Saturday, October 31, 2009

తెలుగు తల్లి పూదండ

మన తెలుగు తల్లికి మరోసారి మల్లె పూదండను అర్పిస్తూ.... ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

భారత ఉక్కు మహిళ

మన మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాందీ వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ... ఈ చిన్ని ప్రయత్నం. చూడండి.


Friday, October 30, 2009

కనుక్కోండి చూద్దాం !

ఈ నవరత్నాలు ఎవరో చెప్పగలరా? ప్రయత్నించండి ?

Thursday, October 29, 2009

ప్రముఖుల హాస్యం

* షెర్లాక్ హోమ్స్ అంటే ఆంగ్ల సాహిత్యంతో సంబంధం లేని వారికి కూడా తెలిసి ఉంటుంది. అపరాధ పరిశోధనలో అజరామయమైన పాత్ర. ఆ పాత్ర సృష్టికర్త కానన్ డయాల్. ఎంత గొప్పవారైనా కొన్ని భయాలకు, బలహీనతలకు అతీతులు కారు. కానన్ దయాల్ కి తనకు ఆత్మలతో సంభాషించలిగే శక్తి ఉందనే భావన ఉండేది. అది నిజమో, భ్రమో తెలియదు.
ఒకసారి ఒకాయన ఆయన్ని కలిసి " మొన్న మీ మిత్రుడు చనిపోయాడుగా ! అతని ఆత్మతో మాట్లాడేరా ? " అని అడిగాడు. దానికి కానన్ " లేదు. ఎవరి ఆత్మతోనైనా మాట్లాడతాను గానీ వాడి ఆత్మతో మాత్రం మాట్లాడను " అన్నాడు. కారణమేంటన్నాడాయన. " ఆ ! ఏముందీ ! ఆ మధ్య మా ఇద్దరి మధ్య గొడవోచ్చింది. మాటలు లేవు. ఇంకెలా మాట్లాడతాను ? " అన్నాడు కానన్ డయాల్ .
* స్టాలిన్ సోవియట్ రష్యా నియంత. సాధారణంగా నియంతలకు అభద్రతా భావం అధికంగా ఉంటుంది. అందుకే వాళ్లు గూఢచారి వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఒకసారి ఆయన తన గూఢచారి వ్యవస్థ పనితీరు ఎలా ఉందో పరీక్షించాలనుకున్నాడు. ' స్టాలిన్ స్వార్ధపరుడు. అతను మన జాతిని నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకున్నాడు. అతని ఆకృత్యాలను అడ్డుకోవాలి ' ఇలా విప్లవ ధోరణిలో ఒక కరపత్రం రహస్యంగా విడుదల చేయించాడు. స్వామి భక్తులైన గూఢచారులు ఆ కరపత్రాన్ని స్టాలిన్ దగ్గరకు పట్టుకొచ్చారు. అది చూసి ఆయన గూఢచార విభాగాదిపతిని " ఇందులో ఎవరి హస్తం ఉందో కనుక్కున్నారా ? " అని అడిగాడు. అందుకతను " మీ గురించి మీ కంటే బాగా తెలిసున్న వారెవరూ లేరుగా ? అలాంటప్పుడు వేరొకరి హస్తం ఎలా ఉంటుంది ? మీ హస్తం తప్ప ! " అన్నాడు.

*
ప్రముఖ ఆంగ్ల రచయిత మార్క్ ట్వేన్ ఒకసారి ఒక ఊళ్ళో హాస్య ప్రసంగ కార్యక్రమానికి వెళ్ళాడు. అక్కడి ప్రజలు తన ప్రసంగం పట్ల ఎంత ఆసక్తితో ఉన్నారో తెలుసుకోవాలనిపించింది. సామాన్యుడిలాగా ఒక షాప్ కి వెళ్ళాడు. షాపతనితో ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ " ఈ ఊరికి కొత్తగా వచ్చాను. సాయంత్రం కాలక్షేపానికి ఏదైనా కార్యక్రమం ఉందా ? " అని అడిగాడు. అందుకా షాపతను " ఆ ! ఉంది. మార్క్ ట్విన్ అని ఒకాయన ఉపన్యాసం ఉంది " అన్నాడు. అంతే ! మార్క్ కి సామాన్య ప్రజల్లో కూడా తనకు పలుకుబడి ఉన్నందుకు చాలా ఆనందం కలిగింది. " ఆయన ఉపన్యాసం అంత బాగుంటుందా ? నీకేలా తెలుసు ? " అని అడిగాడు. దానికా షాపతను " ఎందుకు తెలియదూ ? ఇవాళ నా షాపులో కోడిగుడ్లన్నీ ఇట్టే అమ్ముడయిపోయాయి కదా ! " అన్నాడు.

* ప్రముఖ ఆంగ్ల కవి జాన్ మిల్టన్ భార్య చాలా అందగత్తె. అదే విషయాన్ని అతని మిత్రుడొకరు చెప్పబోతూ కవికి కవితా ధోరణిలోనే చెప్పాలనుకున్నాడేమో " నీ భార్య గులాబీ పువ్వంత అందంగా ఉంది. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి " అని పొగిడాడు.
దానికి మిల్టన్ " నిజమేనేమో కానీ ఆ గులాబీ అందం, సొగసూ ఆస్వాదించలేక పోతున్నాను. అయితే దాని చుట్టూ ఉన్న ముళ్ళ కాఠిన్యం మాత్రం అనుభవిస్తున్నాను " అన్నాడు. మిల్టన్ అంధుడు. ఆయన భార్య గయ్యాళి.

సైకో


పై సన్నివేశం ' సైకో ' ఆంగ్ల చిత్రంలోనిది. ఆ చిత్ర సృష్టికర్త అల్ఫ్రెడ్ హిచ్ కాక్ అని సినిమా ప్రేమికులకు వేరే చెప్పనవసరం లేదు. భయానక దృశ్యాలు, సస్పెన్స్ సంఘటనలు అనగానే ప్రపంచమంతటికీ గుర్తుకొచ్చేది హిచ్ కాకే ! ఈ బాత్ రూం మర్డర్ దృశ్యాన్ని ఇంత భయంకరంగా చిత్రించగలిగేది హిచ్ కాక్ కాక మరెవరు? అనేది సాధారణంగా అందరి అభిప్రాయం.

కానీ ఈ దృశ్యాన్ని మాత్రం ఆయన చిత్రీకరించలేదు. ఇది నిజం! హిచ్ కాక్ జీవిత చరిత్ర రాస్తున్న డోనాల్డ్ స్పాటో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఈ విషయం గురించి వివరించారు. హిచ్ కాక్ దగ్గర గ్రాఫిక్ డిజైనర్ గా పని చేసే శామ్యూల్ బాస్ అనే అతను ' సైకో ' చిత్ర కథా చర్చల్లో పాల్గొనేవాడు. ఆ చర్చల్లో ఈ సన్నివేశం చిత్రీకరణ విధానాన్ని అతను తన సృజనాత్మకతను జోడించి వర్ణించాడు. అది హిచ్ కాక్ కి నచ్చింది. అందుకే ఆ దృశ్య చిత్రీకరణను శ్యామ్యూల్ కే అప్పగించి తను పరిశీలిస్తూ ఉండిపోయాడు. అలా సంచలనం సృష్టంచిన ఆ సన్నివేశం హిచ్ కాక్ చేతిలో కాక అతని శిష్యుని చేతిలో రూపు దిద్దుకుంది. ఈ విషయం గురించి శ్యామ్యూల్ వివరిస్తూ ' శిష్యులకి ఎలా శిక్షణ ఇవ్వాలో , వారినెలా తీర్చిదిద్దాలో మా గురువుగారికి బాగా తెలుసు. అందుకే చివరిదాకా మేము ఆయన్ని వదలి వెళ్ళలేదు ' అన్నాడు. గురువులకే పంగనామాలు పెట్టే శిష్యులున్న ఈ రోజుల్లో ఇలాంటి శిష్యుల్ని సంపాదించుకున్న హిచ్ కాక్ ఎంత అదృష్టవంతుడో కదా !

*
సినిమాల్లో సస్పెన్స్ గురించి హిచ్ కాక్ వ్యాఖ్య " సినిమాలో అకస్మాత్తుగా బాంబు పేలితే అది ఆశ్చర్యం. కానీ మరో అయిదు నిముషాల్లో పేలబోతోందని ప్రేక్షకులకు తెలిసి, ఆ చిత్రంలోని హీరో కి మాత్రం తెలియకపోతే అది సస్పెన్స్ "

విజయవాడ అగ్నిహోత్రావధానులు

గురజాడ అప్పారావు గారి అగ్నిహోత్రావధానులుది విజయనగరమా ? విజయవాడా ? గురజాడ గారి ప్రకారం విజయనగరమే ! పి. పుల్లయ్య గారి ప్రకారం విజయవాడ ! 'కన్యాశుల్కం' నాటకంలో అగ్నిహోత్రావధానులు ఒక పాత్రయితే ' కన్యాశుల్కం ' చిత్రంలో అది పాత్ర కాదు. సజీవమూర్తి. ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన నటుడు విన్నకోట రామన్న పంతులు. ఆ చిత్రం చూసిన వాళ్లకు ఆయన అసలు పేరు గుర్తులేదు. ఆయన పేరు అగ్నిహోత్రావధానులు. అంతే ! విజయవాడలో రామన్న పంతులు గారు వృత్తి రీత్యా వకీలు. ప్రవృత్తి రీత్యా నటుడు, దర్శకుడు మరెన్నో !
' పాతాళ భైరవి ' చిత్ర శతదినోత్సవం విజయవాడ లో వైభవంగా జరిగింది. ఆ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణ ' నాటకం ' అనే నాటకం. ఈ ' నాటకం ' నాటకీయంగా సినిమా రంగానికి కొందరు పెద్దమనుషుల్ని అందించింది. ఆ నాటకం చూసిన పాతాళ భైరవి దర్శకుడు కే. వి. రెడ్డి గారు తమ ' పెద్దమనుషులు ' చిత్రం ద్వారా ఆ నాటక రచయిత డి. వి. నరసరాజు గార్ని, నటుడు రామచంద్ర కాశ్యపను హీరోగానూ పరిచయం చేశారు. కానీ అదే నాటకంలో మరో ప్రధాన పాత్ర పోషించిన మన లాయర్ గారికి అప్పుడు పిలుపు రాలేదు. తర్వాత కాలంలో కె. వి. రెడ్డి గారు అన్నపూర్ణా వారికి ' దొంగ రాముడు ' మొదలుపెట్టినపుడు రామన్న పంతులు గారికి పిలుపు వచ్చింది. అందులో జగ్గయ్యకు అన్నయ్యగా వేషం దొరికింది. ' కన్యాశుల్కం ' చిత్రం ఆయనకు ఎంతో ఖ్యాతి తెచ్చి పెట్టింది. అయినా ఆయన తన వృత్తిని, ఊరిని వదులుకోలేదు. ముఖ్యంగా రంగస్థలాన్ని అసలు వదలలేదు. అయితే ఆయన నటన అంటే అభిమానం ఉన్న సినిమా రంగం ఆయన్ని పూర్తిగా వదులుకోదలచలేదు. రామన్న పంతులు గారు తన నటనా వైదుష్యం వాహినీ వారి ' బంగారు పాప ' , అన్నపూర్ణా వారి ' చదువుకున్న అమ్మాయిలు ' , భరణీ వారి ' బాటసారి ' , బాపు గారి ' సాక్షి '. ' బంగారు పిచిక ' మొదలైన చిత్రాల్లో ప్రదర్శించారు. ఆయన ఎన్ని వేషాలు వేసినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ ఆయన విన్నకోట రామన్న పంతులు కాదు నులక అగ్నిహోత్రావదానులే !
Wednesday, October 28, 2009

జగమే మాయ


1953 లో వచ్చిన దేవదాసు చిత్రానికి సంగీత దర్శకుడు సి. ఆర్. సుబ్బురామన్ అని సినిమా సంగీత ప్రియులందరూ టక్కున చెప్పేస్తారు. అయితే ఇప్పటికీ సజీవంగా నిలిచిపోయిన జగమే మాయ పాట స్వరకర్త మాత్రం సుబ్బురామన్ కాదంటే నమ్మరేమో ! కానీ ఇది నిజం.
ఆ చిత్ర నిర్మాణ సమయంలో సుబ్బురామన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆయన ఈ పాటను స్వరపరిచే పరిస్థితి లేదు. ఆ సమయంలో ఆయనకు సహాయకుడిగా ఉన్న ఎం.ఎస్. విశ్వనాథన్ ఈ బాధ్యతను తీసుకున్నారు. తర్వాత రోజుల్లో దక్షిణాదిన అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా ఆయన ఎదగడం, ఎన్నెన్నో అపురూపమైన పాటల్ని అందించడం మనందరికీ తెలిసిన విషయమే !

శ్రమ విలువ

శ్రమ విలువ తెలుసుకొన్న వాళ్ళు మహాత్ములవుతారు. ఒకప్పటి సోవియట్ రష్యా లో ఒకరోజు ఒక రైల్వే స్టేషన్ లో ఒకావిడ దిగింది. ఆ స్టేషన్ కి దగ్గరలో ఉన్న ఒకరికి ఆమె ఒక సమాచారాన్ని పంపించాలి. ఆ రైలు ఆ స్టేషన్ లో పది నిముషాలు మాత్రమే ఆగుతుంది. ఎవరి చేత పంపాలా అని ఆలోచిస్తుండగా ప్లాట్ ఫాం మీద తిరుగుతూ బికారిలాగ కనిపిస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆవిడ అతన్ని పిలిచి తన దగ్గరున్న ఉత్తరాన్ని ఇచ్చి తను చెప్పిన వ్యక్తికి ఇచ్చి వస్తే రెండు రూబుళ్ళు ఇస్తానని అంది. దానికా వ్యక్తి సరేనని తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాడు. అన్న మాట ప్రకారం ఆవిడ ఆ డబ్బు ఇచ్చేసింది. ఆవిడకు అతన్ని ఎక్కడో చూసినట్లనిపించింది. తిరిగి రైలు ఎక్కాబోతూండగా గుర్తుకొచ్చింది.అతనెవరో! వెంటనే పరుగెత్తి అతన్ని కలిసింది. పరికించి చూసింది. తన అనుమానం నిజమైందని అర్థమవగానే ఖంగారు పడింది. పశ్చాతాప్తపడింది. క్షమాపణ కోరింది. తనిచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చివేయమంది. కానీ ఆయన ఒప్పుకోలేదు. పైగా " మీరు చెప్పిన పని చెప్పిన ప్రకారం చేసాను. నా శ్రమకు తగ్గ ఫలితం మీరు నాకు ఇచ్చారు. నాపని మీకు నచ్చకపోతే చెప్పండి. తిరిగి ఇచ్చేస్తాను. అంతే కానీ నా శ్రమ పడి సంపాదించుకున్న ఈ డబ్బు ఇవ్వను " అన్నాడాయన. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరో ఇక్కడ చూడండి.


పరి ' పూర్ణ ' వినోదం

ఏ సంస్థ అయినా పదికాలాల పాటు నిలదొక్కుకోవాలంటే ఆ సంస్థ నిర్వాహకులకు అకుంథిత దీక్ష, పట్టుదల అన్నిటికీ మించి నిబద్ధత అవసరం. అప్పుడే ఆ సంస్థ అరుదైన రికార్డులు సృష్టించి చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి పరి 'పూర్ణ' త్వాన్ని సంతరించుకోబోతున్న సంస్థ గురించి ఇప్పుడు చూడండి...................

Tuesday, October 27, 2009

కట్టమంచి వారి చతురోక్తులు


కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనలో, అభివృద్ధిలో విశేష కృషి చేసిన మహనీయుడు. ఏలూరు సర్. సి.ఆర్. రెడ్డి కళాశాల ఆయన పేరున వెలిసిందే ! ఆయన మంచి హాస్య చతురతగల వ్యక్తి. ఆయం చతురోక్తులు మచ్చుకి కొన్ని......
* రెడ్డి గారు ఒకసారి మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. సెంట్రల్ స్టేషన్ లో దిగి ప్లాట్ ఫాం మీదే నిలబడి చుట్టూ చూస్తున్నారు. అది గమనించిన ఒక విలేఖరి వచ్చి తనని పరిచయం చేసుకుని సహాయం కావాలా అని అడిగాడు. వెంటనే రెడ్డిగారు " నాకిప్పుడు కావల్సినది రిపోర్టర్ కాదు, పోర్టర్ ! " అన్నారు.
* చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారిని ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించిన సందర్భంగా విజయవాడలో జరిగిన సన్మాన సభకు కట్టమంచి వారు అధ్యక్షత వహించారు. ఆయనకు చెళ్లపిళ్ల వారంటే చాలా భక్తి, గౌరవాలు. రెడ్డిగారు అధ్యక్షోపన్యాసం చేస్తుండగా చెళ్లపిళ్ళవారు వెనుకనుంచి వెటకారంగా వ్యాఖ్యానం చెయ్యడం ప్రారంభించారు. అది రెడ్డిగారికి, సభికులకు ఇబ్బందిగా తయారయింది. పెద్దవారు, పండితులు ఆయన్ని ఎలా నియంత్రించాలో అర్థం కాలేదు. కొంతసేపు భరించాక కట్టమంచి వారు సమయస్పూర్తితో " మొదటినుండి మా గురువుగారికి అంట కవిత్వం అలవాటు కదా ! ఇక్కడ కూడా ఆ అలవాటు పోలేదు " అన్నారు.
* రామలింగారెడ్డిగారు కొంతకాలం విద్యాశాఖాధికారిగా పనిచేసారు. ఒకసారి ఒక ఉన్నత పాఠశాల తనిఖీకి వెళ్ళారు. ఒక తరగతిలో తెలుగు పండితుడు ఒక విద్యార్థిని బోర్డు మీద ' చీకటి ' అనే పదాన్ని రాయమన్నాడు. ఆ విద్యార్థి రాసాడు. " అందులో అరసున్న ఏదీ ? " అని విద్యార్థి మీద కోప్పడ్డాడా పండితుడు. వెంటనే రెడ్డిగారు " అసలే చీకటి కదా ! ఇక అరసున్న ఏం కనిపిస్తుంది ? " అని చమత్కరించారు.
*  కట్టమంచి వారు ఘోటక బ్రహ్మచారి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పనిచేసే రోజుల్లో ఒక సభలో కొందరు వక్తలు ప్రసంగిస్తూ ఆయన్ని పొగడడం మొదలు పెట్టారు. కలియుగ భీష్ముడు, వీర హనుమాన్ అదీ ఇదీ అనే విశేషణాలు తగిలించేసారు. దానికి రెడ్డి గారు సమాధానం చెబుతూ " ఇన్ని విశేషణాలూ, ఉపమానాలూ దేనికి ? క్లుప్తంగా బ్రహ్మచారి అంటే సరిపోతుందిగా ! " అని చలోక్తి విసిరారు.
* ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఆయన పనిచేసే రోజుల్లో పి. కమలమ్మ అనే సెనేట్ సభ్యురాలుండేది. ఆవిడ మాట, ప్రవర్తన కటువుగా ఉండేవి. ఒక సమావేశంలో ఆవిడ తన స్వభావానికి విరుద్ధంగా ఉషారుగా అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండడం రెడ్డి గారి కంట పడింది. ఆయన " కారణమేమైనను వివాహము వలన పరుషములు సరళములైనందుకు సంతోషముగానున్నది " అని చమత్కరించారు. ఇంతకీ ఇందులో చమత్కారం పి. కమలమ్మ గారికి కొద్దిరోజులముందే పెళ్లయి పేరు బి. కమలమ్మగా మారింది.

రాజకీయాల్లో సంస్కారం


ఇప్పటి తరం రాజకీయ నాయకుల్లో అరుదుగా కనిపించే సంస్కారం గత తరం రాజకీయ నాయకుల్లో తరుచుగా కనబడేదనడానికి ఒక ఉదాహరణ.
దామోదరం సంజీవయ్య గారు ఆంద్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి. 1960 వ  సంవత్సరం నుండి 1962వరకూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య  మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఘనత వహించారు. తర్వాత కేంద్రంలో కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా పని చేశారు. అంతటి ఉన్నత స్థానానికి చేర్చింది ఆయన సంస్కారమే !
విదేశీ పర్యటనలంటే ఈనాటి రాజకీయనాయకులు ఎగిరి గంతులేస్తారు. సంజీవయ్య గారికి విదేశాలనుంచి చాలాసార్లు ఆహ్వానాలందాయి. అయితే వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. సంజీవయ్య గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న రోజుల్లో అమెరికా రాయబారి గాల్ బ్రెట్ అమెరికాకు ఆహ్వానించారు. అయితే తనకు ఈ దేశంలోనే చెయ్యడానికి చాలా పని ఉందని ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆ రాయబారి ఆయన సంస్కారానికి ముగ్దుడయ్యాడు.
విదేశీ పర్యటనలకు ప్రజాధనం ఖర్చు చెయ్యడం సంజీవయ్య గారికి ఇష్టం ఉండేది కాదు. ఆయన రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో విదేశాలనుంచి చాలా ఆహ్వానాలు అందాయి. అయితే ఆయన అవేమీ ఉపయోగించుకునే వారు కాదు. పైగా " సహకార రంగంలో ఇతర దేశాల కంటే మనమే ముందున్నాం. ఇక అక్కడికి వెళ్లి నేర్చుకునేదేమిటి ? అనవసరంగా ప్రజా ధనం వృధా చెయ్యడం తప్ప " అనేవారు. ఈనాటి రాజకీయాల్లో ఈ సంస్కారం అరుదై పోయింది.

Monday, October 26, 2009

'ర' సాలూరు_బాపు_బాలు

రాజ్యే 'స్వరం' కి బాపుగారి అక్షర నీరాజనం, బాలుగారి జ్ఞాపక నీరాజనం
( బాపుగారికి క్షమాపణలతో )

'స్వ'రాజేశ్వర రావు

స్వరాలతో సరసాలాడి తెలుగు జాతికి వీనుల విందును అందించిన సాలూరు రాజేశ్వర రావు గారి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పడం చర్విత చర్వణమే ! అందుకే ఆయన స్వయంగా పాడిన స్వరాల రసాలను గ్రోలండి. ఆ మహానుభావుడికి ఇదే నివాళి.


Find more music like this on Hyderabad.org.in

Sunday, October 25, 2009

హరిశ్చంద్ర

కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన " జననీ జన్మభూమి " చిత్రంలో ' హరిశ్చంద్ర ' నాటకం లోని కాటి సీను లోని కొన్ని భాగాలు ఉపయోగించారు. ఆ నాటకాన్ని తెలుగులో తొలుత కీ. శే . బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసారు. అనంతరం కీ.శే . గుర్రం జాషువ కూడా మరో రచన చేశారు. ఈ చిత్రంలోని భాగంలో ఇద్దరి రచనల్లోని పద్యాలూ వాడటం జరిగింది. సాధారణంగా రంగస్థల కళాకారులు కూడా తమ ప్రదర్శనలలో ఇలాగే కలిపి వాడటం జరుగుతుంటుంది.
శ్రీ భ్రమరాంబికా ఫిలిమ్స్ పతాకం మీద కీ.శే. కె.కేశవరావు గారు నిర్మించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సుమలత వగైరా నటించారు. రాజ్యలక్ష్మి తండ్రి రంగస్థల కళాకారుడు. అతను ఈ సన్నివేశంలో నటిస్తూ ఉద్వేగానికి లోనై గుండెపోటుకు గురవుతాడు. ఈ సన్నివేశంలో తెనాలికి చెందిన రంగస్థల కళాకారులే నటించారు. వారిచేతనే ఆ పద్యాలను పాడించి రికార్డు చెయ్యడం జరిగింది. అందులోంచి కొన్నిటిని ఉపయోగించుకోవడం జరిగింది. చిత్రం విజయవంతం కాకపోవడం చేత ఈ విషయం చాలా మందికి చేరలేదు. మన సంస్కృతీ, కళలంటే మక్కువ కలిగిన గురువర్యులు విశ్వనాథ్ గారు ఈసారి నాటక ప్రక్రియను ఈ చిత్రంలో ఉపయోగించారు. సహజత్వంకోసం సినిమా నటులు కాక అసలైన రంగస్థల కళాకారులనే ఉపయోగించారు. వారి నటనకు ముగ్దులయి వారి టైటిల్స్ ప్రత్యేక కార్డుగా వెయ్యాలని షూటింగ్ సమయంలోనే చెప్పటం జరిగింది. మరుగున పడిపోతున్నాయనుకున్న కళలను సజీవం చెయ్యడంలో విశ్వనాథ్ గారి కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఈ చిత్ర పరాజయంతో ఈ విషయం మరుగున పడిపోయింది. పరాజయానికి ఇతరత్రా కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సన్నివేశం మాత్రం ఆ చిట్టాలోకి రాదు. ఏమైనా చాలా చిత్రాల్లో మన నాటకాల్ని అపభ్రంశం చేసి హాస్యానికి వాడుకున్నారుగానీ ( కొన్ని చిత్రాల్లో ప్రత్యేకమైన నాటక సన్నివేశాలు తప్ప ) ఇలా సన్నివేశపరంగా ఉపయోగించే ప్రయత్నం చెయ్యలేదు. చిత్రం విజయం సాధించి ఉంటే శంకరాభరణం, సాగర సంగమంల లాగా ప్రేక్షకుల మీద ప్రభావం చూపించి ఉండేదేమో ! ఆ సన్నివేశాన్ని చూడండి.
.

Saturday, October 24, 2009

కనుక్కోండి చూద్దాం ! - 2

తెలుగు నాటకరంగ విశేషాలు కొన్నిటిని మీరు తిలకించే ఉంటారు. ఇప్పుడు మీకు ఆడియోలో వినిపిస్తున్నది ఏ నాటకంలోని ఏ భాగమో......... ఆగండి. అవి ఎవరైనా చెప్పేస్తారు. అది కాదు మీరు కనిపెట్టవలసింది. ఈ క్లిప్ ఒక సినిమా ఆడియోనుంచి తీసుకున్నది. అది ఏ సినిమానో, దర్శకుడు వగైరా కథాకమామీషూ చెప్పగలరేమో ప్రయత్నించండి.

తెర తీయగ రాదా !

తెలుగు నాటక రంగానికి వందేళ్ళపైనే చరిత్ర ఉంది. ఎంతోమంది మహానటులు, నటీమణులు మన నాటక రంగాన్ని పరిపుష్టం చేసారు. వాళ్ళలో ముఖ్యులు కొందర్ని ఈ క్రింద చూడండి ........

Friday, October 23, 2009

కనుక్కోండి చూద్దాం !


బ్లాగు మిత్రులకు ఒక చిన్న క్విజ్. ఈ ప్రక్క ఫోటోలో ఉన్నది తెలుగు వారందరికీ తెలిసిన  ఒక ప్రముఖ వ్యక్తీ. ఎవరో చెప్పగలరా ? ప్రయత్నించండి.

ప్రాప్తం
 అనుకున్నామని జరగవు కొన్నీ
అనుకోలేదని ఆగవు అన్నీ
ఇదొక సినిమా పాట. మనకేది ప్రాప్తమో అదే జరుగుతుంది తప్ప మనం ఊహించినవన్నీ జరుగవు. మహానటి సావిత్రి విషయం లోనూ అదే జరిగింది.
' మూగమనసులు ' తెలుగు చిత్రాలలో ఇదొక ట్రెండ్ సెట్టర్. సావిత్రి నటనా వైదుష్యానికి పరాకాష్ట. ఆ చిత్రం ఎంత విజయవంతమైందో అప్పటి తరానికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని తమిళంలో తనే స్వీయ దర్శకత్వంలో స్వయంగా నిర్మించింది సావిత్రి. అక్కినేని చేసిన గోపీ పాత్రను శివాజీ గణేశన్, జమున చేసిన గౌరి పాత్రను చంద్రకళ ధరించారు. శివాజీ అప్పటికే సూపర్ స్టార్. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ సినిమా ప్రారంభం నుంచి విడుదల అయ్యేదాకా అనేక కష్టాలను ఎదుర్కొంది సావిత్రి. మొదట్లో తెలుగు చిత్ర విజయంవల్లనైతేనేమి, శివాజీ మార్కెట్ వల్ల నైతేనేమి విడుదల హక్కులకోసం చాలామందే వచ్చారు. ' అదృష్టం అందలం ఎక్కిస్తే దురదృష్టం బురదలోకి లాగిందట ' . సరిగ్గా అదే జరిగింది సావిత్రి జీవితంలో. విజయంమీద విపరీతమైన ఆశలు పెట్టుకున్న ఆమె హక్కులెవరికీ ఇవ్వలేదు. అదే ఆమె పాలిటి దురదృష్టమైంది. ఆర్థికవత్తిడుల మధ్య ఎలాగో పూర్తిచేసింది. ఈ గోరుచుట్టుపైన మరో రోకలి పోటు శివాజీ చిత్రాలు మూడు పరాజయం పాలయ్యాయి. ఆ వరుసలో ఈ చిత్రం కూడా పరాజయం పాలయ్యింది. తెలుగులో ఆ చిత్రానికి ప్రాణంగా నిలిచిన సాహిత్యం, సంగీతం తమిళంలో బలహీనపడ్డాయి. మహానటి జీవితాన్ని అధోలోకంలోకి నెట్టిన ఆ చిత్రం పేరు " ప్రాప్తం ".

Wednesday, October 21, 2009

నవయుగ వైతాళికుడు
ప్రబంధ సాహిత్య వరవడిలో నడుస్తున్న తెలుగు కవిత్వాన్ని భావకవితా బాట పట్టించి నవయుగానికి నాంది పలికిన మహాకవి శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఆయన మీద, ఆయన రచనల మీద ప్రముఖుల అభిప్రాయాలు కొన్ని........


* మహాకవి శ్రీశ్రీ - ఈనాటి యువతరం మీద సినిమా తారల ప్రభావం ఎంత ఉంటున్నదో ఆ రోజుల్లో మాలాంటి వాళ్ళమీద కృష్ణశాస్త్రి సమ్మోహన శక్తి అంతగానో, మరింతగానో వుండేది. నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు. " మా అక్కే ! జుత్తుకి చవుర్రాసుకొదు " అని నాగురించి కూడా కన్యాశుల్కం లోని గిరీశం అని ఉండవచ్చును.
* కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ - శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని నేను చిన్నప్పటినుండి ఎరుగుదును. మే మన్నదమ్ములుగా ఉండెడివారము. ఆయన 'అబ్బ' అన్న పద్యము వ్రాసెను. నాటినుండి ఆయన యన్నచో నాకు గొప్ప అభిప్రాయము కలిగినది. తరువాత " పల్లకి " యన్న పద్యము నన్నాకర్షించినది.
తరువాత తెలుగులో నాయన ఠాగూరు వంటి వాడనిపించినది. కవిత్వము చెప్పలేనుగానీ ఆకృతిచేత సుమిత్రానందపంత్ అనుకొంటిని.
మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో శ్రీ కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయమే కాదు. ఆ కవులను జాగ్రత్తగా చదివిన వారి యభిప్రాయము కూడాను.
* శ్రీ నాభి జగన్నాధరావు - రాజకీయనాయకులు గాంధీజీ సందేశమును ఎన్ని రీతుల వ్యక్తము చేసినను శ్రీ కృష్ణశాస్త్రివలె గాంధీజీ జేవితముయొక్క మూల సూత్రము గ్రహించినవారు లేరనుట సాహసమేమోగాని, " కమ్మగా బ్రతికితే, గాందీ యుగం ! మనిషి కడుపునిండా తింటే గాంధీ మతం " అని అంత గొప్పగా ఇంకెవరనగలరు.  

యాదృచ్చికం

పేరడీ శాస్త్రి గా పేరు గాంచిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారి ఛలోక్తులు 'శిరాకదంబం' లో ఇచ్చాను. ఈరోజు అనుకోకుండా తెలుగుదనం.కో.ఇన్. లో జరుక్ శాస్త్రి గారి మీద సోదాహరణ వ్యాసం వచ్చింది. యాదృచ్చికంగా జరిగినా బ్లాగు మిత్రులకు మరిన్ని జరుక్ శాస్త్రి గారి పేరడీలను ఆస్వాదించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. వివరణాత్మకంగా అందించిన తెలుగుదనం.కో.ఇన్. వారికి కృతఙ్ఞతలు. ఆ వ్యాసం ఇక్కడ చూడగలరు.

జల సూత్రం

           జల సూత్రం రుక్మిణీనాధ శాస్త్రి అంటే చాలామందికి తెలియక పోవచ్చు. జరుక్ శాస్త్రి లేదా    పేరడీ శాస్త్రి అంటే  టక్కున గుర్తు పట్టేస్తారు. హాస్యం, వ్యంగ్యం ఆయన రచనల్లో ప్రధాన వస్తువు. 
 అవి ఆయన మాటల్లో కూడా తొణికిసలాడేవి. ఆ రోజుల్లో ప్రముఖ కవులందరి రచనల మీదా 
 ఆయన రాసిన పేరడీలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.
  " మీ ఇంటిపేరు తమాషాగా ఉందండీ ! " అని ఎవరో ఆయనతో అంటే " అదా ! నీటి ఫార్ములా  H 2 O కదా ? అది మావాళ్ళే కనిపెట్టారట. అందుకే మా ఇంటి పేరు జలసూత్రం అయింది' అన్నారు.
* ' మధుకీల ' అనే కావ్యాన్ని మల్లవరపు విశ్వేశ్వర రావు అనే కవి రచించారు.  దానికి ముందుమాట కృష్ణశాస్త్రి గారు రాసారు. అందులో ' విశ్వేశ్వరరావూ ! నీవు కవివయ్యా ! నేను ఎవరితోనూ ఇలా అనను.విశ్వేశ్వర రావు నిజంగా కవి '; అని రాసారు. దీనికి జరుక్ శాస్త్రి గారి పేరడీ...... ' సుబ్బారావూ ! నువ్వింకా క్షవరం చేయించులోవాలయ్యా ! నీ తల మాసిందయ్యా ! నేను ఎవరితోనూ ఇలా అనను. సుబ్బారావు నిజంగా తలమాసిన వాడు "

* " అసలీ పేరడీలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? " అని ఆయన్ని ఎవరో అడిగారు. " మా తండ్రి గారి దగ్గర " అన్నారు టక్కున.  వాళ్ళు షాక్ నుంచి తేరుకున్నాక తాపీగా " నిజానికి నాకూ కృష్ణశాస్త్రికీ పెద్దగా తేడా ఏమీ లేదు. మా తండ్రి గారు నాక్కూడా కృష్ణశాస్త్రి అని పేరు పెట్టి ఉండొచ్చు. కానీ బెంగాలీలను పేరడీ చేసి తెలుగు వాళ్ళలో ఎవరికీ లేని పేరు పెట్టలేదూ ! " అన్నారట.  
ఇదండీ ఆయన వరస.....ఇంతేనా ? ఇంతేనా అంటే ఇంకా చాలా ఉన్నాయి . మీకూ , నాకూ కాంప్రమైజేషన్ కుదిరాక చెప్తాను . సరేనా !

Tuesday, October 20, 2009

ఉభయకవి మిత్రులు


ఉభయకవి మిత్రుడు అని కవిత్రయంలో తిక్కన సోమయాజి బిరుదు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్ష్యులుగా పనిచేసిన ఆచార్య యస్వీ జోగారావు గారికి మహాకవి శ్రీశ్రీ గారితో పనిబడి మద్రాసు వచ్చి ఎక్కడ కలవమంటారని అడగడానికి ఫోన్ చేశారు. దానికి శ్రీశ్రీ గారు " దానికేముంది.ఉభయకవిమిత్రులు ఉన్నారుగా ! వారింట్లోనే కలుద్దాం !! " అన్నారు. అంతటి పండితుడు జోగారావుగారికి ఏమీ అర్థం కాలేదు. ఈయనేమిటి ఎప్పుడో మహాభారతకాలం నాటికి వెళ్లిపోయారు అనిపించిందాయనకు. అదే అనుమానం శ్రీశ్రీ గారితో వ్యక్తం చేశారు. " అదేనండీ ! మన ఉభయులకూ మిత్రులైన పప్పు వేణుగోపాల రావుగారింట్లో కలుద్దామని నా ఉద్దేశ్యం " అన్నారు శ్రీశ్రీ.  పప్పు వేణుగోపాల రావు గారు అప్పట్లో అమెరికాలోని సాహితీ సంస్కృతి సంస్థలకు, మన దేశంలోని తెలుగు సంస్థలు , ఆయా రంగాల్లోని ప్రముఖులకు మధ్య వారధిగా ఉండేవారు. దాంతో ఆయన కవులకూ, కళాకారులకూ అందరికీ మిత్రులుగా ప్రసిద్ధులు .

Monday, October 19, 2009

నిర్విచారం


కరువు విలయ తాండవం చేస్తోందట
నిజమే ! చెయ్యనీ ఏం చేస్తాం !!

వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయట
నిజమే ! సృష్టించనీ ఏం చేస్తాం !!

భారీ తుఫానులు, భూకంపాలూ వస్తున్నాయట
నిజమా ! రానీ ఏం చేస్తాం !!

ధరలు
భారీగా పెరుగుతున్నాయ
నిజమా ! పెరగనీ ఏం చేస్తాం !!

వేతనాల్లోను, జీతాల్లోను కోతలుంటాయట
నిజమా ! ఉండనీ ఏం చేస్తాం !!

మధ్యంతర ఎన్నికలు రావచ్చట
నిజమా ! రానీ ఏం చేస్తాం !!

ఏం చెయ్యగలం ? మన రాత ఎలావుంటే అలాగే జరుగుతుంది
ఒక వైపు విచారం మరోవైపు నిర్విచారం ! వీటి ప్రతి రూపమే సామాన్యుడు !!

వన్స్ మోర్


చలనచిత్ర రంగంలో టాకీలు మొదలైన తర్వాత కొంతకాలం వరకూ పౌరాణికాలే రాజ్యమేలాయి. దానికి కారణం అప్పటికింకా చిత్ర రంగంపైన నాటకరంగ ప్రభావం ఉండటమే! దాంతో సహజంగానే రంగస్థల నటులు రాజ్యమేలారు. అలా రంగస్థలం మీద ప్రసిద్ధుడై చిత్ర రంగలోకి వచ్చి విలక్షణ నటుడుగా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి సి.యస్.ఆర్. ఆంజనేయులు. శకుని పాత్రలో పరకాయప్రవేశం చేసి ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయాడు. అయితే చిత్ర రంగానికి వచ్చిన తొలి రోజులనాటికి రంగస్థలం మీద కృష్ణుడి పాత్రలో ప్రసిద్దుడవడం వలన ఆయనకి అప్పట్లో ఆ పాత్రలే వచ్చేవి. రంగస్థలం మీద కృష్ణుడిగా సి.యస్.ఆర్. పద్యం పాడితే జనం వన్స్ మోర్ కొట్టే వారు. దాంతో మళ్ళీ పద్యం పాడక తప్పేదికాదాయనకు. 1936 లో వచ్చిన ' ద్రౌపదీ వస్త్రాపహరణం ' చిత్రంలో సి.యస్.ఆర్. కృష్ణుడుగా నటించాడు. ఆ సినిమా ను చూస్తున్న ప్రేక్షకులు సి.యస్.ఆర్. పద్యం పాడటం అవగానే అలవాటు ప్రకారం వన్స్ మోర్ కొట్టేవారు. థియేటర్ వాళ్లు పట్ట్జించుకోకుండా ప్రదర్శన కొనసాగిస్తే ప్రేక్షకులు ఊరుకునేవారు కాదు. దాంతో ఆపరేటర్లకు రీలు వెనక్కి తిప్పి మళ్ళీ ప్రదర్శించాల్సి వచ్చేది. మళ్ళీ 1944 లో సి.యస్.ఆర్. కృష్ణుడుగా నటించిన ' భీష్మ ' చిత్రం విషయంలో కూడా ఇదే పరిస్థితి పునరావృత్తమైంది. అదీ చిత్ర రంగ తొలినాళ్ళ పరిస్థితి.

Sunday, October 18, 2009

విశ్వనాథ వారి చెణుకులు


ఈ రోజు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వర్థంతి. ఆయన సాహిత్యం గురించి చెప్పనక్కర్లేదు. ఆయన వ్యాఖ్యల్లో మాత్రం హాస్యం తొంగిచూసేది. ఆయనకు నివాళులర్పిస్తూ....
* విశ్వనాథ వారి ' శివార్పణం ' పద్యకావ్యం ఆవిష్కరణ సభ జరుగుతోంది. ఆయన్ని గుమ్మడి గారుసత్కరిస్తారని ప్రకటించారు. అలాగే గుమ్మడి గారు సత్కరించారు. దానికి విశ్వనాథ వారు " గుమ్మడి అంటే ఈయనా ? నేనింకా గుమ్మడి సత్కారమంటే గుమ్మడికాయనిస్తారేమో అనుకున్నాను " అన్నారట.

* విశ్వనాథ వారు బందరులో ఉండే రోజుల్లో ఆయన మిత్రుడొకాయన ఊరు వచ్చి " మీ ఊరి నిండా గాడిదలేఉన్నట్లున్నాయే ! " అన్నాడు వ్యంగ్యంగా. దానికి విశ్వనాథ వారు " అవును. నిజమే ! ఉన్నవి చాలవన్నట్లుఅప్పుడప్పుడు పొరుగూరి గాడిదలు కూడా వచ్చిపోతుంటాయి " అన్నారు.

* ఒక చిత్ర నిర్మాతకు విశ్వనాథ వారి ' వేయిపడగలు ' ని సినిమా గా తీస్తే బాగుంటుంది అనిపించింది. ఆయన్ని కలిసాడు. విశ్వనాథ వారు ఇరవై వేలు పారితోషికం అడిగారు. దాంతో ఆ నిర్మాతకు మతి పోయినట్లయింది. ఏం చెయ్యాలో తోచక " అంత ఇచ్చుకోలేను. రెండు వేలు ఇచ్చుకుంటాను. ఓ వంద పడగల్ని ఇప్పించండి " అన్నాడు. ఈసారి విస్తుపోవడం విశ్వనాథ వారి వంతయింది.

*
విశ్వనాథ వారు ఒక పని మీద సచివాలయం చుట్టూ చాలాసార్లు తిరిగి విసుగెత్తి, అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారిని కలిసి విషయం చెప్పారు. ఆయన " అదొక పెద్ద అడివి. దానిలో పని జరిపించుకోవడం అంత సులభం కాదు" అన్నారు. " మీరు ఆంద్ర కేసరి కదా ! ఆ అడవి మీకొక లెఖ్ఖా ? అందుకే మీ దగ్గరకు వచ్చింది " అన్నారు విశ్వనాథ వారు ప్రకాశం గారిని ఇరుకునబెడుతూ.

పుస్తకానికి గజకేసరి యోగంమొదట్లో తాళ ప్రతులుగానూ, కాగితం వచ్చాక చేతిరాతలుగానూ ఉండిపోయిన సంస్కృతాంధ్ర గ్రంథాలను పరిష్కరించి ముద్రణా యంత్రాలనుపయోగించి తెలుగు జాతికి అందించిన తొలి తరం ముద్రాపకులు శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రి , వారి పుత్రులు వెంకటేశ్వర శాస్త్రి గారు. వారు 1854 లో ' సరస్వతీ గ్రంథ మాల ' పేరుతో ముద్రణాలయాన్ని ప్రారంభించారు. రామాయణ, మహాభారతాలను పరిష్కరించి దేవనాగరి లిపిలో 1856 లో ప్రచురించారు.
సందర్భంగా మదరాసులోని తెలుగు వారందరూ కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. గ్రంధాలను ఏనుగు అంబారీ పైనుంచి మంగళ వాద్యాలతో పురప్రముఖులందరూ నగరమంతా ఊరేగించారు. పుస్తకానికి దక్కిన అపూర్వమైన గౌరవమది.

Saturday, October 17, 2009

దివ్వెల పండుగ దీపావళి

తమ సోమా జ్యోతిర్గమయా....
మిత్రులకు శుభాకాంక్షలతో ......ఒక్కసారి మీటి చూడండి
Friday, October 16, 2009

జ్ఞాపకావళి


దీపావళి జ్ఞాపకావళిగా మారిపోయింది. జ్ఞాపకాల పొరలలో నిక్షిప్తమైన మధురానుభూతుల్ని వెలికి తెచ్చింది. నుష్యుల మధ్య అనుబంధాలు, ప్యాయతల్ని పెంచి, అదే సమయంలో మంచీ చెడూ విచక్షణా జ్ఞానాన్ని పంచడమే పండుగల పరమార్థం. ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా ఇంటికీ, ఊరికీ, ఇంకా ఆప్తులికీ దూరంగా ఉండాల్సివచ్చినపుడు ఈజ్ఞాపకాలే మనకి ఆప్తులు. మనసుకి బాధగా ఉన్నప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరితనమే ! అలాంటప్పుడు జ్ఞాపకాలే నకి తోడుగా ఉండి ఒంటరితనాన్ని మరిపిస్తాయి. మన సంస్కృతికి గొప్పతనమది. మిత్రులకు, ఆప్తులకు శుభాకాంక్షలందించడం, అంతా ఒకచోట చేరి విందు వినోదాలతో కాలక్షేపం చెయ్యడం, మనకి తోచినంతలో మన కిందివారికి సాయం చెయ్యడం ఇవన్నీ సమాజంలో సుహృద్భావ వాతావరణాన్ని పెంచుతాయి. మనం వంటరి కామని, మన చుట్టూ సమాజం ఉందని గుర్తుచెయ్యడం ద్వారా మనలో ఒక భద్రత కలిగించండం మన పండగల ప్రత్యేకత. వీటన్నిటివల్లా మానసికోల్లాసం కూడా పుష్కలంగా అందుతుందనటంలో సందేహం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కొంత భాగం కష్టాలలో మునిగిఉంది. ధరలరూపంలో మిగిలిన రాష్ట్రమంతా మరో కష్టంలో మునుగుతోంది. ఆడంబరంగా కాక ఆనందంగా దీపావళి జరుపుకుందాం ! బాధితులకు కూడా మనకి వీలైనంత ఆనందాన్ని పంచుదాం ! అయితే తమ డాబూ దర్పాలూ ప్రదర్శించడానికి పండగల్ని వేదికగా చేసుకునే వాళ్లు కొందరుంటారు. వాళ్ళని చూసి జాలి పడదాం !!
చిన్నప్పటి దీపావళి జ్ఞాపకాలూ చాలానే ఉన్నా సంవత్సరం మాత్రం నా జీవితంలో మరో కొత్త తీపి జ్ఞాపకం చేరింది. మరో కొత్త ప్రపంచాన్ని చూపించింది. ఎంతోమంది కొత్త మిత్రుల్ని అందిస్తోంది. ఎక్కడెక్కడి ఊసులు ! ఎన్నెన్ని భావనలు !! న్నిటినీ ఒకచోట చేర్చిన అందమైన వేదికనందించిన దీపావళిని నేనెలా మరచిపోగలను. అందుకే దీపావళి నాకు మధురమైన జ్ఞాపకావళిగా మారిపోయింది. భాగ్యాన్ని కలిగించిన మిత్రులందరికీ పేరు పేరునా నా
శుభాకాంక్షలు

Thursday, October 15, 2009

హాస్య బ్రహ్మ

" హాస్య బ్రహ్మ " బిరుదుకి వన్నె తెచ్చిన భమిడిపాటి కామేశ్వర రావు గారి చెణుకులు.....

గమనిక : స్పష్టత కోసం ఇమేజ్ మీద నొక్కండి.

Wednesday, October 14, 2009

కళకు గ్రహణం

కళకు గ్రహణం పడితే, అందులోనూ అది పురుషాహంకార గ్రహణమైతే...

Tuesday, October 13, 2009

వందన కదంబం 2

బ్లాగు మిత్రులందరికీ మరో మారు వందనాలు
బ్లాగు అనే ప్రక్రియ ప్రారంభమయి చాలాకాలమైనా వృత్తి పరమైన కారణాలవలన ఇప్పటివరకూ ఇందులోకి తొంగి చూడలేక పోయాను. ఈ మధ్య ఖాళీగా ఉండే సమయం పెరిగి కొత్త ప్రాజెక్ట్ తయారీ పని ఈసారి కంప్యూటర్ మీద చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ సమయం దీంతో గడపడం వలన బ్లాగులని సందర్శించడం జరిగింది. పుస్తకాల మీద ముఖ్యంగా పత్రికల మీద ఉన్న మక్కువతో గత ముఫ్ఫై ఏళ్ళుగా దాచుకున్న ఎంతో విలువైన సమాచారాన్ని క్రోడీకరించే పని ఇంతకాలంగా చెయ్యలేక పోయాను. ఇటీవలే ఆ పని ప్రారంభించాను. నేను సేకరించిన సమాచారాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశ్యంతో తొందరపడి బ్లాగు ప్రారంభించేసాను . తొందరపడి అని ఎందుకంటున్నానంటే సమాచారాన్ని క్రోదీకరించటం పూర్తయ్యాక మొదలుపెట్టి ఉంటే సమగ్రంగా, క్రమ పద్ధతిలో పెట్టి అందించేవాడిని . కానీ బండెడు పుస్తకాలంటారే అది నిజంగా నిజం. అతిశయోక్తి కాకుండా బండెడు పైనే ఉంటాయి నా దగ్గర . ఇంతకాలం తోచిన, లేదా అవసరమైన పుస్తకాలు వెతుక్కుని తీసుకోవడమే జరుగుతోంది. కానీ ఈ పని అనుకున్నంత సులువుగా అయ్యేటట్లు లేదు. అందుకే ఇంకా క్రమ పద్ధైతిలో అందించలేకపోయినా ప్రస్తుతం కొంతవరకే అందిస్తున్నాను . త్వరలో సమగ్రంగా అందిస్తాను అనడం అహంకారం అవుతుంది. అందుకని వీలైనంత సమగ్రంగా అందించే ప్రయత్నం చేస్తాను. ఒక్క విషయం. నేనందించే సమాచారం ఇదివరకే తెలిసున్న వాళ్లు మన బ్లాగర్లలో చాలా మంది ఉండవచ్చు నా రాతల్లో ఏమైనా లోపాలు, దిద్దుబాట్లు ఉంటే దయజేసి తెలియజెయ్యండి. వీలైనంతవరకూ సరైన సమాచారాన్ని తెలియని వారికి అందివ్వడానికి వీలవుతుంది.

                   రేపటితో నేను బ్లాగు ప్రారంభించి రెండు నెలలు పూర్తవుతాయి. ఈ రోజు వీక్షకుల సంఖ్య 1000 దాటింది.  రాశి పెరిగినందుకు సంతోషమే ! కానీ వాసి పెంచుకుని మరింతమంది వీక్షకుల్ని సంపాదించాలని నా చిన్న కోరిక. ఎంతవరకూ సఫలీకృతమవుతుందో ? నా బ్లాగు దర్శిస్తున్న మిత్రులందరికీ మరోసారి వందన కదంబం.

Monday, October 12, 2009

శ్రీశ్రీ శ్లేషలు
 చమత్కారాలు

మహాకవి శ్రీశ్రీ రచనల్లో విప్లవం దాగున్నట్లే మాటల్లో శ్లేషలు తొంగిచూసేవి. మచ్చుకి కొన్ని....

*
వల్లం నరసింహారావు రంగస్థల నటుడు. కొన్ని సినిమాలల్లో కూడా నటించాడు. ఆయన ఒక సాయింత్రం మదరాసు లోని పానగల్ పార్క్ లో శ్రీశ్రీ ని చూసి " గురువు గారూ ! ఓ నాటిక రాసి పెట్టండి " అని అడిగాడు. దానికి శ్రీశ్రీ " అలాగే తప్పకుండా ! ఏ నాటికైనా రాసి పెడతాను " అన్నారు.

*
మొక్కపాటి నరసింహారావు గారు ప్రముఖ రచయిత. ఆయనా, శ్రీశ్రీ గారూ ఒకసారి రైల్వే స్టేషన్ లో కలుసుకున్నారు. మొక్కపాటివారు అడిగారు " ఊరికేనా ? " అని. అందుకు శ్రీశ్రీ " అవును. ఊరికే !! " అన్నారట.

*
ఒకరోజు శ్రీశ్రీ తన మిత్రుడైన ఒక పత్రికా సంపాదకుడిని కలుద్దామని పత్రికాఫీసుకెళ్ళారు. తాజా సంచికకు ముఖచిత్రం ఏం వెయ్యాలా అని ఆలోచిస్తున్న ఆ సంపాదకుడు శ్రీశ్రీని చూడగానే " ముఖచిత్రంగా కొచ్చిన్ సిస్టర్స్ ని వేస్తే ఎలా ఉంటుంది ? " అని అడిగాడు.
అందుకు శ్రీశ్రీ వెంటనే " ఎందుకొచ్చిన సిస్టర్స్ ? ఆకలేస్తోంది. ముందు భోజనానికి వెడదాం ! రా ! " అన్నారు.

Sunday, October 11, 2009

ఆశఆశ

అమ్మ చందమామని తెచ్చిస్తుందనే ఆశ
చిన్నప్పుడు బువ్వ తినిపిస్తుంది

తోటి పిల్లలతో ఆడుకోవచ్చనే ఆశ
బడికి పంపి అక్షరాలు దిద్దిస్తుంది

మంచి ఉద్యోగం వస్తుందనే ఆశ
ఉన్నత చదువులు చదివిస్తుంది

జీవితానికో తోడు కావాలనే ఆశ
పెళ్లి దాకా నడిపిస్తుంది

వంశాభివృద్ధి చెయ్యాలనే ఆశ
ముద్దులొలికే పిల్లల్ని ఇస్తుంది

వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశ
కష్టబడి సంపాదించేటట్లు చేస్తుంది

శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనే ఆశ
పిల్లలమీద ఆధారపడేటట్లు చేస్తుంది

అది నిరాశ కాకూడదనే ఆశ
మరణందాకా నడిపిస్తుంది

జీవన ప్రయాణానికి ఆశే ఇంధనం
గమ్యాన్ని చేరడానికి అదే ఆలంబన

Saturday, October 10, 2009

పెళ్లి సంబరం


బాబాయి కూతురు పెళ్ళి. చాలారోజుల తర్వాత దగ్గర బంధువులింట్లో పెళ్ళేమో చాలా ఉత్సాహంగా బయిల్దేరాను . చిన్నప్పుడు పెళ్ళంటే ఎంత హడావిడి. నెలరోజుల ముందే పనులు మొదలైపోయేవి. అందులోనూ ఆడపిల్ల పెళ్ళంటే మాటలా ? పచ్చటి కొబ్బరాకుల చుట్టిన స్థంభాలతో వేసిన చలువ పందిరి, కర్పూరపు దండలు, పానకాలు, పప్పు దప్పళంతో విందు భోజనం ఇలా ఎన్నెన్నో...! చాలాకాలం తర్వాత చూడబోతున్నందుకు నా మనస్సు ఆనందంలో మునిగిపోయుండగా నేను మాత్రం బాబాయింట్లో తేలాను. ఇంటి ముందు పెళ్లి పందిరి కనబడలేదు. అంతే కాదు ఎక్కడా హడావిడి లేదు. చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది . నాకర్థం కాలేదు. లోపలకెళ్ళాను. అక్కడక్కడా కొన్ని సామానులు కనిపిస్తున్నాయిగానీ ఎక్కడా మనుష్యుల అలికిడి లేదు. ఇంతలో పెరట్లోంచి పిన్ని వచ్చింది. " రారా ! శంకరం !! ఇదేనా రావడం ? సీతా పిల్లలేరి ? ఉండు. మంచినీళ్ళు తాగాక మాట్లాడుకుందాం " అని లోపలికి వెళ్ళిపోయింది. అదే హడావిడి. పిన్నెప్పుడూ అంతే! తన ధోరణి తనదే . మన మాట పట్టించుకోదు. " " బాబాయి లేడా పిన్నీ ? " కాఫీ కలుపుతుండగా అడిగాను. " ఏదో కోర్ట్ పని ఉందని రాజమండ్రి వెళ్ళారు. సాయింత్రానికి వచ్చేస్తారు. సీతా పిల్లల్ని ఎందుకు తీసుకురాలేదు ? " అని మళ్ళీ అడిగింది. " పిల్లలిద్దరికీ పరీక్షలు జరుగుతున్నాయి పిన్నీ ! రాలేకపోతున్నందుకు సీత చాలా బాధపడింది. ఏం చేస్తాం ? కుదరలేదు. అవునూ ! సుజీ ఏదీ ? కనబడదేం ? " చుట్టూ చూస్తూ అడిగాను. " ఇంకా రాలేదు. బహుశా రేపు బయిల్దేరి వస్తుంది. ఏమిటో ! ఈ చదువులు !! " అంది పెదవి విరుస్తూ. " అదేమిటి ? నాల్గు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా రాకపోవడం ? " ఆశ్చర్యంగా అడిగాను. " అయినా అదొచ్చి ఏం చేస్తుంది చెప్పు. అనవసరంగా చదువు పాడవడం తప్ప " అంది అతి మామూలుగా. ఆలోచిస్తే నాకూ అదే అనిపించింది. " పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయినట్లేనా పిన్నీ ? " అనడిగాను. " ఆ ! ఈ రోజుల్లో ఏర్పాట్లు చెయ్యడం ఎంత సేపు ! హైదరాబాద్లో అక్షయమో ఏదో పెళ్ళిళ్ళకి చాలా గొప్పగా ఏర్పాట్లు చేస్తారట. చాలా పేరట కదా ! ముహూర్తం పెట్టగానే మీ బాబాయి వాళ్లతో మాట్లాడేసారు. అసలే అమెరికా సంబంధమాయే ! గ్రాండ్ గా ఉండాలిగా ! వాళ్లక్కావాల్సిన ఏర్పాట్లూ అవీ మనకేం తెలుస్తాయి చెప్పు శంకరం ! " అని చెప్పుకుంటూ పోతోంది. హైదరాబాద్లో ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళు, బఫే భోజనాలూ చూసి చూసి మొహం మొత్తి అచ్చమైన కల్తీ లేని సాంప్రదాయపు పెళ్లి మళ్ళీ చూసే అవకాశం వచ్చిందని, నాల్గు రోజుల ముందరే వెళ్లి బాబాయికి పెళ్లి పనుల్లో సాయపడాలని మా బాస్ ని బతిమాలి సెలవు పెట్టి వచ్చిన నాకు తలతిరిగినట్లయింది. పల్లెటూళ్ళో ఇంకా సాంప్రదాయాలు మిగిలి ఉంటాయనే నా నమ్మకం వమ్ము అయినందుకు, మళ్ళీ అదే ఆధునికతను ఇక్కడ కూడా చూడాల్సి వచ్చినందుకు బాధేసింది. నా సంబరమంతా ఆవిరైపోయింది. చెయ్యాల్సిన పనులమీ లేవుకదా కనీసం పాత స్నేహితుల్నైనా కలుసుకుందామని ఊరిమీద పడ్డాను.

Friday, October 9, 2009

ప్రజలు గొర్రెల మందలా ?

ఉద్యమాలన్నీ సాధారణంగా ఉన్నతమైన ధ్యేయాలతోనే ప్రారంభిస్తారు. భాదిత వర్గంనుంచే ఉద్యమాలు పుడతాయి. కాకపోతే క్రమేణా అందులో రాజకీయనాయకులు ప్రవేశిస్తారు. తమ రాజకీయ లబ్ధికి అనుకూలంగా వాటిని మలుచుకుంటారు. దాంతో ఉద్యమ ధ్యేయం ప్రక్కకేళ్ళిపోతుంది. ప్రారంభించినవారు అయోమయంలో పడిపోతారు. నెమ్మదిగా ఉద్యమం నీరసించిపోతుంది. మరుగునపడిపోయామనుకున్న రాజకీయ నాయకులకి మళ్ళీ జీవం ఇస్తుంది. ఉద్యమ పునాదులపైన కొంతమంది కొత్త రాజకీయనాయకులు పుట్టుకొస్తారు . ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంద్ర రాష్ట్రసాధన కోసం నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకి ఇప్పటి రాజకీయనాయకులకున్న తెలివితేటలు లేవనుకుంటా ! ఉంటే 58 రోజులు నిరాహారదీక్ష చేసేవాడుకాదు. వారం రోజులో చేసి పెద్దల్ని రప్పించుకుని తన రాజకీయ ప్రయోజనాలపైన స్పష్టమైన హామీలను పొంది నిమ్మరసం తాగేసేవారు. ఉద్యమ ఉద్దేశాలను గంగలో కలిపేసేవారు.అప్పుడు ఆంద్ర రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం ఉండేదికాదు. గుంటూరులో అమృతరావు అనే వ్యక్తి గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన ఉద్యమంలో నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి. పెద్ద ఉక్కు కర్మాగారం వచ్చినా ఆతన్ని మాత్రం మరిచిపోయాం. దానికి కారణం బహుశా అతను రాజకీయనాయకుడు కాకపోవడమేనేమో! ప్రజలలోంచి పుట్టిన ఉద్యమాల పరిస్థితే ఇలాఉంటే ఇక రాజకీయనాయకులు ప్రారంభించిన ఉద్యమాలేలా ఉంటాయో ప్రస్తుత తెలంగాణా ఉద్యమాన్ని చూసి తెలుసుకోవచ్చు. దాన్ని కే.సి.ఆర్. ఎన్ని మలుపులు తిప్పాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరో మలుపు. ఉద్యమాల మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల నాయకత్వం మీద ప్రజలకు విశాసం పోయిందనేది మొన్నటి ఎన్నికలు నిరూపించాయి. నిజానికి తమకు కావలిసింది మౌలిక సదుపాయాలేగానీ రాష్ట్రంలో ఉన్నామనేది కాదని నిరూపించారు. ఎంతగా ప్రాంతీయ బేధాలను రెచ్చగొట్టినా పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త పల్లవి వినిపిస్తోంది. అదే కులబేదాలు. మహాత్మా గాందీ కులమేమిటో ప్రజలేవరూ పట్టించుకోలేదు. ఆయనా పట్టించుకున్న దాఖలాలు చరిత్రలో ఎక్కడా కనబడవు. ఇంతకాలం తర్వాత రోశయ్యగారి పుణ్యమాని కే.సి.ఆర్. ప్రజలకు గుర్తుచేస్తున్నారు. ప్రజలు తమ శక్తి ఏమిటో అంత స్పష్టంగా చెప్పినా ఇంకా అర్థం కాకపోవడం అతని అజ్ఞానమా? కాదు. ప్రజల జ్ఞాపకశక్తి మీద అతనికున్న అపార నమ్మకం, త్వరలోనే అన్నీ మర్చిపోతారని. ప్రజలు గొర్రెల మందని అతని నిశ్చితాభిప్రాయం. దాదాపుగా రాజకీయనాయకులందరి అభిప్రాయం కూడా అదేననుకోండి. ప్రాంతీయ బేధం అంతగా పని చెయ్యలేదు. ఇప్పుడీ కులాల్ని అడ్డుపెట్టుకుని కొంతమందినైనా కదిపితే మళ్ళీ అందరూ నెమ్మదిగా తన వెనుక వచ్చేస్తారనే భావన కే.సి.ఆర్. కి ఉందనుకుంటా !
ఎన్నికల్లో పోటీ చేయడానికి దేశంలోని ప్రతి పౌరుడూ రాజ్యాంగం ప్రకారం అర్హుడే ! కానీ రాజకీయాలు ప్రస్తుతం డబ్బూ, పలుకుబడి, కులం, దాదాగిరి అనే వాటి చుట్టూ తిరుగుతున్నాయి. అవే నిజమైన ప్రజాసేవకుల్ని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. అవకాశాన్ని వ్యవస్థ కల్పించదు. కనుక దీనికున్న ఒకే ఒక పరిష్కారం ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలను పట్టించుకోకుండా ప్రజాసేవ చెయ్యాలనే తలంపు ఉన్న ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఎన్నికలలో పోటీ చేసి గెలిచి తర్వాత కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే ! లేకపోతే మళ్ళీ మళ్ళీ వీళ్ళే పోటీ చేస్తుంటారు. వీళ్ళలోనే ఎవరో ఒకరిని ఎన్నుకోక తప్పనిపరిస్థితి. కానీ అలా పోటీ చెయ్యడం, సమైక్యంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం సాధ్యమా ? ఎన్ని సాధ్యం కాలేదు ? ఇది కూడా సాధ్యమౌతుందని ఆశిద్దాం !! మనిషి ఆశాజీవి దా ! క్షమించాలి. నా రాజకీయ పరిజ్ఞానం పరిమితం. అయినా నేను కూడా ఆశాజీవినే !
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం