కోపానికి ప్రళయ తాండవం
ప్రేమకి అనురాగ తాండవం
బాధలకు విషాద తాండవం
ప్రతీ అనుభూతి వ్యక్తీకరణకు ఆలంబన నాట్యం
మానవ జీవితంలో విడదీయరాని భాగం నాట్యం
.... ప్రపంచంలో ప్రతి దేశం, ప్రతి జాతి తమదైన సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి వుంది. వాటిలో భాగంగా తమదైన నాట్యరీతులు ప్రతీ దేశం కలిగి వున్నాయి. అయితే సగానికి పైగా దేశాలలో ప్రభుత్వాలు ఈ కళల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దాంతో ప్రజల్లో కూడా నిస్పృహ మొదలైంది.
నాట్యానికి ప్రజల్లో క్రమేణా తగ్గుతున్న ఆదరణను, పోషించాల్సిన ప్రభుత్వాల అలసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక విభాగం ( యునెస్కో ) ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 29 వతేదీన అంతర్జాతీయ నాట్య దినోత్సవం జరుపుతోంది.
నాట్యం యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియజెయ్యడం, ప్రభుత్వాలను ఈ విషయంలో జాగృతపరచి తగిన నిధులు కేటాయించడం ద్వారా నాట్యాభివృద్ధికి కృషి చెయ్యడం ఈ నాట్యదినోత్సవ లక్ష్యాలు.
మన దేశంలో కూడా ప్రతీ ఏటా ఈ నాట్యదినోత్సవం జరుపుతున్నారు. కానీ మనదేశంలో నాట్యం ఇంకా ఉన్నత తరగతికే పరిమితమైపోయింది. మధ్య తరగతిలో ఆసక్తి వున్నా ఖరీదైన ఆసక్తి కావడంతో తమ ఉత్సాహాన్ని కొంతవరకే పరిమితం చేసుకుని తృప్తి పడాల్సి వస్తోంది. ఇక దిగువ తరగతికి ఇది అందని పండే !
ఆసక్తికి, నైపుణ్యానికి ఆర్ధిక స్థాయితో సంబంధం లేదు. కళాకారులు ఉన్నత తరగతిలో మాత్రమే పుట్టరు. పేదరికం కళాకారునికి ఆటంకం కాకూడదు. కళ అనేది వాళ్లకి కలగా మిగిలిపోకూడదు. అలాగే ఆసక్తి వున్నా ఆర్థికంగా ఉన్నత కుటుంబాలతో పోటీ పడలేక తమలోని నైపుణ్యాన్ని మధ్యలోనే చంపుకునే పరిస్థితి మధ్య తరగతికి వుండకూడదు.
ప్రతీ సంవత్సరం ఏవో కొన్ని కార్యక్రమాలు నిర్వహించి, కొన్ని అకాడెమిలు పెట్టి, వాటిని ఆయా రంగాలతో సంబంధం లేని, వాటి గురించి అవగాహన ఏమాత్రం లేని వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి. ఇది నిజమైన కళాకారులకు, నిజమైన నైపుణ్యం వున్న వాళ్లకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ఎక్కడో కొన్ని కాలేజీలలో మాత్రమే ఈ కోర్సు లు అందుబాటులో ఉంటున్నాయి. అవి కూడా పలుకుబడి, ఆర్ధిక స్థోమత వున్న వాళ్ళకే దక్కుతున్నాయి. కనుక ఇలాంటి కోర్సు లు అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో అందించగలిగితే అసలైన కళాకారులు బయిటకొస్తారు అన్నిటికంటే ముఖ్యం నాట్యాబ్యాసం వల్ల జీవనానికి లోటు వుండదు అనే భరోసా కలిగించగలగాలి. అప్పుడే మరింత మంది ఉత్సాహంగా తమ ఆసక్తిని చూపుతారు. ఈ కళల శిక్షణ అనేది అందని పండులా కాకుండా సాధారణ విద్యాభ్యాసంలో భాగమయ్యే విధంగా ప్రణాళికలు తయారుచెయ్యాలి. అప్పుడే ఈ కళలు విలసిల్లుతాయి. మన సంస్కృతీ సాంప్రదాయాలు పరిరక్షించబడతాయి.
మన నాట్యశాస్త్ర గమనంలో కొన్ని కీలకమైన ఘట్టాలను తెలుపుతూ రాసిన గత సంవత్సరం టపా ................
పంచమ వేదం
http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_29.html
అంతర్జాతీయ నాట్య దినోత్సవ శుభాకాంక్షలతో.......
Vol. No. 02 Pub. No. 216
No comments:
Post a Comment