Friday, March 19, 2010

కిలుం

" ఆడదాన్ని నలభైఏళ్ళు వచ్చేవరకూ శృంగారానికి పనికివచ్చే ఒక వస్తువుగా బాధించటమేకాదు. ఆ తర్వాత ఆమె పెట్టే బంగారు గుడ్డు కోసం కాపువాడిలా, సంఘంలో ప్రతి మగాడు కాపువేస్తాడు. కనీసం ఆ సంస్కృతి మన భారతదేశంలో లేదనుకుంటున్నాను. వయసు మళ్ళిన కొద్దీ, డబ్బు సంపాదిస్తున్న కొద్దీ అక్కడసలు రక్షణ లేదనిపిస్తుంది. అలాంటి నైతికమైన ఆలోచనకి మన సంస్కృతి, మన మతం, మన ఆచారాలు సహకరిస్తాయని నేననుకుంటున్నాను " అంది విమల.


కమల నోరు వెళ్ళబెట్టి చూస్తూండిపోయింది. అమెరికాలో స్త్రీ సంపూర్ణ స్వేఛ్ఛ అనుభవిస్తోందనీ, విడాకులు సులభంగా పొందుతోందనీ, పునర్వివాహం సులువుగా చేసుకోగలుగుతోందనీ, మరి ఇవన్నీ ఏమిటీ......అసలు సంస్కృతి అంటే ఏమిటీ ?

............................................................

దూరపు కొండలు నునుపు అనేది మనకు తెలిసిన విషయమే ! నాగరికత పెరిగింది. ప్రపంచమంతా మన ముంగిట్లోకి వచ్చేసింది. మనకి కావల్సిన దేశం యొక్క సంస్కృతి, ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు ఏమిటో తెలుసుకోవడానికి గతంలోలాగ కష్టపడాల్సిన అవసరం లేదు. బ్రతుకుతెరువు కోసమని ఇతరదేశాలకు వలస పోతున్నా మన సంస్కృతి గొప్పదనాన్ని కాదనలేకపోవడానికి కారణాలు పాశ్చాత్య దేశాల్లో మృగ్యమైపోతున్న మానవత్వ విలువలు, విలువల్లేని మానవ సంబంధాలు; మన దేశంలో ఇంకా కొంతో గొప్పో అవి నిలిచి వుండటం. దశాబ్దం క్రితంనాటి పరిస్థితికి అద్దం పట్టే కథ అయినా ఇప్పటికి కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదేమో l

కథా సంగ్రహానికి వస్తే............

కమల, విమల కవలపిల్లలు. విమలకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రాజాతో పెళ్ళి జరిగి అమెరికా వెళ్లిపోతుంది. అక్కడికి తీసుకెళ్ళాక ఆమెను హింసించి విడాకులిచ్చి మరొకామెను పెళ్లిచేసుకుంటాడు. అయినా విమల తిరిగి ఇండియా రాకుండా అక్కడే వుండిపోయి ఇరవై సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ ఇరవై సంవత్సరాలలో అమె ఆలోచనా సరళిలో వచ్చిన మార్పులు కమలను ఆశ్చర్య పరుస్తాయి.
నాస్తికురాలైన కమలకు విమలలో పెరిగిన భక్తి విస్మయం కలిగిస్తుంది గైనకాలజిస్టుగా ఇరవై ఏళ్ళు అమెరికాలాంటి అగ్రదేశంలో నిపుణత సంపాదించిన విమల ఇలా మాట్లాడటమే దీనికి కారణం.
" జీవితంలో దెబ్బ తిన్నప్పుడే కొన్ని విషయాలు అర్థమవుతాయి " అని చెబుతూ " రాజాతో దేశం కాని దేశంలో, మనుషులు కాని మనుషుల మథ్య నరకం అనుభవించే సమయంలో నన్నీ దేవుళ్ళే రక్షించారు. విష్ణుసహస్ర నామాలే ధైర్యాన్నిచ్చింది " అంటుంది విమల.
" అంతా నీ భ్రమ. నీకు మనుషులెవ్వరూ సాయం చెయ్యలేదా ? " అని అడిగిన కమలతో
" చేశారు. భౌతికంగా చేయూతనిచ్చి, ఆశ్రయం యిచ్చి ఆదుకున్నారు. కానీ మానసికంగా నేను కృంగిపోకుండా నన్ను ఈ దే్వుళ్ళే, నా యీ భారతీయ సంస్కృతే రక్షించింది " అంటింది విమల.
..................................................
" నిన్ను ఇన్ని బాధలు పెట్టిన రాజా ఈ సంస్కృతిలోంచి వచ్చిన వాడేనని మర్చిపోతున్నావా ? " అంటుంది కసిగా కమల.
" లేదు. ఎప్పుడూ మర్చిపోను. కానీ మగవాడు అనే మృగం, జాతి, మత, దేశ, కాలాలకి అతీతమని నాకు బాగా తెలుసు. కానీ నేను నేనుగా నిలద్రొక్కుకోడానికి నాకు దేవుడు అనే ఊహ ఆసరా అయింది. నాకు దేవుడున్నాడు " అని స్పష్టం చేస్తుంది.
................................................
" మతం పేరుతో ఎంత వ్యాపారం, ఎంత అత్యాచారం జరుగుతోందో తెలుసా ? " అని అడిగిన కమలతో
" దాన్ని నేను సమర్థించను. కానీ మానవత్వం పేరుతో అంతకంటే తక్కువేం జరగటంలేదు " అని విమల అనడంటో కమల వులిక్కిపడుతుంది.

నీళ్లకాగులో నానబెట్టిన విగ్రహాలను చూసిన కమల ' చెల్లాయి నమ్మిన దేవుళ్లకి కిలుం పడితే చింతపండు పులుసులో నానబెట్టింది తోమడానికి. తను నమ్మిన మనుష్యులకి పట్టిన కిలుం వదిలించాలంటే ఈ విశ్వమంత గంగాళంలో ఏమి వేసి తోమాలి ? ' అని గందరగోళంలో పడిపోతుంది.

క్లుప్తంగా కథా సంగ్రహమిదే !
కమల కనబడని దేవుళ్లకంటే కనబడే మనుష్యులే నిజమని నమ్మింది. విమల తన పరిస్థితుల ప్రభావం నుంచి బయిటపడటానికి దేవుణ్ణి ఆసరాగా చేసుకుంది. నిజమే విగ్రహాలరూపంలో వున్న దేవుళ్ళకు పట్టిన కిలుం వదిలించడం తేలికే ! కానీ మనుష్యుల మనసులకు పట్టిన కిలుం వదిలించడం తేలికైన పనేనా ?

1996 లో ఈ కథను ఓ ప్రముఖ రచయిత్రి రాసారు. ఉదహరించిన సంభాషణలలో శైలి ద్వారా ఆమె ఎవరో కనుక్కోవడం సులువేననుకుంటాను. ప్రయత్నించండి.

నేనే చెబుతాను. రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల

Vol. No. 01 Pub. No. 229

2 comments:

హను said...

nijame manishi ki paTTina kilumu ni vadilimchaDaaniki aa devuDea digiraavaleamoaa?

SRRao said...

హను గారూ !
ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం