Monday, November 1, 2010

రెండో రాముడు

గతంలో రంగస్థల నాటకాలు సుదీర్ఘంగా సాగేవి. అందుకని రాముడు, కృష్ణుడు వంటి ముఖ్య పాత్రలను ఇద్దరు ముగ్గురు నటులు ధరించేవారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు..... ఇలా ఆ పాత్రని ఫలానా నటుడు ధరిస్తాడని అని కరపత్రాల్లో ముద్రించేవారు.

అలాగ కాదుగానీ  మనకి వెండి తెర రాముడు అంటే గుర్తుకొచ్చేది నందమూరి తారక రాముడే ! ఆయన్ని తప్ప ఊహించుకోలేకుండా వున్న పరిస్థితుల్లో ఆయనే తన స్వంత చిత్రం ' సీతారామకల్యాణం ' లో మరో రాముణ్ణి ప్రవేశపెట్టారు. ఆ రాముడే హరనాథ్.

హరనాథ్ తండ్రి నటుడు అవ్వాలని మద్రాస్ చేరి సహకార దర్శకుడిగా మారారు. హరనాథ్ కి కూడా సినిమాల మీద, నటన మీద ఆసక్తి వున్నా తండ్రి తన అనుభవంతో విధించిన ఆంక్షల కారణంగా బి.ఏ. పూర్తి చేసేవరకూ ఆవైపు తొంగి చూడలేదు. ఇంటర్ మద్రాస్ లో చదివేటపుడు బాపు రమణలు ఆయన సహాధ్యాయులు. కాకినాడలో బి.ఏ, చదివేటపుడు ప్రముఖ నిర్మాతలు వి. బి. రాజేంద్రప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు లు సహాధ్యాయులు.

తండ్రి వల్లో, మిత్రుల వల్లో హరనాథ్ కు సినిమాలలో అవకాశం రాలేదు.  బి.ఏ. పూర్తిచేసి మిలిటరీలో చేరే ఉద్దేశ్యంతో మద్రాస్ కొచ్చిన హరనాథ్ ఒకరోజు కోడంబాక్కం బస్సు స్టాప్ లో నిలబడి వుండగా అప్పట్లో ప్రముఖ కళాదర్శకుడైన సూరన్న చూసి తన కారు ఆపి ' సినిమాలో వేషం వేస్తావా ? ' అని అడిగాడు. తన చిరకాల కోరిక తీరే అవకాశం తనని వెదుక్కుంటూ వచ్చినందుకు షాక్ తిన్న ఆయన్ని నవశక్తి గంగాధరరావు గారికి పరిచయం చేశారు సూరన్న. అతని రూపం, హావభావాలు నచ్చి గుత్తా రామినీడు దర్శకత్వంలో తాను నిర్మించబోయే చిత్రంలో అవకాశం ఇచ్చారు గంగాధరరావు గారు.    

అలా హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో చిత్రీకరించబడ్డ మొదటి చిత్రం ' మా ఇంటి మహాలక్ష్మి ' తో 1959 లో చిత్రరంగ గృహప్రవేశం చేసిన హరనాథ్ 60 వ దశకంలో తెలుగు చిత్ర సీమలో ప్రముఖ హీరోల సరసన చేరాడు. బడ్జెట్ చిత్రాల హీరో గా, పురాణ పాత్రలకు సరిపోయే ఆకారంతో, చూడ చక్కని రూపంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. జమున, హరనాథ్ జంట అప్పటి ప్రేక్షకుల కన్నుల పంట.  ' భీష్మ ' ( 1967 ) చిత్రంలో కృష్ణుడిగా,  ' శ్రీరామకథ '   ( 1969 ) లో మరోసారి రాముడిగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 130 చిత్రాల్లో నటించిన హరనాథ్ చివరి చిత్రం ' నాగు ' .  దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తొలిసారి హీరోగా నటించిన ' పగడాల పడవ ' చిత్రంలో హరనాథ్ ఓ ప్రముఖ పాత్ర పోషించారు. ఆ చిత్రం విడుదల కాలేదు.

ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి అన్ని లక్షణాలు వున్న వ్యక్తి కొన్ని అవలక్షణాల బారిన పడితే తన పతనం తానే కోరి తెచ్చుకున్నట్లవుతుందని చెప్పడానికి హరనాథ్ జీవితమే ఒక ఉదాహరణ.

ఈరోజు ( నవంబర్ 1 )  హరనాథ్ వర్థంతి. ఆయనలోని నటుడిని స్మరించుకుంటూ ..............Vol. No. 02 Pub. No. 047

4 comments:

Vinay Datta said...

Harnath is one of my favourite artists. But I didn't know anything about me. Thanks for the post.

SRRao said...

మాధురి గారూ !
ధన్యవాదాలు

పద్మ said...

"ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి అన్ని లక్షణాలు వున్న వ్యక్తి కొన్ని అవలక్షణాల బారిన పడితే తన పతనం తానే కోరి తెచ్చుకున్నట్లవుతుందని చెప్పడానికి హరనాథ్ జీవితమే ఒక ఉదాహరణ."

బాగా చెప్పారు. చక్కటి రూపం, గొంతు, ఒడ్డు, పొడవు, నటన, అప్పటి హీరోలందరికన్నా మెరుగైన లక్షణాలు కలిగుండి, ఎన్నో చక్కటి అవకాశాలు ఉండి కూడా పతనం చెందటం బాధాకరం.

SRRao said...

పద్మ గారూ !
ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం