మాయాబజార్ కాక !
ఆ చిత్రరాజ సృష్టికర్తల్ని ఒకమారు తల్చుకుందాం !
నిర్మాణం : విజయా ప్రొడక్షన్స్
విజయా ప్రొడక్షన్స్ వారు, అతి భారీగా నిర్మించిన " మాయాబజార్ " చిత్రం 27-3-1957 న విడుదలైంది. అంటే నేటికి సరిగా 53 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.
నిర్మాతలు : నాగిరెడ్డి, చక్రపాణి
ఉత్తమమైన అభిరుచితో, విశిష్టమైన చిత్రాలను నిర్మించిన నాగిరెడ్ది, చక్రపాణి ' మాయాబజార్ ' చిత్రాన్ని ' నభూతో నభవిష్యతి ' అన్నట్లు నిర్మించారు. 10 - 12 లక్షల్లో చిత్రాలు తియ్యగలిగే ఆ రోజుల్లో ' మాయాబజార్ ' కు 26 -30 లక్షల వరకూ వ్యయమైనట్లు అంచనా. ఆ చిత్ర నిర్మాణానికి సంబంధించి స్క్రిప్టు, స్కెచ్ లు, నటీనటుల నిర్ణయాలూ అన్నీ అయిన తర్వాత, ' ఇంత పెద్ద మొత్తంతో ఇంత పెద్ద చిత్రం తీస్తే ఏమవుతుందో ' అన్న అనుమానం వచ్చింది. కొంతకాలం ఆరంభించకుండా ఆపి, చర్చలు జరిపి, బాగా నమ్మకం కుదిరిన తర్వాతనే ఆరంబించి, ఎక్కడా ఏమాత్రం రాజీపడకుండా అనుకున్న కాలానికి నిర్మాణం పూర్తి చేశారు. విడుదలయిన తర్వాత, మ్రోగిన ' విజయ ఢంకా ' నేటికీ మోగుతూనే వుంది.
దర్శకత్వం : కె.వి. రెడ్డి
పౌరాణిక చిత్రాల్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే గల చిత్రంగా ' మాయాబజార్ ' ను కీర్తిస్తారు. అంత పెద్ద కథను, గందరగోళం లేకుండా, సూటిగా చెప్పడంలో దర్శకుడు, రచయితల ప్రజ్ఞను అంతా చెప్పుకుంటారు. చిత్రంలో అడుగడుక్కి పాండవుల ప్రసక్తి వస్తూనే వున్నా, చిత్రం మొత్తం మీద పాండవులను చూపకుండా, వారున్నారన్న భ్రాంతిని కలిగించడం - గొప్ప విశేషం !
ఛాయాగ్రహణం : మార్కస్ బార్ ట్లే
' లాహిరి లాహిరి ' పాటను మూడుస్థలాల్లో మూడు వేర్వేరు వేళల్లో చిత్రీకరించినా - పాట మొత్తం అంతా ఒక్కసారే ఒక్కచోటే తీసిన భ్రమ కల్పిస్తుంది. పగటి వేళలో వెన్నెల కిరణాలతో వున్నట్టుగా నదిని, స్టూడియో చంద్రుడి వెన్నెలతో తళతళలాడి పోతున్న తెల్ల గడ్డి సెట్టునూ, బ్యాక్ ప్రొజెక్షనుతో క్లోజప్స్ నూ తీసి, కలిపి చూపించడంలో లైటింగ్ లో గాని, ఎడిటింగ్ లో గాని ఎక్కడా తేడా కనిపించదు ! టెక్నికల్ పెర్ ఫెక్షన్ కు - ' లాహిరి లాహిరి ' పాట చిత్రీకరణ ఒక ఉదాహరణ. సినిమాల్లో వెన్నెల చూపించడం, చాయాగ్రాహకుడు మార్కస్ బార్ ట్లేకి సాధ్యమైనట్లు, అన్యులకు సాధ్యం కాదేమో ! సహజ ప్రకృతిలో నిర్మలమైన పూర్ణ చంద్రుడు కనిపిస్తే ' విజయావారి చంద్రుడిలా వున్నాడు ' అని మనం మెచ్చుకోవడం బార్ ట్లే ఘనత !
సంగీతం : ఘంటసాల వెంకటేశ్వర రావు
' మాయాబజార్ ' చిత్రానికి టైటిల్స్ లో ' సంగీతం : ఘంటసాల ' అని వేసినా, నాలుగు పాటలకు యస్. రాజేశ్వరరావు వరసలు కల్పించారు. ఆదిలో ఆయన్నే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. కానీ, కారణాల వల్ల ఆయనకు కుదరనందువల్ల నాలుగు పాటలు ' కంపోజ్ ' చేసిన తర్వాత, ఘంటసాలనే సంగీత దర్శకుడిగా, విజయా వారు స్థిరపరిచారు. ఐతే, ఆ నాలుగు పాటలూ కొంతవరకూ ' కంపోజింగ్ ' మాత్రమే అయినాయి గానీ, రికార్డింగ్ జరుగలేదు. ఆర్కెస్ట్రేజేషనూ, రికార్డింగూ అంతా ఘంటసాలే చేశారు గనుక ఆయన పేరే వేశారు. రాజేశ్వరావు వరసలు కల్పించిన ఆ నాలుగు పాటలూ : లాహిరి లాహిరి లాహిరిలో...., నీవేనా నను తలచినది..., చూపులు కలసిన శుభవేళ...., నీకోసమే నే జీవించునదీ.....
కథాకల్పన, మాటలు, పాటలు : పింగళి నాగేంద్ర రావు " లక్ష్మణ కుమారుడు, వీరాధివీరుడైన దుర్యోధనుని కుమారుడే, అతన్నేమిటి చిత్రంలో వెర్రి వెంగళప్పలాగా, వెకిలిగా చిత్రించారు ? " అన్న విమర్శలు ఆ రోజుల్లో వినిపించాయి. ఆ విమర్శ గురించి ఓసారి నాగేంద్రరావు గారు మాట్లాడుతూ " లక్ష్మణకుమారుడు ధీరుడనో, శూరుడనో మహాభారతంలో లేదు. అతనిది పెద్ద పాత్ర కూడా కాదు. భారత యుద్ధం జరిగినప్పుడు, యుద్ధంలో ప్రవేశిస్తూనే అభిమన్యుడి చేతిలో మరణించాడు లక్ష్మణకుమారుడు. ఆ చిన్న విషయాన్ని తీసుకుని, ఆ పాత్రను హాస్యపాత్రను చేసి మలిచాము. అదేం తప్పు కాదు. కారెక్టరైజేషన్ లో ఔన్నత్యం వుంటే, ఆ ఔన్నత్యాన్ని కాదని, ఆ పాత్రను నీచంగా చిత్రిస్తే తప్పు గానీ, ఎలాంటి పాత్రతా లేని, ఒక పాత్రను తీసుకుని హాస్యానికి వాడుకోవడంలో తప్పులేదు, అది అనౌచిత్యమూ కాదు " అన్నా్రు.
శబ్దగ్రహణం : ఎ. కృష్ణన్, వి. శివరాం
కళ : గోఖలే, కళాధర్
నృత్యం : పసుమర్తి కృష్ణమూర్తి, గోపీనాథ్
కూర్పు : జంబులింగం, కళ్యాణం
ఆహార్యం : పీతాంబరం, భక్తవత్సలం
నిశ్చల చిత్రాలు : వృషభేంద్రయ్య
నేపథ్యగానం : ఘంటసాల, మాధవపెద్ది, పి. లీల, సుశీల, వసంతకుమారి, జిక్కి
నాట్యాలు : గోపీనాథ్, లలితారావు, రీటా, సరోజ
స్టూడియో : వాహినీ
' మాయాబజార్ ' విశేషాలు రావికొండలరావు గారు సంకలనం చేసిన సినిమా నవల లోనివి. విశాలాంధ్ర వారి ప్రచురణ.
Vol. No. 01 Pub. No. 236
7 comments:
’మాయాబజార్ మరలదేలయన్న’ అన్నట్టుగా ఎన్నిసార్లు చెప్పినా చేదెక్కని మధురఫలమది.
law of deminishing marginal utility pani cheyyani ekaika concept mayabajar
Unique record... thank you for the post from all the fans of Mayabazar.
Please see this post also:
http://tkvgp.blogspot.com/2010/03/created.html
* అజ్ఞాత గారికి / గార్లకు
( ఒకరో ఇద్దరో తెలియక, వ్యాఖ్యలతో బాటు పేర్లు కూడా రాసుంటే బాగుండేది )
ధన్యవాదాలు
* నాగార్జున గారూ !
ధన్యవాదాలు. మీరిచ్చిన లింక్ చూసాను. అందులో ఇంటర్వ్యూ గురించి చదివాక చాలా బాధనిపించింది. నా వ్యాఖ్య కూడా అందులో రాసాను.
బావుందండీ, నేను మాయాబజార్ గురించి ఒక వ్యాసం రాసాను నవతరంగంలో, మీరు చూసారా?
http://navatarangam.com/2010/02/mayabazar_mahabharat-without-pandavas/
సౌమ్య గారూ !
బావుంది మీ వ్యాసం. మాయాబజార్ లోని పాటల్ని, మాటల్ని బాగా విశ్లేషించారు. దాన్ని గతంలో చదవలేకపోయాను. సమాచారమిచ్చి మంచిపని చేశారు. ధన్యవాదాలు.
సౌమ్య గారూ !
ధన్యవాదాలు. మీ వ్యాసం అప్పుడు చూడలేకపోయాను గానీ ఇప్పుడు చూసాను. పాటల్ని బాగా విశ్లేషించారు. బావుంది. మీ నుంచి మరిన్ని మంచి సమీక్షలు ఆశిస్తూ.....
Post a Comment