Tuesday, October 6, 2009

సర్వ మానవ సమానత్వం

తుఫాను వాతావరణం. ఒక పండితుడు అవతలి వడ్డుకు వెళ్లడానికి నది దగ్గరకు వచ్చాడు. పడవ మాట్లాడుకున్నాడు. ప్రయాణం సాగుతోంది. పండితుడు కాలక్షేపానికి పడవవాడి జ్ఞానాన్ని పరీక్షించాలనుకున్నాడు. " ఒరేయ్ అబ్బీ! నీకు వ్యాకరణ శాస్త్రం తెలుసా ? " అని అడిగాడు. "తెలీదు బాబయ్యా !" అన్నాడు పడవవాడు. " అయితే నీ జీవితంలో పావువంతు వృధా ! నేను చూడు వ్యాకరణ శాస్త్రాన్ని ఔపోసన పట్టేశాను. సరేగానీ వేదాలు తెలుసా ? " అడిగాడు పండితుడు. "వేదాలా ! అంటే ఏటి బాబయ్యా !" ఆశ్చర్యకరంగా అడిగాడు పడవ మనిషి. " వేదాలంటే కూడా తెలీదా ? పోనీ... తర్కం, మీమాంస లాంటి వాటిగురించేనా విన్నావా ? " అన్నాడా పండితుడు. అబ్బే లేదన్నాడు పడవవాడు. పండితుడికి అతడి మీద చాలా జాలి వేసింది. " నిన్ను చూస్తే చాలా భాద వేస్తోందిరా అబ్బీ ! నీ జీవితంలో మూడువంతులు వృధా చేసుకున్నావురా !!" అన్నాడా పండితుడు. ఇంతలొ పెద్ద గాలి. ఒక పెద్ద అల పడవను తాకింది. పండితుడు కంగారు పడ్డాడు. పడవవాడు అడిగాడు " తమరికి ఈత వచ్చా బాబయ్యా ? " అని. " రాదురా ! ఇప్పుడెలా ? " అన్నాడు భయం భయంగా. " అయితే మీ జీవితం మొత్తం వృధా !! " అంటూ నదిలోకి దూకేసాడు పడవవాడు.
ఇది అందరికీ తెలిసిన కథే ! అందులో విశేషం లేదు. కానీ కథలో భిన్న కోణాలున్నాయి. అందులో ఒకటి అహం పనికి రాదన్నదైతే మరొకటి ప్రకృతి దృష్టిలో పండితుడు పామరుడు అనే తేడాలేమీ లేవనేది. అలాగే ప్రకృతికి బీదా గొప్పా తేడాలు కూడా ఉండవు. దానికి ఉదాహరణ తాజా వరదలు. భేదాలేమీ లేకుండా అందర్నీ ముంచెత్తింది. డబ్బు, పలుకుబడి కల వాళ్లు సైతం వాటిని ఉపయోగించి వరదని ఆపలేకపోయారు. ఇవన్నీ శాశ్వతం కాదని హెచ్చరించింది. ప్రకృతిలో అందరూ సమానమే! సృష్టిలో తేడాలు లేవు అని చాటి చెప్పింది. మనిషి తన సృష్టేనని గుర్తుచేసింది. అహంకారం పోరలుకమ్మి తన ఉనికిని తాను మరచిపోతున్న మనిషికి నువ్వు నా ముందు చాలా అల్పుడివిరా అని నెత్తి మీద మొట్టినట్లు అప్పుడప్పుడూ ఇలా తన ప్రతాపం చూపిస్తోంది . ఎంత అభివృద్ది సాధించినా ప్రకృతిని శాసించలేకపోతున్నాం. వరదల్ని, తుఫానుల్ని ఆపలేకపోతున్నాం . ఆపలేం కూడా ! మానవ మనుగడకు ప్రకృతిని ఉపయోగించుకునే శాస్త్ర సాంకేతిక అభివృద్ది అవసరమే కానీ మానవాళికి ముప్పుగా పరిణమించే అభివృద్ది ఆత్మహత్యా సదృశ్యం కాదా ? మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు అభివృద్ది దేనికోసం ? ఎవరికోసం ? ప్రకృతిని జయించగలిగాననుకోవడం ఎంత అవివేకం ! ఉదాహరణకు ప్రకృతిలో సహజంగా పెరిగే వైరస్ ద్వారా వచ్చే జబ్బులేన్నిటికో విరుగుడు కనిపెట్టాననుకున్నాడు మానవుడు. కానీ వాటిని కూడా తట్టుకునే కొత్త వైరస్ లెన్నో పుట్టుకొస్తున్నాయి. ప్రకృతిని జయించడం కల్ల . మనలోని అహాన్ని జయించి ప్రకృతి సహజత్వానికి భంగం కలగకుండా,అత్యాశకు పోకుండా మన మనుగడకు ఎంతవరకూ అవసరమో అంతవరకూ అభివృద్ధిని పరిమితం చేస్తే ప్రకృతి కూడా తన సహజ పద్ధతిలో నడుచుకుంటుంది. బీదా గొప్పా , కుల మత జాతి ప్రాంతీయ, పండిత పామర భేదాలు ప్రకృతికి లేవు. పుట్టుకతో మనుషులందరూ సమానమే! వారి వారి కర్మలను బట్టి , గుణాలను బట్టి విభజనలుంటాయని ఆది శంకరుల మాట. ఇది అక్షర సత్యం.
కొస మెరుపు : ఇదంతా నిజమే! కానీ మేము కొంచం ఎక్కువ సమానం అని కర్నూల్ లో కొంతమంది బడాబాబులు నిరూపించారు. తమ డబ్బు, పలుకుబడి ఉపయోగించి నీటి గండం నుంచి తప్పించుకోవడమే కాక వరద నీరు మిగిల్చిన బురద శుభ్రం చెయ్యడానికి ప్రభుత్వం పంపించిన యంత్రాలను , సిబ్బందిని కూడా కొనేస్తున్నారు. మరి సామాన్యుల సంగతి, వారికి పంపుతున్న పరిహారం సంగతి..... దేవుడికే తెలుసు. అన్నట్లు ఆయన కూడా వాళ్ల పక్షమే కదా!



3 comments:

జయ said...

జీవిత సారం వడబోసినట్లు, చాలా వివరంగా రాసారండి. ఎంతటి పామరులకైనా అర్ధమై తీరుతుంది.

మంచు said...

1. " ఎంత అభివృద్ది సాధించినా ప్రకృతిని శాసించలేకపోతున్నాం."
2. ప్రకృతిని శాసించేటంత అభివృద్ది మనమింకా సాదించలేదు"
ఈ రెండు వాక్యాల్లొ ఎది నిజం అనుకుంటున్నారు ?

నిజమే.. ప్రకృతిని జయించగలిగాననుకోవడం, జయించాలనుకొవడం ఎంత అవివేకం ! అది జరగదు. అందుకే నేను సైన్స్ కన్నా ఇంకా ఎదొ పెద్దది వున్నదనుకుంటా.. దాన్ని నేను దైవం నమ్ముతా..

SRRao said...

జయ గారు ! కృతజ్ఞతలు
మంచుపల్లకీ ! రెండూ నిజాలే !
1. అంతరిక్ష నుండి సముద్రలోతుల్ని శోధించేటంత అభివృద్ది సాధించాం కానీ ప్రకృతి చేసే చిన్న బీభత్సాన్ని కూడా ఆపలేకపోతున్నాం.
2. ఎప్పటికప్పుడు అప్పటి అనుభవాలతో ప్రకృతికి అడ్డుకట్ట వెయ్యగలుగుతున్నామనుకుంటున్నాం. కానీ వాటిని అధిగమించి ప్రకృతి తన ప్రతాపాన్ని చూపుతోంది.
కాబట్టి ప్రకృతిని శాసించేటంత అభివృద్ధ్హి మనమెప్పటికీ సాధించలేమని ప్రకృతే మనకెప్పటికప్పుడు గుర్తు చేస్తోంది.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం