Tuesday, November 10, 2009

' రచనా ' కొండ


"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను"
" దోచుకు తినడమే సమాజపు అసలు తత్త్వం. దానిని మిగతా వారికి చెప్పాలని రాయడం ప్రారంభించాను "

రావిశాస్త్రిగా పిలువబడే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి అంతరంగం ఇది. ఆయన రచనల్లో ఆవిష్కరించిన అంతరంగం కూడా ఇదే ! పీడిత ప్రజలకోసం రాసిన రచయితలు చాలామందే ఉన్నారు. వారెవరికీ లేని విలక్షణ శైలి ఆయన ప్రత్యేకత. ఆయన వాళ్ల జీవితాల్లోకి చొచ్చుకెళ్లారు. వాళ్ల జీవితాల్ని ఆక్రమించేసారు. వాళ్ళతో మమేకం అయిపోయారు. వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ పంచుకున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ఎండగట్టారు. సమాజంలో సగటు మనిషి ఎలా దోపిడీకి గురవుతున్నాడో కళ్ళెదుట చూపించారు. మనిషికి ఉండే లలు, కోరికలు...అవి తీరే మార్గం లేక, తీర్చుకునే శక్తి లేక అతడు పడే మానసిక ఘర్షణను చిత్రీకరించారు. తద్వారా సమాజపు అసలు రూపాన్ని బైట పెట్టారు. అందరూ భావించినట్లు ఆయన మార్క్సిస్టా ! ఏమో ! మరి ఆయన సిద్ధాంతాలు ప్రవచించలేదు. నినాదాలు చెయ్యలేదు. కానీ ఆయన హ్యుమనిష్టు. ఆయన చేసినది సగటు మనిషి తరుఫున వకాల్తా తీసుకుని వాదించడమే ! ఎంతైనా ప్లీడరు కదా !! అనుభంవల్ల కాబోలు సాక్ష్యానికే తప్ప నిజానికి విలువ ఇవ్వని న్యాయ వ్యవస్థ అమాయకులైన ప్రజల్ని ఎలా బలి తీసుకుంటోందో వివరించారు. ప్రజలకు రక్షణగా ఉండడానికి ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ సామాన్య ప్రజల పాలిట శాపంగా ఎలా మారిందో చూపించారు.
ఆయనది విలక్షమైన శైలి. విభిన్నమైన శిల్పం. సగటు జీవి వాస్తవిక జీవితాన్నే కాదు అతని అంతరంగపు లోతులు తరచి చూసే శిల్పమది. మానసిక సంఘర్షణలను అంతలా వర్ణించిన రచయిత ఇంకొకరు లేరేమో ! తనకు కవిత్వం చెప్పడం రాదనీ మనకి అబద్ధం చెప్పారాయన. ఆయన శైలిలో ప్రధానమైనది కవితాత్మకతే ! అది వచనమా ! కవిత్వమా అనే మీమాంస అనవసరం. ఎందుకంటే అయన దాని గురించి ఆలోచించి దాఖలాలు కనిపించవు. ఆయనకవన్నీ అనవసరం. ఆయనకు కావలసింది పీడిత ప్రజలకు న్యాయం జరగడం. ఆయన రచనలు చదివించేలా, చదివాక ఆలోచించేలా చేసేది రచనలలోని వేగమే ! వచనాన్ని, కవిత్వాన్ని సమపాళ్ళలో రంగరించి వదిలిన బాణాలు ఆయన రచనలు. అవి సూటిగా పాథకులకు తగులుతాయి. వారి మెదడుకు పదును పెడతాయి. అంతరంగాలు, సంఘర్షణలు వగైరా అనేవి సహజంగా చాలామంది పాఠకులకు రుచించని పదార్ధాలు. విసుగని పేజీ తిప్పేస్తారు. కానీ రావిశాస్త్రి గారి శిల్పం మాత్రం వాళ్ళని ఆసాంతం చదివేటట్లు చేస్తుంది. తమ అంతరంగాల్ని దర్శించుకునేలా చేస్తుంది. శైలికి, శిల్పానికి ప్రతిరూపాలు ఒకటా, రెండా 1935 లో ' దేముడే చేసాడు ' కథతో ప్రారంభమయిన ఆయన రచనా ప్రస్తానం ' ఇల్లు ' వరకు సాగింది. చైతన్య స్రవంతి శైలి లో సాగిన ప్రయోగాత్మక నవల ' అల్ప జీవి ' ( 1952 ) ఉత్తమ రచనగా ఇప్పటికీ పాఠకుల మనస్సులో నిలిచిపోయింది. రావిశాస్త్రి గారి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి అల్ప జీవి, సారా కథలు. ఆయన రచనా నేపధ్యమంతా మధ్య తరగతి, బడుగు తరగతి మాత్రమే ! విశాఖ ప్రాంత మాండలీకాన్ని ఆయన ఉపయోగించినట్లు వేరెవ్వరు ఉపయోగించలేదేమో ! ఆయన పాత్రలకు, సంఘటనలకు పరిమితులు లేవు. అవి గొలుసు పద్ధతిలో అనంతంగా సాగిపోతునే ఉంటాయి. ఒక చట్రంలో ఇరుక్కుపోవడం ఆయన పధ్ధతి కాదు. ఇలా ఆయన రచనల గురించి చెప్పుకుంటూ పోతే అనంతం. 1922 జులై 30 తేదీన జన్మించిన రాచకొండ 1993 నవంబరు 10 తేదీన మరణించే వరకు ఆయన కలం అమృత బిందువులు చిందిస్తునే ఉంది.

*******రావిశాస్త్రి
గారి వర్థంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ...........********

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం