Sunday, November 1, 2009

ఆంధ్రుల ఉద్యమాలు


సుమారు 2000 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఆంధ్రులది. ఐతిరేయ బ్రాహ్మణం లో ఆంధ్రుల ప్రసక్తి ఉండేదని అంటారు. రామాయణ, భారత, భాగవతాది పురాణాలలో కూడా ఆంధ్రుల ప్రసక్తి ఉందంటారు. వాటి మాట ఎలా ఉన్నా
ఆంధ్రుల చరిత్ర అతి ప్రాచీనమైనదని ఒప్పుకోక తప్పదు. శాతవాహనుల కాలంలో ఆంధ్ర ప్రాంతమంతా ఒకే ప్రాంతం, ఒకే పాలన. కాకతీయ రాజులు, విజయనగర రాజుల కాలం వరకు తెలుగుకు వైభవం బాగానే ఉండేదని చరిత్ర
చెబుతోంది. తర్వాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం నైజాం నవాబు చేతిలోకి, విజయనగర వంశానికి చెందిన చంద్రగిరి రాజుల ద్వారా చెన్నపురి ప్రాంతం బ్రిటిషు వారి చేతిలోకి వెళ్ళిపోయాయి. అటు పిమ్మట నిజాం నవాబు తన అధీనంలో ఉన్నసర్కారు జిల్లాలను, అప్పట్లో దత్తమండలాలుగా పిలవబడే రాయలసీమను కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం బ్రిటిషు వారికి ధారపోసాడు.

మాట్లాడే భాష ఒకటే ! సంస్కృతీ ఒకటే !

కానీ సర్కారు, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి చేతిలో ! తెలంగాణ నైజాం నవాబు గుప్పిట్లో !! దాంతో తెలుగు వారి మీద పరాయి పాలకుల పెత్తనం, తెలుగు భాష మీద పరాయి భాషల పెత్తనం మొదలయ్యాయి. ఇదిలా
ఉండగా బ్రిటిషు వారి ' విభజించి పాలించు ' సూత్రం ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది, 1906 లో లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన తో ! దీన్ని భారతీయులు వ్యతిరేకించారు. వివిధ ప్రాంతాల్లో వివిధ ఉద్యమాలు నడిచాయి. ఆ సమయంలోనే
ఆంధ్రలో భాషోద్యమం ఆరంభమయింది. చివరికి దేశంలోని అన్ని ఉద్యమాలు కలిసి వందేమాతరం ఉద్యమంగా రూపుదిద్దుకున్నాయి. దాంతో 1911 లో బెంగాల్ విభజన రద్దయింది. ఉద్యమాల గొప్పతనం తెలిసిన సందర్భమది. తర్వాత మళ్ళీ కొంతకాలానికి భాషా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఇక్కడొక చిన్న విషయం. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా నడిచిన ఈ ఉద్యమాలన్నీ పరిపాలన, విద్యా బోధన రెండూ మాతృ భాషలోనే జరగాలనే ప్రధాన అంశం మీదే ఆధారపడ్డాయి.
1913 లో దేశభక్త కొండా వెంకటప్పయ్య నేతృత్వంలో బాపట్లలో ప్రధమాంధ్ర మహాసభ జరిగింది. ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనేదే ! ప్రజల్ని ఉత్తేజపరచి ఈ ఉద్యమంలో భాగస్వాముల్ని చెయ్యడానికి
ప్రతి సంవత్సరం జిల్లాల్లో మహాసభలు నిర్వహించారు. తెలుగు వారికి సంస్థాగత గుర్తింపు రావడానికి డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు చేసిన విశేష కృషి, ఆయనకు లోకమాన్య బాల గంగాధర తిలక్ సహకారం
కారణమయ్యాయి. 1919 లో డా. పట్టాభి రాష్ట్ర కాంగ్రెస్ సంఘాన్ని ఆరంభించారు. అక్కడినుంచి మహాత్మా గాందీ పిలుపు కారణంగా ఆంధ్రోద్యమం జాతీయ భావాలు సంతరించుకుంది. 1920 లో జాతీయోద్యమంలో కలిసి పోయింది.
బ్రిటిషు ప్రాంతంలో ఉన్న ఆంధ్రులు 1913 లో ఉద్యమం ఆరంభిస్తే నిజాం పాలనలో ఉన్న ఆంధ్రులు బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు ప్రభృతుల నేతృత్వంలో 1921 లో ఆంధ్ర జన సంఘం ప్రారంభించారు. అప్పటి పత్రికలు నీలగిరి, తెలుగు పత్రిక, గోల్కొండ తమ మద్ద్దతునిచ్చాయి. ఈ సంఘం తర్వాత ఆంధ్ర జన కేంద్ర సంఘంగా, నిజాం ఆంధ్ర జన కేంద్ర సంఘంగా రూపాంతరాలు చెంది చివరికి నైజాం ఆంధ్ర మహా సభగా ఆంధ్రోద్యమం సాగించింది. రెండు ప్రాంతాలలోను పన్నుల నిరాకరణోద్యమం ఉధృతంగా సాగింది. బ్రిటిష్ ప్రభువులు మళ్ళీ విభజించి పాలించే పనిని చేపట్టారు. రెండు ప్రాంతాల ప్రజలు కలిస్తే ఉద్యమం ఉధృతమవుతుందని భయపడిన బ్రిటిష్ అధికారులు
మిలటరీని చేరవెయ్యడానికి గుంటూరునుంచి పల్నాడు వరకు రైల్వే లైన్ వెయ్యడానికి సంకల్పించారు. ఇలా జాతీయోద్యమంగా మారిన తర్వాత కొంతకాలం వరకు ప్రత్యేక రాష్ట్ర నినాదం కొంచెం తగ్గినట్లయింది . 1913 నాటి మాంటంగ్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణల ఫలితంగా 1935 లో భాషా రాష్ట్రాల చట్టం వచ్చింది. దీని వలన బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఏర్పడ్డాయి గానీ ఆంద్ర రాష్ట్రం మాత్రం రాలేదు. 1937 లో మద్రాస్ రాష్ట్రంలో రాజాజీ ప్రధానిగా కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పడింది. ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర తీర్మానం చేసింది. జూలై 10 వ తేదీన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఇంట్లో ( శ్రీ బాగ్ ) జరిగిన సమావేశంలో కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఇదే శ్రీబాగ్ వప్పందంగా
చరిత్రకెక్కింది. అందులోని కొన్ని ముఖ్యాంశాలు
1) వెనుకబడ్డ ప్రాంతమైన రాయలసీమ ఆర్థికాభివృద్ధికి 10 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యమివ్వాలి.
2) హైకోర్ట్ రాయలసీమలో ఏర్పాటు చెయ్యాలి.
3) రాయలసీమకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలి.
4) జనాభాతో సంబంధం లేకుండా అన్ని జిల్లాలకు శాసన సభలో ప్రాధాన్యం ఉండాలి.
మద్రాస్ నగరం తమిళులకు, ఆంధ్రులకు ఉమ్మడి రాజధానిగా ఉండాలనే ఆంద్ర నాయకుల కోరికను రాజాజీ వ్యతిరేకించారు.
తెలంగాణాలో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా 1937 లో నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర సభలో మొదటి రాజకీయ తీర్మానం చెయ్యడం జరిగింది.
1938 లో ఆంధ్రోద్యమ రజతోత్సవాలు విజయవాడలో జరిగాయి. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటయింది. దీన్ని నిజాం నిషేధించాడు.
1939 లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆంధ్రోద్యమం దాదాపుగా మూలన పడింది.
1942లో ' క్విట్ ఇండియా ' ఉద్యమం ప్రారంభమయింది. అది ఉధృతంగా జరుగుతోన్న సమయంలో తెలంగాణాలో సంస్థానాధీశుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమయింది. అది తెలంగాణా రైతాంగ పోరాటంగా,
విశాలాంధ్ర ఉద్యమంగా తీవ్రరూపం దాల్చింది.
1946 లో శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలను అణిచివెయ్యడానికి ' రజాకార్లు ' అనే పేరుతో కొన్ని ముస్లిం సంస్థలు ఆంధ్రోద్యమకారులపై విరుచుకు పడ్డాయి. వీరికి నిజాం తన సైన్యంతో మద్దతిచ్చాడు.
1947 లో భారత దేశానికి స్వతంత్ర్యం వచ్చినపుడు నిజాం బ్రిటిష్ వారితో యథాతథ వప్పందం చేసుకుని భారత సమాఖ్యలో చేరకుండా స్వతంత్ర్యం ప్రకటించుకున్నాడు. దీనికి కాంగ్రెస్ శాంతియుతంగా నిరసన తెలిపితే కమ్యూనిష్టులు సాయుధ పోరాటం ద్వారా ఎదుర్కోవడం ప్రారంభించారు. రజాకార్లు తమ ఆగడాలను కొనసాగించారు.
1947 లోనే భారత ప్రభుత్వం భాషా రాష్ట్రాల పునర్వవస్థీకరణం కోసం ఫజలాలీ కమీషన్ ని నియమించింది.
1948 సెప్టెంబరు 13 వ తేదీన భారత ప్రభుత్వం పోలీసు చర్య ప్రారంభించింది. సెప్టెంబరు 17 వ తేదీన అప్పటి నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ లొంగిపోయాడు. దాంతో నిజాం పాలనలో ఉన్న మరాట్వాడా ప్రాంతం మహారాష్ట్ర
లోను, కన్నడ ప్రాంతాలు మైసూరు ప్రాంతం లోను విలీనం కాగా తెలంగాణా ప్రాంతం విడిగా ఉండిపోయింది. అంతే గానీ విశాలాంధ్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమాలు ఫలించలేదు. స్వాతంత్ర్యం ముందుగానీ, తర్వాతగానీ ఆంధ్ర రాష్ట్రం
ఏర్పాటు కాలేదు.
1951 లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యారు.
1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. హైదరాబాదు స్టేట్ కి బూర్గుల రామకృష్ణారావు గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటయింది. 1956 వరకూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన వాయిదా వెయ్యాలని నీలం సంజీవరెడ్డి 21 మంది కాంగ్రెస్, స్వతంత్ర సభ్యులతో ఒక విజ్ఞాపన ప్రధానికి సమర్పించారు. దాంతో ఆంధ్ర రాష్ట్ర సాధన ఆశయం మీద నీళ్ళు చల్లినట్లయింది.
పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకోసం 58 రోజుల నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబరు 15 వ తేదీన ప్రాణత్యాగం చేసారు. దీని ఫలితంగా 1953 అక్టోబరు 1 వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం
పంతులు గారు తొలి ముఖ్యమంత్రి. నీలం సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రి. అయితే 13 నెలలు గడవక ముందే ప్రకాశంగారి మంత్రివర్గంపైన గౌతు లచ్చన్న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కారణంగా అధికార పక్షంలోని నలుగురు
సభ్యులు వెన్నుపోటు పొడవడంతో ఒక్క ఓటు తేడాతో ఆ తీర్మానం నెగ్గింది. ప్రకాశం గారు రాజీనామా చెయ్యవలసి వచ్చింది. ఫలితంగా 1955 లో మధ్యంతర ఎన్నికలొచ్చాయి.
ఈలోగా తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే ఆలోచన బలపడింది. దానికి కాంగ్రెస్ , కమ్యూనిష్టు పార్టీలు మద్దతు తెలిపాయి. మర్రి చెన్నారెడ్డి, కె. వి.రంగారెడ్డి లాంటి వారు ఓ వర్గంగా ఏర్పడి తెలంగాణా విడిగానే
ఉండాలని వాదించారు. అయితే ఈ అసమ్మతి ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం మీద పడలేదు. తెలంగాణా ప్రయోజనాలు కాపాడడానికి పెద్దమనుష్యుల వప్పందం పేరుతో ఆంధ్ర, తెలంగాణా నాయకుల మధ్య ఒక వప్పందం జరిగింది.
1956 నవంబరు 1 వ తేదీన ఆంధ్రులంతా కోరుకున్న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి.
పెద్ద మనుష్యుల వప్పందాన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా నైతేనేమి, అప్పటి ఆంధ్ర, తెలంగాణా నాయకుల ఆధిపత్య పోరు వల్లనైతేనేమి 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వచ్చింది. అంతకంటే ఉధృతంగా 1972 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర
ఉద్యమం నడిచింది. ఈ రెండు ఉద్యమాలు స్వార్థ రాజకీయాల పునాదులపై నిర్మించబడటం, చివరికి ఆ రాజకీయాలకే ఆ ఉద్యమాలు బలయిపోవడం ఒక చేదు నిజం. ఈ విషయంలో ఆప్పటి ప్రజలు కూడా రాజకీయ నాయకుల చిత్తశుద్ధి విషయంలో పొరబడ్డారు. ఇప్పటి ప్రజలు ఈ అనుభవాలతో వాస్తవాలు గ్రహించే స్థితికి చేరుకున్నారు. ఆ ఉద్యమాలు ప్రజలకు స్వార్థరాజకీయాల మీద అవగాహన పెంచాయనే చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందు తెలుగువాళ్ళమందరమూ ఒకే గొడుగు క్రిందకు రావాలనే ఆశయం అప్పటి నాయకుల్లో బలంగా ఉండేది. తర్వాతి వచ్చిన నాయకుల్లో స్వార్థమేగానీ సెంటిమెంట్ కనబడదు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు భాషని, సంస్కృతిని ముక్కలు చెయ్యడానికి వెనుకాడటం లేదు. అయితే ప్రజలు గత ప్రత్యేక తెలంగాణా, ఆంధ్రా ఉద్యమ ఫలితాలనుంచి నేర్చుకున్న పాఠాలతో చైతన్యవంతులయ్యారనే చెప్పవచ్చు. ఈ చైతన్యం ఇలాగే కొనసాగుతుందని ఆశిద్దాం !

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం