Wednesday, October 7, 2009

పెను ఉత్పాతాలు- నా అనుభవాలు

మన రాష్ట్రంలో పెను ఉత్పాతాలుగా చెప్పుకునే రెండు వైపరీత్యాల్లో నా అనుభవాలు.
1. 1977 నవంబర్ 19 తేదీన సంభవించిన దివిసీమ ఉప్పెన
అర్థరాత్రి
- కృష్ణ , గుంటూరు జిల్లాల ప్రజలకు కాళరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా సముద్రం ఒక్కసారిగా విరుచుకుపడింది. అధికారిక లెక్కల ప్రకారం 10,౦౦౦ మంది శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. అనధికారిక లెక్క లక్ష పై మాటే ! ఎక్కడచూసినా గుట్టలుగా మనుష్యుల, పశువుల శవాలు. ఎటు తిరిగినా కూలిపోయిన ఇళ్ళూ, చెట్లూ!! దృశ్యం వర్ణించలేను. తమ కళ్ళ ముందే మనుష్యుల్ని, పశువుల్ని తాడిచెట్టు పరిమాణానికి ఎగరవేస్తుంటే..... బాధితులు చెబుతుండగా వింటుంటేనే నాకు ఒళ్ళు జలదరించింది. మరి స్వయంగా చూసిన వాళ్ల పరిస్థితి..... ....? 20 తేదీన దివిసీమ చేరే దారిలేక గుంటూరు జిల్లాలో బాపట్ల ప్రాంతానికి అతి కష్టం మీద చేరుకోగలిగాను. బీభత్సకర దృశ్యాల్ని చూసి మనసు కకావికలమై పోయింది దివిసీమ వెళ్లాలనుకున్నా ధైర్యం చాలక వెనుదిరిగాను.
2. 1986 ఆగష్టు నెల లో గోదావరికి వచ్చిన వరద
ఆగష్టు
15 తేదీ స్వాతంత్ర్య దినోత్సవం. జెండా వందనం జరిగింది. అప్పుడే ఒక మిత్రుడు కబురు మోసుకొచ్చాడు. గోదావరి ఉప్పొంగి మా కోనసీమను చుట్టుముట్టిందని. ఉభయ గోదావరి జిల్లాల్లో మెట్ట ప్రాంతాలు తప్ప మిగిలిని ప్రాంతమంతా జలదిగ్భంధమైపోయింది . అప్పటికి వారం రోజులనుండి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆరోజే తెరిపిచ్చాయి. రెండురోజులుగా వరద హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. అయితే వర్షాలు, వరదలూ అలవాటైపోయిన ప్రజలు అది మామూలు విషయంగానే తీసుకున్నారు. అదీకాక ఇంతటి సమాచార వ్యవస్థ అప్పుడులేదు. రేడియోనే ఆధారం. అదికూడా చాలా తక్కువమందికే ఉండేది. వరద తీవ్రత సమాచారం ప్రజలకి చేరకముందే వరద చేరిపోయింది. లంక గ్రామాలన్నీ ముంచేసింది. అంతకంతకూ పెరుగుతున్న ప్రవాహం మధ్యనుంచి ఇళ్ళ పైకప్పులమీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ప్రజల్ని ఒడ్డుకి చేర్చటం గగనమైపోయింది. అక్కడక్కడా పాక్షికంగా మునిగిపోయిన ఇళ్లలోని జనం తమ ఆస్తుల్ని వదిలి రావడానికి మొండికేసేవారు. వాళ్ళని బ్రతిమాలి, మొండికేస్తే బెదిరించి సురక్షిత ప్రదేశాలకు తీసుకురావలసి వచ్చేది. రహదారులన్నీ తెగిపోయాయి. రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ కుప్పకూలాయి. స్థంబాలు నేలకోరగటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గట్లు తెగిపోకుండా యువకులు, పోలీసులు, రెవిన్యూ సిబ్బంది కలిసికట్టుగా కాపలాకాసి కొన్ని గ్రామాలను కాపాడగలిగారు. అప్పటి అమలాపురం ఆర్డీవో శ్రీ సుబ్రహ్మణ్యం గారు యువకుడు. సాహసి. విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్న గోదావరిలోకి అందుబాటులో ఉన్న మామూలు నాటు పడవలో వెళ్లి మునిగిపోతున్న ఊరిని, ప్రజల్ని రక్షించడం, స్ఫూర్తితో నాలాంటి యువకులు సహాయకార్యక్రమాల్లోకి స్వచ్చందంగా దిగిపోవడం నేనింకా మర్చిపోలేను. పోలీస్, రెవిన్యూ వైర్లెస్, ఇలాంటి వైపరీత్యాలు సంభవించినపుడు అత్యవసరంగా ఉపయోగించే టెలీ కమ్యూనికేషన్స్ వారి వైర్లెస్ తప్ప మరే ఇతర సమాచార వ్యవస్థ పనిచేయకపోయినా, ఎక్కడైనా సమస్య ఉందని ఏరకమైన సమాచారం అందినా వారి సిబ్బందితో బాటు మమ్మల్ని కూడా సిద్ధం చేసి తక్షణం అక్కడ ప్రత్యక్షమయ్యే వారు. రహదారులు వరద నీటితో నిండిపోయి, గండ్లు పడి వాహనాలు వెళ్ళే పరిస్థితి లేని చోట కాలినడకన నీటిలో వెళ్లి రక్షణ కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం. ప్రభుత్వాధికారులు రాలేదనే మాట ఎక్కడా వినపడేది కాదు. ఆయన ఇప్పుడేక్కడున్నారో ? అలాంటి అధికారులుంటే ఉద్యోగులకే కాక, ప్రజలకు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉత్సాహం ఉంటుంది. గోదావరి చరిత్రలో అతి పెద్ద వరదలవి. గణాంకాలు సరిగా గుర్తులేదుగానీ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర వచ్చిన కృష్ణానది నీటిమట్టం కంటే కాటన్ బ్యారేజీ దగ్గర కొంచెం ఎక్కువగానే వచ్చినట్లు గుర్తు. ఇప్పటిలా నీటి ప్రవాహాన్ని నియత్రించే పరిస్థితి లేకపోవడం దీనికి కారణం కావచ్చు. ప్రస్తుతం సుమారుగా స్థాయి వైపరీత్యాన్ని దగ్గరుండి చూస్తున్న నాకు అప్పటి అనుభవాలు గుర్తుకొచ్చాయి. అయితే ఒక్క విషయం అలా స్పూర్తినిచ్చే అధికారులు ఇప్పుడు అంతగా కనబడడంలేదు. యువకుల్లో యాంత్రికత పెరిగిందేమోననిపిస్తోంది. కృష్ణా వరదల్లో స్వచ్చందంగా సహాయ కార్యకమాల్లో పాల్గొన్న దాఖలాలు అంతగా కనబడలేదు. ఎవరో వచ్చి కాపాడుతారులే మనకెందుకు అనే నిర్లిప్త కనబడుతోంది. ప్రభుత్వోద్యోగులు కూడా మనుష్యులే ! ఇంతటి విపత్తు సంభవించినపుడు పరిమిత సంఖ్యలో వుండే ప్రభుత్వోద్యోగులు మీదనే ఆధారపడకుండా మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలనే ఆలోచన ప్రజల్లో ముఖ్యంగా యువకుల్లో ఉండాలి. స్ఫూర్తి ఉంటే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు.

3 comments:

సుభద్ర said...

అవున౦డీ,ప్రబుత్వధికారులు కూడా బాదితులే!!!అ౦దుకే ప్రభుత్వ౦ ప్రక్క జిల్లా లా య౦త్రా౦గాన్ని ర౦గ౦ లోకి ది౦పాలి.ప్రజలు కుడా కొ౦చ౦ చోరవ చూపి౦చాలి.
మీకు 1996 నవ౦బర్ లో కోనసీమ తుఫాన్ గుర్తు లేదా??ఆ టై౦ లో ల౦క ఊళ్ళు "ప౦డీ","పోరా" లో వేలలో జనాలు చనిపోయారు.

SRRao said...

గుర్తుంది. ఆ విలయం తర్వాత కోనసీమలో తలెత్తుకు నిలబడే కొబ్బరిచెట్లు తలదించి నేలవాలడం చూసి నాకు కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. కోనసీమ చరిత్రలో అదొక పెను విషాదం. కాకపొతే నేను రాసిన రెండూ నేను స్వయంగా అనుభవించినవి. 1996 నాటికి ఉద్యోగ రీత్యా అక్కడ లేకపొవడంతో విలయానంతర విషాదాన్నే చూడగలిగాను. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనలేకపొయాను.

మంచు said...

86 వరదలకి మా ఇంటి డాబా మీద 8 రోజులు వున్నాం. చుట్టుపక్కల వెరే డాబాలు లేక మాతొ పాటు ఇంకొ 4 కుటుంబాలు మా డాబా మీదే వున్నాయి . రోజు పడవలలొ మాకు పాలపొడి, పులిహొర పొట్లాలు ఇచ్చేవారు. అప్పుడప్పుడు మా వాళ్ళు మా వీదుల్లొ ఈదుకుంటూ వెళ్ళి పులిహొర తెచ్చెవారు. (ఆ వరదల్లోనే మా డాబా మీద అడుతుంటే ఇనుపచువ్వ గుచ్చుకుని నా బుర్ర కి చిల్లుపడింది.. డొక్టర్ దొరకక మేము పడ్డ బాదలు అంతా ఇంతా కాదు)
96 తుఫాను కి కాకినాడ లో వున్నా.. కాళరాత్రి అంటే అదే..

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం