వేదిక - 01
చిన్నపిల్ల పాలు తాగుతుంటే ఎవరి కంటా పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ! అన్నం తినడానికి పేచీలు పెడుతుంటే ఎవరో దిష్టి పెట్టారని ఖంగారు పడి అర్జెంటుగా కాస్త ఉప్పో, మిరపకాయలో దిగతుడిచి పడేస్తాం. ఇంకొంతమంది కొంచెం ముందడుగు వేసి ఆ మిరపకాయల్ని నిప్పుల్లో వేసి ఇంట్లోని వాళ్ళ చేతేకాక చుట్టు పక్కల వాళ్ళందరి చేతా కూడా కళ్ళమ్మట నీళ్ళు తెప్పిస్తారు.
పంట చేలో ఏపుగా ఎదిగిన పంటమీద ఎవరి దృష్టి పడకుండా గడ్డితో బొమ్మను చేసి దానికి లాగూ చొక్కా తొడిగి దానిపైన కుండను తలగా తగిల్చి సున్నపు బొట్లు పెట్టి తృప్తి పడిపోతాం. పంట మీదనుంచి మనుష్యుల దృష్టే కాకుండా పశుపక్ష్యాదుల దృష్టి కూడా మరల్చేసామనుకుంటాం.
కొత్త ఇల్లు కడుతున్నామనుకోండి. దానికి గోడలు, తలుపులు ఇంకా పెట్టకముందే ఎదురుగా దిష్టి బొమ్మను తగిలిస్తాం. దాని వలన కట్టుబడి మీదనుంచి చూసేవాళ్ల దృష్టి మళ్ళుతుందని మన ఆలోచన. కడుతున్న ఇల్లేమిటి ? మనం ఉంటున్న ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళమీద, ఇంట్లో వున్న వస్తువులమీద పరాయివాళ్ళ దృష్టి పడకుండా ఉండడానికి గుమ్మడికాయను అలంకరించి కడతాం. అలా చేస్తే దృష్టి దోష నివారణతో బాటు దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని నమ్ముతాం.
కొంతమంది మనుష్యులకు ఈ దృష్టి దోషాన్ని ఆపాదించడం కూడా మనం చూస్తుంటాం. ఒక్కొక్క వ్యక్తి కనుక ఎవరివైపేనా తదేకంగా చూస్తే ఆ మనిషో లేక ఆ వస్తువో నాశనం అవుతాయని నమ్ముతుంటాం. వాళ్ళకెదురు పడడానికి ఎవరూ ఇష్టపడరు.
* ఈ నమ్మకాలు నిజమేనా ? వీటిని మూఢ నమ్మకాలుగా పరిగణించవచ్చా ?
* ' కంటి చూపుతో చంపేస్తా ' అన్నట్లు అసలు మనిషి దృష్టికి ఇతరుల్ని, వస్తువుల్ని నాశనం చేసే శక్తి ఉందా ? ఒకవేళ వుంటే ఆది ఎప్పుడూ ఉంటుందా ? ప్రత్యేక సందర్భాలలో బయిటకు వస్తుందా ? అలాంటి సందర్భాలేమిటి ?
* ఈ దృష్టి దోషాన్ని ఒక మనిషికి ఆపాదించడం ఎంతవరకూ సబబు ?
* అసలు దృష్టిలో దోషముంటుందేమో గానీ దృష్టికి దోషముంటుందా ?
ఇవన్నీ నాకర్థం కాని ప్రశ్నలు. వీటికి జవాబులు తెలిసిన మిత్రులు, పెద్దలు సహేతుకమైన సమాచారమిచ్చి ఈ విషయంలో అందరికీ ఉండే అపోహలు తొలిగిస్తే బాగుంటుంది. అయితే కొన్ని విన్నపాలు. వ్యాఖ్యల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. కానీ అవి ఎవరినీ కించపరిచేవిగా మాత్రం వుండకూడదు. ఎదుటి వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూనే అందులోని మంచి చెడ్డలు ఆమోదయోగ్యమైన పద్ధతిలో చర్చించమని మనవి. ఈ చర్చ కేవలం ఈ విషయానికి మాత్రమే పరిమితం అని గమనించ ప్రార్థన.
Vol. No. 01 Pub. No. 069
2 comments:
I would like to believe that there is no truth in these superstitions. I do believe in God but not in superstitions. A good attempt made by you to make people think over certain routine things which they do without seriously thinking whether they carry any logic or not.
When you study the 'transfer of energy' that takes place always, you'll come to know that 'drishti' is partially right. We're always influenced by our own thoughts and others' thoughts.
Post a Comment