Wednesday, March 31, 2010

నాటకరాజం

కనుక్కోండి చూద్దాం - 13

సుమారు మూడు దశాబ్దాల క్రితం ఆంద్ర దేశాన్ని
అనేక వేల ప్రదర్శనలతో ఉర్రూతలూగించిన
ఒక రంగస్థల నాటకంలోని సంభాషణలివి.

* ఆ నాటకం పేరేమిటి ?
* ప్రధాన పాత్రను పోషించిన నటుడెవరు ?Vol. No. 01 Pub. No. 240

Tuesday, March 30, 2010

రెండు తెలుగు జాతి రత్నాలు

కనుక్కోండి చూద్దాం - 12పై ఫోటోలో వున్నది తెలుగు జాతికే అలంకారంగా భాసించిన ఇద్దరు ప్రముఖులు.
ఎవరా ఇద్దరు ?
వారు ప్రసిద్ధి చెందిన రంగాలేవి ?

జవాబులు : ఒకరు
భావకవి - దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
మరొకరు
బావ.. కవి - నండూరి వెంకట సుబ్బారావు గారు


Vol. No. 01 Pub. No. 239

Monday, March 29, 2010

అపర త్యాగయ్య

నాగదేవత శర్మ దంపతులకు ప్రసాదించింది నాగేశ్వర్ ని
నటరాజు తెలుగు ప్రేక్షకులకు ప్రసాదించాడు నాగయ్యను
కాదు... కాదు..... అపర త్యాగయ్యను

ఆంగికం, వాచికం, ఆహార్యం నాగయ్య సొత్తు
అదే అలరించింది తెలుగువారిని యావత్తు
తెలుగుచిత్ర చరిత్రలో చెదిరిపోని జ్ఞాపకం నాగయ్య
అందుకే అయ్యాడు తెలుగు వారికి అతడు మరో త్యాగయ్య


జాలి, దయ, పరోపకారాలే నిజమైన నిధులని నమ్మి
తనకున్న నిధినంతా దానధర్మాలు చేసేసి
అంతులేని కీర్తి అనే పెన్నిధి స్వంతం చేసుకుని.......

నిధి చాలా సుఖమా !
రాముని సన్నిధి చాలా సుఖమా !!


అంటూ రాముని సన్నిధికి చేరిన అపర త్యాగయ్య ' నాగయ్య ' గారి జన్మదినం సందర్భంగా ఆయనకు స్మ్రత్యంజలి
నాగయ్య గారిపై గతంలో రాసిన టపా నాన్నగారు నాగయ్య

Vol. No. 01 Pub. No. 238

Saturday, March 27, 2010

రంగస్థలం


నటరాజు నాట్యం చేసే స్థలం రంగస్థలం.
నటనను సజీవంగా చూడగలిగే స్థలం రంగస్థలం.

అటువంటి రంగస్థలం పరిస్థితి ప్రస్తుతం క్షీణదశలో వుందనే చెప్పవచ్చు. సాంకేతికాభివృద్ధి క్రమంలో రంగస్థలాన్ని సినిమా కొంతవరకూ మింగేస్తే, టెలివిజన్ దాదాపుగా కనుమరుగు చేసేసింది. ఒకప్పుడు రంగస్థల కళాకారులకు పునరావాసంగా చలనచిత్ర రంగం వుంటే నేడు టెలివిజన్ రంగం పునరావాసం కల్పిస్తోంది. కానీ రంగస్థలం పాటించిన సామాజిక విలువలకు టెలివిజన్ కార్యక్రమాలు దూరంగా వున్నాయనే చెప్పవచ్చు. గతంలో దూరదర్శన్ నాటకాల్ని, ఇతర రంగస్థల కళల్నీ ప్రసారం చేసేది. ప్రస్తుతం ప్రైవేట్ ఛానల్స్ ద్వారా ఎదుర్కొంటున్న వ్యాపారాత్మక పోటీ కారణంగా అది కూడా గత వైభవంగా మిగిలిపోయింది.

కొంతకాలం క్రితం వరకూ అక్కడక్కడా నిర్వహించే పరిషత్తులు నాటక రంగాన్ని కొంతవరకూ నిలబెట్టాయనే చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం ఆ పరిషత్తులు కూడా కనుమరుగయిపోతున్నాయి. ప్రభుత్వ నిర్వహణలో జరిగే నంది నాటకోత్సవాలు నాటక రంగ పతనానికి నాంది పలుకుతున్నాయి. ఆదరణ కరువైపోతున్న రంగస్థలాన్ని కాపాడుకునే దిశగా కళాకారులు, కళాభిమానులూ, ప్రభుత్వం నడుం బిగిస్తే రంగస్థలానికి పూర్వ వైభవం తీసుకు రావచ్చేమో !

నేడు ( మార్చి 27 ) ప్రపంచ రంగస్థల దినోత్సవం . 1961 లో అంతర్జాతీయ రంగస్థల శిక్షణా సంస్థ మొదటిసారిగా ఈ అంతర్జాతీయ రంగస్థల దినోత్సవాన్ని ప్రకటించింది. అప్పట్నుంచీ ప్రతి సంవత్సరం ఆ సంస్థతో బాటు అంతర్జాతీయ రంగస్థల సమాజమంతా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటోంది. ఆరోజు అంతర్జాతీయంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ సందర్భంగా రంగస్థలం నుంచి గానీ, మరే ఇతర రంగాలనుంచి గానీ ప్రముఖులైన వ్యక్తులతో రంగస్థలంపై వారి అభిప్రయాలను ఒక ప్రత్యేక సందేశం ద్వారా ప్రపంచానికి అందిస్తారు. ఈ సంవత్సరానికి ప్రముఖ ఆంగ్ల చిత్ర, రంగస్థల, టీవీ నటి డామ్ జూడి డెంచ్ ఆ సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని ఇక్కడ చూడవచ్చు. 2002 లో మన భారతీయ నటుడు, ప్రయోక్త గిరీష్ కర్నాడ్ తన సందేశాన్నిచ్చారు.

రంగస్థల దినోత్సవ సందర్భంగా కళాకారులకు, కళాభిమానులకు శుభాకాంక్షలతో.....

గతంలో తెలుగు నాటక రంగ నటరత్నాలను పరిచయం చేస్తూ అందించిన ' తెర తీయగ రాదా ! ' చూడండి.


Vol. No. 01 Pub. No. 237

53 వసంతాల 'మాయాబజార్'

ఒక చలన చిత్రం 53 సంవత్సరాలపాటు ప్రజల హృదయాల్లో సజీవంగా వుండగలగడమే గొప్ప అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆధునిక హంగులు సంతరించుకుని కొత్తగా విడుదల కావడం, అర్థ శతదినోత్సవం జరుపుకుని మరోసారి విజయ ఢంకా మ్రోగించడం మరీ గొప్ప కదా !  ఆ గొప్పతనం ఇంకే చిత్రానిదై వుంటుందీ.........
మాయాబజార్ కాక !                               
 
ఆ చిత్రరాజ సృష్టికర్తల్ని ఒకమారు తల్చుకుందాం !

నిర్మాణం : విజయా ప్రొడక్షన్స్   
విజయా ప్రొడక్షన్స్ వారు, అతి భారీగా నిర్మించిన " మాయాబజార్ " చిత్రం 27-3-1957 న విడుదలైంది. అంటే నేటికి సరిగా 53 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. 

నిర్మాతలు : నాగిరెడ్డి, చక్రపాణి    
ఉత్తమమైన అభిరుచితో, విశిష్టమైన చిత్రాలను నిర్మించిన నాగిరెడ్ది, చక్రపాణి ' మాయాబజార్ ' చిత్రాన్ని ' నభూతో నభవిష్యతి ' అన్నట్లు నిర్మించారు. 10  - 12 లక్షల్లో చిత్రాలు తియ్యగలిగే ఆ రోజుల్లో ' మాయాబజార్ ' కు 26 -30 లక్షల వరకూ వ్యయమైనట్లు అంచనా. ఆ చిత్ర నిర్మాణానికి సంబంధించి స్క్రిప్టు, స్కెచ్ లు, నటీనటుల నిర్ణయాలూ అన్నీ అయిన తర్వాత,  ' ఇంత పెద్ద మొత్తంతో ఇంత పెద్ద చిత్రం తీస్తే ఏమవుతుందో ' అన్న అనుమానం వచ్చింది. కొంతకాలం ఆరంభించకుండా ఆపి, చర్చలు జరిపి, బాగా నమ్మకం కుదిరిన తర్వాతనే ఆరంబించి, ఎక్కడా ఏమాత్రం రాజీపడకుండా అనుకున్న కాలానికి నిర్మాణం పూర్తి చేశారు. విడుదలయిన తర్వాత, మ్రోగిన ' విజయ ఢంకా ' నేటికీ మోగుతూనే వుంది.

దర్శకత్వం : కె.వి. రెడ్డి  
పౌరాణిక చిత్రాల్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే గల చిత్రంగా ' మాయాబజార్ ' ను కీర్తిస్తారు. అంత పెద్ద కథను, గందరగోళం లేకుండా, సూటిగా చెప్పడంలో దర్శకుడు, రచయితల ప్రజ్ఞను అంతా చెప్పుకుంటారు. చిత్రంలో అడుగడుక్కి పాండవుల ప్రసక్తి వస్తూనే వున్నా, చిత్రం మొత్తం మీద పాండవులను చూపకుండా, వారున్నారన్న భ్రాంతిని కలిగించడం - గొప్ప విశేషం !

ఛాయాగ్రహణం : మార్కస్ బార్ ట్లే     
' లాహిరి లాహిరి ' పాటను మూడుస్థలాల్లో మూడు వేర్వేరు వేళల్లో చిత్రీకరించినా - పాట మొత్తం అంతా ఒక్కసారే ఒక్కచోటే తీసిన భ్రమ కల్పిస్తుంది. పగటి వేళలో వెన్నెల కిరణాలతో వున్నట్టుగా నదిని, స్టూడియో చంద్రుడి వెన్నెలతో తళతళలాడి పోతున్న తెల్ల గడ్డి సెట్టునూ, బ్యాక్ ప్రొజెక్షనుతో క్లోజప్స్ నూ తీసి, కలిపి చూపించడంలో లైటింగ్ లో గాని, ఎడిటింగ్ లో గాని ఎక్కడా తేడా కనిపించదు ! టెక్నికల్ పెర్ ఫెక్షన్ కు - ' లాహిరి లాహిరి ' పాట చిత్రీకరణ ఒక ఉదాహరణ. సినిమాల్లో వెన్నెల చూపించడం, చాయాగ్రాహకుడు మార్కస్ బార్ ట్లేకి సాధ్యమైనట్లు, అన్యులకు సాధ్యం కాదేమో ! సహజ ప్రకృతిలో నిర్మలమైన పూర్ణ చంద్రుడు కనిపిస్తే ' విజయావారి చంద్రుడిలా వున్నాడు ' అని మనం మెచ్చుకోవడం బార్ ట్లే ఘనత !  

సంగీతం : ఘంటసాల వెంకటేశ్వర రావు   
' మాయాబజార్ ' చిత్రానికి టైటిల్స్ లో ' సంగీతం : ఘంటసాల ' అని వేసినా, నాలుగు పాటలకు యస్. రాజేశ్వరరావు వరసలు కల్పించారు. ఆదిలో ఆయన్నే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. కానీ, కారణాల వల్ల ఆయనకు కుదరనందువల్ల నాలుగు పాటలు ' కంపోజ్ ' చేసిన తర్వాత, ఘంటసాలనే సంగీత దర్శకుడిగా, విజయా వారు స్థిరపరిచారు. ఐతే, ఆ నాలుగు పాటలూ కొంతవరకూ ' కంపోజింగ్ ' మాత్రమే అయినాయి గానీ, రికార్డింగ్ జరుగలేదు. ఆర్కెస్ట్రేజేషనూ, రికార్డింగూ అంతా ఘంటసాలే చేశారు గనుక ఆయన పేరే వేశారు. రాజేశ్వరావు వరసలు కల్పించిన ఆ నాలుగు పాటలూ : లాహిరి లాహిరి లాహిరిలో...., నీవేనా నను తలచినది..., చూపులు కలసిన శుభవేళ...., నీకోసమే నే జీవించునదీ.....
కథాకల్పన, మాటలు, పాటలు : పింగళి నాగేంద్ర రావు     " లక్ష్మణ కుమారుడు, వీరాధివీరుడైన దుర్యోధనుని కుమారుడే, అతన్నేమిటి చిత్రంలో వెర్రి వెంగళప్పలాగా, వెకిలిగా చిత్రించారు ? " అన్న విమర్శలు ఆ రోజుల్లో వినిపించాయి. ఆ విమర్శ గురించి ఓసారి నాగేంద్రరావు గారు మాట్లాడుతూ " లక్ష్మణకుమారుడు ధీరుడనో, శూరుడనో మహాభారతంలో లేదు. అతనిది పెద్ద పాత్ర కూడా కాదు. భారత యుద్ధం జరిగినప్పుడు, యుద్ధంలో ప్రవేశిస్తూనే అభిమన్యుడి చేతిలో మరణించాడు లక్ష్మణకుమారుడు. ఆ చిన్న విషయాన్ని తీసుకుని, ఆ పాత్రను హాస్యపాత్రను చేసి మలిచాము. అదేం తప్పు కాదు. కారెక్టరైజేషన్ లో ఔన్నత్యం వుంటే, ఆ ఔన్నత్యాన్ని కాదని, ఆ పాత్రను నీచంగా చిత్రిస్తే తప్పు గానీ, ఎలాంటి పాత్రతా లేని, ఒక పాత్రను తీసుకుని హాస్యానికి వాడుకోవడంలో తప్పులేదు, అది అనౌచిత్యమూ కాదు " అన్నా్రు.   

శబ్దగ్రహణం : ఎ. కృష్ణన్, వి. శివరాం             
కళ  : గోఖలే, కళాధర్  
నృత్యం : పసుమర్తి కృష్ణమూర్తి, గోపీనాథ్
కూర్పు : జంబులింగం, కళ్యాణం  
ఆహార్యం : పీతాంబరం, భక్తవత్సలం              
నిశ్చల చిత్రాలు : వృషభేంద్రయ్య  
నేపథ్యగానం : ఘంటసాల, మాధవపెద్ది, పి. లీల, సుశీల, వసంతకుమారి, జిక్కి
నాట్యాలు : గోపీనాథ్, లలితారావు, రీటా, సరోజ
స్టూడియో : వాహినీ


' మాయాబజార్ ' విశేషాలు రావికొండలరావు గారు సంకలనం చేసిన సినిమా నవల లోనివి. విశాలాంధ్ర వారి ప్రచురణ.

Vol. No. 01 Pub. No. 236

Friday, March 26, 2010

అరుదైన స్కెచ్

కనుక్కోండి చూద్దాం - 11


పైన కనిపిస్తున్న చిత్రం అఖిలాంద్ర ప్రేక్షకుల్నీ, ఆబాలగోపాలాన్నీ అర్థశతాబ్దం పైబడి అలరిస్తున్న మరుపురాని, మరువలేని తెలుగు చిత్రంలోని ఒక సెట్ కి కళాదర్శకుడు వేసిన స్కెచ్.

ఆ చిత్రం ఏమిటో .... ? - మాయాబజార్
ఆ సన్నివేశం ఏమిటో ... ? - ఘటోత్కచుడి ఆశ్రమం
ఆ కళాదర్శకుడెవరో..... ? - గోఖలే ( మాయాబజార్ కి గోఖలే, కళాధర్ లిద్దరూ కళా దర్శకత్వం నిర్వహించినా స్కెచ్ మాత్రం గోఖలే గారు గీసింది. )
.................. చెప్పగలరా ?

Vol. No. 01 Pub. No. 235

Wednesday, March 24, 2010

కనుక్కోండి చూద్దాం - 10 - జవాబులు

అదొక తెలుగు సినిమా కుటుంబం.
  • తండ్రి గత తరంలో ప్రముఖ దర్శకుడు - కె. యస్. ప్రకాశరావు
  • ఆయన భార్య కూడా గత తరంలో ప్రముఖ నటీమణి - జి. వరలక్ష్మి
  • కొడుకు మెగా.. మెగా... దర్శకుడు - కె. రాఘవేంద్రరావు
  • మరో కొడుకు ప్రముఖ చాయాగ్రాహకుడు - కె. యస్. ప్రకాష్
  • అన్నగారి కొడుకు రెండు భాషల్లో ప్రముఖ దర్శకుడు - కె. బాపయ్య


Vol. No. 01 Pub. No. 234

అంతా రామమయం !

ఎక్కడ చూసినా రామనామం. ఊరంతా పెళ్లి కళ.
సీతారాముల కళ్యాణమంట.... చూసిన వారిదే వైభోగమంట.... అందుకే.....

రామకథా... శ్రీరామకథా.....
ఎన్ని మార్లు ఆలించినగానీ.... ఎన్నిమార్లు దర్శించినగానీ..... తనివితీరని దివ్యకథా !!

మరోమారు ఆ దివ్య గాథను విని తరించండి.


అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
Vol. No. 01 Pub. No. 233

Monday, March 22, 2010

కనుక్కోండి చూద్దాం - 10

అదొక తెలుగు సినిమా కుటుంబం.
ఎవరు వీళ్ళంతా ? వరుసగా చెప్పగలరా ?

Vol. No. 01 Pub. No. 232

Sunday, March 21, 2010

నిదురపోరా తమ్ముడా !

ష్....! గప్ చుప్ .....

*
*
*
*
ఎక్కడనుంచి హాయి గొలిపే ఆ మధుర గానం ?......... మంచి నిద్ర వస్తోంది. ...... ఎవరు ఆ గాన కోకిల ?


మొన్న 19 వ తేదీ ప్రపంచ నిద్రా దినోత్సవం సందర్భంగా .............
Vol. No. 01 Pub. No. 231

Saturday, March 20, 2010

' శోభన ' మైన ' బాబు '

1959 లో ' దైవబలం ' చిత్రంతో చిత్ర సీమలో అడుగుబెట్టిన ఉప్పు శోభనాచలపతిరావు 1960 లో ' భక్త శబరి ' చిత్రంతోనే శోభన్ బాబు గా ప్రేక్షకుల ముందుకొచ్చారు.

అనేక రకాల ఒత్తిళ్ళు, రాజకీయాలకు నెలవైన సినిమా ప్రపంచంలో ప్రశాంతమైన జీవితం గడిపిన నటుడు శోభన్ బాబు. ఆకర్షణలకు, వ్యామోహాలకు, పొగడ్తలకు లొంగి సంపాదించినదంతా హారతి కర్పూరం చేసెయ్యడం సినిమా జీవులకు అలవాటు. అందుకు భిన్నంగా సంపాదనను జాగ్రత్త చెయ్యడమే కాకుండా మరింత వృద్ధి చేసిన జాగ్రత్తపరుడు. కొంతమంది ఎన్ని అనుభవాలు ఎదురైనా వాటి నుంచి నేర్చుకుని భవిష్యత్తులో జాగ్రత్తపడరు. అహం అడ్డొస్తుంది. కానీ సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు, సీనియర్ల అనుభవాలు శోభన్ బాబుని జాగ్రత్తపడేలా చేసాయి.

' వీరాభిమన్యు ' ఆయన నటజీవితాన్ని మలుపుతిప్పిన చిత్రం. కార్మిక నాయకుడిగా ' మనుష్యులు మారాలి ', సంఘర్షణకు లోనయ్యే రెండు విభిన్న పాత్రల్లో ' మానవుడు దానవుడు ', గ్లామర్ కు ఏమాత్రం ఆస్కారంలేని పాత్రలో ' చెల్లెలి కాపురం ', ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే పాత్రల్లో ' ఇల్లాలు ప్రియురాలు ', ' గోరింటాకు ', ' కార్తీకదీపం ' వగైరా, ' భక్త శబరి ', ' భీష్మ ' , 'నర్తనశాల ', ' వీరాభిమన్యు ', ' సంపూర్ణ రామాయణం ', ' కురుక్షేత్రం ' లాంటి పౌరాణిక చిత్రాల్లో, ' తాసిల్దారుగారి అమ్మాయి ', ' రాధాకృష్ణ ', ' జీవనతరంగాలు ' లాంటి నవలా చిత్రాల్లోనూ విభిన్నమైన పాత్రలను పోషించిన విలక్షణ నటుడాయన,

మితంగా మాట్లాడటం, పబ్లిసిటీకి దూరంగా వుండటం ఆయన నైజం. సాయింత్రం ఆరు గంటల తర్వాత షూటింగ్లో పాల్గొనకపోవడం, ఆదివారం సెలవు తీసుకోవడం, కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సమయం గడపడం ఆయన తనకు తాను విధించుకున్న నియమాలు. 1997 లో షష్టిపూర్తి జరిగాక ఎందరెన్ని చెప్పినా చిత్రసీమనుంచి రిటైర్ అయ్యి చివరి వరకూ ప్రశాంత జీవనం గడిపారు. అందాల నటుడిగా శోభాయమానంగా వెలిగిన శోభన్ బాబు 20 మార్చి 2008 న స్వర్గస్తులయ్యారు. ఆయన వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.........Vol. No. 01 Pub. No. 230

Friday, March 19, 2010

కిలుం

" ఆడదాన్ని నలభైఏళ్ళు వచ్చేవరకూ శృంగారానికి పనికివచ్చే ఒక వస్తువుగా బాధించటమేకాదు. ఆ తర్వాత ఆమె పెట్టే బంగారు గుడ్డు కోసం కాపువాడిలా, సంఘంలో ప్రతి మగాడు కాపువేస్తాడు. కనీసం ఆ సంస్కృతి మన భారతదేశంలో లేదనుకుంటున్నాను. వయసు మళ్ళిన కొద్దీ, డబ్బు సంపాదిస్తున్న కొద్దీ అక్కడసలు రక్షణ లేదనిపిస్తుంది. అలాంటి నైతికమైన ఆలోచనకి మన సంస్కృతి, మన మతం, మన ఆచారాలు సహకరిస్తాయని నేననుకుంటున్నాను " అంది విమల.


కమల నోరు వెళ్ళబెట్టి చూస్తూండిపోయింది. అమెరికాలో స్త్రీ సంపూర్ణ స్వేఛ్ఛ అనుభవిస్తోందనీ, విడాకులు సులభంగా పొందుతోందనీ, పునర్వివాహం సులువుగా చేసుకోగలుగుతోందనీ, మరి ఇవన్నీ ఏమిటీ......అసలు సంస్కృతి అంటే ఏమిటీ ?

............................................................

దూరపు కొండలు నునుపు అనేది మనకు తెలిసిన విషయమే ! నాగరికత పెరిగింది. ప్రపంచమంతా మన ముంగిట్లోకి వచ్చేసింది. మనకి కావల్సిన దేశం యొక్క సంస్కృతి, ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు ఏమిటో తెలుసుకోవడానికి గతంలోలాగ కష్టపడాల్సిన అవసరం లేదు. బ్రతుకుతెరువు కోసమని ఇతరదేశాలకు వలస పోతున్నా మన సంస్కృతి గొప్పదనాన్ని కాదనలేకపోవడానికి కారణాలు పాశ్చాత్య దేశాల్లో మృగ్యమైపోతున్న మానవత్వ విలువలు, విలువల్లేని మానవ సంబంధాలు; మన దేశంలో ఇంకా కొంతో గొప్పో అవి నిలిచి వుండటం. దశాబ్దం క్రితంనాటి పరిస్థితికి అద్దం పట్టే కథ అయినా ఇప్పటికి కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదేమో l

కథా సంగ్రహానికి వస్తే............

కమల, విమల కవలపిల్లలు. విమలకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రాజాతో పెళ్ళి జరిగి అమెరికా వెళ్లిపోతుంది. అక్కడికి తీసుకెళ్ళాక ఆమెను హింసించి విడాకులిచ్చి మరొకామెను పెళ్లిచేసుకుంటాడు. అయినా విమల తిరిగి ఇండియా రాకుండా అక్కడే వుండిపోయి ఇరవై సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ ఇరవై సంవత్సరాలలో అమె ఆలోచనా సరళిలో వచ్చిన మార్పులు కమలను ఆశ్చర్య పరుస్తాయి.
నాస్తికురాలైన కమలకు విమలలో పెరిగిన భక్తి విస్మయం కలిగిస్తుంది గైనకాలజిస్టుగా ఇరవై ఏళ్ళు అమెరికాలాంటి అగ్రదేశంలో నిపుణత సంపాదించిన విమల ఇలా మాట్లాడటమే దీనికి కారణం.
" జీవితంలో దెబ్బ తిన్నప్పుడే కొన్ని విషయాలు అర్థమవుతాయి " అని చెబుతూ " రాజాతో దేశం కాని దేశంలో, మనుషులు కాని మనుషుల మథ్య నరకం అనుభవించే సమయంలో నన్నీ దేవుళ్ళే రక్షించారు. విష్ణుసహస్ర నామాలే ధైర్యాన్నిచ్చింది " అంటుంది విమల.
" అంతా నీ భ్రమ. నీకు మనుషులెవ్వరూ సాయం చెయ్యలేదా ? " అని అడిగిన కమలతో
" చేశారు. భౌతికంగా చేయూతనిచ్చి, ఆశ్రయం యిచ్చి ఆదుకున్నారు. కానీ మానసికంగా నేను కృంగిపోకుండా నన్ను ఈ దే్వుళ్ళే, నా యీ భారతీయ సంస్కృతే రక్షించింది " అంటింది విమల.
..................................................
" నిన్ను ఇన్ని బాధలు పెట్టిన రాజా ఈ సంస్కృతిలోంచి వచ్చిన వాడేనని మర్చిపోతున్నావా ? " అంటుంది కసిగా కమల.
" లేదు. ఎప్పుడూ మర్చిపోను. కానీ మగవాడు అనే మృగం, జాతి, మత, దేశ, కాలాలకి అతీతమని నాకు బాగా తెలుసు. కానీ నేను నేనుగా నిలద్రొక్కుకోడానికి నాకు దేవుడు అనే ఊహ ఆసరా అయింది. నాకు దేవుడున్నాడు " అని స్పష్టం చేస్తుంది.
................................................
" మతం పేరుతో ఎంత వ్యాపారం, ఎంత అత్యాచారం జరుగుతోందో తెలుసా ? " అని అడిగిన కమలతో
" దాన్ని నేను సమర్థించను. కానీ మానవత్వం పేరుతో అంతకంటే తక్కువేం జరగటంలేదు " అని విమల అనడంటో కమల వులిక్కిపడుతుంది.

నీళ్లకాగులో నానబెట్టిన విగ్రహాలను చూసిన కమల ' చెల్లాయి నమ్మిన దేవుళ్లకి కిలుం పడితే చింతపండు పులుసులో నానబెట్టింది తోమడానికి. తను నమ్మిన మనుష్యులకి పట్టిన కిలుం వదిలించాలంటే ఈ విశ్వమంత గంగాళంలో ఏమి వేసి తోమాలి ? ' అని గందరగోళంలో పడిపోతుంది.

క్లుప్తంగా కథా సంగ్రహమిదే !
కమల కనబడని దేవుళ్లకంటే కనబడే మనుష్యులే నిజమని నమ్మింది. విమల తన పరిస్థితుల ప్రభావం నుంచి బయిటపడటానికి దేవుణ్ణి ఆసరాగా చేసుకుంది. నిజమే విగ్రహాలరూపంలో వున్న దేవుళ్ళకు పట్టిన కిలుం వదిలించడం తేలికే ! కానీ మనుష్యుల మనసులకు పట్టిన కిలుం వదిలించడం తేలికైన పనేనా ?

1996 లో ఈ కథను ఓ ప్రముఖ రచయిత్రి రాసారు. ఉదహరించిన సంభాషణలలో శైలి ద్వారా ఆమె ఎవరో కనుక్కోవడం సులువేననుకుంటాను. ప్రయత్నించండి.

నేనే చెబుతాను. రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల

Vol. No. 01 Pub. No. 229

Wednesday, March 17, 2010

కొత్త సంవత్సరానికి కొత్త ప్రతిపాదనమన జీవితాల్లో మరో ఉగాది వచ్చింది.
క్రిందటి సంవత్సరం పేరుకు తగ్గట్టుగానే విరోధాలను పెంచింది.

దొంగలు, హంతకులు, స్మగ్లర్లు లాంటి నేరస్తులు కూడా సమాజంలో సభ్యులే ! వారి చర్యలను వారు సమర్థవంతంగానే సమర్థించుకోవచ్చు. తనకు బ్రతుకు తెరువు కోసం దొంగతనాలు చేస్తున్నానంటాడు దొంగ. అలాగే ఇతరులకు కూడా వారి వారి కారణాలు వారికీ వుంటాయి. ఎటొచ్చీ సమాజానికి మాత్రం వారి చర్యలను అంగీకరించేటంత విశాల హృదయం వుండదు.

పుట్టుకతోనే అందరూ మహాత్ములు కారు. వారి వారి ఆలోచనా విధానాలు, ప్రవర్తనా, ఇతరుల్నీ- సమాజాన్ని ప్రభావితం చేసే తీరు కారణంగా వారు మహాత్ములుగా గుర్తించబడతారు. ఇందుకు మనకు కనిపించే మంచి ఉదాహరణ గాంధీ.

ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాల్ని త్యాగం చేసాడు కాబట్టే అన్ని కోట్లమంది ప్రజల్ని, ప్రపంచాన్నీ ప్రభావితం చెయ్యగలిగాడు. కానీ ఉద్యమంలోకి రాక ముందు ఆయన వ్యక్తిగత జీవితం అందరు సామాన్యుల్లాగే సాగింది.

ప్రజల్ని ప్రభావితం చేసిందీ, ఏకచత్రాధిపత్యంగా పాలన సాగిస్తున్న బ్రిటిష్ వారిని లొంగదీసిందీ ఆ జీవితం కాదు. నిజానికి గాంధీ గారి సామాన్య జీవితం మనకు అవసరం లేదు. మనం స్పూర్తిగా తీసుకోవలసినది ఆయన ఉద్యమ జీవితమే ! ఏ కారణంగా ఆయన్ని మన దేశమే కాకుండా ప్రపంచమంతా మహాత్ముడిగా కొనియాడుతోందీ, విదేశాలలో కూడా ఆయన విగ్రహాలెందుకు పెట్టవలసి వచ్చిందీ, ఇటీవల అమెరికాలో అప్పటివరకూ వున్న వేరే పేరును మార్చేసి గాంధీ పేరును ఒక ముఖ్యమైన జిల్లాకి ఎందుకు పెట్టారో ఒక్కసారి ఆలోచిస్తే........ ఆయన వ్యక్తిగత జీవితానికి ప్రభావితులై మాత్రం వాళ్ళు ఆ పనులు చెయ్యలేదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే !

మహానీయులందరూ పుట్టుకతోనే మహనీయులుగా పుట్టలేదు. వాళ్ళు కూడా మామూలు జీవితాలను అనుభవించిన వారే ! వాళ్ళ జీవితాలన్నీ ఎక్కడో ఒక సందర్భంలో మలుపు తిరిగి మహనీయులుగా రూపు దిద్దుకుంటాయి. వారి మామూలు జీవితం మనకు ఆదర్శమా, మహనీయులుగా మారిన తర్వాత జీవితం మనకు ఆదర్శమా అంటే విజ్ఞులైన ఎవరైనా ఏది కోరుకుంటారు ?

కిరాతకుడిగా వున్న వాల్మీకి కావాలా ? మహర్షిగా రామాయణాన్ని రాసిన వాల్మీకి కావాలా ?
భోగిగా వున్న వేమారెడ్డి కావాలా ? యోగిగా మారి జీవిత సత్యాల్ని ప్రజలకు సరళమైన పద్య సంపదగా అందించిన వేమన కావాలా?
తాను కూర్చున్న కొమ్మను నరుక్కోబోయిన అజ్ఞాని కావాలా ? మహాకావ్యాలను సృష్టించిన మహాకవి కాళిదాసు కావాలా ?

ఇలా అడిగితే ఎవరైనా ఏం సమాధానం చెబుతారు ?

అలాగే బ్లాగుల్లో రాస్తున్నది ఆడవాళ్ళా, మగవాళ్ళా - వాళ్ళ వ్యక్తిగత జీవితాలేమిటి అనేది అవసరమా ? లేక వాళ్ళు రాసే విషయ సంపద అవసరమా ?

ఎవరికి తెలిసిన, నచ్చిన విషయాలను మాట్లాడే, రాసే స్వేచ్చ మనకు వుంది. కానీ ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడే, రాసే హక్కు ఎవ్వరికీ లేదు.

విరోధి నామ సంవత్సరంలో కొంతమంది మంచిగా రాసి, మరికొంతమంది చెడ్డగా రాసి విరోదుల్ని పెంచుకున్నారు. మంచిగా రాస్తే విరోదులేమిటంటే మంచిగా రాస్తున్న వారిని ఈ చెడురాతలు రాసేవారు వెంటాడినట్లుగా నాకనిపించింది,

వికృతి నామ సంవత్సరంలోనైనా చెడురాతలు రాసే వికృత సంస్కృతికి తిలోదకాలిచ్చేద్దామని, బ్లాగు లోకాన్ని మంచి సమాచారంతో, రచనలతో, సందేశాలతో గుబాళించేటట్లు చెయ్యాలని ఆ బాపతు బ్లాగు మిత్రులు ఈ ఉగాది రోజునైనా తీర్మానం చేసుకుంటే బాగుంటుందేమో ? ఇది కొత్త సంవత్సరంలో నా కొత్త ప్రతిపాదన. మరి మిగిలిన మిత్రులేమంటారో ?

ఏమైనా మనకున్న/ తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుదాం.... పంచుకుందాం ! అంతే కానీ మన మానసిక వికారాల్ని బ్లాగర్లపై , బ్లాగులోకం పైనా రుద్దకూడదని అందరూ తీర్మానించుకుంటే బ్లాగు లోకం ఆరోగ్యంగా వుంటుంది, మన మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుందని నా నమ్మకం.

చివరగా ఈ మానసిక వికారుల బారిన పడిన బ్లాగు మిత్రులకు ఒక మాట. ఒకప్పుడు కుష్టు రోగుల్ని చూసి అసహ్యించుకునేవారు. అలాగే ఎయిడ్స్ రోగుల్ని చూసి అసహ్యంతో బాటు, భయం కూడా పడేవారు. దాంతో వాళ్ళు నిరాశా, నిస్పృహలకు లోనై మానసికంగా కృంగిపోయి కసితో కొన్ని దారుణాలు చెయ్యడానికి సిద్ధపడేవారు. కానీ వాళ్ళను సానుభూతితో అర్థం చేసుకుంటే కనీసం మానసికంగానైనా ఆరోగ్యంగా వుంటారు. దాంతో కొంతమందినైనా నేరస్తులుగా తయారవకుండా నివారించిన వారమవుతాం !

అలాగే బ్లాగుల్లో మానసిక వికారాల్ని ప్రదర్శించే వారిపట్ల జాలి, సానుభూతి చూపించండి. కానీ భయపడకండి. కోప్పడకండి. రెచ్చగొట్టకండి. తప్పక వారిలో మార్పు వస్తుంది. ఈ వికృతి అయినా వారిలోని వికృతాన్ని పోగొట్టాలని కోరుకుందాం ! దీనికి అత్యంత ఎక్కువ ప్రాముఖ్యమివ్వడం బ్లాగులోకాన్ని మరింత కలుషితం చేస్తుంది. ప్రాముఖ్యమివ్వవలసిన సమస్యలు సమాజంలో ఇంకా చాలా వున్నాయి. వాటిని గురించి చర్చిద్దాం. కనీసం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పరిష్కారమైనా లభించే అవకాశం వుంది.

ఈ కొత్త సంవత్సరంలో మరో కొత్త ప్రతిపాదన వచ్చే టపాలో ............

Vol. No. 01 Pub. No. 228

Tuesday, March 16, 2010

తెలుగు వెలుగుల ఉగాది

ఏటేటా వచ్చిపోవు ఉగాదీ !
ఏమున్నది ఈ యేడు నీ మది ?

విరోధి నుంచి వికృతికి పయనం
తేవాలి తెలుగుల మధ్య సంయమనం !

ఈ తెలుగు వెలుగుల ఉగాది !
కావాలి నవ్య క్రాంతుల యుగాది !!


Vol. No. 01 Pub. No. 227

Monday, March 15, 2010

మనకు తెలియని మన చరిత్ర

తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ కథా సంపుటి త్వరలో వెలువడబోతోంది. ఆ సందర్భంగా ఈరోజు ( 15 మార్చ్  2010 ) ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'వివిధ ' శీర్షికలో అచ్చమాంబ-మనకు తెలియని మన చరిత్ర పేరుతో శ్రీ కె. శ్రీనివాస్ రాసిన సమగ్ర వ్యాసం ఇక్కడ చదవండి.

Vol. No. 01 Pub. No. 226

Sunday, March 14, 2010

అందరికీ ఒక్కడే దేవుడు

శ్రీ రహమతుల్లా గారు పంపిన మరో మంచి పాట మీకోసం......................

అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము కొందరికి రాముడు
ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే [[అందరికీ]]

పూలలో ఉన్నాయి వేలరకాలు
పక్షులలో ఉన్నాయి లక్షవిధాలు
రేకులు ఉంటేనే పువ్వంటాము
రెక్కలు ఉంటేనే పక్షంటాము
మతాలు ఏవైనా కులాలు వేరైనా
మంచిమనసు ఉంటేనే మనిషంటాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]

పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమికాదు
ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు?
పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు?
మానవసేవే మాధవ సేవ
బాధపడే సోదరులను ఆదుకునేను
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]

కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
స్వార్ధపరుల ఆట మనం కట్టిస్తాము
శ్రమజీవుల కష్తఫలం ఇప్పిస్తాము
అహింస బోధిస్తాం ప్రశాంతి సాధిస్తాం
లోకంలో ఆకలే లేకుండా చేస్తాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
--- ఈ పాట 1970 లో వచ్చిన ' ఒకే కుటుంబం ' చిత్రంలోనిది. దాశరథి రాసిన ఈ పాటకు స్వరకల్పన ఎస్. పి. కోదండపాణి. పాడింది ఘంటసాల.

శ్రీ రహమతుల్లా గారు పంపిన మరో మంచి పాట గతంలో ఆకాశవాణిలో పలుమార్లు వినిపించిన లలిత గీతం.

నారాయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిట తండ్రీ నీ పిల్లలమేమెల్లా || నారాయణ ||


మతమన్నది నాకంటికి మసకైతే

మతమన్నది నా మనసుకు మబ్బైతే
మతం వద్దు గితం వద్దు మాయామర్మం వద్దు || నారాయణ ||

ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గతం వద్దు
మారణ హొమం వద్దు || నారాయణ||

మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరము మానవులం,
అందరమూ సోదరులం || నారాయణ ||

---దేవులపల్లి కృష్ణశాస్త్రి


ఈ పాట ఆడియో గతంలో నా దగ్గర ఉండేది. ప్రస్తుతం కనిపించడం లేదు. మిత్రులెవరిదగ్గరైనా వుంటే అప్ లోడ్ చెయ్యగలరు.

శ్రీ రహమతుల్లా గారు అడిగిన మరో పాట

ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమూ
ఎల్లమతముల సారమొకటే
తోటకెల్ల వసంతుడొకడే
.......గుడి గంట ఒకటే

ఈ పాట బహుశా సినారె గారు రాశారనుకుంటా.మొత్తం పాట తెలిసినవారు బ్లాగులో పెట్టండి.


Vol. No. 01 Pub. No. 225

నిజాయి ' టీ '

ఈరోజుల్లో రాజకీయనాయకులకు అందినకాడికి దండుకుని పదవి ఉండగానే ఇల్లు / ఇళ్ళు చక్కబెట్టుకోవడం వెన్నతో పెట్టిన విద్య. మరీ పాత తరం కాకపోయినా 60 వ దశకం వరకూ స్వాతంత్ర్య స్ఫూర్తి ఇంకా మిగిలి వుండడంవల్లనో ఏమో కానీ రాజకీయ నాయకులు అవినీతే లక్ష్యంగా వుండేవారు కాదు. వారిలో మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి ప్రథములని చెప్పుకోవచ్చు.

ఐన్ స్టీన్ గాంధీ గారి గురించి చెప్పినట్లు లాల్ బహదూర్ నిజాయితీని గురించి చెబితే భావితరాలు నమ్మకపోవచ్చు.
చెప్పిన వాణ్ని అజ్ఞానిగా జమ కట్టవచ్చు. కానీ ఇది నిజం. దానికి నిదర్శనంగా ఒక సంఘటన.

కేంద్ర రైల్వే మంత్రిగా వున్న రోజుల్లో 1956 లో మహబూబ్ నగర్ దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో 112 మంది మరణించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. తర్వాత 1957 లో జరిగిన ఎన్నికలలో నెగ్గి తొలుత సమాచార, రవాణాశాఖ మంత్రిగా ఆ తర్వాత వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఓ రోజు అనుకోకుండా ఒక మిత్రుడు ఆయన ఇంటికి వచ్చాడు. ఆ మిత్రునికి మంచి రుచి గల టీ ఇచ్చారు శాస్త్రి. ఆ రుచి చూసి ఆశ్చర్యంతో ఆ మిత్రుడు ' ఇంత రుచి గల టీ నేనెక్కడా తాగలేదు. ఈ రుచి ఎలా వచ్చింది ? ' అని అడిగాడు.

దానికి శాస్త్రి గారు నవ్వుతూ ' ఈ పొడి మీకు బజారులో ఎక్కడా దొరకదు. విదేశాలకు మాత్రమే ఎగుమతి చేసేది. నేను కేంద్ర పరిశ్రమల శాఖకు మంత్రిగా వున్నపుడు టీ బోర్డు వారు బహుకరించారు ' అన్నారు.

దానికా మిత్రుడు ' మీరు ఆ శాఖను నిర్వహించి చాలా కాలమైంది కదా ? ఇన్నాళ్ళదాకా వచ్చిందంటే వాళ్ళు చాలా డబ్బాలు ఇచ్చుండాలి ' అన్నాడు.

' అవును. చాలానే ఇచ్చారు. మొత్తం మూడు డబ్బాలు. రెండు అప్పుడే మా ఆఫీసు వాళ్లకిచ్చాను. ఒకటి నేను దాచుకున్నాను. ఈ టీ అంతే నాకిష్టం. అందుకే దాచుకుని అప్పుడప్పుడు మాత్రమే తాగుతాను ' అన్నారట లాల్ బహదూర్ శాస్త్రి గారు.

Vol. No. 01 Pub. No. 224

Saturday, March 13, 2010

మరో అవార్డు

 మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక తెలుగు చలన చిత్ర పురస్కారాల్లో మరొకటి నాగిరెడ్డి - చక్రపాణి అవార్డు. ఈ పురస్కారానికి తెలుగు సినిమా రంగం గర్వంగా చెప్పుకునే ప్రసాద్ ల్యాబ్, ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ అధినేత శ్రీ రమేష్ ప్రసాద్ గారు ఎంపికయ్యారు. 

శ్రీ రమేష్ ప్రసాద్ గారికి అభినందనలు. - శిరాకదంబం

Vol. No. 01 Pub. No. 223

Friday, March 12, 2010

ముచ్చటగా మూడు ఆవార్డులు

2008 వ సంవత్సరానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చలన చిత్ర రంగానికి అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. అవి ఈ విధంగా వున్నాయి.


ఈ నెల 16 వ తేదీన ఉగాది పర్వదినాన ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.
పురస్కార గ్రహీతలకు అభినందనలు - శిరాకదంబం

Vol. No. 01 Pub. No. 222

కులం కులం అని......

తెలుగు భాషా వికాసానికి అంకిత భావంతో కృషి చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎన్. రహమతుల్లా గారు  ఈరోజు ఒక మంచి పాటను గుర్తు చేసారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పాట మీకోసం...

కులం కులం అని కుఛ్ఛితాలు పెంచుకోకు

ఓ కూటికి లేనివాడా మనదంతా ఒకే కులం అదే అదే మనిషి కులం [కులం]

మతం మతం అని మాత్సర్యం పెంచుకోకు

ఓ సమతా మానవుడా మనదంతా ఒకే మతం అదే అదే మనిషి అభిమతం [కులం]

నాదినాది అని వాదులాట పెంచుకోకు

ఓ డొక్కలైన నిండనోడా మనదంతా ఒకే శక్తి అదే అదే మనిషి శ్రమశక్తి [కులం]

ఈ పాట 1982 లో సి విజయలక్ష్మిగారు విప్లవ శంఖం సినిమా కోసం రాసింది.చక్రవర్తి సంగీతం.


 Vol. No. 01 Pub. No. 221

Thursday, March 11, 2010

మహిళా ప్రముఖుల చిత్రాలు - జవాబులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళామణులకు శుభాభినందనలు తెలియజేస్తూ శిరాకదంబం అందించిన మహిళాలోకానికి శుభాభినందనలు టపాలోని ఫోటోలలో వున్న మహిళా ప్రముఖులు వరుసక్రమంలో...................
1 . రుక్మిణీదేవి అరండల్ - ప్రముఖ నాట్యాచారిణి
2 . కస్తూర్బా గాంధి - మహాత్మా గాంధీ సతీమణి
3 . అనీ బెసెంట్ - స్త్రీ హక్కుల ఉద్యమ కారిణి, భారత స్వాతంత్ర్య సమరయోధురాలు
4 . జిజియాబాయి ( పెయింటింగ్ లో ) - ఛత్రపతి శివాజీ తల్లి
5 . ప్రతిభా పాటిల్ - ప్రస్తుత భారత రాష్ట్రపతి
6 . అనితా మజుందార్ దేశాయ్ - నవలాకారిణి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
7 . అరుంధతి రాయ్ - రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత
8 . భండారు అచ్చమాంబ - తెలుగులో మొదటి కథా రచయిత్రి
9 . మహాశ్వతాదేవి - రచయిత్రి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత
10 . నిర్మల దేశ్ పాండే - సామాజిక కార్యకర్త, 2005 లో నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్
11 . కిరణ్ మజుందార్ షా - పారిశ్రామికవేత్త, భారత దేశంలో అత్యంత ధనవంతురాలు
12 . ఝాన్సీ లక్ష్మీబాయి - స్వాతంత్ర్య సమరయోధురాలు
13 . కమలాదేవి చటోపాధ్యాయ - స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త
14 . దుర్గాబాయి దేశ్ ముఖ్ - స్వాతంత్ర్య సమరయోధురాలు, స్త్రీజనోద్దరణ ఉద్యమకారిణి
15 . కిరణ్ బేడి - సాహస పోలీసు అధికారిణి
16 . కమలా నెహ్రు - జవహర్లాల్ నెహ్రు సతీమణి, ఇందిరా గాంధీ తల్లి
17 . ఇందిరా గాంధీ - మాజీ ప్రధానమంత్రి
18 . ఎం.ఎస్. సుబ్బులక్ష్మి - ప్రముఖ సంగీత కళాకారిణి
19 . మల్లికా సారాభాయ్ - ప్రముఖ నాట్య కళాకారిణి
20 . పద్మా సుబ్రహ్మణ్యం - ప్రముఖ భరతనాట్య కళాకారిణి
21 . యామినీ కృష్ణమూర్తి - ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి
22 . సోనాల్ మాన్ సింగ్ - ప్రముఖ ఒడిస్సీ నాట్య కళాకారిణి
23 . మదర్ థెరేస్సా - సంఘ సేవకురాలు
24 . మదర్ ( పాండిచేరి ) - సంఘ సేవకురాలు
25 . సుచేతా కృపలానీ - స్వాతంత్ర్య సమరయోధురాలు, భారతదేశంలో ఎన్నికైన మొదటి మహిళా ముఖ్యమంత్రి ( ఉత్తర ప్రదేశ్ )
26 . సరోజినీ నాయుడు - స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి
27 . కల్పనా చావ్లా - భారత సంతతి మహిళా అంతరిక్ష యాత్రికురాలు
28 . అరుణ అసఫ్ ఆలీ - స్వాతంత్ర్య సమరయోధురాలు
29 . సిస్టర్ నివేదిత - వివేకానందుని శిష్యురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు
30 . లత మంగేష్కర్ - ప్రముఖ గాయని
31 . కరణం మల్లీశ్వరి - ప్రముఖ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి
32 . మల్లాది సుబ్బమ్మ - సామాజికసేవా కార్యకర్త, రచయిత్రి
33 . ఆంగ్ సాన్ సూక్యీ - ప్రజాస్వామ్య హక్కుల పోరాట కార్యకర్త
34 . కెప్టైన్ మమత - భారత తొలి మహిళా ఏవియేషన్ శిక్షకురాలు
35 . చిత్రా విశ్వేశ్వరన్ - ప్రముఖ భరతనాట్య కళాకారిణి
36 . బచెంద్రి పాల్ - ఎవరెస్ట్ అధిరోహించిన తొలి మహిళ
37 . పి. టి. ఉష - ప్రముఖ అథ్లెట్
38 . సానియా మీర్జా - ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి
39 . శకుంతలా దేవి - ప్రముఖ గణిత శాస్త్రజ్ఞురాలు

ఇవి కాక ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రాలతోబాటు ఇతరుల చిత్రాలు కూడా వున్నాయి. జవాబులు చెప్పడానికి ప్రయత్నించిన, ప్రతి స్పందించిన సోదరీమణులకు ధన్యవాదాలు.

* ఇక ఇందులో వినిపించిన ' మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ....' పాట మహానటి సావిత్రి దర్శకత్వంలో వచ్చిన ' మాతృదేవత ' చిత్రంలోనిది. పాడింది సుశీల బృందం. రచన సి. నారాయణరెడ్డి, సంగీతం కె. వి. మహదేవన్.

Vol. No. 01 Pub. No. 220

Wednesday, March 10, 2010

కనుక్కోండి చూద్దాం - 9


ఇక్కడ రెండు చిత్రాలున్నాయి. అవి రెండూ ప్రముఖ నటులవే ! విలక్షణమైన ఆహార్యంతో కనిపిస్తున్న ఆ నటులను గుర్తించగలరా ?

అలాగే ఈ స్టిల్స్ ఏ ఏ చిత్రాలలోవో చెప్పగలరా ?
జవాబులు : మొదటి చిత్రంలో వున్నది పి. ఎల్. నారాయణ. యండమూరి వీరేంద్రనాథ్ నాటిక ఆథారంగా నిర్మించిన ' కుక్క ' చిత్రంలోని స్టిల్.
రెండవ చిత్రంలో వున్నది విజయచందర్. బాపు గారు దర్శకత్వం వహించిన ' రాజాధిరాజు ' చిత్రంలోని స్టిల్.Vol. No. 01 Pub. No. 219

Tuesday, March 9, 2010

తొలి నేపథ్య గానం

   1931 లో భారత చిత్రాలకు మాటలోస్తే నేపథ్యగానం మాత్రం 1934 లో ఆరంభమైంది. కెమెరామన్ గా ప్రారంభించిన నితిన్ బోస్ ( దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత ) తాను దర్శకత్వం వహించిన  ' భాగ్య చక్ర ' బెంగాలీ చిత్రంలో తొలిసారిగా నేపథ్యగానాన్ని ప్రవేశపెట్టారు. ఆ చిత్రం ' దూప్ చావ్ ' గా హిందీలో అదే సంవత్సరం రూపొందించారు. మొదటి పాటను కె. సి . డే, పాల్ ఘోష్, సుప్రభా సర్కార్ పాడారు.  


తెలుగులో మాత్రం పది సంవత్సరాలు ఆలస్యంగా 1944 లో నేపథ్య గానం ఆరంభమైంది. అప్పటివరకూ నటీనటులు వారి పాటలను వారే లైవ్ లో పాడుకునేవారు. తర్వాత కాలంలో సుందరదాసుగా ప్రసిద్ధి పొందిన ఎం.ఎస్. రామారావు గారు తొలి నేపథ్య గీతాన్ని ఆలపించారు. ఆ చిత్రం ' తాసిల్దారు '. వై. వి. రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆయనతో బాటు భానుమతి, కమలా కొట్నీస్, బలిజేపల్లి మొదలైన వారితో బాటు ఎం. ఎస్. రామారావు కూడా నటించారు. హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి సంగీత దర్శకత్వం వహించారు. నండూరి సుబ్బారావు గారి ఎంకి పాట ' ఈ రేయి నన్నొల్ల నేరమా '  ఎం. ఎస్. రామారావు గారు పాడారు.

గమనిక : ఎం. ఎస్. రామారావు గారి తొలి పాట ఎవరి దగ్గరైనా వుంటే వినిపిస్తారా ?

Vol. No. 01 Pub. No. 218

Monday, March 8, 2010

మహిళాలోకానికి శుభాభినందనలు

పుడమి తల్లి మహిళ
లెక్కలేనంత సంతానాన్ని భరిస్తోంది
ప్రకృతిమాత మహిళ
అంతులేనంత కాలుష్యాన్ని భరిస్తోంది

నవమాసాలు కడుపున భరించేది మహిళ
రెక్కలోచ్చేవరకూ మన అల్లరి భరించేది మహిళ
మనకి తొలి గురువు, మార్గదర్శి ఆ మహిళే
జీవితాంతం తోడూ నీడగా వుండి భరించేది మహిళ
కుటుంబ వ్యవహారాల నిర్వాహకురాలు కూడా ఆ మహిళే
మహిళ లేనిదే మగవాని జీవితం అసంపూర్ణం
అర్థనారీశ్వర తత్వమే దీనికి నిదర్శనం

ముఖ్యంగా మహిళా బ్లాగరు మిత్రులకు మరిన్ని శుభాకాంక్షలతో ...
గమనిక : ఈ వీడియోలో కొంతమంది మహిళా ప్రముఖుల చిత్రాలున్నాయి. వారిని కనిపెట్టి, వారే రంగంలో ప్రముఖులో వరుసక్రమంలో చెప్పగలరేమో ప్రయత్నించండి..

Vol. No. 01 Pub. No. 217

Sunday, March 7, 2010

ఎవరో వస్తారని ఏదో చేస్తారని.......

ఎదురు చూసి మోసపోకుమా
మహాకవి శ్రీ శ్రీ రాసిన మంచి పాటల్లో ఇది కూడా ఒకటి. ప్రబోధాత్మక గీతం.శ్రీ శ్రీ ఈ పాటలో చెప్పిన పంతుళ్ల పరిస్థితుల్లో ఇప్పుడు కొంత మార్పు వచ్చిందేమో గానీ చదువులో పెద్ద మార్పు కనబడదు. మిగిలిన పూరిగుడిసెల, పేదల కాలే కడుపుల , మందులు లేని ఆసుపత్రుల, మూఢాచారాలకు, ఇతరత్రా అన్యాయంగా బలైపోయే పడతుల, దురాశ, దురలవాట్లకు బానిసలై పోయే వాళ్ళ , సేద్యం లేక పనుల్లేని రైతు కూలీల, శ్రమకు తగ్గ ఫలితం దక్కని శ్రమజీవుల పరిస్థితుల్లో అప్పటికీ, ఇప్పటికీ చెప్పుకోదగ్గ మార్పు రాలే్దు. అందుకే ఆయన ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడద్దంటారు.

అనుపమ ఫిల్మ్స్ బ్యానర్ పైన దర్శక నిర్మాత కె. బి. తిలక్ నిర్మించిన చిత్రం ' భూమికోసం ' లోనిదీ పాట. ఘంటసాల గారు చివరి రోజుల్లో పాడిన పాటల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రానికి పేరు పెట్టింది శ్రీ శ్రీ గారేనట. పెండ్యాల నాగేశ్వర రావు సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని తిలక్ గారి సోదరుడు కె. రామనరసింహ రావు ( నక్సలైట్ ) కు అంకితమిచ్చారు. తిలక్ గారు ఒక ఐరిష్ రచయిత రాసిన LAND అనే నవలను శ్రీ శ్రీ గారికిస్తే ఆయన దాన్ని మన తెలుగు వాతావరణానికి అన్వయిస్తూ చలన చిత్ర కథగా మార్చారు. ఈ పాటలో గుమ్మడి నటించారు. ఈ చిత్రం ద్వారానే ప్రభ, జయప్రద పరిచయమయ్యారు. అయితే తర్వాత ప్రభ నటించిన ' నీడలేని ఆడది ' ముందుగా విడుదలయింది.

రేపు, ఎల్లుండి ( మార్చి 8, 9 తేదీలలో ) చెన్నై లో శ్రీ శ్రీ సాహిత్య సదస్సులు జరుగనున్నాయి. ఆ సందర్భంగా ఆ మహాకవిని మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ........
Vol. No. 01 Pub. No. 216

Saturday, March 6, 2010

సమాధి మీద రాత

మనకి సమాధి మీద రాతలతో పరిచయం తక్కువ. ఎక్కువగా మన దేశంలోని సమాదులమీద జనన మరణ తేదీలనే రాస్తారు కానీ పాశ్చాత్య దేశాలలో అలా కాదు. సమాధి మీద చనిపోయిన వ్యక్తికి సంబంధించిన లేదా ఆ వ్యక్తికి నచ్చిన వాక్యాలు రాయడం పరిపాటి.

ఆంగ్ల చిత్ర ప్రియులకు 1939 లో వచ్చిన GONE WITH THE WIND చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హాలీవుడ్ ఆణిముత్యాలుగా పిలువబడే చిత్రాలలో ఇది కూడా ఒకటి. పది ఆస్కార్ అవార్డులు సాధించి సంచలనం సృష్టించిన చిత్రం. మరో ఇరవై సంవత్సరాలదాకా ఆ రికార్డును ఏ చిత్రం కూడా అధిగమించ లేకపోయింది. హాలీవుడ్ చిత్రాలలో మణిపూసగా నిలిచిన ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి ఆస్కార్ కు నామినేట్ అయిన ' హాలీవుడ్ రారాజు ( King of Hollywood ) ' అని పిలిపించుకున్న నటుడు క్లార్క్ గేబుల్ ( Clark Gable ).

నటుడు కావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. నాటక రంగంనుంచి సినిమా రంగానికి వచ్చాడు. చేటంత చెవులతో అతనొక కోతిలా ఉన్నాడని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నెర్ బ్రదర్స్ ప్రతినిథి వెటకారం చేసాడు. అయినా పట్టుదలతో ప్రయత్నించి MGM సంస్థలో చేరి 1931 లో Dance, Fools, Dance చిత్రంతో నిలదొక్కుకున్నాడు.

అందరిలాగే క్లార్క్ గేబుల్ కూడా తన మరణం తర్వాత తన సమాధి మీద రాయడానికి ఓ వాక్యాన్ని, జీవించి వుండగానే సిద్ధం చేసుకున్నాడు. ఆ వాక్యం ఏమిటంటే...........

క్లార్క్ గేబుల్ నవంబర్ 16 వ తేదీ 1960 న మరణించాడు.

Vol. No. 01 Pub. No. 215

Friday, March 5, 2010

ఓం సచ్చిదానంద....

ఇప్పుడెక్కడ చూసినా సచ్చిదానందమే !
అంతా మాయ ! జగమంతా మిథ్య !!
మా కేళీ లీలా విలాసాలోకటే సత్యం !
భక్తులకు ముక్తి వేదాంతం
మాకు రక్తి సిద్దాంతం
మా బోధనలే మీకు శిరోధార్యాలు
మీ ' సేవ 'లే మాకు అలౌకికానందాలు
ఎందరో స్వాములు, గురువులు, బాబాలు
అందరికీ వందనాలు
అందుకే మహాకవి దృష్టిలో మిథ్యావాది .............

మాయంటావా ? అంతా
మిథ్యంటావా ?
నా ముద్దుల వేదాంతీ !
ఏమంటావూ ?
కనబడినది కనబడదని
వినబడినది వినబడదని
జగతి మరుపు, స్వప్నం, ని
శ్శబ్దం ఇది
మాయ ! మాయ !
మాయంటావూ ! అంతా
మిథ్యంటావూ !!

ఓం సచ్చిదానంద..............Vol. No. 01 Pub. No. 214

Thursday, March 4, 2010

నాయకుడికి నిజమైన నిర్వచనం

నాయకుడంటే ఒక గుంపుకో, ఒక ప్రజా సమూహానికో దిశా నిర్దేశకుడు. అతనిని అనుసరించే వాళ్ళు సహజంగానే అతడు తమను సరైన మార్గంలో నడిపించాలనుకుంటారు. తమకు నాయకుడు మంచి చేస్తాడని, తమ ప్రయోజనాలను కాపాడతాడని నమ్ముతారు.

మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజల్ని నియోజకవర్గాలవారిగా విడదీసి ఒక్కొక్క నియోజక వర్గానికీ ఒక్కొక్క నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు ఆ నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి పాటు పడాలి. సాంకేతికంగా, రాజ్యాంగపరంగా ఇదే నిజమనుకుంటాను. కానీ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ముందు ఆలోచించేది ప్రజల సంక్షేమం కాదు. తన, తనవాళ్ళ క్షేమం. ప్రజల ఓట్ల అండతో పదవిలోకొచ్చాక ఆలోచించేది తనకా స్థితి కల్పించిన ప్రజల్ని ఎలా దోచుకోవచ్చా అనే విషయమే ! అందుకే వాళ్ళు మంత్రి పదవి దక్కే అవకాశం వస్తే కాసులు కురిపించే శాఖ కావాలనుకుంటారే కానీ ప్రజలకు సేవ చేసే శాఖ కావాలని కోరుకుంటారా ? ప్రజలకు సేవ చేస్తే ఏం రాలుతుంది.... బూడిద !! ఒకవేళ ఎవరైనా అలా కోరుకుంటే వాళ్ళను పిచ్చివాళ్ళనుకుంటారు. కానీ అలా సేవ చెయ్యాలనుకునే వాళ్ళు కూడా వుంటారు. ఈ రోజుల్లో కాకపోవచ్చు. గతవైభవమే కావచ్చు. అయినా అలాంటి వాళ్ళను ఒక్కసారైనా తలుచుకుంటే ప్రస్తుత రాజకీయనాయకుల అవినీతి విన్యాసాలనుంచి కొంచెం ఉపశాంతి. అలాంటి ఓ ఉదంతం.

గత కాబినెట్ లో పశుసంవర్థక శాఖా మంత్రిగా పనిచేసిన మండలి బుద్ధ ప్రసాద్ గారి పేరు వినే వుంటారు. ఆయన తండ్రిగారు మండలి వెంకట కృష్ణారావు గారు కూడా ఒకప్పుడు మంత్రిగా పనిచేసినవారే ! ఆయనకు మొదటిసారి మంత్రి పదవి లభించింది పి.వి.నరసింహారావు గారి హయాంలో. పి.వి. గారు మంత్రివర్గానికి శాఖల కేటాయింపులు చేస్తూ సహచరులను శాఖల మీద వాళ్ళ ఆసక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో మండలి వెంకట కృష్ణారావు గారి వంతు వచ్చింది. పి.వి. గారు అడిగారు మీకేం శాఖ కావాలని. తనకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించమన్నారు. పి.వి. గారు ఆశ్చర్యపోయారు. ఆయన ఎందుకు ఆశ్చర్యపోయారో అప్పట్లో అజ్ఞానులైన ఓటర్లకు అర్థం కాకపోయి వుండవచ్చుగానీ, తెలివి మీరినా నిస్సహాయులైన ఇప్పటి ఓటర్లకు అర్థమవుతుంది. ఇదివరలో ప్రభుత్వోద్యోగులకు పనిష్మెంట్ ట్రాన్స్ఫెర్ అంటే ఏ శ్రీకాకుళమో, ఆదిలాబాదో పంపిచేయ్యడం. అదే ఇప్పటి నాయకుల దృష్టిలో సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వడమంటే అలాంటిదే ! రాజకీయాలు వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో ఆశాఖలో తమ పెట్టుబడి గిట్టుబాటు కాదని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే వాళ్ళు దాని జోలికి పోరు. ఇక ఆఖరు వరుసలో వున్న వారు మాత్రం ( బంగారు ) భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తప్పనిసరై వప్పుకుంటారు.

అందుకే పి.వి. గారికి కూడా అనుమానం వచ్చింది. ఈయన ఈ శాఖను ఎందుకు కోరుకుంటున్నారా అని. ఆ విషయమే అడిగారు అందరూ వద్దనుకునే శాఖనే మీరెందుకు కోరుకుంటున్నారని. దానికి మండలి వెంకట కృష్ణారావు గారిచ్చిన సమాధానం ఏమిటంటే పేదప్రజలకు దగ్గరగా వుంటూ సేవ చేసే అవకాశం సాంఘిక సంక్షేమ శాఖలోనే వుందని, అందుకని ఆ శాఖనే తనకు కేటాయించవలసినదిగా ముఖ్యమంత్రిని కోరారు. పిచ్చివాడు కాకపోతే పేద ప్రజలకు సాయం చెయ్యడమేమిటి ? సొంత లాభం చూసుకోక ! అలా కాదు కాబట్టే మనం ఇప్పుడు కూడా వాళ్ళను తలచుకోవడం జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా పి.వి. గారే ఒక సదస్సులో చెప్పి మండలి వారి గొప్పతనాన్ని ప్రశంసించారట.

ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిస్వార్థ రాజకీయ నాయకులు వుండాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమోగానీ నిజమైన నాయకుడికి నిజమైన నిర్వచనం మాత్రం ఇదేనేమో !Vol. No. 01 Pub. No. 213

Tuesday, March 2, 2010

తొలి భారతీయ ఆంగ్ల టాకీ చిత్రం ' కర్మ '

హిమాంశురాయ్ అనే తొలి తరం భారత నిర్మాత, దర్శకుడు జర్మనీ సహకారంతో 1926 లో ' ది లైట్ అఫ్ ఆసియా ' అనే చిత్రాన్ని నిర్మించాడు. అంతర్జాతీయ సహకారంతో నిర్మించిన మొదటి చిత్రం అదే. అయితే అది మూకీ చిత్రం. తర్వాత జర్మనీ సంస్థ అయిన UFA ( Universum Film Aktiengesellschaft ) తో కలసి మరో రెండు చిత్రాలు నిర్మించారు.

1930 లో నిర్మించిన ' A thrown of dice ' చిత్రంతో తొలి తరం కథానాయిక దేవికారాణి వెండితెరకు పరిచయమైంది. అప్పటికి దేవికారాణి ఇంగ్లాండ్ లో ఆర్కిటెక్చర్, ఫిలిం క్రాఫ్ట్ చదువుతోంది. మన విశాఖపట్నంలో కల్నల్ డా. ఎం.ఎన్. చౌదరి, లీల దంపతులకు జన్మించిన దేవికారాణి విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ మేనకోడలు. ' A thrown of dice ' నిర్మాణ సమయంలోనే హిమంశురాయ్, దేవికారాణి పెళ్లి చేసుకున్నారు.

ప్రపంచ చలనచిత్ర రంగం మాటలు నేర్చుకుంది. మూకీలు  టాకీలుగా మారాయి. ఇంగ్లాండ్ కు చెందిన I.B.P. సంస్థతో కలిసి హిమంశురాయ్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ' కర్మ ' చిత్రం మొదలు పెట్టాడు. అందులో హిమంశురాయ్, దేవికారాణిలే నాయిక నాయకులు. సీతాపూర్ మహారాణికి, జయనగర్ యువరాజుకు మధ్య నడిచే ప్రేమాయణం, యువరాజుని అతని తండ్రి నిర్భంధించి వారి ప్రేమను భగ్నం చెయ్యడం ఈ చిత్ర కథ. లండన్ లోని మార్బుల్ ఆర్చ్ పెవిలియన్ లో 1933 మే నెలలో ఈ చిత్రం విడుదలయింది.

ఈ చిత్రంతో దేవికారాణి ప్రపంచ ప్రేక్షకలోకానికి కలలరాణి అయింది. పాశ్చాత్య పత్రికా ప్రపంచం ఈమె అందాన్ని, వాచకాన్ని వేనోళ్ళ కీర్తించింది. ఈ చిత్రం భారతదేశంలో 'కర్మ' 1934 లో విడుదలయింది. సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారత్ లో ఈ చిత్రంలో హిమంశురాయ్, దేవికారాణి ల పై నాలుగు నిముషాల పాటు వుండే ముద్దు దృశ్యం అప్పట్లో సంచలనం రేపింది. ఈ చిత్రంతో భారతీయ ప్రేక్షకులకు కూడా ఆమె కలల రాణి అయిపోయింది. ఈ చిత్రాన్ని, దేవికారాణి అందాన్ని, అభినయాన్ని భారత కోకిల సరోజినీ దేవి ప్రత్యేకంగా ప్రశంసించారు కూడా !

Vol. No. 01 Pub. No. 212
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం