ఈ నయగారము....ఈ వయ్యారము...
......అంటూ షష్టిపూర్తి జరుపుకుంటున్న చిత్రం ' మల్లీశ్వరి ' చిత్రంలో గానంలోను, అభినయం లోను వయ్యారమొలికించిన భానుమతి ఆ చిత్రం స్వర్ణోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.....
" మల్లీశ్వరి చిత్ర విజయం ఒక్కరిది కాదు. అందరి కృషితోనే విజయవంతమైంది. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే అప్పట్లో మల్లీశ్వరి చిత్రం లోని పాటలు రేడియోలో ప్రసారం చేయనీకుండా నిలిపివేయడం.
మల్లీశ్వరి చిత్రం లో వేసిన సెట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. కృష్ణదేవరాయలు సభకు ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ అద్భుతంగా వేసారు. దర్శకుడు బి. ఎన్. రెడ్డికి మంచి అభిరుచి ఉండటంతో దానికి అణుగుణంగా సెట్స్ ను తయారు చేయించారు.
ఇక సంగీతం విషయానికొస్తే సాలూరి రాజేశ్వరరావులోని క్రియేటివిటీని వెలికి తీయడం ఒక్క భానుమతి వల్లే అవుతుంది. ఆయనకు నౌషాద్ సంగీతం అంటే ఇష్టం. అయితే ఆ ప్రభావం ఇందులో పడకుండా జాగ్రత్త తీసుకుని ఆయన వద్ద మంచి ట్యూన్లు చేయించాం ! ఇక్కడ ఇదే ఇంట్లో ( భానుమతి గారిల్లు ) సంగీతం సమకూర్చాము. నేను పాడే పాటలు నాకిష్టమైన కాఫీ రాగం, కమాసు, సింధుభైరవి, యమన్ కళ్యాణ్ రాగాల్లో సమకూర్చుకున్నాను.
పిలచిన బిగువటరా ( కాఫీ రాగం ), ఎందుకే నీకింత తొందరా ( కమాసు ), ఎవరేమని అందురో ( దర్బారీ రాగం ) , మనసున మల్లెలు ( యమన్ కళ్యాణ్ రాగం ), జయ జయ ( కళ్యాణి రాగం ) పాటలకు సంగీతం సమకూర్చుకున్నాను.
అప్పటికి నాకు 23 సంవత్సరాలు. అప్పటికే కొన్ని పిక్చర్స్ లో చేసిన సీనియర్ నటిని. నేను వేసినందునే మల్లీశ్వరి అంత హిట్ అయింది " అని గర్వంగా చెప్పుకున్నారు.
అది గర్వం అయి వుండదు. ఆత్మ విశ్వాసం కావచ్చు. ఏమైనా మల్లీశ్వరిగా తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయిన భానుమతి వయ్యారాలొలికించిన ఈ పాట ఆ చిత్ర షష్టిపూర్తి సందర్భంగా.............
తెలుగు చలనచిత్ర సీమకు సంబంధించినంతవరకూ 1951 వ సంవత్సరం చాలా విశిష్టమైనది. ఇంకా చెప్పాలంటే ఆ సంవత్సరం తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించడానికి అన్ని అర్హతలు వున్నది. సినిమా అనేది సకల కళల సమాహారమని నిరూపితమైన సంవత్సరం. మళ్ళీ యాభై ఒకటో సంవత్సరం వస్తే బాగుంటుందేమో !
సినిమా అనేది భారీగా డబ్బుతో చేసే వ్యాపారమని, వ్యాపార విలువలు తప్ప కళలు కూడు పెట్టవని నమ్మేవారికి ఒక్కసారి 1951 ని గుర్తు చేస్తేనైనా తమ అభిప్రాయం మార్చుకుంటారేమో ! ఇంతకీ 1951 విశిష్టత ఏమిటో ఒకసారి చూద్దాం........
తరతరాలుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న పాతాళభైరవి, మల్లీశ్వరి చిత్రాలు విడుదలయింది ఈ సంవత్సరమే ! విజయా సంస్థను నిలబెట్టి మనకు అజరామరమైన చిత్రాలను అందించడానికి పునాది వేసిన చిత్రం ' పాతాళభైరవి ' అయితే, బి. యన్. రెడ్డి గారి లోని కళా పిపాసను మనందరికీ పంచేటట్లు చేసిన చిత్రం ' మల్లీశ్వరి '.
అల్లావుద్దీన్ అద్భుతదీపం లాంటి అరబియన్ నైట్స్ కథను తీసుకుని దానికి అనేక వన్నెలు చిన్నెలు అద్ది తయారుచేసిన అసలు సిసలు జానపద కథ ' పాతాళభైరవి '.
శ్రీకృష్ణదేవరాయలు కాలంలో జరిగినట్లు చెప్పబడే ఒక చిన్న సంఘటన ఆధారంగా తయారుచేసుకున్న కథ ' మల్లీశ్వరి '. అదొక మధురమైన వెండితెర దృశ్యకావ్యం. సంగీత, సాహిత్య, నృత్య, శిల్ప...... ఇలా ఒకటేమిటి సమస్త కళలను సమపాళ్ళలో రంగరించిన ' మల్లీశ్వరి ' చిత్రం నభూతో నభవిష్యతి.
* ' పాతాళభైరవి ' చిత్రంతో కె.వి.రెడ్డి, పింగళి కాంబినేషన్ ప్రారంభమైతే, ' మల్లీశ్వరి ' చిత్రంతో అప్పటికే భావకవిగా ప్రసిద్ధులైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చిత్ర రంగ ప్రవేశం చేసి తన పాటలతో మనందరి మనసున మల్లెలు పూయించారు.
* ఆ సంవత్సరమే విడుదలయిన ' దీక్ష ' చిత్రంతో ' పోరా బాబూ పో... పోయి చూడు ఈ లోకం పోకడ ' అంటూ ప్రవేశించారు మరో రచయిత ఆత్రేయ .
* ఆ సంవత్సరమే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ' ఆకాశరాజు ' చిత్రంతో రంగ ప్రవేశం చేసారు.
* అంతకుముందు ' ఆహుతి ' అనే డబ్బింగ్ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమైనా, నేరుగా తెలుగు పాటలతో మహాకవి శ్రీశ్రీ పరిచయమైంది ' నిర్దోషి ' చిత్రంతో
ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు కలిగిన 1951 సువర్ణ సంవత్సరం మళ్ళీ రావాలని కోరుకోవడం తప్పు కాదేమో !
సాధారణంగా పిల్లలకు పెద్దల్ని అనుకరించడం అలవాటు. పుట్టిన వెంటనే బిడ్డ తన చిరునవ్వు నుంచి, నడక, మాట, ప్రవర్తన, అలవాట్లు ఇలా అన్నీ తన కంటే పెద్దవారి నుంచి ముఖ్యంగా తమ తల్లిదండ్రులు, అక్కలు, అన్నల నుంచి నేర్చుకునేది ఎక్కువగా వుంటుంది. తర్వాత కాలంలో స్నేహితులు, ఉపాధ్యాయులు మొదలైన వారినుంచి, తాము చదువుకున్న పుస్తకాలలోని గొప్ప వ్యక్తుల జీవితాలను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే తాము చూసే సినిమాలలోని నటులను అనుకరించాలనే భావన కూడా వారిలో వుంటుంది.
అలాంటి అనుకరణలోంచి వచ్చినదే గతతరంలోని పిల్లలు ఆడుకున్న అచ్చ తెలుగు ఆట బొమ్మల పెళ్లి. ముఖ్యంగా వేసవి సెలవలిస్తే ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా కలసి తాటియాకు బొమ్మల్ని చేసుకుని వాటిని సింగారించి, కొబ్బరి బూరాలు చేసుకుని అట్టహాసంగా పెళ్లి జరిపేవారు. టీవీలు, కంపూటర్లు వచ్చి వీటినన్నిటినీ మింగేసిన నేపథ్యంలో ఒక్కసారి ఆ ఆటను గురించి పేరడీ రచనలకు పేర్గాంచిన జరుక్ ( జలసూత్రం రుక్మిణీనాథ ) శాస్త్రి గారి వర్ణన చూద్దాం !
తాటియాకుకు కాటికా బొట్టు పెట్టి చీర సింగారించి షోకు జేశారు !
గాజు పూసలపేరు మెళ్ళో వేశారు గౌరీ కళ్యాణాల రేఖ దిద్దారు !
ఋగ్వేదం నుంచి వాయిద్యం యజుర్వేదం నుంచి అభినయం సామవేదం నుంచి సంగీతం అధర్వణవేదం నుంచి భావ ప్రకటన
ఉద్భవించాయంటారు. నాలుగు వేదాలలోని లక్షణాలను సంతరించుకున్నది కనుక నాట్యాన్ని ' పంచమవేదం ' అంటారు.
నాట్యానికి రాజు ' నటరాజు '.
సుమారు రెండు వేల సంవత్సరాలకు పూర్వం భరతముని రాసిన ' నాట్యశాస్త్రము ' మనకి నాటక కళను నేర్పింది. నాట్యమేళ సాంప్రదాయం శాస్త్రీయ కళగా రూపొందడానికి నాట్యశాస్త్రం దోహదపడింది.
క్రీ.శ. 3 వ లేదా 4 వ శతాబ్దంలో నందికేశుడు రచించినట్లుగా చెప్పబడుతున్న ' భరతార్ణవం ' అప్పటివరకూ అమలులోవున్న ఏకపాత్రకేళికా సాంప్రదాయాన్ని కళాఖండాలుగా తీర్చిదిద్దింది. దీనికి సంక్షిప్త రూపమైన ' అభినయ దర్పణం ' నాట్యాచార్యులకు భగవద్గీతలాంటిదని చెబుతారు.
క్రీ.శ. 1253-54 ప్రాంతంలో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని బావమరిది అయిన జాయపసేనాని ' నృత్త రత్నావళి ' రచించాడు. ఈయన కృష్ణాజిల్లాలోని దివిసీమకు చెందిన వాడుగా చరిత్ర.. జాయపను చిన్నప్పుడే గణపతి దేవుడు ఓరుగల్లుకు తీసుకువెళ్ళి గుండయామాత్యుడనే నాట్యాచార్యుని దగ్గర జేర్చి నాట్యకళను నేర్పించాడు. ఆనాటి నాట్య శాస్త్రాలను, సాంప్రదాయాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి తన అనుభవములను కూడా జోడించి ' నృత్తరత్నావళి ' ని రచించాడు.
దేవగిరిని పాలించిన యాదవరాజుల ఆస్థాన విద్వాంసునిగా వున్న శార్జ్ఞ్గదేవుడు తాను రచించిన ' సంగీత రత్నాకరము ' అనే గ్రంథములో భారత నాట్య రీతుల్లో వచ్చిన మార్పుల్ని వివరించాడు.
భారత దేశంలో సంస్కృతం రాజభాషగా వున్న కాలంలో ఇన్ని రకాల నృత్య రీతులు లేవు. దేశమంతటా ఒకే రకమైన శాస్త్రీయ నృత్యకళ వుండేది. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం పెరిగి, సంస్కృతం ప్రాముఖ్యం తగ్గడంతో ప్రాంతాల వారీగా నృత్య రీతులు అభివృద్ధి చెందాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న తెలుగు భాష సంగీతానికి, సాంస్కృతిక వికాసానికి అనువైన భాషగా పండితులు, విద్వాంసులు గుర్తించారు. దాంతో తెలుగు భాషలో అనేక నృత్య సంగీత రచనలు వెలువడ్డాయి. అందుకే దక్షిణాదిన ప్రధానంగా తెలుగు పాటే వినబడుతుంది.
ప్రాచీన కాలంలో మతానికి, కళలకి దగ్గర సంబంధముండేది. అందుకే దేవాలయ శిల్పాలలో మనం నాట్యకళను దర్శించవచ్చు. యజ్ఞయాగాది క్రతువుల్లో సంగీత నృత్యాలు భాగమై వుండేవి. బౌద్ధ, జైన మతాలు కూడా నాట్యకళను ప్రోత్సహించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. శాతవాహన, ఇక్ష్వాక రాజుల చరిత్రలలో ఈ ప్రస్థావన కనిపిస్తుంది. హాలుని గాథాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథలలో కూడా నాట్య ప్రస్థావన వున్నట్లు చెబుతారు. గుజరాతీ, కన్నడ భాషల్లో వున్న జైన మత గ్రంథాలలో నృత్యభంగిమలు, నర్తనరీతుల గురించి వున్నట్లు తెలుస్తోంది. తర్వాత కాలంలో వ్యాప్తిలోకి వచ్చిన శైవ, వైష్ణవ సాంప్రదాయాలు రెండూ నాట్యకళకు పెద్దపీటే వేసాయని చెప్పవచ్చు.
ఇక తెలుగు కళను సుసంపన్నం చేసిన కూచిపూడి నాట్య సాంప్రదాయం కృష్ణాజిల్లాలోని ఒక చిన్న గ్రామమైన ' కూచిపూడి ' నుంచి వచ్చింది. క్రీ.శ. 13 లేదా 14 వ శతాబ్దులలోనే ఈ సాంప్రదాయానికి మూలాలు వున్నట్లు చెబుతారు. ఆ ప్రాంతానికి చెందిన నృత్యకళా ప్రవీణుడు, వాగ్గేయకారుడు అయిన సిద్ధేంద్ర యోగి ' భామాకలాపం ' రచించి కూచిపూడి భాగవతులకు నేర్పించాడు. క్రీ.శ. 1506-09 ప్రాంతాలలో కూచిపూడి భాగవతులు హంపీ విజయనగరంలో ప్రదర్శనలిచ్చినట్లు ఆధారాలున్నాయి. ఇవి ప్రధానంగా నృత్య రూపకాలు. కూచిపూడికి దగ్గరలోనే ' మువ్వగోపాల పదాలు ' రచించిన మహాకవి క్షేత్రయ్య నివసించిన మొవ్వ గ్రామం వుంది. ఈ విషయం మీద చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నట్లుగా తోస్తుంది. అక్కడికి సమీపంలో ఒకప్పుడు శాతవాహనుల రాజధాని అయిన శ్రీకాకుళం కూడా వుంది. ' కృష్ణలీలాతరంగిణి ' రచించిన నారాయణ తీర్థులువారు కూడా శ్రీకాకుళానికి చెందిన వారేనని ఒక వాదన.
ఇప్పుడు మనం భరతనాట్యంగా పిలుచుకుంటున్న సాంప్రదాయాన్ని మహారాష్ట్ర రాజైన రెండవ శరభోజి ఆస్థానంలో విద్వాంసులుగా వున్న నలుగురు సోదరులు రూపొందించిన సదిర్ లేదా దాసి ఆట నుండి రూపాంతరం చెందింది. ఐతే ఇది భరతనాట్యంగా 1930 తర్వాతే విస్తృత ప్రచారం పొందిందట. క్రీ.శ. 17 వ శతాబ్దంలో కథకళి , ఆ తర్వాత కాలాల్లో ఒడిస్సీ, మణిపురి, కథక్ మొదలైన సాంప్రదాయాలు మన దేశంలో రూపుదిద్దుకున్నాయి.ఇవన్నీ మూడు వందల సంవత్సరాల కాలంలోనివే !
ఆంధ్ర దేశంలో నాట్య సాంప్రదాయం రెండు రకాలు . ఒకటి నట్టువ మేళం. రెండు నాట్యమేళం. నట్టువమేళం ఏకపాత్ర నృత్యము. ఇది ఎక్కువగా దేవదాసీ సాంప్రదాయంగా వుండేది. నాట్యమేళం సామూహికంగా ఎక్కువ పాత్రలతో రూపకాలుగా వుండేది. కూచిపూడి ఆ సాంప్రదాయానికి చెందినదే. వీటిని ' యక్షగానాలు ' అని కూడా పిలిచేవారు.
అలాగే ఆలయాల్లో చేసే ఆగమ శాస్త్ర నర్తనం, రాజాస్థానాలలో చేసే ఆస్థాన నర్తనం, కలాపాలు, భాగవతాలతో కూడిన ప్రబంధ నర్తనం అనే మూడురీతులు ప్రచారంలో వుండేవి. ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ గారు ఈ మూడు రీతుల్నీ సమన్వయ పరుస్తూ ' ఆంధ్ర నాట్యం ' అనే కొత్త రీతిని ప్రచారంలొకి తెచ్చారు. అలాగే ఆయన జాయప సేనాని రచించిన ' నృత్తరత్నావళి ' నుంచి ' పేరిణి ' అనే నృత్యాన్ని గ్రహించి ' పేరిణి శివతాండవం ' పేరుతో పునరుద్ధరించారు.
సూక్ష్మంగా మన నాట్య కళా చరిత్ర ఇది. అంతర్జాతీయ నాట్య దినోత్సవం ( ఏప్రిల్ 29 ) సందర్భంగా ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ..... ఎందరో కళాకారులు మన నాట్య కళా సాంప్రదాయాన్ని సుసంపన్నం చేసారు. అందులో ముఖ్యమైన వారిని ఈ శుభసందర్భంగా తలచుకుందాం !
సుమారు 2000 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఆంధ్రులది. ఐతిరేయ బ్రాహ్మణం లో ఆంధ్రుల ప్రసక్తి ఉండేదని అంటారు. రామాయణ, భారత, భాగవతాది పురాణాలలో కూడా ఆంధ్రుల ప్రసక్తి ఉందంటారు. వాటి మాట ఎలా ఉన్నా ఆంధ్రుల చరిత్ర అతి ప్రాచీనమైనదని ఒప్పుకోక తప్పదు. శాతవాహనుల కాలంలో ఆంధ్ర ప్రాంతమంతా ఒకే ప్రాంతం, ఒకే పాలన. కాకతీయ రాజులు, విజయనగర రాజుల కాలం వరకు తెలుగుకు వైభవం బాగానే ఉండేదని చరిత్ర చెబుతోంది. తర్వాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం నైజాం నవాబు చేతిలోకి, విజయనగర వంశానికి చెందిన చంద్రగిరి రాజుల ద్వారా చెన్నపురి ప్రాంతం బ్రిటిషు వారి చేతిలోకి వెళ్ళిపోయాయి. అటు పిమ్మట నిజాం నవాబు తన అధీనంలో ఉన్నసర్కారు జిల్లాలను, అప్పట్లో దత్తమండలాలుగా పిలవబడే రాయలసీమను కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం బ్రిటిషు వారికి ధారపోసాడు.
మాట్లాడే భాష ఒకటే ! సంస్కృతీ ఒకటే !
కానీ సర్కారు, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి చేతిలో ! తెలంగాణ నైజాం నవాబు గుప్పిట్లో !! దాంతో తెలుగు వారి మీద పరాయి పాలకుల పెత్తనం, తెలుగు భాష మీద పరాయి భాషల పెత్తనం మొదలయ్యాయి. ఇదిలా ఉండగా బ్రిటిషు వారి ' విభజించి పాలించు ' సూత్రం ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది, 1906 లో లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన తో ! దీన్ని భారతీయులు వ్యతిరేకించారు. వివిధ ప్రాంతాల్లో వివిధ ఉద్యమాలు నడిచాయి. ఆ సమయంలోనే ఆంధ్రలో భాషోద్యమం ఆరంభమయింది. చివరికి దేశంలోని అన్ని ఉద్యమాలు కలిసి వందేమాతరం ఉద్యమంగా రూపుదిద్దుకున్నాయి. దాంతో 1911 లో బెంగాల్ విభజన రద్దయింది. ఉద్యమాల గొప్పతనం తెలిసిన సందర్భమది. తర్వాత మళ్ళీ కొంతకాలానికి భాషా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఇక్కడొక చిన్న విషయం. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా నడిచిన ఈ ఉద్యమాలన్నీ పరిపాలన, విద్యా బోధన రెండూ మాతృ భాషలోనే జరగాలనే ప్రధాన అంశం మీదే ఆధారపడ్డాయి. 1913 లో దేశభక్త కొండా వెంకటప్పయ్య నేతృత్వంలో బాపట్లలో ప్రధమాంధ్ర మహాసభ జరిగింది. ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనేదే ! ప్రజల్ని ఉత్తేజపరచి ఈ ఉద్యమంలో భాగస్వాముల్ని చెయ్యడానికి ప్రతి సంవత్సరం జిల్లాల్లో మహాసభలు నిర్వహించారు. తెలుగు వారికి సంస్థాగత గుర్తింపు రావడానికి డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు చేసిన విశేష కృషి, ఆయనకు లోకమాన్య బాల గంగాధర తిలక్ సహకారం కారణమయ్యాయి. 1919 లో డా. పట్టాభి రాష్ట్ర కాంగ్రెస్ సంఘాన్ని ఆరంభించారు. అక్కడినుంచి మహాత్మా గాందీ పిలుపు కారణంగా ఆంధ్రోద్యమం జాతీయ భావాలు సంతరించుకుంది. 1920 లో జాతీయోద్యమంలో కలిసి పోయింది. బ్రిటిషు ప్రాంతంలో ఉన్న ఆంధ్రులు 1913 లో ఉద్యమం ఆరంభిస్తే నిజాం పాలనలో ఉన్న ఆంధ్రులు బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు ప్రభృతుల నేతృత్వంలో 1921 లో ఆంధ్ర జన సంఘం ప్రారంభించారు. అప్పటి పత్రికలు నీలగిరి, తెలుగు పత్రిక, గోల్కొండ తమ మద్ద్దతునిచ్చాయి. ఈ సంఘం తర్వాత ఆంధ్ర జన కేంద్ర సంఘంగా, నిజాం ఆంధ్ర జన కేంద్ర సంఘంగా రూపాంతరాలు చెంది చివరికి నైజాం ఆంధ్ర మహా సభగా ఆంధ్రోద్యమం సాగించింది. రెండు ప్రాంతాలలోను పన్నుల నిరాకరణోద్యమం ఉధృతంగా సాగింది. బ్రిటిష్ ప్రభువులు మళ్ళీ విభజించి పాలించే పనిని చేపట్టారు. రెండు ప్రాంతాల ప్రజలు కలిస్తే ఉద్యమం ఉధృతమవుతుందని భయపడిన బ్రిటిష్ అధికారులు మిలటరీని చేరవెయ్యడానికి గుంటూరునుంచి పల్నాడు వరకు రైల్వే లైన్ వెయ్యడానికి సంకల్పించారు. ఇలా జాతీయోద్యమంగా మారిన తర్వాత కొంతకాలం వరకు ప్రత్యేక రాష్ట్ర నినాదం కొంచెం తగ్గినట్లయింది . 1913 నాటి మాంటంగ్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణల ఫలితంగా 1935 లో భాషా రాష్ట్రాల చట్టం వచ్చింది. దీని వలన బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఏర్పడ్డాయి గానీ ఆంద్ర రాష్ట్రం మాత్రం రాలేదు. 1937 లో మద్రాస్ రాష్ట్రంలో రాజాజీ ప్రధానిగా కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పడింది. ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర తీర్మానం చేసింది. జూలై 10 వ తేదీన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఇంట్లో ( శ్రీ బాగ్ ) జరిగిన సమావేశంలో కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఇదే శ్రీబాగ్ వప్పందంగా చరిత్రకెక్కింది. అందులోని కొన్ని ముఖ్యాంశాలు 1) వెనుకబడ్డ ప్రాంతమైన రాయలసీమ ఆర్థికాభివృద్ధికి 10 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. 2) హైకోర్ట్ రాయలసీమలో ఏర్పాటు చెయ్యాలి. 3) రాయలసీమకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలి. 4) జనాభాతో సంబంధం లేకుండా అన్ని జిల్లాలకు శాసన సభలో ప్రాధాన్యం ఉండాలి. మద్రాస్ నగరం తమిళులకు, ఆంధ్రులకు ఉమ్మడి రాజధానిగా ఉండాలనే ఆంద్ర నాయకుల కోరికను రాజాజీ వ్యతిరేకించారు. తెలంగాణాలో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా 1937 లో నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర సభలో మొదటి రాజకీయ తీర్మానం చెయ్యడం జరిగింది. 1938 లో ఆంధ్రోద్యమ రజతోత్సవాలు విజయవాడలో జరిగాయి. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటయింది. దీన్ని నిజాం నిషేధించాడు. 1939 లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆంధ్రోద్యమం దాదాపుగా మూలన పడింది. 1942లో ' క్విట్ ఇండియా ' ఉద్యమం ప్రారంభమయింది. అది ఉధృతంగా జరుగుతోన్న సమయంలో తెలంగాణాలో సంస్థానాధీశుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమయింది. అది తెలంగాణా రైతాంగ పోరాటంగా, విశాలాంధ్ర ఉద్యమంగా తీవ్రరూపం దాల్చింది. 1946 లో శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలను అణిచివెయ్యడానికి ' రజాకార్లు ' అనే పేరుతో కొన్ని ముస్లిం సంస్థలు ఆంధ్రోద్యమకారులపై విరుచుకు పడ్డాయి. వీరికి నిజాం తన సైన్యంతో మద్దతిచ్చాడు. 1947 లో భారత దేశానికి స్వతంత్ర్యం వచ్చినపుడు నిజాం బ్రిటిష్ వారితో యథాతథ వప్పందం చేసుకుని భారత సమాఖ్యలో చేరకుండా స్వతంత్ర్యం ప్రకటించుకున్నాడు. దీనికి కాంగ్రెస్ శాంతియుతంగా నిరసన తెలిపితే కమ్యూనిష్టులు సాయుధ పోరాటం ద్వారా ఎదుర్కోవడం ప్రారంభించారు. రజాకార్లు తమ ఆగడాలను కొనసాగించారు. 1947 లోనే భారత ప్రభుత్వం భాషా రాష్ట్రాల పునర్వవస్థీకరణం కోసం ఫజలాలీ కమీషన్ ని నియమించింది. 1948 సెప్టెంబరు 13 వ తేదీన భారత ప్రభుత్వం పోలీసు చర్య ప్రారంభించింది. సెప్టెంబరు 17 వ తేదీన అప్పటి నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ లొంగిపోయాడు. దాంతో నిజాం పాలనలో ఉన్న మరాట్వాడా ప్రాంతం మహారాష్ట్ర లోను, కన్నడ ప్రాంతాలు మైసూరు ప్రాంతం లోను విలీనం కాగా తెలంగాణా ప్రాంతం విడిగా ఉండిపోయింది. అంతే గానీ విశాలాంధ్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమాలు ఫలించలేదు. స్వాతంత్ర్యం ముందుగానీ, తర్వాతగానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాలేదు. 1951 లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. హైదరాబాదు స్టేట్ కి బూర్గుల రామకృష్ణారావు గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటయింది. 1956 వరకూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన వాయిదా వెయ్యాలని నీలం సంజీవరెడ్డి 21 మంది కాంగ్రెస్, స్వతంత్ర సభ్యులతో ఒక విజ్ఞాపన ప్రధానికి సమర్పించారు. దాంతో ఆంధ్ర రాష్ట్ర సాధన ఆశయం మీద నీళ్ళు చల్లినట్లయింది. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకోసం 58 రోజుల నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబరు 15 వ తేదీన ప్రాణత్యాగం చేసారు. దీని ఫలితంగా 1953 అక్టోబరు 1 వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు తొలి ముఖ్యమంత్రి. నీలం సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రి. అయితే 13 నెలలు గడవక ముందే ప్రకాశంగారి మంత్రివర్గంపైన గౌతు లచ్చన్న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కారణంగా అధికార పక్షంలోని నలుగురు సభ్యులు వెన్నుపోటు పొడవడంతో ఒక్క ఓటు తేడాతో ఆ తీర్మానం నెగ్గింది. ప్రకాశం గారు రాజీనామా చెయ్యవలసి వచ్చింది. ఫలితంగా 1955 లో మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఈలోగా తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే ఆలోచన బలపడింది. దానికి కాంగ్రెస్ , కమ్యూనిష్టు పార్టీలు మద్దతు తెలిపాయి. మర్రి చెన్నారెడ్డి, కె. వి.రంగారెడ్డి లాంటి వారు ఓ వర్గంగా ఏర్పడి తెలంగాణా విడిగానే ఉండాలని వాదించారు. అయితే ఈ అసమ్మతి ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం మీద పడలేదు. తెలంగాణా ప్రయోజనాలు కాపాడడానికి పెద్దమనుష్యుల వప్పందం పేరుతో ఆంధ్ర, తెలంగాణా నాయకుల మధ్య ఒక వప్పందం జరిగింది. 1956 నవంబరు 1 వ తేదీన ఆంధ్రులంతా కోరుకున్న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. పెద్ద మనుష్యుల వప్పందాన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా నైతేనేమి, అప్పటి ఆంధ్ర, తెలంగాణా నాయకుల ఆధిపత్య పోరు వల్లనైతేనేమి 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వచ్చింది. అంతకంటే ఉధృతంగా 1972 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం నడిచింది. ఈ రెండు ఉద్యమాలు స్వార్థ రాజకీయాల పునాదులపై నిర్మించబడటం, చివరికి ఆ రాజకీయాలకే ఆ ఉద్యమాలు బలయిపోవడం ఒక చేదు నిజం. ఈ విషయంలో ఆప్పటి ప్రజలు కూడా రాజకీయ నాయకుల చిత్తశుద్ధి విషయంలో పొరబడ్డారు. ఇప్పటి ప్రజలు ఈ అనుభవాలతో వాస్తవాలు గ్రహించే స్థితికి చేరుకున్నారు. ఆ ఉద్యమాలు ప్రజలకు స్వార్థరాజకీయాల మీద అవగాహన పెంచాయనే చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందు తెలుగువాళ్ళమందరమూ ఒకే గొడుగు క్రిందకు రావాలనే ఆశయం అప్పటి నాయకుల్లో బలంగా ఉండేది. తర్వాతి వచ్చిన నాయకుల్లో స్వార్థమేగానీ సెంటిమెంట్ కనబడదు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు భాషని, సంస్కృతిని ముక్కలు చెయ్యడానికి వెనుకాడటం లేదు. అయితే ప్రజలు గత ప్రత్యేక తెలంగాణా, ఆంధ్రా ఉద్యమ ఫలితాలనుంచి నేర్చుకున్న పాఠాలతో చైతన్యవంతులయ్యారనే చెప్పవచ్చు. ఈ చైతన్యం ఇలాగే కొనసాగుతుందని ఆశిద్దాం !
ఇప్పటి తరం రాజకీయ నాయకుల్లో అరుదుగా కనిపించే సంస్కారం గత తరం రాజకీయ నాయకుల్లో తరుచుగా కనబడేదనడానికి ఒక ఉదాహరణ.
దామోదరం సంజీవయ్య గారు ఆంద్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి. 1960 వ సంవత్సరం నుండి 1962వరకూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఘనత వహించారు. తర్వాత కేంద్రంలో కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా పని చేశారు. అంతటి ఉన్నత స్థానానికి చేర్చింది ఆయన సంస్కారమే !
విదేశీ పర్యటనలంటే ఈనాటి రాజకీయనాయకులు ఎగిరి గంతులేస్తారు. సంజీవయ్య గారికి విదేశాలనుంచి చాలాసార్లు ఆహ్వానాలందాయి. అయితే వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. సంజీవయ్య గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న రోజుల్లో అమెరికా రాయబారి గాల్ బ్రెట్ అమెరికాకు ఆహ్వానించారు. అయితే తనకు ఈ దేశంలోనే చెయ్యడానికి చాలా పని ఉందని ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆ రాయబారి ఆయన సంస్కారానికి ముగ్దుడయ్యాడు.
విదేశీ పర్యటనలకు ప్రజాధనం ఖర్చు చెయ్యడం సంజీవయ్య గారికి ఇష్టం ఉండేది కాదు. ఆయన రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో విదేశాలనుంచి చాలా ఆహ్వానాలు అందాయి. అయితే ఆయన అవేమీ ఉపయోగించుకునే వారు కాదు. పైగా " సహకార రంగంలో ఇతర దేశాల కంటే మనమే ముందున్నాం. ఇక అక్కడికి వెళ్లి నేర్చుకునేదేమిటి ? అనవసరంగా ప్రజా ధనం వృధా చెయ్యడం తప్ప " అనేవారు. ఈనాటి రాజకీయాల్లో ఈ సంస్కారం అరుదై పోయింది.
తెలుగు నాటక రంగానికి వందేళ్ళపైనే చరిత్ర ఉంది. ఎంతోమంది మహానటులు, నటీమణులు మన నాటక రంగాన్ని పరిపుష్టం చేసారు. వాళ్ళలో ముఖ్యులు కొందర్ని ఈ క్రింద చూడండి ........