Friday, November 26, 2010

విషాదంలోనూ వినోదమే !


విషాదంలోనుంచి వినోదం సృష్టించడంలో ప్రపంచ ఖ్యాతి గడించిన కళాకారుడు చార్లీ చాప్లిన్. ఆ ఒరవడిని అంది పుచ్చుకున్న తెలుగు నటుడు రేలంగి వెంకట్రామయ్య. తెలుగు చిత్రరంగంలో హాస్యనటులకు సుస్థిర స్థానం కల్పించిన నటుడు రేలంగి. ఆయన తెరమీద నవ్వినా, ఏడ్చినా ప్రేక్షకులకు వచ్చేవి కన్నీళ్లు కాదు.....నవ్వులే ! తెర మీద కనిపించినపుడే కాదు నిజజీవితంలో కూడా ఆయన ఎక్కడ కనిపించినా జనం నవ్వేవారు.


ఆయన
కారు దిగితే నవ్వు....
నడిస్తే నవ్వు......
ఆగితే నవ్వు.....
మాట్లాడబోతే నవ్వు.....
మాట్లాడకపోతే నవ్వు......
ఏం చేసినా నవ్వే ! ఏం చెయ్యకపోయినా నవ్వే !
................అలా సాగింది ఆయన నవ్వుల ప్రవాహం

1955 లో హైదరాబాద్ లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ లో ప్రముఖ నటుడు స్థానం నరసింహారావు గారి  చేతుల మీదుగా రేలంగి వెంకట్రామయ్య గారికి ఘన సన్మానం జరిగింది. ఆ సన్మానానికి రేలంగికి నోట మాట రాలేదు. గొంతు పూడుకుపోయింది. కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు. ఆది చూసి ప్రేక్షకుల నవ్వులు.
అప్పుడు చూడండి రేలంగి గారి పరిస్థితి. ఎలాగో గుండె దిటువు చేసుకుని నేను నిజంగానే ఏడుస్తున్నానని ప్రకటించారు. ఆయన పరిస్థితి అర్థమైన కొంతసేపటికి ప్రేక్షకుల నవ్వులు ఆగాయి.
స్థానం వారు " ఎందుకు బాబూ నీకీ కన్నీళ్లు ? " అని అడిగారు.
గద్గద స్వరంతో రేలంగి గారు " గతంలో నాటకాల్లో వేషం వెయ్యాలని కోరికతో మీదగ్గరకొచ్చి అడిగాను. నువ్వు నాటకాలేం వేస్తావు పొమ్మన్నారు. ఈరోజు మీ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం....... నిజంగా ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ ఆనంద భాష్పాలు " అన్నారు. సభంతా గంభీర వాతావరణంతో నిండిపోయింది.
వినోదంలో ఎంత ఆనందాన్ని పంచగలడో విషాదంలో అంత అనుభూతిని పంచగల సమర్థుడు రేలంగి వెంకట్రామయ్య. హరికథకుడిగా, హార్మోనియం వాయిద్యకారుడిగా, రంగస్థల నటుడిగా ప్రారంభమైన రేలంగి 1935 లో శ్రీ కృష్ణ తులాభారం చిత్రంతో మలుపు తిరిగింది. హాస్యనటుడిగానే కాక గాయకుడిగా కూడా ఆయన కొన్ని పాటలు పాడారు.

తెలుగు చిత్రాల్లో హాస్యానికి రాచబాట వేసిన రేలంగి వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ................



Vol. No. 02 Pub. No.067

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం