంతా హారతి కర్పూరం లాగా హరించుకుపోయింది. నలుగురికి పెట్టడం, నలుగురికి ఇవ్వడం అనే స్వభావం మాత్రం తాతయ్యకి ఊపిరి వున్నన్నాళ్ళూ వదలలేదు. నా చిన్నప్పుడు మేము బందరులో వుండే వాళ్ళం మేడమీద కాపురం. ఇల్లు అద్దెకిచ్చి బాడుగ తీసుకోవడమే  కానీ సౌకర్యాలు కల్పించడం ఇంటి వాళ్లకి అనవసరం. మాకు పైకి నీళ్ళు వచ్చేవి కావు. పంపు వుండేది. పని చేసేది కాదు. ప్రతి నీటి బొట్టు కిందనుంచి రావాల్సిందే ! పనివాళ్ళ సహాయం అంతంత మాత్రమే ! నాకు ఈ కష్టాలు తెలుసు కానీ సహాయం చేసే వయసు లేదు.   
                  మంచి ఎండాకాలం. మా తాతయ్య వచ్చాడు. బందరులోనే మా రెండో పెద్దనాన్న వుండేవారు. ఆయనకీ భార్య గతించింది. ముగ్గురు పిల్లలు. మా పెద్దనాన్నగారికి ఒక గురువుగారు వుండేవారు. ఆయన వైష్ణవ భక్తుడు. మా పెద్దనాన్న అన్ని వ్యవహారాలూ ఆయన సలహాతో చేసేవారు. అది మా తాతయ్యకి నచ్చేదికాదు. ఏదో విషయంలో మాటా మాటా వచ్చి తాతయ్య అక్కడికి వెళ్లడం మానేసాడు. మా పెదనాన్న వుండటం కూడా గురువుగారి ఇంట్లోనే అద్దెకుండేవారు.   
          సరే ! అసలు సంగతికి వద్దాము. ఆ రోజు మా ఇంటికి ఎవరో భోజనానికి వచ్చారు. మా అమ్మ వంటలు చేసి అలిసిపోయి, ఒక కునుకు తీసి లేచింది.  మాఇంట్లో మూడు పెద్దబిందె నీళ్ళు పట్టే గుండిగ వుండేది. దాంట్లో నీళ్ళు పట్టేవారు. మా అమ్మ లేచి ఆ గుండిగలో నీళ్ళు ముంచుకొందామని చెంబు లోపల పెట్టింది. నీళ్ళు బరువుగా లోప తగిలాయి తీరా చూస్తే గుండిగలో పొట్టు మినపపప్పు పోసివుంది. మా అమ్మ నన్ను పిలిచి " ఇదేమిటే ! దీన్నిండా మినపపప్పు వుంది, నువేమయినా పోసావా ? అంది. లేదమ్మా అన్నాను. తాతయ్యే పోసి ఉంటాడని అర్ధమయింది. తాతయ్యని పిలిచా ! తాతయ్య వచ్చి " గారెలు వండుతారని నేనే మినప పప్పు నీళ్ళల్లో పోసా ! “ అన్నాడు. మా  అమ్మకి నోట మాట రాలేదు కాని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఒక్కసారి నన్ను అడిగి పోయ్యవచ్చుగా అనుకొంది. దీనికి రెండు కారణాలు. పొట్టుపప్పు కడగటానికి నీళ్ళు ధారాళంగా కావాలి. నీళ్ళు లేవు. రెండోది పప్పురుబ్బటానికి ఆ రోజుల్లో ఎలెక్ట్రికల్ మిక్సీలు, గ్రైండర్లు లేవు. చిన్నసంసారం, చిన్నరోలు. రెండుశేర్ల పప్పు ఎప్పటికి రుబ్బగలదు ? మా అమ్మ సన్నగా రివటలా వుండేది. బలహీనురాలు. " ఇంత పప్పు ఎందుకు పోసారు ? " అంది ధైర్యం తెచ్చుకొని మా తాతయ్యకి రయ్యిమని కోపం వచ్చింది. తన పొట్టమీద చేత్తో కొట్టుకొంటూ " నా పొట్ట పెద్దదే ! కాస్తా కూస్తా చాలదు. నువ్వు రుబ్బకపోతే నే రుబ్బుతాలే ! “ అన్నాడు విసురుగా. అమ్మ కిందకి వెళ్లి నీళ్ళు తెచ్చి పప్పు కడిగింది. రుబ్బు పొత్రానికి పట్టుకొనేందుకు కర్ర పిడి వుండేది పొడుగ్గా, మా అమ్మ రుబ్బుతుంటే నేను ఆ కర్రపిడి పైనపట్టుకోనేదాన్ని. దానివల్ల మా అమ్మకి ఇబ్బంది అయేది, కానీ సహాయం తక్కువ. అందుకని అమ్మ రుబ్బుతుంటే పప్పు రోలు గుంత లోకి తోసేదాన్ని. ఘంటసేపటికి ఆ పప్పు రుబ్బటం అయింది. మా అమ్మ గారెలు చేసింది. తాతయ్యని పిలిచి గారెలు పెట్టింది. ఆయన ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని ఓ డజను గారెలు పెట్టించుకొని అవన్నీ ఒక విస్తరాకులో చుట్టి ఉత్తరీయంలో మూట కట్టాడు. మేం చూస్తూ నుంచున్నాము. “ చిన్నాడి ఇంటికి వెళ్లి వస్తానే " అని లేచాడు. “ మీరు తిని, తీసుకెళ్ళండి “ అంది అమ్మ. “ నే  తరవాత తింటానులే “ అన్నాడు తాతయ్య. “ తాతయ్యా ! నువ్వు  పెదనాన్న ఇంటికి వెళ్ళవుగా ! “ అన్నాను. “ సందు చివర నుంచుంటే ఏ మనమడో బయటికి వస్తాడుగా ! అప్పుడు ఇచ్చి వస్తా ! “ అని తాతయ్య వెళ్ళాడు. ఆయన ప్రేమకి జోహారులు అంది అమ్మ. కానీ తాతయ్యని ఏమీ అనలేదు. తరవాత రెండు రోజులు మా అమ్మ లేవలేదు. మా నాన్నగారికి ఇదంతా తెలిసి కోపం వచ్చింది కాని ఆయనా తాతయ్యని ఏమీ అనలేదు. మా అమ్మ సహనమే మా నాన్నగారి నోరు మూయించేదేమో ?     
                                ఈ సంఘటన గుర్తుకు వచ్చినపుడల్లా అనుకొంటాను. " అమ్మా ! నీ  సహనంలో  వందోవంతు వుంటే చాలమ్మా ! జీవితం శాంతంగా గడిచిపోతుంది " అని. మా అమ్మ ఏమిటి ? అమ్మలందరికి సహనం వుంటుంది. లేకపోతే అసహాయులైన పసిగుడ్డుని ఎంత ఓర్పుతో పెంచి పెద్దచేస్తుంది అమ్మ. అమ్మని అర్ధం చేసుకొని,  చేయించుకొన్న సేవని మర్చిపోకుండా కృతజ్ఞతలు చెప్పుకొంటూ అమ్మని ఆనందంగా వుంచుకోగలిగితే  బిడ్డల జీవితాలు ధన్యమవుతాయి.   



Visit web magazine at www.sirakadambam.com


 Vol. No. 03 Pub. No. 138

Friday, May 21, 2010

తుఫాను లీల



లైలా తుఫాను లీల ఈ రోజు సాయింత్రం వరకూ కొనసాగింది. ఇదే లైలా తుఫాను తిరిగి సముద్రంలోకి ప్రవేశించి ఒడిస్సా వైపు పయనించి మళ్ళీ తీరం తాకుతుందని, మరో తుఫాను ముప్పు పొంచి వుందని దానికి ' బంద్ ' అనే పేరు కూడా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న లైలా తీరం దాటిన విషయంలో కూడా అధికారుల మధ్య, మీడియాలోను గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో బాపట్ల దగ్గర  తీరం దాటినట్లు ఒక వార్తా ఛానల్ ప్రసారం చేస్తే కొన్ని చానెళ్ళు సందిగ్డంగానే ప్రకటించాయి. దానికి ముందు వరకూ మచిలీపట్టణం దగ్గర తీరం దాటే అవకాశం అధికంగా వుందని వార్తలు పదే పదే ప్రసారమయ్యాయి. ఆ ప్రాంతంలో ప్రజలకు సహాయం అవసరమవుతుందని వెళ్ళిన మాకు అక్కడ దాదాపుగా ప్రశాంత వాతావరణం ఎదురయ్యింది. అప్పుడప్పుడు కొద్దిగా గాలి, కొద్దిగా వర్షం మాత్రమే అక్కడ కనబడింది. గ్రామాలన్నీ అధికారులు ముందే ఖాళీ చేయించడంతో ప్రశాంతంగా వుంది. తుఫాను ముందు ప్రశాంతత ఏమో అనుకున్నాం. కాసేపటికి బాపట్ల దగ్గర తీరం దాటిందని, కాదు ఒంగోలు దగ్గర దాటిందని రకరకాల వార్తలు వచ్చాయి. దేశమంతా కలవరపడుతున్నా తుఫానులకు అలవాటు పడ్డ మచిలీపట్టణం ప్రజలు ఎప్పటిలాగే వాళ్ళ దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోయున్నారు. తుఫాను గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదనిపించింది. ఆది నిజమేమో కూడా ! ప్రతి సంవత్సరం ఎదురయ్యే పరిస్థితి ఇది.

కోస్తాప్రజల జీవితాల్లో తుఫానులు, వరదలు వాటితో వచ్చే నష్టం కూడా ఒక భాగమైపోయాయి. ప్రజల బలహీనతలతో ఆడుకునే రాజకీయనాయకులకి, వాళ్ళను గుడ్డిగా అనుసరించే అమాయక ప్రజలకు సస్యశ్యామలంగా కనిపించే కోస్తాయే కనబడుతుంది. ప్రతి సంవత్సరం ఇలా రెక్కల కష్టం కొంత ప్రకృతి పాలబడితే, మరికొంత నాయకుల అండతో చక్రం తిప్పే దళారుల పాలవుతుంటే ఎవరు కాపాడుతున్నారు ? అమాయక ప్రజల మధ్య ప్రాంతీయ, కుల, మత బేధాలు రెచ్చగొట్టే నాయకులకు ఈ కష్టం ఏం అర్థమవుతుంది ?  ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు ఏ ప్రాంతం పరిస్థితులు, కష్టాలు వారివి. ఒక ప్రాంతం పచ్చగా వుందని, మరొక ప్రాంతం ఎండిపోయిందని - ఒక ప్రాంతం ప్రజలు సుఖపడిపోతున్నారని, మరొక ప్రాంతం ప్రజలు కష్టపడిపోతున్నారని అనుకోవడం మన అజ్ఞానమే కానీ మరేదీ కాదని అప్పుడప్పుడు ఇలా ప్రకృతి మనకు గుర్తు చేస్తుంది.

ఇక ప్రస్తుతానికి వస్తే తీరం దాటిందో లేదో తేలని స్థితిలో రాబోయే విపత్తుని ఎదుర్కోవడానికి వేచి చూస్తున్న మాకు తీరం దాటిన విషయం మీద ఖచ్చితమైన వార్త సాయింత్రం ఆరుగంటల తర్వాత చేరింది. మరో గంట అక్కడే వుండి ఇక ఏ భయం లేదని తేలిన తర్వాత వెనుదిరిగాము. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిందనుకున్న ఈ రోజుల్లో కూడా ఈ సందిగ్ధత, పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, అసలే అయోమయంలో వున్న ప్రజల్ని గందరగోళ పరిచే విధంగా ఎందుకున్నాయి అనే విషయం అర్థం కావడం లేదు.

1990 మే 9 వ తేదీ మచిలీపట్టణం దగ్గర తీరం దాటిన పెను తుఫాను  కృష్ణా జిల్లాలో, విజయవాడ నగరంలో విధ్వంసం సృష్టించింది. అప్పుడు ఇప్పుడున్నంత పటిష్టమైన సమాచార వ్యవస్థ లేదు. తుఫాను పరిస్థితి తెలుసుకోవాలంటే రేడియో, దూరదర్శన్ మాత్రమే ఆధారం. అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ లాంటివేవీ లేని రోజులవి.  ముందు రోజు వాతావరణ నివేదిక ప్రకారం చెప్పిన సమయానికి, ప్రదేశానికి కొంచెం అటూ, ఇటూగానే తీరం దాటడం జరిగేది. సెల్ ఫోన్ అంటే అసలే తెలీదు. నగరాలలోనే ఎస్టీడీ ఫోన్ బూత్ లు రెండు, మూడు కిలోమీటర్లకు ఒకటిగా ఉండేవి. తుఫానులో చిక్కుకున్న ప్రాంతాల్లో వున్న వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో హైదరాబాద్ గాంధీనగర్లో ఉండే మాకు దరఖాస్తు చేసి ఆరునెలలైనా ఫోన్ రాలేదు. దగ్గరగా ఉండే ఎస్టీడి బూత్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండేది. అక్కడ మామూలు రోజుల్లోనే టోకెన్ పధ్ధతి ఉండేది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాలా ? మన వంతు వచ్చినా సాంకేతికంగా ఇంత అభివృద్ధి లేకపోవడం, తుఫాను తాకిడి ప్రాంతాలలో కేబుల్స్ తెగిపోవడం లాంటి కారణాలవలన అంత సులువుగా కావాల్సిన నెంబర్ దొరికేది కాదు. ఆ సమయంలో ప్రైవేటు టెలిఫోన్ సంస్థల పోటీ లేదు. అయినా మన టెలిఫోన్ శాఖ తుఫాను సమాచారం తెలుసుకోవడానికి అప్పట్లో చక్కని అవకాశం కల్పించింది. తుఫాను తాకిడి ప్రాంతాలకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది. అప్పట్లో ఇన్ని కస్టమర్ సర్వీసు కేంద్రాలు లేవు. మాకు దగ్గరలో చిక్కడపల్లిలో ఉండేది. అక్కడ మూడు ఫోన్లు కాబోలు ఉండేవి. ఈ సౌకర్యం గురించి తెలియగానే వెళ్ళడం వలన మాకు తేలిగ్గానే అవకాశం వచ్చింది. కాకపోతే షరా మామూలే ! లైన్లు దొరకడం కష్టమయ్యేది. ప్రయత్నించి, ప్రయత్నించి చాలాసేపటికి క్షేమ సమాచారాలు తెలుసుకోగలిగాం ! అయితే ఒకసారి సమాధానం రాకపోతే తర్వాత వారికి అవకాశమిచ్చి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించడం లాంటి స్వీయ నియంత్రణ పాటించడం వలన జనం ఎక్కువగా వచ్చినా అందరికీ అవకాశం దొరికేది.  

ఎలక్ట్రానిక్ మీడియా కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని పెద్దది చేసి చూపి ప్రజలను ఆందోళనకు గురిచేసిందా లేక వాళ్ళు అలా చెయ్యడం వలన ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో ఉందా అంటే చెప్పడం కష్టం. దీంట్లో మంచి చెడులు నిర్ణయించే కంటే ప్రజలు కొంత ఆందోళన కలిగినా ప్రభుత్వపరంగా విపత్తు జరిగాక చేపట్టే సహాయ చర్యలకంటే ఎక్కువ ముందు జాగ్రత్త తీసుకున్నట్లు కనిపించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధపడే ప్రజలందర్నీ తమ ఏర్పాట్లతోను, ముందు జాగ్రత్త చర్యలతోనూ తృప్తి పరచడం సాధ్యం కాకపోయినా కోస్తా ప్రాంతమంతా సహాయ చర్యల్లో పాల్గొని నిజంగా భయపడినంత పెనుతుఫాను ముంచుకొచ్చినా ప్రాణనష్టం తగ్గించేందుకు నిద్రాహారాలు మాని కృషి చేసిన ప్రభుతోద్యోగులు అభినందనీయులు. ఈ మూడు రోజులు వారి కృషికి కరుణించిందేమో తుఫాను కూడా తలవోగ్గింది. ఒడ్డున కూర్చుని చెప్పడం చాలా సులువు. ముఖ్యంగా తీరప్రాంతంలో ప్రాణాలకు తెగించి ఎవర్నీ సముద్రంకేసి వెళ్ళనివ్వకుండా గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు, ప్రమాద నివారణా విభాగ సిబ్బంది సేవలు నిరుపమానం. భయంగోల్పుతున్న కెరటాల అంచున వున్నది వాళ్ళే ! ఉపద్రవం వస్తే మొదట బలయ్యే అవకాశం వున్నది వాళ్ళకే ! అందుకే వారి సేవలకు జోహార్లు.

పెనుముప్పు జరగబోతోందని భయపెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసి తీరం దాటకుండా, ఎక్కడ దాటుతుందో, అసలు దాటిందో లేదో అర్థం కాకుండా, దాటాక ఎటు మళ్ళుతొందో అర్థం కాక చాలాసేపు దోబూచులాడిన ఈ లైలా తుఫాను లీల ఇక్కడితో పూర్తయిందా ? మరో తుఫాను రూపంలో మళ్ళీ వస్తుందా ? చూడాలి. 

Vol. No. 01 Pub. No. 293

Tuesday, May 18, 2010

భవిష్యత్తుకు బీజాలు

ప్రతి మనిషి ప్రవర్తనకు, జీవన శైలికి అతని బాల్యంలోని సంఘటనలే కారణమవుతాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలోను కొన్ని స్వంత ఇష్టాలు, అభిరుచులు వుంటాయి. అయితే అవి ఏర్పడడానికి బీజాలు మాత్రం బాల్యంలో వుంటాయి.   సాధారణంగా చిన్నతనంలో పిల్లలు తమ తల్లిదండ్రుల్ని అనుకరిస్తారు. కాస్త ఊహ తెలిసాక తమ చుట్టూ వుండే పరిసరాలు, పరిస్థితులలోంచిగానీ, వ్యక్తుల ప్రభావం వలన గానీ ఈ ఇష్టాలు, అభిరుచులు ఏర్పరుచుకోవచ్చు.

ఉదాహరణకు ఒక డాక్టర్ పిల్లలు ఆడుకునే ఆటల్లో సాధారణంగా హాస్పిటల్ కి సంబంధించిన ఆటలు ఆడుకోవచ్చు. లేదా ఏదో కారణం వలన తరచుగా ఆస్పత్రికి వెళ్లి వచ్చే పిల్లలు కూడా తమకు బాగా పరిచయమైన ఆస్పత్రి, డాక్టర్ ఆటలు ఆడుకోవడానికి ఉత్సాహం చూపవచ్చు. మా చిన్నతనంలో డిటెక్టివ్ పుస్తకాలు ఎక్కువగా వస్తుండేవి. అవి చదవడం అలవాటయ్యాక మేము అప్పుడప్పుడు ఆ కథల్ని ఆటలుగా ఆడుకునేవాళ్ళం. మంచి నాటకం చూస్తే స్నేహితుల్ని పోగేసి ఇంట్లోనే తెరలు కట్టి అవే నాటకాల్ని మాకు తోచిన రీతిలో ప్రదర్శించేసేవాళ్ళం. సినిమా చూసి వచ్చాక కొద్దిరోజులు ఆ సినిమాలో పాటల్ని, ఫైట్లనీ అనుకరించేవాళ్ళం.

ఇలా నా అభిరుచులకి, ఇష్టాలకి మూలమైన పరిస్థితులు, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి నా స్వ ' గతం ' పేజీలో వేసవి ముచ్చట్లలో ............... 

Vol. No. 01 Pub. No. 290

Sunday, April 25, 2010

వేసవి ముచ్చట్లు

అందరికీ వేసవి సెలవలిచ్చేసారు. పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ అమ్మమ్మలు, మామయ్యలు, అక్కలు, బావలు వగైరా బంధువుల ఇళ్ళకి ప్రయాణమవుతుంటే పెద్దలు సంవత్సరమంతా తినడానికి ఉపయోగించే ఊరగాయ పచ్చళ్ళు తయారీలో మునిగిపోతారు. ఇది ఒకప్పటి మన జీవనచిత్రం.






ప్రస్తుతం రెడీమేడ్ గా దొరుకుతున్న పచ్చళ్ళు మన డైనింగ్ టేబుల్ ని అలంకరిస్తున్నాయి.  ఇంకా అప్పటి తరం వాళ్ళుంటే మాత్రం అప్పటి పద్ధతుల్లో కారం దంపించడం, నూనె ప్రత్యేకంగా గానుగ ఆడించడం చెయ్యకపోయినా బజార్లో రెడీ గా దొరికే కారాలు, నూనెలు వగైరా తెచ్చుకుని సమ పాళ్ళలో కలుపుకోవడం ఇప్పటికీ కనబడుతుంది.  వేసవి కాలంలో ఊరగాయ పచ్చళ్ళు పెట్టడం ఒక గతకాలపు జ్ఞాపకం. అప్పుడది ఇంటిల్లపాదికీ పని. సంవత్సరమంతా అన్నంలోకి ఒక మధురమైన ఆధరువు.




అలాగే వేసవి సెలవలు పిల్లలకు ఆటవిడుపు. ఇప్పట్లా పోటీ చదువులు, వేసవి శిక్షణా శిబిరాలు తెలియని రోజుల్లో ఆ సెలవలకు బంధువుల ఇళ్ళకు వెళ్ళడం, ఆ సెలవలన్నీ ఆట, పాటలతో ప్రకృతిమాత  ఒడిలో గడిపి వేసవి తాపాన్నుంచి ఉపశమనం పొందడం, బడులు తెరిచే సమయానికి కొత్త శక్తితో రావడం............ ఇదంతా గత తరం జ్ఞాపకాలే ! అప్పటి నా ముచ్చట్లు   స్వ ' గతం ' పేజీలో రాస్తున్నాను. ఒక్కసారి ఆ పేజీ తెరవండి.  ఆ ముచ్చట్లు పంచుకోండి.  

Vol. No. 01 Pub. No. 268

Wednesday, October 7, 2009

పెను ఉత్పాతాలు- నా అనుభవాలు

మన రాష్ట్రంలో పెను ఉత్పాతాలుగా చెప్పుకునే రెండు వైపరీత్యాల్లో నా అనుభవాలు.
1. 1977 నవంబర్ 19 తేదీన సంభవించిన దివిసీమ ఉప్పెన
అర్థరాత్రి
- కృష్ణ , గుంటూరు జిల్లాల ప్రజలకు కాళరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా సముద్రం ఒక్కసారిగా విరుచుకుపడింది. అధికారిక లెక్కల ప్రకారం 10,౦౦౦ మంది శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. అనధికారిక లెక్క లక్ష పై మాటే ! ఎక్కడచూసినా గుట్టలుగా మనుష్యుల, పశువుల శవాలు. ఎటు తిరిగినా కూలిపోయిన ఇళ్ళూ, చెట్లూ!! దృశ్యం వర్ణించలేను. తమ కళ్ళ ముందే మనుష్యుల్ని, పశువుల్ని తాడిచెట్టు పరిమాణానికి ఎగరవేస్తుంటే..... బాధితులు చెబుతుండగా వింటుంటేనే నాకు ఒళ్ళు జలదరించింది. మరి స్వయంగా చూసిన వాళ్ల పరిస్థితి..... ....? 20 తేదీన దివిసీమ చేరే దారిలేక గుంటూరు జిల్లాలో బాపట్ల ప్రాంతానికి అతి కష్టం మీద చేరుకోగలిగాను. బీభత్సకర దృశ్యాల్ని చూసి మనసు కకావికలమై పోయింది దివిసీమ వెళ్లాలనుకున్నా ధైర్యం చాలక వెనుదిరిగాను.
2. 1986 ఆగష్టు నెల లో గోదావరికి వచ్చిన వరద
ఆగష్టు
15 తేదీ స్వాతంత్ర్య దినోత్సవం. జెండా వందనం జరిగింది. అప్పుడే ఒక మిత్రుడు కబురు మోసుకొచ్చాడు. గోదావరి ఉప్పొంగి మా కోనసీమను చుట్టుముట్టిందని. ఉభయ గోదావరి జిల్లాల్లో మెట్ట ప్రాంతాలు తప్ప మిగిలిని ప్రాంతమంతా జలదిగ్భంధమైపోయింది . అప్పటికి వారం రోజులనుండి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆరోజే తెరిపిచ్చాయి. రెండురోజులుగా వరద హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. అయితే వర్షాలు, వరదలూ అలవాటైపోయిన ప్రజలు అది మామూలు విషయంగానే తీసుకున్నారు. అదీకాక ఇంతటి సమాచార వ్యవస్థ అప్పుడులేదు. రేడియోనే ఆధారం. అదికూడా చాలా తక్కువమందికే ఉండేది. వరద తీవ్రత సమాచారం ప్రజలకి చేరకముందే వరద చేరిపోయింది. లంక గ్రామాలన్నీ ముంచేసింది. అంతకంతకూ పెరుగుతున్న ప్రవాహం మధ్యనుంచి ఇళ్ళ పైకప్పులమీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ప్రజల్ని ఒడ్డుకి చేర్చటం గగనమైపోయింది. అక్కడక్కడా పాక్షికంగా మునిగిపోయిన ఇళ్లలోని జనం తమ ఆస్తుల్ని వదిలి రావడానికి మొండికేసేవారు. వాళ్ళని బ్రతిమాలి, మొండికేస్తే బెదిరించి సురక్షిత ప్రదేశాలకు తీసుకురావలసి వచ్చేది. రహదారులన్నీ తెగిపోయాయి. రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ కుప్పకూలాయి. స్థంబాలు నేలకోరగటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గట్లు తెగిపోకుండా యువకులు, పోలీసులు, రెవిన్యూ సిబ్బంది కలిసికట్టుగా కాపలాకాసి కొన్ని గ్రామాలను కాపాడగలిగారు. అప్పటి అమలాపురం ఆర్డీవో శ్రీ సుబ్రహ్మణ్యం గారు యువకుడు. సాహసి. విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్న గోదావరిలోకి అందుబాటులో ఉన్న మామూలు నాటు పడవలో వెళ్లి మునిగిపోతున్న ఊరిని, ప్రజల్ని రక్షించడం, స్ఫూర్తితో నాలాంటి యువకులు సహాయకార్యక్రమాల్లోకి స్వచ్చందంగా దిగిపోవడం నేనింకా మర్చిపోలేను. పోలీస్, రెవిన్యూ వైర్లెస్, ఇలాంటి వైపరీత్యాలు సంభవించినపుడు అత్యవసరంగా ఉపయోగించే టెలీ కమ్యూనికేషన్స్ వారి వైర్లెస్ తప్ప మరే ఇతర సమాచార వ్యవస్థ పనిచేయకపోయినా, ఎక్కడైనా సమస్య ఉందని ఏరకమైన సమాచారం అందినా వారి సిబ్బందితో బాటు మమ్మల్ని కూడా సిద్ధం చేసి తక్షణం అక్కడ ప్రత్యక్షమయ్యే వారు. రహదారులు వరద నీటితో నిండిపోయి, గండ్లు పడి వాహనాలు వెళ్ళే పరిస్థితి లేని చోట కాలినడకన నీటిలో వెళ్లి రక్షణ కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం. ప్రభుత్వాధికారులు రాలేదనే మాట ఎక్కడా వినపడేది కాదు. ఆయన ఇప్పుడేక్కడున్నారో ? అలాంటి అధికారులుంటే ఉద్యోగులకే కాక, ప్రజలకు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉత్సాహం ఉంటుంది. గోదావరి చరిత్రలో అతి పెద్ద వరదలవి. గణాంకాలు సరిగా గుర్తులేదుగానీ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర వచ్చిన కృష్ణానది నీటిమట్టం కంటే కాటన్ బ్యారేజీ దగ్గర కొంచెం ఎక్కువగానే వచ్చినట్లు గుర్తు. ఇప్పటిలా నీటి ప్రవాహాన్ని నియత్రించే పరిస్థితి లేకపోవడం దీనికి కారణం కావచ్చు. ప్రస్తుతం సుమారుగా స్థాయి వైపరీత్యాన్ని దగ్గరుండి చూస్తున్న నాకు అప్పటి అనుభవాలు గుర్తుకొచ్చాయి. అయితే ఒక్క విషయం అలా స్పూర్తినిచ్చే అధికారులు ఇప్పుడు అంతగా కనబడడంలేదు. యువకుల్లో యాంత్రికత పెరిగిందేమోననిపిస్తోంది. కృష్ణా వరదల్లో స్వచ్చందంగా సహాయ కార్యకమాల్లో పాల్గొన్న దాఖలాలు అంతగా కనబడలేదు. ఎవరో వచ్చి కాపాడుతారులే మనకెందుకు అనే నిర్లిప్త కనబడుతోంది. ప్రభుత్వోద్యోగులు కూడా మనుష్యులే ! ఇంతటి విపత్తు సంభవించినపుడు పరిమిత సంఖ్యలో వుండే ప్రభుత్వోద్యోగులు మీదనే ఆధారపడకుండా మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలనే ఆలోచన ప్రజల్లో ముఖ్యంగా యువకుల్లో ఉండాలి. స్ఫూర్తి ఉంటే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు.
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం