నూతనోత్సాహం నింపుకున్న నూతన సంవత్సరం వచ్చేసింది
చెడు జ్ఞాపకాలను పారద్రోలుతూ మంచి అనుభూతుల్ని నింపుకోవాలని అందరి ఆకాంక్ష
నేను, నాది అనే స్వార్థం నుండి అందరూ బాగుండాలని జగమంతా కోరుకునే శుభాకాంక్ష
2011 ను విశ్లేషిస్తే తెలుగు వారికి మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందేమో !
రాజకీయనాయకులాడిన చదరంగంలో అనేకమంది జీవితాలతో బాటు తెలుగు భాష, సంస్కృతి, పరువు బలయిపోయాయి.
ఎంతోమంది ప్రముఖుల్ని తీసుకుపోయింది.
దానికి వర్షాభావం వల్ల కరువు కూడా తోడయింది.
వెడుతూ వెడుతూ చివరలో తమిళ సోదరులను ' థానే ' తుఫాను కుదిపేసింది.
ఇప్పుడు అందరి ఆకాంక్ష.....
2012 లో నైనా తమవారికి, లోకానికి మంచి జరగాలనే శుభాకాంక్ష.
చివరగా ఒక మాట. 2009 లో బ్లాగు ద్వారా మొదలైన నా అంతర్జాల యాత్రలో ప్రపంచం నలుమూలల నుంచీ ఎంతోమంది మిత్రులు లభించారు. ప్రోత్సాహాన్ని అందించారు. 2011 లో వారిలో చాలామంది ఆప్తబంధువులై పోయారు. విడదీయలేని బంధం ఏర్పరుచుకున్నారు. ప్రోత్సహిస్తున్నారు. చేదోడు వాదోడుగా నిలబడుతున్నారు. ఆ రకంగా నాకు మాత్రం 2011
మంచే చేసిందని చెప్పుకోవచ్చు.
మన తెలుగు సరస్వతికి నా శక్తి మేరకు సేవ చెయ్యాలనే సంకల్పంతో 2011 ఆగష్టు లో ' శిరాకదంబం ' వెబ్ పత్రిక ప్రారంభించాను. నా ఆసక్తి, నా ' శక్తి ' మాత్రమే పెట్టుబడిగా ప్రారంభించిన ఆ పత్రికకు ఎంతోమంది మిత్రులు ఉత్సాహంగా తమ రచనలను, చిత్రాలను పంపుతూ ప్రోత్సహించారు.... ప్రోత్సహిస్తున్నారు. ఇంత స్పందనను నేను ఊహించలేదు. ఇంకా ఎంతోమంది మిత్రులు ఉత్సాహం చూపుతున్నారు.
ఇందులో ఆర్థిక ప్రసక్తి లేదు. జమా ఖర్చులు లేవు.
చేదోడు వాదోడుగా నిలబడి నడిపిస్తున్న మిత్రులందరి ప్రోత్సాహమే వారానికి రెండురోజులు పూర్తిగా నన్ను బయిట ప్రపంచం మర్చిపోయేలా చేసింది... చేస్తోంది. ఈ ప్రోత్సాహం లేకపోతే నేను కూడా నీరస పడేవాడినేమో !
ప్రతీ సంచికకూ చదువరులు, వీక్షకులు పెరుగుతున్నారు. అది కూడా నన్ను మరింత ఉత్సాహపరుస్తోంది. పెద్ద వార్తా పత్రికల సరసన చిన్న పత్రికలున్నట్లే ... ప్రస్తుతం ఈ పత్రిక.... వెబ్ పత్రికల్లో చిన్న పత్రిక.
2012 లో మీ అందరి ప్రోత్సాహం, సహకారంతో పెద్ద పత్రికగా రూపు దిద్దుకోవాలని కోరుకుంటూ............
Vol. No. 03 Pub. No.098