Thursday, April 21, 2011

అరవై యేళ్ళ క్రితం......

తెలుగు చలనచిత్ర సీమకు సంబంధించినంతవరకూ 1951 వ సంవత్సరం చాలా విశిష్టమైనది. ఇంకా చెప్పాలంటే  ఆ సంవత్సరం తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించడానికి అన్ని అర్హతలు వున్నది. సినిమా అనేది సకల కళల సమాహారమని నిరూపితమైన సంవత్సరం. మళ్ళీ యాభై ఒకటో సంవత్సరం వస్తే బాగుంటుందేమో !

సినిమా అనేది భారీగా డబ్బుతో చేసే వ్యాపారమని, వ్యాపార విలువలు తప్ప కళలు కూడు పెట్టవని నమ్మేవారికి ఒక్కసారి 1951 ని గుర్తు చేస్తేనైనా తమ  అభిప్రాయం మార్చుకుంటారేమో ! ఇంతకీ 1951 విశిష్టత ఏమిటో ఒకసారి చూద్దాం........

తరతరాలుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న పాతాళభైరవి, మల్లీశ్వరి చిత్రాలు విడుదలయింది ఈ సంవత్సరమే ! విజయా సంస్థను నిలబెట్టి మనకు అజరామరమైన చిత్రాలను అందించడానికి పునాది వేసిన చిత్రం ' పాతాళభైరవి ' అయితే, బి. యన్. రెడ్డి గారి లోని కళా పిపాసను మనందరికీ పంచేటట్లు చేసిన చిత్రం ' మల్లీశ్వరి '. 


అల్లావుద్దీన్ అద్భుతదీపం లాంటి అరబియన్ నైట్స్ కథను తీసుకుని దానికి అనేక వన్నెలు చిన్నెలు అద్ది తయారుచేసిన అసలు సిసలు జానపద కథ ' పాతాళభైరవి '.


శ్రీకృష్ణదేవరాయలు కాలంలో జరిగినట్లు చెప్పబడే ఒక చిన్న సంఘటన ఆధారంగా తయారుచేసుకున్న కథ ' మల్లీశ్వరి '. అదొక మధురమైన వెండితెర దృశ్యకావ్యం. సంగీత, సాహిత్య, నృత్య, శిల్ప...... ఇలా ఒకటేమిటి సమస్త కళలను సమపాళ్ళలో రంగరించిన ' మల్లీశ్వరి ' చిత్రం నభూతో నభవిష్యతి. 






*  ' పాతాళభైరవి ' చిత్రంతో  కె.వి.రెడ్డి, పింగళి కాంబినేషన్ ప్రారంభమైతే,  ' మల్లీశ్వరి ' చిత్రంతో అప్పటికే భావకవిగా ప్రసిద్ధులైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చిత్ర రంగ ప్రవేశం చేసి తన పాటలతో మనందరి మనసున మల్లెలు పూయించారు.



*  ఆ సంవత్సరమే విడుదలయిన ' దీక్ష ' చిత్రంతో  ' పోరా బాబూ పో... పోయి చూడు ఈ లోకం పోకడ ' అంటూ ప్రవేశించారు మరో రచయిత ఆత్రేయ . 





*  ఆ సంవత్సరమే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ' ఆకాశరాజు ' చిత్రంతో రంగ ప్రవేశం చేసారు. 





* అంతకుముందు ' ఆహుతి ' అనే డబ్బింగ్ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమైనా, నేరుగా తెలుగు పాటలతో మహాకవి శ్రీశ్రీ పరిచయమైంది ' నిర్దోషి ' చిత్రంతో



ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు కలిగిన 1951 సువర్ణ సంవత్సరం మళ్ళీ రావాలని  కోరుకోవడం తప్పు కాదేమో !


Vol. No. 02 Pub. No. 207

2 comments:

Rajendra Devarapalli said...

1951 సువర్ణ సంవత్సరం మళ్ళీ రావాలని కోరుకోవడం తప్పు కాదేమో !...కానీ అత్యాశవుతుంది.

SRRao said...

రాజేంద్రకుమార్ గారూ !
మంచిరోజులు మళ్ళీ రావాలని కోరుకోవడం అత్యాశ కాదేమోనండీ ! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం