Friday, January 28, 2011

జాన ' పథం '

ఒక సామాన్య యువకుడు రాజకుమారిని ప్రేమిస్తాడు. సహజంగానే ఇది రాజుకు కోపం తెప్పిస్తుంది. దాంతో అతన్ని బంధిస్తాడు. ఇంతలో రాణికి పేరు తెలియని జబ్బేదో వస్తుంది. ఆస్థాన వైద్యులు నయం చెయ్యడం తమ వల్ల కాదని, ఎక్కడో చాలా కోసుల దూరంలో వున్న అడవిలో వున్న అరుదైన సంజీవిని మూలికను తీసుకొచ్చి వైద్యం చేస్తేకానీ నయంకాదని చెబుతారు. అయితే ఆ ప్రాంతం ఒక రాక్షసుని అధీనంలో వుందని, వాణ్ణి ఎదిరించి ఆ మూలికను తీసుకురావడం అంత సులువు కాదని కూడా చెబుతారు. దాంతో రాజు అక్కడికి వెళ్ళి ఆ రాక్షసుడ్ని జయించి, ఆ మూలికను తెచ్చిన వాడికి అర్థరాజ్యంతో బాటు రాజకుమారిని ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటిస్తాడు. ఆ సాహసం చెయ్యడానికి రాజ్యంలో ఎవ్వరూ ముందుకు రారు. ఖైదులో వున్న కథానాయకునికి ఈ విషయం తెలిసి తనకు అవకాశం ఇస్తే ఆ సాహసం చేస్తానని చెబుతాడు. దాంతో రాజు అతన్ని విడుదల చేస్తాడు.


ఆ యువకుడు బయిల్దేరుతాడు. దారిలో ప్రాణాపాయంలో వున్న జంతువొకటి కనబడుతుంది. దాన్ని అతను రక్షిస్తాడు. దాంతో ఆ జంతువు ఒక దేవకన్యగా మారిపోతుంది. తనకు శాపవశాన ఈ రూపం వచ్చిందని ఆ యువకుని వలన విమోచనం కలిగిందని అతనికి కృతజ్ఞతలు చెప్పి ఒక ఉంగరం ఇస్తుంది. ఆది ధరిస్తే కోరుకున్న చోటుకు వెళ్ళవచ్చని చెప్పి మాయమైపోతుంది. ఆ ఉంగరం మహిమ వలన మూలిక వున్న చోటుకి చేరుకుంటాడు. అక్కడ అడ్డగించిన రాక్షసుని అనుచరులని తొలగించుకుంటూ ముందుకు సాగిన ఆ యువకుడిని రాక్షసుడు తన మాయతో కోతిగా మార్చేస్తాడు. దాంతో అతను వచ్చిన పనికి ఆటంకం కలుగుతుంది. అక్కడ ఇంకా అతని లాంటి వాళ్ళు అనేక రూపాల్లో కనిపిస్తారు. తన అసలు రూపు ఎలా పొందాలా, అక్కడనుంచి ఎలా తప్పించుకోవాలా, ఆ మూలికను ఎలా సాధించాలా అని ఆలోచిస్తుంటాడు. అతనికో మార్గం దొరుకుతుంది.


ఏమిటా మార్గం ? ఆ యువకుడు తప్పించుకున్నాడా ? ఆ మూలిక సాధించాడా ? రాజధాని చేరుకున్నాడా ? రాజకుమారిని చేపట్టాడా ? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే వెండితెరపై చూడండి.   

ఇదేమీ చందమామలోని కథ కాదు. జానపద సినిమాల కథ. ఆ మాటకొస్తే సుమారుగా జానపద కథలన్నీ ఈ బాణీలోనే వుంటాయి. అవి నేల విడిచి సాము చేస్తాయి. ఆది వాటి నైజం. ఇవన్నీ కేవలం కల్పిత కథలని అందరికీ తెలుసు. రచయిత గానీ, దర్శకుడు గానీ, నిర్మాత గానీ ఇదొక సందేశాత్మక చిత్రమనీ, వైవిధ్యభరితమైన కథ అనీ,  అదని, ఇదనీ గొప్పలు చెప్పరు. అయినదానికీ, కాని దానికీ ఆస్ట్రేలియాలు, మారిషస్ లూ వెళ్ళి గుంపు నృత్యాలు లాంటి కవాతులు, గ్రాఫిక్స్ యుద్ధాలు చేయించరు. మనల్ని మనం మరచిపోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా మూడు గంటలు గడపడానికి కావాల్సిన, అందరికీ తెల్సిన కథ, దాంట్లో మలుపులు, పుష్కలంగా వినోదాన్ని అందించే మాయలు.. మహిమలు, అప్పుడప్పుడు సాహస పోరాటాలు, చక్కటి వీనుల విందైన పాటలు, నృత్యాలు .... ఇవన్నీ కలిపితే ఆది విఠలాచార్య చిత్రం.   

సగటు ప్రేక్షకుడు కోరుకునే అన్ని హంగుల్నీ దర్శకత్వమనే తన మంత్రదండంతో వెండితెర మీద సృష్టించిన జానపద బ్రహ్మ విఠలాచార్య. మూస చిత్రాలనీ, ట్రెండ్ పేరుతో అన్నీ ఒకే ఫార్ములాతో తీస్తున్నారని మనం ఇప్పుడు తిట్టుకుంటున్నాం. కానీ విఠాలాచార్య చిత్రాలన్నీ ఫార్ములా చిత్రాలే ! కథ ఏదైనా ఆయన ఫార్ములా ఒకటే ! అయినా అవన్నీ వినోదాత్మకమైనవే ! పిల్లల్నీ, పెద్దల్నీ, ఆడా మగా తేడా లేకుండా అందర్నీ అలరించినవే ! రోజంతా కష్టపడి పని చేసిన శ్రమజీవి కష్టాన్ని మరిపించి మర్నాటికి మళ్ళీ పనికి సిద్ధం చేసే అమృత గుళికలు విఠలాచార్య చిత్రాలు. ఆయన చిత్రాల గురించి ఎక్కువ చర్చలు, వాదోపవాదాలు అక్కర్లేదు. హాయిగా కాసేపు చూసి ఆనందించడమే తప్ప సమాజాన్ని ఉద్ధరించేది గానీ, పాడు చేసేది గానీ ఏమీ వుండదు. ఎందుకంటే సమకాలీన సమాజ నేపథ్యం కాదు కనుక ప్రేక్షకులెవరూ తమను తాము ఆ చిత్రాల లోని పాత్రలతోను, సంఘటనలతోను సరి పోల్చుకోరు.... ప్రభావితం కారు. అవన్నీ ఊహాజనితమైన కథలనీ, ఊహాజనిత పాత్రలనీ ప్రేక్షకుల మనస్సులో ముందే స్థిరపడిపోయి వుంటుంది.

అలాంటి ఊహాజనిత ప్రపంచాన్ని తెలుగు తెరపై సృష్టించిన జానపద చిత్రాల బ్రహ్మ విఠలాచార్య.  హోటల్ రంగానికి ప్రసిద్ధి చెందిన కన్నడ దేశంలోని ఉడిపిలో జన్మించి, తెలుగు ప్రేక్షకులకు తన చిత్రాలతో షడ్రసోపేతమైన విందు భోజనం అందించిన దర్శకుడు విఠలాచార్య. కొత్త సినిమా నిర్మాణాన్ని ప్రకటించిన రోజునే విడుదల తేదీ ప్రకటించగలిగిన సత్తా వున్న దర్శకుడు. నిర్మాతల పాలిట వరం విఠలాచార్య.

ఆయన చిత్రీకరణ పైన వున్న అందరికీ తెలిసిన ఓ జోకు........ ఏరోజైనా షెడ్యూలు ప్రకారం హీరో గానీ, హీరోయిన్ గానీ రాకపోతే ఆరోజు వారి మీద తియ్యాల్సిన సీన్లు ఆగేవి కాదట. ఆ దృశ్యంలో మిస్సయిన వారిని కోతిగానో, చిలుక గానో, మరోటి గానో మార్చేసి తీసేసేవారట. అలా ఆయన షెడ్యూల్ ను పాడు కానిచ్చేవారు కాదట.

ఓసారి ఓ నిర్మాత విఠలాచార్య దగ్గరకొచ్చి " అయ్యా ! మీరు అతి తక్కువ ఖర్చుతో చిత్రాలు నిర్మిస్తారని అంటారు. ఆ కిటుకేదో నాకు కూడా చెబితే నన్ను రక్షించిన వారవుతారు " అని అడిగాడు.
దానికాయన " అలాగే చెబుతాను. ఒక్క నిముషం. ఫ్యాన్ వుంటే చాలుగా ! లైట్ ఆర్పేసి వస్తాను. " అని కుర్చీలోంచి లేచారు. అంతే విషయం గ్రహించిన ఆ నిర్మాత " ఇంకే చెప్పనక్కర్లేదు. నాకర్థమైపోయింది. నమస్కారం. వస్తాను " అని లేచి వెళ్ళిపోయాడట. అదీ విఠలాచార్య గారి పొదుపు.

స్టార్ డం మీద కాక టెక్నిక్ మీద నమ్మకం ఎక్కువ ఆయనకి
అందుకే ఆయనకు స్టార్లక్కర్లేదు.. ఆయన చిత్రాల్లో ఆయనే స్టార్

కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే మాట తెలియని రోజుల్లో అద్భుతమైన గ్రాఫిక్స్ సృష్టించిన ఘనుడాయన.    
తెలుగు చిత్రరంగంలో విఠలాచార్యది ఒక ప్రత్యేకమైన పంథా ! అదే జనపదులకు ఇష్టమైన జాన ' పథం '  !!!

 జానపద బ్రహ్మ విఠలాచార్య జయంతి సందర్భంగా ఆయనకు చిత్ర నీరాజనాలతో...............




 Vol. No. 02 Pub. No. 130

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం