Saturday, November 6, 2010

భమిడిపాటి వారి ' దీపావళి '

నిన్న దీపావళి. ఈ దీపావళి పండుగ చిన్నతనంలోని చిలిపి జ్ఞాపకాలను వెలికి తెచ్చింది. అవన్నీ ఒక మాలగా గుదిగుచ్చి అందిద్దామని ప్రయత్నిస్తుండగా గతంలో చదివిన హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారి ' దీపావళి ' వ్యాసం గుర్తుకొచ్చింది. నా అనుభవాలని గుర్తు చేసే ఆ వ్యాసంలోని కొంత బాగం ఇక్కడ అందిస్తున్నాను. గిలిగింతలు పెట్టే ఆ భాగాన్ని అందుకుని ఆస్వాదించండి.
దీపావళిలో ‘ దీపం ‘ వేసి చూడకుండానే కొందరు మాట్టాడతారు. వెనక ఒక రాక్షసుడు చచ్చిపోయాడు గనుక వాడి నిమిత్తం మనం పిండివంటల్తో భోంచెయ్యాలనీ, దీపావళి నాటికి వాన్లు వెనకట్టడం జరుగుతుంది గనుక లోగడ పుట్టిపెరిగిన క్రిమి కీటకాదులు ( నలకలడయోరభేధ: ) సమూలంగా నశించడానికి దేశం అంతా తలంట్లుపోసుగుని బాణాసంచా కాల్చాలనీ, అల్లుళ్ళని పిలవడానికి ఆదే సందర్భంగనుక వాళ్ళ ముఖతేజం ఎక్కువ చేసే నిమిత్తం మతాబాలు కాల్పించాలనీ, మొదలైన పూర్వగాథలకి తడుముకోనూ లేదు. 

దీపావళి కాల్పులికి దరిద్రుడూ, ధనికుడూ వివక్షత లేదు, గానీ పిన్నా పెద్ద వివక్షతా, ఖర్చూ బేఖర్చూ వివక్షతా, కసీ బేకసీ వివక్షతా ఉన్నాయి. పిన్నలకి ఏదో ఇంత తగలేయ్యాలనీ, పెద్దలకి ఖర్చులేకుండా ఉంటే సరి ఇంకా తగలెయ్యమనీ ! దరిద్రుడైనా సరే కసి ఉంటే తల తాకట్టేట్టయినా సరే నరకాసురుణ్ణి దహనం చేస్తాడు. ఇంతవరకింకా దీపావళిలో దీపంసంగతి అప్రధానం అయిందే కానీ, ఆరిపోలేదు. 

ప్రధాన విషయం చప్పుడు ! ఎంత గొప్పచప్పుడు చేస్తే అంతా గొప్ప దీపావళి యోధుడు. దరిద్రుడు కాగితపు టపాకాయను పేల్చడం, ( సంచీ లామడిచి, ఒకవైపు చిల్లు చేసి, గాలి పోరించి, అది పొంగిన తరవాత నేల మీద పెట్టి ఒకటిచ్చుగుంటే ఠప్పుమనేవి ), ఖాళీ డబ్బాలు వాయించడం, డబ్బాలోరాళ్లేసి వేళ్లాడ గట్టి రెండు మూడు రకాల కర్రల్తో బాదడం - తరవాత తాటాకు టపాకాయలు ! ఇవేనా లేకుండా ఎవరూ ? ఇవి క్రమేపీ చౌకఅవడం కద్దు. మేఘదర్శనం అయేసరికి ఇవి కాళ్ళుపారజాచేస్తాయి. మరీ నాసిరకం పేలకపోయినా నాలిక గీసుకోవచ్చని కొందరు కొనడం. ఇవి పెల్తే ఒట్టి పేలుడే ! కానీ ఎడా పెడా ఎడా పెడా వాయించినట్టు పేలే సీమటపాకాయలు. ఎల్లానూ సీమ సీమే ! కొందరికి కసి ఆగక రెండుమూడు సీమటపాకాయల గుత్తులు కిరసనాయలు డబ్బాలోపడేసి అవి చెడామడా క్షోభపడిపోతోంటే ' వెయ్ వెయ్ ' అని కేకలేస్తూ డబ్బాని చావగొట్టడం ! 
గోడటపాకాయలని కూడా వస్తుండేవి  అరుగులమీద పరధ్యానంగా కూచున్న వాళ్ళు ఉలిక్కిపడేటట్లు ఒక్ఖటి గోడనిబాదేసి, దీపావళివీరుడు పరక్షోభగురించి నవ్వుకుంటూ పోతుండేవాడు. అవే నేల్నెట్టి జబ్బనేప్పెట్టేలాగా కొట్టేవాళ్లు కొందరు.వీట్లని మించిపోయినవి ఔట్లు. ఔట్లు పేల్చేవాళ్లు మహాధ్వనికారుల్లో జమ.ఒక దీపావళి రౌతు ఒక ముసలాయనతో చెప్పకుండా ఔటు పేల్చేసరికి ఆయనగుండే ఆగిపోయింది. అది ఆగిపోవడంవల్ల తెలిసింది గాని లేకపోతే ఆయనకి గుండె ఉన్నసంగతి తేలకపోయేదిగదా అన్నాడు ఆ రౌతు. 
వెలుగు గురించిన ఆరాధనలో మతాబాలు సార్థకం అయినా, అవి కాల్చడం అనేదాన్లో పౌరషం లేదు పొమ్మన్నారు. ఎందుకంటే - ప్రతి సందర్భంలోనూ ప్రతీవాళ్లూ మతాబా కాల్చగలరు గనుక ! కాల్చడంలో ఒకచోటనుంచి మరోచోటుదాకా వెళ్ళి ఇతరుల్ని బాధపెట్టే బాపతైన తూటాల వంటి వాట్లకి ఘరానాఎక్కువ. ఎడంచేత్తో అంటించిన తూటా పట్టుగుని ఇటూ అటూ రవ్వలు చిమ్ముతూ, ఒకవేళ చీదినా, అరిచెయ్యి దానిమ్మకాయ పగిలినట్టు పగిలినా, కిక్కురుమనకుండా చివరదాకా నిల్చేవాళ్లూ, 'బాబోయ్ ' అని తోకముడిచేవాళ్లూ ఉండేవాళ్ళు. కానీ, ఎంత ఎత్తుకి వేడితే అంత గొప్పవాడు అనేది దీపావళిలోనూ నిజమే. దీపావళి భటుడి అసలు అస్త్రం జువ్వ.అతడు జువ్వల రంగడు. జువ్వవదలడం కొత్తగా నేర్చుగునేవాళ్ళు తాటాకు చూర్లకీ చుట్టుపక్కజనానికీ భయకారణంగా ఉండేవాళ్లు. ఆరి తేరిన వాళ్ళు అల్లాంటిపన్లు చెయ్యక, ఊరవతలకిపోయి పాతిగముఫ్ఫై గజాల్లో ఎదరేదరగా నుంచుని, జువ్వలు నేలబారుగా వదిలి, పోటీ చేసుగునేవాళ్లు. దెబ్బలు తగిలినవాళ్ళని తక్కిన వాళ్ళు ఇంటికి మోసుకెళ్ళేవాళ్లు. అవీ ఇనీ కొనడంకంటే మనమే కట్టుగుంటే సొమ్ముకిమించిన సరుకొస్తుంది అనేగడుసుదనంతో వ్యవహరించి, యథాశక్తిగా కాళ్ళూ, వేళ్లూ, చేతులూ, చర్మమూ, వొళ్లూ, ఇల్లూ, ప్రాణమూ ధారపోసిన దీపావళి మత భక్తులుంటుంటారు - సంస్థ స్థాపించిన వాళ్ళ ఉద్దేశం ఈభక్తి కాదేమో అనితోస్తుంది. ఏమిటో, చెప్పలేం ! కొంత పిరికి తనం, కొంత దారిద్ర్యం, కొంత ఇతరులకి బాధ గలిగి దెబ్బలాట కోస్తారనే భయం - ఇవన్నీ ఉండడంవల్ల, నేను ఏ మతాబా అగ్గిపుల్లేనా కాల్చి ఉంటాను, గాని ఒకటోరకమైన మతాబాయేనా కాల్చినట్టు జ్ఞాపకంలేదు.
ఇదో రకం : 
" బాణాసంచా అంటే చెవి కోసుగుంటారు. సూర్యాస్తమయాలు చూసి ఆనందించలేరు కొందరుజనం " అంటాడు ఒక కవి.

 


Vol. No. 02 Pub. No. 051

4 comments:

Saahitya Abhimaani said...

రావు గారూ. మంచి రచనను మరొక్కసారి గుర్తు చేశారు. ధన్యవాదాలు.

astrojoyd said...

deepavali-deepam/చెన్నైలో ఒక్క తెలుగువారు తప్ప మిగిలిన వారెవ్వరు దీపాలను పెట్టకపోవడం..మేరు సరిగ్గా అదే వాక్యాన్ని పోస్ట్ మొదటిలినులో ఉటంకించడం ..what a coincidence ?

sivakrishna said...

CHALA BAGUNDI

SRRao said...

* శివ గారూ !
* astrojoyd గారూ !
* శివకృష్ణ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం