సుమారు యాభై మూడేళ్ళ క్రితం పారిస్ నగరంలో ఇది జరిగింది. ఓ యువకుడు కాలక్షేపానికి ఆ మహానగరంలోని ఒక సినిమా థియేటర్ లోనికి ప్రవేశించాడు టికెట్ తీసుకుని. ఆ యువకుడి పేరు ఫ్రాన్సిస్ లా బోర్డే. అప్పటికి అతను అనామకుడే ! ఆ థియేటర్ లో ఆ రోజు ప్రదర్శిస్తున్న సినిమా దర్శకుడు కూడా అప్పటికి అనామకుడే ! అప్పటికి ఆ చిత్రం చూడడం పూర్తి చేసిన తర్వాత కనుకొలుకులలో నీటి బిందువులు కనిపించాయి. హృదయం చలించింది కూడా ! పేదరికం అంత దుర్భరంగా ఉంటుందని ఫ్రాన్సిస్ లా బోర్డే కి ఆనాటివరకూ తెలీదు. ఆ పేదరికాన్ని, దారిద్ర్యాన్ని స్వయంగా చూడడానికి 1956 చలికాలంలో పారిస్ నుంచి లా బోర్డే కలకత్తాకు వచ్చాడు. హౌరా స్టేషన్ బయిట రోడ్డుమీద ఫీల్ఖానా బస్తీ కుష్టురోగులను చూసి లాబోర్డే చలించి పోయాడు. నాటినుంచి కలకత్తాలోనే మానవ సేవకుడిగా , సంఘసేవకుడిగా స్థిరపడిపోయాడు. లా బోర్డే ఎన్నో కుష్టురోగుల గృహాలు, అనాథ శరణాలయాలు స్థాపించాడు. ఆ రోజు యాభైమూడేళ్ళ క్రితం ఆ సాయింత్రం పారిస్ లో లా బోర్డే కన్నార్పకుండా చూసిన చిత్రం సత్యజిత్ రే ' పథేర్ పాంచాలి ' . అప్పటికి అనామకుడైన ఆ చిత్ర దర్శకుడు సత్యజిత్ రే.
భారతదేశ చలన చిత్ర రంగానికి వెలుగు దీపం సత్యజిత్ రే. ఆయన చిత్రాలు సజీవ చిత్ర రూపాలు. భారత చలన చిత్రాలను ప్రపంచానికి చూపించింది సత్యజిత్ రే. తన చిత్రాలద్వారా భారత దేశానికి అంతర్జాతీయంగా ఖ్యాతి తీసుకొచ్చిన మహా దర్శకుడు.
ఆయన చిత్రాల్లో పాత్రలు నేలవిడిచి సాము చెయ్యవు. అవన్నీ రోజూ మన చుట్టూ కనబడే మనకి పరిచయమున్న వ్యక్తులే ! ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉండే కష్టాలు, కన్నీళ్లు... వాటితో వాళ్ళు నిరంతరం పడే రాజీ ప్రధానంగా కనిపిస్తాయి. ఆదర్శాలు వల్లించడం, ఊహల్లో తేలిపోవడం ఆయన చిత్రాల్లో కనబడదు. కేవలం ఆయా జీవితాల సజీవ చిత్రణ మాత్రమే కనబడుతుంది.
అలాంటి మహోన్నత దర్శకుడు సత్యజిత్ రే గారి వర్థంతి సందర్భంగా కళా నీరాజనాలతో............
విన్నపం : ఈ టపాలో ఒక పొరబాటు దొర్లింది. నిజానికి ఈ రోజు ( ఏప్రిల్ 23 ) సత్యజిత్ రే గారి వర్థంతి. పొరబాటున జయంతిగా పేర్కొనడం జరిగింది. ఆయన జయంతి మే 2 వ తేదీన.జరిగిన పొరబాటుకి క్షంతవ్యుణ్ణి. ఆ పొరబాటును సవరించాను. గమనించగలరు.
Vol. No. 02 Pub. No. 210
No comments:
Post a Comment