Showing posts with label ప్రముఖుల విశేషాలు. Show all posts
Showing posts with label ప్రముఖుల విశేషాలు. Show all posts

Wednesday, March 16, 2016

మానవుడే మహనీయుడు....


మానవులందరూ మహనీయులు కాలేరు
మహనీయులు మాత్రం కారణజన్ములవుతారు
లోకకళ్యాణం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తారు
అఖండమైన కీర్తిని మూటగట్టుకుని అమరజీవులవుతారు

తెలుగువారి అస్థిత్వం కోసం అలుపెరుగని పోరాటం చేశారు పొట్టి శ్రీరాములు
ఆత్మార్పణతో ఆంధ్రులకు రాష్ట్రం సాధించి పెట్టి అమరజీవి అయ్యారు

.... అమరజీవి పొట్టి శ్రీరాములు నడయాడిన నేల. అత్యున్నత ఆశయం కోసం, ఆంధ్రుల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం కోసం 58 రోజులపాటు కఠోర దీక్ష చేసిన చోటు, ఎన్ని అవమానాలు, అవరోధాలు ఎదురైనా దీక్షాకంకణ బద్ధుడై, తుది శ్వాస వరకూ ఆంధ్రుల పౌరుషాన్ని నిలబెట్టి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనితర సాధ్యమైన ఆమరణ దేక్ష చేసిన ప్రదేశం చెన్నై నగరంలోని మైలాపూర్ ప్రాంతం. ఆ ప్రదేశంలో అడుగుపెడుతూనే ఒక రకమైన ఉద్వేగం. ఆ మహనీయుడు చేసిన త్యాగమే ఆంధ్రుల ఉనికికి ఆలంబన అయింది. దశాబ్దాల పోరాటం సఫలం చేసింది. ఆ విషయం తల్చుకుంటుంటే ఒక విధమైన పులకింత. ఆయన దీక్ష చేసిన చోటు, ఆయన సమాధి, అక్కడ ప్రతిష్టించిన విగ్రహం.... వీటన్నిటి వెనుక ఆయన దీక్షా దక్షత, పట్టుదల, త్యాగం... ఇవన్నీ కనిపిస్తాయి. ఆంధ్ర దేశంలోని ప్రతి అణువణువులో ఆయన ఉనికి వుంది. అయితే ఆ ఉనికి గుర్తించి, ఆ స్ఫూర్తినుంచి ప్రేరణ పొందితేనే ఆయన ఆశయాన్ని సాధించినట్లు అవుతుంది.


పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసిన ప్రదేశంలో అడుగుపెట్టడమే అదృష్టం అనుకుంటే... ఆయన 116 వ జయంతి ఉత్సవాలలో పాల్గొనడం నేను చేసుకున్న పుణ్యం. మనం ఎలాగూ మహానుభావులం కాలేము. కనీసం అటువంటి మహనీయులను స్మరించుకుని తరిస్తే... వారి ఆశయాల సాధనకు మన వంతు కృషి చేస్తే.... మన జన్మ ధన్యం.



ఒకసారి సందర్శించినందుకు, ఆ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు నేనే అదృష్టవంతుణ్ణి అనుకుంటుంటే.... నిత్యం ఆయనని, ఆయన ఆశయాలను సజీవంగా వుంచి, వారి స్ఫూర్తిని అందరికీ పంచుతున్న చెన్నైలోని " అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ " వారు నిజంగా ధన్యులు. ఆయన 58 రోజుల దీక్ష తర్వాత ఆత్మార్పణ చేసిన ప్రదేశంలోనే ముచ్చటైన స్మారక భవనం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన స్మృతికి నివాళి గా అనేక కార్యక్రమాలు నిర్వహణకు రూపకల్పన చేస్తున్న ఆ సంస్థ సారధి శ్రీ వై. రామకృష్ణ గారు అభినందనీయులు.

ఈ నెల 12 వ తేదీ శనివారం రోజున వారు " అమరజీవి పొట్టి శ్రీరాములు " గారి 116 వ జయంతిని వైభవంగా చెన్నైలోని పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో నిర్వహించారు. ఆ సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న రచయిత, రంగస్థల నటులు శ్రీ వాడ్రేవు సుందరరావు గారు పొట్టి శ్రీరాములు గారి జీవిత చిత్రాన్ని ఆహుతుల కళ్ల ముందు ఆవిష్కరించారు. దీక్ష ప్రారంభానికి ముందే పొట్టి శ్రీరాములు గారు తన దీక్షను ఆమరణ దీక్షగా ప్రకటించారు అనేదానికి నిదర్శనంగా అప్పటి వార్తాపత్రికలను కూడా ప్రదర్శించారు.

ఈ సందర్భంగా " అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ " వారు యువజనుల కోసం ప్రారంభించిన
త్రైమాసిక అంతర్జాల పత్రిక " యువ " ను ఆవిష్కరించారు.



ఆ పత్రిక లింక్ :

అమరజీవి ఆశయాలను, తెలుగువారి ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న చెన్నై లోని తెలుగువారిని, తెలుగు రాష్ట్రాల్లోని వారందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. తెలుగు భాష, తెలుగు సంస్కృతి పరిరక్షణ మన ప్రధాన ఆశయం కావాలి. తెలుగు వారి పౌరుషాన్ని ప్రదర్శించి మన ఉనికిని కాపాడుకోవాలి.
పొట్టి శ్రీరాములు లాంటి ఎందరో మహానుభావులు తెలుగు జాతి ఉన్నతికి కృషి చేశారు. వారినందర్నీ స్మరించుకునే విధంగా చెన్నైలోని ' పొట్టి శ్రీరాములు స్మారక భవనం ' లో ఆ మహనీయులందరి చిత్రపటాలను ఏర్పాటు చెయ్యడం అభినందనీయం. ఆ కార్యక్రమం లో పాల్గొని ఆ మహనీయుని స్మరించుకునే అవకాశం దక్కడం నా అదృష్టం. 
ఆ అవకాశాన్ని కల్పించిన " అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ " వారికి కృతజ్ఞతలతో..... 

ఈరోజు " అమరజీవి పొట్టి శ్రీరాములు " గారి 116 వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ....
 

 Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 07 Pub. No. 014

Tuesday, July 28, 2015

భారత ' జాతి ' రత్నం

 ఆయనకు పిల్లలంటే అమితమైన ఇష్టం.
వారిలో భావి భారతాన్ని చూడగలిగిన దార్శనికుడాయన.
పిల్లలని, యువకులని కలలు కనమన్నారాయన.
ఆ కలల్ని సాకారం చేసుకునేందుకు కృషి చెయ్యమన్నారు. 




ఆయన నిజమైన, స్వచ్చమైన లౌకిక వాది.
ఏ మత సిద్ధాంతాన్నైనా, సంప్రదాయన్నైనా గౌరవించగల సంస్కారం ఆయన స్వంతం.
ఉన్నత శిఖరాలు అందుకోవడానికి ఉన్నతమైన లక్ష్యం, నిబద్ధత కావాలి గానీ అడ్డదారులు కావని నిరూపించిన మహనీయుడు.



రాష్ట్రపతి అయినా ప్రజలకు దూరంగా అద్దాల సౌధంలో గడపనవసరం లేదని, ప్రజల మధ్యనే వుండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యవచ్చని తెలియజేసిన మహా నాయకుడు ఆయన.




పదవి అందరికీ అలంకారం. ఆయన పదవికే అలంకారం.
ఇటీవలి కాలంలో భారతజాతి గర్వించదగ్గ ఏకైక ' భారతరత్నం ' ఆయన. 
తన వ్యక్తిత్వాన్ని, ఆదర్శాలను, ఆకాంక్షలను మనకి వదలి, నా పని అయిపోయింది.... ఇక అనుసరించడం మీ పని అన్నట్లుగా నిన్ననే ( 27 జూలై 2015 ) వెళ్లిపోయారాయన.



ఆయన చెప్పిన మార్గంలో మన పిల్లల్ని తయారుచేసి, భవిష్యత్తులోనైనా ఆయన లాంటి నాయకులను, శాస్త్రజ్ఞులను, పండితులను దేశానికి అందించడమే అబ్దుల్ కలామ్ గారికి నిజమైన నివాళి.



అప్పుడే మన దేశాన్ని బయిటి ముష్కరుల నుంచి, లోపలి రాబందుల నుంచి మనమే రక్షించుకోగలుగుతాము.
 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 029

Sunday, May 27, 2012

ఇద్దరు మహనీయుల స్మృతి

 బాల్య వివాహాలు సర్వసాధారణం అయిన రోజులవి. 
వివాహానికి కనీస వయస్సు అనే నియమమేదీ లేని రోజులవి. 
కాటికి కాళ్ళు జాచుకున్న పండు ముసలి వాడైనా, 
రెండో.... మూడో పెళ్లి వాడైనా మళ్ళీ పెళ్ళికి సిద్ధమనే రోజులవి. 
అయితే ముక్కుపచ్చలారని బాలికమణే కావాలి 
పెళ్ళంటే.. సంసారమంటే.. అర్థమయ్యే వయస్సు వచ్చేసరికి 
ఆ మొగుడు కాస్తా వయోభారంతో గుటుక్కు మంటే.. 
ఆమె వయసు, జీవితం అడవి కాచిన వెన్నెలే ! 
నచ్చిన బట్టలు కట్టడానికి లేదు.... 
అందమైన మోమున బొట్టు పెట్టడానికి లేదు.... 
అభిరుచితో అలంకారాలు చేసుకోవడానికి లేదు..... 
నచ్చిన తిండి తినడానికి లేదు.....  

స్త్రీ అలాంటి దుర్భర పరిస్థితుల్లో అలమటిస్తున్న రోజుల్లో నేనున్నానంటూ వారికి అండగా నిలబడి, ఏటికి ఎదురీది విధవా పునర్వివాహం, స్త్రీ విద్య లాంటి ఎన్నో సంస్కరణలను ధైర్యంగా ప్రవేశ పెట్టి, అమలు చేసిన గొప్ప సంస్కర్త కీ. శే.  కందుకూరి వీరేశలింగం పంతులు గారు.  
 వీరేశలింగం పంతులు గారి స్మృతి దినం సందర్భంగా నివాళులర్పిస్తూ ....... 

గతంలోని టపా : 




సుమారు రెండు శతాబ్దాలు పరాయి దేశస్థుల పాలనలో మగ్గిపోయిన భారతావని స్వీయ పాలనలోకి వచ్చాక... ప్రభుత్వాన్ని ఏర్పరచడం... నడపడం కట్టి మీద సామే !
ఎన్నో అగచాట్లు పడిన ప్రజలు సుపరిపాలనను కోరుకుంటారు.
అంతకాలం తాము కోల్పోయినవన్నీ వెంటనే ఏర్పడాలని కలలు కంటారు.
ఆ కలల్ని నిజం చేసే నాయకులు వుండాలని... తాము కోరుకున్నవన్నీ అందించాలని ఆశిస్తారు.
సరిగ్గా అటువంటి పరిస్తితుల్లో భారత దేశానికి మొదటి ప్రధాన మంత్రి గా ఎన్నిక కాబడడమే కాక దీర్ఘకాలం అదే పదవిలో పని చేసి, నవ భారత పునర్నిర్మాణానికి ఎన్నో పథకాలు రచించి... ఎన్నో విషయాల్లో వెనుకబడిన దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించిన నాయకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రు.

 నెహ్రు స్మృతి దినం సందర్భంగా నివాళులు అర్పిస్తూ....... 

గతంలోని టపా :

ఆధునిక భారత రూపశిల్పి  


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 141

Monday, April 16, 2012

ఇద్దరు మహనీయులు

 మనిషి ఎప్పుడూ నిలకడగా ఉండడేమో ! ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉంటేనే గానీ తోచదనుకుంటాను. ఈ కాలంలో అవినీతి, స్వార్థపరత్వం, పరపీడనం లాంటి దురాచారాలు పాటిస్తుంటే, గత కాలంలో మన సమాజం ఆదిశక్తిగా కొలుచుకునే స్త్రీలను అణిచి వెయ్యడానికి అనేక దురాచారాలు పాటించేవారు. అయితే ప్రతీ దురాచారాన్ని ఖండించడానికి, వ్యతిరేకించడానికి, దానికి బలవుతున్న అభాగ్యుల్ని రక్షించడానికి ఎవరో ఒక సంస్కర్త పుడుతూనే వుంటారు.

అలా సుమారు నూట అరవై నాలుగు సంవత్సరాల క్రితమే ( 1848  లో ) జన్మించి ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమములు చేపట్టి, మరెన్నో దురాచారాలను రూపు మాపడానికి కంకణం కట్టుకుని.... నవయుగ వైతాళికుడు అనిపించుకున్న మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. 

పత్రికలున్నవి ప్రజల బలహీనతలతో ఆడుకోవడానికి, ఆర్థిక ప్రయోజనాన్నో, రాజకీయ ప్రయోజనాన్నో ఆశించి ఎవరో ఒక వ్యక్తికో, ఏదో ఒక వర్గానికో, పార్టీకో కొమ్ము కాయడానికో కాదని,,,, అసలు మీడియా సమాజానికి అవసరం ఏమిటో, బాధ్యత ఏమిటో తెలుసుకోవాలంటే వీరేశలింగం గారి ' వివేక వర్ధని '  పత్రిక గురించి తెలుసుకోవాలి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలని, మూఢాచారాలని ఖండించడానికి, ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యడానికి ఆయన పత్రికను ఆలంబనగా చేసుకున్నారు. పత్రికా విలువలేమిటో తెలుసుకోవాలంటే వీరేశలింగం గారి ' వివేక వర్ధని ' గురించి తెలుసుకోవాలి.

 ఆ నవయుగ వైతాళికుని జన్మదినం సందర్భంగా నివాళులు అర్పిస్తూ......... 

వీరేశలింగం గారి మీద గతంలోని టపాలు........ 

తెలుగు తేజం కందుకూరి

*****************************************************************************

ఒక్కొక్క వ్యక్తి జన్మించి ఆ యుగం తనదనిపించుకుంటాడు. ఆ యుగాన్ని శాసిస్తాడు. ప్రజల మీద, ప్రపంచం మీద తనదైన ముద్ర వేసుకుంటాడు.
కొంతమంది కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతారు. దానికి భాష కూడా కొంత కారణమవుతుంది. కానీ కొంతమంది విషయంలో ఇవేవీ అవసరం లేదు. వారికి భాషతో పని లేదు. ఆచార వ్యవహారాలతో పని లేదు. ప్రపంచమంతా వారిదే !  
హాస్యం, నటన అనగానే ప్రపంచంలో అందరూ ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పేరు చార్లీ చాప్లిన్.
భాష అవసరం లేని మూకీల కాలం నుంచి భాష నేర్చుకున్న టాకీల కాలం దాకా వున్న చాప్లిన్ సినిమాలకు భాషతో సంబంధం లేదు. ఆయన హావ భావాలే ఆయన భాష.
ఆయన చిత్రాలు భాష కారణంగా ప్రపంచంలో ఎవరికైనా అర్థం కాకపోవడం ఉంటుందా ?
ఆయన చిత్రాల్లో వుండేది వినోదమా ! విషాదమా !
వినోదంలోనుంచి విషాదం.... విషాదంలో నుంచి వినోదం పుట్టించగల దిట్ట.
దృశ్య మాధ్యమమైన సినిమాకు మాటల ప్రాధాన్యం అవసరమా ?
ఆయన కళ్ళు మాట్లాడతాయి. ఆయన నడక మాట్లాడుతుంది. ఆయన నటన మాట్లాడుతుంది. కానీ ఆయన మాట్లాడడు.
కేవలం మూకీ సినిమాల్లోనే కాదు. సాంకేతికాభివృద్ధి జరిగి టాకీ లొచ్చినా ఆయన సినిమాలు చాలాకాలం మాట్లాడలేదు. తర్వాత మాట్లాడినా అవసరమైన చోట్ల, అవసరమైనంత వరకే !
సాంకేతికాభివృద్ధి వెర్రి తలలు వేస్తున్న ఈరోజుల్లో ఇది చాదస్తంగా అనిపించవచ్చు కానీ, ఎవరైనా చాప్లిన్ శైలిని అర్థం చేసుకుని కొద్దిగానైనా అనుసరించడానికి ప్రయత్నిస్తే ఆ మాధ్యమానికి, ప్రజలకి న్యాయం జరుగుతుంది.

  ఆ విశ్వనటచక్రవర్తి జన్మదినం సందర్భంగా నివాళులు అర్పిస్తూ...........    

చార్లీ చాప్లిన్ పైన గతంలోని టపాలు...........  

విషాదంలోనూ వినోదమే !
నవ్వుల విషాదం
నవ్వుల గని 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 133

Tuesday, April 10, 2012

భర్త...భర్తే !

 ఆల్బర్ట్ ఐన్ స్టీన్ .....
ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ. ముఖ్యంగా సైన్సు తో కొద్దిపాటి పరిచయమున్న ప్రతీవారికి తెలిసిన పేరు. సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొని విజ్ఞాన శాస్త్రంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న మహానుభావుడు.

ఎంత గొప్పవాడైనా ఒక స్త్రీకి భర్తే ! ఎంత అభివృద్ధి చెందినా పురుషాధిక్యత విషయంలో, స్త్రీ వివక్షత విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఒకటే అనిపిస్తుంది.

ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞుడిగా పేరు తెచ్చుకున్నా ఐన్ స్టీన్ కూడా సగటు భర్తే అని ఆయన మరణించిన చాలాకాలానికి దొరికిన ఆయన ఉత్తరాలు నిరూపించాయి. అందులో ఆయన తన భార్యకు విధించిన కొన్ని షరతులు కలిగిన ఉత్తరం కూడా వుంది.

ఆ షరతులు ఏమిటంటే  ..........

* సరిగా సమయానికి వంట చేసి భోజనం పెట్టాలి
* తన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి, ఇస్త్రీ చేసి ఉంచాలి.
* రెండుపూటలా పడకగది, తన ఆఫీసు గది ఊడ్చి శుభ్రం చెయ్యాలి.   
* తన టేబుల్, దాని మీదున్న పుస్తకాలు, కాగితాలు ఎత్తి పరిస్తితుల్లో ముట్టుకోకూడదు.
* తను బయిటకు రమ్మన్నప్పుడే రావాలి గానీ తీసుకెళ్ళమని అడగకూడదు.
*  పిలిచినపుడు వెంటనే రావాలి. పడకగదిలోకి అయినా సరే !
* ఇతరుల ఎదుట, ముఖ్యంగా పిల్లల ఎదుట తన మాటకు ఎదురు చెప్పకు.

ఇప్పుడు ఒప్పుకుంటారా ? ఎంత గొప్పవాడైనా భర్త.... భర్తే.... అని. 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 131

Friday, March 2, 2012

భారత కోకిల స్మృతి

స్వంత గడ్డ కాకపోయినా పుట్టింది , పెరిగింది, ప్రపంచ యవనిక మీద భారత కోకిలగా ప్రసిద్ధి చెందడానికి పునాది పడింది తెలుగు నేల మీదనే !
ఆ కోకిలే తెలుగు వారి దత్త పుత్రిక, తెలుగు వారి కోడలు సరోజినీ నాయుడు.
హైదరాబాద్ నగరంతో అనుబంధాన్ని, ప్రేమబంధాన్ని ముడివేసుకున్న సరోజిని భారతీయులు గర్వంగా చెప్పుకోగలిగిన విదుషీమణి, స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి
హైదరాబాద్ నగరానికి తలమానికంగా చెప్పుకునే నిజాం కళాశాల వ్యవస్థాపకుల్లో ప్రముఖులు సరోజిని తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ. ఆమె తల్లి  సుందరి దేవి కూడా బెంగాలీలో కవయిత్రే !
సరోజినీ చిన్ననాటనే పెర్షియన్ భాషలో రచించిన కవిత నైజాం నవాబును మెప్పించింది.  పదహారవ ఏటనే ఆమెను పై చదువులకోసం లండన్ పంపించింది.  అక్కడ ప్రముఖ సాహితీకారుల సాంగత్యం ఆవిడ సృజనాత్మకతకు మరింత పదును పెట్టింది.
పందొమ్మిదవ ఏటనే అప్పటి సాంప్రదాయాలను ఎదిరించి కులాంతర ప్రేమ వివాహం చేసుకుని తెలుగు వారి కోడలయింది.
గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్ టాగోర్, జిన్నా, గాంధీ, నెహ్రు లాంటి నాయకుల ప్రభావంతో స్వాతంత్ర్య సమరంలో పాల్గొని భారత స్త్రీలకు స్పూర్తి నిచ్చింది.
అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా  కూడా ఎంపికయింది.
స్వాతంత్ర్యానంతరం  ఉత్తరప్రదేశ్ కు గవర్నర్ గా పని చేసి తొలి భారతీయ మహిళా గవర్నర్ అయింది.
ఆ సమయంలోనే ప్రపంచాన్ని తన కవితాగానంతో ఉర్రూతలూగించినఈ భారత కోకిల  1949  మార్చి   2  వ తేదీన  నింగికెగిసింది.
  భారత కోకిల సరోజినీ నాయుడుకి స్మృత్యంజలి ఘటిస్తూ............

భారత కోకిల సరోజినినాయుడు కవితల్ని ఈ లింక్ లో చదవండి.

http://www.poemhunter.com/sarojini-naidu/poems/

 భారత కోకిల జీవిత చిత్రణ ఈ ఫిల్మ్స్ డివిజన్ డాక్యుమెంటరీ లో ..............



Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 123

Saturday, February 18, 2012

అద్వైత సాధకులు శ్రీ రామకృష్ణులు

మానవాళికి మార్గనిర్దేశం చెయ్యడానికి అప్పుడప్పుడు మహానుభావులు ఉద్భవిస్తూ వుంటారు. అలాంటి వారిలో ప్రముఖులు పురాణ కాలంలో నరనారాయణులు అర్జునుడు, శ్రీకృష్ణుడు అయితే ఆధునిక కాలంలో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు ఆ కోవకు చెందుతారు.

శ్రీ ఆదిశంకరులవారి అద్వైతాన్ని అంది పుచ్చుకున్నారు రామకృష్ణులు. ఆయన బాటలో పయనించి భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు వివేకానందులు.

అద్వైతంలో పరాకాష్టకు చేరుకొని ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించి ఈ యుగంలో... ఈ కాలంలో.... ఒక విశిష్ట వ్యక్తిగా భాసిల్లిన శ్రీరామకృష్ణ పరమహంస జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో శ్రీ టి. వి. యస్. శాస్త్రి గారు వ్రాసిన అమూల్యమైన వ్యాసం ఈ లింకులో...........

మహాయోగి-శ్రీ రామకృష్ణ పరమహంస - టి.వి.యస్. శాస్త్రి

 

  Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 119

Friday, February 3, 2012

నో గో కలర్

కస్తూర్బా గాంధీ గారికి ఆంగ్లంలో ప్రవేశం అంతంత మాత్రం. 

ఆవిడ ఓసారి తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచెంగోడ్ వెళ్లారు. అక్కడ గాంధీజీ ఆశ్రమం వుంది. ఆ ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. గాంధీ దంపతులకు సన్నిహితుడైన రాజాజీ ఆమె కూడా వుండి ఆశ్రమంలోని అన్ని విభాగాలు చూపించి వివరిస్తున్నారు. అలా ఖాదీ వస్త్రాలపై అద్దకం చేసే విభాగం వద్దకు వచ్చారు. ఆ పనిని పరిశీలిస్తున్న కస్తూర్బాకు ఒక సందేహం వచ్చింది. ప్రక్కనే వున్న రాజాజీని ఇలా అడిగారు. 
" దిస్ కలర్ గో " 
రాజాజీ గారికి అర్థమైపోయింది కస్తూర్బా మాటల్లోని భావం. అక్కడ అద్దుతున్న రంగులు వెలిసిపోతాయా అన్నది ఆవిడ సందేహం. 
 రాజాజీ సహజంగా చమత్కార భాషణులు. అందుకే వెంటనే " నో ! దిస్ ఈజ్ ' నో గో కలర్ ' ! " అన్నారట. దాంతో చుట్టూ వున్న వాళ్ళు నవ్వారట. అంతే... కస్తూర్బా గారికి ఎక్కడో తేడా వచ్చిందని అర్థమైపోయింది.
" ఏం ? నేనేమైనా తప్పు మాట్లాడానా ? " అని అడిగారట. 
దానికి రాజాజీ " లేదు లేదు. ఇది కస్తూర్బా ఇంగ్లీష్ " అని మరో చమత్కారం విసిరారట. 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 112

Monday, January 30, 2012

పూజ్య బాపూజీ అంతిమ సంస్కారం

అది 1948 వ సంవత్సరం, జనవరి 30 వ తేది,శుక్రవారం. మహాత్మ యధావిధిగా తెల్లవారుఝామున 3-30 గంటలకు నిద్రలేచారు. ప్రాతః:సమయ ప్రార్ధన తర్వాత, కాంగ్రెస్ సంస్థాగత Constitution కి తుది మెరుగులు దిద్దుతున్నారు. అటుపైన కొన్ని ఉత్తరాలకు సమాధానాలు వ్రాశారు. కొంతమంది ఆత్మీయులు,వారి వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని ఈ విధంగా అన్నారు " ఇప్పుడు ఆ పనులన్నీ చేయవలసిన అత్యవసరమేమున్నదని ?" అందుకు గాంధీ గారు " రేపు అనేది వాస్తవం కాదు. రేపు నేను మీ మధ్య ఉండకపోవచ్చు కదా!" అని బదులు చెప్పారు.ప్రార్ధనా మందిరానికి బయలుదేరుతుండగా యెవరో అన్నారట--ఈ రోజు మీరు అంత ఉల్లాసంగా కనపడటంలేదు, కాబట్టి ఇవాళ ప్రార్ధనకు పోక పొతే ఏమి పోయింది? అని. అందుకు మహాత్ముడు " ఒకవేళ నాకు మరణం సంభవిస్తే, అది ప్రార్ధన  సమయంలోజరగాలని నాకోరిక. నాకు జరగపోయే హాని/మృత్యవు నుంచి నన్ను ఒక్క భగవంతుడు తప్ప మిగిలిన వారెవ్వరూ కాపాడలేరు" అన్నారు.. మహాత్ముడు ప్రార్ధనకు వెళ్లి  ప్రార్ధనకు ఉపక్రమించిన వెంటనే హిందూ మతోన్మాది అయిన గాడ్సే తుపాకి గుండ్లకు నేలకొరిగి "హే రాం!" అని  మృత్యవు ఒడిలోకి  జారిపోయారు. ఈ వార్త దావానలంలా దేశమంతా వ్యాపించి ప్రజలందరూ శోక తప్తులయ్యారు.
           చితి మీద మహాత్ముని భౌతిక కాయాన్ని తల ఉత్తర దిశ వైపు ఉండేటట్లు పడుకోబెట్టారు. బుద్ధుడు కూడా అదే విధంగా తల ఉత్తర దిశగా వున్నప్పుడే  భౌతిక యాత్ర ముగించాడు. అదే రోజు సాయంత్రం 4-45 గంటల సమయంలో గాంధీ గారి మూడవ కుమారుడైన రామదాసు గారు చితికి నిప్పు అంటించారు. అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున  పైకి ఎగిసి పడ్డాయి. స్త్రీలు పురుషులు గుండెలు బాదుకుంటూ ఆ దృశ్యాన్ని చూస్తూ భోరున విలపిస్తున్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించిన 'సత్యాగ్రహి' దేహం బూడిదగా మారటానికి యెంతో సేపు పట్టలేదు.
ప్రజలు  యెంత రోదించినా, భారతమాత మాత్రం తనకు దాస్య విముక్తి కలిగించి,అలసిసొలసిన  తన ముద్దుబిడ్డను ప్రేమగా తన ఒడిలోకి తీసుకొని ఆనందించింది.
              భారత జాతిపిత అలా తన దేహయాత్ర ముగించారు.

మహాత్మాగాంధీ దహన సంస్కారాల అరుదైన చిత్రాలు

 



















 



















చదవడం వలన ప్రయోజనం ఏమిటంటే నలుమూలల నుంచి వచ్చే విజ్ఞానాన్ని పొందడం, దాన్నుంచి జీవిత పాఠాలను నేర్చుకోవడం.గాంధీజీ 

********
నియమబద్ధ జీవితానికి కోర్కెలను జయించడం మొదటి మెట్టు. - గాంధీజీ
*********
మహాత్మాగాంధీకున్న మనోబలం ఈరోజు ఎందరికి ఉంది ? అప్పుడే కొన్నిదేశాలలో వాళ్ళు, " గాంధీనిజం గా ఒక మనిషేనా లేక కట్టుకథా ? అంతటి సంకల్ప బలం మానవమాత్రులకు ఉండడం సహజమా " అనుకుంటున్నారట.
*********
శ్రీ టీవీఎస్.శాస్త్రి గారు పంపిన ఇ మెయిల్ సందేశం  


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 110

Saturday, December 10, 2011

జడ్జికి శిక్ష

గతంలో ఇంచుమించుగా ప్రతి కళాశాలలోనూ ' మాక్ పార్లమెంట్ ' నిర్వహించేవారు. పార్లమెంట్ లో వాద ప్రతివాదాలు ఎలావుంటాయో విద్యార్థులకు తెలిసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. అలాగే మాక్ న్యాయస్థానాలు కూడా జరుగుతూ వుండేవి.

ఒకప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకుడిగా పనిచేసిన ఎ. యస్. రామన్ విద్యార్థిగా వుండగా ఒక ప్రపంచ న్యాయస్థానం కార్యక్రమం జరిపారు. అందులో కేసు ' సైన్స్ మానవాళికి హాని చేస్తోంది '  అనే విషయం గురించి. సైన్స్ తరఫున సూరి భగవంతం గారు, ప్రజల తరఫున మామిడిపూడి రంగయ్య గారు వాద ప్రతివాదులు.

మూడు గంటలకు సరిపడా కార్యక్రమం రూపొందించారు. ఆ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఉండమని సి. ఆర్. రెడ్డి గారిని కోరారు. మూడు గంటలే కదా అని రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇరువైపులా వున్నది సామాన్యులా ? ఒకరు తర్వాత కాలంలో భారత దేశం గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడిగా ఎదిగిన వారు. మరొకరు తర్వాత రోజుల్లో రచయిత, విమర్శకుడు గా ఖ్యాతి వహించిన వారు. వాద ప్రతివాదాలు నిరాఘాటంగా తొమ్మిది గంటలు సాగాయి.

చివరికి రెడ్డి గారు న్యాయమూర్తిగా తన తీర్పుని సైన్స్ కి అనుకూలంగా ఇచ్చారు. అయితే శిక్ష విషయానికొచ్చేటప్పటికి ఆయన సహజ ధోరణిలో
" నిజానికి ఈరోజు దోషిగా బోనులో నుంచున్నది సైన్స్ కాదు.... నేను. ఇంత సమయం అవుతుందని తెలియక ఈ న్యాయమూర్తి పదవికి ఒప్పుకున్నాను. అందుకే నాకు బాగా శిక్ష పడింది "
అనడంతో అందరూ ఘొల్లుమన్నారు. 


 ప్రముఖ విద్యావేత్త, సాహితీ విమర్శకుడు కట్టమంచి రామలింగ రెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ..........

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 086

Saturday, December 3, 2011

రాజేంద్ర ' బాబు '

మన దేశానికి స్వాతంత్యం సముపార్జించడంలో అనేకమంది తమ చదువుల్ని, ఆస్తుల్నీ, చివరకి తమ జీవితాల్ని కూడా పణంగా పెట్టారు. ఆ త్యాగాల ఫలం మనమిప్పుడు అనుభవిస్తున్నాం.

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత నవ భారతాన్ని తీర్చిదిద్దడంలో అనేకమంది మహనీయుల కృషి వుంది.  సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నాయి.  క్రమంగా అప్పటి త్యాగధనులను, పథ నిర్దేశకులను, ఈనాటి భారతావనికి రూపకల్పన చేసి, పునాదులు వేసిన ప్రముఖులను ఒక్కొక్కరినే మరచిపోతున్నాము. ఇప్పటి తరానికి అసలు కొందరి పేర్లు తెలియదంటే ఆశ్చర్యం లేదు. అయితే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్య ఫలాలను అందించిన వారిని కనీసం జయంతుల, వర్థంతుల పేరుతోనైనా గుర్తు చేసుకోవడంతో బాటు, మన తర్వాత తరాలకు వారి గురించి ఎరుకపరచాల్సిన బాధ్యత వుంది. వారి త్యాగాలనుంచి, కార్యదక్షత నుంచి ఇప్పటి తరాలు నేర్చుకోవాల్సింది, స్పూర్తి పొందాల్సింది ఎంతైనా వుంది.   


అలాంటి మహనీయుల్లో  మన ప్రథమ రాజ్యాంగ పరిరక్షకుడు తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఈరోజు ఆయన జయంతి. ఆ సందర్భంగా ఆయన వివరాలు, విశేషాలతో కూడిన గతంలోని టపా ఈ లింక్ లో .......

 మన తొలి రాష్ట్రపతి

 భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్  జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ......

 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 082

Wednesday, November 23, 2011

' మా తెలుగు తల్లి ' కవికి గుర్తింపు...?

 1975  లో హైదరాబాద్ లో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అంత పెద్ద ఎత్తున, అంత వైభవంగా మళ్ళీ జరగలేదేమో ! అప్పటికి విద్యార్థిగా వున్న నాకు ఆ సభలకు ప్రతినిధిగా హాజరయ్యే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఎంతోమంది తెలుగు వెలుగుల్ని చూడగలిగే అదృష్టం కలిగింది. ఆ సభలకు ప్రతినిధులుగా దేశ విదేశాల్లోని తెలుగు వారెందరో వచ్చారు.

ప్రధాన వేదికగా లాల్ బహదూర్ స్టేడియం వున్నా అనేక సదస్సులు, సమావేశాలు నగరంలోని పలుచోట్ల జరిగేవి. అలా రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంతో తెలుగు జాతి పులకించిపోయింది. దానికి కారణం అప్పటివరకూ రేడియో ద్వారా, రికార్డుల ద్వారా మాత్రమే వినబడుతూ వచ్చిన గేయం, స్వరం వేదికపైన ప్రత్యక్షమై సభికులందరికీ వీనుల విందుతో బాటు కనుల విందు కూడా చేసింది.

ఆ గేయమే ' మా తెలుగు తల్లికి మల్లె పూదండ '


ఆ గేయాన్ని మధురంగా, భావయుక్తంగా ఆలపించి ప్రతీ తెలుగు వాడినీ పులకింప జేసిన గాయనీమణి టంగుటూరి సూర్యకుమారి. అప్పటికే ఇంగ్లాండ్ లో స్థిరపడి అక్కడి పౌరసత్వం కూడా తీసుకున్న ఆమె గురించి తెలియని తెలుగు వారుండరు. గాయనిగా, నటిగా ... బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు వారందరికీ ఆమె సుపరిచితమే ! అలాంటి గాన సరస్వతి వేదిక మీద ప్రత్యక్షంగా కనిపించడమే కాక ఆ గేయాన్ని పాడి వినిపించడం అందర్నీ అలరించింది. దాంతో అందరూ తమ హర్షధ్వానాలు తెలియజేసారు. పూలదండలతో, ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కోలాహలానికి సూర్యకుమారి గారు స్పందిస్తూ

" నా పాటకు ఇంతగా ప్రశంసల వర్షం కురిపించినందుకు చాలా సంతోషం. కానీ ఇంతటి గొప్ప పాట రాసిన అచ్చ తెలుగు కవి...... అరుగో....... అక్కడ జనం మధ్యలో ఇరుక్కుని నలిగిపోతున్నారు. ముందు ఆ మహాకవి గొప్పతనాన్ని గుర్తించి గౌరవిస్తే ఇంకా సంతోషిస్తాను "



అనగానే జనమంతా ఆయన వైపు తిరిగారు. ఆయనే ఆహార్యంలో సాదా సీదాగా కనిపించే శంకరంబాడి సుందరాచారి. అంతవరకూ తమ మధ్యలోనే వున్నా ఆయన్ని గుర్తించని సభికులు వెంటనే తమ చేతులే ఆసనంగా చేసి వేదికపైకి తీసుకొచ్చి ఘనంగా సన్మానించారు. ఆయనకు మళ్ళీ లాల్ బహదూర్ స్టేడియంలోని ప్రధాన వేదికపైన కూడా ప్రజలందరి సమక్షంలో సన్మానం జరిగింది.




 గ్లామర్ , ఆర్భాటాలు ఉంటేగానీ ప్రతిభను త్వరగా గుర్తించరేమో తెలుగు వారు. 







Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 079

Thursday, November 17, 2011

స్థితప్రజ్ఞత

ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆత్మస్థైర్యం చెక్కు చెదరకుండా ఉండగలగడం అందరికీ సాధ్యం కాదు. దానికి ఎంతో మనోనిబ్బరం వుండాలి. మహనీయులకు గానీ అది సాధ్యం కాదు.

కాంగ్రెస్ కు స్వర్ణయుగం మన దేశ స్వాతంత్ర్యానికి ముందు కాలమనే చెప్పవచ్చు. నిజానికి కాంగ్రెస్ చరిత్రను స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత అని విడదీసి చూస్తే పూర్వ భాగంలో అధిక భాగం త్యాగధనుల పార్టీగా వుండేది. అలాంటి ఒక త్యాగధనుడు, ఆంధ్రుడు బులుసు సాంబమూర్తి గారు.  అప్పటి కాంగ్రెస్ నాయకుడు. స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాత్ర మరచిపోలేనిది. ఆ ఉద్యమ కాలంలో ఆయనను అరెస్ట్ చేసి నానా హింసలకు గురి చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆయన నోట్లో మలమూత్రాలను కూడా పోసి తమ పాశవికతను ప్రదర్శించారట అప్పటి బ్రిటిష్ పోలీసులు. దేశ స్వాతంత్ర్యం కోసం అలాంటి ఘోరాలెన్నిటినో అనుభవించిన దేశభక్తుడు, త్యాగధనుడు సాంబమూర్తి గారు.  

1923  లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ కాకినాడలో జరుగుతోంది. ఆ సభకు దేశం నలుమూలనుండీ ప్రముఖ కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారు. ఆ ఆహ్వాన సంఘానికి బులుసు వారు కార్యదర్శి. మూడురోజులపాటు జరిగే ఆ సభలకు అన్ని ఏర్పాట్లు ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అద్భుతమైన ఏర్పాట్లు చేసారు. రాబోయే అతిధులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆ ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది నుండి వచ్చే అతిధులకు ఆంధ్ర భోజనం రుచి మర్చిపోకుండా వుండేటట్లు చెయ్యడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. సాంబమూర్తి గారికి ఊపిరి సలపడం లేదు. మహాసభల తేదీలు సమీపిస్తున్నాయి.

 ఆ సమయంలో ఒక పెను విషాదం. సాంబమూర్తి గారి ఏకైక కుమారుడు టైఫాయిడ్ బారిన పడి మరణించాడు. ఆయనకు అంతులేని శోకాన్ని మిగిల్చాడు. ఆ సమయంలో కూడా ఆయన ఆ శోకాన్ని దిగమింగారు. తనపైన ఉన్న బాధ్యతను గుర్తు చేసుకున్నారు. అంతే ! ఆ శోకాన్ని కర్తవ్యం జయించింది.

ఆ కాంగ్రెస్ మహాసభలు న భూతో న భవిష్యతి అన్నట్లు జరిగాయి. అందరూ ఆయన చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. జరిగిన విషాదం తెల్సుకున్న భారత కోకిల సరోజినీ నాయుడు సాంబమూర్తి గారి స్థితప్రజ్ఞతకు చలించి అప్పటికప్పుడు ఆ సభలో ఆశువుగా గీతాన్ని ఆలపించారని అంటారు.

అందుకేనేమో తెలుగు జాతి ఆయనను ' మహర్షి ' అనే బిరుదుతో గౌరవించింది.


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 075

Thursday, November 3, 2011

భవిష్యద్దర్శనం


' ఆంధ్రరత్న ' బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మహా మేధావి. భవిష్యత్తును అంచనా వెయ్యడంలో దిట్ట. ఆయన ఓసారి మాట్లాడుతూ.... 

" ఆంధ్రుల్లో ముగ్గురు మేధావులున్నారు. వారిలో ఒకరు నేను.  కానీ పెద్దగా పైకి  రాను. ఎందుకంటే అల్పాయుష్కుడిని. 


రెండవవారు కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆయన గొప్ప ప్రతిభావంతుడు. అయితే ఆయనకు వాక్ స్థానంలో శని వున్నాడు. అందుకే ఆయనకు విరోధాలు, విరోధులు ఎక్కువే !
ఆ కారణంగా ఆయన ఉన్నత స్థానానికి చేరుకోవడం కష్టమే ! 

ఇక మూడవ వారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన నవగ్రహమాలికా యోగ జాతకుడు. భవిష్యత్తులో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు " అన్నారు. 

ఈ మాటల్లో ఎంత నిజముందో పరిశీలిద్దాం.....

దుగ్గిరాల వారు నలభై సంవత్సరాలు వయసు దాటకుండానే మరణించారు.   
కట్టమంచి వారు విద్యావేత్తగా, విమర్శకుడిగా పేరు తెచ్చుకున్నా విశ్వవిద్యాలయ స్థాయిని దాటలేదు. 
ఇక భారత రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. 

Vol. No. 03 Pub. No. 067

Tuesday, October 18, 2011

సునిశిత విమర్శ

 విమర్శ అనేది ఎలా ఉండాలంటే ఎదుటివారిలో లోపాలను సునిశితంగా పరిశీలించి వారి లోపం వారికి తెలిసే విధంగా వుండాలి. అది వారి అభివృద్ధికి తోడ్పడాలి. అంతేకానీ లేని లోపాల్నీ వెదికి, అంత ప్రాముఖ్యం కాని అంశాలను ఎత్తి చూపితే అది విమర్శ అనిపించుకోదు. తమలోని అహాన్ని సంతృప్తి పరచడానికి ఎదుటివారిని విమర్శించేవారు మనకు చాలామంది కనబడుతుంటారు. నిండు కుండ తొణకదు అన్నట్లు ఒక అంశంలో నిష్ణాతులైన వాళ్లకి అదే అంశంలో ఇతరులు చేసే చిన్న చిన్న పొరబాట్లు, లోపాలు కూడా స్పష్టంగా అగుపడతాయి. అవి గమనించి ఊరుకోక వారికి చెప్పి వారి లోపాలను సవరించడానికి ప్రయత్నిస్తారు. ఇలా చెప్పడానికి వారికి అహం అనేది అడ్డు రాదు. అలా పెద్దలు, నిష్ణాతులు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తమలోని లోపాలను సవరించుకుంటే వారు కూడా ఆయా కళలలో, ఇతర అంశాలలో నిష్ణాతులుగా తయారయ్యే అవకాశముంది. అలాంటి ఓ సునిశిత విమర్శ లేదా సూచనను గురించి పరిశీలిద్దాం.

తెలుగు నాటక రంగం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా స్థానం నరసింహారావు గారి స్త్రీ పాత్రల గురించి తెలియక పోదు. ఆయన ధరించిన స్త్రీ పాత్రల్లో రోషనార ప్రముఖమైనది. దానికంటే ముందు ధర్మవరపు రామకృష్ణాచార్యులు గారు రచించిన ' రోషనార శివాజీ ' నాటకం ద్వారా రోషనార పాత్రలో పేరు గడించిన నటులు పెమ్మరాజు కేశవమూర్తి గారు.

ఒకసారి ఆ నాటక ప్రదర్శన జరుగుతోంది. ఆ ప్రదర్శనకు ప్రముఖ నటులు, ప్రయోక్త బళ్ళారి రాఘవాచార్యులు గారు హాజరయ్యారు. ముందు వరసలోనే కూర్చున్నారు. ఇది గమనించిన కేశవమూర్తి గారు రెట్టించిన ఉత్సాహంతో నటించడం ప్రారంభించారు. ఫలితంగా ఆనాటి రోషనార పాత్ర ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. దానికి నిదర్శనం హాలంతా మార్మోగిన చప్పట్లు, రంగస్థలం మీద కురిసిన రూపాయిల, బంగారు ఆభరణాల వర్షం. ప్రేక్షకులు అంత తన్మయం చెందినా, ప్రశంసల వర్షం కురిపించినా బళ్ళారి రాఘవ గారి ముఖంలో అంత సంతృప్తి వున్నట్లు కేశవమూర్తి గారికి తోచలేదు. ఆయన అహం దెబ్బతింది. విషయమేమిటో తెలుసుకోవాలనుకున్నారు.

ప్రదర్శన పూర్తి అయ్యాక నేరుగా బళ్ళారి రాఘవ గారి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించి
" తమవంటి పెద్దలు నా ప్రదర్శనకు రావడం అదృష్టం. మీకేవైనా లోపాలు కనిపిస్తే చెబితే సరి దిద్దుకుంటాను " అన్నారు. పైకి వినయంగా అడిగినట్లు వున్నా ఆయన మాటల్లో అహంకారం ధ్వనించింది. అది గ్రహించిన రాఘవగారు చిరునవ్వుతో
" బాగుంది. చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకుంటే నీ నటన ఇంకా రాణిస్తుంది " అన్నారు.
నా నటనలో లోపాలా అన్న అహం ధ్వనిస్తుండగా " ఆ లోపాలేవిటో సెలవిస్తే సవరించుకుంటాను " అన్నారు కేశవమూర్తి గారు. అప్పుడు బళ్ళారి వారు
" బాబూ ! నువ్వు వేసిన వేషం రోషనార. అంటే ముస్లిం వనిత. శివాజీకి ఉత్తరం రాసే ఘట్టంలో నువ్వు ఏ భాషలో రాస్తున్నట్లు ? ఉర్దూ భాషలో కదా ! ఆ భాషలో వాక్యాలను కుడినుంచి ఎడమకి కదా రాసేది. నువ్వు అలా రాసావా మరి ? " అన్నారు.

అంతే ! కేశవమూర్తి గారు ఆశ్చర్యచకితులై పోయారు. ఆయన సునిశిత పరిశీలనా శక్తికి ముగ్ధులై రాఘవ గారి పాదాల మీద వాలిపోయారు.

కుడి ఎడమ కావడాన్ని సాధారణ ప్రేక్షకుడు గమనించ లేకపోవచ్చు గానీ బళ్ళారి రాఘవ గారి లాంటి నిష్ణాతుడికి సాధ్యమే ! అందుకే అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు మన అభివృద్ధికి పునాదులు.
 

Vol. No. 03 Pub. No. 060

Friday, October 7, 2011

అధికారికి ప్రేమలేఖ

  డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు బందరు జాతీయ కళాశాల పాలకమండలి కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఓ రోజు ఆయనకో లేఖ అందింది. అందులో ...........

" ప్రాణేశ్వరీ ! అనుకోకుండా ఊరికి వెడుతున్నాను. కనుక ఈ మూడురోజులూ మనకి వియోగం, విరహవేదన తప్పవు...... " అంటూ ఇంకా ఏదేదో రాసి వుంది. అది ప్రేమ లేఖ అని పట్టాభి గారికి అర్థమయింది గానీ ఎవరు రాసారో, తనకెందుకు వచ్చిందో మాత్రం అర్థం కాలేదు.  సాధారణంగా ప్రేమలేఖల్లో వుండేటట్లే సంభోదనలో గానీ, సంతకంలో గానీ కొసరు పేర్లే గానీ అసలు పేర్లు లేవు. అందుకనే ఆయనకేమీ అర్థం కాలేదు.

ఎటూ పాలుపోక తన మిత్రుడు కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు గారికి ఆ ఉత్తరం చూపించారు పట్టాభిగారు. అది చదివిన కృష్ణారావు ఆ చేతివ్రాత నిశితంగా పరిశీలించి ఆ రాత ప్రముఖ సాహితీకారుడు, చిత్రకారుడు అయిన అడవి బాపిరాజు గారిదని గుర్తుపట్టారు. కానీ బాపిరాజు గారు రాసిన ప్రేమలేఖ పట్టాభి గారికెలా వచ్చిందో అర్థం కాలేదు. ఆ విషయమే ఆయన్ని అడిగారు కృష్ణారావు గారు. అప్పుడు ఆలోచిస్తే ఇద్దరికీ విషయం బోధపడింది. ఏమిటంటే............


అప్పట్లో అడవి బాపిరాజు గారు జాతీయ కళాశాలకు ప్రధానాచార్యులుగా వుండేవారు. ఆయన ఆ సమయంలో స్వంత పని మీద ఊరికి వెళ్ళారు. బహుశః ఆ విషయం తెలియజేయ్యడానికి సమయం లేక ఆయన భార్యకు ఈ లేఖ రాసి ఉంటారని... పట్టాభి గారికి సెలవు మంజూరు కోరుతూ సెలవు చీటీ రాసి ఉంటారని... అయితే కవరు మీద చిరునామాలు తారుమారు అయి ఉంటాయని నిర్థారణకు వచ్చి నవ్వుకున్నారు పట్టాభి గారు, కృష్ణారావు గారు.


Vol. No. 03 Pub. No. 053

Monday, August 29, 2011

తెలుగు పిడుగు ' గిడుగు '

 గిడుగు రామమూర్తి పంతులు గారు అనగానే తెలుగులో వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యులుగా మాత్రమే అందరికీ గుర్తుకొస్తుంది. ఆ కారణంగానే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  సామాన్య ప్రజలకు అర్థం కాని... వేదాల్లో ఉండే భాషను ప్రామాణికంగా తీసుకున్న కాలంలో తెలుగు భాషను సామాన్యుల స్థాయికి దించడానికి ఆయన జీవితకాల పోరాటం చేసిన మాట వాస్తవమే ! 

 కానీ ఆయన కేవలం తెలుగు భాషోద్ధరణకే పరిమితం కాలేదు. అప్పటికీ, ఇప్పటికీ ఎవరికీ పట్టని ఆదివాసుల సమస్యలకు ఎన్నిటికో ఆయన పరిష్కారం చూపారు. ఆదివాసుల సంక్షేమానికి కృషి చేసిన వాళ్ళకు ఈయనే మార్గదర్శి అని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల గిరిజనులు మాట్లాడే భాషలలో ముఖ్యమైనది సవర భాష. ఐతిరేయ బ్రాహ్మణంలో కూడా ఈ భాష ప్రస్తావన ఉందంటారు. అప్పటివరకూ ఆ భాషకు లిపి లేదు. వారి మాతృ  భాషలో చదువుకునే యోగం ఆ గిరిపుత్రులకు ఉండేది కాదు. ఈ పరిస్థితి గమనించిన గిడుగు వారు ఆ భాషపై విస్తృత పరిశోధన చేసి ధ్వన్యాత్మక లిపిని రూపొందించారు. 

 కేవలం లిపిని రూపొందించి వదిలివేయలేదు. ఆ లిపిలో పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసారు. ఆ గిరిజన ప్రాంతాలలో ప్రజలను విద్యావంతులను చెయ్యడానికి పాఠశాలలు ఏర్పాటు చేయించారు. వాటి నిర్వహణకు తన స్వంత డబ్బును సైతం ఖర్చు చెయ్యడానికి వెనుకాడలేదు. వాటిని అభివృద్ధి చెయ్యడానికి ప్రభుత్వంమీద ఒత్తిడి తీసుకువచ్చి సాధించారు. అంతే కాదు. సవర భాషకు నిఘంటువు, వ్యాకరణం కూడా రూపొందించారు. వారి సమస్యలెన్నిటికో ఆయన పరిష్కారాలు చూపారు. గిరిజనుల అభ్యున్నతికి ఇంతగా కృషి చేసినవారు అప్పటికీ, ఇప్పటికీ ఇంకెవరూ లేరేమో ! 

 గిడుగు వారు కేవలం తెలుగు వ్యావహారిక భాష మీదనే పరిశోధనలు చెయ్యలేదు. గ్రాంథిక భాషలో కూడా ఉద్దండులే ! ఆంగ్ల భాషలో కూడా ఆయన పరిశోధనలు సాగాయి. తెలుగు వారికి ఆంగ్లం సులువుగా నేర్చుకునే పద్ధతులను గురించి తెలియజేసేందుకు ఒక పత్రికను కూడా నిర్వహించారు. 

నిజానికి గిడుగు రామమూర్తి గారి ముందుతరం వారు, సమకాలీనుల గురించి పరిశోధన, ప్రచారం జరిగినంతగా ఆయన గురించి జరుగలేదేమో ! అక్కడక్కడ కొంత జరిగినా అది అసమగ్రంగానే వుంది. మన భాషావికాసానికి ఉద్యమించి తెలుగును సజీవం చెయ్యడానికి పాటుపడిన ఆ మహానుభావుడి గురించి మరింత విస్తృత పరిశోధన జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. అప్పుడే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు సార్థకత వుంటుంది. 


 తెలుగు పిడుగు గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ......
తెలుగు సోదర, సోదరీమణులందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు.  

తేనే కన్నా తీయనిది తెలుగు భాష
దేశభాషలందు లెస్స తెలుగు భాష ....... 
 



Vol. No. 03 Pub. No. 017

Friday, August 26, 2011

అమ్మ ఎవరికైనా అమ్మ

మృత్యుముఖంలోని వారికి సంజీవని అమ్మ పిలుపు 
పీడిత తాడిత జనులకు వరప్రసాదం అమ్మ పిలుపు 

ఆవిడ విశ్వమానవులందరికీ  అమ్మ 
ఆవిడ కదలివచ్చిన కరుణామయి అమ్మ 

సేవ, త్యాగం లాంటి ఉత్తమ లక్షణాలకు ప్రతిరూపం అమ్మ 
హిమాలయమంత ఎదిగిన ఔన్నత్యానికి మరోరూపం అమ్మ 

ఆ అమ్మ ఎవరికైనా అమ్మ 
కలకత్తా వరప్రసాదం మదర్ థెరేసా

 ఆ అమ్మ మదర్ థెరేసా జన్మదినం సందర్భంగా నివాళులు అర్పిస్తూ..... 

అమ్మ పై గతంలో రాసిన టపాలు.... 

అమ్మకు వందనం

Vol. No. 03 Pub. No. 012

Tuesday, August 23, 2011

ఆంధ్రకేసరి ఆత్మాభిమానం


మహానుభావులు కొందరే వుంటారు. మహత్తర కార్యాలు చెయ్యడానికే వారు పుడతారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. మన భారతదేశానికి స్వేచ్చావాయువులు అందించడంలో ఎనలేని కృషి చేసి, బ్రిటిష్ అధికారుల్ని గడగడలాడించి, తెలుగుజాతికే గర్వకారణంగా నిలిచి ' ఆంధ్రకేసరి ' గా పిలిపించుకున్న మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. దేశాభిమానంతో బాటు ఆత్మాభిమానం ఆయన సొత్తు. ఆయనలోని ఈ లక్షణాల్ని తెలియజేసే ఓ సంఘటన......

 ప్రకాశంగారు వృత్తి రీత్యా న్యాయవాది. కొంతకాలం రాజమండ్రిలో ప్రాక్టీసు చేసారు. ఒకసారి అక్కడి మునసబు కోర్టులో ఓ కేసు విషయంలో వ్యాజ్యం జరుగుతోంది. ఆ సమయంలో ప్రకాశం పంతులుగారు అక్కడే వున్నారు. ఆ కేసులో నిందితుడిగా వున్న వ్యక్తిని మునసబుగారు అతని తరఫున వకీలెవరని అడిగారు. తాను పేదవాడినని, వకీలును పెట్టుకునే స్థోమత లేదని విన్నవించుకున్నాడు ఆ వ్యక్తి. దానికా మునసబు హేళనగా .... 

" అదేమిటయ్యా ! ఇంత పెద్ద రాజమండ్రి పట్టణంలో వకీళ్ళకేమి కొరత ? వీధికి ముగ్గురు వకీళ్ళున్నారు. రెండు మూడు రూపాయలిస్తే ఏ వకీలైనా నీ తరఫున వాదించడానికి వస్తాడు " అన్నారు. 

 ఇది విన్న ప్రకాశంగారికి ఆత్మాభిమానం పొంగివచ్చింది. రాజమండ్రి వకీళ్ళను హేళన చేసిన మునసబు మీద కోపం వచ్చింది. ఆయనకు బుద్ధి చెప్పాలని వెంటనే లేచి నిలబడి..... 

" అయ్యా ! మీరు చెప్పింది గతంలో సంగతి. ఇప్పుడు రెండు, మూడు రూపాయలకు వాదించే వకీళ్ళు ఎవరూ రాజమండ్రిలో లేరు. అలాంటి వాళ్ళందరూ మునసబులైపోయారు " అన్నారు. దాంతో ఒకప్పుడు వకీలుగా పనిచేసిన ఆ మునసబు ఖంగు తిన్నాడు. 

 ' ఆంధ్రకేసరి ' టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ..... 

Vol. No. 03 Pub. No. 009

Thursday, August 18, 2011

' ఆజాద్ ' నేతాజీ

 సుమారు రెండు వందల సంవత్సరాల పరాయి పాలన దుష్ఫలితాలు మన మనసులనుంచి అప్పుడే చెరిగిపోవు. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదన్నారు రమణ. 

అలాగే ఇంత దుర్భరమైన... దాస్య శృంఖలాలలో మ్రగ్గిపోయిన బతుకులు అంత తొందరగా తెప్పరిల్లవు. ఆ మరకలు అంత తొందరగా చెరిగిపోవు. 

తరాలు మారుతున్నా ఆ కన్నీటి గాథల్ని, దుర్భర నరకాన్ని ఇప్పటికీ ఇంకా తలచుకుంటూనే వుంది మన జాతి. 65 ఏళ్ళు గడిచిపోతున్నా స్వాతంత్ర్య ఫలాన్ని అందించిన మహానుభావుల్ని మరచిపోలేదు ఈ దేశం. 

ఎందరెందరు... ఎన్ని త్యాగాలు... ఎన్నెన్ని పంథాలు... అవి చెప్పుకుంటే తరిగేవి కావు. ఏ దారిన వెళ్ళినా అందరి లక్ష్యం ఒక్కటే ! మన జాతి స్వతంత్ర్యంగా జీవించాలి. పరాయివాళ్ళ తొత్తులు కాకూడదు. మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి. ఇదీ అప్పటి మహనీయుల ఆశయం. 


అలాంటి మహానుభావుల్లో అగ్రగణ్యులుగా పేరు తెచ్చుకున్న వారిలో ప్రముఖులు నేతాజీ సుభాస్ చంద్ర బోస్. బ్రిటిష్ వారి మీద తిరుగుబాటుకోసం స్వంతంగా సైన్యాన్నే నిర్మించిన ధీశాలి. ఎన్నో కష్టనష్టాలు భరించారు. తన నిండు జీవితాన్ని దేశంకోసం బలి చేసారు. 


 నేతాజీ సుభాస్ చంద్రబోస్ వర్థంతి సందర్భంగా ఆ దేశభక్తునికి నివాళులు అర్పిస్తూ.... 

  నేతాజీ గురించి గతంలోని టపా ................

నేతాజీ - ఆంధ్రతో అనుబంధం


Vol. No. 03 Pub. No. 004
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం